Brain Dead /బ్రెయిన్ డెడ్

బ్రెయిన్‌డెడ్ అంటే ఏమిటి, ఎలా నిర్ణయిస్తారు?
ఆధునిక వైద్యశాస్త్రంలోని పురోగతి వల్ల ఇప్పుడు అవయవాలను మార్చి ప్రాణాలను నిలబెట్టగల సామర్థ్యం మన వైద్యులకు ఉంది. అయితే జీవించి ఉన్నవారు తమ అవయవాలను ఎలా ఇవ్వగలరు? అందుకే జీవన్మృతుల (బ్రెయిన్‌డెడ్ పర్సన్స్) నుంచి అవయవాలను సేకరించే అవకాశాన్ని కల్పించేలా చట్టబద్ధమైన మార్గదర్శకాలు ఉన్నాయి.
బ్రెయిన్‌డెడ్ అంటే ఏమిటి, ఎలా నిర్ణయిస్తారు?
ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు తలకు దెబ్బతగిలి మెదడు పనితీరు పూర్తిగా ఆగిపోయినా… శరీరం కొద్దిసేపు జీవంతోనే ఉంటుంది. ఆ సమయంలో గుండె స్పందనలూ, ఊపిరితిత్తుల పనితీరు, కిడ్నీలు, కాలేయం సజీవంగానే ఉంటాయి. అయితే రోగి ఎట్టిపరిస్థితుల్లోనూ బతికే అవకాశం ఉండదు. ఆ పరిస్థితినే బ్రెయిన్‌డెడ్ కండిషన్‌గా పేర్కొంటారు.
ఒకరు జీవన్మృతుడని నిర్ణయించాలంటే కొన్ని నిర్దిష్ట నిబంధనలు ఉన్నాయి. న్యూరాలజీ, న్యూరోసర్జరీ, అనస్థిసిస్ట్, జనరల్ ఫిజీషియన్‌లతో పాటు, సదరు ఆసుపత్రి సూపరింటెండెంట్లతో కూడిన ఐదుగురు సభ్యులతో కూడిన బృందం, కొన్ని నిర్దిష్ట మార్గదర్శకాల ద్వారా బ్రెయిన్‌డెడ్ అనే విషయాన్ని నిర్ధారణ చేస్తారు. అప్పుడు ఆ బ్రెయిన్‌డెత్‌కు గురైన వారి బంధువులతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగమైన ‘జీవన్‌దాన్’ బృందం సభ్యులు కలిసి, మాట్లాడి వారిని అవయవదానానికి ఒప్పిస్తారు.
ఈ ‘జీవన్‌దాన్’ కార్యక్రమానికి ప్రధాన కార్యక్షేత్రం నిమ్స్ కాగా… అవయవదానం పట్ల అవగాహన పెంచే బాధ్యతలను గాంధీ ఆసుపత్రి, రోగి బంధువులకు కౌన్సెలింగ్ నిర్వహించాల్సిన బాధ్యతలను ప్రభుత్వం ఉస్మానియా ఆసుపత్రి నిర్వహిస్తుంది..
అర్హులైన వారికే… అర్హమైన అవయవం…
