అసలు మనకి జ్వరం ఎందుకు వస్తుంది? జ్వరం వచ్చినప్పుడు మన శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయి?

జ్వరం అనేది వ్యాధి కాదు. వ్యాధి లక్షణం. శరీరం లో ఏదయినా భాగానికి ఇన్ఫెక్షన్ సోకి నప్పుడు, కొన్ని సందర్భాలలో వైరస్ ల కారణం గాను జ్వరం వస్తుంది. ఇన్ఫెక్షన్ బాక్టీరియా వల్ల, కలుషితం అయిన ఆహారం, నీరు, వాతావరణం లో మార్పు ల వలన వస్తుంది. ముందు గా డాక్టర్ లు చేయవలసినది, ఎందుకు జ్వరం వచ్చింది పరిశీ లించడం.తరువాత తగిన వైద్యం చెయ్యడం.

జ్వరం అంటే ఏమిటి? మన శరీర ఉష్ణోగ్రత సాధారణ పరిస్థితుల్లో 98.6° F, .37°C (సాధారణoగా కొద్దిపాటి తేడా ఉండచ్చు ) అది ఏ మాత్రం పెరిగినా జ్వరం అంటారు. శరీరం కాస్త వేడిగా ఉంటుంది. ఇది మరింత పెరిగితే వేడి మరికాస్త ఎక్కువ. దీనికి తోడుగా ఉండేది తలనొప్పి.ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దానితో పోరాడ డానికి రక్తం లోని సైన్యం (తెల్ల రక్త కణాలు )రడీ గా ఉంటుంది. ఆ పోరాటం లోనే జ్వరం వస్తుంది.

శరీర ఉష్ణోగ్రతను కంట్రోల్ చేసే మంచి మందు పారాసెటామోల్ (paracetamol ). ఇది crocin, Dolo, calpol తదితర పేర్ల తో దొరుకుతుంది. దీనితో పాటు ఇన్ఫెక్షన్ తగ్గటానికి ఆంటిబయోటిక్ ను డాక్టర్ లు వ్రాస్తారు. ఇవి పెన్సిలిన్ (amoxy cyllin, cipro floxacin etc) తరహా మందులు, సల్ఫా డ్రగ్స్ (septran etc )cefexime etc. వీటిని డాక్టర్ సలహా మీదే వాడండి.సాధారణ జ్వరం తగ్గుతుంది. ఏంటి బయోటిక్స్ 5 నుండి 7 రోజులు వాడాలి. జ్వరం తగ్గింది అని పూర్తి కోర్స్ వాడక పొతే ఇన్ఫెక్షన్ తిరగ బెడుతుంది. మందులు పూర్తి కోర్సు వాడాలి.

మలేరియా

దోమల నివారణ దోమలు కుట్టకుండా చూసుకోవటం ద్వారా వీటిని చాలావరకు నివారించుకోవచ్చు. ఒకవేళ మలేరియా వచ్చినా సరైన చికిత్స తీసుకుంటే పూర్తిగా బయటపడొచ్చు కూడా. కాకపోతే దీన్ని వీలైనంత త్వరగా గుర్తించి, చికిత్స ఆరంభించటం ముఖ్యం. అవసరమైనప్పుడు పూర్తికాలం మందులు వాడటమే కాదు.. డాక్టర్‌ సలహా లేకుండా అనవసరంగా, విచక్షణా రహితంగా మందులు వాడకపోవటం కూడా కీలకమే. లేకపోతే పరాన్నజీవి మలేరియా మందులను తట్టుకునే సామర్థ్యాన్ని సంతరించుకుంటుంది. సమస్య మరింత మొండిగానూ తయారవుతుంది. ఇప్పటికే మనదేశంలో ఇలాంటి పరిణామాలు మొదలయ్యాయి. వీటికితోడు ఇప్పుడు ఒకే దోమ రెండు, మూడు రకాల మలేరియా పరాన్నజీవులను మోసుకొస్తూ.. ‘మిశ్రమ ఇన్‌ఫెక్షన్‌’కూ దారితీస్తోంది. దీంతో ఒకేసారి రెండు, మూడు రకాల మలేరియా కూడా కనబడుతోంది. దీన్ని పోల్చుకోలేకపోవటం, సరిగా గుర్తించలేకపోవటం వల్ల తీవ్ర సమస్యగానూ మారుతోంది. చికిత్స కూడా కష్టమైపోతోంది.
ప్రధానంగా రెండు రకాలు
మలేరియా జ్వరానికి మూలకారణం ‘ప్లాస్మోడియం’ పరాన్నజీవి. ఇది ఆడ అనాఫిలెస్‌ దోమల ద్వారా వ్యాపిస్తుంది. దోమలు తమ గుడ్లను వృద్ధి చేసుకోవటానికి రక్తం అవసరం. అందుకే ఇవి మనుషులను కుడుతుంటాయి. ఈ క్రమంలో అప్పటికే మలేరియాతో బాధపడుతున్న వ్యక్తిని కుట్టిన దోమలు అనంతరం మరొకరిని కుట్టటం ద్వారా మలేరియా కారక పరాన్నజీవి మనుషులకు వ్యాపిస్తుంది. ఈ పరాన్నజీవిలో ఫాల్సిఫారమ్‌, వైవాక్స్‌, ఒవేల్‌, మలేరియే అని నాలుగు రకాలున్నాయి. ఒవేల్‌లో మళ్లీ రెండు రకాలు కనబడతాయి. వీటితో పాటు కోతుల్లో కనబడే నోవలేసే రకం కూడా ఇప్పుడు మనుషులకు విస్తరిస్తోంది. వీటన్నింటిలోనూ ఫాల్సిఫారమ్‌, వైవాక్స్‌లతో వచ్చే మలేరియాలే తరచుగా కనబడుతుంటాయి. వీటిల్లోనూ ఫాల్సిఫారమ్‌ మలేరియా ఇంకా ఎక్కువ.
