ఫేషియల్‌ పెరాలసిస్‌

Facial Paralysis: Causes Symptoms Diagnosis - Sakshi

ముఖంలో ఒక పక్క పక్షవాతం వచ్చినట్లుగా వాలిపోయే పరిస్థితే ఫేషియల్‌ పెరాలసిస్‌. పక్షవాతంలో కనిపించే లక్షణాలైన దేహంలోని ఒక పక్క ఉండే భాగాలు అచేతనంగా మారిపోయినట్లే…. కొందరికి కేవలం ముఖం వరకే ఒక భాగం చచ్చుబడినట్లుగా అయిపోతుంది. దీన్నే సాధారణ భాషలో ‘ఫేషియల్‌ పెరాలసిస్‌’ అనీ, వైద్యపరభాషలో ‘బెల్స్‌పాల్సీ’ అని అంటారు.  

ఇది చాలా మందిలో కనిపించే సాధారణ  జబ్బే. మన మెదడునుంచి బయల్దేరిన వెన్నుపాము నుంచి 12 నరాలు బయటకు వస్తాయి. అవి పుర్రె భాగం నుంచి బయటకు వస్తాయి కాబట్టి వాటిని క్రేనియల్‌ నర్వ్స్‌ అంటారు. ఇందులో ఏడవ నరం దెబ్బతినడం వల్ల ఒకవైపున ముఖం కండరాలు పనిచేయవు. దీనివల్ల ముఖం వంకరగా కనపడుతుంది. నవ్వినప్పుడు, మాట్లాడినప్పుడు ఈ వంకరదనం ఎక్కువగా కనిపిస్తుంది. 

ఇది కూడా హెర్పిస్‌ సింప్లెక్స్‌ లాంటి ఏదైనా వైరల్‌ ఇన్ఫెక్షన్‌ వచ్చాక, ఆ పరిణామం వల్ల ఉత్పన్నమైన యాంటీబాడీస్‌ ఫేషియల్‌ నర్వ్‌ అనే ముఖానికి సంబంధించిన నరాన్ని దెబ్బతీస్తాయి. దాంతో ఆ నరం వాపు వచ్చి, అది అనుసంధానం చేసే ముఖ భాగాలు చచ్చుబడిపోతాయి. 

లక్షణాలు : మూతి, ముఖం వంకరపోవడం, ఆ వైపు కంట్లోంచి నీరు కారడం, నీళ్లు పుక్కిలిస్తుంటే ఒకవైపు నుంచే సమర్థంగా పుక్కిలించగలగడం… ఫలితంగా నోటికి ఒకవైపు నుంచే నీళ్లు చిమ్మినట్లుగా బయటకు రావడం, ఒకవైపు కనురెప్ప మూసుకుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. చికిత్సగానూ ప్రెడ్నిసలోన్‌ వంటి స్టెరాయిడ్స్‌తో చికిత్స చేస్తారు. ఇది కేవలం కొద్ది రోజుల్లోనే తగ్గిపోతుంది. పూర్తిగా తగ్గిపోయే ఈ సమస్యతో ఆందోళన పడాల్సిన అవసరం లేదు.  

రక్తహీనత

Health Tips Remedy For Controlling Anemia - Sakshi

జున్ను నుంచి బీ–12 లభిస్తుంది. పాలు, పన్నీరు, పాల ఉత్పత్తులు, ముడిబియ్యం వాడాలి.  రక్తహీనత ఎక్కువగా ఉండేవాళ్లు.. పాలకూరతో జ్యూస్‌ చేసుకుని తాగాలి. బీట్‌రూట్‌, క్యారట్‌, ఉసిరి కలిపి జ్యూస్‌ చేసుకుని ఉదయాన్నే తాగితే.. ఐరన్‌ పుష్కలంగా వస్తుంది. ఐరన్‌ సమృద్ధిగా ఉంటే రక్తహీనత రానే రాదు. రోజూ దానిమ్మ రసం తీసుకోవాలి. 

గుప్పెడు కరివేపాకును దంచి మజ్జిగలో వేసుకుని తాగితే మంచిది.  మధ్యాహ్నం పూట ప్రతిరోజూ తోటకూర, గోంగూర, పాలకూర ఏదో ఒకటి తినేలా చూసుకోవాలి. వారంలో ఆరురోజులు ఆకు కూరలు తినాలనే నిబంధన తప్పని సరిగా పెట్టుకోండి. 

పాలీ సిస్టిక్ ఓవరి సిండ్రోమ్ (PCOS)

పాలీ సిస్టిక్ ఓవరి సిండ్రోమ్ (PCOS), అనేది హార్మోన్ ల అసమతుల్యం వల్ల స్త్రీ ల లో కలిగే సర్వ సాధారణమైన సమస్య. 15 నుండి 44 సంవత్సరాల వయస్సులో ఎప్పుడైనా రావచ్చు.

ఆరోగ్యకరమైన రుతుచక్రంలో, అండాశయం, ప్రతి నెలా అండాల్ని తయారు చేసి విడుదల చేస్తుంది. హార్మోన్ల అసమతుల్యం వల్ల, అండాశయం లో మార్పులు సంభవిస్తాయి.అండం పరిపక్వత చెందక పోవడం, లేదా అండం విడుదల లో జాప్యం కలుగుతుంది. ఫలితంగా, రుతుక్రమం తప్పడం లేదా ఆలస్యంగా రావడం జరుగుతుంది. నిర్లక్ష్యం వహిస్తే, అండాశయం లో నీటి తిత్తులు (Cysts), సంతాన లేమి (infertility) వంటి సమస్యలు కలుగుతాయి.

PCOS లక్షణాలు:

 1. నెలసరి తప్పడం, ఆలస్యం అవడం లేదా మరీ ఎక్కువగా రావడం
 2. అవాంఛిత రోమాలు (Hirsutism)
 3. మొటిమలు ( Harmonal acne)
 4. జుట్టు పలచబడటం
 5. బరువు పెరగడం లేదా తగ్గడం
 6. మానసిక సమస్యలు (Mood Swings)

PCOS కారణాలు:

PCOS కి ఖచ్చితమైన కారణం అంటూ లేదు. కొన్ని పరిశోధన ల ప్రకారం క్రింది కారణాలు ఉండవచ్చు.

 1. అధిక మోతాదు లో ఆండ్రోజెన్స్ విడుదల అవడం: ఆండ్రోజెన్స్ ని పురుష హార్మోన్ లు గా కూడా సంభోదిస్తారు. ప్రతి స్త్రీ లోను, కొంత మోతాదు లో, పురుష హార్మోన్ లు విడుదల అవ్వడం సర్వ సాధారణం. కానీ PCOS ఉన్న వారి లో, సాధారణం కన్నా ఎక్కువగా ఆండ్రోజెన్స్ విడుదల అవుతాయి. ఫలితం గా, అండం పరిపక్వత చెందక పోవడం, అండం విడుదల లో జాప్యం, అవాంఛిత రోమాలు, మొటిమలు వంటి సమస్యలు కలుగుతాయ.
 2. ఇన్సులిన్ నిరోధకత (Insulin Resistance): ఇన్సులిన్ అనే హార్మోన్ రక్తం లో చక్కెర నిల్వల్ని క్రమబద్దీకరిస్తుంది. PCOS ఉన్న చాలా మంది స్త్రీ ల లో, ముఖ్యం గా, అధిక బరువు, అనారోగ్యపు ఆహార అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, లేదా వంశ పారంపర్యపు మధుమేహం వల్ల, ఇన్సులిన్ నిరోధకత కలుగుతుంది. తద్వారా, రక్తం లో ఇన్సులిన్ మోతాదు పెరిగి పోతుంది. క్రమేణా అది టైపు-2 మధుమేహం గా మారుతుంది.

PCOS నిర్దారణ మరియు చికిత్స:

ఖచ్చితమైన నిర్దారణ విధానం అంటూ లేదు. స్త్రీ వ్యాధుల నిపుణుల్ని (Gynecologist) ని సంప్రదిస్తే, లక్షణాలు, పెల్విక్ ఎక్షామినేషన్, ఆల్ట్రాసౌండ్ లేదా రక్త పరీక్షల ద్వారా PCOS ని నిర్దారిస్తారు.

చికిత్స లో నెలసరి క్రమం గా రావడానికి, గర్భనిరోధక మాత్రల్ని (Harmonal contraceptives), పురుష హార్మోన్ ల ప్రభావం తగ్గించడానికి, యాంటి ఆండ్రోజెన్స్ ని, ఇన్సులిన్ నిరోధకత కి, ఇంకా ఇతరత్రా PCOS లక్షణాలని తగ్గించడానికి మెట్ఫార్మిన్ (Metformin) లాంటి మాత్రల్ని సూచిస్తారు.

మన ఆరోగ్యం-మన చేతుల్లోనే:

చికిత్స తీసుకోవడం తప్పు కాదు. కానీ, మన జీవన శైలిని, ఆహారపు అలవాట్లను మార్చుకోనంత వరకు, ఫలితం మాత్రం తాత్కాలికం లేదా శూన్యం. ఆరోగ్యకరమైన జీవన విధానం మరియు ఆహరపు అలవాట్ల వల్ల చాలా వరకు ఆరోగ్య సమస్యల్ని అధిగమించవచ్చు.

PCOS నుండి విముక్తి పొందడానికి సహజ సిద్దమైన పద్దతులు:

ఆహారం: PCOS కి సంబందించినంత వరకు, ఆహారానిది ప్రముఖ పాత్ర. సరైన ఆహారం తినడం ఎంత ముఖ్యమో, సరైన వేళలో తీసుకోవడం కూడా అంతే ముఖ్యం.

అల్పాహారం గా, నాన బెట్టిన బాదం, ఎండు ద్రాక్ష, వాల్నట్స్, మొలకెత్తిన గింజలు, అవిసెలు, తాజా పండ్లు, కూరగాయలు, పులిసిన ఆహారం(ఇడ్లీ లాంటివి) తీసుకోవచ్చు.

మధ్యాహ్నపు భోజనం గా, ఆరోగ్యకరమైన కంచెం పద్దతి (Healthy Plate Method) ని అనుసరించాలి. అంటే, సగం కంచెం లో తాజా కూరగాయలు, మిగతా సగం లో కార్బోహైడ్రేట్ లు, మాంసకృత్తులు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండేలా చూసుకోవాలి.

రక్తం లో చక్కెర నిల్వల్ని అదుపు లో ఉంచుకోవడానికి, Low Glycemic Index కలిగిన ఆహారం ని తీసుకోవాలి. రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు లాంటి చిరు ధాన్యాన్ని ప్రయత్నించవచ్చు.

వేపుడు పదార్థాలు, పచ్చళ్లు, తీపి పదార్థాలు, టీ, కాఫీలు, మైదా, చక్కెర తో చేసినవి, మాంసం వీలైనంత తగ్గిస్తే మంచిది. బదులుగా జీవ క్రియల్ని (Metobolism) మెరుగు పరిచే, గ్రీన్ టీ లాంటివి తీసుకోవచ్చు.

జీర్ణ క్రియ కి సూర్యుడికి సంబంధం ఉందంటారు. అంటే, జఠరాఙి కూడా సూర్యుడితో పాటు పెరుగుతూ, సూర్యాస్తమయానికి తగ్గుతుందని అంటారు. ఆహారం కూడా ఇలా ప్రకృతి నియమాలకు అనుగుణం గానే తీసుకోవాలి. పగలు క్లిష్టమైనవి, రాత్రి వేళ తేలిక గా జీర్ణం అయ్యే ఆహారం తీసుకుంటే మంచిది. రాత్రి భోజనం కూడా వీలైనంత త్వరగా ముగించటం వల్ల, బరువు చాలా వరకు నియంత్రణ లోకి వస్తుంది.

శారీరక శ్రమ: దీనికి నడక, వ్యాయామం లేదా యోగా వీటిలో ఎదో ఒకటి ఎంచుకోవచ్చు. హార్మోన్ల వ్యవస్థ ని, క్రమబద్దీకరించడానికి, కొన్ని ప్రత్యేకమైన యోగాసనాలు ఉంటాయి. అవి ఎంచుకోవచ్చు. ఎదేమైనా ఖచ్చితంగా రోజుకి ఒక గంట శారీరక శ్రమ ఉండేలా చూసుకోవాలి.

మరికొంత:

 1. సరైన నిద్ర వేళలు (ఒకే సమయానికి నిద్రించటం మరియు మేల్కొవడం) పాటించటం చాలా ముఖ్యం. ఎందుకంటే స్త్రీ హర్మోన్ల పై, జీవ గడియారం ప్రభావం చాలా ఉంటుంది.
 2. సాధ్యమైనంత వరకు, సేంద్రియ పద్దతి లో పండించిన ఆహారాన్ని తీసుకోవాలి.
 3. వీలైనంత ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలి. ఎందుకంటే, మనం వాడే ప్లాస్టిక్ వస్తువుల నుండి, రోజుకి కొన్ని లక్షల సూక్ష్మ రేణువులు విడుదలవుతాయి. వాటిలో ఉండే రసాయనం BPA (Bisphonol) హార్మోన్ల సమతౌల్యాన్ని దెబ్బ తీస్తుంది.
 4. ఒత్తిడి మరియు PCOS ది అవినాభావ సంభందం. మానసిక సమస్యలు అదనం (Mood Swings). ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. యోగా, ధ్యానం లాంటివి ఉపకరిస్తాయి.
 5. ఇక ఎక్కువ గా బాధించే మరిన్ని సమస్యలు అవాంఛిత రోమాలు మరియు మొటిమలు( Harmonal Acne). ఇవి హార్మోన్ ల అసమతుల్యం వల్ల కలిగేవీ కాబట్టి, పై పూతల వల్ల ప్రయోజనం తక్కువ. సమస్య మూలాలపై దృష్టి సారిస్తే , స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. అవాంఛిత రోమాలు తగ్గించుకోవడానికి, తాత్కాలిక మరియు శాశ్వత పద్దతులు ఉంటాయి. ముఖ చర్మం సున్నితం గా ఉంటుంది కాబట్టి నిపుణుల్ని సంప్రదిస్తే మంచిది. వారు సమస్య తగ్గడానికీ మందులు లేదా శాశ్వతంగా తొలగించడానికి లేజర్ లేదా ఎలెక్ట్రోలైసిస్ పద్దతుల్ని సూచిస్తారు.

PCOS తప్పకుండా అదుపు లో కి వస్తుంది.కానీ, సహనం కొల్పో కుండా, క్రమ శిక్షణ తో ప్రయత్నించాలి.

ఎదిగే పిల్లలకు చిరుతిండ్లు

క్యారెట్‌ పాయసం క్యారెట్లను బాగా ఉడకపెట్టి గుజ్జుగా చేసి పాలలో కలిపి, చక్కెర వేసి, యాలకుల పొడి వంటివి వేసి చక్కటి పాయసం తయారు చేసుకోవచ్చు. అన్నంలో పెసరపప్పులేదా శెనగపప్పు వంటివి కలిపి చేస్తే పోషకాలు ఎక్కువగా అందుతాయి.
పుడ్డింగ్‌ పాలు, కోడిగుడ్లు, చక్కెర ఈ మూడు తగిన పాళ్లలో కలిపి దానికి యాలకుల పొడి వంటివి కలిపి ఇడ్లీకుక్కర్‌ లో పెట్టి ఆవిరిమీద ఉడకబెడితే చక్కటి జున్నులాంటి పుడ్డింగ్‌ తయారవుతుంది. దీనిలోనే బ్రెడ్‌ ముక్కలు కూడా తోడు చేస్తే బ్రెడ్‌ పుడ్డింగ్‌ సిద్ధం దీన్నుంచి శక్తి కూడా ఎక్కువగా అందుతుంది.
ఫ్రూట్‌ కస్టర్డ్‌ : చాలామంది బజారులో దొరకే క్లస్టర్డ్‌ పౌడర్‌ తెచ్చుకోవాలని భావిస్తుంటారు గానీ పాలను చిక్కగా మరిగించి ఇంకా కావాలంటే చిక్కదనరం కోసం దానిలో కొద్దిగా మొక్కజొన్న పిండి కలిపి సువాసనకోసం కొద్దిగా ఎస్సెన్స్‌ కలిపి సెగమీద కొంతసేపు ఉంచిన తరువాత దానిలో రకరకా పండ్లముక్కను కలిపి చక్కటి క్లస్టర్డ్‌ ఇవ్వవచ్చు.
పిల్లలకు పండ్లు తప్పనిసరి. వీటిని తినిపించటానికి ఇది తేలికైన పద్ధతి. విడిగా ఇస్తే ఒక్క అరటిపండు తినిపించడమే గగనం. కానీ ఈ క్లస్టర్డ్‌లో ఆపిల్‌ అరటి మామిడివంటి చాలా రకాలు కలిపి ఇవ్వవచ్చు.
మిల్క్‌షేక్‌ ఆడుకోవటానికి ఉరుకుతుంటే పిల్లలను పట్టుకుని వాళ్ళచేత నాలుగు సపోటాలు తినిపించాంటే మహా కష్టం. కానీ అదే సపోటాను పాలో వేసి మిల్క్‌షేక్‌లా తయారు చేసి చేతికిస్తే హాయిగా ఇష్టంగా క్షణాల్లో తాగేస్తారు. సపోటానే కాదు. అరటి, మామిడి స్టాబెర్రీ వంటివన్నీ కూడా ఇలాగే ఇవ్వవచ్చు.
జావ జావ తాగటమంటే అదేదో ముసలివాళ్ల వ్యవహారమన్న ధోరణి ఒకటి పాతుకుపోయింది. ఇప్పుడిప్పుడే ఇది మారుతోంది. నిజానికి ఆరోగ్యానికి చక్కటి పునాది అవసరమైనది చిన్నతనంలోనే రాగి జావ, సజ్జ జావ వంటివి తయారు చేసినప్పుడు వాటిలో మామిడి రసం, అరటి గుజ్జు,అనాస గుజ్జు వంటివి కలిపి ఇస్తే ఇష్టంగా తాగుతారు.
రాగి లడ్డులు సాధారణంగా ఇంట్లో నిల్వ చేసుకునే చిరుతిండ్లన్నింటినీ కూడా బియ్యం పిండి, గోధుమపిండి, శెనగపిండి వంటి వాటితోనే చేస్తారు. కానీ ఇవే కాకుండా రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రల వంటి వంటివి కూడా వాడుకుంటూ చాలా రకాల వంటలు చేసుకోవచ్చు. సాధారణంగా బియ్యంతో చెయ్యటానికి వీలైన పదార్థాలన్నింటినీ కూడా వీటితో తయారు చెయ్యవచ్చు. రాగిపిండిని ఒక బట్టమీద పోసి కొద్దిగా తడిపి దాన్ని ఆవిరి మీద కొద్దిసేపు ఉడికిస్తే ఉండ వచ్చేలా తయారవుతుంది. దాన్ని బెల్లం పాకంలో వేసి దాన్లోనే వేయుంచిన పల్లీ పొడి వంటివి కలిపి ఉండలా చేసే చక్కటి రాగి లడ్డూలు సిద్దమవుతాయి. ఆరోగ్యానికి ఇవి ఎంతో మంచివి కానీ జావలాగా తాగాంటే దానిలో 2-3 చెంచా కంటే ఎక్కువ రాగిపిండి పట్టదు. అందుకని ఇలా లడ్డూల వంటివి చేసుకుని వివిధరూపాల్లో తింటే మంచిది.
రాగిపిట్టు కేరళ తదితర రాష్ట్రాలో రాగిపిట్టు చాలా ఇష్టంగా తింటారు. కుక్కర్‌లో దీన్ని తేలికగానే తయారు చేయవచ్చు. కుక్కర్‌లో అన్నం తదితరాటు పెట్టే గిన్నెను తీసుకుని దానిలో అడుగు వరసన రాగిపిండి, దానిపైన కొబ్బరి తురుము, మళ్ళీ దానిపైన చక్కెర లేదా బెల్లం వంటివి పొరలు పొరలుగా (కలపకుండా) వేసి ఆవిరి మీద ఉడికించి దాన్ని ముక్కలుగా కూడా కోసుకుని తినవచ్చు. దీనిలో పిల్లలకు కావాల్సిన పోషకాల శక్తి వంటివన్నీ లభ్యమవుతాయి.
కూరపకోడీలు ఉల్లి పకోడీలనేవి మామూలే గానీ, పాలకూర, తోటకూర, క్యాబేజీ, క్యాలీఫ్లవర్‌ వంటివి కలిపి వెజటబుల్‌ పకోడి వంటివి చేస్తే మంచిది. పునుగులలో కూడా ఆకుకూరలు, నానబెట్టిన శెనగపప్పు, పెసరపప్పు వంటివి కలిపి వెయ్యవచ్చు. వీటిలోనూ క్యారెట్లు, ఆకుకూరలు, క్యాబేజీ వంటి కాయగూర ముక్కలు దండిగా కలపవచ్చు.

1-5 సంవత్సరముల లోపు పిల్లల ఆహారం

1-5 సంవత్సరముల లోపు పిల్లల ఆహారం : డా. జానకి,నూట్రిషినిస్టు, హైదరాబాద్‌ మొదటి అయిదు సంవత్సరాలు పిల్ల జీవితంలో చాలా ముఖ్యమైనవి. అప్పుడు శారీరకంగా ఎదుగుదల బాగుంటుంది. జీర్ణవ్యవస్థ చురుగ్గా పనిచేస్తుంది. రోగనిరోధకశక్తి కూడా పెరుగుతుంది. పిల్లలు పొడగవుతారు. బరువు కూడా పెరుగుతారు. ఇలాంటి సమయంలో తల్లిదండ్రులు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేమిటో తెలుసుకుందాం.
ఈ వయసు పిల్లల్లో ఏకాగ్రత తక్కువ. ప్రతి పదినిమిషాలకు వారి దృష్టి వేరే వాటి మీదికి మరలిపోతుంది. అందుకే తల్లిదండ్రులు పిల్లలకు 20 నిమిషాలోపు అన్నం తినిపించాలి.
ఆకలేసినప్పుడే పిల్లలకు అన్నం పెట్టాలి. ఆకలి కాకుండానే అన్నం పెడితే వారు సరిగా తినరు.
తిండి విషయంలో పిల్లలను వారి స్నేహితుతో ప్చోవద్దు. పిల్లలకు ఏది ఇష్టమో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. వాళ్ళ స్నేహితులు ఎలాంటి ఫుడ్‌ ఐటమ్స్‌ తెచ్చుకుంటారో అడిగి తెలుసుకుంటే మంచిది. అలా చేస్తే ఫుడ్‌కి సంబంధించి పిల్లల ఇష్టాఇష్టాలు ఏమిటో తల్లితండ్రులకు తెలిసే అవకాశం ఉంటుంది.
అన్నం తింటే నీకు చాక్లెట్‌ పెడతాను. బిస్కట్‌ ఇస్తాను అన్ని తల్లులు పిల్లనును ఆశపెడుతుంటారు. ఇది మంచి పద్ధతి కాదు. మెనూ ప్లానింగ్‌లో పిల్లలు పాలుపంచుకునేలా చేయాలి. ఎలాంటి ఫుడ్‌ ఐటమ్‌ వారికి ఇష్టం, ఎలాంటివి ఇష్టం లేదు తెలుసుకుని తదనుగుణంగా మెనూ టైమ్‌ టేబుల్‌ తయారుచేసి పిల్లలకు పెట్టాలి.
పోషకాహార లోపం ఉన్న పిల్లలు దేన్నీ తింటానికి తొందరగా ఇష్టపడరు. అలాంటి వారికి తగిన సప్లిమెంట్లు ఇప్పించాలి. అప్పుడు వారిలో పోషకాహార సమస్యలు పోయి ఆకలివేయడం, తిండి పట్ల ఆసక్తి రెండూ పెరుగుతాయి.
సాధారణంగా ఈ వయసు పిల్లలు రోజు మొత్తంలో కొన్ని సమయాల్లో ఇంట్లో లేదా స్కూల్ లేదా క్రచ్‌లో ఉంటారు. తల్లితండ్రు పిల్లలు తినే వేళ పట్ల శ్రద్ధవహించాలి. సమయానికి వారికి ఆహారం తినటం అలవాటుచేయాలి. అన్నం తినే వేళు సరిగ్గా పాటిస్తే పిల్లలు ఎప్పుడూ హుషారుగా, ఎనర్జిటిక్‌గా ఉంటారు.
ఒకేసారి పిల్లలకు ఎక్కువ అన్నం పెట్టేయకండి. అలా పెడితే వారి కడుపు అరాయించుకోలేదు.పసివాని బొజ్జలో ఒకసారి 250 ఎం ఎల్‌ కన్నా మించి ఎక్కువ ఆహారం పోదు.
పోషకపదార్థాలు పుష్కలంగా ఉండే ఆహారాన్ని పిల్లలకు పెట్టాలి. ఇలాచేస్తే పోషకాహార లోపం రాదు. చిక్కి, డ్రైఫ్రూట్స్‌, మిల్క్‌షేక్స్‌, నట్‌ హల్వా, నువ్వుల లడ్డు, పీనట్స్‌, వెన్నపూసిన చపాతీలు, ఎగ్‌ ఆమ్లెట్‌ కలిపిన చపాతీలు, దోసె వంటివి ఈ వయసు పిల్లలకు పెట్టాలి.
పిల్లలకు అన్నం కలిపి పెట్టవద్దు, వారికి వారే ఆహారం కలుపుకుని తినేట్టు అలవాటు చేయాలి.
తిండి ప్రాధాన్యత పిల్లలకు అర్థమయ్యేలా తెలియచెప్పాలి. పిల్లలకు ఇష్టమైన చాక్లెట్లు, పిజ్జాల లాంటివి తినొద్దని కట్టడి చేయకండి. అదే సమయంలో చాక్లెట్‌తో పాటు ఒక పండు కూడా పిల్లలచేత తినిపిస్తే వారి ఆరోగ్యానికి చాలా మంచిది.
పిల్లలకు పెట్టాల్సినవి
ఉదయం 6 గంటకు పాలు, 2 బాదం పప్పులు
ఉదయం 8 గంటకు చట్నీ లేదా సాంబారుతో ఇడ్లీ లేదా ఎగ్‌ దోసె.
ఉదయం 11 గంటకు అరటిపండు లేదా ఇతర పండ్లు
మధ్యాహ్నం 1 గంటకు నెయ్యి వేసిన పప్పు అన్నం, పెరుగు అన్నం
3 గంటకు నువ్వు లడ్డు లేక పల్లీ పట్టీ
సాయంత్రం 5 గంటలకు ఏదైనా పండు
సాయంత్రం 7 గంటలకు రాజ్మా లేదా వెజిటబుల్‌ కర్రీతో చపాతీ
రాత్రి పడుకోబోయే ముందు గ్లాసుడు పాలు, 2 ఖర్జూర పండ్లు

చిన్న పిల్లల ఆహారం

అమ్మపాల నుంచి ….అన్న ప్రాశనలోకి అడుగుపెట్టాక ఎదిగే పాపాయికి ఏం పెట్టాలి ? బిడ్డ చలాకీగా, చురుగ్గా, ఆరోగ్యవంతంగా ఉండటానికి పొట్టను నింపే పోషకాహారాన్ని గోరుముద్దలు ఏ రూపంలో అందించాలి? ఎదిగే క్రమంలో బిడ్డ మానసిక, శారీరక, మానసిక ఎదుగుదలకి అవసరం అయిన పోషకాహారం గురించిన అవగాహన ప్రతి తల్లికి ఎంతో అవసరం.
ముఖ్యంగా ఏడాది లోపు బిడ్డ ఎదుగుదలకి అవసరం అయిన పోషకాలని ఎలా సులువుగా అందించాలో చెబుతున్నారు నిపుణులు.
అమృత సమానం…. అమ్మపాలు : తొలినాళ్ళలో అంటే ఆరునెలల వరకు బిడ్డకు కావల్సిన సమస్త పోషకాలు అమ్మపాలనుంచే అందుతాయి. తల్లి అందించే ఆ అమృతధారలు బిడ్డ వ్యాధి నిరోధక శక్తిని పెంచి రోగాల బారిన పడకుండా చేస్తాయి. ముఖ్యంగా నెలలు నిండకుండా పుట్టిన బిడ్డకు అమ్మపాలే ఔషధం. బదులుగా కొంతమంది ఆవుపాలని, నీళ్ళని ప్రత్యామ్నాయంగా ఇస్తుంటారు. నీళ్ళ వల్ల అనవసరంగా పాపాయి పొట్ట నిండిపోవడం తప్ప ప్రయోజనం ఉండదు. అలాగే ఆవుపాలల్లో ఇనుము లోపం ఉంటుంది. మేకపాల నుంచి అత్యావశ్యక ఫోలిక్‌ ఆమ్లం లభించదు. ఇవి తల్లిపాలకు ప్రత్యామ్నాయం ఎంత మాత్రం కాదు. పైగా కొన్ని సందర్భాల్లో బుద్ధిపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇక ఆర్నెల్ల తర్వాత నుంచీ ఎదిగే చిన్నారులకు వారి అవసరాల రీత్యా ఘనాహారాన్ని తప్పనిసరిగా అందించాలి.
బరువుకు తగ్గ ఆహారం. : ఆరోగ్యవంతమైన శిశువు పుట్టినప్పుడు సుమారు మూడు కేజీల వరకు బరువుండాలి. ఐదోనెలకి అది రెట్టింపవ్వాలి. మొదటి పుట్టిన రోజు నాటికి మూడు రెట్లు ఉండాలి. బిడ్డ బరువు పెరుగుతున్న కొద్దీ, ఆటపాటలు అధికమవుతున్న కొద్దీ వారికి తల్లిపాలతో పాటు ఇతర ఘనాహారం నుంచి అందే శక్తి అవసరం పెరుగుతుంది.
తొలి ఘనాహారం …శక్తి భరితం : సాధారణంగా అన్న ప్రాశన జరిగినప్పట్నుంచి మెత్తగా మెదిపిన అన్నం..పప్పుపై తేట, ఉడికించి మెదిపిన బంగాళదుంపలు, అరటిపండు గుజ్జు నెయ్యి వంటివి వాటిని పిల్లకు తినిపిస్తుంటారు. వాస్తవానికి ఇది మంచి ఆహారమే అయినా పిల్లలు వీటిని కొంచెం తినేటప్పటికి వాటిలోని నీటిశాతం కారణంగా త్వరగా పొట్ట నిండిపోతుంది. దాంతో వాటిని తినమంటూ మారం చేస్తారు. ఫలితంగా పోషకాలు అందవు. అలా కాకుండా తొలి ఘనాహారంలో గింజధాన్యాలు, పాలు, పప్పు దినుసులు కలయికతోచేస్తే మేలు. ఎందుకంటే ఇవి త్వరగా జీర్ణమవుతాయి.
మేలుచేసే మాల్టింగ్‌ పద్దతి : ప్రత్యేక పద్దతిలో చేసే మాల్టింగ్‌ ఆహారాలు పిల్లలకు తేలికగా జీర్ణమై సంపూర్ణ పోషకాలని అందిస్తాయి. ఎంపిక చేసిన చిరు, గింజ ధాన్యాలని ఎండబెట్టి పొడికొట్టే ఈ విధానంలో రాగులు, పెసలతో చేసే మాల్టింగ్‌ ఆహారాలు ఎంతో మేలు చేస్తాయి. వాటిని ఎలా చేసుకోవచ్చో చూద్దాం
రాగి మాల్ట్‌ : శుభ్రం చేసిన కేజీ రాగులని పదిహేను గంటలపాటు నానబెట్టుకోవాలి. నీటిని వంపి తడి వస్త్రంలో మూడు రోజుల పాటు మూటకట్టి ఉంచాలి. మధ్యలో నీటిని చిలకరిస్తూ మొలకలు వచ్చిన తర్వాత తీసి ఎండపెట్టాలి. తర్వాత వాటిని దోరగా వేయించుకోవాలి. మొలకలని తొలగించి పిండి పట్టించుకొని గాలిచొరని డబ్బాలో భధ్రపరుచుకోవాలి.
పెసలమాల్ట్‌ : శుభ్రం చేసిన కిలో పెసలని పదిహేను గంటలపాటు నానబోసి వాటిని తడి వస్త్రంలో మూటకట్టి రోజంతా ఉంచితే మొలకలొస్తాయి. తర్వాత వీటిని ఎండబెట్టి పొట్టు, మొలకలు తొలగించిన తర్వాత సన్న సెగన దోరగా వేయించి, చల్లార్చి పిండి పట్టించుకుంటే పెసల మాల్ట్‌ సిద్ధమైనట్టే.
రుచికరమైన బేబి ఫుడ్‌ చేసుకొనేదిలా… రెండు భాగాలు రాగి మాల్ట్‌కి, ఒక భాగం పెసల మాల్ట్‌ కలిపితే బేబి ఫుడ్‌ సిద్దమైనట్టే. అందులోంచి ఐదు చెంచాల పొడిని తీసుకొని కప్పు పాలలో లేదా నీళ్లలో వేసి ఉడకనివ్వాలి. కమ్మటి వాసనతో మూడు నిమిషాల పాటు ఉడికిన తర్వాత పిల్లకు కాస్తగా జారుగా చేసి పెట్టాలి. ఈ ఆహారం వలన పిల్లలకు ఉబ్బరం, గ్యాస్‌ వంటి సమస్యలు తలెత్తవు. పాలతో కలిపి ఇస్తున్నట్లయితే అవి బాగా మరిగాక ఈ పొడి కపాలి. లేకపోతే అజీర్ణ సమస్యలు తలెత్తుతాయి.
1) ఆరునెలల పిల్లలకు ఆ ఆహారాన్ని ప్రారంభించవచ్చు. నెమ్మదిగా ఏడు, ఎనిమిది నెలల్లో ఈ మాల్ట్‌ ఆహారానికి తోడుగా బాగా ఉడికించిన మాంసం, పప్పు, చేపలు, కూర ముక్కలు, పండ్లు, గుడ్డులోని పచ్చసొన అవసరాన్ని బట్టి కొద్దిగా పంచదార కలపొచ్చు
2) ఇలా నాలుగైదు రకాల ఆహారాని కలిపి ఇవ్వడాన్ని మల్టీమిక్స్‌ అంటారు. ఈ విధానంలో పిల్లలకు మాంసకృత్తులు, ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా అందుతాయి. ఈ ఆహారాన్ని తప్పనిసరిగా చనుపాలు పట్టిన తర్వాతే పెట్టాలి. ముందే పెడితే తల్లిపాలు తాగడం మానేస్తారు. మొదట్లో రెండు చెంచాల వరకు సరిపోతుంది. ఇలా పెట్టినప్పుడు కొన్నిసార్లు పిల్లలు ఉమ్మేస్తుంటారు కూడా కారణం అంతవరకు ఇతర ఆహారం రుచి ఎలా ఉంటుందో తెలియకపోవడమే. క్రమంగా అలవాటు చేసుకుంటారు. అధిక శక్తి కోసం ఆహారంలో కొద్దిగా నూనె, నెయ్యి వంటి కొవ్వు పదార్ధాలని కలపడం పిల్లలకు రెట్టింపు శక్తి అందుతుంది.
3) పసిపాప ఆహారంలో గట్టిగా ఉండే పదార్ధాలని, పొట్టు ఉన్నవాటిని దూరంగా ఉంచాలి. లేకపోతే అజీర్తి చేస్తుంది.
4) ఆహారాన్ని బవంతంగా కాకుండా బుజ్జగించి పదార్ధాన్ని ఆస్వాదించేలా చేసి అప్పుడు పెట్టాలి. ఏడాది నిండిన పిల్లలకు క్రమంగా అన్ని రకాల ఆహారాలని పరిచయం చెయ్యాలి.
పసితనంలో ఏ ఆహారపు అవాట్లు చేస్తారో అవే చాలాకాలం ఉంటాయి. నడక నేరుస్తున్న రోజులోనే పిల్లలకు అన్ని రుచులూ అలవాటు చేయాలి. మూడేళ్ళ పిల్లల ఆహారం పెట్టే తల్లులు ఒకేచోట కూర్చుని ఆహారం తినే అవాటు చేయాలి. అటు, ఇటూ తిరుగుతూ తినే తిండి వంటబట్టదు. అన్నం 20 నిమిషాలో తినిపించాలి.
ప్రతి వారం ఒక కొత్త రుచిని అవాటు చేయాలి. పాలు, పెరుగు రోజులో కనీసం రెండుసార్లు ఇవ్వాలి. బరకగా, మెత్తగా ఉండే ఆహారం అలవాటు చేయాలి. రోజులో పప్పు రెండుసార్లు, పండ్లు ఒకసారి అలవాటు చేయాలి. అన్నంతో కూరగాయలు కలిపి పెట్టాలి.
పిల్లలను తామంత తామే తినేటట్లు ప్రోత్సహించాలి. పిల్లలకు అన్ని రుచులు తెలియాలి. అన్నీ కలిపి మిక్సీలో వేసి మిక్సడ్‌ రుచులు వద్దు. బయటకు తీసుకు వెళ్ళి తినిపించే ఆహారం అసు వద్దు.
పిల్లల పళ్ళు దృఢంగా ఉంచే ఆహారం
బాగా పీచు ఉండి ఎక్కువ సేపు నమిలితే పళ్ళు శుభ్రపడతాయి.
నట్స్‌ : నట్స్‌ ఉప్పులేకుండా తింటే మంచిది. పచ్చి నట్స్‌ చప్పరించటం వన బ్యాక్టీరియా, యాసిడ్స్‌ తొలగి పోతాయి.
తాజాపండ్లు : పండ్లలో పీచు ఎక్కువగా ఉండి చిగుళ్లకు మసాజ్‌ జరుగుతుంది.ఎక్కువగా నమడం వలన పళ్ళు దృఢంగా అయ్యే అవకాశం ఎక్కువ. సిట్రస్‌ పళ్ళు (పుల్లనివి) తిన్న తరువాత నోరు కడుక్కునే అలవాటు చేయాలి. లేకపోతే వీటిలో ఉండే ఆమ్లం వలన పళ్ళపై ఉండే ఎనామిల్‌ దెబ్బ తింటుంది.
పచ్చి కూరగాయలు : పండ్లకంటే పచ్చికూరగాయలు మంచిది. వీటివలన అదనపు చక్కెర చేరదు.
పెరుగు లేదా పాలు : ఇవి కాల్షియంకు అద్భుతమైన ఆధారం. పళ్ళు ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడతాయి.

