కొండపల్లి బొమ్మలు

భారతదేశంలోనే గాక ప్రపంచవ్యాప్తంగా కొండపల్లి బొమ్మలు ప్రసిద్ధి చెందాయి. కొండపల్లి గ్రామం కృష్ణా జిల్లాలోని ఇబ్రహింపట్నం మండలంలో ఉన్నది. కొండపల్లి బొమ్మలు కొండపల్లి చుట్టుపక్కల అడవులలో దొరికే పొనికి అనే తేలికపాటి చెక్కనుండి తయారవుతాయి. కొండపల్లి కళాకారులు ఏకాగ్రతతో ఈ బొమ్మలు తయారు చేస్తారు. ముందుగా బొమ్మల విడిభాగాలు తయారు చేస్తారు. ఉదాహరణకు కాళ్లు, చేతులు, తల మొదలగు భాగాలను విడి విడిగా తయారుచేసి తరువాత వీటన్నిటినీ చింతగింజల పొడుంతో తయారు చేసిన బంకతో ఒకటిగా అంటిస్తారు. ఏనుగు అంబారీలు, గీతోపదేశం, తాటిచెట్టు క్రింద కల్లుతాగుతున్న వ్యక్తి, కృష్ణుడు గోపికలు వీటిలో కొన్ని ప్రసిద్ధి చెందినవి. ఇవి బహుమతులుగా ఇవ్వటానికి చాలా బాగుంటాయి. ఎక్కువగా సహజ రంగులనే వాడతారు (చెట్ల ఆకులు, బెరడుల నుండి తయారు చేసినవి) ఈ మధ్య సింధటిక్ కలర్స్ కూడా ఉపయోగిస్తున్నారు. ఇవి లేపాక్షి షోరూంల నుండి కొనవచ్చు. లేక కొండపల్లి గ్రామానికి వెళ్లిన వారు అక్కడ స్థానికంగా వీటిని కొనవచ్చ. కృష్ణాజిల్లా ఇబ్రహింపట్నం రింగురోడ్డు నుండి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో కొండపల్లి గ్రామం ఉంది. విజయవాడ నుండి షుమారు 22 కిలోమీటర్ల దూరం. చరిత్ర ప్రసిద్ధి గాంచిన కొండపల్లి కోట కూడా కొండపల్లి గ్రామానికి దగ్గరలోనే ఉంది.