ఉమ్మడిగా దాడి..
మలేరియాతో ముంచుకొస్తున్న మరో సమస్య ఒకేసారి రెండు, మూడు ప్లాస్మోడియం రకాలు దాడి చేస్తుండటం. దీన్నే మిశ్రమ ఇన్‌ఫెక్షన్‌ అంటున్నారు. ఒకప్పుడు అరుదని భావించేవారు కానీ ఇదిప్పుడు తరచుగానూ కనబడుతోంది. కొన్నిసార్లు ఒకే దోమలో ఫాల్సిఫారమ్‌, వైవాక్స్‌ వంటి రకాలు ఉండొచ్చు. ఇవి కలిసి దాడి చేయటమే మిశ్రమ ఇన్‌ఫెక్షన్‌కు దోహదం చేస్తోంది. సాధారణంగా చికిత్స తీసుకున్నాక ఫాల్సిఫారమ్‌ రకం మలేరియా తిరగబెట్టటమనేది అరుదు. అయితే కొందరిలో చికిత్సతో మలేరియా తగ్గినా మళ్లీ మళ్లీ వస్తుండటంతో దీనికి కారణమేంటనేదానిపై పరిశోధకులు అధ్యయనం చేశారు.
వీరిని మళ్లీ దోమ కుట్టిందా? కొత్తగా మళ్లీ ఇన్‌ఫెక్షన్‌ వచ్చిందా? అని పరిశీలించారు. అయితే మొదటిసారి దోమ కుట్టినపుడే ఒకటి కన్నా ఎక్కువ ప్లాస్మోడియం రకాలు ఒంట్లోకి ప్రవేశిస్తున్నట్టు బయటపడటం గమనార్హం. వీటిల్లో ఫాల్సిఫారమ్‌, వైవాక్స్‌ రకాలే ఎక్కువగా కనబడుతున్నాయి. తీవ్ర మలేరియా బారినపడుతున్నవారిలో సుమారు 5% మందిలో మిశ్రమ ఇన్‌ఫెక్షన్‌ ఉంటున్నట్టు కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
చలీ, వణుకు..
మలేరియాలో విపరీతమైన చలి, వణుకుతో తీవ్రమైన జ్వరం ముంచుకొస్తుంది. సాధారణంగా మలేరియా పరాన్నజీవి రక్తంలోకి ప్రవేశించాక కాలేయంలోకి చేరుకొని వృద్ధి చెందుతుంది. అక్కడ్నుంచి రక్తంలో కలిసిపోయి రక్తకణాలను విచ్ఛిన్నం చేస్తుంది. దీంతో విషతుల్యాలు విడుదలై చలి, వణుకు వంటివి మొదలవుతాయి. తలనొప్పి, ఒళ్లునొప్పులు, వాంతులు కూడా ఉండొచ్చు. చిన్నపిల్లల్లో కొందరికి నీళ్ల విరేచనాలూ కావొచ్చు. సమస్య తీవ్రమవుతున్నకొద్దీ రక్తహీనత, కామెర్ల వంటి సమస్యలూ వేధిస్తాయి. ఎర్రరక్తకణాలు విచ్ఛిన్నం కావటం వల్ల హిమోగ్లోబిన్‌ కిడ్నీల ద్వారా బయటకు రావొచ్చు. దీంతో మూత్రం నల్లగా రావొచ్చు.
ఒకప్పుడు గిరిజన ప్రాంతాలకే పరిమితమైన ఫాల్సిఫారమ్‌ ఇప్పుడు పట్టణ ప్రాంతాలకూ విస్తరించింది. ప్రస్తుతం నగరాల్లో ఫాల్సిఫారమ్‌ రకమే ఎక్కువగా కనబడుతోంది. ఇది వైవాక్స్‌ కన్నా ప్రమాదకరమైంది కూడా. దీంతో దుష్ప్రభావాలూ ఎక్కువే. కొందరిలో కాలేయం, కిడ్నీలు, మెదడు వంటి అవయవాలూ దెబ్బతినొచ్చు. అంతేకాదు… ఫాల్సిఫారమ్‌ పరాన్నజీవుల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయి కేశరక్తనాళికల్లో చిక్కుకుపోవచ్చు. దీంతో అవయవాలకు ఆక్సిజన్‌ తగ్గుతుంది. రక్తకణాలు విచ్ఛిన్నం కావటం వల్ల రక్తహీనత రావొచ్చు. కాలేయం నుంచి పిత్తాశయానికి వెళ్లే నాళాల్లో అడ్డంకులూ తలెత్తొచ్చు. కొన్నిసార్లు ఊపిరితిత్తులు దెబ్బతిని ఏఆర్‌డీఎస్‌ వచ్చి, పలు అవయవాలు పనిచేయలేని స్థితికి చేరుకోవచ్చు. దీన్ని గుర్తించి, సరైన చికిత్స అందించకపోతే ప్రాణాపాయానికి దారితీస్తుంది.
నివారణ కీలకం
మలేరియా నివారణకు దోమలు కుట్టకుండా చూసుకోవటం ఒక్కటే మార్గం. ఇందుకోసం..
* అందరూ దోమ తెరలు వాడుకోవాలి. కిటికీలకు జాలీలు బిగించుకోవాలి. తెరలు వేలాడదీయాలి.
* దోమలు కుట్టకుండా పొడవు చేతుల చొక్కాలు వేసుకోవాలి. దోమలు కుట్టకుండా చూసే పూత మందులు కూడా చర్మానికి రాసుకోవచ్చు.