తల్లిపాలు ….. ఆవశ్వకత

ఆరు నెలల వరకు పూర్తిగా తల్లిపాలే ఇవ్వాలని తెలిసినా.. సగానికి పైగా పిల్లలకు ఈ అదృష్టం దక్కటం లేదు. ఆరు నెలల తర్వాత అదనపు ఆహారాన్ని ఆరంభించాలని తెలిసినా.. దాదాపు సగం మంది ఈ కమ్మదనాన్ని పొందటం లేదు. దీంతో ఎంతోమంది పోషణలోపం బారినపడుతున్నారు. ఎక్కడుందీ లోపం? అందరమూ వేసుకోవాల్సిన ప్రశ్న ఇది.
మొక్క ఏపుగా ఎదగాలంటే ఆయా దశలకు అనుగుణంగా అవసరమైన పోషకాలన్నీ అందాలి. పిల్లలూ అంతే. ఏ వయసులో అవసరమైన పోషకాలు ఆ వయసులోనే అందాలి. అప్పుడే చక్కటి ఆరోగ్యంతో ఎదుగుతారు. శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారవుతారు. పిల్లల పోషణ విషయంలో పుట్టినప్పటి నుంచి తొలి రెండేళ్లు చాలా కీలకమైన దశ! వారి శారీరక ఎదుగుదలకు, మానసిక వికాసానికి బీజం పడేది ఈ వయసులోనే. ప్రవర్తన రూపుదిద్దుకోవటం, విషయాలను గ్రహించే నేర్పులూ పురుడుపోసుకునేదీ ఈ వయసులోనే. అందువల్ల తొలి రెండేళ్లలో పిల్లలకు తగినంత పోషణ లభించటం చాలా అవసరం. లేకపోతే వారి ఎదుగుదల కుంటుపడుతుంది. రకరకాల జబ్బులు చుట్టుముడతాయి. కొన్నిసార్లు బతికి బట్ట కట్టటమే కష్టమైపోతుంది. మనదేశంలో ఎంతోమంది బిడ్డలు కేవలం పోషకాహార లోపంతోనే చనిపోతుండటం ఆందోళకరం. కాబట్టి పిల్లల పోషణపై పుట్టినప్పటి నుంచే దృష్టి పెట్టటం.. జాగ్రత్తగా మసలుకోవటం.. చాలా అవసరం. ముఖ్యంగా తల్లులకు వీటిపై సరైన అవగాహన ఉండటం ముఖ్యం.
సీసాలు వద్దే వద్దు!
పిల్లలకు సీసాతో పాలు పట్టటం తగదు. మనదేశంలో ఏటా 5-6 లక్షల మంది పిల్లలు కేవలం ఈ సీసాల మూలంగానే మరణిస్తున్నారు. వీటితో పాలు పట్టటం వల్ల తీవ్రమైన విరేచనాలు, చెవిలో చీము, గొంతు నొప్పి, వూపిరితిత్తుల్లో నిమ్ము, పిప్పిపళ్లు.. వంటి రకరకాల సమస్యలు చుట్టుముడతాయి. నోట్లో తేనె పీకలు, పాసిఫయర్లు కూడా పెట్టొద్దు. పాలను మాత్రమే కాదు.. నీళ్లు తాగించటానికి కూడా సీసాను వాడొద్దు. తల్లీబిడ్డల అనురాగం, ఆప్యాయతలకు సీసా గొడ్డలిపెట్టు. వీటితో పెరిగే పిల్లలకు అనురాగం, ఆప్యాయత, మానవ స్పర్శ.. వాటి విలువలు తెలియవు. ఇలా యాంత్రికంగా సీసా పాలు తాగి పెరిగే పిల్లలు నలుగురితో కలిసిమెలసి ఉండలేకపోతున్నారని, కలివిడిగా పనిచేయలేకపోతున్నారని అధ్యయనాలు సైతం పేర్కొంటున్నాయి.
తిండితో పాటు ప్రేమా పెట్టాలి!
బిడ్డకు తిండి పెట్టటమే కాదు.. ప్రేమతో, బాధ్యతతో, సంతోషంతో తినిపించటమూ ముఖ్యమే. మనదగ్గర చాలామంది బిడ్డను కాళ్ల మీద వేసుకొని నోట్లో తిండి కుక్కుతుంటారు. పిల్లలేమో అటూఇటూ కదులుతూ, మూతి తిప్పేసుకుంటూ పోరాటం చేస్తుంటారు. కొందరు తల్లులు కొడుతుంటారు కూడా. దీనివల్ల క్రమంగా పిల్లలకు తిండిపై తిరస్కార భావన కలుగుతుంది. ఇలాంటి పరిస్థితిని ఎన్నడూ తెచ్చుకోకూడదు. పిల్లలు సంతోషంగా తినేలా చూడాలి. అలాగని అన్నం పిల్లల ముందు పెట్టేసి వాళ్లే తింటారులే అని విడిచిపెట్టటమూ మంచిది కాదు. తినిపించేవారి ఎత్తులో పిల్లలను కూచోబెట్టి.. వారి కళ్లలోకి చూస్తూ.. నవ్వుకుంటూ.. అనునయంగా మాట్లాడుతూ తినిపించాలి. అదీ ఒకేసారి ఎక్కువగా కాకుండా.. కొంచెం కొంచెంగా పెట్టాలి. పెదవి దగ్గరకు తెస్తే బిడ్డ తనంత తానుగా లోపలికి తీసుకునే అవకాశం ఇవ్వాలి. దీంతో తన ఆహారం తనే తిన్నాననే తృప్తి పిల్లలకు కలుగుతుంది.
పిల్లలకు తినిపించే ఆహారం తాజాగా, వేడిగా ఉండాలి. వండాక రెండు గంటల్లోపే తినిపించాలి. వండే ముందు, తినిపించే ముందు.. దొడ్డికి కడిగిన తర్వాత.. తప్పనిసరిగా చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి.

తొలిగంటలోనే తల్లిపాలు
బిడ్డ పుట్టిన తొలి గంటలోనే తల్లిపాలు ఆరంభించటం చాలా కీలకం. ఈ సమయంలో వచ్చే ముర్రుపాలు బిడ్డకు శక్తిమంతమైన రక్షణ కవచం లాంటివి. ఇదే మనం బిడ్డకు ఇచ్చే మొదటి టీకా అనీ అనుకోవచ్చు. ముర్రుపాలలో శిశువులకు అత్యావశ్యకమైన పోషకాలతో పాటు యాంటీబోడీలు కూడా ఉంటాయి. ఇవి రోగనిరోధకశక్తి పెంపొందటానికి తోడ్పడతాయి. ఇన్ఫెక్షన్ల బారినపడకుండా కాపాడతాయి. మరణం ముప్పు సైతం తగ్గుతుంది. కేవలం తొలి గంటలో తల్లిపాలు పట్టటం ద్వారానే సుమారు 10 లక్షల మంది శిశువులను కాపాడుకోవచ్చు! సిజేరియన్ కాన్పు అయినా కూడా వీలైనంత త్వరగా తల్లిపాలు మొదలెట్టాలి. సహజ కాన్పు కాదు కాబట్టి వెంటనే పాలు రావేమోన్న సందేహం అవసరం లేదు. పుట్టుకతో వచ్చే సమస్యల మూలంగా శిశువును ఇంక్యుబేటర్లో పెట్టినా కూడా తల్లిపాలను పిండి ట్యూబ్ ద్వారానో, చెమ్చాతోనో తాగించే ప్రయత్నం చేయాలి. బిడ్డ ఏడిస్తేనే పాలు ఇవ్వాలని కూడా లేదు. పాల కోసం పిల్లలు చేసే ప్రయత్నాల్లో ఏడ్వటమనేది చివరిది. అంతకుముందు చప్పరించినట్టు చప్పుడు చేయటం, గుప్పిళ్లతో నోటిని రుద్దుకోవటం, సున్నితమైన కూతలు, కళ్లు అటూఇటూ వేగంగా తిప్పటం, ఒకరకమైన చికాకుతో కదలటం వంటివి చేస్తుంటారు. ఇలాంటివి గమనించి వెంటనే పాలు పట్టటం మంచిది. ఎంత ఎక్కువసార్లు ఇస్తే పాలు అంత బాగా వస్తాయి. అందుకే పగటిపూటే కాదు.. రాత్రిపూట కూడా బిడ్డకు తప్పనిసరిగా పాలు పడుతుండాలి.
ఆర్నెల్ల వరకూ కేవలం తల్లిపాలే
పసి పిల్లలకు ఆరు నెలల వయసు వరకూ పూర్తిగా తల్లిపాలే పట్టాలి. ఈ సమయంలో వారికి మంచి నీళ్లు తాగించాల్సిన అవసరమూ లేదు. తొలి ఆరు నెలల్లో బిడ్డ ఎదగటానికి అవసరమైన పోషకాలన్నీ తల్లిపాలలోనే ఉంటాయి. ప్రేమతో, ఆప్యాయతతో ఇచ్చే తల్లిపాలకు సాటి వచ్చేది మరేదీ లేదని గుర్తించాలి. చాలామంది బిడ్డకు 3, 4 నెలలు రాగానే పాలు సరిపోవేమోనని భావిస్తుంటారు. నిజానికిది పూర్తిగా అపోహే. ఆర్నెల్ల వరకూ బిడ్డ అవసరాలకు తగినన్ని పాలు తల్లి దగ్గర లభిస్తాయి. కొందరు 3 నెలలు దాటగానే బిడ్డకు అవీఇవీ పెట్టాలని ప్రయత్నిస్తుంటారు. ఇలాంటివేవీ అవసరం లేదు. పనిచేసే తల్లులు కూడా ఉద్యోగాలకు వెళ్లేటప్పుడు పాలు పిండి ఇంట్లో పెట్టి వెళ్లొచ్చు. ఆఫీసులో ఉన్నప్పుడు కూడా పాలు పిండి నిల్వ చేసుకోవచ్చు. తల్లికి జ్వరం వచ్చినా నిరభ్యంతరంగా పిల్లలకు పాలు పట్టొచ్చు. పాలు రావటం లేదని కొందరు తల్లులు మధ్యలో మానేస్తుంటారు. ఇలాంటివాళ్లు పాలివ్వటం ఆరంభిస్తే మళ్లీ పాలు వస్తాయి. పాలు పడుతున్నకొద్దీ వస్తాయి, పట్టకపోతే రావనే విషయాన్ని గుర్తించాలి.
ఆర్నెల్లు దాటుతూనే అదనపు ఆహారం
ఇప్పటికీ గ్రామాల్లో కొందరు తల్లులు 9, 10 నెలలు దాటినా పిల్లలకు కేవలం తల్లిపాలే ఇస్తుంటారు. ఇది మంచి పద్ధతి కాదు. ఆరు నెలల వయసు దాటుతూనే పిల్లలకు పోషకాల అవసరమూ పెరుగుతుంది. అందువల్ల తల్లిపాలు మాత్రమే ఇస్తే సరిపోదు. అదనపు ఆహారం కూడా మొదలెట్టాలి. లేకపోతే పిల్లలు బక్క చిక్కిపోతారు. ఎదుగుదల కుంటుపడుతుంది. ఇంట్లో ఉండే దినుసులతో చేసిన ఆహారమే పిల్లలకు మంచిది. రకరకాల ధాన్యాలు, పప్పులు కలిపి పిండి పట్టించి.. దాన్ని రెండు పూటలా జావలా చేసి పెట్టటం మంచిది. తమిళనాడులో దంపుడు బియ్యం, గోధుమ, జొన్నలు, సజ్జలు, రాగులు, సగ్గుబియ్యం, మొక్కజొన్న, కందిపప్పు, సెనగ పప్పు, పెసర పప్పు, మినపపప్పు, సోయా, పల్లీలు, జీడిపప్పు, బాదం, ఎండుద్రాక్ష, యాలకులు.. ఇలా 18 రకాల ఆహార దినుసులు కలగలసిన ‘కంజికట్’ అనేది ప్రాచుర్యంలో ఉంది. వీటిని ఎండబెట్టి, వేయించి, పొడికొట్టి.. రోజూ కొద్దిగా నీటిలో ఉడకబెట్టి జావలా చేసి పెడితే పిల్లలు హాయిగా తింటారు. దీంతో అన్ని పోషకాలు లభిస్తాయి. మనదగ్గర కూడా బియ్యం, రకరకాల పప్పులు పొడిగొట్టి వాడటం తెలిసిందే. వీటితో చేసిన ఉగ్గును ఒకట్రెండు చెమ్చాలతో మొదలుపెట్టి క్రమేపీ ఎంత తింటే అంత.. అంటే మూతి తిప్పేదాకా పెట్టాలి. ఈ పొడిని చేసుకోలేకపోతే బియ్యం-పప్పుతో చేసిన ఉగ్గు.. జావ మాదిరిగా చేసి ఇవ్వాలి. ఇందులో కాస్త ఉప్పు-నెయ్యి లేదా చక్కెర-నెయ్యి వేసి తినిపిస్తే తక్కువ ఆహారంతోనే ఎక్కువ కేలరీలు లభిస్తాయి. ఆ తర్వాత వారం వారం వాటిలో ఏదో ఒక కూరగాయ- ఉడకబెట్టిన బంగాళాదుంప, ఉడకపెట్టిన క్యారెట్ వంటివి కలిపి పెట్టాలి.
చిరుతిండిగా అరటిపండు పెట్టొచ్చు. దీన్ని చేత్తో ముట్టుకోకుండా అరటిపండును చెంచాతో కొద్ది కొద్దిగా గీరి బిడ్డ నోట్లో పెట్టటం మంచిది. ఆపిల్, ఆలుగడ్డను ఉడకబెట్టి గుజ్జుగానూ చేసి ఇవ్వొచ్చు. 9-12 నెలల వయసులో మూడుసార్లు ఉగ్గు, రెండుసార్లు చిరుతిండి పెట్టటం మంచిది.
చాలామంది బయట కొనుక్కొచ్చిన డబ్బాల్లోని పొడులే బలమిస్తాయని పొరపడుతుంటారు. ఇది నిజం కాదు. డబ్బాల్లో ఒకటో రెండో దినుసులే ఉంటాయి. వీటి ఖరీదు ఎక్కువ, పోషకాలు తక్కువ. పైగా కొనుక్కొచ్చి పెడతారు కాబట్టి పొదుపుగా, కొద్దికొద్దిగానే ఇస్తారు. ఇది బిడ్డ అవసరాలకు ఏమాత్రం సరిపోదు. ఇంట్లో చేసుకున్నదైతే ఎంత కావాలంటే అంత పెట్టొచ్చు.
బిడ్డకు 6-9 నెలల మధ్యలో గుడ్డు ఉడకబెట్టి.. పచ్చసొనను జావలోనే కలిపి ఇవ్వటం ఆరంభించొచ్చు. మాంసాహారులైతే 9 నెలల తర్వాత ఖీమానూ కలిపి ఇవ్వొచ్చు. ఇవేకాకుండా పెద్దలు వండుకున్న ఆహారాన్నే.. తాము తింటున్నప్పుడే.. కొద్దిగా తీసి మెత్తగా పిసికి పిల్లలకు పెట్టొచ్చు.

ఏడాది దాటితే పెద్దల ఆహారమే
పిల్ల్లల నాలుకల మీద కూడా రుచిమొగ్గలుంటాయి. వీటిని క్రమంగా మన ఇంటి వంటల రుచులకు అలవాటు చెయ్యాలి. ఇది 9 నెలల నుంచి ఏడాది మధ్య సాఫీగా జరిగిపోవాలి. అలాగే కొద్దికొద్దిగా బరక గింజలు తినటమూ అలవాటు చెయ్యాలి. దీంతో పిల్లలు తేలికగా, నమిలి మింగటానికి అలవాటు పడతారు. లేకపోతే ఆ తర్వాత అలవడటం కష్టమవుతుంది. ఏడాది దాటిన బిడ్డలకు ఇంట్లో అందరూ ఏం తింటుంటే అవన్నీ పెట్టాలి. ఏడాది తర్వాత పిల్లలకు ప్రత్యేకంగా ఏదీ వండి పెట్టాల్సిన అవసరం ఉండకూడదు. తల్లిదండ్రులు తాము తినేటప్పుడే పిల్లలను పక్కన కూచోబెట్టుకొని తినేలా చూసుకోవాలి. అదనపు ఆహారం పెట్టినా రెండు సంవత్సరాల వరకూ బిడ్డకు తల్లిపాలివ్వాలి. ఆ తర్వాత ఇవ్వటమా, ఇవ్వకపోవటమా అన్నది తల్లి ఇష్టం. చాలామంది రెండేళ్ల వరకూ తల్లిపాలు ఇవ్వాల్సిన అవసరముందా అనీ సందేహిస్తుంటారు. ఇందులో ఎంతో శాస్త్రీయత ఉంది. ఆర్నెల్ల నుంచి ఏడాది వరకు బిడ్డకు కావాల్సిన 50 శాతం పోషకాలు తల్లిపాల ద్వారానే అందుతాయి. ఇక ఏడాది నుంచి రెండేళ్లు నిండే వరకూ.. వారి పోషక అవసరాల్లో మూడింట ఒక వంతు తల్లిపాల నుంచే లభిస్తాయి. కాబట్టి రెండేళ్లు నిండేవరకూ బిడ్డకు తల్లిపాలు పట్టటం అవసరమే.

పోషణలోపం తొలి రెండేళ్లలోనే అధికం
మనదేశంలో ఏటా సుమారు 18 లక్షల మంది పిల్లలు ఐదేళ్లలోపే మరణిస్తున్నారు. ఇందులో చాలావరకు మరణాలకు పోషకాహార లోపమే కారణం. ఈ లోపం తొలి రెండు సంవత్సరాల వయసులోనే ఎక్కువగా ఉంటోంది. తల్లిపాలు ఇవ్వకపోవటం, సరైన అదనపు ఆహారం పెట్టకపోవటమే దీనికి ముఖ్య కారణం. బిడ్డ బక్కగా.. పొట్ట, బుగ్గలు లోపలికి పీక్కుపోయి కనబడుతున్నా.. చర్మం ముడతలు పడినట్టున్నా.. గుండ్రంగా ఉండాల్సిన తొడలు-పిర్రలు ముడతలు పడినట్టున్నా.. బిడ్డకు పోషకలోపం ఉన్నట్టే! ఇలాంటి పిల్లలకు మరింత తరచుగా ఆహారం ఇవ్వాలి. ప్రతిసారీ అదనంగా మరో రెండు చెంచాలు ఎక్కువగానూ తినిపించాలి. ఆహారంలో నెయ్యి, కొవ్వులు పెంచటం వల్ల మరింత శక్తి లభిస్తుంది.

Breast Feeding Procedures

breast feeding methods

ఇలా చేయాలి :
పై చిత్రంలో చూపిన విధంగా పూర్తి బ్రెస్ట్ ను యూ-హోల్డ్ మాదిరిగా కింది నుంచి చేతిని పాలిండ్లు చుట్టినట్లుగా పెట్టాలి. పాపాయి పై పెదవికి నిపుల్ తేలిగ్గా తగిలేలా ఉంచాలి. ఇది స్టిమ్యులేటింగ్ ప్రభావం చూపుతుంది. పాపాయి విశాలంగా నోరు తెరిచాక బిడ్డను దగ్గరగా పొదువుకోవాలి. బిడ్డ పై పెదవికి ముక్కుకు నడుమ గ్యాప్ ఉండాలి. దీనివల్ల బిడ్డ నిపుల్ను గట్టిగా పెదవుల నడుమ బిగించి సౌకర్యంగా పాలు తాగుతుంది.
…………………………………………………………………………………………………………………………………………………………………………………..

breast feeding methods

ఇలా చేయకూడదు :
రెండువేళ్ళ నడుమ నిపుల్ ఉంచి నొక్కడం తప్పు. దీనివలన నిపుల్ చుట్టుప్రక్కలా బ్లాక్ అయ్యి పాలు రావటం తగ్గుతుంది.
…………………………………………………………………………………………………………………………………………………………………………………..

breast feeding methods

ఇలా చేయాలి :
బిడ్డను పూర్తిగా పొట్టకు ఆనించుకొని, తల,మెడ, మిగతా శరీరం తిన్నగా సరైన సపోర్ట్ తో ఉండాలి సపొర్ట్ తో ఉండాలి.
…………………………………………………………………………………………………………………………………………………………………………………..

breast feeding methods

ఇలా చేయకూడదు :
కేవలం బిడ్డ తల లేదా ముఖాన్ని మాత్రమే రొమ్ము వైపునకు తిప్పుకోవటం సరికాదు.
…………………………………………………………………………………………………………………………………………………………………………………..

milk feeding

ఇలా చేయాలి :
పాపాయి నోటిని విశాలంగా తెరవాలి.కిందిభాగం బిడ్డనోటిలో ఉండాలి. నిపుల్ నేరుగా బిడ్డ ముక్కువైపుగా ఉండాలి.బిడ్డ చుబుకం బ్రెస్ట్ కు తగులుతూ తలపైకి వుండాలి. ముక్కు స్త్యన్యం పైన ఉండాలి. దీనివల్ల గాలి బాగా ఆడటానికి, మింగటానికి వీలవుతుంది. కింది పెదవి వెలుపలకు ఉండాలి. ఇలా ఇవ్వటం వలన నిపుల్స్ కు నొప్పి, గాయాలవంటి అసౌకర్యం ఉండదు.
…………………………………………………………………………………………………………………………………………………………………………………..

breast feeding methods

ఇలా చేయకూడదు :
స్తనం కొద్దిభాగం మాత్రమే బిడ్డ నోటిలో ఉంటే పాలు సరిగ్గా అందవు. మెడ, తలనొప్పి పెడతాయి. శరీరం తిన్నగా ఉండదు.
…………………………………………………………………………………………………………………………………………………………………………………..

breast feeding methods

ఇలా చేయాలి :
నిపుల్ నోటిలోని రూఫ్ కుసాఫ్ట్ పలెట్టాను టచ్ చేయాలి పైవైపునకు ఉండాలి.
…………………………………………………………………………………………………………………………………………………………………………………..

breast feeding methods

ఇలా చేయకూడదు :
క్రింది వైపునకు ఉండకూడదు.
…………………………………………………………………………………………………………………………………………………………………………………..

breast feeding methods

క్రాడిల్ విధానం:
చేతితో బిడ్డ తలనుంచి వీపుదాకా సపోర్ట్ చేస్తూ పాలివ్యాలి. సపోర్ట్ కోసం దిండు వాడుకోవచ్చు. నూతన శిశువు కాకుండా పాలుతాగడం నేర్చిన నెలల పిల్లలకు ఈ విధానం బాగుంటుంది.
…………………………………………………………………………………………………………………………………………………………………………………..

breast feeding methods

క్రాస్ క్రాడిల్ విధానం :
బ్రెస్ట్ కు వ్యతిరేక దిశలో చేతిని సపోర్ట్ చేస్తూ పాపాయి మెడకిందుగా చెయ్యి వేసి పాలివ్యాలి. నూతన శిశువులకు , కొద్దిగా పెద్దశిశువులకు అనువైన విధానం.
…………………………………………………………………………………………………………………………………………………………………………………..

breast feeding methods

మోడిఫైడ్ క్రాడిల్ విధానం :
రెండు చేతులూ వాడుతూ బిడ్డకు సపోర్ట్ చేయాలి. ఈ పద్ధతి కొంచెం పెద్దపిల్లలకు అనువుగా వుంటుంది.
…………………………………………………………………………………………………………………………………………………………………………………..

breast feeding methods

పడుకునే పాలిచ్చే విధానం:
ఓ వైపునకు తిరిగి పడుకుని, బిడ్డను తనవైపుకు తిప్పుకొని పాలివ్వాలి. పాపాయికి ఓ చేత్తోగానీ, దిండుతో కానీ సపోర్ట్ ఇవ్వాలి. రెండో చేతితో స్తన్యాన్ని పాపాయి పాలు తాగటానికి సౌకర్యంగా పట్టకోవాలి. సి-సెక్షన్ జరిగిన తల్లులకు అనువైనది. పాలిస్తూ తల్లికి బిడ్డకూ కూడా నిద్రలోకి జారుకోవటానికి సౌకర్యంగా ఉంటుంది.
…………………………………………………………………………………………………………………………………………………………………………………..

breast feeding methods

లెయిడ్ బ్యాక్,బయోలాజికల్ నర్సింగ్ :
రిక్లైనర్ లో వెనక్కు వాలి లేదా దిండులు ఎత్తుగా పెట్టుకుని తరువాత పాపాయిని ఛాతీ లేదా ఉదరంపై పెట్టుకుని వీలయినంత దగ్గరగా పాపాయి స్తనాలపైకి పాకే విధమైన పొజిషన్లో ఉంచుకుని పాలు తాగించాలి. ఏ విధమైన నర్సింగ్ కైనా సూటవుతుంది. నూతన శిశువులకు ముఖ్యంగా పాలుతాగడంలో మొదట్లో సమస్యలు ఎదురైన వారికి అనువుగా ఉంటుంది.
…………………………………………………………………………………………………………………………………………………………………………………..

breast feeding methods

ఫుట్ బాల్ లేదా సైడ్ క్లచ్ :
చేతులు గల సోఫా లేదా దిండుపై చేతిని ఆనించి ఒకచేతితో బిడ్డను పట్టుకోవాలి. బాగా చిన్న పిల్లలకు, పెద్ద స్తనాలు కలిగిన తల్లులకు, సి-సెక్షన్ జరిగిన వారికి మరియు కవల పిల్లలకు అనువైన విధానం.

Lice…..పేల నివారణ

పేలనుండి ఉపశమనం పొందటానికి మార్కెట్లో చాలా షాంఫూలు లభిస్తున్నాయి. కాని అవి రసాయనాలతో తయారు చేయబడినవి. అలా కాకుండా సహజసిద్ధంగా దొరికే పదార్థాలతో పేల బాధ తగ్గించుకోవడానికి కొన్ని చిట్కాలు :

పేల నివారణకు వెల్లుల్లి అద్భుతంగా పని చేస్తుంది. ముందుగా కొన్ని వెల్లుల్లి రెబ్బలను మెత్తగా నూరి, దానికి కాస్త నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని మాడుకు పట్టించి మునివేళ్లతో చిన్నగా మర్ధన చేయాలి. గంటసేపు అలాగే ఉంచాలి. ఆ తరువాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయించి.. చిక్కుదువ్వెనతో దువ్వాలి. అప్పుడు పేలు మొత్తం రాలిపోతాయి. 

రెండు టేబుల్ స్పూన్ల వెనిగర్ కు అంతే మోతాదులో నీరు కలిపి ఆ మిశ్రమాన్ని తలకు రాసి ఆరనివ్వండి. సరిగ్గా గంట తరువాత కుంకుడు కాయరసంతో తలస్నానం చేయాలి.

ఒక కప్పు కొబ్బరినూనెలో టీస్పూన్ కర్పూరం పొడి కలపాలి. ఆ పొడి కరిగిపోయేదాకా కొబ్బరినూనెను వెచ్చబెట్టండి. గోరువెచ్చగా నూనెను మాడుకు అంటేలా శుభ్రంగా మర్థనా చేయాలి. ఒక గంటతరువాత కుంకుడు కాయల రసంతో స్నానం చేయాలి.

బాదం పప్పులను ఒకరోజు మొత్తం నీటిలో నానబెట్టాలి. ఉదయాన్నే వాటిపైనున్న తొక్కను తీసేసి.. మెత్తటి పేస్టులా రుబ్బుకోవాలి. అందులోకి రెండుమూడు స్పూన్ల నిమ్మరసం కలిపి. జుట్టు కుదుళ్లకు పట్టించాలి.

గుప్పెడు తులసి ఆకులు తీసుకొని నూరి రాత్రి నిద్రపోయేముందు తలకు అంటేలా రాసుకోండి. తర్వాత వెంట్రుకలు కనిపించకుండా తలకు మెత్తని వస్ర్తం కట్టుకొని పడుకోండి. తెల్లారి లేచిన తరువాత పేల దువ్వెనతో దువ్వండి.

వేపగింజల నూనె మార్కెట్లో దొరుకుతుంది. దాన్ని తీసుకుని తలకు పట్టించవచ్చు. లేదంటే వేపనూనెకు షాంపూను కలిపి కూడా జుట్టుకు అప్లై చేయవచ్చు. 

రాత్రి పడుకోబోయే ముందు ఆలివ్ నూనెను తలకు బాగా పట్టించి తర్వాత ఒక ప్లాస్టిక్ సంచిని తలకు చుట్టుకొని పడుకోండి. తెల్లారిన తరువాత పేల దువ్వెనతో శుభ్రంగా దువ్వండి వారానికి ఒకసారి ఇలా చేస్తే పేలబాధనుండి విముక్తి పొందవచ్చు.