ప్రతి అవయవ ప్రదానానికి అవసరమైన నిబంధనలను ఆ స్పెషాలిటీకి చెందిన ఒక నిపుణుల బృందం మార్గదర్శకాలను నిర్దేసిస్తుంది. దానికి అనుగుణంగా ఒక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించడం జరిగింది. దీని వల్ల ఎలాంటి అవకతవకలకు గాని, ఎలాంటి ఒత్తిళ్లు, సిఫార్సులకు గాని లోనుకాకుండా కేవలం అర్హులైన వారికే ఆయా అవయవాలు అందేలా చూస్తారు.
డిమాండ్ ఎక్కువ… లభ్యత తక్కువ
ప్రస్తుతం అవయవాల అవసరం ఉన్నవారు ఎక్కువగానూ, వాటి లభ్యత తక్కువగానూ ఉన్నందున జీవన్‌దాన్ కార్యక్రమం నెట్‌వర్క్‌తో అనుసంధానమైన ఆసుపత్రులకు రొటేషన్ పద్ధతుల్లో రోగికి అవయవాలు అందేలా ఏర్పాట్లు ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఇలాంటి ఆసుపత్రులు 30 ఉన్నాయి. ఒత్తిడి వల్లనో, పలుకుబడితోనో అవయవాలు పొందాలన్నా పొందలేని విధంగా ఈ 30 ఆసుపత్రుల్లోని రోగుల వివరాలూ, వారి ప్రాధాన్య క్రమాలూ… అన్నీ అనుసంధానమై ఉన్నాయి. దాంతో కేటాయింపుల్లో ఏమాత్రం పొరబాటుకు తావుండదు.
రెండు రాష్ట్రాల్లో కలిపి మూప్ఫై ఆసుపత్రులకే ఎందుకు…?
రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 30 ఆసుపత్రులకే ఒక రోగిని బ్రెయిన్‌డెడ్‌గా నిర్ణయించే అర్హత, అవయవమార్పిడి చేసే అర్హత ఉన్నాయి. మరిన్ని ఆసుపత్రులకు ఈ వసతి కల్పిస్తే మరింత చావు నీడన బతుకీడుస్తున్న మరింత మందికి అవయవాలు చేరే అవకాశం ఉంది కదా అన్న ప్రశ్న తలెత్తవచ్చు. కానీ… ఒక వ్యక్తిని బ్రెయిన్‌డెడ్‌గా నిర్ణయించడం చాలా నిబద్ధతతో, నిష్ణాతులైనవారి పర్యవేక్షణలోనే జరుగుతుంది. ముందు చెప్పుకున్నట్లుగా న్యూరాలజీ, న్యూరోసర్జరీ, అనస్థీషియా, జనరల్ ఫిజీషియన్ స్పెషాలిటీలతో పాటు… మరెన్నో సౌకర్యాల, ఉపకరణాల లభ్యత వంటి అంశాలుండాలి. నైపుణ్యం ఉన్న సిబ్బంది ఉండాలి. వీరంతా ఉన్న ఆసుపత్రులకే ఈ సర్టిఫికేట్ లభిస్తుంది. పైగా ఆ నిపుణుల బృందం పొరబాటుకు తావివ్వకూడదనే ఉద్దేశంతో బ్రెయిన్‌డెడ్ అయిన వ్యక్తిని ఒకటికి రెండుసార్లు పరీక్షించి మరీ నిర్ధారణ చేస్తారు. ఇంత జాగ్రత్త, ఇన్ని సౌకర్యాలూ, ఇంత నైపుణ్యం అవసరం.