* ఇప్పుడు దోమలను చంపే మందు పూత పూసిన దోమ తెరలు కూడా వస్తున్నాయి. మలేరియా ప్రబలంగా ఉన్న ప్రాంతాల్లో వీటిని వాడుకోవటం మంచిది.
* దోమలను చంపటానికి ఇంట్లో స్ప్రేలతో మందు (ఇండోర్‌ రెసిడ్యుయల్‌ స్ప్రేయింగ్‌- ఐఆర్‌ఎస్‌) కూడా చల్లుకోవచ్చు. వీటిని ఒకసారి చల్లితే 3-6 నెలల వరకూ పనిచేస్తాయి.
సమర్థవంత పరీక్షలున్నాయి
మలేరియాను కచ్చితంగా, త్వరగా గుర్తించటానికి పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. ర్యాపిడ్‌ డయాగ్నొస్టిక్‌ టెస్ట్‌ (ఆర్‌డీటీ) ప్యారాసైట్‌ ఎఫ్‌, వి ద్వారా ఫాల్సిఫారమ్‌, వైవాక్స్‌ రకం మలేరియాలను గుర్తించొచ్చు. మలేరియా పరాన్నజీవిలో కనబడే ప్రత్యేకమైన ప్రోటీన్‌ ఆధారంగా ఇది సమస్యను నిర్ధరిస్తుంది. రెండు కన్నా ఎక్కువ రకాల పరాన్నజీవులను గుర్తించటానికి ఇప్పుడు ‘పారామ్యాక్స్‌ కిట్‌’ కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ పరీక్షలకు పెద్దగా నైపుణ్యం అవసరం లేదు. ఎక్కడైనా చేయొచ్చు. ఖర్చు కూడా తక్కువ. వీటితో ఎలాంటి రకం మలేరియానైనా చాలా త్వరగా, కచ్చితంగా, చవకగా నిర్ధరించటానికి వీలుంది.
* మనదేశంలో ఫాల్సిఫారమ్‌, వైవాక్స్‌ రకం మలేరియాలే తరచుగా కనబడుతుంటాయి. అయితే ఇటీవలి కాలంలో ఆఫ్రికా వంటి దేశాలకు ప్రయాణాలు ఎక్కువైన నేపథ్యంలో అన్నిరకాల మలేరియా జ్వరాలను గుర్తించాల్సిన అవసరముంది.
ప్రమాదమా ?…..
ఏదో ఒకరకం మలేరియాలో కన్నా మిశ్రమ మలేరియాలో జ్వరం మరింత తీవ్రంగా ఉంటుంది. జ్వరం తీరుతెన్నులను అంచనా వేయటం కూడా కష్టమే. సాధారణంగా వైవాక్స్‌ రకం మలేరియాలో జ్వరం రోజు విడిచి రోజు వస్తుంటుంది. ఫాల్సిఫారమ్‌లో రోజూ జ్వరం, జ్వరంలో విపరీతమైన చలి ఉంటాయి. అదే రెండు కలిసి ఉన్నప్పుడు జ్వరం మరింత ఉద్ధృతంగా వస్తుంది. జ్వరం రావటం, తగ్గటంలో ఒక పద్ధతంటూ ఉండదు. చలి, వణుకు వంటి లక్షణాలు కూడా తీవ్రంగానే ఉంటాయి. మలేరియా మూలంగా తలెత్తే కామెర్లు, రక్తహీనత, కిడ్నీలు దెబ్బతినటం వంటి దుష్ప్రభావాలు కూడా వీరిలో మరింత త్వరగా వచ్చే అవకాశముంది. చికిత్స తీసుకున్నప్పుడు ఫాల్సిఫారమ్‌ రకం తగ్గినప్పటికీ.. వైవాక్స్‌ మూలంగా మళ్లీ మలేరియా దాడిచేయొచ్చు. అప్పటికే బలహీనంగా ఉన్నవారికిది మరింత హాని చేస్తుంది. ఈసారి జ్వరం మరింత ఉద్ధృతంగానూ ఉంటుంది.
చికిత్సలోనూ తేడా
ఫాల్సిఫారమ్‌ రకం మలేరియాకు 3 రోజుల పాటు మందులిస్తే సరిపోతుంది. ఆర్టీమినిసిన్‌ మందు దీనికి అద్భుతంగా పనిచేస్తుంది. అయితే మలేరియా పరాన్నజీవి దీన్ని తట్టుకునే సామర్థ్యం సంతరించుకుంటుండటంతో ఆర్టీమినిసిన్‌కు లూమిఫాంటిన్‌, మెఫ్లోక్విన్‌, సల్ఫాడాక్సిన్‌/పైరిమెథమైన్‌ వంటి ఇతరత్రా మందులను కలిపి కాంబినేషన్‌ చికిత్స (ఏసీటీ) చేస్తున్నారు. దీంతో ఫాల్సిఫారమ్‌ మలేరియా పూర్తిగా నమయైపోతుంది. కానీ వైవాక్స్‌ అలా కాదు. ఇది క్లోరోక్విన్‌ మాత్రలతో ముందు తగ్గినా.. దోమలేవీ కుట్టకపోయినా కొన్నాళ్లకు మళ్లీ తిరగబెట్టొచ్చు.