Hormones..హర్మోన్స్

మానవ శరీరంలోని కొన్ని గ్రంథులు రక్తంలోకి నేరుగా కొన్ని రసాయన ద్రవపదార్థాలను విడుదల చేస్తాయి. ఇవి విడుదల చేసే ద్రవ పదార్థాలను ‘హర్మోన్స్’ అని అంటారు. ఈ గ్రంథులను ‘ఎండోక్రైన్ గ్రంథులు’ అంటారు శరీరంలో జరిగే జీవ ప్రక్రియకు, నియంత్రణకు హర్మోనులే ఆధారం. ఎవరైనా వ్యక్తికి పదే పదే ఓ సమస్య ఏర్పడితే వెంటనే అది హార్మోనుల లొపం అని చెబుతారు. ప్రస్తుత కాలంలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది సర్వ సాధారణంగా మారింది. ఒత్తిడితో కూడిన జీవన శైలి మరియు తీసుకొనే అనారోగ్యకరమైన ఆహారం వలన శరీరంలో హార్మోనల్ అసమతుల్యత ఏర్పడి అనేక సమస్యలకు దారి తీస్తుంది. అయితే హార్మోనుల అసమతుల్యత వల్ల పురుషుల కంటే స్త్రీలకే ఎక్కువ సమస్యలు కలుగుతాయి.

ఈ హార్మోన్‌లు రెండు రకాలు ఎక్సోక్రైన్, ఎండోక్రైన్.

ఎక్సోక్రైన్ గ్రంథులు విడుదల చేసే స్రావాలు నాళాల ద్వారా స్రవిస్తాయి. ఎండ్రోక్రైన్ గ్రంథులకు నాళాలు ఉండవు, వీటి నుంచి వెలువడిన హార్లోన్లు నేరుగా రక్తంలో కలసి శరీరమంతా వ్యాపిస్తాయి. ఎక్సోక్రైన్ గ్రంథులకు ఉదాహరణలుగా స్వేదగ్రంథులు, కాలేయాన్ని చెప్పవచ్చు. కాలేయం, క్లోమం జీర్ణరసాలను ఉత్పత్తి చేస్తాయి. ఎండోక్రైన్ గ్రంథులకు ఉదాహరణలు …..పిట్యుటరీ గ్రంథి, థైరాయిడ్ గ్రంథి, పారాథైరాయిడ్, ఎడ్రినల్ గ్రంథులు. మగవారిలో వృషణాలు, స్త్రీలలో అండాశయాలు కూడా ఎండోక్రైన్ గ్రంథులే. హార్మోనులు తగినంత పరిమాణంలో విడుదల కావాలి. అవసరానికి మించి విడుదలైనా, తక్కువగా విడుదలైనా చెడ్డ ఫలితాలు కలుగుతాయి.
హార్మోన్ల కారణంగానే మానసిక శారీరక ఎదుగుదల జరుగుతాయి జీవక్రియలు, శరీర నియంత్రణ, సంతానోత్పత్తి, వయసుకు తగిన మార్పులు, శారీరక విధులు ఆలోచన, ఆవేశం, సెక్స్ హార్మోన్‌ల వల్లనే కలుగుతాయి శరీరంలో గ్లూకోజ్ ను నియంత్రించేదే ఇన్సులిన్. దీని లోపం కారణంగానే డయాబెటిస్ వస్తుంది
ఆర్గానిక్ ఫుడ్స్ లో రసాయనాలు ఉండవు. దీని వలన హార్మోన్ లు సమతుల్యంగా ఉంటాయి. బ్రొకోలీ, కాలీఫ్లవర్, మరియు క్యాబేజ్ శరీరంలో హార్మోనులను బ్యాలెన్స్ చేస్తాయి. గోధుమలు, బ్రెడ్, బ్రౌన్ రైస్ వంటి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు హార్మోనులను స్థిరంగా ఉంచడానికి సహాయపడుతాయి. లెంటిల్స్, పచ్చిబఠానీలు మరియు సోయా బీన్స్ వంటి వాటిలో ఈస్ట్రోజెన్అధికంగా ఉండటం వలన హార్మోన్స్ ను బ్యాలెన్స్ చేస్తాయి. ఆకుపచ్చని కూరగాయలలో ప్రోటీనులు మరియు న్యూట్రీషియన్స్ అధికంగా ఉంటాయి. ఇవి హార్మోనులను బ్యాలెన్స్ చేస్థాయి . హార్మోనులు నియంత్రించబడతాయి.
హార్మోనులు బ్యాలెన్స్ చేయడానికి మరో మంచి ఆహారం చేపలు . వారానికొక సారి ఫిష్ తీసుకోవడం వల్ల హార్మోనులను బ్యాలెన్స్ చేసుకోవచ్చు. తున మరియు సాల్మన్ వంటి చేపల్లో ఉండే నూనెలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వెజిటేరియన్స్ ఆలివ్ ఆయిల్, నట్స్, హోల్ గ్రెయిన్స్ తీసుకోవచ్చు. వీటిలో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి
బెర్రీస్ లో ఫ్లెవనాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి హార్మోన్స్ ను బ్యాలెన్స్ చేస్తాయి. సిట్రస్ ఫ్రూట్స్, గ్రేప్స్ మరియు రెడ్ బెర్రీస్ మొదలైనవి హార్మోన్స్ ను బ్యాలెన్స్ చేయడానికి ఉపయోగపడతాయి.
కొన్ని రకాల హార్మోన్స్ గురించి వివరాలు……

ఎండార్ఫిన్స్ :

ఇవి శరీరంలో బాధను తగ్గించి నొప్పి తలెత్తకుండా ఆపుతుంది. సంతోషానుభూతికి ఈ హార్మోన్ కారణం.
ఎండార్ఫిన్ హార్మోన్స్ విడుదల కావటానికి అతి మంచి మార్గం క్రమం తప్పకుండా వ్యాయామం చేయటమే. కారంగా ఉన్న మిర్చిబజ్జీ తిన్నపుడు లేక బాగా కారంగా ఉన్న పదార్థం తిన్నపుడు మన మెదడుకు బాధలాంటి సిగ్నల్స్ అందుతాయి. దీనితో శరీరంలో ఎండార్ఫిన్స్ విడుదల అవుతాయి. స్ట్రాబెర్రీలు, ద్రాక్ష, పెరుగు నొప్పిని తగ్గించే ఎండార్ఫిన్ల ఉత్పత్తికి తోడ్పడతాయి.

థైరాక్సిన్

ఈ హార్మోన్ థైరాయిడ్ గ్రంధి నుండి ఉత్పత్తి అవుతుంది. ఈ హార్మోన్ మానవ శరీరంలోని జీవక్రియను నియంత్రిస్తుంది. జీర్ణశక్తి, గుండె, కండరాల ఫంక్షన్స్, మెదడు ఎదుగుదల మీద ప్రభావం చూపుతుంది. ఈ గ్రంధి శరీరంలోని గొంతు భాగంలో సీతాకోకచిలుక ఆకారంలో ఉంటుంది. ఈ హార్మోన్ మన శరీరానికి తప్పని సరి అవసరం. ఈ హార్మోన్ విడుదల హెచ్చు-తగ్గుల వలన శరీరంలో వివిధ రకాల మార్పులు సంభవిస్తాయి. థైరాయిడ్ సమస్యల వలన చాలా రకాల సమస్యలు కలుగవచ్చు ఈ థైరాయిడ్ హార్మోన్ లోపం కారణంగానే థైరాయిడ్ అనే వ్యాధి వస్తుంది- శరీరం అతిగా పెరగటం లేక తగ్గటం.
థైరాయిడ్ సమస్యలకు కారణం స్వీట్స్, బిస్కెట్స్, కేక్స్ మరియు ఇతర అధిక క్యాలోరీలను అందించేవి. వేయించిన ఆహారాలను, చక్కెర ద్రావణాలను, టీ మరియు కాఫీలను కూడా తగ్గించాలి. అధికంగా నీటిని త్రాగటం మరియు తాజా పండ్ల రసాలను తాగటం. అంతేకాకుండా, తగిన సమయం పాటూ నిద్ర వలన కూడా థైరాయిడ్ సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. వ్యాయామాలను అధికం చేయటం వలన శరీరానికి ఆక్సిజన్ సరఫరా ఎక్కువ అవుతుంది. దానితో థైరాయిడ్ గ్రంధి కూడా ఆరోగ్యకర స్థాయిలో ఉంటుంది.
థైరాయిడ్ సమస్యలతో భాదపడే వారు అయోడిన్’ను ఎక్కువగా తీసుకోవాలి. అయోడిన్’ను అందించే ఆహార పదార్థాలు అయినట్టి ఆస్పాగారాస్, ఓట్స్, ఉల్లిపాయ, పనస పండు, టమాట, క్యాబేజీ, అల్లం మరియు స్ట్రాబెర్రీలను తినండి. ఈ రకమైన ఆహార పదార్థాల నుండి శరీరానికి అవసరమైన స్థాయిలో అయోడిన్ అందించబడుతుంది.
విటమిన్ ‘ఎ’ వలన థైరాయిడ్ సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. రోజూ తీసుకునే ఆహారంలో విటమిన్ ‘ఎ’ అధికంగా ఉన్న పచ్చని కూరగాయలను ఆహారంలో చేర్చుకోవాలి. విటమిన్ ‘ఎ’ క్యారెట్, గుడ్లు మరియు పచ్చని ఆకుకూరలలో ఎక్కువగా ఉంటుంది.

డోపమైన్

ఈ హార్మోన్ వలన కూడా సంతోషం కలుగుతుంది. ఏదైనా లక్ష్యాన్ని అందుకున్నపుడు కొంతసేపు తృప్తితో కూడిన సంతోషం కలుగుతుంది. దీనికి కారణం డోపమైన్. డోపమైన్ లోపం కారణంగానే పార్కిన్ సన్ (మెదడు లోని నరాలు క్షీణించడం) అనే వ్యాధి వస్తుంది. ఈ హార్మోన్ మొదడులోని ఒక భాగం నుండి విడుదల అవుతుంది.
డోపమైన్ ను మెరుగు పరచుకోవటం : క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం వలన శరీరంలో డోపమైన్ స్థాయి పెరుగుతుంది. లక్ష్యం నిర్ధేశించుకుని దానిని సాధిస్తే ఆ పని వలన మనలోని ఆనందపు స్థాయి అద్భుతంగా పెరుగుతుంది.
టమాటోలు, బ్రకోలీ, అవకాడో, బంగాళాదుంపలు, కొత్తిమీర, కమలాలు, మొలకెత్తిన గింజలు, మొదలైన వాటినుండి డోపమైన లభిస్తుంది. చాకొలెట్లు, బ్లూబెర్రీలు, చిలగడదుంపలు, బ్రకోలీ ఆనందమయ జీవనానికి కారణమైన డోపమైన్‌ను విడుదల చేస్తాయి.
అరటి పళ్లు, ప్రొటీన్ అధికంగా లభించే ఆహారపదార్ధాల వలన డోపమైన్ స్థాయి పెరుగుతుంది. ఇంకా ఆలివ్ ఆయిల్, వేరుశెనగప్పులు, ఓట్స్, పుదీనా, పుచ్చకాయ, సోయా ఉత్పత్తులు, నువ్వులు, పసుపు వంటి వంటిని వాడటంతో ఈ హార్మోన్ స్థాయిలు పెరుగుతాయి.

ఘ్రెలిన్

దీనిని హంగర్ హార్మోన్ గా పిలుస్తారు. ఆకలిని ఉద్దీప్తం చేయటంలో హైపోథాలమస్ పై పనిచేస్తుంది. ఆహారం తిన్న తరువాత ఘ్రెలిన్ స్థాయిలు తగ్గిపోతాయి. తరువాత ఆహారం తీసుకునే సమయాని వీటి స్థాయి పెరిగి ఆకలి పెరుగుతుంది.

గ్రోత్ హార్మోన్

మన ఎదుగుదలకు కారమణమయ్యే గ్రోత్ హార్మోన్ ను పిట్యుటరీ గ్రంథి తయారు చేస్తుంది

ఇన్సులిన్

మనం తిన్న ఆహారం జీర్ణమై గ్లూకోజ్ గా మారి రక్తంలో కలుస్తుంది. ఈ గ్లూకోజ్ ను శరీరంలోని జీవకణాలు గ్రహించి శక్తిని పొందుతాయి. ఈ గ్లూకోజ్ ను జీవకణాలు గ్రహించటానికి ఇన్సులిన్ తాళం చెవిలాగా పనిచేస్తుంది. ఇన్సులిన్ సరైన మోతాదులో ఉత్పత్తి అయినపుడు మాత్రమే గ్లూకోజ్ ను జీవకణాలు గ్రహిస్తాయి. ఇన్సులిన్ సరైన మోతాదులో ఉత్పత్తి కానపుడు లేక పూర్తిగా ఉత్పత్తి కానపుడు గ్లూకోజ్ రక్తంలో అధికంగా నిల్వ ఉండి పెద్దవారిలో టైప్-1, చిన్న పిల్లలలో టైప్ – 2 డయాబెటిస్ వస్తుంది. వీరినే షుగర్ వ్యాధిగ్రస్తులు అని కూడా అంటారు. డయాబెటిస్ కు కారణం ఇన్సులిన్

లెప్టిన్

హర్మోన్ ఆఫ్ ఎనర్జీ ఎక్సె పెండిచర్ గా ఈ హార్మోన్ ను పేర్కొంటారు. ఆకలిని అడ్డుకోవటం ద్వారా శక్తి సమతౌల్యాన్ని క్రమబద్దీకరిస్తుంది. తక్కువ ఆకలి ఉంటే తక్కువ ఆహారం తింటారు. తరువు తగ్గుతారు. స్థూలకాయులలో లెప్టిన్ ను నియంత్రించే శక్తి ఉండదు. అందుకనే అధికంగా ఆహారం తింటారు.

ఆక్సిటోసిన్‌

ఈ హార్మన్ వలన పునరుత్పత్తి వ్యవస్థ, శిశు జననం, బాలింతలలో పాలు పడటం లాంటి విషయాలను నియంత్రిస్తుంది. ఇది కుంగుబాటు తనానికి పూర్తి వ్యతిరేకి. తేలికపాటి వ్యాయామాలు, యోగా వలన ఈ హార్మోన్ పెరుగుతుంది. ఆక్సిటోసిన్ ఇంజక్షన్ లను పాడిపశులకు ఇచ్చి వాటినండి అమానుషంగా పాలను పూర్తిగా సేకరిస్తుంటారు. ప్రస్తుతం ఈ ఇంజక్షన్ లను పశువులకు చేయటం నిషేధించబడింది. గుమ్మడి విత్తనాలు, బంగాళాదుంపలు, క్వినోవా, నువ్వులు ప్రేమలో పడ్డప్పుడు విడుదలయ్యే ఆక్సిటోసిన్‌ని ఉత్పత్తి చేస్తాయి.

టెస్టాస్టిరాన్

టెస్టోస్టిరాన్‌ పురుషుల్లో బీజాల నుండి, ఎడ్రినల్‌ నుండి టెస్టోస్టిరాన్‌ హార్మోను ఉత్పత్తి అవుతుంది. పురుషుల మగతనానికి ఇది అత్యంత ముఖ్యమైంది. ఇది లేకపోతే మీసాలు, గడ్డాలు పెరగవు. గొంతులో మార్పు రాదు. సెక్స్‌లోపం కూడా సంభవిస్తుంది. మహిళల్లో కూడా టెస్టోస్టిరాన్‌ హార్మోను ఉంటుంది. కాకపోతే పురుషుల్లో కన్నా బాగా తక్కువగా ఉంటుంది. మహిళల్లో ఎడ్రినల్‌ గ్రంథుల నుండి టెస్టోస్టిరాన్‌ ఉత్పత్తి అవుతుంది. పురుషుల్లో ప్రతి 100 మిల్లీలీర్ల రక్తంలో 300 నానోగ్రాముల నుండి 1200 నానోగ్రాముల దాకా టెస్టోస్టిరాన్‌ ఉంటుంది. మహిళల్లో ప్రతి 100 మిల్లీలీరట్ల రక్తంలో 15 నుండి 100 నానోగ్రాముల పరిమాణంలో టెస్టోస్టిరాన్‌ ఉంటుంది.
టెస్టాస్టిరాన్ స్థాయిలు తగ్గితే శారీరకంగా ఎదుగుదల కుంటుపడుతుంది. ఈ హార్మోన్ సరైన స్థాయిలో ఉండేలా చూసుకోవాలంటే ఈ క్రింది అంశాలను మీరు గుర్తుంచుకోవాలి.
అధిక బరువు ఉన్నవారు బరువు తగ్గాలి. జింకు, మెగ్నీషియం లాంటి లోహాలు టెస్టాస్టిరాన్ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తాయి. అందువల్ల ఈ లోహాలందే ఆహారం తినడం మగవారిలో టెస్టాస్టిరాన్ స్థాయి పెరగడానికి చాలా ముఖ్యం. ఒత్తిడి తగ్గించుకోవాలి.
చక్కర తీసుకున్నప్పుడు శరీరంలో టెస్టాస్టిరాన్ స్థాయి ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. చక్కర ఎక్కువగా తీసుకోవడం తప్పనిసరిగా తగ్గించుకోవాలి. పోషకాహారం తీసుకోవాలి. విపరీతంగా వ్యాయామాలు చేయకూడదు.

ఆండ్రోజన్లు

ఇవి పురుషు లైంగిక హార్మోనులు. ఇవి మహిళల్లో లైంగిక వాంఛను, శక్తిని, ఎముకల సాంధ్రతను, కండరాల పటుత్వాన్ని పెంచుతాయి. అండాల్లోని పురుష హార్మోనుల చురుకుదనం వల్ల మహిళల్లో సంతానోత్పత్తి నియంత్రణలో ఉంటుంది. అండాశయంలో ఫాలికిల్స్‌ ఉంటాయి. వీటిని పుటికలు అంటారు. ఇవి కూడా ఒక రకమైన కణాలు. ఫాలికిల్స్‌ నుండి అండాలు విడుదలవుతాయి. పురుష హార్మోనులు ఫాలికిల్‌ పెరుగుదల, అభివృద్ధిని నియంత్రిస్తుంది. ఇవి ఫాలికిల్‌ ఎదుగుదలను, అభివృద్ధిని నియంత్రిస్తాయి. అదే సమయంలో పెరుగుతున్న అండాలు కలిగున్న ఫాలికిల్స్‌ క్షీణించడాన్ని నివారిస్తాయి.

Unfertility… Reasons-..Solutions….పండంటి పాపాయి కోసం…

పెళ్లయి ఏళ్లు గడుస్తున్నా పిల్లలు పుట్టడం లేదని కలత
స్త్రీలు గర్భం దాల్చకపోవడానికి చాలా కారణాలుండొచ్చు. అధిక బరువు, వయసు, పోషకాల లోపం వల్ల కూడా సంతానసాఫల్యత తగ్గొచ్చు. ముఖ్యంగా ఫోలిక్‌యాసిడ్‌, ఇనుము, జింక్‌, విటమిన్‌ బి12 లోపాలు ప్రభావం చూపిస్తాయి. పూర్తిగా శాకాహారం తీసుకునేవారు వైద్యుల సలహాతో ఆ పోషకాలను సప్లిమెంట్ల రూపంలో తీసుకోవాల్సి ఉంటుంది. అతిగా వ్యాయామం చేయడం, అసలు చేయకపోవడం కూడా సమస్యే. లైంగికంగా సంక్రమించే క్లమీడియా ప్రభావం ఫెలోపియన్‌ ట్యూబులపై పడుతుంది. కొన్నిరకాల రసాయనాలు, ఒత్తిడి వల్ల లైంగికచర్యపై ఆసక్తి సన్నగిల్లి సంతాన సాఫల్యత తగ్గుతుంది. ఇవే కాదు… మరికొన్ని సమస్యలూ ఉన్నాయి.
అండాలు నాణ్యత లేకపోవడం…
రుతుక్రమం మొదలయ్యాక ప్రతినెలా అండం విడుదల కావాలి. అయితే కొన్నిసార్లు అసలు అండం విడుదల కాదు లేదా ఎప్పుడో విడుదల కావచ్చు. కొందరిలో నలభైఏళ్లకే అండాశయాల పనితీరు ఆగిపోతుంది. దీన్ని ప్రిమెచ్యూర్‌ ఒవేరియన్‌ ఫెయిల్యూర్‌ అంటారు. అలాగే పీసీఓఎస్‌ (పాలిసిస్టిక్‌ ఒవేరియన్‌ సిండ్రోమ్‌)సమస్య వల్లా అండాశయాలు సరిగ్గా పనిచేయవు. అప్పుడు కూడా అండాల విడుదల సరిగా ఉండదు.
ప్రొలాక్టిన్‌ స్థాయులు (హైపర్‌ప్రొలాక్టెనీమియా) ఎక్కువగా ఉన్నవారు గర్భం దాల్చలేరు. ఆ స్థాయులు పెరిగేతే అండాల విడుదలపై, సంతాన సాఫల్యతపై ప్రభావం పడుతుంది.
కొందరికి అండాలు విడుదల అవుతాయి కానీ నాణ్యత ఉండదు. జన్యుపరమైన లోపాలు, వయసు ఇందుకు కారణం.
థైరాయిడ్‌, గర్భాశయం లేదా ఫెలోపియన్‌ ట్యూబులో సమస్యలు… అండం విడుదలైనా అది గర్భాశయంలోకి చేరకుండా అడ్డుకుంటాయి. అలా అండం సవ్యంగా ప్రయాణించకపోతే గర్భం దాల్చలేరు.
కటివలయానికి ఏదయినా శస్త్రచికిత్స జరిగినప్పుడు ఫెలోపియన్‌ ట్యూబులకు హాని కలగొచ్చు. అలాగే గర్భాశయ ముఖద్వారానికి ఆపరేషన్‌ జరిగితే అది కుంచించుకుపోవచ్చు. క్యాన్సర్‌ కాని ఫైబ్రాయిడ్లు కూడా కొన్నిసార్లు ఫెలోపియన్‌ ట్యూబుల్లో అడ్డుపడతాయి. దాంతో అండం, వీర్యకణాలు కలవలేవు. ఫైబ్రాయిడ్ల పరిమాణం పెరిగేకొద్దీ… గర్భాశయంపై ప్రభావం పడుతుంది. అప్పుడు వీర్యకణాలు సాఫీగా ప్రయాణించలేవు. ఎండోమెట్రియాసిస్‌ కూడా ఓ కారణమే.
అప్పటికే ఫెలోపియన్‌ ట్యూబులు మూసుకుపోవడంతో అవి మళ్లీ మామూలుగా పనిచేయడానికి చికిత్స చేయించుకున్నా ప్రయోజనం ఉండకపోవచ్చు.
స్టిరాయిడ్‌ లేదా యాస్ప్రిన్‌, ఇబూఫ్రిన్‌ లాంటి నొప్పి నివారణా మందులు ఎక్కువకాలం వాడినా సమస్యే. కీమోథెరపీ, రేడియేషన్‌ చికిత్సలతోనూ సంతానసాఫల్య సామర్థ్యం తగ్గొచ్చు.
వీర్యకణాల సంఖ్య తగ్గడం
పురుషుల్లో ఉండే కొన్ని సమస్యలు సంతానసాఫల్య సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. ముఖ్యంగా వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉండటం. అవి 15 మిలియన్ల లోపల ఉంటే తక్కువున్నట్లే లెక్క. కొన్నిసార్లు తగినన్ని వీర్యకణాలు ఉన్నా…అవి అండాన్ని చేరుకోలేవు.
పురుషుల్లో జననాంగాలకు సంబంధించిన ఇన్‌ఫెక్షన్‌ ఉండటం, క్యాన్సర్‌, ఏదయినా శస్త్రచికిత్స చేయించుకోవడం కూడా కారణాలే. జన్యుపరంగా పురుషుడిలో ఎక్స్‌, వై క్రోమోజోములు ఉండాలి. అలా కాకుండా రెండు ఎక్స్‌ క్రోమోజోములు, ఒక వై క్రోమోజోము ఉంటే టెస్టోస్టిరాన్‌ లోపం ఎదురవుతుంది. వీర్యకణాల సంఖ్య తక్కువగా లేదా అసలు లేకపోవచ్చు. కొన్నిరకాల మందులూ ఇందుకు కారణం కావచ్చు. నలభైఏళ్లు దాటేకొద్దీ వీర్యకణాల సంఖ్య కూడా తగ్గుతుంది.
మద్యపానం అలవాటు ఉన్న పురుషుల్లో సంతాన సాఫల్య సామర్థ్యం తగ్గుతుంది.
పురుషులకు: అతడి వ్యక్తిగత ఆరోగ్యం, వాడే మందులు, లైంగిక చర్యకు సంబంధించిన అంశాల ఆధారంగా పరీక్షలు చేస్తారు. ఆ తరువాత వీర్యకణాల సంఖ్య తెలుసుకునేందుకు సెమెన్‌ ఎనాలిసిస్‌ పరీక్ష ఉంటుంది. వాటి రంగు, నాణ్యత, ఇన్‌ఫెక్షన్లు, రక్తం కూడా పడుతోందా అనేది అంచనా వేస్తారు. టెస్టోస్టిరాన్‌, ఇతర హార్మోన్ల పనితీరు తెలుసుకునేందుకు రక్తపరీక్ష ఉంటుంది. క్లమీడియా గుర్తించేందుకు పరీక్ష చేస్తారు.
ఇద్దరికీ చికిత్స ఉంది..
మొదట భార్యాభర్తలిద్దరినీ అండం విడుదలయ్యే సమయంలో శారీరకంగా కలవమంటారు. దానివల్ల గర్భం దాల్చొచ్చు. సంతాన సాఫల్య సామర్థ్యం పెరిగేలా కొన్నిరకాల మందులు సిఫారసు చేస్తారు. హార్మోన్లు విడుదలయ్యేందుకు కొన్ని మాత్రల్ని సూచిస్తారు.
ఫెలోపియన్‌ ట్యూబులు మూసుకుపోతే శస్త్రచికిత్స ఉంటుంది. అప్పుడే అండాల కదలిక సజావుగా, సాఫీగా ఉంటుంది. ఎండోమెట్రియాసిస్‌ అయితే ల్యాప్రోస్కోపీ ద్వారా నయం చేస్తారు.
పరీక్షలున్నాయి… స్త్రీలకు వ్యక్తిగత ఆరోగ్య పరీక్ష, వాడే ముందులు, నెలసరి వచ్చే విధానంతోపాటు లైంగికంగా ఎంత చురుగ్గా ఉన్నారనేది గమనిస్తారు. హార్మోన్ల స్థాయులు, అండం విడుదలయ్యే తీరునీ తెలుసుకుంటారు.
గర్భాశయంలోకి ద్రవాల్ని పంపించి, ఎక్సరే తీస్తారు. అది సరిగ్గా ఫెల్లోపియన్‌ ట్యూబులోకి చేరుతుందా లేదా అనేది గమనిస్తారు. ఎక్కడైనా మూసుకుపోయినట్లుగా ఉంటే… శస్త్రచికిత్స చేస్తారు. దీన్ని హిస్ట్రోసాల్పింగోగ్రఫీ అంటారు.
ఫెలోపియన్‌ ట్యూబులు, గర్భాశయం, అండాశయాలు, కటివలయం, పొట్ట భాగాన్ని చిన్న కెమెరా ద్వారా పరీక్షిస్తారు. దీనివల్ల ఆ భాగాల్లోని సమస్యలు తెలుస్తాయి. ఎండోమెట్రియాసిస్‌, ఫెలోపియన్‌ ట్యూబులు
మూసుకుపోయి ఉన్నా కనిపిస్తుంది. ఇందుకోసం హిస్టెరోస్కోపీ చేస్తారు. అండాలు ఎంత మేరకు విడుదల అవుతున్నాయనేది తెలుసుకుంటారు. జన్యుపరమైన లోపాల్ని తెలుసుకునేందుకు పరీక్షలుంటాయి. కటివలయ పనితీరు తెలుసుకునేందుకు అల్ట్రాసౌండ్‌ చేస్తారు. క్లమీడియా, థైరాయిడ్‌ కూడా పరీక్ష చేస్తారు.

