Myopia / హ్రస్వదృష్టి

ఈ దృష్టి దోషం గలవారికి దగ్గర గల వస్తువులు కనబడతాయి.దూరంగా గల వస్తువులను చూడలేరు. దీనికి కారణం దూరంగా ఉన్న వస్తువుల ప్రతిబింబాలు రెటీనా మీద కాకుండా రెటీనా ముందు కేంద్రీకరింపబడతాయి.
భౌగోళిక, జన్యుపరమైన అంశాలే దీనికి బీజం వేస్తున్నాయి. పాశ్చాత్యదేశాల కన్నా మనలాంటి ఆసియాదేశాల పిల్లల మీదే హ్రస్వదృష్టి ఎక్కువగా దాడి చేస్తుండటమే దీనికి నిదర్శనం. తల్లిదండ్రులిద్దరూ హ్రస్వదృష్టి గలవారైతే పిల్లలకూ వచ్చే అవకాశం పెరుగుతుంది. నెలలు నిండకముందే పుట్టే పిల్లలకు, ఎక్కువసేపు ఇంట్లోనే ఉండేవారికి కూడా దీని ముప్పు పెరగొచ్చు. కంటికి మరీ దగ్గరగా వస్తువులను పెట్టుకొని చూడటం కూడా కొంతవరకు సమస్యకు దారితీయొచ్చు.
హ్రస్వదృష్టి తరచుగా చూసే సమస్యే. దీన్నే నియర్ సైట్, మయోపియా అనీ అంటారు. దీని బారినపడ్డవారికి దగ్గరి వస్తువులు బాగానే కనబడతాయి గానీ దూరంగా ఉన్నవి స్పష్టంగా కనబడవు. మనదేశంలో కంటి సమస్యలతో ఆసుపత్రులకు వచ్చే పిల్లల్లో మూడింట రెండొంతుల మంది హ్రస్వదృష్టితో బాధపడుతున్నవారే. ఇది చిన్న వయసులోనే మొదలవుతుంది. హ్రస్వదృష్టికి ప్రధాన కారణం- కనుగుడ్డు సైజు పెరగటం. మన కంట్లో ముందువైపు కనిపించే నల్లగుడ్డు, దాని వెనక లెన్సు ఉంటాయి. బయటి నుంచి వచ్చే కాంతి కిరణాలను ఈ లెన్సు- కనుగుడ్డు వెనకాల ఉండే రెటీనా పొర మీద సరిగ్గా కేంద్రీకృతమయ్యేలా చేస్తుంది. దీంతో ఆయా దృశ్యాలు మనకు స్పష్టంగా కనబడతాయి. ఈ ప్రక్రియలో కనుగుడ్డు, రెటీనా పొర మధ్య ఉండే దూరం (ఆక్సియల్ లెంగ్త్) చాలా కీలకం. సాధారణంగా పుట్టినపుడు సుమారు 17 మిల్లీమీటర్లుండే ఈ దూరం పెద్దయ్యాక దాదాపు 24 మిల్లీమీటర్ల వరకు చేరుకుంటుంది. ఇది తగ్గినా, పెరిగినా చూపు మీద గణనీయమైన ప్రభావం పడుతుంది.
ఒక మిల్లీమీటరు దూరం పెరిగినా చూపు పవర్ (డయాప్టర్) మైనస్ 3 అవుతుంది. అదే మిల్లీమీటరు దూరం తగ్గితే పవర్ ప్లస్ 3 అవుతుంది. నిజానికి చాలామందికి పుట్టుకతోనే ప్లస్ 3 పవర్ ఉంటుంది. అసలు చిక్కేంటంటే- వయసు పెరుగుతున్నకొద్దీ కంటి పొడవు, ఆకారం మారుతూ వస్తుండటం. కనుగుడ్డు పొడవు పెరుగుతున్నకొద్దీ నల్లగుడ్డుకూ రెటీనా పొరకు మధ్య దూరం పెరుగుతూ వస్తుంది. దీంతో ప్లస్ పవర్ నెమ్మదిగా తగ్గుతూ.. సున్నాకు చేరుకుంటుంది. దీన్నే ఇమెట్రోపైజేషన్ అంటారు. కనుగుడ్డు సైజు ఇంకా పెరుగుతూ వస్తే మైనస్ పవర్ మొదలవుతుంది. ఇదే హ్రస్వదృష్టికి మూలం. కనుగుడ్డు, రెటీనా పొర మధ్య దూరం పెరిగినపుడు కాంతి కిరణాలు రెటీనా మీద పడకుండా.. కాస్త ముందుభాగంలోనే ఆగిపోతాయి. దీంతో దూరం వస్తువులు సరిగా కనబడవు. అంతా మసక మసకగా అనిపిస్తుంది. దగ్గరివి మాత్రం బాగానే కనబడతాయి.