దీన్ని నివారించటానికి రెండు వారాల పాటు ‘ప్రైమాక్విన్‌’ అనే మందునూ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఒకే సమయంలో ఫాల్సిఫారమ్‌తో పాటు వైవాక్స్‌ వంటి ఇతర రకాలతో కూడిన మిశ్రమ ఇన్‌ఫెక్షన్‌ ఉన్నట్టయితే చికిత్స విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. లేకపోతే సమస్య మళ్లీ మళ్లీ తిరగబెట్టొచ్చు. అది ఈసారి తీవ్రంగానూ దాడిచేయొచ్చు. పాల్సిఫారమ్‌తో కూడిన మిశ్రమ ఇన్‌ఫెక్షన్లకు మామూలుగా ఫాల్సిఫారమ్‌ చికిత్సనే ఇవ్వాలి. ఎందుకంటే ఆర్టిమినిసిన్‌ కాంపౌండ్‌ చికిత్స వైవాక్స్‌ వంటి వాటికి పనికిరాదు. అలాగే వీరికి ఈ చికిత్స అనంతరం రెండు వారాల పాటు ప్రైమాక్విన్‌ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో వైవాక్స్‌ మలేరియా తిరగబెట్టకుండా చూసుకోవచ్చు. అయితే ప్రైమాక్విన్‌తో చిక్కేంటంటే- జీ6పీడీ ఎంజైమ్‌ లోపం గలవారికి దీంతో రక్తం విచ్ఛినమయ్యే (హిమోలైసిస్‌) అవకాశముంది.
కాబట్టి ముందుగా జీ6పీడీ లోపాన్ని గుర్తించే రక్తపరీక్ష చేయటం తప్పనిసరి. ఈ పరీక్ష అందుబాటులో లేని ప్రాంతాల్లో జబ్బు తీవ్రతను బట్టి డాక్టర్లు నిర్ణయం తీసుకుంటారు. అలాగే గర్భిణులకు, పిల్లలకు ప్రైమాక్విన్‌ ఇవ్వటంలోనూ జాగ్రత్తగా ఉండాలి. దీన్ని తీసుకుంటున్న సమయంలో మూత్రం ముదురురంగులో రావటం, కళ్లు పచ్చబడటం, పెదవులు నల్లబడటం, కడుపునొప్పి, వాంతి, వికారం, ఆయాసం వంటి లక్షణాలు కనబడితే వెంటనే డాక్టర్‌ను సంప్రతించటం మంచిది.

డెంగ్యూ జ్వరం

డెంగ్యూ అనేది ఎయిడెస్‌ ఈజిఫ్లై అనే జాతి దోమ కాటువల్ల మానవ శరీరంలో ప్రవేశించే వైరస్‌ వలన వచ్చే జ్వరం. తీవ్ర జ్వరం వలన కొన్ని సందర్భాలలో రక్తస్రావం, షాక్‌, రక్తపోటు పడిపోవటం వంటి క్షణాలతో మరణం సంభవించవచ్చు.
ఎప్పుడు వస్తుంది : సంవత్సరంలో ఏ సమయంలో అయినా డెంగ్యూ జ్వరం రావచ్చు. కాని వర్షాకాలంలో (ఆగష్టు-అక్టోబర్‌) అధికంగా కనిపిస్తుంది. వర్షాలు వెనుక పడిన తర్వాత కాలమైన సెప్టెంబర్‌-అక్టోబర్‌లలో రక్తస్రావ పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి.
ఎలా వస్తుంది : ఎయిడెస్‌ ఈజిఫ్లై అనే దోమకాటు వలన ఒకరినుండి మరొకరికి డెంగ్యూ వైరస్‌ వ్యాప్తి చెందుతుంది. ఈ జాతి దోమ మీద ఉండే నలుపు, తెలుపు చారవల్ల దీనిని టైగర్‌ దోమ అనికూడా పిలుస్తారు.
ఎయిడెస్‌ దోమ గురించి : ఈ జాతి దోమ మన ఇంటి పరిసరాలోనే నివసిస్తుందని తెలుసుకోండి. పూల కుండీలు, ఎయిర్‌కూలర్స్‌, పాత టైర్లు, పాత ఖాళీ డబ్బాలు వంటి వాటిలో చేరే నీరు ఈ దోమలకు అనుకూలం. మన పరిసరాలు అపరిశుభ్రంగాపెట్టుకుని డెంగ్యూకి అవసరమైన పరిస్థితులు మనమే కల్పిస్తాం.
గమనించాల్సిన మరో విషయం ఈ జాతి దోమలు సూర్యోదయ, సూర్యాస్తమయ సమయాలలో తిరుగుతాయి. కాని మిగిలిన దోమలలా రాత్రిపూట కాదు. కాబట్టి ఆ సమయాలో మనల్ని మనం దోమకాటు నుండి రక్షించుకోవాలి.
డెంగ్యూ ఎవరికి వస్తుంది ? పసిపిల్ల నుండి పెద్దల వరకు అన్ని వయసుల వారికి డెంగ్యూ వస్తుంది. అడవులలో ఉండే గిరిజనుల నుండి మహానగరాలోని నాగరికుల వరకు అందరికీ వస్తుంది. బహిరంగ ప్రదేశాలో పనిచేసేవారికి ఇది వచ్చే అవకాశం మరింత ఎక్కువ. జీవితకాలంలో మొత్తం నాలుగు సార్లు డెంగ్యూ జ్వరం వచ్చే అవకాశముంది. నాలుగు రకాల సెరో తరహా వైరస్ లు ఉండటమే దీనికి కారణం. మొదటిసారి కన్నా ఆ తర్వాత వచ్చే ప్రతి సారీ జ్వరతీవ్రత మరింతగా పెరుతుంటుంది. ఉష్ణ ప్రకృతి ఉన్నవారిలో ఈ రోగ తీవ్రత, సమస్యు అధికంగా కనిపిస్తాయి.