Pelvic Organ Prolapse…కటివలయం జారకుండా

స్థానభ్రంశం అంటారు కదా… అలా రకరకాల దశల్లో మన కటివలయ భాగాలు స్థానభ్రంశం చెందుతాయి. అదెప్పుడూ, ఎందుకూ, దానికి ఉండే చికిత్సా విధానాలేంటో చూద్దాం.స్త్రీ పునరుత్పత్తి భాగాలు అంటే గర్భాశయం, మూత్రాశయం, రెక్టమ్‌ (పురీషనాళం) నిర్మాణాన్ని కటివలయం అంటారు. కొన్ని దశల్లో వాటిపై అధిక ఒత్తిడి పడినప్పుడు కటివలయంలోని ఆ భాగాలు సహజ స్థానం నుంచి యోనిలోకి చేరతాయి. ఆ పరిస్థితినే పెల్విక్‌ ప్రొలాప్స్‌ అంటారు. కొన్నిసార్లు అవి యోనిని దాటి కూడా కిందకు జారతాయి. ఈ సమస్యకు అన్నిసార్లూ చికిత్స అవసరంలేదు కానీ ఇది అసౌకర్యంగా ఉంటుంది. మలమూత్రవిసర్జనకూ, లైంగికచర్యకు ఇబ్బందిగా అనిపించొచ్చు.
కారణాలున్నాయి…
–కటివలయ భాగం బలహీనం కావడానికి ప్రధాన కారణం గర్భధారణ, ప్రసవం. ఆ సమయంలో హార్మోన్ల అసమతుల్యతా, కణజాలం, నరాలు దెబ్బతినడం వల్ల ఇలా జరుగుతుంది. అంటే ఎక్కువ సమయం నొప్పులు పడటం, పరికరాలు వాడి ప్రసవం చేయడం (ఫోర్సెప్స్‌ లేదా వాక్యూమ్‌తో బిడ్డను బయటకు తీయడం), అధిక బరువున్న బిడ్డకు జన్మనివ్వడం, ఒకేసారి ఎక్కువ మంది పిల్లలు కలగడం దీనికి కారణం కావచ్చు. ఎక్కువ కాన్పులు అయినా కూడా ఎప్పుడో ఒకప్పుడు ఈ సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువ. కొన్నిసార్లు ప్రసవం కాకపోయినా ఈ సమస్య ఎదురుకావచ్చు. అందుకే ప్రసవానంతరం కటివలయ కండరాలను దృఢంగా మార్చే పెల్విక్‌ఫ్లోర్‌ వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. అలాగని ఈ సమస్యను రాకుండా అడ్డుకోలేం.
— మెనోపాజ్‌, వయసు పెరగడం దీనికి మరో కారణం. కటివలయ భాగం దృఢంగా ఉంచడంలో ఈస్ట్రోజెన్‌ పాత్ర కీలకమే. మెనోపాజ్‌ దశలో ఈస్ట్రోజెన్‌ స్థాయులు తగ్గుతాయి. అప్పుడు కటివలయ భాగం బలహీనమవుతుంది. ఇలాంటి సమయంలో మరే ఇతర కారణాలున్నా సమస్య మరింత తీవ్రమవుతుంది. అయితే వయసు పెరిగే కొద్దీ కటివలయం నిర్మాణం విశ్రాంత స్థితికి చేరుకుంటుంది.
— దీర్ఘకాలం దగ్గూ, బరువైన వస్తువులు ఎత్తడం, స్థూలకాయం, కటివలయభాగం, పొత్తికడుపుపై ఒత్తిడి పడటం దీనికి మరో కారణం.
— లిగమెంట్లూ, కండరాలు యోనిభాగానికి ఆయువుపట్టు. హిస్టెరెక్టమీ చేయించుకుంటే ఆ కారణంగా అవి బలహీనపడతాయి. ఈ సమయంలోనూ ప్రొలాప్స్‌ సమస్య ఎదురుకావచ్చు. కొన్నిసార్లు వంశపారంపర్యంగానూ ఈ సమస్య రావచ్చు. ఎన్ని రకాలుంటాయి…
గర్భాశయం, మూత్రాశయం, రెక్టమ్‌లలో ఏదో ఒకటి లేదా రెండు భాగాలు కూడా స్థానభ్రంశం చెందొచ్చు.
1. యాంటీరియర్‌ వాల్‌ ప్రొలాప్స్‌ – మూత్రాశయం ఉబ్బి యోని గోడల లోపలికి వచ్చేస్తుంది.
2. పోస్టీరియర్‌ వాల్‌ ప్రొలాప్స్‌(రెక్టాకోలె)- పురీషనాళం ఉబ్బి యోని గోడల వెలుపలికి రావడం.
3. యుటెరెయిన్‌ ప్రొలాప్స్‌ – గర్భాశయం యోనిలోపలికి జారుతుంది. కొన్నిసార్లు అది యోని దాటి ఇంకా ఇవతలకు కూడా వచ్చేస్తుంది.
4. వాల్ట్‌ ప్రొలాప్స్‌- హిస్టెరెక్టమీ తరువాత జననేంద్రియపై భాగం కిందకు జారొచ్చు. ఇది హిస్టెరెక్టమీ చేసిన పదిమందిలో ఒకరికి ఎదురు కావచ్చు.
లక్షణాలేంటి…
ప్రొలాప్స్‌ లక్షణాలు సమస్య తీవ్రతను బట్టి మారుతుంటాయి. సమస్య ప్రాథమిక స్థాయిలో ఉంటే ఎలాంటి లక్షణాలు కనిపించవు. అలాంటప్పుడు వైద్యులు యోని భాగాన్ని పరీక్షించాకే సమస్యని నిర్ధరిస్తారు. అంటే పాప్‌ స్మియర్‌ పరీక్ష చేస్తారు. కొన్నిసార్లు అయితే…
–గడ్డలాంటిది జారుతున్నట్లు అనిపిస్తుంది.
–కటివలయం, నడుము కింది భాగంలో నొప్పీ, అసౌకర్యంగా అనిపిస్తుంది. ఎక్కువ సమయం కూర్చున్నా, నిల్చున్నా ఈ లక్షణాలు పెరుగుతాయి.
–యోని భాగంలో గడ్డలాంటిది తగులుతుంటే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల్ని సంప్రదించాలి. లేదంటే మరిన్ని సమస్యలకి కారణం కావచ్చు.
–మూత్ర సంబంధ సమస్యలు రావచ్చు. మూత్రాశయం యోని Ëలోపలికి జారినప్పుడు దానిపై ఒత్తిడి పడి దగ్గినా, తుమ్మినా, నవ్వినా మూత్రం వచ్చేస్తుంటుంది. మూత్రాశయం నిండినట్లు అనిపిస్తుంది. మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లు కూడా తరచూ బాధిస్తాయి.
— లైంగిక సమస్యలూ ఎదురవుతాయి. స్థానభ్రంశం చెందిన కటివలయ భాగాల వల్ల కలయిక అసౌకర్యంగా మారుతుంది.
చికిత్సలు ఏంటంటే… ప్రొలాప్స్‌ లక్షణాలూ, తీవ్రతా, వయసూ, ఆరోగ్య స్థితిపై ఆధారపడి ఉంటుంది. అలానే చికిత్స సూచించే ముందు ఆ మహిళ పిల్లల్ని ఇంకా కావాలనుకుంటుందా లేదా అనేదాన్ని బట్టి వైద్యులు నిర్ధరిస్తారు. ఈ చికిత్సా విధానం రెండు విడతల్లో ఉంటుంది. ఎలాగంటే…
శస్త్రచికిత్స లేకుండా…
కటివలయంపై పడే ఒత్తిడిని తగ్గించడం. అంటే అధికబరువుంటే తగ్గమని చెప్తారు. బరువులు మోయకుండా చూడటం, దీర్ఘకాలింగా బాధించే దగ్గూ, మలబద్ధకాన్ని అదుపులో ఉంచడం వల్ల పరిష్కారం ఉంటుంది.
కటి భాగంలో కండరాలను బలోపేతం చేయడానికి ప్రత్యేకంగా కొన్ని వ్యాయామాలుంటాయి. ప్రొలాప్స్‌ ఉన్నట్టు గుర్తిస్తే వీటిని సూచిస్తారు.
— పెస్సరీస్‌ అనేది సిలికాన్‌ పరికరం. దీన్ని యోని పై భాగంలో అమరిస్తే కటి వలయ నిర్మాణానికి దన్నుగా ఉంటుంది. ఇవి రకరకాల ఆకృతుల్లో అందుబాటులో ఉంటాయి. గర్భిణులకూ, అప్పుడే ప్రసవం అయిన వారికీ, శస్త్రచికిత్స చేయించుకోవాలనే వారికి ఇది అనువుగా ఉంటుంది. శస్త్రచికిత్స చేయించుకోవడం ఇష్టపడనివారు దీన్ని శాశ్వతంగా అలానే ఉంచేసుకోవచ్చు. దీన్ని సరిగ్గా అమరిస్తే యోని వద్ద ఒక పరికరం ఉంది అనే భావనా కలగదు. ఇది చిన్నగా ఉంటే ఇవతలకు వచ్చే ప్రమాదం ఉంటుంది. అలాగని బిగుతుగా అమరిస్తే యోని భాగంలో ఏదో ఉందనే భావనా, పుండూ, నొప్పీ, రక్తస్రావం వంటివి ఇబ్బందిపెట్టొచ్చు. అలా అనిపిస్తే మాత్రం వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి.
— హార్మోన్ల చికిత్స కూడా సూచిస్తారు. దీనివల్ల అంత ఫలితం ఉండకపోవచ్చు. కణజాలం మందంగా, పొడిబారినప్పుడు గాఢత తక్కువ ఉన్న ఈస్ట్రోజెన్‌ క్రీములు వాడటం వల్ల ప్రయోజనం ఉండొచ్చు. శస్త్రచికిత్సలు..
పైన చెప్పిన ఏ చికిత్స వల్లా ప్రయోజనం లేని పక్షంలో శస్త్రచికిత్స తప్పనిసరి. కటివలయానికి దన్నుగా ఉండే నిర్మాణాన్ని పునర్నిర్మించడం లేదంటే బాగు చేయడం శస్త్రచికిత్సలో భాగం. ఇందుకు రకరకాల చికిత్సా ప్రక్రియలు అందుబాటులో ఉన్నాయి. అవయవాలేమన్నా విచ్ఛిన్నమవుతాయా, మహిళ వయసూ, ఆమె గర్భాశయాన్ని కావాలనుకుంటున్నదా వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని వైద్యులు శస్త్రచికిత్సను నిర్ణయిస్తారు.
— కటివలయ భాగాన్ని బలోపేతం చేసేందుకూ, ఆసరా ఇచ్చేందుకూ యోనిగోడల్ని బిగుతుగా మారుస్తారు. దీనికి కోత ఉండదు. యోనిలోపల నుంచే శస్త్రచికిత్స చేస్తారు. మెష్‌ అనే ఓ పరికరాన్ని యోనిలో అమర్చడం మరో చికిత్సా విధానం.
— గర్భాశయం లేదా యోని భాగాన్ని వెన్నెముక అడుగున ఉన్న ఎముకకు జతచేస్తారు. ఇది చాలా కీలకమైన శస్త్రచికిత్స. గర్భాశయం పూర్తిగా కిందకు జారినప్పుడు వయసును బట్టి దాన్ని తొలగిస్తారు. కటివలయం చికిత్సలో భాగంగా దీన్ని ఎంచుకుంటారు.
— ఆరోగ్య పరిస్థితి మరీ చేయిదాటిపోతుంది అనుకున్నప్పుడు, గతంలో శస్త్రచికిత్సలకు చేసి విఫలమైన సందర్భాల్లో యోనిని పూర్తిగా మూసేయాల్సి వస్తుంది. ఇలా చేస్తే దీర్ఘకాలంగా లైంగిక కలయిక అసాధ్యమవుతుంది. ఇబ్బందులుండొచ్చు…
–శస్త్రచికిత్స చేసినప్పుడు నొప్పీ, అసౌకర్యం కొన్ని వారాలపాటు తప్పదు. కలయిక సమయంలో కొన్నిరోజులు నొప్పి ఉండొచ్చు. కొన్నిసార్లు ఇది శాశ్వతంగానూ ఉండే అవకాశం ఉంది.
— ఆపరేషన్‌ తరవాత దగ్గినా, తుమ్మినా, నవ్వినా మూత్రం బయటకు వచ్చే అవకాశం కూడా ఉండొచ్చు. అలాంటప్పుడు మళ్లీ శస్త్రచికత్స చేయాల్సి రావచ్చు. మూత్రాశయం నిండినట్టు అనిపిస్తుంది. దాదాపు వందమందిలో కేవలం ఐదు నుంచి పది మందికి మాత్రమే ఇలాంటి భావన ఉండదు. అందుకే సంచిని లోపల అమర్చాల్సి ఉంటుంది. –

Urinary Infection మూత్రనాళ ఇన్ఫెక్షన్

దాదాపు అరవైశాతం మంది మహిళలు తమ జీవితకాలంలో ఎప్పుడో ఒకప్పుడు ఎదుర్కొనే ప్రధాన సమస్య మూత్రనాళ ఇన్ఫెక్షన్
ఈ సమస్య పురుషులతో పోలిస్తే.. మహిళల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. సంతానోత్పత్తి వయసులోనే కాదు మెనోపాజ్ తరువాత కూడా ఈ తీవ్రత ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం మహిళ కావడమే. మూత్రాశయం దగ్గర బ్యాక్టీరియా ఎప్పుడూ ఉంటుంది. పురుషులతో పోలిస్తే… మహిళల్లో మూత్రాశయ మార్గం నుంచి మూత్రం బయటికి వెళ్లే మార్గం చాలా చిన్నగా ఉంటుంది. దాంతో బ్యాక్టీరియా చేరితే సులువుగా వ్యాపిస్తుంది. అలా వచ్చే ఇన్ఫెక్షన్లలో కొన్నింటిని యాంటీబయాటిక్స్తో నివారించవచ్చు.ఒకవేళ ఇన్ఫెక్షన్ తాలూకు బ్యాక్టీరియా మూత్రపిండాలకు గనుక వ్యాపిస్తే.. నడుమునొప్పీ, చలీ, జ్వరం, వికారం, వాంతులు.. కావడం వంటివన్నీ కనిపిస్తాయి. ఈ సమస్య కొందరిలో ఏడాదికి ఒకటి రెండుసార్లు వచ్చి తగ్గిపోతే మరికొందరిలో తరచూ ఇబ్బందిపెట్టొచ్చు.
కానీ చాలామంది ఈ సమస్యను తేలిగ్గా తీసుకుంటాం. వైద్యులకు ఆ లక్షణాలను చెప్పడానికి ఇబ్బందిపడతారు. చాలామటుకు వీటిని మందులతోనే నయం చేయొచ్చు. కానీ అలా చేయకపోవడం వల్ల ఇతర సమస్యలు వస్తాయి.
అవి ఎలాంటి సమస్యలంటే…
– తరచూ ఇన్ఫెక్షన్ కనిపించడం, దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్ల ఆ ప్రభావం మూత్రపిండాలపై పడుతుంది. అది క్రమంగా అధిక రక్తపోటుకు దారితీసి.. చివరకు మూత్రపిండాలు పనిచేయని పరిస్థితి ఎదురవుతుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి.
– సమస్య మొదట్లోనే అదుపు చేయకపోతే… మెనోపాజ్ వచ్చాక అర్జ్ ఇంకాంటినెన్స్ సమస్య ఎదురుకావచ్చు. అంటే తెలియకుండానే మూత్రం పడిపోవడం, నియంత్రించుకోలేకపోవడం వంటి ఇబ్బందులన్నమాట.
– ఒకవేళ గర్భధారణ సమయంలో ఎదురైతే గనుక ఆ తల్లికే కాదు.. పుట్టబోయే పాపాయికీ కొన్నిసార్లు ప్రమాదకరమే. కొన్నిసార్లు లక్షణాలు కనిపించకపోవచ్చు కూడా.
– మెనోపాజ్ వచ్చాక ఈస్ట్రోజెన్ హార్మోను విడుదల ఆగిపోతుంది. అదే జననేంద్రియాల్లో పీహెచ్ శాతాన్ని పెంచుతుంది. క్రమంగా అదే ఇన్ఫెక్షన్కి కారణం అవుతుంది.
లక్షణాలు….
– తరచూ బాత్రూంకి వెళ్తుంటే మంటగా అనిపించడం…
– రోజులో ఎక్కువ సార్లు బాత్రూంకి వెళ్లడం… లేదా ఆపుకోలేకపోవడం
– పొత్తి కడుపులో నొప్పి, కలయిక సమయంలో నొప్పి
– మూత్రం కోసం తరచూ నిద్ర లేవడం
– మూత్రం నురగగా ఉండటం, దుర్వాసన..
– చాలా అరుదుగా మూత్రంలో రక్తం కనిపించడం వంటివన్నీ దీనికి సంకేతాలే.
ముందు జాగ్రత్తలే మేలు…
– మంచినీళ్లు వీలైనంత ఎక్కువగా తీసుకోవడం వల్ల మూత్రం ద్వారా బ్యాక్టీరియా బయటకు పోతుంది. ఇన్ఫెక్షన్ అదుపులోకి వస్తుంది. అలాగని రోజులో నాలుగైదు లీటర్ల నీటిని తాగాలని లేదు. మూత్రం రంగు తెల్లగా పారదర్శక రంగులో వచ్చేవరకూ మంచినీళ్లు తాగితే సరిపోతుంది.
– ఒక రోజులో ఒకటిన్నర నుంచి రెండు లీటర్ల వరకూ ద్రవపదార్థాలు తీసుకోవాలి. రోజూ రెండుపూటలా భోజనం సమయంలో నీళ్లు తాగితే చాలనుకోకూడదు. ప్రతి గంటకోసారి దాహం వేసినా వేయకపోయినా నీళ్లు తాగుతూ ఉండాలి. భోజనం చేసేప్పుడు మాత్రం మరో గ్లాసు అదనంగా తీసుకుంటే చాలు.
– గాఢతా, సువాసన ఎక్కువగా ఉండే సబ్బులూ, యాంటీసెప్టిక్ క్రీంలూ, స్ప్రేలూ, పౌడర్లు జననేంద్రియ భాగాల్లో వాడకుండా చూసుకోవాలి.
– వ్యక్తిగత పరిశుభ్రత తప్పనిసరి. మలవిసర్జనకు వెళ్లిన తరువాత ముందునుంచీ వెనక్కి శుభ్రం చేసుకోవాలి. దానివల్ల బ్యాక్టీరియా మూత్రకోశంలోకి వెళ్లకుండా ఉంటుంది. జననేంద్రియ భాగాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. బాత్రూంకి వెళ్లినప్పుడు పూర్తిగా వెళ్లాలి తప్ప మధ్యలోనే ఆపేయకూడదు. కాటన్ లోదుస్తుల్ని ఎంచుకోవాలి. అవి కూడా రోజులో రెండుసార్లు మార్చుకోవాలి.
– లైంగికచర్య సమయంలో ఎక్కువశాతం బ్యాక్టీరియా మూత్రాశయంలోకి చేరుతుంది. అదే ఇన్ఫెక్షన్కి దారితీయొచ్చు. అందుకే కలయిక తరువాత తప్పనిసరిగా మూత్రవిసర్జనకు వెళ్లాలి. అలాగే మలబద్ధకం సమస్య ఉన్నప్పుడు కూడా ఎక్కువశాతం బ్యాక్టీరియా చేరుతుంది. దాన్ని నివారించాలంటే పీచుశాతం ఎక్కువగా ఉన్న పండ్లూ, కూరగాయలు తీసుకోవాలి. పండ్లరసాలు ఎక్కువగా తాగాలి. కుదిరితే క్రాన్బెర్రీ జ్యూస్ని తాగడం మంచిది. ఇది బజార్లో దొరుకుతుంది. ఇందులో ప్రత్యేకంగా ఉండే యాసిడ్ మూత్రంలోకి ప్రవేశిస్తుంది. అది మూత్రం పీహెచ్శాతాన్ని తగ్గిస్తుంది. పీహెచ్శాతం ఉన్నప్పుడే బ్యాక్టీరియా పెరుగుతుంది కాబట్టి దాన్ని అదుపులో ఉంచుతుంది.
– బ్యాక్టీరియా వృద్ధి చెందకుండా వైద్యులు యాంటీబయాటిక్స్ని సిఫారసు చేస్తారు. అంటే నేరుగా ఇన్ఫెక్షన్ని నివారించకుండా పరోక్షంగా బ్యాక్టీరియా సంఖ్యను తగ్గిస్తారు. రెండోసారి లక్షణాలు కనిపిస్తే మూత్ర పరీక్ష చేయించుకుని ఆ ప్రకారమే మాత్రల్ని వాడాలి. మందులు వాడి ఆపేసిన తరువాత సమస్య తిరగబెట్టే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆ తరువాత కూడా పరీక్ష చేయించుకుని లేదని నిర్ధరించుకోవాలి. కొందరు బ్యాక్టీరియాను నివారించేందుకు దీర్ఘకాలం మందులు వాడాల్సి రావచ్చు.

Mensus / రుతుస్రావం లేక బహిష్టు

ఒక వయసు వచ్చిన దగ్గరి నుంచీ ఆడపిల్ల శరీరం.. గర్భధారణకు అనువుగా తయారవుతుంటుంది. దాన్లో భాగమే నెలనెలా వచ్చే ఈ బహిష్టులు!
ఒక వయసు వచ్చిన దగ్గరి నుంచీ ఆడపిల్ల శరీరంలో నెలనెలా అండం విడుదల అవుతుంటుంది. అదే సమయంలో.. ప్రతి నెలా గర్భాశయం లోపల ఒక మెత్తటి పొర కూడా తయారవుతుంటుంది. ఒకవేళ ఆ అండం గనక పురుషుడి శుక్రకణాలతో సంయోగం చెంది ‘పిండం’ ఏర్పడితే.. (దీన్నే మనం ‘గర్భం దాల్చటం’ అంటాం)..
ఆ పిండం గర్భాశయంలోనే స్థిరంగా కుదురుకునేందుకు ఈ మెత్తటి పొర చక్కటి పాన్పులాగా ఉపయోగపడుతుంది. తర్వాత అదే మరింత మందంగా తయారై, రక్తనాళాలను ఏర్పరచుకుని, పెద్ద సంచిలా తయారై, తొమ్మిది నెలల పాటు బిడ్డ ఎదిగేందుకు అవసరమైన ‘మాయ’లా మారిపోతుంది. అదే ఈ పొరకున్న ప్రయోజనం. అయితే గర్భధారణ జరగలేదనుకోండి.. అంటే ఆడపిల్ల శరీరంలో విడుదలైన అండం సంయోగం చెందకుండా అలాగే ఉండిపోయిందనుకోండి.. కొద్దిరోజుల్లోనే లోలోపలే ఆ అండం విచ్ఛిన్నం అయిపోతుంది. ఇక అప్పటికే సిద్ధమైన మెత్తటి పాన్పులాంటి పొర, కొద్దిగా రక్తం, ఇతరత్రా స్రావాలన్నింటిని కలిపి శరీరం బయటకు పంపించేస్తుంది! బహిష్టు అంటే ఇదే! అదంతా బయటకు రావటానికి 3-5 రోజులు పడుతుంది. ఒకసారి అదంతా బయటకు వచ్చేయగానే.. లోపల మళ్లీ అండం విడుదలకు రంగం సిద్ధమవుతుంది. మళ్లీ పాన్పు పొర తయారవుతుంటుంది. శరీరం మళ్లీ గర్భధారణకు సంసిద్ధమవుతుంటుంది.
గర్భం దాల్చకపోతే.. మళ్లీ అదీ బయటకు వచ్చేస్తుంది. ఆడపిల్ల శరీరంలో ఇదంతా నెలనెలా జరిగే ప్రక్రియ. అందుకే దీన్ని మనం నెలసరి అనీ, రుతుక్రమం అనీ, రుతుస్రావం అనీ.. రకరకాలుగా పిలుస్తుంటాం! అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది.. బహిష్టు రూపంలో బయటకు వచ్చేదంతా కూడా ఆమె.. అమ్మ కావటానికి, మాతృత్వానికి ఉపయోగపడే జీవపదార్థం అని! అదెలాంటి హానీ చెయ్యదని!!
రక్తం చాలా పోతుందా?
రుతుస్రావం రూపంలో చాలా రక్తం పోతుందనీ, దీనివల్ల స్త్రీలు చాలా బలహీనపడిపోతారనీ ఒకప్పుడు బలంగా నమ్మేవాళ్లు. వాస్తవానికి నెలనెలా రుతుస్రావం ఎంత అవుతుందన్నది మనిషికీ మనిషికీ మారుతుంటుందిగానీ.. మొత్తమ్మీద సగటున బయటకు పోయే రక్తం 3-4 టీస్పూన్లకు (80 మిల్లీ లీటర్లు) మించి ఉండదు. కాకపోతే చూడటానికి అదే చాలా ఎక్కువగా అనిపించొచ్చు. సాధారణంగా కొద్దిపాటి స్రావంతో మొదలై, ఒకటిరెండు రోజులు ఎక్కువై, ఆ తర్వాత మళ్లీ తక్కువ కావచ్చు. రుతుస్రావం ఇలా మొత్తం 3 నుంచి 7 రోజులు కావొచ్చు.
ఈ స్రావంలో కొన్నికొన్నిసార్లు చిన్నచిన్న గడ్డల్లా కనిపించొచ్చు. అయినా కంగారుపడాల్సిందేం లేదు. లోపల గర్భాశయం నుంచి వూడిన మెత్తటి పొర తాలూకూ ముక్కలవి. స్రావం రంగు కూడా కొన్నిసార్లు తుప్పులా ముదురు రంగులో ఉండొచ్చు. లేదూ బాగా ఎర్రగానూ ఉండొచ్చు. ఇదంతా సహజమే. కాకపోతే- ప్యాడ్స్ బాగా తడిసిపోతూ గంటకోసారి మార్చుకోవాల్సి రావటం, అలా చాలా గంటలు గడవటం.. లేదూ పెద్దపెద్ద గడ్డలు అవుతుండటం.. పరిస్థితి ఇలా ఉంటే మాత్రం స్రావం ఎక్కువ అవుతోందని అనుమానించి, వైద్యులను సంప్రదించటం మంచిది. గర్భనిరోధక మాత్రలు వాడే వారిలో కొన్నిసార్లు రుతుస్రావం చాలా తక్కువగా అవ్వచ్చు. లేదూ నెల మధ్యలోనే ఎరుపు (స్పాటింగ్) కనబడొచ్చు. ఇదేం సమస్య కాదు.
ఒత్తిడితో ముందువెనకలు అవుతుందా?
ఏదైనా కీలకమైన పని పెట్టుకున్నప్పుడు చాలామంది నెలసరి వచ్చేస్తుందేమోనని భయపడుతూ మానసికంగా విపరీతంగా మథనపడుతుంటారు. ఇలా మానసిక ఒత్తిడి పెంచుకోవటం వల్ల నెలసరి ఉన్నట్టుండి ముందువెనకలు అయ్యే మాట వాస్తవం. కొత్తగా స్కూలు, ఆఫీసుల వంటివి మారినప్పుడో, కొత్త బాధ్యతలు నెత్తినపడినప్పుడో, కుటుంబంలోనో స్నేహితులతోనో ఇబ్బందులు ఎదురైనప్పుడు, లేదూ కొత్త ప్రదేశాల్లో ప్రయాణాలు చెయ్యాల్సి వచ్చినప్పుడు.. లేదూ జీవితంలో అత్యంత కీలకమైన పెళ్లి వంటి ఘట్టాలకు సిద్ధమవుతున్నప్పుడు..
ఇలాంటి సందర్భాల్లో మనకు తెలియకుండానే మానసిక ఒత్తిడికి లోనవుతాం. దీంతో ఒత్తిడి హార్మోన్ కార్టిజోల్ పెరిగి.. మొత్తంగా హార్మోన్ పరమైన మార్పులు తలెత్తి, నెలసరి ముందువెనకలు కావచ్చు. కాకపోతే అది తాత్కాలికం. అలాకాకుండా పని పరమైన, వృత్తిపరమైన దీర్ఘకాలిక ఒత్తిళ్లూ ఉండొచ్చు. దానివల్ల నెలసరి ఎప్పుడొస్తుందో తెలీక ప్రతిసారీ అయోమయంగా తయారై.. ఇది ఇంకోరకం ఒత్తిడికి దారి తీస్తుంది. కాబట్టి మొత్తమ్మీద చక్కటి పోషకాహారం తీసుకుంటూ, ఒత్తిళ్లు లేని క్రమబద్ధమైన జీవనశైలి అలవరచుకుంటే ఈ అస్తవ్యస్తాల బెడద ఉండదు. నెలసరి అనేది ఒక క్రమం ప్రకారం ఒంట్లో చోటుచేసుకునే సహజ ప్రక్రియ. మన పనులకు అదేదో అడ్డం వస్తోందని తరచూ దాన్ని ఆపేందుకు మాత్రల వంటివి వేసుకోవటం ఆ క్రమాన్ని చెడగొట్టటమే అవుతుంది, ఇది సరికాదు.
వ్యాయామం, శ్రమ చెయ్యకూడదా?
నెలసరి వచ్చినప్పుడు స్త్రీలు పూర్తి విశ్రాంతి తీసుకోవాలన్న నమ్మకం కూడా చాలా సమాజాల్లో కనబడుతుంది. నెలంతా ఇంటిల్లి పాదికీ బండెడు చాకిరీ చేసే స్త్రీలకు ఈ రూపేణా కొంత విశ్రాంతి చిక్కుతుంటే మంచిదేగానీ.. ఇప్పుడీ విషయంలో మన అవగాహన చాలా మారింది. అధిక రుతుస్రావం, విపరీతమైన పొత్తికడుపు నొప్పి వంటి ఇతరత్రా ఇబ్బందులు ఎదుర్కొనే వారికి తప్పించి.. మిగతా వారందరికీ ఈ సమయంలో ప్రత్యేకించి విశ్రాంతి అవసరమేం లేదు. పైగా తేలికపాటి వ్యాయామం చాలా మంచిది. పొత్తికడుపు నొప్పి (మెన్స్ట్రువల్ క్రాంప్స్) వంటి వాటితో సతమతమయ్యే వారికి కూడా వ్యాయామం వల్ల ప్రయోజనం ఉంటోందని అధ్యయనాల్లో తేలింది. నడక, ఈత అందరికీ మంచివి. కొన్ని రకాల యోగాసనాలూ వెయ్యొచ్చు. ఇక నిత్యం కఠిన వ్యాయామాలు, క్రీడా శిక్షణ వంటివాటికి వెళ్లే వారికి కూడా నెలసరి అడ్డంకేం కాదు. కొంతమంది నెలసరి సమయంలో ఈతకు వెళ్లకూడదని భావిస్తుంటారు. నీళ్లు పీలుస్తాయి కాబట్టి ప్యాడ్స్తో ఈత కష్టం. అందుకని ఈతకు వెళ్లేప్పుడు ప్యాడ్స్ బదులు ‘ట్యాంపూన్స్’ వాడితే ఏ ఇబ్బందీ ఉండదు. అవి యోనిలోనే ఉండిపోయి, బయటకు ఎలాంటి స్రావాలనూ రానివ్వవు, ఈతకూ ఇబ్బంది ఉండదు. కాకపోతే ఈత నుంచి రాగానే వాటిని మార్చేసుకోవాలి.
సిగ్గు పడటం కాదు.. సిద్ధపడాలి!
చాలామంది నెలసరి గురించి అనవసరపు బిడియాలు పెట్టుకుని లేనిపోని ఇబ్బందులు పడుతుంటారు. కానీ ఇది సహజ శరీర ధర్మం. దీని గురించి అనవసర బెరుకు, భయాలు పెట్టుకునే బదులు.. ముందే సిద్ధంగా ఉండటం ముఖ్యం. దీనివల్ల ఆత్మవిశ్వాసం దెబ్బతినకుండా హాయిగా ఉంటారు. నెలసరి అనేది కచ్చితంగా ఎప్పుడొస్తుందో తెలీదు కాబట్టి కొన్ని వారాల ముందు నుంచే దగ్గర ప్యాడ్స్ ఉంచుకోవాలి. నెలసరి వచ్చే ముందు కొందరికి పొత్తికడుపులో నొప్పిగా అనిపిస్తుంది. లోపల గర్భాశయంలో పెరిగిన పొర విడివడేందుకు, దాన్ని బయటకు నెట్టేందుకు ఈ సమయంలో గర్భాశయ కండరం బిగుతుగా తయారవుతుంటుంది, అందుకే నెలసరి రావటానికి కొద్ది ముందు కొందరికి పొత్తికడుపులో బిగలాగుతున్నట్టుగా, కాస్త నొప్పిగా అనిపిస్తుంది. ఇది సహజమే. అయితే కొద్దిమందిలో ఈ నొప్పి నడుములోకి, తొడల్లోకి కూడా పాకి మరీ బాధాకరంగా అనిపించొచ్చు.
ఇలాంటి వాళ్లు ప్యాడ్స్తో పాటు నొప్పి నివారిణి మాత్రలు కూడా దగ్గరుంచుకోవాలి. ఇలాంటి ఏర్పాట్ల వల్ల రోజువారీ పనులకు ఏ ఇబ్బందీ ఉండదు. ఒకవేళ ప్యాడ్స్ దగ్గర లేనప్పుడు నెలసరి వస్తే- ఏం కంగారుపడొద్దు. తాత్కాలికంగా టిష్యూలను కూడా వాడుకోవచ్చు. శుభ్రంగా ఉన్న పేపర్ న్యాప్కిన్లను మూడు అంగుళాల వెడల్పు, పావుఅంగుళం మందంగా ఉండేలా మడతపెడితే చాలు.. తాత్కాలిక ప్యాడ్ సిద్ధమైనట్లే. తర్వాత దగ్గర్లోని దుకాణంలో ప్యాడ్స్ కొనుక్కోవచ్చు.
నొప్పి బాధిస్తుంటే.. ఇవి ప్రయత్నించండి!
వేడి పాలు తాగటం
నడక వంటి వ్యాయామం మానకుండా ఉండటం
తేలికపాటి ఆహారం, ఎక్కువసార్లు తీసుకోవటం
నొప్పిగా ఉంటే మునివేళ్లతో పొత్తికడుపు మీద గుండ్రంగా, సున్నితంగా మసాజ్ చేసుకోవటం
పక్కకు తిరిగి కాళ్లు ముడుచుకు పడుకోవటం లేదా కాళ్ల కింద కాస్త ఎత్తుపెట్టుకోవటం.
స్నానాలు చెయ్య కూడదా?
నెలసరి సమయంలో స్నానం చెయ్యకూడదన్న నమ్మకం చాలా సమాజాల్లో కనబడుతుంది. బహుశా, ప్రజలు నదుల్లోనూ, కాలువల్లోనూ స్నానాలు చేసే రోజుల్లో పుట్టిన నమ్మకం కావొచ్చు ఇది! కానీ ఇవాల్టి రోజున దీనికి ఏమాత్రం ప్రాధాన్యం లేదు. పైగా నెలసరి సమయంలో శుభ్రత చాలా చాలా అవసరం. దాన్ని విస్మరించి ఏమాత్రం ఉదాసీనంగా ఉన్నా ఇన్ఫెక్షన్ల ముప్పు పొంచి ఉంటుంది. ఎందుకంటే రుతుస్రావం అవుతున్న సమయంలో యోనిలో ఆమ్ల-క్షార స్వభావం (పీహెచ్ బ్యాలెన్స్) కాస్త మారుతుంది.
దీనివల్ల బ్యాక్టీరియా పెరిగి తేలికగా ఇన్ఫెక్షన్లు బయల్దేరతాయి. కాబట్టి రోజూ తప్పనిసరిగా శుభ్రంగా స్నానం చెయ్యాలి. వెంటనే చక్కగా ఉతికి, పొడిగా ఉన్న లోదుస్తులు ధరించాలి. బిగుతుగా, గాలి ఆడకుండా ఉండే సింథటిక్ లోదుస్తులు వేసుకుంటే లోపల చెమ్మ, వెచ్చదనం పెరిగి బ్యాక్టీరియా వృద్ధి అవుతుంది. కాబట్టి కాస్త వదులుగా, గాలి ఆడేలా ఉండే కాటన్ వాటినే ధరించాలి. ప్రతి 3-4 గంటలకు ఒకసారి ప్యాడ్స్ మార్చుకుంటూ ఉండాలి. ఇంట్లోంచి బయటకు వచ్చే ముందు, అలాగే నిద్రకు ఉపక్రమించబోయే ముందు కూడా ప్యాడ్స్ మార్చుకోవటం మంచిది. మల, మూత్ర విసర్జనకు వెళ్లిన ప్రతిసారీ యోని ప్రాంతాన్ని పైపైన నీటితో (సబ్బు వద్దు) శుభ్రంగా కడుక్కోవాలి. అదీ, ముందు నుంచి వెనక్కే కడుక్కోవాలి. ప్యాడ్స్ మార్చుకునే ముందు కూడా నీటితో కడుక్కోవాలి. కడుక్కున్న ప్రతిసారీ పొడిగా తుడుచుకున్న తర్వాతే మళ్లీ ప్యాడ్ అమర్చుకోవాలి. ఈ ప్రాంతంలో డియోడరెంట్ల వంటివేమీ వాడొద్దు.
మూఢం అని కొట్టేయటం సరికాదు.. సరిపోదు!
బహిష్టు వచ్చినప్పుడు అమ్మాయి పూజలకు, గుళ్లకు, పెళ్లిళ్లకు, పేరంటాళ్లకు వెళ్లరాదనీ.. ఆ సమయంలో ఆమెను ముట్టుకోకూడదనీ, ఆమె తలస్నానం, వంట చెయ్యకూడదనీ, ఆ సమయంలో శృంగారానికి కూడా దూరంగా ఉండాలని.. మన సమాజంలో ఇలాంటి నమ్మకాలకు అంతులేదు. మన సమాజంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంస్కృతిలో, చాలా దేశాల్లో ఇలాంటి నమ్మకాలు కనబడుతుంటాయి. మరోవైపు అసలివన్నీ మూఢనమ్మకాలనీ, వీటిలో శాస్త్రీయత లేదని రుజువు చేసే ప్రయత్నాలూ చాలానే జరుగుతుంటాయి.
అయినా కూడా నేటికీ చాలామంది స్త్రీలు అవేం పట్టించుకోకుండా తమ ఆచారాలను తాము పాటిస్తుండటం చూస్తూనే ఉన్నాం. నిజంగా అవన్నీ నమ్మి పాటిస్తున్నారా? అంటే కాకపోవచ్చు. చాలామంది విషయంలో ఇది తరతరాలుగా వస్తున్న నమ్మకాలు, ఆచారాల పట్ల గౌరవం తప్పించి మరోటి కాదు. కాబట్టి మనం బహిష్టు విషయంలో ప్రతి సమాజానికీ తనకంటూ ఒక ‘చరిత్ర’ ఉందని గుర్తించటం అవసరం. దాన్ని ఆధునిక సైన్స్తోనో, ఇతర సమాజాలతోనో పోలుస్తూ.. పనిగట్టుకుని అదంతా తప్పని నిరూపించే ప్రయత్నం వృథా. ఈ ఆచారాలన్నీ కూడా పూర్వం వ్యవసాయ ఆర్థిక సమాజం, ఉమ్మడి కుటుంబాలు బలంగా ఉన్నప్పుడు.. అప్పటి అవసరాలకు, అవగాహనలకు తగ్గట్టు రూపుదిద్దుకున్నవి. కానీ ఈ ఆధునిక పారిశ్రామిక, టెక్నాలజీ ఆధారిత ఆర్థిక వ్యవస్థల్లో, చిన్న కుటుంబాలు పెరిగిపోయిన నేపథ్యంలో ఇవాల్టి రోజున ఆయా నమ్మకాలకు పెద్దగా ప్రాధాన్యం లేదని చెప్పుకోక తప్పదు. కాబట్టి అన్నింటినీ గుత్తగా మూఢంగా కొట్టిపారేయటం కాకుండా.. రకరకాల ఆచారాల గురించి, వాటివెనకున్న భావనల గురించి లోతుగా చర్చించి, ఈ కాలానికి అవెంత వరకూ పనికొస్తాయో తరచిచూడటం ఉత్తమం. దానివల్ల అవగాహన పెరిగి అపోహలు తొలగిపోతాయి.