నిర్ధరణ
హ్రస్వదృష్టిని చాలావరకు లక్షణాల ఆధారంగానే అనుమానించొచ్చు. అయితే కంటిని పూర్తిగా పరీక్షించి సమస్యను నిర్ధరించటం చాలా అవసరం. అందుకే డాక్టర్లు ముందుగా కంటిని నిశితంగా పరిశీలించి మెల్లకన్ను ఏమైనా ఉందా? కంటి వెనకభాగం ఎలా ఉంది? అనేవి చూస్తారు. హ్రస్వదృష్టి విషయంలో కంట్లో సైక్లోపెంటలేట్ చుక్కల మందు వేసి పరీక్షించటం చాలా కీలకం. ఈ మందుతో తాత్కాలికంగా కంటిపాప పెద్దదవుతుంది. సీలియరీ కండరాలు వదులవుతాయి. అనంతరం రెటీనోస్కోపీతో పరీక్ష చేస్తే దృష్టి దోషం కచ్చితంగా తెలుస్తుంది. కంటి వెనకాల భాగం ఎలా ఉందో కూడా చూస్తారు. మిగతావన్నీ బాగానే ఉండి దృష్టి దోషం మైనస్ పవర్లో ఉంటే హ్రస్వదృష్టిగా నిర్ధరిస్తారు. సమస్య ఒక్క కంట్లోనే ఉందా? రెండు కళ్లలో ఉందా? సమస్య తీవ్రత ఎలా ఉంది? అనేవి కూడా ఇందులో బయటపడుతుంది.
నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం
హ్రస్వదృష్టి ఉన్నా కూడా దాన్ని గుర్తించకుండా ఉండిపోయే పిల్లలూ కనబడుతుంటారు. ముఖ్యంగా ఒక కంట్లోనే దోషం ఉన్నప్పుడు.. మరో కన్ను బాగానే ఉంటుంది. దీంతో చూపులో పెద్ద తేడా కనబడదు. ఎప్పుడైనా అనుకోకుండా కంటికి ఏదైనా అడ్డు పడ్డప్పుడు మసక మసకగా అనిపించి సమస్య బయటపడొచ్చు. అప్పటికే సమస్య ముదిరిపోయి ఉండొచ్చు కూడా. పవర్ ఎక్కువగా ఉన్నవారికి.. ఒక కంట్లో పవర్ ఉండి, మరో కంట్లో ఎలాంటి పవర్ లేనివారికి సమస్యను సకాలంలో గుర్తించకపోతే చివరికి దృష్టిమాంద్యానికి దారితీయొచ్చు. దోషం ఉన్న కన్ను క్రమేపీ కనిపించకుండా పోతూ.. ఆఖరికి దృష్టిమాంద్యంలోకి (ఆంబ్లియోపియా) వెళ్లిపోవచ్చు. అప్పుడు అద్దాలు ఇచ్చినా చూపు తిరిగి మెరుగుపడదు. దృష్టిదోషాలు గల పిల్లల్లో సుమారు 5 శాతం మందికి ఆంబ్లియోపియా వచ్చే అవకాశముంది. ఏడాదికోసారి కంటి పరీక్ష చేయటం ద్వారా ఈ స్థితి రాకుండా చూసుకోవచ్చు. ముఖ్యంగా బడిలో చేర్పించే సమయంలోనే పిల్లలకు సంపూర్ణ కంటిపరీక్ష చేయించటం ముఖ్యమనే సంగతిని అంతా గుర్తించాలి.
ప్రధాన చికిత్స అద్దాలే
హ్రస్వదృష్టి గలవారికి ఆయా పవర్కు అనుగుణమైన అద్దాలు వాడితే చూపు బాగా మెరుగవుతుంది. తొలిసారి అద్దాలు వాడటం మొదలెట్టిన తర్వాత మూడు, నాలుగు నెలలకు మరోసారి పరీక్ష చేసి చూస్తారు. ఎలాంటి ఇబ్బంది లేకపోతే అద్దాలను అలాగే కొనసాగించొచ్చు. ఏదైనా తేడా కనబడితే పవర్ మార్చాల్సి ఉంటుంది. తర్వాత ఆర్నెల్లకోసారి పరీక్షించుకోవాల్సి ఉంటుంది. అద్దాలు ఇష్టం లేకపోతే, నాట్యం వంటివి చేసేవారికి, ఆటలాడేవారికి కాంటాక్ట్ లెన్సులు ఇవ్వొచ్చు. అయితే పిల్లలు కాంటాక్ట్ లెన్సులు ధరించటం కష్టం. రోజూ తీసి పెట్టటం వల్ల ఇన్ఫెక్షన్ల వంటివి తలెత్తొచ్చు. అందువల్ల చాలావరకు అద్దాలకే ప్రాధాన్యం ఇస్తారు. దృష్టిదోషం స్థిరపడిన తర్వాత హ్రస్వదృష్టిని పూర్తిగా నయం చేయటానికి లేసిక్ శస్త్రచికిత్స బాగా ఉపయోగపడుతుంది. దీన్ని 18 ఏళ్ల తర్వాతే.. అదీ ఏడాది వరకు పవర్ మారకుండా ఉంటేనే చేస్తారు. నిజానికి ఒకసారి కంటి సైజు పెరిగితే దాన్ని తగ్గించటమనేది అసాధ్యం. అందుకే లేసిక్ సర్జరీలో కార్నియా మందాన్ని, వంపును తగ్గించటం ద్వారా మాత్రమే చూపును సరిచేస్తారు. అయితే ఇది అందరికీ పనికిరాదు. కార్నియా మందం పలుచగా ఉన్నవారికి దీన్ని చేయటం కుదరదు.