జ్వర క్షణాలేమిటి ? 101 నుండి 105 డిగ్రీల జ్వరం హఠాత్తుగా వస్తుంది. తీవ్ర తలనొప్పి, నడుము కిందిభాగంలో తీవ్రనొప్పి, కళ్ళు మండటం వంటి క్షణాలు వస్తాయి. ఈ జ్వరం వచ్చినవారు తీవ్రవమైన ఒళ్లు నొప్పులు, కడుపులో తిప్పడం, వాంతులు, కుడి ఉదరభాగం వైపున నొప్పి వస్తుంది. ఉష్ణోగ్రత పెరిగినపుడు రోగికి తీవ్రంగా నీరసం, కూర్చుంటున్నా నిలుచుంటున్నా తల తిరుగుడు, ముక్కు నుండి రక్తం రావటం, నల్లని మలం వస్తాయి. దోమ కుడితే ఏర్పడేటటువంటి ఎర్రని చుక్కవంటివి ఏర్పడుతాయి. (రక్తం చర్మం లోపకి రక్తబిందువు కనిపిస్తాయి.)
డెంగ్యూ అని ఎలా తెలుస్తుంది ? డెంగ్యూ జ్వరం ప్రత్యేక లక్షణాతో ఆ జ్వరమని అనుమానించగా రక్తపరీక్షలో తక్కువ సంఖ్యలో తెల్ల రక్తకణాలు, తక్కువ స్థాయిలో ప్లేట్‌లెట్స్‌, బ్లడ్‌ స్మియర్‌ మీద ఎటిపికల్‌ సెల్స్‌తో ధృవీకరించబడుతుంది. ఎన్‌. ఎస్‌ యాంటిజన్‌ మరియు యాంటీ డెంగ్యూ యాంటీ బాడీస్‌ IGM తో రోగ నిర్థారణ చేయవచ్చు
డెంగ్యూ ప్రాణాంతకమా ? అవును, డెంగ్యూతో పాటు రక్తస్రావం (డెంగ్యూ హెమరేజ్‌ ఫివర్‌ డి.హెచ్‌.ఎఫ్‌) లేదా రక్తపోటు అతి తక్కువకు పడిపోవడం, డెంగ్యూ షాక్‌ సిండ్రోమ్‌ (డి.హెచ్‌.ఎస్‌.ఎస్‌ లు) కనిపిస్తే ప్రాణాంతకమే. అయితే అంత తీవ్రస్థాలో డెంగ్యూ వచ్చేవారు 5 శాతానికి అటు ఇటుగా ఉంటారు 95 శాతం మందికి ప్రాణాంతకం కాదు.
డెంగ్యూకి చికిత్స ఖర్చుతో కూడినదా ? అధిక కేసుల్లో అది ఖర్చుతో కూడిన చికిత్స కాదు కాని బ్లడ్‌ ప్లేట్‌లెట్స్‌ 10,000 స్థాయికి పడిపోయినా (సాధారణంగా 1.5 నుండి 4.5 లక్షలుంటాయి) లేక తీవ్ర రక్తస్రావం వున్నా ఇచ్చే సింగిల్‌ డోనార్‌ ప్లేట్‌లెట్స్‌ (ఎస్‌.డి.పి) లేదా యాంటీ ఆర్‌.హెచ్‌.డి ఇంజక్షన్స్‌ మాత్రమే ఖరీదైనవి. 95 శాతం మంది రోగులకు రక్తపోటును గమనించటం, ఇంట్రావీనస్‌ ఫ్లూయిడ్స్‌ ఇవ్వటం చేస్తారు కాబట్టి అంత ఖరీదుతో కూడినవి కావు.
చికిత్సా విధానం : డెంగ్యూ జ్వర చికిత్సకంటూ ప్రత్యేకంగా మందులు లేనందున చికిత్సా విధానం పరోక్ష పద్ధతిలో ఉంటుంది. రోగుకు నోటిద్వారా లేదా రక్తనాళాల ద్వారా ద్రవాలను ఎక్కిస్తారు. అప్పుడప్పుడు ప్లేట్‌లేట్స్‌ ఎక్కిస్తారు. (ప్లేట్‌లెట్స్‌ సంఖ్య 10,000 కన్నా పడిపోయినా లేదా తీవ్ర రక్తస్రావం వున్నా) లేదా రక్తం లేదా ఇంట్రావీనస్‌ కొల్లాయిడ్స్‌ ఎక్కిస్తారు. జ్వరం మరింత తీవ్రమైనపుడు సింగిల్‌ డోనార్‌ ప్లేట్‌లెట్స్‌ని, యాంటీ ఆర్‌.హెచ్‌.డి ఇంజక్షన్‌ ఇస్తారు. స్టీరాయిడ్‌ ఇంజక్షన్‌ వల్ల ఎటువంటి లాభం వుందని నిరూపణ కాలేదు. పైగా అవి ప్రమాదకరం. అవసరం లేకున్నా ప్లేట్‌లెట్స్‌ను ఎక్కించడం పి.ఆర్‌.పి కూడా రోగికి చెరుపు చేస్తాయి.
రోగిని ఆసుపత్రిలో ఎప్పుడు చేర్చాలి ? డెంగ్యూ జ్వరపీడితులకు రక్తపోటు బాగా పడిపోయినా, తీవ్రంగా వాంతులు చేసుకుంటూ నోటి ద్వారా ద్రవాలు తీసుకోవంట కష్టంగా వున్నా లేదా ప్లేట్‌లెట్స్‌ సంఖ్య 50,000 కన్నా తక్కువస్థాయికి పడిపోయినా ఆసుపత్రిలో చేర్చాల్సి వుంటుంది.
ఇంటెన్సివ్‌ కేర్‌ (ఐ సి యూ) అవసరం ఎప్పుడు ఏర్పడుతుంది ? ప్లేట్‌లెట్స్‌ కౌంట్‌ 30,000 కన్నా తగ్గినా, తీవ్రరక్తస్రావం అవుతున్నా, ఏదైనా ఒక అంగం సక్రమంగా పనిచేయక పోతున్నా రోగిని ఇంటెన్సివ్‌ కేర్‌లో చేర్చాల్సి వస్తుంది.