మోనోపాజ్

మానవ శరీరంలో కొన్ని ప్రత్యేక దశలుంటాయి. ఒక దశనుండి తరువాత దశకు చేరటంలో చిన్న చిన్న మార్పులు సహజం. ఈ మార్పులు పురుషులలో కన్నా స్త్రీలలో స్పష్టంగా కనబడతాయి.
యవ్వనంలోకి ప్రవేశించేటపుడు కనిపించే మార్పును చూసి ఒకదశలో భయాందోళనలకు గురవుతారు. శారీరకంగా వచ్చే మార్పులు ఎలా ఉన్నా హార్మోన్ ల ప్రభావంతో శరీరంలో జరిగే మార్పులతో శరీరం ప్రకృతి ధర్మానికి సిద్ధమవుతుంది. అదే తొలిసారి బహిష్టు అవటం.
ఆ నాటినుండి ఆడపిల్లల జీవితంలో ఋతుచక్రం మొదలవుతుంది. సంతానం పొందటానికి శరీరం అనువుగా తయారవుతుంది. ఈ మార్పులన్నీ హార్మోన్ల పరంగా వచ్చేవే. నాటినుండి అమ్మాయిల జీవితాన్ని నియంత్రించే రసాయనాలు కీలకమవుతాయి.
కోరికలు కలిగించేవి హార్మోన్లు, గర్భం వస్తే శిశువుకు అనుకూలంగా శరీరాన్ని తయారుచేసేది, స్తనాలలో పాలు తయారయ్యేది, శిశువు ఎదుగుదల, ప్రసవం అన్నీ హార్మోన్ల ప్రభావంతోనే జరుగుతాయి. ప్రతినెలా హార్మోన్లు ఒక క్రమపద్ధతితో తమ బాధ్యతను నిర్వహిస్తూ బహిష్టు సమయానికి వచ్చేలా చేస్తాయి.
ఒక వయసు తర్వాత సంతానం పొందాలన్న కోర్కె ప్రతి ఒక్కరికీ కలుగుతుంది. అది ఒక బాధ్యత. ప్రకృతి నిర్ధేశించిన ఆ బాధ్యతను నిర్వహించిన శరీరం క్రమంగా తదుపరి దశకు సిద్ధమవుతుంది.ఈ దశనే మోనోపాజ్ అంటారు.
ఈ దశను మగువలు ఎవరూ ఇష్టపడరు. ఈ దశ దాదాపుగా 45 ఏళ్ల వయసుకు అటుఇటుగా గరిష్టంగా 55 ఏళ్లలొపు వస్తుంది,
ఆలస్యంగా వివాహం, గర్భం, సంతానలేమి, మారిన ఆహారపు వేళలు వగైరా అలవాట్లు కలిసి మోనోపాజ్ వయసును తగ్గిస్తున్నాయి.
గర్భసంచి తొలగించుకున్నవారికి త్వరగా మోనోపాజ్ వస్తున్నది. మోనోపాజ్ బహిష్టులు ఆగిపోయే దశ. నెలవారీ ఇబ్బందులు ఇక ఉండవు. సంతానం పొందగలిగిన శక్తి ఆగిపోతుంది.
మోనోపాజ్ దశలు
ఈ దశకు తీసుకు వచ్చేది హార్మోన్ లు. నాటి వరకు శరీరంలో ఋతుచక్రాన్ని నడిపించిన లైంగిక హార్మోన్ ల స్థాయి క్రమంగా పడిపోతుంది. స్ర్రీ శరీరంలో అండం ఉత్పత్తి ఆగిపోతుంది. ప్రతి స్త్రీ శరీరంలో నిర్ధిష్ట సంఖ్యలో అండాలు నిక్షిప్తమై ఉంటాయి. నెలకు ఒకటి చొప్పున విడుదలవుతాయి. విడుదలైన ఆ అండం ఫలదీకరణం చెంది పిండంగా మారితే బహిష్టు ఆగిపోయి గర్భం పెరుగుతుంది. ప్రపసవమవగానే తిరిగి శారీరక సర్దుబాట్లతో నెలవారీ అండాల విడుదల మొదలవుతుంది.
అండం ఫలదీకరణం చెందకపోతే నెల చివరన బయటకు వదిలి వేయబడుతుంది. అదే బహిష్టు, దానితో బాటుగా రక్తం వస్తుంది. ఇలా ప్రతి నెలా జరిగే కార్యక్రమానికి అంతం పలకటమే మోనోపాజ్. చాలా అరుదుగా, మొత్తం స్త్రీలలో 1 శాతం 40 ఏళ్లకు ముందే మోనోపాజ్ వస్తుంది. ఆ వయసులోనే మోనోపాజ్ రావటానికి పలుకారణాలు ఉంటాయి. డయాబెటిస్, కీమోథెరపీ, ఇతర అనారోగ్యాలు, జన్యులోపం వంటివి ఈ పరిస్థతికి కారణాలు అవుతాయి. త్వరిగతిన వచ్చే మోనోపాజ్ పలు శరీరక, మానసిక ఇబ్బందులను తెస్తాయి.
ఎక్కువ మందిలో బహిష్టులు ఆగిపోవటం అనేది క్రమపద్ధతిలో వయసుకు తగ్గట్టే జరుగుతుంది. మోనోపాజ్ రాబోతుంది అనేదానికి తొలిగా కనిపించే లక్షణం నెలవారీ బహిష్టులు గతి తప్పటం. గతంలోనూ సరిగ్గా నెలకు అటూ ఇటూ అవుతుంటాయి. రక్తస్రావం అధికంగా ఉంటుంది.
ఇతర మార్పులను తెస్తుంది. మానసికంగా మార్పులు వస్తాయి. కోపం, చిరాకు పెరుగుతుంది. ఆ కోపంలో అరుస్తారు. భావోద్వేగాలను నియంత్రించుకోవటంలో ఇబ్బందులు వుంటాయి. ఆఫీసుల్లో పనిచేసే ఆడవారిలో ఈ దశ మరిన్ని ఇబ్బందులను తెస్తుంది. ఆ సమయంలో అందరూ తననే గమనిస్తున్నారనే భావన, అధిక రక్తస్రావం బయటపడుతుందేమోనన్న భయం, ఆకర్షణ తగ్గపోతుందన్న ఆందోళన, వగైరాలన్నీ కలిపి వారి ప్రవర్తనను మార్చివేస్తాయి.
హార్మోన్స్ పరంగా వస్తున్న మార్పులు కొందరిలో నిద్రలేమిని తెస్తాయి. ఆదుర్ధా పెంచుతాయి. దృష్టి నిలపటం మరింత కష్టమవుతుంది. ఆ వయసులో బాధ్యతాయయుతమైన స్థానంలో వున్న మహిళలను భరించటం కష్టమని కొలీగ్స్ చెవులు కొరుక్కోవటం ఇబ్బందులను పెంచుతుంది.
మోనోపాజ్ రెండో దశను పెరిమోనోపాజ్ దశ అంటారు. క్రమపద్ధతి తప్పిన బహిష్టుల నుండి బహిష్టులు పూర్తిగా ఆగిపోయేవరకు వుండే దశ ఇది. దాదాపుగా నాలుగు నుండి ఎనిమిది వారాల వరకు వుంటుంది ఈ దశ. మోనోపాజ్ అనే తుదిదశకు నపడిపించే దశ ఇది. ఈస్ట్రోజోన్ హార్మోన్ తీవ్ర హెచ్చుతగ్గులు ఈ దశలో ఉంటాయి. అతి తక్కువ స్థాయిలోనే వుండే టెస్టోస్టిరోన్ అనే హార్మోన్ మరీ తగ్గిపోయినట్టుగా వుంటుంది. చర్మం మీద ముడుతలు కనిపిస్తాయి. జుట్టురాలిపోతుంది. గాయాలు త్వరగా మానవు. జ్ఞాపకశక్తి మందగిస్తుంది. మూడ్ త్వరత్వరగా మారిపోతుంది. నీరసంగా వుంటుంది.
ఎముకల, కీళ్లు ఇబ్బందులు ఈ దశలో సహజం. ఎముకల బలహీనత వేగం పుంజుకొంటుంది. ఆస్టియోపోరోసిస్ వచ్చి సులభంగా ఎముకలు విరుగుతాయి. ఈ దశలో శరీరం బరువు పెరుగుతుంది. మోనోపాజ్ తరువాత శరీరం 5 కిలోల దాకా బరువు పెరగటం సహజంగా జరుగుతుంది.
ఈ బరువు పెరుగుదలకు కారణాలు చురుకుదనం తగ్గి పనులు చెయ్యకపోవటం, మందగించిన జీవనక్రియలు వంటివి.
ఆనందంలో తేడా ఉండదు
మోనోపాజ్ కి రావటంతో ఇక ఆనందం అయిపోయింది అనే భావన తప్పు మోనోపాజ్ అంటే పిల్లలను కనే దశ అయిపోయిందనే కాని లైంగికానుభవ దశ పోయిందని కాదు.
హార్మోన్ లు పడిపోయినందున సెక్సీ కోరికలు, స్పందనలు మందగిస్తాయే కానీ ఆగిపోయి. మోనోపాజ్ ముందు దశ వరకు సెక్స్ ను ఆనందంగా అనుభవించిన వారికి ఆ ఆనందం అందుకోవటంలో తేడా వుండదు. ఇదివరకులాగా స్పర్శ స్పందనలు వుండకపోవచ్చు. క్రమంగా సెక్స్ పట్ల విముఖత వస్తుంది.
యోనిలో తేమ లోపం సెక్స్ కు దూరంగా వుండేలా చేస్తుంది. ఇటువంటి శారీరక ఇబ్బందులు అందరిలో కనిపించవు. మోనోపాజ్ అనేది ఒక్కొక్కరికి ఒకలాంటి భావన కలిగిస్తుంది. బహిష్టుల గోల ఆగిపోయిందని చెప్పినవారూ ఉన్నారు.మోనోపాజ్ తరువాతే సెక్స్ లో బ్రహ్మాండంగా పాల్గొంటున్నామని, ఆనందం, తృప్తి అధికమయ్యాయని చెపుతూ వున్నవారూ ఉన్నారు.
ఎటువంటి కుటుంబ బాద్యతలు లేని ఆడవారు మోనోపాజ్ సమయంలో దొరకిన ఏకాంతాన్ని మరింత ఆనందంగా గడుపుతున్నారు.
మోనోపాజ్ సమయంలో వాడదగిన లూబ్రికెంట్స్ తో సెక్స్ లో బాధను తగ్గించుకుంటున్నారు. యోనిలోకి సూక్ష్మజీవులు చేరకుండా రక్షించుకుంటున్నారు.
యోని పరిశుభ్రత ఏ వయసులో అయినా అవసరమే. మోనోపాజ్ తరువాత సెక్స్ ను కొనసాగించే వారిలో గుండె సమస్యలు తగ్గుతాయి. రోగనిరోధక వ్యవస్థ మెరుగై ఆరోగ్యంగా ఉంటారు. కీళ్లనొప్పుల సమస్య రావు. మొత్తంమీద సెక్స్ ను అనుభవించేందుకు ఎటువంటి అడ్డంగిగా మోనోపాజ్ ఉండదు.
ఈ సమయంలో ఆమెకు భర్త సహాయం అవసరం. అర్ధం చేసుకుని ఆమెను సెక్స్ లోకి నడిపించే నేర్పు అతనిలో ఉండాలి.
గతంలో మాదిరిగా స్పందనలు వుండవన్న వాస్తవం అర్ధం చేసుకుని, ఫోర్ ప్లేలో ఎక్కువ సమయం గడపగలిగితే దంపతులు ఇద్దరూ సెక్స్ ను మరింత ఆనందంగా అనుభవించగలరు. మోనోపాజ్ తరువాత శారీరకంగా ఆమెలో వచ్చే మార్పులను భర్త అంగీకరించాలి. శరీరం బిగుతుగా ఉండదు. స్తనాలు జారటం, యోని తేమ తగ్గటం వంటి మార్పులను అర్ధం చేసుకోవాలి. ఆమెలో తగ్గిన ఆకర్షణ మీద అతిగా వ్వాఖ్యానం చేయకూడదు. అలా చేస్తే ఆమెతో సెక్స్ ఆనందానికి పూర్తిగా దూరమవుతారు.
హార్మోన్ థెరపీ అనే పరిష్కారం వుంది. నిపుణులైన వైద్యుల చేత హార్మోన్ చికిత్స చేయించుకుని సెక్స్ జీవితం మెరుగుపరచుకోవటమే కాక ఇతర ఆరోగ్య లాభాలను పొందగలరు. అయితే ఈ చికిత్సలో సైడ్ ఎఫెక్ట్స్ వుండే అవకాశం ఉంది. నలభై ఏళ్లకన్నా ముందే మోనోపాజ్ కి చేరిన వారికి ఈ చికిత్స పనికొ వస్తుంది.
అవగాహన అవసరం
మోనోపాజ్ దశలో కొందరు డిప్రెషన్ కు గురవుతారు. హార్మోన్ల ఉత్పత్తి హఠాత్తుగా ఆగిపోయినందున దాని ప్రభావం మొదడులో సమాచార పంపిణీ వ్యవస్థ మీద పడినందున మానసిక సమస్యలు తతెత్తుతాయన్నది వాస్తవం.
ఇది సహజమైన మార్పు అని అంగీకరించగలిగితే సమస్య చాలావరకు తగ్గిపోతుంది. మోనోపాజ్ అనేది జబ్బుకాదు కాబట్టి దీనికి ప్రత్యేకంగా మందులు, చికిత్స అనేది లేదు. అయితే మోనోపాజ్ దశను జాగ్రత్తగా నిర్వహించుకోవటం అవసరం.
ఈ దశకు చేరుతున్న వయసుకు ముందునుండే శారీరకంగా శ్రద్ధ తీసుకోవాలి. ఆ తరువాత వచ్చే మార్పులకు అనుగుణంగా మనసను శరీరాన్ని సిద్ధం చేసుకున్నవారు మోనోపాజ్ సమస్యను అధిగమించగలుగుతారు.

సిజేరియన్ సర్జరీ

ఏ సందర్భాలలో సిజేరియన్ చేస్తారు ?..
గర్భిణిలకు, డాక్టర్లకు ఇద్దరికీ సిజేరియన్ కంటే సుఖప్రసవమే సులువు. అయితే కొన్ని అత్యవసర సందర్భాలలో తల్లీ బిడ్డల క్షేమం కోసం సిజేరియన్ ఒక్కటే ప్రత్యామ్నయం కావచ్చు. అ సందర్భాలు..
గర్భంలో బిడ్డ ఎదురు కాళ్లతో ఉన్నప్పుడు…
తొమ్మిది నెలలు నిండినా బిడ్డ తలక్రిందులవకుండా అడ్డంగా ఉండిపోయినప్పుడు……..
మొదటి కాన్పు సాధారణమై, రెండోసారి బిడ్డ అడ్డం తిరిగినప్పుడు…….
ప్రసవం జరిగే వీలు లేకుండా మాయ అడ్డుపడ్డపుడు…..
అంతకు ముందు జరిగిన సిజేరియన్ వలన మాయ అతుక్కుపోయి ఉన్నా…
బిడ్డకు రక్తప్రసరణ తగ్గిపోయినా……….
కవలపిల్లలలో మొదటి బిడ్డ ఎదురు కాళ్లతో ఉన్నా…. మొదటి కాన్పు సిజీరియన్ అయి ఉండి రెండో సారి నొప్పులు రాకపొయినా…
గర్భద్వారం తగినంతం ఓపెన్ అవకపోయినా, కొంతవరకు తెరచుకొని మధ్యలో ఆగిపోయినా…
బిడ్డ మలవిసర్జన చేసి అది బిడ్డ ఊపిరి తిత్తులలోకి చేరే ప్రమాదం ఉన్నా లేక ప్రసవ సమయంలో బిడ్డ గుండె కొట్టుకొనే వేగం తగ్గిపోయినా…
ఇద్దరికంటే ఎక్కువ కవలలు గర్భంలో ఉన్నప్పుడు..
సిజేరియన్ తరువాత రక్తస్రావం ఏ మేరకు……
సాధారణ ప్రసవం, సిజేరియన్ ఏది జరిగినా గర్భాశయం సాధారణ సైజుకి చేరుకోవటానికి ఆరువారాలు పడుతుంది. ఈ ఆరు వారాలు రక్తస్రావం కనిపిస్తుంది. శరీర తీరును బట్టి కొందరిలో రక్తస్రావం అంతకంటే ముందే ఆగిపోతే, ఇంకొందరిలో ఆరువారాలపాటు కనిపించవచ్చు. అయితే నార్మల్, సిజేరియన్ ఏ ప్రసవమైన తర్యాతి రెండు రోజులు బ్లీడింగ్ కొంత ఎక్కువగా ఉంటుంది. ఈ బ్లీడింగ్ తీవ్రత కొంత ఎక్కవగా ఉంటుంది. ఈ బ్లీడింగ్ తీవ్రత కొంత ఎక్కువగా ఉండి ప్రతి మూడు గంటలకొకసారి ప్యాడ్ మార్చాల్సి రావచ్చు. ఇది సహజం. ఇలా కాకుండా పంపు తిప్పినట్టు రక్తం పోతున్నా, అరగంట వ్యవధిలోనే ప్యాడ్ మార్చాల్సి వచ్చినా, పెద్ద పెద్ద రక్తపు గడ్డలు కనిపించినా అసాధారణంగా భావించి వెంటనే వైద్యులను కలవాలి.

ప్రమాదకర లక్షణాలు…

సిజేరియన్ తరువాత ఇంటికి చేరుకున్న తరువాత ఈ లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యలను కలవాలి.
తీవ్రమైన జ్వరం…
వాసనతో కూడిని డిశ్చార్జ్…..
లావుపాటి రక్తపు గడ్డలతో కూడిన రక్తస్రావం…
పొత్తికడుపులో తట్టుకోలేనంత నొప్పి…
విపరీతమైన రక్తస్రావం…..
కోతపెట్టిన ప్రదేశంలో ఇన్ ఫెక్షన్

రెండోబిడ్డ ఎప్పుడంటే…?
నార్మల్ లేదా సిజేరియన్ ఎలాంటి ప్రసవమైనా మొదటి బిడ్డకు, రెండో బిడ్డకు కనీసం రెండు నుంచి మూడేళ్ల ఎడం పాటించాలి. సర్జరీ నుండి శరీరం పూర్తిగా కోలుకొని తిరిగి రెండో గర్భానికి సిద్ధ పడటానికి సమయమివ్వాలి. అలోగా పిల్లలు కూడా పెద్దవుతారు. గర్భం దాల్చినా శ్రమ అనిపించదు. ఇక సర్జరీ తర్వాత ఆరు వారాల వరకూ రక్తస్రావమవుతూ ఉంటుంది. కాబట్టి ఇన్ ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఎక్కువ. కాబట్టి ఆరు వారాలు లేదా రక్తస్రావం ఆగే వరకు భార్యాభర్తలు ఎడం పాటించాలి.
సిజేరియన్ తరువాత..
సిజేరియన్ తరువాత నిండు ఆరోగ్యం సమకూరాలంటే మంచి ఆహారం…శారీరక వ్యాయామం…శుభ్రత… ఈ మూడు అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.
ఆహారంలో ఎలాంటి నియమాలు పాటించవలసిన అవసరం లేదు. బయట వండినవి తప్ప అన్నీ తినవచ్చు.
ప్రొటీన్లు, పీచు, ఐరన్ ఉండే బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలి.
రోజుకు అరలీటరు పాలు తప్పనిసరిగా తాగాలి.
తాజాపళ్లు, కూరగాయలు తీసుకోవాలి.
నూనె, మసాలలు తక్కువ ఉన్న ఆహారం తీసుకోవాలి.
బాలింతకు పాలు పడటం కోసం ఆకుకూరలు, మిల్క్ బ్రెడ్, గుడ్లు, మాంసం తినవచ్చు.
మెంతికూర, ఓట్స్, వెల్లుల్లి, బాదం తీసుకుంటే పాలు పెరుగుతాయి.
మాంసకృత్తులు అత్యధికంగా లభించే మాంసం, పప్పులు తినటం వల్ల సర్జరీ గాయం త్వరగా మానుతుంది.
కొన్నినియమాలు..
సర్జరీ కుట్లు ఇన్ ఫెక్షన్ కు గురికాకుండా ఉండాలంటే శుభ్రత పాటించాలి. కానీ కొందరు కదిలితే కుట్లు ఊడిపోతాయని నీళ్లకు నాని చీము పడతాయని భయంతో వారం, పదిరోజులు స్నానం చేయకుండా ఉంటారు. ఇంకొందరు ఆకు పసర్లు, పెసరపిండితో రుద్దటం లాంటివి చేస్తారు. ఈ అలవాట్లు ప్రమాదకరం.
ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ అయినప్పటి నుండి ప్రతిరోజూ స్నానం చేయాలి. కుట్లు ఉన్న చోట రుద్ది శుభ్రం చేయాలి. గాయం పొడిగా, శుభ్రంగా ఉంచుకోవాలి. వైద్యులు సూచించిన పౌడర్ వాడాలి.
దురద ఉంటే గొళ్లతో బలంగా గీకకూడదు.
సర్జరీ తరువాత ఏమేం చేయాలి ?
సర్జరీ జరిగిన మరుసటి రోజునుండి లేచి నడవవచ్చు. కానీ ఎక్కువమంది పెద్ద ఆపరేషన్ అయింది కాబట్టి విశ్రాంతి తీసుకోవాలనే అపోహతో మంచానికి పరిమితమైపోతారు. కానీ సర్జరీ తరువాత నడకలాంటి శారీరక వ్యాయామం వలన త్వరగా కోలుకుంటారు.
డిశ్చార్జ్ అయి ఇంటికి చేరుకున్న రోజు నుండి రోజు మొత్తంలో వీలున్నప్పుడల్లా నడుస్తుండాలి.
15 రోజుల నుండి 10 నిమిషములనుండి 15 ని. వరకు నడక మంచిది.
ట్రెడ్ మిల్ మీద నడవాలంటే ఒకటిన్నర నెలలు ఆగాలి.
ఆరు వారాల నుండి ఔట్ డోర్ గేమ్స్, జిమ్ లో వ్యాయామాలు చేయవచ్చు.
శరీరం సహకరిస్తే వీలున్నంతవరకు చిన్న చిన్న పనులు సొంతంగా చేసుకోవాలి.
నెల తరువాత పొట్టమీద ఒత్తిడి పడే పనులు, బరువులు ఎత్తటం తప్ప ఇంటి పనులన్నీ చేసుకోవచ్చు.
ఏరోబిక్స్, వెయిట్స్, పరుగులాంటి వ్యాయామాలు 3 నెలల తరువాతే మొదలు పెట్టాలి.

ప్రసవం తర్వాత తీసుకోవలసిన జాగ్రత్తలు

మాతృత్వం ప్రతి స్త్రీకి భగవంతుడిచ్చిన వరం. కాని ఒకసారి గర్భం వచ్చాక, ప్రసవం తర్వాత స్త్రీ తన శరీర సామర్థ్యాని, సౌందర్యాన్ని, సౌకుమార్యాన్ని, లాలిత్యాన్ని కోల్పోయి ఒళ్ళు వచ్చి పొట్ట జారి, స్తనాలు సడలి, నడుం పెద్దదై తన పూర్వపు యవ్వనపు సౌరభాన్ని కోల్పోయినట్లు అనిపిస్తుంది.
అలాగే రాత్రి తన మడత పడ్డ పొట్ట, ఆపరేషన్‌ ప్రసవం కారణంగా పడ్డ కుట్లు, నల్ల మచ్చలు, కొట్టవచ్చినట్లు కనబడి బాధ అనిపిస్తుంది. అందుకే ఆ అందం సడలకుండా ఆ ముడతలు లేకుండా పొట్ట బరువు పెరగకుండా, నడుం నిలకడగా ఉంచుకోవడానికి ఆయుర్వేద ఆచార్యులు చక్కటి సంరక్షణను ప్రతిపాదించారు. అదే సూతికా పరిచర్య. ఈ సూతికా కాలాన్ని పోస్ట్‌ పార్టమ్‌ అంటారు. ఆధునికులు. ప్రసవం అయ్యాక తొలి నలభై రెండు రోజులను సూతికా కాలం లేదా పోస్ట్‌ పార్టమ్‌ పిరీయడ్‌ అంటారు.
ఈ కాలాన్ని చక్కగా సంరక్షించుకోవడం అటు తల్లికి, ఇటు శిశువుకు కూడా ప్రయోజనకరం. అంతే కాదు ముఖ్యమైనది కూడా. ఈ కాలంలో తీసుకునే ప్రత్యేక జాగ్రత్తలు ఆమె భవిష్యత్తు శోభయమానంగా ఉండటానికి, శిశువు ఆరోగ్య వంతంగా పెరగటానికి దోహదపడుతుంది.
నలభైరెండు రోజులు చాలు : పది నెలలు మోసి ఆ కాలంలో ఎన్నో ఒడిదుడుకులు పడి చురకత్తి కోతలాంటి ప్రసవంలో ఒక కొత్త ప్రాణికి జన్మనిచ్చిన తరువాత ఆ శరీరం, మనస్సు, గుండె, హార్మోన్సు, చర్మ, ముఖం చివరికి ఆత్మ సాధారణ స్థితికి చేరుకోవటం సహజ పరిణామమైనా మన తీసుకునే జాగ్రత్తలు మరింత దోహదపరుస్తాయి. ఈ అవస్థలో ఏ మాత్రం హెచ్చుతగ్గులు జరిగినా, స్త్రీ గర్భాశయంలో లోపాలు, హార్మోన్లలో తేడాలు, అయితే అక్షయం లేదా అధిక బరువు పెరగడం స్త్రీ జననేంద్రియాల వ్యాధులు రావటానికి అవకాశం ఉంది.
సూతికా కాలంలో మనం జాగ్న్రత్తలు అంటే కాస్త విశ్రాంతిగా ఉంటే సహజ పరిణామంలోనే అంతకు ముందు గర్భిణీ కాలంలోనూ, తీవ్రమైన ప్రసవ వేదనలోనూ సంక్షుభితమైన అవయవాలన్నీ సాధారణ స్థితిని చేరుకుంటాయి.
ఆ కాలంలో కారు నడపటం, స్కూటర్‌ డ్రైవ్‌ చేయటం, ఆటలలో గెంతటం మానేయడం మంచిది. ఆ సమయంలో బయట స్నేహితులవద్దకు వెళ్ళటం,ఇంట్లో ఎక్కువ సేపు బయట స్నేహితులతో గడపడం తగ్గించడం మంచిది. ఎందుకంటే వాళ్ళనుంచి ఇన్ఫెక్షన్‌ త్వరగా సోకుతుంది. ఈ కాలంలో తల్లి కాస్త జాగ్రత్త పడితే తనకీ, తన బిడ్డకీ వచ్చే కడుపుబ్బరం, కడుపునొప్పి, నిద్రరాకపోవడం, చికాకుగా ఉండడం, నిర్లిప్తత వంటివి రావు. ఈ సూతికా పరిచర్యవల్ల తల్లి తన భవిష్యత్తులో ఎదురయ్యే శారీరక పరంగా, మానసిక పరంగా ఒత్తిడిని తట్టుకొనే శక్తి, ఆత్మశక్తి దైవబలం సమకూర్చుకో గలుగుతుంది.
సున్నితంగా మసాజ్‌ : తొలి మూడు నుండి ఏడు రోజుల దాకా గోరువెచ్చని నువ్వుల నూనెతో పైనుంచి కిందకి పొట్టపైన, నడుంపైన లోతొడలలోను సున్నితమైన మసాజ్‌ చేసుకోవడం హితకరం. మొదటి మూడు రోజులు వేయించిన బియ్యంతో వండిన తేలికైన అన్నం తినడం మంచిది. ఏడవ రోజు నుండి వీలైతే జీర్ణద్రవ్యాలతో కలిపి వండిన మాంస రసం ఇవ్వడం మంచిది. అక్కడినుండి పల్చని వెడల్పయిన మొత్తటి గుడ్డతో పొట్ట, నడుంకి బిగించి కట్టుకోవటం మంచిది. దీన్ని నడికట్టు అంటారు.
సూతికా కాలంలో తల్లి వేడినీళ్ళతో స్నానం చేయాలి. కోపం, వ్యాయామం, అధికమైన శారీరక కష్టం, ముఖ్యంగా భర్తతో సంభోగం, మానేయాలి. ఈ కాలంలో పెద్దవాళ్ళు ముఖ్యంగా ప్రేమించే తల్లి మేనత్త, ఆమెని ఉత్సాహపరుస్తూ బిడ్డ పెంపకం పాలివ్వడం, బిడ్డ ఏడిస్తే కంగారుపడకండా చూడటం చేస్తే తల్లికి ఊరటనిస్తాయి.
అలాగే నడుముకి, పొట్టకీ నువ్వుల నూనె కొద్దిగా వేడిచేసి సాయంకాలం సున్నితంగా మర్దన చేసుకుంటే నడుము బలం పెరిగి, సడలిన పొట్ట బిగుతుగా వుండటానికి దోహదపడుతుంది.
తల్లి ఆహారం నువ్వుల నూనెతో కాని, నేతితో కాని తీసుకోవటం చాలా మంచిది. తల్లి సూతికా కాలంలో రోజూ కొద్ది సేపైనా బోర్లా పడుకోవటం చాలా మంచిది. పిప్పళ్లు, ధనియల పొడి, జీలకర్ర, అల్లం, మిరియాల పొడి, సైంధవ లవణంతో కూడిన బియ్యపు జావ తాగడం చాలా ఉపకరిస్తుంది. ఇది తింటే జీర్ణశక్తికి, వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఈ సూతికా కాలంలో దశమూలా ఆరిష్టం రోజూ ఒక ఔన్సు చొప్పున ఉదయం, సాయంత్రం తీసుకోవటం అవసరం. గర్భిణీ కాలంలో పెద్దదైన గర్భాశయం సహజంగానే మామూలు స్థితికి రావాలి. అది చక్కగా రావటానికి పిప్పలీ మూలం, రెండు గ్రాముల నెయ్యితో కలిపి ఏడు రోజులు ఇస్తే మంచిది. పచ్చి వంకాయ నూరి, రెండు చిటికల కర్పూరం కలిపి తేనెతో కలిపి ముద్దని యోని పైన రాసుకుంటే ప్రసవం తర్వాత వదులైన యోని గట్టిపడుతుంది. ఈ కాంలో స్నానమైన తర్వాత ఒంటికి, తలకి అగరు ధూపం వేసుకోవటం మంచి సౌందర్య సాధనం. శతావరీ కల్ప,అశ్వగంధ లేహ్యాం, శతావరీ ఘృతామృతం తీసుకుంటే మంచిది. ప్రసవం తర్వాత మీ దేహం తిరిగి పూర్వసౌష్టవం పొందాలని ప్రయత్నించండి.