అపోహలు తొలగాలి…
అవయవదానంపై మన సమాజంలో ఎన్నో అపోహలు రాజ్యమేలుతున్నాయి. కానీ మరణించిన వ్యక్తికి ఏమాత్రం పనికిరాని అవే అవయవాలు మరెందరి ప్రాణాలనో నిలబెడతాయి. అలా కాదని ఖననం చేస్తే విలువైన అవయవాలు వృథాగా మట్టిలో కలిసిపోతాయి. దహనం చేస్తే కాలిపోతాయి. మట్టిలో కలవడం కంటే… కాలడం కంటే ఇతరులకు ప్రాణదానం చేయడం ఎంతో మేలని ప్రతివారిలోనూ అవగాహన కలిగినప్పుడు మరెందరో అవయవార్థులు జీవం పుంజుకొని సమాజంలో తమవంతు బాధ్యతలను పోషిస్తారు. ‘‘ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు కొద్దిగా చైతన్యం వచ్చినా అవయవాల కోసం ప్రస్తుతం ఉన్న డిమాండ్‌తో పోలిస్తే లభ్యత తక్కువే. అపోహలు తొలగి మరింత మంది అవయవదానికి ముందుకు రావాల్సిన అవసరం ఉంది.

Organ Donatiion…Jeevandan….జీవన్‌దాన్… అవయవ మార్పిడి

అవయవ మార్పిడి కోసం ఎదురు చూసే వారికి అపన్న హస్తం. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి సకాలంలో అవయవాలను మార్పిడి చేయించి వారికి పునర్జన్మ కల్పించడంలో విశేష కృషి చేస్తోంది.బాధిత కుటుంబాల్లో కొత్త వెలుగులు ప్రసాదిస్తోంది. దూర ప్రాంతాల నుంచి కూడా అవయవాలను ప్రత్యేక వాహనాల్లో తెప్పించి బాధితులకు బాసటగా నిలుస్తోంది. గుండె, కిడ్నీ, కాలేయం, ఊపిరితిత్తులు, కార్నియాల మార్పిడీల సంఖ్యను పెంచుతూ బాధితులకు పునర్జన్మ కల్పిస్తోంది.
నిమ్స్‌లో నోడల్‌ కేంద్రం
జీవన్‌దాన్‌కు సంబంధించి 2013లో నిమ్స్‌లో నోడల్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ జీవన్‌దాన్‌కు డీఎంఈ చైర్మన్‌గా, నిమ్స్‌ డైరక్టర్‌ కో-చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. గాంధీ, ఉస్మానియా ఆస్పత్రి వర్గాలకు కూడా ఇందులో భాగస్వామ్యం ఉంది. కాలేయం, కిడ్నీ, గుండెకు సంబంధించిన కమిటీలు ఉంటా యి. ఈ కమిటీ పర్యవేక్షణలో అవయవ మార్పిడీల కేటాయింపులు జరుగుతాయి. రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి
ప్రతి ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రి తప్పని సరిగా జీవన్‌దాన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకుని ఉండాలి. రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న ఆస్పత్రికే అవయవాలు కేటాయించి అక్కడే మార్పిడి నిర్వహిస్తారు. రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న ప్రతి ఆస్పత్రిలో ఓ కో-ఆర్డినేటర్‌ను నియమించాలి.
కో-ఆర్డినేటర్లకు శిక్షణ
ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో నియమించిన కో-ఆర్డినేటర్లకు అవయవదానంపై బాధిత కుటుంబాలకు అవగాహన ఎలా కల్పించాలి అనే అంశంపై శిక్షణ ఇస్తారు. ఏదైనా ఆస్పత్రిలో బ్రెయిన్‌డెత్‌ అయితే ఏం చేయాలి. రోగి కుటుంబ సభ్యులకు ఎలా కౌన్సెలింగ్‌ నిర్వహించాలి. ఈ సమాచారాన్ని జీవన్‌దాన్‌కు ఎలా చేరవేయాలి ఇత్యాది అంశాలపై ఆరునెలల నుంచి ఏడాదిపాటు శిక్షణ ఇస్తారు. అవయవాల కేటాయింపు ఎలా జరుగుతుంది ?….
ఏదైనా బ్రెయిన్‌డెత్‌ ఉంటే జీవన్‌దాన్‌కు ఆ సమాచారం అందుతుంది. అక్కడి నుంచి ఓ కో-ఆర్డినేటర్‌ వెళ్లి రోగి కుటుంబ సభ్యులను ఒప్పించి అవయవ మార్పిడి ప్రక్రియకు మార్గం సుగమం చేస్తారు. ఆ తరువాత ఆ వివరాలను వెంటనే జీవన్‌దాన్‌ కమిటీకి అందజేస్తారు. ఈ కమిటీ అత్యవసరంగా అవయవాలు అవసరమున్న బాధితులను గుర్తించి మార్పిడికి అవకాశమిస్తారు. జాబితా ప్రకారం అత్యవసరమున్న వారికే ఈ అవయవాలను అందిస్తారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోని రోగులకే మొదటి ప్రాధాన్యతను జీవన్‌దాన్‌ కల్పిస్తుంది.

అవయవాల కోసం రిజిస్ట్రేషన్‌
అవయవాలు అవసరమైన వారు ముందుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలి. నిమ్స్‌లోని జీవన్‌దాన్‌ నోడల్‌ కేంద్రానికి వచ్చి బాధితులు తమ వివరాలను అందజేయాల్సి ఉంటుంది.
బాధితులు 040-23489494 నంబర్‌కు ఫోన్‌ చేసి కూడా సమాచారం తెలుసుకోవచ్చు.
www.eevandan.gov.in అనే వెబ్‌సైట్‌ ద్వారా కూడా వివరాలు తెలుసుకోవచ్చు.