రోగి ఆసుపత్రిలో ఎంతకాలం ఉండాలి ? రక్తంలో ప్లేట్‌లెట్స్‌ సంఖ్య క్రమంగా పెరిగే వరకు రోగి ఆస్పత్రిలో వుండాలి. జ్వరం తగ్గిన తర్వాత 48 నుండి 72 గంటలు రోగిని పరిశీలనలో వుంచి, ప్లేట్‌లెట్స్‌ సంఖ్య 50 వేలు, ఆపైన చేరిన తర్వాత డిశ్చార్జి చేస్తారు.
డెంగ్యూ రాకుండా నిరోధించ వచ్చా? మీ పరిసరాలను శుభ్రంగా ఉంచుకుని దోమలు చేరకుండా చూసుకోవటం ద్వారా, దోమకాటుకు గురి కాకుండా చూసుకోవటం ద్వారా నిరోధించవచ్చు. ఈ జ్వరానికి టీకా మందు లేదు.
జాగ్రత్తలు : డెంగ్యూ జ్వర లక్షణాలు కనిపిస్తే వీలైనంత త్వరగా వైద్య పరీక్ష చేయించుకోవాలి. ద్రవపదార్థాలు అధికంగా తీసుకోవాలి. పళ్ళరసాలు లేదా కొబ్బరి నీళ్ళలో గ్లూకోజ్‌ కలుపుకుని తీసుకోవాలి. పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి. రాత్రిపూట బాగా నిద్రపోవాలి. దోమతెరలను, దోమలను పారద్రోలే రసాయనాలను వాడాలి. పరిసరాలను శుభ్రంగా ఉంచుకుని నిలువనీరు లేకుండా చూసుకోవాలి

Typhoid……….టైఫాయడ్‌ జ్వరం

టైఫాయిడ్‌ జ్వరం మన దేశంలో చాలా సాధారణం. ఇది సల్మోనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియా కారణంగా వస్తుంది. ఇప్పటికే ఇది ఉన్న వ్యక్తి మలంతో కలుషితమైన నీరు, ఆహారం తీసుకొనటం ద్వారా, టైఫాయిడ్‌ ఒకరి నుండి మరొకరికి వస్తుంది. కొందరిలో జ్వరం ఉండదు గానీ, ఈ బ్యాక్టీరియా వాళ్ళ పొట్టలో ఉండి వారి మలంలో కలుషితమైనపుడు ఇతరులకు వ్యాపిస్తూ ఉంటుంది. సరైన పారిశుధ్యం లేకపోవటం మల విసర్జనకు వెళ్ళిన తరువాత చేతులు శుభ్రంగా కడుక్కోవకపోవటం వంటివన్నీ దీని వ్యాప్తికి ముఖ్య కారణం.
హోటళ్ళలో పనిచేసే వారు, అన్నం వండేవాళ్ళు, వడ్డించే వారు వీరంతా శుభ్రంగా ఉండటం పారిశుధ్యంలో భాగమే.
లక్షణాలు : జ్వరం సాధారణంగా తక్కువ స్థాయిలో ప్రారంభమై, క్రమేపీ రోజు రోజుకూ పెరుగుతుంది. అన్న హితవు లేకపోవటం, వాంతులు వంటివి వేధిస్తుంటాయి. రోగిని చూడగానే బాగా జబ్బు పడినట్లుంటారు. బాగా నీరసపడి పోతారు. సరైన చికిత్స ఇవ్వకపోతే వారాలు గడుస్తున్నా జ్వరం తగ్గదు. రెండు వారాల తర్వాత కొందరికి విరేచనాలు కావచ్చు. రెండు వారాల పాటు సరైన చికిత్స ఇవ్వకపోతే జ్వరం బాగా ముదిరి పేగులకు రంధ్రం పడి లోలోపలే రక్తస్రావం కావచ్చు. బి పి పడిపోవటం, నాడి పడిపోవటం, వంటి లక్షణాతో షాక్‌లోకి వెళ్ళవచ్చు. టైఫాయిడ్‌ ను సకాలంలో గుర్తించక పోతే, ఇన్‌ఫెక్షన్‌ రోగి రక్తంలో చేరి చనిపోయే ప్రమాదం ఉంటుంది. మన దేశంలో జ్వరం రాగానే చాలా మంది వైడాల్‌ పరీక్ష చేయించి ఇందులో పాజిటివ్‌ వస్తే టైఫాయిడ్‌ అనుకుంటారు.కానీ ఇది పూర్తిగా నమ్మదగ్గ పరీక్ష కాదు. జ్వరం ఆరంభమైన 3వ వారానికి దీంతో కొంత ఉపయోగం ఉండొచ్చు గానీ అప్పటి వరకూ చికిత్స ఇవ్వకుండా ఉంటే ప్రమాదం.
టైఫాయిడ్‌కు మొదటి వారంలో రక్తం కల్చర్‌ పరీక్ష చేస్తే చాలావరకూ తెలుస్తుంది. ఇందులో కూడా 40-80 శాతం పాజిటివ్‌ కాకపోవచ్చు కాబట్టి లక్షణాను బట్టి చికిత్స ఆరంభిస్తారు. వారం తర్వాత స్మానెల్లా ఐ జి యం యాంటీబోడీ పరీక్ష చేస్తే 70 శాతం వరకూ ఖచ్చితంగా తెలుస్తుంది. ఇక 2,3 వారాల్లో మాత్రం,మలం కల్చర్‌ పరీక్ష చేస్తే అందులో ఖచ్చితంగా తెలుస్తుంది. మొత్తానికి లక్షణాల ఆధారంగా ముందు మందులు మొదలు పెట్టటం ప్రధానం.