Sex in Pregnency Period….గర్భధారణ సమయంలో కలయుక

కాబోయే తల్లి తండ్రులలో చాలా మంది తీసుకునే మొదటి జాగ్రత్త కలయుకను పూర్తిగా వాయిదా వేయడం. పైగా ఈ సమయంలో లైంగికచర్య వల్ల కాబోయే బిడ్డకు ఏదయినా సమస్య ఎదురుకావచ్చు అని భయపడతారు. అందుకే సురక్షితం కాదని దూరంగానే ఉండిపోతారు. కానీ అందరికీ ఇది వర్తించదు. దీనివల్ల బిడ్డకు ఎలాంటి ప్రమాదం ఎదురుకాదు కూడా ఎందుకంటే పాపాయి గర్భసంచిలో ఉమ్మనిటి మధ్య ఉంటుంది. పైగా మ్యూకస్ గర్భాశయ ముఖద్వారాన్ని కప్పి ఉంచుతుంది. గర్భాశయ కండరాలు కూడా ధృఢంగానే ఉంటాయి. అలా బిడ్డకు ఏ ప్రమాదం జరగదు. కలయిక వల్ల కొన్నిసార్లు ఇన్ ఫెక్షన్లు ఎదురైనా అవి పుట్టబోయే పాపాయి వరకూ చేరవు. కాబట్టి భయపడక్కర్లేడు. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం వైద్యలు కొందరు మహిళలకు హైరిస్క్ ప్రెగ్నెన్సీ అని నిర్ధారిస్తారు. అలాంటప్పుడూ, మరికొన్ని సందర్భాలలో లైంగిక చర్యకు దూరంగా ఉంటేనే మంచిది. అదెప్పుడంటే
– నెలలు నిండకుండానే కాన్పు అయ్యే అవకాశాలు ఉన్నపుడు…
– గతంలో అబార్షన్లు అయి, మళ్లీ జరిగే పరిస్థితులు ఉన్నా…..
-స్కానింగ్ లో ఉమ్మనిటీ సంచి పగిలిపోవచ్చనే సందేహం కలిగినా, ఆ అవకాశాలు ఎక్కువగా ఉన్నా…
-అకారణంగా రక్తస్రావం అవుతున్నా లేదా మరేదయినా స్రావాలు అవుతున్నా..
– భాగస్వామికి లైంగికంగా సంక్రమించే వ్యాధులు ఉన్నా…
– గర్భాశయ ముఖద్వారం బలహీనంగా ఉదని వైద్యులు చెప్పినా, మాయ కిందకు ఉన్నా….
– కవలలు పుట్టే అవకాశం ఉన్నా.. వైద్యులు కలయుకకు దూరంగా ఉండండి అని చెప్పినపుడు మాత్రమే మానేయాలి.
అప్పుడు నిర్లక్ష్యం వద్దు…
పై కారణాలలో తప్ప ఏ ఇబ్బంది లేదని వైద్యులు చెప్పినపుడు దాదాపు తొమ్మిది నెలలవరకు కలయుకను ఆనందించవచ్చు. అయితే ఆ సమయంలో నొప్పిగా అనిపించినా ఏ మాత్రం అసౌకర్యంగా ఉన్నా వెంటనే ఆపేయాలి. చివరి నెలలో మాత్రం పూర్తిగా మానేయడమే మంచిది. ఎందుకంటే…వీర్యకణాలలో ఉండే ప్రొస్టాగ్లాండెన్స్ అనే హార్మోనల్ నొప్పులకు దారితీయెచ్చని చెబుతారు. అయితే ఈ సమయంలో వీలైనంతవరకూ కండోమ్ లు వాడటమే మంచిది. ఎంత గర్భం దాల్చినా హెచ్. ఐ.వి.హెర్పిస్, క్లమీడియా తరహా లైంగికంగా సంక్రమించే ఇన్ ఫెక్షన్లను గర్భం అడ్డుకోలేదని గుర్తుంచుకోవాలి. అసలు ఏయే దశల్లో కాబోయే తల్లిలో ఎలాంటి మార్పు జరుగుతాయంటే
మొదటి త్రైమాసికంలో… హార్మోన్ల పనితీరులో మార్పులు సహజం. శారీరకంగానూ మార్పులు ఉంటాయి. ఈ సమయంలో లైంగిక కోరికలు ఉన్నా వికారం, అలసట, వక్షోజాలు సున్నితంగా ఉండటం, తరచూ బాత్ రూంకు వెళ్లాల్సి రావడం వల్ల…కాస్త అసౌకర్యంగా అనిపించి కలయికను పూర్తి స్థాయిలో ఆస్వాదించలేక పోవచ్చు.
రెండో త్రైమాసికంలో…పొట్ట కాస్త పెరుగుతున్నా కూడా ఈ సమయంలో లైంగిక చర్య సౌకర్యంగానే అనిపిస్తుంది, గర్భం దాల్చినప్పుడు రక్తప్రసరణ కాస్త వేగంగానే ఉంటుంది. పైగా ఆ ప్రసరణ పొట్ట అడుగుభాగంలోనే ఎక్కువగా ఉంటుంది. దాంతో కలయుకను పూర్తి స్థాయిలో ఆనందించొచ్చు.
మూడో త్రైమాసికంలో…నెలలు గడిచేకొద్దీ లైంగికచర్యపై ఆసక్తి తగ్గడం సహజమే. పొట్ట పెరిగేకొద్దీ అసౌకర్యంగా అనిపించడమే దానికి కారణం అయితే ఏమాత్రం అసౌకర్యంగా ఉన్నా భాగస్వామికి చెప్పాలి. ఒకవేళ ఆ సమయంలో లేదా తరువాత రక్తస్రావం కనిపిస్తున్నా, ఉమ్మనీరు పోతోందనే సందేహం కలిగినా, నొప్పిగా అనిపిస్తున్నా వైద్యల్ని సంప్రదించడం మంచిది. రక్తస్రావం చాలా కొద్దిగా కనిపించడం సహజమే కానీ మరీ అయితే మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. భాగస్వామిలో లైంగికంగా సంక్రమించే వ్యాధులు ఉంటే కనుక అవి ఇన్ ఫెక్షన్లకు దారి తీస్తాయని గుర్తుంచుకోవాలి.
ప్రసవం తరువాత ఎప్పుడంటే…
మొదటి ఆరువారాల వరకూ వద్దని చెబుతారు వైద్యులు. ఇనఫెక్షన్ల ప్రభావం ఎదురుకాకుండే ఉండేందుకూ, ప్రసవం నుంచి కోలుకునేందుకు, గర్భధారణ సమయంలో జరిగిన హార్మోన్ల మార్పులు మళ్లీ సమతూకంలోకి వచ్చేందుకు ఆ మాత్రం సమయం పడుతుంది. పైగా ప్రసవ సమయంలో తెరుచుకున్న గర్భాశయ ముఖద్యారం మూసుకోవాడానికీ, రక్తస్రావం పూర్తిస్థాయిలో ఆగిపోవటానికి సమయం పడుతుందని అర్ధం చేకోవాలి. దానికి తోడు పాపాయి సంరక్షణతో శారీరక, మానసిక అలసటా కాస్త ఎక్కువే ఉంటుంది కాబట్టి కనీసం ఆరువారాల ఎడం పాటించాలి. అయితే ఆరువారాల కలయిక సమయంలో నొప్పిగా ఉన్నా తేలికగా తీసుకోకూడదు. రక్తహీనత, థైరాయిడ్ పనితీరులో లోపాలు కారణం కావచ్చు. అలాగే బ్యాక్టీరియల్ వెజైనోసిస్, పాలివ్వటం వలన ఈస్ర్టోజెన్ స్థాయిలు తగ్గడం, గర్భనిరోధక సాధనాలు వాడటం వల్ల ఆ చర్య నొప్పిగా అనిపించొచ్చు.
పాలిచ్చే తల్లుల్లో ఈ సమస్య ఇంకాస్త ఎక్కువగానే ఉంటుంది. కొన్నిసార్లు ఏ కారణం లేకుండానే ఆసక్తి తగ్గవచ్చు. నొప్పిగా అనిపించవచ్చు. అవన్నీ తాత్కాలికమే కాబట్టి వీలైనంతవరకూ భాగస్వామితో ఎక్కువగా గడిపేలా చూసుకోవాలి. పాలిచ్చేసమయంలో జననేంద్రియాలు పొడిబారటం సహజం. అలాంటప్పుడు లైంగికచర్య నొప్పిగా అనిపించవచ్చు. అప్పుడు మాత్రం వైద్యులు లూబ్రికెంట్స్ ను సూచిస్తారు.. మరోపని చేయవచ్చు. ఆ సమయంలో నొప్పి తగ్గడానికీ ముందే బాత్రూంకి వెళ్లటం, వేడినీటితో స్నానం చేయడం వల్ల కాస్త మార్పు ఉంటుంది. ప్రసవానంతరం జననేంద్రియాల్లోని కండకాల ధృఢత్వం మారేందుకు కిగోల్ వ్యాయామాలు చేయాలి. బాత్రూంని ఆపుతున్నట్లుగా కటివలయ కండరాలను పట్టి ఉంచి వదలాలి. ఇలా పదిసార్లు చేస్తే చాలు. –

Regular and better Mensus

ఒకమ్మాయికి నెలసరి వచ్చే రెండు రోజుల ముందు నుంచే విపరీతమైన కడుపునొప్పి, నడుం నొప్పి, మరొకమ్మాయికి నెలసరే ప్రతి నెలా రాదు. నెలా ఇరవై రోజులకో, రెండు నెలలకో వస్తుంది. దాంతో ఏదో చికాకు… ఇంకొకామెకు నెలకి రెండుసార్లు నెలసరి వస్తుంది. వస్తే పదిరోజుల దాకా ఆగదు. దాంతో విపరీతమైన నీరసం, చికాకు!
ఇలా ప్రతి స్త్రీలో చక్కగా సాగవలసిన ఋతుచక్రంలో ఎన్నో ఆవాంతరాలు. వీటి అవర్తన వికృతు (మెనుస్ట్రల్‌ ఇర్రెగ్యు లారిటీస్‌) అంటారు. గర్భాశయంలోనో, లోపలి పొరలలోనో, శరీరంలో ఇతర వ్యాధులవలనో, హార్మోన్ల హెచ్చుతగ్గుల వలనో జననేంద్రియాలో ఏర్పడే గడ్డల వలనో ఈ ఋతుస్రావంలో బాధు, మార్పులు కలుగుతూ వుంటాయి.
హార్మోన్ల ప్రభావం వలన : స్త్రీ శరీర ఆకృతి ఆమె స్వభావసిద్ధమైన ప్రకృతి, ఆమెలో ఉన్న వాత, పిత్త, కఫ శక్తులలో సంభవించే హెచ్చుతగ్గులు వీటికి కారణం. అంతర్గత స్వాభావిక మార్పు వలన ప్రతి నెల 28 రోజుల కొకసారి యోని నుండి ప్రసవించే ఈ ముదురు ఎరుపు రంగుతో ఉండే రక్తం చిన్న చిన్న ముద్దలాంటి పొరలనే ఋతుస్రావం అంటారు. ఆ స్రవించే మూడు నుండి అయిదు రోజుల కాలపరిమితిని ఋతుకాలం మెనుస్ట్రువల్‌ పిరియడ్‌ అంటారు. ఆ సమయంలో స్త్రీని ఋతుమతి అంటారు. ఆ సమయంలో స్త్రీ తన ఆరోగ్యం కోసం తీసుకునే చిన్న చిన్న జాగ్రత్తలను ఋతుమతి ధర్మాలు అంటారు. వాటిలో కొన్నిటిని అయినా పాటిస్తే భవిష్యత్తులో బాధలు లేకుండా ఉంటాయి.
నెలసరి రావటంలో హెచ్చుతగ్గులు ఆరంభంలో కాస్త ఎక్కువగానూ, మధ్యలో ఇబ్బంది కరంగానూ, చివరిలో శారీరక, మానసిక మార్పులతో రావటం చాలావరకు హార్మోన్ల ప్రభావం వల్ల జరుగుతుంది. 24 రోజు నుండి 32 రోజుల మధ్యలో రావటం అసహజం కాదు కాని, నెలకి రెండు సార్లు లేదా రెండు మూడు నెలలకి ఒకసారి రావటం అసహజమే కాదు వ్యాధి కూడా.
హార్మోన్ల హెచ్చు తగ్గులే కాదు, ఆ హార్మోన్లు మెదడుకు, మిగతా చోట్ల ఇచ్చే సంకేతాలతో మార్పులు కూడా వ్యాధికి కారణమవుతాయి.
పిట్యూటరీ గ్రంథిలోనూ, ఓవరిస్‌లోనూ నిలవ ఉండే ఈస్ట్రోజెన్‌, ప్రాజెస్టిరోన్‌ అనే హార్మోన్లు నెలసరి చక్కగా రావటానికి దోహదపడతాయి. నెలసరి వచ్చేముందు ఈ గ్రంథులు ఒకదాని కొకటి పంపుకునే సంకేతాలలో మార్పుల వలన నెలసరిలో హెచ్చుతగ్గలు మార్పులు సంభవిస్తాయి. గర్భం రావటం, ఆహారంలో సమగ్రత లోపించడం, పోషకాహార లోపాలు, యాభై ఏళ్ళ వయస్సు తర్వాత ఆగిపోయే హార్మోన్ల కారణంగా ఈ మార్పులు వస్తాయి. అలా శాశ్వతంగా ఆగిపోయే నెలసరి స్థితిని క్షీణార్తవం మెనోపాజ్‌ అంటారు.అలాగే పదహాళ్ళు దాటాక పిల్లలలో నెలసరి వస్తూ హఠాత్తుగా మూడునెలలు రాకపోతే అనార్తనం అంటారు. నాలుగ్ను నెలలకొకసారి ఒకటి రెండు బొట్లు కనిపించి మానేసే, దాన్ని స్వత్విర్తావం అంటారు.కొంత మంది స్త్రీలో నభై ఏళ్ళు రాకముందే ఓవరీ సామర్థ్యం ఆగిపోయి నెలసరి ముందుగానే ఆగిపోతుంది. దాన్ని పి ఓ ఎఫ్‌ అంటారు.
అలాగే గర్భాశయం లోపలా బయటా గడ్డలు (ఫైబ్రాయిడ్స్‌) ఏర్పడటం, గ్నర్భాశయం లోపలి పొర వాయటం, పాండు, టి బీ లాంటి శోషవ్యాధులు కూడా ఈ ఆవర్తన వికృతులకు కారణం అవుతాయి. నెలసరి వచ్చేటపుడు, ఉన్నపుడు విపరీతమైన కడుపునొప్పి, నడుము నొప్పి, వాంతులు, తలనొప్పి వంటివి వచ్చి బాధాకరమైతే దాన్ని కష్టార్తవం అంటారు.
అధికంగా ఒళ్ళు ఉండటం వలన లేదా రోజురోజుకీ బరువు పెరగటం సాంక్రమిక వ్యాధులు, గ్నర్భాశయంలో మెలికు పోలిప్స్‌. క్యాన్సరు వంటి తీవ్ర వ్యాధులు కూడా నెలసరి ఉపద్రవాకి కారణమవుతాయి.
తగిన ఆహారం : మూత్రం మంటగా ఉన్నా, గర్భం తోందరగా రాకుండా ఉన్నా, తరచూ జ్వరం వస్తున్నా ఎప్పటికీ తగ్గని నడుం నొప్పి ఉన్నా, సంభోగ సమయంలో బాధగా ఉన్నా, నెలసరి సరిగా రానివారు మరింత జాగ్రత్త పడాలి. నెలసరి ఇబ్బందులు శాకాహారులకన్నా మాంసాహారులలో తక్కువగా ఉంటాయి. కానీ ఎక్కువగా లావు అవుతుంటే ఇదీ మరీ పెరుగుతుంది. అందుకే మందులు తీసుకోవటం కన్నా ఆహారం, నడవడిక ఆలోచనలో మార్పు ముందు నుంచే కొంచెం జాగ్రత్త పడితే ఈ బాధలు రావు. పాప పన్నెండో సంవత్సరంలో అడుగిడుతుంటే సాయంత్రం చిమ్మిరి వుండలు రెండు తినిపించడం మంచిది. మినప గారెలు ఆహారంలో ఇవ్వడం మంచిది. అలాగే ఇంగువ కూరల్లోన్లూ, పచ్చళ్ళలోనూ వేయటం మరచిపోకండి. అలాగే తెల్లని బ్రెడ్‌ కన్నా ఎర్రని బ్రెడ్‌ నెలసరిని సరిగ్గా ఉంచే ఆహారం.
ఎక్కువ కారం, శనగపిండి వస్తువులు తినకండి. తాజా ఆకుకూరలు, పళ్ళు ముఖ్యంగా బొప్పాయి, జామ, దానిమ్మ పళ్ళు నెలసరిని సరిగ్గా ఉంచే ఆహారం.
పళ్ళు, చిక్కుళ్ళు, గోరుచిక్కుళ్ళు అని వయస్సుల ఆడవారికి మంచివి. మాంసాహారం తినేవాళ్ళు చేపలు, గ్రుడ్లు తినడం మంచిది. ఆలివ్‌ ఆయిల్‌, నువ్వునూనె వంటకి వాడటం నెలసరి సరిగ్గా ఉంచే చక్కటి నూనెలు. ఇవి గర్భాశయపు నరాల శక్తిని స్థిరపరుస్తాయి. ప్రతి రోజూ రాగి చెంబులో నీళ్ళు ఎక్కుగా తాగడం మంచిది. క్యారట్‌ రసం ప్రతి రోజూ తీసుకుంటే నెలసరి సమస్యలు రావు.
ములక్కాడ, గుమ్మడి వడియాలు, పొట్లకాయ కూర, పచ్చి బొప్పాయి కూర ప్రతి ఆడపిల్ల తీసుకుంటే నెలసరి సమస్యలు తగ్గుతాయి. సంవత్సరానికి మూడుసార్లు మధ్య వయస్సువారు పంచకర్మ చికిత్స చేయుంచుకుంటే అన్ని దోషాలు పోయి నెలసరి చక్కగా సాగుతుంది.
ఆయుర్వేద చిట్కాలు : నెలసరి సరిగ్గా రాని వారు రోజూ ద్రాక్షారసం ఒక గ్లాసు తాగడం మంచిది. రెండు చిటికెల పసుపు, ఒక ,చెమ్చా ధనియాులు రెండు లవంగాలు, రెండు మిరియాులు కలిపి అన్నం మొదటి ముద్దలో తింటే నెలసరి సమస్యు తగ్గుతాయి.

ఫైబ్రాయిడ్స్‌ Fibroids

గర్భాశయంలో ఉండే కణితులూ, గడ్డలు… వీటినే వైద్యపరిభాషలో ఫైబ్రాయిడ్స్‌ అంటాం. ఈ కణితులతో వచ్చే చిక్కులని తక్కువ అంచనా వేయడానికి లేదు! సాధారణ కడుపునొప్పితో మొదలుపెట్టి గర్భస్రావందాకా ఎన్నో సమస్యలకి ఇవి కారణమవుతాయి. అందుకే మనం వీటి గురించి అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది.
నెలసరులు సరిగారానప్పుడూ, కడుపులో తీవ్రమైన నొప్పి వేధిస్తున్నప్పుడు… ఆ సమస్యల్ని అంత తేలిగ్గా తీసుకోకూడదు. ఒక వేళ ఈ సమస్యలకి గర్భాశయంలోని ఫైబ్రాయిడ్స్‌ కారణం కావొచ్చు. అవే అయితే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. ఇవి తర్వాతి కాలంలో సంతానలేమికి కూడా కారణమవుతాయి! తాజా అధ్యయనాల ప్రకారం సంతానోత్పత్తి సామర్థ్యం ఉన్న మహిళలపై ఇవి 35 నుంచి 77 శాతం వరకూ ప్రభావం చూపుతాయట. గర్భవతుల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు మామూలు సమయాలతో పోలిస్తే గర్భధారణ సమయంలో కణితుల పరిమాణం పెరిగే వేగం కూడా ఎక్కువగా ఉంటుంది. గర్భానికి వెళ్లే రక్తప్రవాహం ఫైబ్రాయిడ్ల వైపు మళ్లడమే ఇందుకు ప్రధాన కారణం. కానీ ఈ కణితులు ప్రతి గర్భవతికీ నష్టం చేస్తాయని చెప్పలేం. 40 శాతం మందిలో మాత్రమే వీటివల్ల నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది. పరిమాణం, ప్రదేశం..
కణితి పరిమాణం, వాటి సంఖ్యా, అది ఉన్న ప్రదేశాన్ని బట్టే దాని ప్రభావం ఆధారపడి ఉంటుంది. ఫైబ్రాయిడ్ల పరిమాణం ఐదు సెంటీమీటర్ల కంటే ఎక్కువగా ఉంటే దుష్ఫలితాలు కనిపిస్తాయి. ఒక్కోసారి సిజేరియన్‌ వరకూ వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఇదే కణితి సాధారణ పరిమాణంలో ఉంటే వారికి సహజ ప్రసవమే అవుతుంది. ఫైబ్రాయిడ్లు లేనివారితో పోలిస్తే… ఉన్నవారిలో గర్భస్రావమయ్యే ప్రమాదం ఎక్కువ. అలాగే ఒకే కణితి ఉన్నవారితో పోలిస్తే ఎక్కువున్నవారిలోనూ గర్భస్రావాలయ్యే ఆస్కారం అధికం. కణితులు ఏ ప్రాంతంలో ఉన్నాయి అనేది కూడా చాలా కీలకమైన విషయం. ఇవి గర్భాశయం దిగువభాగంలో ఉంటే వాటి ప్రభావం తక్కువగా ఉంటుంది. అదే ఎగువవైపుంటే గర్భం నిలవడమే కష్టం! కొన్నిసార్లు గర్భధారణ సమయంలో రక్తస్రావం అవుతుంటుంది. దానిక్కారణం మాయని ఫైబ్రాయిడ్లు అంటిపెట్టుకుని ఉండి, దానిపై ఒత్తిడి తీసుకురావడమే. ఇలాంటప్పుడు కూడా గర్భస్థ పిండానికి చేటు జరుగుతుంది.
నొప్పి ఏ పరిస్థితుల్లో?
కొన్నిసార్లు గర్భిణికి రక్తస్రావంతోపాటూ తీవ్రమైన నొప్పీ, జ్వరం వేధిస్తాయి. ఈ పరిస్థితిని నెక్రోబయోసిస్‌ లేదా రెడ్‌ డీజనరేషన్‌ అంటారు. కణితుల్లో అసాధారణమైన పెరుగుదలే ఇందుక్కారణం. ముఖ్యంగా ఐదు సెంటీమీటర్ల కంటే ఎక్కువ పరిమాణంలో కణితులున్నప్పుడు కడుపులో నొప్పీ, జ్వరం మొదలవుతాయి. అంతేకాదు ఫైబ్రాయిడ్లు కూడా కదిలి కొన్నిరకాల ప్రోస్టోగ్లాండిన్స్‌ అనే స్రావాలని విడుదల చేస్తాయి. దాంతో నొప్పి మరింతగా పెరుగుతుంది. అలాంటప్పుడు స్కాన్‌ ద్వారా ఫైబ్రాయిడ్లను గుర్తిస్తారు. అందుకు తగ్గట్టు తగిన చికిత్సలు అందించడం మొదలుపెడతారు.
నియంత్రించకుంటే..
సాధారణ పరిస్థితుల్లో బిడ్డ పుట్టిన తర్వాత మాయ వేరవుతుంది. కానీ ఫైబ్రాయిడ్లు నియంత్రణలో లేనివారిలో ఈ పరిస్థితి తారుమారు అవుతుంది. శిశువుకి పోషకాలూ, ప్రాణవాయువూ అందించే మాయ ప్రసవానికి ముందే వేరవుతుంది. దాంతో బిడ్డకు అందాల్సిన పోషకాలూ, ఆక్సిజన్‌ సరిగా అందవు. దాంతో తీవ్రమైన రక్తస్రావం జరిగి తల్లీబిడ్డలిద్దరికీ ప్రాణాపాయ పరిస్థితి తలెత్తుతుంది. దీన్నే ‘ప్లాసెంటా అబ్రప్షన్‌’ అంటారు. అన్నిరకాల కణితులవల్లా ఈ పరిస్థితి రాదు. సబ్‌మ్యూకోజల్‌, రెట్రోప్లాసెంటల్‌ వంటి కొన్ని రకాల ఫైబ్రాయిడ్ల వల్లే ఇలాంటి ప్రాణాంతక పరిస్థితి వస్తుంది. పరిస్థితి ఇలా విషమించినప్పుడు ఫైబ్రాయిడ్లకు వెళ్లే రక్తాన్ని నిలుపుదల చేసి ఉపశమనం కలిగిస్తారు. కొన్ని సందర్భాల్లో ఈ కణితులు మాయ కిందకు దిగిపోవడానికీ కారణమవుతాయి. ఈ పరిస్థితిని ప్లాసెంటా ప్రీవియా అంటారు దీనివల్ల ప్రసవం కంటే ముందుగా రక్తస్రావం అవుతుంది. చాలా అరుదుగా కొందరిలో ప్రసవ సమయానికి బిడ్డ తలకిందకు ఉండదు. దీనినే ఫీటల్‌ మాల్‌ప్రెజెంటేషన్‌ అంటారు. దీనివల్ల చాలాసార్లు సిజేరియన్‌ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కొన్ని సందర్భాల్లో నెలలు నిండకముందే ప్రసవమవుతుంది.
శస్త్రచికిత్స తక్కువ సందర్భాల్లోనే..
గర్భధారణ సమయంలో ఈ ఫైబ్రాయిడ్ల కారణంగా తలెత్తే నొప్పిని నివారించడానికి కొన్నిమార్గాలున్నాయి. మూడో త్రైమాసికంలో అయితే బిడ్డ ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని నాన్‌స్టిరాయిడల్‌ ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్స్‌ మందులిస్తారు. మరీ నొప్పి ఎక్కువగా ఉంటే ఆసుపత్రిలో చేర్చుకుని వైద్యసేవలు అందిస్తారు. చాలా తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే శస్త్రచికిత్స చేస్తారు. ఓపెన్‌ మయోమెక్టమీ శస్త్రచికిత్స చేసి కణితులని తొలగిస్తారు. కానీ వీలైనంతవరకూ చేయకుండా ఉండటానికే ప్రయత్నిస్తారు. ఎందుకంటే ఈ సమయంలో కణితులూ, గర్భాశయం అన్నీ సున్నితంగా ఉంటాయి. ఇలాంటి సమయంలో శస్త్రచికిత్స చేస్తే రక్తస్రావం చాలా ఎక్కువగా అవుతుంది. దానిని నియంత్రించడం కష్టమవుతుంది. అలాంటప్పుడు హిస్టరెక్టమీ ద్వారా గర్భాశయాన్నీ తొలగించాల్సి రావొచ్చు! అందుకే వీలైనంత వరకూ మయోమెక్టమీ చేయకుండా ఉండటానికి ప్రయత్నిస్తారు.

Ovarian Cancer అండాశయ (ఒవరియన్‌) క్యాన్సర్‌

గర్భాశయానికి ఇరుపక్కలా బాదం పప్పు సైజులో ఉండే అండాశయాలు అండాలను ఉత్పత్తి చేయడంతో పాటు స్త్రీ హార్మోన్స్‌ అయిన ఈస్ట్రోజన్‌, ప్రొజెస్టిరాన్‌ను విడుదల చేస్తుంటాయి. స్త్రీలో నెలసరికి ఈ హార్మోన్స్‌ కారణం. ఈ హార్మోన్స్‌ సరిగ్గా విడుదల అయినంత కాలం అనేక గైనిక్‌ సమస్యలకు దూరంగా ఉండటంతో పాటు సంతానలేమి సమస్య కూడా బాధించదు. అండాశయంలో కణాలు అపరిమితంగా పెరిగి ప్రక్కనున్న టిష్యూలకు ఇతర భాగాలకు వ్యాపించడాన్ని ఓవరియన్‌ క్యాన్సర్‌ అంటారు. ఈ అపరిమితంగా పెరిగే కణాలను బట్టి ఈ క్యాన్సర్‌ను మూడు రకాలుగా విభజించారు.
1.ఎపిథీలియట్‌ ఒవేరియన్‌ క్యాన్సర్‌ : వయస్పు సైబడిన స్త్రీలో దాదాపు 90% వరకు ఈ క్యాన్సర్‌ వస్తుంది.
2.జెశ్యాసెల్‌ ఓవరియ్‌ క్యాన్సర్‌ : వయస్సులో ఉండే అమ్మాయిలో వచ్చే ఒవేరియన్‌ క్యాన్సర్‌ ఇది. ఈ క్యాన్సర్‌ కణాలు అండాల నుండి పుడతాయి.
2. స్టోమల్‌ ఒవేరియన్‌ క్యాన్సర్‌ : ఈ క్యాన్సర్‌ కణాలు అండాలలో హార్మోన్స్‌ ఉత్పత్తి అయ్యే దగ్గర నుండి తయారు అవుతాయి. స్త్రీలలో ఈస్ట్రోజన్‌, ప్రొజిస్టిరాన్‌ హార్మన్స్‌ చాలా ఎక్కువగా దీర్ఘకాలికంగా ఉంటే ఈ క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఎక్కువ. స్త్రీలో వచ్చే క్యాన్సర్‌లో ఈ క్యాన్సర్‌ది మూడవ స్థానం. గర్భాశయ ముఖద్వారం, రొమ్ము క్యాన్సర్‌ తర్యాత ఈ క్యాన్సర్స్‌ ఎక్కువ.
ఈ మూడు రకాలే కాకుండా వాటిలో ఇంకా ఎన్నో సబ్‌టైప్స్‌ ఉన్నాయి. స్త్రీలలో 50 సంవత్సరాలు పైబడ్డాక ఎక్కువగా కన్పించే ఈ క్యాన్సర్‌ను ఒక సైలెంట్‌ కిల్లర్‌గా పేర్కొంటారు. ఎందుకంటే పొత్తికడుపులో చాలా లోపలికి ఉండే అండాశయ క్యాన్సర్‌కు సంబంధించిన లక్షణాలు కూడా చాలా ఆస్యంగా బయటపడుతుంటాయి.
పిల్లలు కలగని స్త్రీలలో బ్రెస్ట్‌, కొన్‌ క్యాన్సర్‌ వచ్చిన వారిలో.
సంతానం కొరకు మందులు చాలా ఎక్కువగా వాడిన వారిలో.
హార్మోన్స్‌ రీప్లేస్‌మెంట్‌ ధెరపీని దీర్ఘకాంగా తీసుకున్నవారిలో.
కొవ్వు పదార్థాలు మాంసాహారం ఎక్కువగా తీసుకున్నవారిలో.
ఫ్యామిలీ హిస్టరీ కలిగిన 50 ఏళ్ళ పైబడిన స్త్రీలో ఈ క్యాన్సర్‌ వచ్చే రిస్క్‌ కొంచెం ఎక్కువ
ఒవేరియన్‌ క్యాన్సర్‌ లక్షణాలు : ఈ క్యాన్సర్‌ క్షణాలు అంత త్వరగా బయడపడవు. అంతే కాకుండా అజీర్తి యూరినరీ ఇన్‌ఫెక్షన్స్‌ వంటి లక్షణాలుగా అన్పించవచ్చు. మొదట్లో లక్షణాలు అంత తీవ్రంగా లేకపోవటం వలన తొలిదశలో ఈ క్యాన్సర్‌ను గుర్తించటం కష్టం కావచ్చు.
పొత్తికడుపు ఉబ్బినట్లు నొప్పిగా ఉండటం
అజీర్తి, వికారం, తేన్పు వంటి జీర్ఱసంబంధ సమస్యలు
యోని స్రావాలు అసాధారణంగా ఉండటం.
మూత్రం ఎక్కువగా లేదా తొందరగా రావటం
అలసట, జ్వరం
ఎక్కువగా లేదా అంతకు ముందులా తినలేకపోవటం కొంచెం తినగానే పొట్టనిండినట్లు ఉండటం
ఊపిరి కష్టంగా ఉండటం
కలయిక కష్టంగా ఉండటం
వెన్నునొప్పి లేదా నడుము నొప్పిగా అన్పించటం
అకస్మాత్తుగా బరువు పెరగటం లేదా తగ్గటం.
ఈ లక్షణాలలో కొన్ని ఈ క్యాన్పర్‌ లక్షణాలుగా బయటపడవచ్చు. గైనకాలజిస్టు దగ్గరకు గైనిక్‌ చెకప్‌కు వెళ్లినపుడు ఈ క్యాన్సర్‌ అంత త్వరగా బయటపడకపోవచ్చు. అందుకే అనుమానం ఉంటే అల్ట్రాసౌండ్‌ పరీక్షతో పాటు బ్లడ్‌ టెస్ట్‌, సి.ఏ 125, పిప్‌ టెస్ట్‌, మొదలైన వాటితో పాటి సి టి,యం.ఆర్‌ ఐ వంటివి కూడా చేస్తారు బ్రెస్ట్‌ క్యాన్సర్‌కు కారణమయ్యే BRCAI జీన్‌ మ్యూటేషన్‌ తేడాలున్నపుడు ఈ క్యాన్సర్‌ పరీక్షలు 25 ఏళ్ళనుండి చేయించటం మంచిది. మెనోపాజ్‌ దశకు ముందు నుండి ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ ను మాత్రమే 5 నుండి 10 సార్ల్లు కంటే ఎక్కువగా తీసుకుంటే ఈ క్యాన్సర్‌ వచ్చే రిస్క్‌ పెరగవచ్చు. ప్రొజెస్టిరాన్‌ హార్మోన్‌ కాంబినేషన్‌లో ఈస్ట్రోజన్‌ తీసుకుంటే ఈ ముప్పు కొంతవరకు తగ్గవచ్చు. అన్ని క్యాన్సర్స్‌లో లాగే ఈ క్యాన్సర్‌లో నాలుగు స్టేజ్‌ లుంటాయి.
స్టేజ్‌ 1 : ఒకటి లేదా రెండు అండాశయాలకు మాత్రమే పరిమితం
స్టేజ్‌ 2 : గర్భాశయానికి వ్యాప్తి చెందటం
స్టేజ్‌ 3 : అండాశయాలు, గర్భాశయంతో పాటు లింప్‌ నాళాలు, పొత్తికడుపు లైనింగ్‌కు వ్యాప్తి చెందటం
స్టేజ్‌ 4 : పై వాటితో పాటు శరీరంలో ఇతర అవయవాలకు సోకటం.
స్టేజ్‌పై ఆధారపడి సర్జరీతో పాటు ఇతర థెరపీలు, ట్రీట్‌మెంట్స్‌ ఎంతకాలం ఇవ్వాలో నిర్థారిస్తారు. నోటి ద్వారా ఐ వి ద్వారా లేక నేరుగా పొట్టలోకి ఇచ్చే కీమోతో పాటు టార్గెటెడ్‌ థెరపీ కూడా ఉంటాయి. పెళ్లకాని అమ్మాయిు ఈ క్యాన్సర్‌కు ఇచ్చే కీమో, రేడిమో థెరపీతో మెనోపాజ్‌ లాంటి లక్షణాలను గుర్తించవచ్చు. అందుకే వీరి అండాలను ట్రీట్‌మెంట్స్‌ ముందు తీసి భవిష్యత్తులో సంతాన భాగ్యం పొందటానికి భద్రపరిచే సౌకర్యాలు ఉన్నాయి.
ఈ రోజులలో వాడే బర్త్‌కంట్రోల్‌ పిల్స్‌ వలన ట్యూబల్‌ లిటిగేషన్‌, హిస్టరెక్టస్‌ అయన స్త్రీలో ఒవరియన్‌ క్యాన్సర్‌ వచ్చే అవకాశం తక్కువ కావచ్చు

IVF …..సంతాన సాఫల్యానికి ఐ. వి. ఎఫ్‌

స్త్రీలలో గర్భధారణ సమస్యలు ఏర్పడటానికి ఎన్నో కారణాలు ఉంటాయి. అండాలు విడుదల సక్రమమంగా లేకపోవటం, ఫాలోషియస్‌ ట్యూఋలు మూసుకుపోవటం, పురుషులలో వీర్యకణాల సంఖ్య తగ్గిపోవటం వంటి అనేక కారణాలు గర్భధారణకు అవరోధంగా మారుతాయి. ఈ సమస్యకు ఇన్‌ విట్రో ఫెర్టిలైజేషన్‌ థెరపీ చక్కని ఫలితాన్ని ఇస్తుందని అంటున్నారు డాక్టర్‌ సునీత.
ఎవరు చేసుకోవచ్చు : గర్భధారణతో కీలక పాత్ర పోషించే ఫాలోషియస్‌ ట్యూబ్స్‌ మూసుకుపోవటం లేదా దెబ్బతినడం, పురుషులలో వీర్యకణాల సంఖ్య తగ్గిపోవడం, లేదా కణాలు చురుకుగా లేకపోవడం, గర్భధారణ సమస్యకు కారణాలు తెలియకపోవడం వంటి పరిస్థితులో ఐ వి ఎఫ్‌ చికిత్స ద్వారా గర్భధారణ ఇబ్బందులను అధిగమించవచ్చు.
ఐ వి ఎఫ్‌ అంటే ఏమిటి? సహజ సిద్ధంగా గర్భధారణ జరగని పక్షంలో పురుషుడి వీర్యాన్ని స్త్రీ అండాన్ని ప్రయోగశాలలో సంయోగం చేసి అండం ఫలదీకరణ జరిగేలా చేసి ఒకటి లేదా రెండు పిండములను స్త్రీ గర్భాశయములోకి బదిలీ చేసి అవి గర్భాశయ వాహికలోకి చేర్చడం ద్వారా అవి అక్కడ ఎదిగేలా చేయడం జరుగుతుంది.
ఐ వి ఎఫ్‌ ప్రక్రియ ముందుగా స్త్రీ శరీరంలోని అండమును అచేతనం చేయడానికి హార్మోన్‌ చికిత్స ఇవ్వడం జరుగుతుంది. గర్భధారణ చికిత్స జరుగుతున్న సమయంలో సొంత హార్మోన్లు అడ్డుపడకుండా ఉండేందుకు ఈ చికిత్స అవసరం. ఇది ఇంజక్షన్‌ రూపంలో ఇస్తారు. అనంతరం అండాశయం అధిక సంఖ్యలో అండములను విడుద చేసేలా ప్రేరేపించడానికి ఫలదీకరణ ఇన్‌జెక్షన్‌ చికిత్స (గోనడోట్రోఫిన్‌ థెరపీ)ను స్త్రీకి ఇవ్వడం జరుగుతుంది. ఈ చికిత్సా కాలంలో ఆల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ ద్వారా అండము ఎదుగుదలను ఎప్పటికప్పుడు పరిశీలించడం జరుగుతుంది. అండము తగిన పరిమాణంలో పెరిగిన తరుణంలో హెచ్‌సిజి ఇంజక్షన్‌ ఇస్తారు. హెచ్‌జీజి ఇంజక్షన్‌ చేసిన 32-34 గంటల తరువాత పేషెంట్‌ను ఆసుపత్రిలో చేర్చుకొని జనరల్‌ అనస్థీషియా ఇచ్చి అండాశయంలో నుండి అండము సేకరిస్తారు. ఆల్ట్రా స్కానింగ్‌ ద్వారా అండమును గుర్తించడానికి జననాంగం పైన ఒక సన్నని నీడిల్‌ని అండాశయ పొరలోకి పంపడం జరుగుతుంది. పొర లోపలి ఉండే అండమును ఈ సూది ద్వారా వెలికితీసి పెట్రి డిష్‌లోకి చేరుస్తారు.
అలా మొత్తం అన్ని అండముల సేకరణ పూర్తయ్యే వరకు ఈ ప్రక్రియ సాగుతుంది.అండముల సేకరణ పూర్తయిన అనంతరం పేషెంట్‌ విశ్రాంతి తీసుకున్న అనంతరం అదేరోజు ఇంటికి పంపించి వేస్తారు. అదే సమయంలో ఆమె భర్త నుంచి వీర్య సేకరణ జరుగుతుంది. అనంతరం ఈ కణాలను పెట్రిడిషలో ఉన్న అండముతో సంయోగం చేయడం జరుగుతంది. ఈ డిష్‌ను ఇన్‌క్యుబరేటర్‌లో ఉంచుతారు.
48 గంటల తర్వాత కొన్ని అండము ఫలదీకరణ జరుగుతుంది. అండము ఫలదీకరణ చెందిన తర్వాత ఇవి పిండముగా ఎదుగుతాయి. పిండమును గర్భాశయంలో ప్రవేశపెట్టే ప్రక్రియ చాలా సుభమైనది దీనికి అనెస్థీషియా కూడా అవసరం లేదు. గర్భాశయంలోకి వీటిని క్యాథటర్‌ ట్యూబ్‌ ద్వారా ప్రవేశ పెడతారు గరిష్టంగా రెండు పిండములను మాత్రమే గర్భాశయంలోని ప్రవేశపెట్టడం జరుగుతుంది. అనంతరం స్త్రీకి ఫలదీకరణ చెంది ప్రత్యేక డిష్‌లో మిగిలిపోయిన పిండమును ఘనరూపంలోకి మార్చి భద్రపరచడం జరుగుతుంది. ఒకవేళ గర్భధారణ విఫలమైనా లేక మరోసారి గర్భధారణ ఆశించినా ఈ పిండము ఉపయోగపడుతుంది.
విజయావకాశము ఎంత? ఈ ప్రక్రియలో సుమారు 30-35 శాతం విజయావకాశాలు లభిస్తున్నాయి .అంతేగాక 35 సంవత్సరాల లోపు స్త్రీలలో విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి.
దుష్పభావాలు ఉంటాయా ? గొనడోట్రోఫిన్‌ ఇన్‌జెక్షన్‌ వాడకం వల్ల అండాలు ఎక్కువ సంఖ్యలో పెరిగే అవకాశం ఉంది. దీని వల్ల ఓవరీయన్‌ హైపర్‌ స్టిమ్యులేషన్‌ సిండ్రోమ్‌ ఏర్పడి అండాశయంలో వాపు ఏర్పడవచ్చు. అయితే ఈ పరిస్థితి కేవలం 2 శాతం మందిలో మాత్రమే తలెత్తే అవకాశం ఉంది. అలాగే గర్భధారణ ఫలప్రదం అయ్యేందుకు రెండు పిండములను ప్రవేశ పెట్టడం జరుగుతుంది. దీనివల్ల కవల శిశువులు జన్మించే అవకాశం 20 నుండి 40 శాతం వరకు ఉంది.

Hysterectomy …. గర్భకోశం తొలగింపు….. హిస్టరెక్టమి

పిల్లలు పుట్టిన తరువాత ఇక గర్భాశయంతో పనేంటి? దీనితో ఎదురయ్యే సమస్యలను భరించడం ఎందుకు? తొలగించుకుంటే సరిపోతుంది కదా! మన దేహనిర్మాణం ఎలా ఉంటుంది? తన విధులను సవ్వంగా నిర్వర్తించడంలో గర్భాశయంతో సహా అన్ని అవయవాలు ఎంత ముఖ్యమో! తప్పని సరిగా తొగించాల్సిన పరిస్థితుల గురించి …..
గర్భాశయం మూత్రాశయానికి పెద్దపేగుకు మధ్య ఫ్యూబిక్‌ టోన్‌కు పైభాగంలో ఉంటుంది. గర్భాశయానికి మందువైపు మూత్రాశయం, వెనుక వైపు పేగులుంటాయి. ఇది సహజమైన దేహనిర్మాణం. గర్భాశయం, సర్విక్స్‌, వెజైనా ఒకదాని ఆధారంగా మరొకటి పనిచేస్తాయి. గర్భాశయం (యుటిరస్‌)ను తొగించడం అంటే సర్విక్స్‌ను కూడా తొలగించడం జరుగుతుంది. గర్భాశయం లిగమెంట్లు నరాలు, రక్తనాళాలతో అనుసంధానమై ఉంటాయి. గర్భాశయాన్ని పాక్షికంగా గాని, పూర్తిగా గానీ తొలగించినపుడు ఈ వ్యవస్థ మొత్తం అస్తవ్యస్తం అవుతుంది. ఇది స్త్రీ శరీరం నుంచి ముఖ్యమైన భాగాలను అసహజమైన పద్ధతిలో దూరం చేయడమే.
గర్భాశయం (యుటిరస్‌) దేహ నిర్మాణంలో చాలా కీలకమైన భాగం. దీనిని పునరుత్పత్తికి సంబంధించిన అవయవంగానే పరిగణిస్తుటారు. నిజానికి గర్భాశయం నిర్వహించే విధుల్లో గర్భధారణ అనేది ఒకటి మాత్రమే. మిగిలిన వాటిలో గుండె సంరక్షణ ముఖ్యమైనది. గర్భాశయాన్ని తొలగించని వారితో పోలిస్తే గర్భాశయం తొలగించిన వారిలో గుండెకు సంబంధించిన రుగ్మతలు తలెత్తటానికి మూడింతల అవకాశం ఎక్కువ. అలాగే గర్భాశయంతో పాటు అండాశయాన్ని కూడా తొలగించినట్లయితే వారిలో గుండె వ్యాధుల రిస్క్‌ ఏడింతలు పెరుగుతుంది. గర్భాశయం పునరుత్పత్తి విధులతో పాటు హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తూ ఉన్న ప్రధానమైన శరీర భాగం లోపించడంతో ఎదురయ్యే పరిణామం.
శరీరంలో అంతర్భాగంగా ఉన్న పునరుత్పత్తి అవయవం మనిషి జీవించినంత కాం విధులను నిర్వర్తిస్తూనే ఉంటుంది. కాబట్టి ఎట్టి దశలోనూ దానిని తొగించడం సరికాదు. స్త్రీ ఆరోగ్యానికి గర్భాశయం అనుబంధ అవయవాలు ప్రతిబంధకంగా మారినపుడు మాత్రమే ఈ ఆలోచన రావాలి తప్ప మరే సందర్భంలోనూ గర్భాశయాన్ని తొలగించడం అనే ఆలోచన చేయకూడదు. హిస్టరెక్టమీ అంటే గర్భశయాన్ని తొగించడం. స్త్రీ దేహంలో అండాశయాలు, జనన గ్రంథులు, జీవితకాలం పాటు హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తూనే ఉంటాయి. హిస్టరెక్టమీ చేయించుకుంటున్న మహిళల్లో 75 శాతం ఊఫోరెక్టమీ (ఓవరీను తొగించే ఆపరేన్‌) చేయించుకోవటం సాధారణం. ఓవరీను తొలగించుకోనివారు తాము ఓవరీను తొగించుకోలేదు కాబట్టి దేహంలో ఏమీ కోల్పోలేదనీ, ఎలాంటి అనారోగ్య పరిణామాలు ఎదురుకావని అనుకుంటారు. కానీ హిస్టరెక్టమీతో పాటు ఊఫోరెక్టమీ చేయించుకోని వారిలో ఓవరీకు రక్తప్రసరణ ప్రక్రియ సరిగ్గా జరగక వాటి పనితీరు లోపిస్తుంది. ఫలితంగా ఈ పరిస్థితి ప్రీమెచ్యూర్‌ మెనోపాజ్‌కు దారితీస్తుంది.
హిస్టరెక్టమీతో ఎదురయ్యే సమస్యలు : హిస్టరెక్టమీ చేయటం వలన పెల్విస్‌ కండరాల, నరాలు బలహీనమై ఆ ప్రభావం మూత్రాశయంతో పాటు ఇతర భాగాల మీద పడుతుంది. మూత్రాన్ని నియంత్రించుకోగలిగిన శక్తి లోపించడం, దీర్ఘకాలిక మలబద్ధకం, విరోచనాన్ని అదుపుచేసుకోలేకపోవటం వంటి సమస్యలకు దారితీస్తుంది. గర్భాశయం మూత్రాశయానికి సహజసిద్ధంగా సపోర్టునిస్తుంది. యూటిరెస్‌ను తొగించడం వల్ల బ్లాడర్‌ అప్పటివరకు గర్భాశయం నుండి అందుకుంటూ ఉన్న సపోర్టును కోల్పొతుంది. పేగుకు సంబంధించి కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుంది. అలాగే జననేంద్రియాల్లో ఇంద్రియ జ్ఞానం తగ్గడం లేదా పూర్తిగా కోల్పోవటం జరుగుతుంది. హిస్టరెక్టమీ అయిన వారిలో లైంగిక స్పందనలు తగ్గడం, పూర్తిగా లేకపోవడం, యుటిరైన్‌ కాట్రాక్షన్స్‌ వంటి పరిణామాలు గమనిస్తుంటాము. హిస్టరెక్టమీ తరువాత ఎదురయ్యే పరిణామాల దృష్ట్యా వెజైనా (యోని)ను లిగమెంట్స్‌తో కలిపి కుట్టివేయటం జరుగుతుంది. కొంతమందిలో ఈ ప్రక్రియ అనుకున్న ఫలితాలను ఇవ్వక వైజైనా ప్రోలాప్స్‌ (జారడం)తో ఇబ్బంది పడుతుంటారు.
హిస్టరెక్టమి ఎప్పుడు ? ప్రత్యామ్నాయాలు ?
1. యుటిరైటిస్‌ క్యాన్సర్‌ (గర్భాశయ క్యాన్సర్‌), ఓవరియన్‌ క్యాన్సర్‌ (అండాశయం) సర్వికల్‌ క్యాన్సర్‌ (గర్భాశయం కంఠం) వంటి పరిస్థితులో హిస్టరెక్టమీ చేయడమే పరిష్కారం. గర్భాశయం జారడం, స్థానభ్రంశం చేందడం, ఇది యూరినరీ ప్రాబ్లమ్స్‌కు దారితీయవచ్చు. పెల్విస్‌ మీద ఒత్తిడి కలగడం లేదా పేగుల కదలికను నియంత్రిచడం వంటి సందర్భాల్లో గర్భాశయాన్ని తొలగించే నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంటుంది.
2. అధిక రక్తస్రావం, వైట్‌ డిశ్చార్జ్‌ వంటి సమస్యలకు ఎండోమ్కెటియల్‌ అబ్లేషన్‌, మిరెనా ఇన్‌సెర్షన్‌ వంటి ప్రక్రియను అనుసరించడం ద్వారా హిస్టరెక్టమీని నివారించవచ్చు
3. ఫైబ్రాయిడ్లు ఏర్పడినపుడు వాటిని తొలగించడం కంటే గర్భాశయాన్ని తొలగించడమే మంచిదని భావిస్తుంటారు, కానీ చాలా రకాల ఫైబ్రాయిడ్లకు చికిత్స అవసరం లేదు. చికిత్స అవసరమైతే మయోమెక్టమీ చేయించుకోవచ్చు. కొన్ని రకాల ఫైబ్రాయిడ్లు క్యాన్సర్‌కు దారితీసే అవకాశం ఉన్నప్పటికీ అది 0.1 శాతం మాత్రమేనని గమనించాలి.
ఆందోళన కలిగించే అంశాలు : వైట్‌ డిశ్చార్జ్‌, అధిక రక్తస్రావం, ఫైబ్రాయిడ్లు… మహిళను ఆందోళనకు గురిచేస్తుంటాయి. నిజానికి వైట్‌ డిశ్చార్జ్‌ అనగానే అది క్యాన్సర్‌కు దారితీస్తుందేమో అని ఆందోళన చెంది హిస్టరెక్టమీ చేయించుకోవడాన్ని చూస్తుంటాము. దీనిని మందులతో తగ్గించుకోవచ్చు. అయితే చాలా సందర్భాల్లో భార్య భర్తలిద్దరూ మందులను వాడాల్సి ఉంటుంది. అలా కాకుండా స్త్రీలే మాత్రమే మందులు వాడడంతో అప్పటికి తగ్గినట్లు అనిపించినా తిరిగి సమస్య తలెత్తే అవకాశాలు ఎక్కువ. వైట్‌ డిశ్చార్స్‌కు ఇలా నాలుగైదు సార్లు యాంటీబయోటిక్స్‌ వాడిన వాళ్ళు విసిగిపోయి హిస్టరెక్టమీ చేయుంచుకోవటానికి మొగ్గు చూపుతుంటారు.
అనారోగ్య పరిస్థితులు
హిస్టరెక్టమీ ఎడ్యుకేషన్‌ రీసోర్సెస్‌ అండ్‌ సర్వీసెస్‌ ఫౌండేషన్‌ 1991 నిర్వహించన అధ్యయనంలో హిస్టరెక్టమీ చేయుంచుకున్న వారిలో కనిపించే లక్షణాలు… జీవకళ లోపించడం, కీళ్ల నొప్పులు, తీవ్రమైన నీరసం,దేహాకృతితో మార్పు, లైంగిక వాంఛ లోపించడం, శక్తి తగ్గినట్లు అనిపించడం, షార్ట్‌ టరమ్‌ మెమరీ, , ఎముకలు, కీళ్లనొప్పులు, నిద్రలేమి, ఆత్మస్థైర్యం లోపించడం, ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన రావడం, ముందు చేస్తున్న పనులను అదే స్థాయలో చేయలేకపోవటం, మాతృత్వ భావనలు లోపించడం వంటి సమస్యలు ఎదురవుతున్నట్లు తెలిసింది ఇవన్నీ హిస్టరెక్టమీ చేయించుకున్న తర్వాత పదినుంచి ఇరవై ఏళ్ళలో సంభవిస్తున్నట్లు సమాచారం.

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌… దీన్ని తొలి దశలోనే గుర్తించగలిగితే 90-95% పూర్తిగా నయం చెయ్యచ్చు.
అసలు క్యాన్సర్‌ మార్పులు మొదలవ్వక ముందే… ‘ప్రీ క్యాన్సర్‌’ దశలోనే గుర్తించగలిగితే – నూటికి నూరు శాతం అది క్యాన్సర్‌గా మారకుండా అడ్డుకోవచ్చు.
అందుకే స్క్రీనింగ్‌ పరీక్షలు మనకు చాలా ముఖ్యం.
గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌… మనదేశంలో మధ్యవయసు స్త్రీలలో చాలా ఎక్కువగా కనబడుతున్న క్యాన్సర్‌ ఇది. పైకి ఎటువంటి లక్షణాలూ లేకుండానే.. నిశ్శబ్దంగా ప్రాణాలను హరించే క్యాన్సర్లలో ఇదే ప్రధానమైంది. మన దేశంలో ఏటా కొత్తగా 1,30,000 మంది ఈ క్యాన్సర్‌ బారినపడుతున్నారు. ఏటా సుమారు 75,000 మంది దీని కారణంగానే మరణిస్తున్నారంటే ఇదెంత పెద్ద సమస్యో అర్థం చేసుకోవచ్చు. నిజానికి ఇవన్నీ కొద్దిపాటి జాగ్రత్తలతో నివారించదగ్గ మరణాలే. ఓ 50 ఏళ్ల క్రితం పాశ్చాత్య దేశాల్లో కూడా ఎంతోమంది మహిళలు ఇలాగే ఈ క్యాన్సర్‌తో మరణిస్తుండేవారు. కానీ ‘పాప్‌ స్మియర్‌’ వంటి తేలికపాటి పరీక్షలు అందుబాటులోకి వచ్చాక ఆ దేశాలన్నీ దీన్ని అద్భుతంగా కట్టడి చేశాయి. క్యాన్సర్‌ ఆనవాళ్లను… చాలా ముందుగానే… అసలు క్యాన్సర్‌ మార్పులు మొదలవ్వకముందే పసిగట్టటం ద్వారా దీనిపై పెద్ద విజయమే సాధించాయి.
ఇప్పుడు ఆ స్క్రీనింగ్‌ పరీక్షలన్నీ మనకూ అందుబాటులో ఉన్నాయి. కానీ మన దేశంలో ఈ పరీక్షల పట్ల పెద్దగా అవగాహన లేకపోవటం మూలంగా చాలామంది క్యాన్సర్‌ బాగా ముదిరిపోయిన తర్వాతగానీ వైద్యులను సంప్రదించటం లేదు. ఆ దశలో గుర్తించినా చెయ్యగలిగిందేం లేదు. అందుకే దీన్ని ఆదిలోనే గుర్తుపట్టాలి.. ఆ వెంటనే మట్టుబెట్టాలి!.
ఎందుకొస్తుందీ క్యాన్సర్‌ ?
ఇతరత్రా క్యాన్సర్లతో పోలిస్తే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ ఎందుకొస్తోందన్న కారణాన్ని గుర్తించటంలో వైద్యరంగం గణనీయమైన పురోగతి సాధించింది. ఈ క్యాన్సర్‌కు ప్రధాన కారణం – ‘హ్యూమన్‌ ప్యాపిలోమా’ అనే వైరస్‌ అని స్పష్టంగా గుర్తించింది. దీన్నే ‘హెచ్‌పీవీ’ అంటారు. ఇది లైంగిక కలయిక ద్వారా సంక్రమించే వైరస్‌, పైగా సర్వ సాధారణమైన వైరస్‌. ఎంత సాధారణమైన వైరస్‌ అంటే. సమాజంలో చాలామంది స్త్రీపురుషులు జీవితంలో ఎప్పుడో ఒకసారి దీని బారినపడే వాళ్లే.
80-90 మందిలో ఈ హెచ్‌పీవీ ఇన్ఫెక్షన్‌ దానంతట అదే తొలగిపోతుంది. మిగిలిన 10 శాతం మందిలో కూడా చాలా తక్కువ మందికే.. అది దీర్ఘకాలిక ఇన్‌ఫెక్షన్‌గా మారుతుంది. లేదా తరచూ వస్తుంటుంది. వీరిలోనూ కేవలం 2-3% మందిలోనే అది ‘ప్రీక్యాన్సర్‌’ దశకు వెళ్లొచ్చు. ఇందుకు 10-20 సంవత్సరాలు పట్టవచ్చు. ఈ దశలో మనం గుర్తించకపోతే క్రమేపీ అది క్యాన్సర్‌గా మారుతుంది. కొందరిలో క్యాన్సర్‌గా మారకుండా అలాగే ఉండిపోనూవచ్చు. అది క్యాన్సర్‌గా మారుతుందా? మారితే ఎంత కాలానికి అవ్వచ్చు? అన్నది చెప్పటం కష్టం. అది వ్యక్తికీ వ్యక్తికీ మారిపోతుంటుంది.
వీటితో రిస్కు పెరుగుతుంది
హెచ్‌పీవీ ఇన్ఫెక్షన్‌కు… జననాంగ అపరిశుభ్రత, ఎక్కువ గర్భాలు, ఎక్కువ కాన్పులు, చిన్న వయసులోనే లైంగిక జీవితాన్ని ఆరంభించటం, తరచుగా సుఖవ్యాధులకు గురవటం, ఎక్కువ మంది లైంగిక భాగస్వాములు ఉండటం, పోషకాహార లోపం, పొగతాగటం, హెచ్‌ఐవీ రావటం.. వింవి తోడైతే క్యాన్సర్‌గా మారే అవకాశాలు మరింతగా పెరుగుతాయి.
స్క్రీనింగ్‌ పరీక్షలు
1. ‘పాప్‌ స్మియర్‌’
చాలా ఏళ్లుగా ఉన్న పరీక్ష ఇది. చిన్నదూది పుల్లతో గర్భాశయ ముఖద్వారం వద్ద నుంచి స్రవాలను తీసి చేసే పరీక్ష ఇది. దీనిలో అసాధారణ కణాలు, మార్పులుంటే వెంటనే తెలుస్తుంది. దీనితో ‘ప్రీక్యాన్సర్‌’ దశలోనే జబ్బును కనిపెట్టవచ్చ. ఇలా అసాధారణ మార్పులు ఉంటే… అవి క్యాన్సర్‌ తరహా మార్పులా? కాదా? అన్నది తెలుసుకునేందుకు మరికొన్ని నిర్ధారణ పరీక్షలు చేస్తారు. ఈ పరీక్షలో పాజిటివ్‌ ఉన్నంత మాత్రాన అందరికీ క్యాన్సర్‌ ఉందని చెప్పలేం.
కానీ వీరిలో 80-90 ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వారికి తర్వాత తప్పనిసరిగా నిర్ధారణ పరీక్షలు చెయ్యాలి. ఈ పరీక్ష 30 ఏళ్లు దాటిన మహిళలకు విదేశాల్లో ప్రతి ఏడాదీ చేస్తున్నారు. మనం కనీసం మూడేళ్లకోసారి అయినా చేయించుకోవాలి. దీంతో క్యాన్సర్‌ సోకుతుంటే చాలా చాలా తొలి దశలోనే దాన్ని గుర్తించి వెంటనే నయం చేసే వీలుంటుంది. క్యాన్సర్‌ నుంచి రక్షణగా నిలిచేది ఈ పరీక్ష అన్నది మర్చిపోకూడదు.
2. వెనిగర్‌ పరీక్ష (విజువల్‌ స్క్రీనింగ్‌)
పాప్‌స్మియర్‌ పరీక్ష మన దేశంలో పట్టణాలన్నింటిలోనూ చేస్తున్నారు. పల్లెల్లో, మారుమూల ప్రాంతాల్లో మాత్రం ఇదింకా అందుబాటులో లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని… ప్రపంచ ఆరోగ్య సంస్థ మరో తేలిక పరీక్షను ముందుకు తెచ్చింది. దీనిలో – గర్భాశయ ముఖద్వారానికి వెనిగర్‌ ద్రావణం లేదా అయోడిన్‌ ద్రావణం పూస్తారు. అక్కడ క్యాన్సర్‌ తరహా మార్పులేమైనా ఉంటే.. కొద్దిసేపట్లోనే కనబడతాయి. నర్సులు కూడా చేయానికి వీలైన తేలిక పరీక్ష ఇది. అయితే ఇది నూటికి నూరుశాతం ఖచ్చితమైన పరీక్ష కాదు. కాబట్టి పాప్‌స్మియర్‌ చేసే వెసులుబాటు, అవకాశం లేని సందర్భాల్లో.. కొంతలో కొంత మేలు చేస్తుందని మాత్రమే దీన్ని ఆశ్రయించాలన్నది ప్రస్తుత అవగాహన.
3. హెచ్‌పీవీ డీఎన్‌ఏ పరీక్ష
అసలు ఇది ప్రీక్యాన్సర్‌ దశ కంటే కూడా ముందే… ఒంట్లో అసలు హెచ్‌పీవీ ఇన్పెక్షన్‌ ఉందా ? లేదా? అన్నది చెబుతుంది. ఇది బాగా ఖరీదైన పరీక్ష. ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వస్తోంది. దీనికీ దూది పుల్లతోనే స్రావాలను తీసుకుంటారు. ఒకసారి ఈ పరీక్షలో ‘నెగిటివ్‌’ అని వస్తే ఇక క్యాన్సర్‌ భయం పెద్దగా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత ఐదు పదేళ్ల వరకూ మళ్లీ పరీక్షలు కూడా అవసరం ఉండదు. అయితే దీనిలో పాజిటివ్‌ వస్తే – వారిలో హెచ్‌పీవీ ఇన్ఫెక్షన్‌ దీర్ఘకాలికంగా మారిందని అర్థం. అది భవిష్యత్తులో క్యాన్సర్‌ కారక మార్పులను తెచ్చిపెట్టవచ్చు. పెట్టకపోవచ్చు. అవకాశమైతే మాత్రం ఉందని గుర్తించి.. అక్కడి నుంచీ తరచుగా పరీక్షలు చేస్తూ, మార్పులేమైనా కనబడితే వెంటనే చికిత్స చేయటం ద్వారా క్యాన్సర్‌ దరి జేరకుండానే చూసుకోవచ్చు. కాబట్ట 30 ఏళ్లు దాటిన వారు ఈ పరీక్ష చేయించు కోవటం ఉత్తమం.
ఈ స్క్రీనింగ్‌ పరీక్షలన్నీ ఉపయోగకరమైనవే. దేనిలో ‘పాజిటివ్‌’ వచ్చినా.. అది క్యాన్సర్‌ తరహా మార్పా? కాదా? అన్నది కచ్చితంగా నిర్ధారించుకునేందుకు మరిన్ని పరీక్షలు చెయ్యాల్సి ఉంటుంది. వీటిలో ముఖ్యమైనది : కాల్పోస్కోప్‌. ఇది కెమేరా గొట్టం వంటిది. దీనితో సర్విక్స్‌ను, యోని మార్గాన్ని, అక్కడి కణజాలాన్ని పెద్దగా చేసుకుని చూస్తూ… ఎక్కడైనా అనుమానంగా అనిపిస్తే అక్కడి నుంచి చిన్న ముక్క తీసి… పరీక్షకు పంపిస్తారు. దీనిలో అది క్యాన్సరా? కాదా? క్యాన్సరే అయితే ఏ దశలో ఉందన్నది కచ్చితంగా నిర్ధారణ అవుతుంది. ఇలా గుర్తించటం వల్ల క్యాన్సర్‌ మార్పులను ముందే కనిపెట్టవచ్చు.
30ల నుంచే మేలు!
చాలా క్యాన్సర్లు పెద్ద వయసులో ఎక్కువగా కనబడుతుంటాయి. కానీ ఈ సర్వైకల్‌ క్యాన్సర్‌ మాత్రం.. కాస్త ముందుగానే… సగటున 40-45 ఏళ్ల వయసులోనే కనబడుతుంటుంది. అంటే వీరిలో అప్పటికి 10 ఏళ్ల క్రితమే ‘ప్రీక్యాన్సర్‌’ మార్పులు మొదలయ్యాయని అర్థం. అందుకే 30 ఏళ్లు దాటిన దగ్గరి నుంచీ క్రమం తప్పకుండా స్క్రీనింగ్‌ పరీక్షలు చేయించుకోమని సూచిస్తున్నారు.
చికిత్స
అసలు హెచ్‌పీవీ ఇన్ఫెక్షన్‌ దశ లోనే గుర్తించ గలిగితే.. ఏ చికిత్సా అక్కర్లేదు… చక్కటి ఆరోగ్యకరమైన జీవనశైలి అనుసరిస్తుంటే సరిపోతుంది. కాకపోతే క్యాన్సర్‌ మార్పులేమైనా ? అన్నది తెలుసుకునేందుకు ఏడాదికి ఒకసారైనా పరీక్షలు మాత్రం చేయించుకుంటూ ఉండాలి.
ప్రీక్యాన్సర్‌ దశలో : ఈ దశలో చాలా తేలికపాటి చికిత్స చేస్తే సరిపోతుంది. వీటికి పెద్దగా ఖర్చవ్వదు. ఆసుపత్రిలో చేరాల్సిన అవసరమూ ఉండదు. కేవలం క్రయోథెరపీ (ఐస్‌ పెట్టటం), లేదంటే లీప్‌ (లూప్‌ ఎలక్ట్రో సర్జికల్‌ వైడ్‌ ఎక్సిషన్‌) వంటి చిన్న చిన్న విధానాల ద్వారా… 90% సంపూర్ణంగా నయమైపోతుంది. ఆ తర్వాత ఏడాదికి ఒకసారి స్క్రీనింగ్‌ పరీక్ష చేయించుకుంటే చాలు. ఒకవేళ సర్విక్స్‌ మీద చాలా పెద్ద భాగంలో మార్పులు వచ్చి… ఇతరత్రా కూడా సమస్యలున్నా.. ఈ సాధారణ చికిత్సలు చేసే అవకాశం లేకపోయినా.. అలాంటి పరిస్థితుల్లోనే సర్విక్స్‌తో సహా గర్భాశయాన్ని తొలగించే (హిస్ట్రెక్టమీ) ఆపరేషన్‌ గురించి ఆలోచిస్తారు. కేవలం పుండు ఉందని గర్భాశయం తీసెయ్యాలన్నది మాత్రం అపోహ, తప్పుడు అభిప్రాయం. ఈ దశలో ఐస్‌ పెట్టటం వంటి తేలిక చికిత్సలే సరిపోతాయి.
క్యాన్సర్‌ దశలో : ఒకసారి క్యాన్సర్‌ దశలోకి వెళితే తీవ్రమైన చికిత్సలు తప్పవు. క్యాన్సర్‌ కణాలు రక్తం ద్వారా ఒళ్లంతా వ్యాపిస్తాయి. కాబట్ట వాటిని నిర్వీర్యం చేసేందుకు రేడియేషన్‌, కీమోథెరపీ, వీటితో పాటు సర్విక్స్‌, గర్భాశయాలే కాదు.. చుట్టుపక్కల ఉండే కణజాలం, లింఫ్‌ గ్రంథుల వంటివన్నీటిని కూడా తొలగించే ర్యాడికల్‌ సర్జరీ వంటివి అవసరమవుతాయి. దశలు ముదిరిన కొద్దీ… సర్జరీ కష్టం. రేడియేషన్‌ వంటివే ఉపయోగపడతాయి. వీటి వల్ల దుష్ప్రభావాలు చాలా ఎక్కువ. పైగా స్పందన ఎలా ఉంటుందో చెప్పలేం, తగ్గినా తిరిగి వచ్చే అవకాశాలుంటాయి. ఇక స్టేజ్‌-4లో అయితే.. తాత్కాలిక ఉపశమనానికి, నొప్పులు తగ్గేందుకు సాధారణ చికిత్సల వంటివి తప్పించి ప్రత్యేకంగా క్యాన్సర్‌ తగ్గించేందుకు ఆ దశలో చెయ్యగలిగింది చాలా తక్కువ.
ముందస్తు హెచ్చరిక…ప్రీక్యాన్సర్‌!
చాలా రకాల క్యాన్సర్ల విషయంలో.. అది వచ్చిన తర్వాత సాధ్యమైనంత తొలి దశలో గుర్తించటమేగానీ అది రాక ముందే పట్టుకునే అవకాశం ఇప్పటి వరకూ లేదు. కానీ అదృష్టవశాత్తూ ఈ సర్వైకల్‌ క్యాన్సర్‌ విషయంలో మాత్రం దీన్ని ‘ప్రీక్యాన్సర్‌’ దశలోనే గుర్తించే వీలుంది. ఇలా గుర్తిస్తే వెంటనే సంపూర్ణంగా నయం చెయ్యచ్చు కూడా. పరీక్షల ద్వారా మాత్రమే దీన్ని కనిపెట్ట వచ్చు. అయితే బాధలేమీ ఉండకపోవటం, ఆరోగ్యంగానే తిరుగుతుండటం వల్ల స్త్రీలంతా దీని విషయంలో అశ్రద్ధ, నిర్లక్ష్యం చూపిస్తుంటారు. ఈ చిన్న నిర్లక్ష్యం పెను ముప్పు తెచ్చి పెడుతుంది.
లక్షణాలు లేకపోవటం పెద్ద సమస్య
ప్రీక్యాన్సర్‌ దశలో : ఏమీ లక్షణాలుండవు. వైద్యులు చూసినా కూడా ఏమీ తెలియదు. కేవలం ‘పాప్‌ స్మియర్‌’ వంటి పరీక్షల్లో మాత్రమే ఈ దశలో గుర్తించే వీలుంది.
క్యాన్సర్‌ తొలి దశలో : చాలాసార్లు ఏ లక్షణాలూ ఉండవు. మనుషులు ఆరోగ్యం గానే తిరుగుతుంటారు. కేవలం పాప్‌స్మియర్‌, కాల్పోస్కోప్‌ పరీక్షల్లో మాత్రమే దాన్ని చూడటం సాధ్యపడుతుంది.
ముదిరిన దశలో : కొద్దికొద్దిగా రక్తస్రావం కావటం, దుర్వాసనతో తెలుపు వంటి సాధారణ లక్షణాలే ఉంటాయి. సర్విక్స్‌ మీద పుండ్లు, గడ్డల వంటివి ఉండొచ్చుగానీ మొత్తానికి ఈ లక్షణాలు కనిపించే సరికే సమస్య ముదిరిందని అర్థం. అసలీ దశ వరకూ రాకుండా చూసుకోవటమే అత్యుత్తమ విధానం.
టీకాలు
గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్‌ రాకుండా అదృష్టవశాత్తూ టీకాలు (గర్డాసిల్‌/సర్వారిక్స్‌) అందుబాటులోకి వచ్చాయి. వీటితో హెచ్‌పీవీ 16, 18 ఉప రకాల నుంచి రక్షణ ఉంటుంది, ప్రపంచవ్యాప్తంగా టీకాలను అత్యుత్తమ నివారణ విధానంగా అనుసరిస్తున్నారు. ఆడపిల్లలంతా తప్పనిసరిగా తీసుకోవాల్సిన టీకాల్లో దీన్నీ చేర్చారు. కానీ మన దేశంలో మాత్రం రకరకాల అపోహలు, చర్చోపచర్చల కారణంగా… ప్రస్తుతం దీని వినియోగం కాస్త వెనకబాట పట్టింది. శాస్త్రీయంగా చూసినప్పుడు క్యాన్సర్‌ నివారణలో ఈ టీకాకు అత్యంత ప్రాముఖ్యం ఉంది. దీనిపై సంశయాలు పెట్టుకోవాల్సిన పని లేదు. దీన్ని లైంగిక జీవితం ఆరంభించక ముందే, 18 ఏళ్ల లోపే తీసుకోవటం ఉత్తమం.