జ్వరం బాగా ఉన్నప్పుడు కొందరికి పలవరింతలు రావచ్చు. చాలామందికి తెల్ల రక్తకణాల సంఖ్య పెరగక పోవచ్చు. పైగా తగ్గే అవకాశం ఉంది. ప్లేట్‌లెట్లు కూడా తగ్గే అవకాశం ఉంటుంది గానీ డెంగీ జ్వరంలో అంత ఎక్కువగా అంటే లక్ష కంటే తగ్గటం అరుదు. టైఫాయిడ్‌ జ్వరంలో ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తేలికగా జీర్ణమయ్యే ద్రవాహారం ఎక్కువగా ఇవ్వాలి. రెండు మూడు వారాలు మొత్తగా ఇవ్వాలి. జ్వరం తీవ్రత తగ్గడానికి ప్యారాసెట్‌మల్‌ బిళ్ళలతో పాటు ముఖ్యంగా యాంటీబయాటిక్స్‌ (మనదేశంలో సెఫ్ట్రియాక్సోన్‌ వంటి మూడోతరం సెఫలోస్ఫోరిన్లు) ఇస్తారు. వీటిని పూర్తి కోర్సు వాడాలి.వీటితో జ్వరం పూర్తిగా తగ్గిపోతుంది. టైఫాయిడ్‌ రాకుండా ఇప్పుడు టీకాలు అందుబాటులో ఉన్నాయి. టీకాలు తీసుకోవచ్చు.

Flue fever……ఫ్లూ జ్వరం

ఫ్లూ వైరస్‌ మన దేశంలో సాధారణంగా వర్షాకాలం, శీతాకాలాల మధ్య విజృంభిస్తుంటుంది. ఫ్లూ జ్వరంలో కూడా దాదాపు జలుబు లక్షణాన్నీ వుంటాయి. కానీ జ్వరం తీవ్రంగా ఉండటం, జ్వరం వస్తూనే ఒళ్ళు విరగ్గొట్టినంత నొప్పులు బాధ ఉండటం, కదల్లేకపోవటం దీని ముఖ్య లక్షణాలు. ఇవి మనిషిని బాగా నిస్సత్తువగా మార్చేస్తాయి. అందుకే దీన్ని చాలామంది విషజ్వరం అని అంటారు. దీనివల్ల చాలామంది రోజువారీ పనులకు కూడా వెళ్ళలేరు.
లక్షణాలు : తీవ్రమైన ఒళ్లు నొప్పులతో పాటు గొంతునొప్పి, దగ్గు, తలనొప్పి ఉండొచ్చు. జ్వరం మాత్రం 101 కంటే ఎక్కువే ఉంటుంది. ఫ్లూ జ్వరం వచ్చిన వారు ఇంట్లో నుంచి నుంచి కదలలేరు. బద్ధకంగా పడుకోవటానికే ఇష్టపడతాడు. ఫ్లూతో పెద్దగా తీవ్రమైన లక్షణాలేవి లేకుండానే వచ్చిపోవచ్చు. దాని గురించి ఆందోళన అవసరంలేదు. కానీ ఫ్లూ జ్వరంతో వచ్చే ప్రధాన సమస్య కొందరిలో ఇది గొంతు నుంచి కిందికి అంటే ఊపిరితిత్తుల్లోకి కూడా పోతుంది. దీంతో దగ్గు, ఊపిరితిత్తుల్లో నీరు చేరి న్యూమోనియా, ఏ ఆర్‌ డి ఎస్‌ వంటి తీవ్ర సమస్యలు రావచ్చు వృద్దుల్లో మధుమేహం ఉన్న వారిలో గ్నర్భిణుల్లో, చిన్న పిల్లలలో ఇప్పటికే ఆస్థమా వంటి ఊపిరితిత్తుల జబ్బులున్న వారిలో ఇది ప్రమాదం తెచ్చి పెడుతుంది.
అరుదుగా ఫ్లూ జ్వరంతో మరణాలు సంభవిస్తుంటాయి. అందుకే దీన్ని పూర్తిగా తీసి పారెయ్యటానికీ లేదు. ఈ లక్షణాలు కనబడితే వైద్యులను కవటం అవసరం. అందుకే ఫ్లూ జ్వరాలను మరీ అంత తేలికగా తీసుకోవటానికి వీల్లేదు. ఫ్లూ జ్వరాన్ని గుర్తించేందుకు వైద్యుల అవసరమైతే రక్త పరీక్షలు, ఫ్లూ పరీక్షలు, ఛాతీ ఎక్స్‌ రే వంటివి చేయిస్తారు.
అవసరమైతే ఆసుపత్రిలో కూడా చేరాల్సిన అవసరం కూడా రావచ్చు. సాధారణంగా ఫ్లూజ్వరం దానంతట అదే తగ్గిపోతుంది. జ్వర తీవ్రత తగ్గేందుకు ప్యారాసెట్‌మాల్‌ మాత్రలిస్తారు. ద్రవాహారం ఎక్కువగా తీసుకోవాలి. పూర్తి విశ్రాంతి అవసరం. అవసరమైతే వైద్యులు ఒసాల్లామావిర్‌ వంటి యాంటీవైరల్‌ మందులిస్తారు. వీటితో జ్వరం త్వరగా తగ్గుతుంది. ఇతరత్రా ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. రోగి త్వరగా కోలుకుంటారు. ఇతరత్రా ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు యాంటీ బయాటిక్స్‌ సకాలంలో, సరైన మోతాదులో వాడాలి. ఇతరత్రా ఇబ్బందులేవి లేకపోతే ఫ్లూ 5 నుండి 7 రోజులో తగ్గిపోతుంది.