బ్రెస్ట్‌ క్యాన్సర్

కణాల ఎదుగుదలను నియంత్రించే మరియు ఆరోగ్యంగా ఉండేట్లుగా చేసే జన్యువులలో అసాధారణ మార్పులు జరగటం వలన క్యాన్సర్‌ వస్తుంది. దేహంలో పెరిగే అన్ని రకాల కణుతులు / ట్యూమర్లు ప్రమాదకరం కాదు. క్యాన్సర్‌ కారకమైన ట్యూమర్లు స్థనాలలో వేగంగా విస్తరిస్తూ ఇతర కణాలను కూడా వ్యాధికి గురిచేస్తాయి.
స్థనాలలో పెరిగే ఈ ప్రమాదకర ట్యూమర్‌లను ”బ్రెస్ట్‌ క్యాన్సర్‌” అంటారు. సాధారణంగా బ్రెస్ట్‌ క్యాన్సర్‌ అనేది పాలను ఉత్పత్తి చేసే గ్రంధులలోని కణజాలంలోను లేదా గ్రంథుల నుండి చనుమొనలకు పాలను సరఫరా చేసే నాళాలలోను వస్తుంది. అతి కొద్దిమందిలో స్థానాల కండరాలకు కూడా వచ్చే అవకాశం ఉంది.
90% వరకు క్యాన్సర్‌ అనేది వయసు ప్రభావం వలన జన్యువులలో కలిగే అసాధారణ మార్పులవల్ల వస్తుంది. కేవలం 10% మందిలో వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంది.
చాలా వరకు క్యాన్సర్‌ కారకాలు మన నియంత్రణలో ఉండవు ఉదాహరణకు వయస్సు, కుటుంబ నేపధ్యం, ఆరోగ్య నేపధ్యం, మొదలైనవి. కాని అధిక బరువు వ్యాయామం, మధ్యపానం వంటి కారకాలను మనం నియంత్రించవచ్చు.
నియంత్రించగలిగే కారకాలు :
బరువు: అధిక బరువు కలిగిన మహిళలకు మరీ ముఖ్యంగా మెనోపాజ్‌ దాటిన వారికి క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
ఆహారం : వైజ్ఞానికంగా నిరూపించాల్సి ఉన్నప్పటికీ, ఆహారపు అలవాట్ల వల్ల కూడా క్యాన్సర్‌ వస్తుందనేది నిపుణుల భావన. మాంసాహారం, జంతు సంబంధిత కొవ్వు పదార్థాల వినియోగం తగ్గించడం మంచిది. ఎందుకంటే వీటిలో వివిధ రకాల హార్మోనులు, యాంటిబయెటిక్స్‌, పురుగు మందుల అవశేషాలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. తక్కువ కొవ్వుశాతం గల తాజా కూరగాయలు, పండ్లు వంటివి ఎక్కువగా తీసుకోవాలి.
వ్యాయామం: వ్యాయామం వల్ల క్యాన్సర్‌ అవకాశాలు చాలా వరకు తగ్గుతాయి. ప్రతిరోజూ కనీసం 45నుండి 60 నిమిషాలు వ్యాయామం చేయటం ఉత్తమం.
మధ్యపానం: మద్యపానం వలన రక్తంలో ఈస్ట్రోజోన్‌ హార్మోన్‌ స్థాయి పడిపోతుంది. దాని వలన క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఎక్కువ. కాబట్టి మద్యపానానికి దూరంగా ఉండటం మంచిది.
ధూమపానం : ధూమపానం వలన కూడా క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఉంటుంది.
ఈస్ట్రోజోన్‌ : ఈస్ట్రోజోన్‌ హార్మోన్‌ స్థనాల పెరుగుదలకు తోడ్పడుతుంది. దీర్ఘకాలం పాటు బయటనుండి ఈస్ట్రోజోన్‌ హార్మోన్‌ తీసుకోవటం వలన బ్రెస్ట్‌ క్యాన్సర్‌ పెరిగే అవకాశాలు ఎక్కువ. ఎక్కువకాలం కంబైన్డ్‌ హార్మోన్‌ రీప్లేస్‌మెంట్ థెరపిని తీసుకోవటం వలన లేదా కేవలం ఈస్ట్రోజోన్‌ హార్మోన్‌ రీప్లేస్‌మెట్ ను 10 సంవత్సరాల కంటే ఎక్కువకాలం ఎటువంటి విరామం లేకుండా తీసుకోవడం వలన క్యాన్యర్‌ వచ్చే అవకాశాలు ఎక్కువ. స్ట్రెస్‌ మరియి యాంగ్జౖటీ: స్ట్రెస్‌ మరియు యాంగ్టౖటీ అనేవి క్యాన్సర్‌ కారకాలుగా వైజ్ఞానికంగా నిరూపించబడనప్పటికీ మానసిక వత్తిడి, ఆందోళలను తగ్గించుకోవటం వలన సుఖమయ జీవితాన్ని గడపవచ్చు.
క్యాన్సర్‌ను నియంత్రించలేని కారణాలు:
వయస్సు : వయస్సు అనేది మరొక పెద్ద క్యాన్సర్‌ కారకం. మీవయస్సు ఎంత ఎక్కువగా ఉంటే క్యాన్సర్‌ వచ్చే అవకాశం అంత ఎక్కువగా ఉంటుంది. నిపుణుల అధ్యయనంలో తేలినది 30 నుండి 39 సంవత్సరాల వయస్సు గల స్త్రీలలో ప్రతి 233 మందిలో ఒకరికి బ్రెస్ట్‌ క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఉంది. అయితే వయస్సు 60 పై బడిన స్త్రీలలో ప్రతి 27 మందిలో ఒకరికి బ్రెస్ట్‌ క్యాన్సర్‌ వస్తుంది.
కుటుంబనేపధ్యం : మీ దగ్గరి బంధువులకు (అమ్మ, సోదరి, కూతురు) క్యాన్సర్‌ ఉన్న ట్లైతే మీకు కూడా క్యాన్సర్‌ వచ్చే అవకాశం మరింత పెరుగుతుంది.
వ్యక్తిగత నేపథ్యం : మీకు ఇదివరకే బ్రెస్ట్‌ క్యాన్సర్‌ ఉన్నట్లేౖతే అదే బ్రెస్ట్‌లో కానీ, ప్రక్క బ్రెస్ట్‌లో కానీ మరల క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
జాతి : నల్లజాతి స్త్రీలతో పోలిస్తే తెల్లజాతి స్త్రీలలో బ్రెస్ట్‌ క్యాన్సర్‌ వచ్చే అవకాశం మరింత ఎక్కువ.
ఈస్ట్రోజన్‌: ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ స్థనాల్లోని కణాలను ఉత్తేజ పరుస్తుంది. దీర్ఘకాలంపాటు ఈస్ట్రోజన్‌ హార్మోన్‌కు గురికావటం వలన బ్రెస్ట్‌ క్యాన్సర్‌ పెరిగే అవకాశం ఎక్కువ.
అయితే ఈస్ట్రోజన్‌ నియంత్రించడం అనేది కొన్నిసార్లు మన చేతుల్లో ఉండదు. ఉదాహరణకు చిన్న వయసులోనే అంటే 12 సంవత్సరాలకన్నా తక్కువ వయస్సులోనే నెలసరి ప్రారంభం కావటం అదే విధంగా 55 సంవత్సరాల తరువాత బహిష్టు ఉడిగిపోవడం (మోనోపాజ్‌) అంటే దీర్ఘకాలం పాటు నెలసరి కొనసాగితే క్యాన్సర్‌ వచ్చే అవకాశం కూడా అంత ఎక్కువే. అదే విధంగా బయటి వాతావరణం నుండి శరీరంలోని ప్రవేశించే ఈస్ట్రోజన్‌ ఉదా : మాంసాహారంలో ఉండే హార్మోన్‌లు, ఇతర ఆహారాలలో ఉండే పురుగు మందుల అవశేషాలు మన శరీరంలో ఈస్ట్రోజన్‌ను పోలిన అవశేషాలను విడుదల చేస్తాయి.
గర్భం మరియు స్థనపానం : గర్భం మరియు స్థనపానం అనేవి నెలసరుల సంఖ్యను తగ్గిస్తాయి. తద్వారా క్యాన్సర్‌ ముప్పును కూడా తగ్గిస్తాయి. 30 సంవత్సరాలు పైబడే వరకు గర్భం ధరించని స్త్రీలకు లేదా అసలు గర్భం ధరించని స్త్రీలకు బ్రెస్ట్‌ క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఎక్కువ.
దీర్ఘకాలం అంటే ఒకటి నుండి ఒకటిన్నర లేదా రెండు సంవత్సరాల వరకు పాలు ఇచ్చే తల్లులకు కూడా బ్రెస్ట్‌ క్యాన్సర్‌ వచ్చే అవకాశం తక్కువ. అయితే అంత సుదీర్ఘ కాలం పాటు పాలు ఇవ్వడం ఈ రోజులలో సాధ్యం కావడం లేదు. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికిని (మంచి ఆహారపుటలవాట్లు, వ్యాయామం) మన చేతిలో లేని పైన పేర్కొన్న అనేక రకాల కారణాలవలన బ్రెస్ట్‌ క్యాన్సర్‌ వస్తుంది. బ్రెస్ట్‌ క్యాన్సర్‌ వచ్చినపుడు అదేదో మనం చేసిన తప్పిదం వలన వచ్చినట్లుగా కృంగిపోవటం తగదు.
సాధారణంగా బ్రెస్ట్‌ క్యాన్సర్‌ అనేది కణుతుల రూపంలో బయటపడుతుంది. ఈ కణుతులు నొప్పిలేకుండాను, గట్టిగాను, సమానమైన అంచులు లేకుండా ఉంటాయి. మరికొన్ని సార్లు మొత్తగాను, సమానంగాను ఉంటాయి, కాబట్టి స్థనాలలో ఏమాత్రం మార్పు కనిపించినా వెంటనే డాక్టరుకు చూపించుకోవటం మంచిది, సాధారణంగా బ్రెస్ట్‌ క్యాన్సర్‌ సోకినపుడు ఈ క్రింద పేర్కొన్న విధంగా మార్పులు సంభవిస్తాయి.
1. స్థనాలలో వాపు, ఇరిటేషన్‌, స్థనాలలో నొప్పి, చనుమొనలలో నొప్పి చనుమొనలు లోపలికి కృంగిపోవటం, ఎరుపెక్కటం, స్థనాలు, చనుమొనలు మొద్దుబారిపోవటం, చనుమొనల నుండి పాలు కాకుండా ఇతర ద్రవాలు స్రవించడం, చంకలు క్రింది భాగంలో గడ్డలు ఉండటం మొదలైనవి.
అయితే అన్ని రకాల గడ్డలు క్యాన్సర్‌ కాకపోవచ్చు. డాక్టర్‌చే క్షుణ్ణంగా పరీక్ష చేయించుకుని నిర్థారించుకోవటం మంచిది.
క్యాన్సర్‌ను ఎంత ముందుగా గుర్తిస్తే అంత సులువుగా చికిత్స చేయవచ్చు. క్యాన్సర్‌ను ముందుగా గుర్తించడానికి ఎప్పటికప్పుడు పరీక్షించుకోవటం ఉత్తమమైన మార్గం. 20 సంవత్సరాలు దాటిన స్త్రీలు ప్రతి నెలా స్థనాలను స్వయంగా పరీక్షించుకోవాలి.20-40 సవంత్సరాల వయస్సు గల స్త్రీలు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి డాక్టర్‌చే స్థనాలను పరీక్ష చేయుంచుకోవాలి. 40 సం.లు దాటిన స్త్రీలు ప్రతి సంవత్సరం పరీక్ష చేయించుకోవాలి. 40-49 సంవత్సరాలు వయస్సు గల స్త్రీలు ప్రతి రెండు సంవత్సరాలకు డిజిటల్‌ మమ్మోగ్రఫీ ద్వారా పరీక్ష చేయించుకోవాలి. 50 ఏళ్ళ పైబడిన స్త్రీలు ప్రతి సంవత్సరం మమ్మోగ్రఫీ పరీక్ష చేయించుకోవాలి.
డిజిటల్‌ మమ్మోగ్రఫి అనేది డిజిటల్‌ రెసెస్టర్‌ మరియు కంప్యూటర్‌కి అనుసంధానిచ్చిన ఆధునిక ఎక్స్‌రే మెషీన్‌. దీని ద్వారా అత్యంత సులువుగా, వేగంగా బయాప్సీ చేయవచ్చు. మరీ ముఖ్యంగా ఇపుడు వస్తున్న ఆధునాతన డిజిటల్‌ మమ్మోగ్రఫీ మెషిన్స్‌లో వచ్చే బెడ్‌ వల్ల కూర్చుని లేదా పడుకుని కూడా అత్యంత వేగంగా బయాప్సీనీ సేకరించవచ్చు. మోమ్మోమ్‌ వంటి వాక్యూమ్‌ పవర్డ్‌ పరికరాల వలన అత్యంత ఖచ్చితంగా మల్టిపుల్‌ బయాప్సీ చేయవచ్చు.

డెలివరీ అలారం, ప్రసవవేదన

ప్రకృతి అత్యద్భుతమైనది. నలుసు కడుపున పడిన సమయం నుంచి కావలసినవన్ని, గర్భంలోనే సమకూర్చి పెట్టేలా ఏర్పాటు చేసింది. నలభై వారాలు కడుపులో ఉన్నా పర్లేదు కాని.. నాలుగు నిమిషాలు ఆలస్యం అయితే బిడ్డకు అనేక సమస్యలు. అందుకే బిడ్డ పుట్టుకను ఆలస్యం కాకుండా చూసేలా ఒక హెచ్చరికలాంటి వేదనను ఏర్పాటు చేసింది. అదే ప్రసవవేదన. కాన్పు సమయంలో వచ్చే ఆ నొప్పులు ఏమిటో, కాన్పు ఎందుకు ఆసుపత్రిలో అయ్యేలా చూసుకోవాలో, అలా చూసుకోకపోతే వచ్చే సమస్యలు…
తల్లి గర్భాశయం నుంచి బిడ్డను బయటకు నెట్టే ప్రక్రియను ప్రసవం లేదా డెలివరీ అంటారు. ప్రసవ సమయంలో బిడ్డ యోనిమార్గం ద్వారా బయటకు వస్తే దాన్ని సాధారణ ప్రసవం అని, లేదా శస్త్రచికిత్స ద్వారా బిడ్డను బయటకు తీసుకురావడాన్ని సిజేరియన్‌ డెలివరీ అంటారు. ఒకవేళ నెలలు పూర్తిగా నిండక మునుపే… అంటే 37 వారాలకు మందే ప్రసవం జరిగితే దాన్ని ‘ప్రీమెచ్యూర్‌’ డెలివరీ అంటారు.
తల్లి గర్భాశయం నుంచి బిడ్డను, ఉమ్మనీటి పొరను, మాయను, యోనిమార్గనుంచి బయటకు తీసువచ్చేందుకు వీలుగా జననాంగాల్లో జరిగే మార్పుల తీరును లేబర్‌ అని, ఆ సమయంలో వచ్చే నొప్పులను ప్రసవ వేదన అంటారు.
నొప్పులు ఎప్పుడు : తల్లి కడుపులో బిడ్డ పడినప్పటి నుంచి బయటకు వచ్చేందుకు పట్టే వ్యవధిని అంచనా వేయడానికి ఒక ఉజ్జాయింపు లెక్క కడతారు. చివరిసారిగా రుతుస్రావం అయిన తేదీ నుంచి బిడ్డ బయటకు రావడానికి 280 రోజులు వ్యవధి పడుతుంది. వారాల్లో చెప్పాలంటే 40 వారాలు, నెలల్లో చెప్పాలంటే తొమ్మిది నెలలు పూర్తయ్యాక వారం రోజుల వ్యవధి పడుతుంది. దీని ఆధారంగా ప్రసవం అయ్యే తేదీని డాక్టర్లు ఉజ్టాయింపుగా చెబుతారు.
ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి రెండువారాలు ముందుగా లేదా మరికొందరిలో ఒకవారం ముందుగా లేదా మరికొందరిలో సరిగ్గా ప్రసవం అయ్యే సమయానికి నొప్పులు రావచ్చు.
సాధారణ ప్రసవం : నొప్పులు వాటంతట అవే ప్రారంభమై, గర్భాశయ ముఖద్వారంలో బిడ్డ తల కిందివైపునకు ఉండటం, బిడ్డ బయటకు వచ్చే ప్రక్రియ మరీ ఆలస్యం కాకుండా బయటి ప్రమేయాలతో బిడ్డ బయటకు వచ్చి,తల్లికీ, బిడ్డకూ ఎలాంటి హాని జరుగకపోతే దాన్ని సాధారణ ప్రసవంగా చెప్పవచ్చు.
అబ్‌నార్మల్‌ లేబర్‌ : సాధారణ ప్రసవం సమయంలో ఉండాల్సిన ఏ అంశమూ సవ్యంగా లేకుండా ఉంటే దాన్ని అబ్‌నార్మల్‌ లేబర్‌గా పేర్కొనవచ్చు అంటే జనన మార్గంలో బిడ్డ తలకింది వైపునకు తిరగకుండా ఉండటం,లేదా ఏదైనా అవరోధం వల్ల ప్రసవానికి ఆటంకం కలగడం, తల్లి, బిడ్డ ఈ రెండు ప్రాణాల్లో దేనికైనా ప్రమాదం జరిగే పరిస్థితి ఉండటాన్ని అబ్‌నార్మల్‌ లేబర్‌గా పేర్కొనవచ్చు.
కాన్పునొప్పులకు ముందు : గర్భాశయంలోని బిడ్డ నుంచి ఏసిటిహెచ్‌, కార్డిసోలఠ్‌ అనే హార్మోన్లు విడుదలై అవి తల్లి నుంచి స్రవించే ప్రోస్టాగ్లాండిన్స్‌, ఈస్ట్రోజెన్‌, ఆక్సిటోసిన్‌ వంటి హార్మోన్లను ఉత్తేజితం చేస్తాయి. గర్భాశయం కుంచించుకుపోవటంతో కాన్పునొప్పులు మొదలవుతాయి.
కాన్పు నొప్పులు ప్రారంభమైనపుడు నొప్పులు నెమ్మదిగా మొదలై క్రమంగా తీవ్రమవుతాయి.
ప్రసవ క్రమం: ఆ తర్వాత గర్భాశయం ముఖద్వారం విచ్చుకోవటం మొదలవుతుంది. దీనివల్ల అక్కడ ఉండే ఉమ్మనీటి పొరలు, చిన్న రక్తనాళాలు చిట్లి కొంత తెలుపుతో పాటు అవి యోని మార్గం నుంచి బయటకు స్రవిస్తాయి. దీనే షో అంటారు. ఇక ఆ తర్వాత ఉమ్మనీటి పొర సర్విక్స్‌లోకి ఉబ్బుతుంది. కొందరిలో ఉమ్మనీటి పొర చిట్లి ఉమ్మనీరు వేగంగా బయటకు వస్తుంది. ఈ క్రమంలో శిశువు తల కిందకు దిగుతుంది.
శిశువును బయటకు తీసుకువచ్చే నొప్పులను పవర్‌ అని శిశువును ప్యాసెంజర్‌ అని, బిడ్డ వచ్చే మార్గాన్ని ప్యాసేజ్‌ అంటారు. సాధారణ డెలివరి పవర్‌ ప్యాసెంజర్‌, ప్యాసేజ్‌ అన్ని బిడ్డ బయటకు రావడానికి అనువుగా ఉండాలి.
పవర్‌ నొప్పులు : కాన్పు నొప్పులు మొదట్లో పది నిమిషాలకు ఒకమారు వచ్చి.. వచ్చినపుడల్లా 10…20 సెకన్లు ఉంటాయి. ఇవి మొదట్లో 10-15 నిమిషాలకు ఒకసారి వచ్చి… వచ్చినపుడు 20-30 సెకన్లు కొనసాగుతాయి. కొందరిలో మరింత ఎక్కువసేపు ఉంటాయి. ఈ నొప్పులు నడుములో ప్రారంభమై,పొత్తి కడుపునుంచి, తొడలలోకి పాకుతున్నట్లుగా వస్తాయి. లేబర్‌ చివర్లో 30-40 సెకన్లుపాటు ఉంటాయి. ప్రసవం సమయంలో గర్భాశయ కండరాలు ముడుచుకునిపోతూ. సాగుతూ, గర్భాశయ ముఖద్వారం తెరచుకుంటూ ఉండటం వల్ల వస్తాయి.బిడ్డ బయటకు వచ్చేందుకు తల్లికూడా సహకరించి పొట్ట కండరాలను బలంగా బిగబట్టటంతో బిడ్డ బయటకు వస్తుంది.
జననమార్గం: శిశువు గర్భాశయం నుంచి బయటకు రావాలంటే పెల్విన్‌ అనే ఎముకలనుంచి రావాల్సి ఉంటుంది. ఈ మార్గం శిశువు పరిమాణానికి సరిపడా ఉంటేనే బిడ్డ బయటకు రాగలుగుతుంది.
శిశువు : బిడ్డ బరువు, పొజిషన్‌, ప్రజెంటేషన్‌ అంటే, గర్భాశయం కిందివైపునకు బిడ్డ ఉందా మరే అవయవమైనా ఉందా అనే అంశాలపై కూడా ప్రసవం ఆధారపడి ఉంటుంది.
ప్రసవ దశలు : నాలుగు దశలుగా విభజింపవచ్చు.
మొదటి దశ : నిజమైన కాన్పునొప్పులు మొదలైన దగ్గర నుంచి గర్భాశయ ముఖద్వారం పూర్తిగా విచ్చుకునే వరకు ఉండే దశను మొదటి దశగా చెప్పవచ్చు. ఈ దశ వ్యవధి తొలిచూలు వారిలో 12 గంటలు ఉంటే, మలిచూలు వారిలో 6 గంటలు ఉండవచ్చు.
రెండో దశ : ఇది గర్భశయ ముఖద్వారం పూర్తిగా విచ్చుకున్న దగ్గర నుంచి బిడ్డ బయటకు వచ్చే వరకు ఉంటుంది. మొదటి కాన్పు వారికి గంట నుంచి రెండు గంటలు వరకు తర్వాత కాన్పులలో అరగంట వరకు ఈ దశ కొనసాగుతుంటుంది.
మూడో దశ : బిడ్డ పుట్టినప్పటి నుంచి, మాయ బయటపడే వరకు ఉండే దశ ఇది. దీనికి 15 నిమిషాలు పడుతుంది.
నాలుగో దశ : మూడో దశ తర్వాత ఒక గంటపాటు నిపుణుల పర్వవేక్షణలో ఉంచాల్సిన దశగా దీన్ని అభివర్ణించవచ్చు. ఈ దశలో తల్లి బి.పీ, పల్స్‌ రేట్, బ్లీడింగ్‌ వంటివి పరిశీలిస్తూ ఉండాలి.
చాలామందిలో కాన్పుకి రెండు మూడు వారాల ముందునుంచే కడుపు కొంచెం గట్టిగా, వదులుగా అవుతూ ఉంటుంది. ఇలాంటి సమయంలో వచ్చే నొప్పులను కాన్పు నొప్పుల్లా అనిపించే నొప్పులు లేదా ఫాల్స్‌ లేబర్‌ పెయిన్స్‌ అంటారు. నిజమైన కాన్పు నొప్పులకు, ఫాల్స్‌ ఫెయిన్స్‌కు తేడా ఇలా.. నిజమైన నొప్పులు: ప్రసవం మొదలయ్యే టైమ్‌కు వస్తాయి. నొప్పులు క్రమబద్ధంగా, కొద్ది కొద్ది విరామాలతో వస్తూ, క్రమంగా నొప్పి వచ్చే వ్యవధి పెరుగుతూ ఉంటుంది. నొప్పి నడుములో మొదలై పొత్తికడుపులోకి వస్తుంది. గర్భాశయం కండరాలు సమర్థంగా ముడుచుకుంటూ, సర్విక్స్‌ మెత్తబడి విచ్చుకోవటం మొదలవుతుంది.
ఉమ్మనీటి పొరలు, చిన్న రక్తనాళాలు చిట్లి, కొంత తెలుపుతో పాటు రక్తం బయటకు స్రవించే షో మొదలవుతుంది. నొప్పి ఉపశమించేందుకు ఇచ్చే మందులు, ఎనిమా వంటివి ఇస్తే నొప్పులు తగ్గవు.
కాన్పునొప్పుల్లా అనిపించేవి : ప్రసవానికి చాలా రోజుల ముందు నుంచే వస్తాయి. నొప్పి రావడం క్రమబద్ధంగా ఉండదు. నొప్పి తీవ్రతల్లో మార్పు ఉండదు. నొప్పి చాలావరకు పొత్తికడుపులోనే ఉంటుంది. గర్భాశయం కండరాలు ముడుచుకోవడం ఉంటుంది గానీ, సర్విక్స్‌ లో మార్పు ఉండదు. షో ఉండదు. ఉపశమన మందులు, ఎనీమాతో నొప్పులు తగ్గుతాయి.

స్త్రీలు చేయుంచుకోవాలసిన కొన్ని ముఖ్యమైన పరీక్షలు

Pop Smear Test….పాప్స్మియర్

గర్భాశయ ముఖద్వారానికి వచ్చే క్యాన్సర్ని గుర్తించడానికి చేసే చాలా ముఖ్యమైన పరీక్ష ఇది. ఇందులో గర్భాశయ ముఖద్వారం నుంచి కొన్ని కణాలను సేకరించి, పరీక్షిస్తారు. దీంతో క్యాన్సర్ రావడానికి ఐదు నుంచి పది సంవత్సరాల ముందుగానే గుర్తించవచ్చు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ భారతీయ స్త్రీలల్లో అత్యంత సాధారణంగా కనిపిస్తుంది. అందుకే కలయిక మొదలుపెట్టిన సంవత్సరం తరువాత నుంచీ, లేదా ఇరవై ఒక్క సంవత్సరాల నుంచీ చేయించుకోవటం మంచిది. ప్రతి రెండు మూడు సంవత్సరాలకోసారి చేయించుకుంటూ ఉండాలి. అప్పుడే క్యాన్సర్ను ముందుగా గుర్తించి, రాకుండానే నివారించవచ్చు. ఇప్పుడు మనకు పాప్స్మియర్తోపాటు హెచ్పీవీ (హ్యూమన్పాపిలోమా వైరస్) పరీక్ష కూడా అందుబాటులో ఉంది. దీన్ని ఐదేళ్లకోసారి చేయించుకుంటే క్యాన్సర్ ముప్పును ముందుగానే పసిగట్టవచ్చు.

Mammography test …మామోగ్రాఫీ

దీనిద్వారా రొమ్ముక్యాన్సర్ని ప్రారంభదశలోనే గుర్తించొచ్చు. సాధారణంగా అయితే దీన్ని నలభై ఏళ్ల నుంచీ చేయించుకోవాలి. అయితే కుటుంబంలో ఎవరైనా క్యాన్సర్ బాధితులు ఉన్నా… రిస్క్ఫ్యాక్టర్స్ ఉంటే గనుక అంతకన్నా ముందునుంచీ చేయించుకోవాలి. అలాగే ప్రతి రెండుమూడేళ్లకోసారి చేయించుకోవాలి. దీన్ని ప్రత్యేకమైన ఎక్సరే, ఆ తరువాత అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా చేస్తారు. అలాగే స్వీయ రొమ్ము పరీక్ష చేసుకోవడం కూడా తెలిసుండాలి. నెలసరి అయిపోయిన వెంటనే రొమ్ముల్ని చేతులతో తాకి పరీక్షించుకోవడం వల్ల తేడాలు ఏమైనా ఉంటే గమనించుకోవచ్చు.

Bowel Cancer…బవెల్ క్యాన్సర్

ఇది పేగులకు సంబంధించిన క్యాన్సర్. మలంలో రక్తం పోవడాన్ని గుర్తించే అక్కల్ట్ బ్లడ్ టెస్ట్ చేయడం వల్ల దీన్ని గుర్తించొచ్చు. ఆ రిస్క్ ఉన్నవారు రెండేళ్లకోసారి చేయించుకోవడం మంచిది.

Bone Density test….ఎముకల దృఢత్వం కోసం

వయసుపైబడిన స్త్రీలల్లో అత్యంత సాధారణంగా కనిపించే సమస్య ఆస్టియోపోరోసిస్. అంటే ఎముకలు గుల్లబారతాయి. ఏ మాత్రం జారి కిందపడినా, ఒక్కోసారి కాలు మెలికపడినా ఫ్రాక్చర్లు అవుతాయి. అందుకే బాగా సన్నగా ఉన్నవారూ, వయసు నలబైఅయిదు పైన ఉన్నవారూ, మెనోపాజ్ దశకు చేరుకున్నవారూ, ఉబ్బసంతో బాధపడేవారూ, స్టిరాయిడ్లు ఎక్కువగా తీసుకునేవారు కాస్త అప్రమత్తంగా ఉండాలి. ఇది జన్యుపరంగా కూడా రావచ్చు. మెనోపాజ్ తరువాత ప్రతి స్త్రీలో ఎముకల సాంద్రత తగ్గుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ బోన్డెన్సిటీ (డెక్సా) పరీక్ష చేయించుకోవాలి. ఒకవేళ ఎముకల దృఢంగా ఉంటే మూడేళ్ల తరువాత చేయించుకోవాలి.