ఫ్లూ రాకుండా టీకాలున్నాయి. కానీ వీటిని ప్రతి ఏటా తీసుకోవాల్సి ఉంటుంది. 50 ఏళ్ళు పైబడిన వారు, ఛాతీ సమస్యలున్న వారు తీసుకోవటం మంచిది.

Common Cold….. జలుబు

సర్వసాధారణ సమస్య జలుబు. దీనిని కామన్‌ కోల్డ్‌ అనికూడా అంటారు. ముఖ్యంగా చిన్నపిల్లలలో సంవత్సరానికి 6 నుండి 12 సార్లు వస్తుంటుంది. వయసు పెరిగిన కొద్ది తరచుదనం తగ్గుతుంది. పెద్దవాళ్ళకు కూడా 3,4 సార్లు రావచ్చు. జలుబు తెచ్చిపెట్టే వైరస్ లు దాదాపు 200 వరకూ ఉన్నాయి గానీ ఎక్కువగా కనబడేది రైనో వైరస్‌.
ఇంకా ఎడినో వైరస్‌, ఆర్‌ ఎస్‌వి, కరోనా వైరస్‌ వంటివి చాలా ఉన్నాయి. దేనీతో వచ్చిందన్నది చెప్పటం కష్టం. అంత అవసరం కూడా కాదు. జలుబు చాలా వరకూ దానంతట అదే తగ్గిపోతుంది. దీనివన ఇతరత్రా సమస్యలు ముదరటం అరుదు.
లక్షణాలు : తుమ్ములు, ముక్కు, కారటం, ముక్కు పట్టేయటం, తలనొప్పి, కొద్దిగా జ్వరం ఇవన్నీ ఉండొచ్చు. కొందరిలో జ్వరం ఉండకపోవచ్చు కూడా. మొదట్లో1,2 రోజూ ముక్కు నుండి స్వచ్ఛమైన నీరులాంటి ద్రవం వస్తుంది. కొద్దిమందిలో దగ్గు, గొంతు నొప్పి కూడా రావచ్చు. మరీ తీవ్రమైన జ్వరం ఉండదు. ఒళ్ళు నొప్పులు అంతగా ఉండవు. ఈ సమస్య సాధారణంగా 2-5 రోజుల్లో తగ్గిపోతుంది.
ఈ బాధలు వేధిస్తుంటే యాంటీ హిస్టామిన్‌, డీకంజెస్టెంట్‌ మందులు వాడితే మంచి ఉపశమనం ఉంటుంది. ఇవి ముక్కునుండి స్రావాలను తగ్గిస్తాయి. ఇక జలుబు కంటూ ప్రత్యేకంగా యాంటీవైరల్‌ మందు లేదు. కొంచెం ఒళ్లు నొప్పులు ఉంటే పారాసెట్‌మెల్‌ బిళ్ళలు వేసుకోవచ్చు. సాధారణ జలుబు మందుల్లో (డీకోల్డ్‌ వంటివి) ఇవన్నీ కలిసే ఉంటాయి. వీటితోనే జలుబు తగ్గిపోతుంది. చిన్న పిల్లలు ముక్కు బిగిసిపోయి ఏడుస్తుంటే వారికి నేసోక్లియర్‌ వంటి చుక్కల మందు ముక్కులో వేస్తే రంధ్రాలు తెరుచుకుని హాయిగా గాలి పీల్చుకుంటారు.
జలుబు సమయంలో తీసుకోవాల్సి ఆహారం ప్రత్యేకంగా ఉండదు కానీ కొంతమంది మిరియాల కషాయం, చికెన్‌ పులుసు, మషాలా సూపు వంటివి తీసుకుంటారు. వీటితో ముక్కు తెరుచుకున్నట్లయి హాయిగా ఉంటుంది. ఈ సమయంలో ద్రవాహారం, విశ్రాంతి ఈ రెండూ ముఖ్యం. ఇలా చేస్తే నాలుగైదు రోజులో జలుబు పూర్తిగా తగ్గిపోతుంది.
ఇక చాలా మందిలో జలుబు ముదిరి పైనుసైటిస్‌, చిన్నప్లిల్లలలో చెవిపోటు వంటి సమస్యలు రావచ్చు. ప్రారంభ దశలో అవసరం లేకపోయినా రెండు మూడు రోజుల తర్వాత ముక్కు స్రావాలు పసుపు లేదా ఆకుపచ్చగా వస్తుండటం తలభారం ఉంటే వైద్యుల సలహా మేరకు అమోక్సిలిన్‌, అజిత్రోమైసిన్‌, సెఫలెక్సిన్‌ వంటి యాంటీబయాటిక్స్‌ వాడితే తగ్గిపోతుంది. చాలామంది జలుబు రాగానే యాంటీ బయాటిక్స్‌ మొదలు పెడతారు. అది అవసరంలేదు. ముక్కు నుంచి నీరులాంటి స్రావం కారుతున్న తొలిదశలో యాంటీబయాటిక్స్‌ అవసరం అసలుండదు. స్రావాలు రంగు మారితే అప్పుడు వైద్యుల పర్వవేక్షణలో యాంటీబయాటిక్స్‌ వాడటం మంచిది.
చాలా మందిలో జలుబు తగ్గినట్లే తగ్గి మళ్ళీ వస్తుంది. ద్రవాలు పచ్చరంగులోకి మారి, జ్వరం, దగ్గు, గొంతు నొప్పి వంటివి రావచ్చు. వీరికి వైద్యుల సలహా మేరకు యాంటి బయాటిక్స్‌ వాడవలసి ఉంటుంది.
ప్రతి సీజన్లోనూ ఈ వైరస్‌ లక్షణాలు మారిపోతుంటాయి కాబట్టి ఇది రాకుండా చూసే టీకాలేం లేవు.