కార్నియా మందం పలుచగా గలవారికి కంటి లోపలే లెన్సును అమర్చే ఐసీఎల్ ప్రక్రియతో హ్రస్వదృష్టిని శాశ్వతంగా నయం చేయొచ్చు. సమస్య చాలా తీవ్రంగా గలవారికి.. అంటే మైనస్ పవర్ 9 దాటినవారికి ఇది ఉపయోగపడుతుంది. అయితే నల్లగుడ్డుకు, కంటిపాపకు మధ్య దూరం తక్కువగా గలవారికి దీన్ని చేయటం కుదరదు.
ప్రధానంగా 3 రకాలు
తీవ్రతను బట్టి హ్రస్వదృష్టిని 3 రకాలుగా విభజించుకోవచ్చు. మైనస్ పవర్ 2 వరకు ఉంటే మామూలు (మైల్డ్), మైనస్ 2-5 వరకు ఒక మాదిరి (మోడరేట్), మైనస్ 5 కన్నా ఎక్కువుంటే తీవ్ర (హై) హ్రస్వదృష్టిగా పరిగణిస్తారు. చాలామంది మైనస్ పవర్ పెరుగుతోంటే లోపల కన్ను దెబ్బతింటుందేమోనని భావిస్తుంటారు. ఇది నిజం కాదు. అద్దాలతో ఎలాంటి హ్రస్వదృష్టినైనా సరిదిద్దుకోవచ్చు. కానీ సరైన అద్దాలు వాడకపోతేనే ఇబ్బంది.
అనుమానించేదెలా?
హ్రస్వదృష్టి పిల్లలకు స్కూలులో బోర్డు మీద రాసినవి సరిగా కనిపించవు. దీంతో బోర్డు దగ్గరికి వెళ్లి రాసుకోవటానికి ప్రయత్నిస్తుంటారు. టీవీకి దగ్గరగా కూచొని చూస్తుంటారు. పుస్తకం కంటికి దగ్గరగా పెట్టుకొని చదువుతుంటారు.
దూరంగా ఉన్నవాటిని చూడాలంటే కళ్లు చిట్లించి, తదేకంగా చూస్తుంటారు.
– ఇలాంటివి గమనిస్తే డాక్టర్ను సంప్రదించటం మంచిది.
ఆర్నెల్లకోసారి కంటి పరీక్ష
శరీర ఎదుగుదల ఆయా వయసుల్లో కాస్త ఉద్ధృతంగా సాగుతుంటుంది. ఈ క్రమంలో కన్ను సైజు కూడా వేగంగా పెరుగుతూ వస్తుంది. పిల్లలకు 13 ఏళ్లు వచ్చేసరికి కనుగుడ్డు చాలావరకు ఎదుగుతుంది. ఆ తర్వాతా పెరగొచ్చు గానీ అంత ఎక్కువగా ఉండదు. మొత్తమ్మీద 18-20 ఏళ్లు వచ్చేసరికి కన్ను సైజుతో పాటు దృష్టి కూడా స్థిరపడిపోతుంది. అందుకే హ్రస్వదృష్టి చాలావరకు చిన్నవయసులో.. 13 ఏళ్లలోపే బయటపడుతుంటుంది. అయితే కొందరికి ఒక కంట్లోనే సమస్య ఉండొచ్చు. ఇంకొందరికి ఒక కంట్లో ప్లస్ పవర్, మరో కంట్లో మైనస్ పవర్ ఉండొచ్చు (అనైసోమెట్రోపియా). దీంతో సమస్యను పోల్చుకోవటం కష్టమవుతోంది. అందువల్ల పుట్టిన తొలి సంవత్సరంలోనే పిల్లల కంటి డాక్టర్తో ఒకసారి విధిగా పరీక్ష చేయించటం మంచిది. అంతేకాదు, దృష్టిదోష లక్షణాలేవీ లేకపోయినా కూడా పిల్లలకు 13-14 ఏళ్లు వచ్చేవరకూ.. అంటే దృష్టి స్థిరపడేవరకూ ఏటా కంటి పరీక్ష చేయించటం తప్పనిసరి. ఒకసారి మెదడులో దృష్టి వ్యవస్థ స్థిరపడిపోతే దాన్ని సరిదిద్దటం అసాధ్యం. కాబట్టి పిల్లలకు క్రమం తప్పకుండా కంటి పరీక్ష చేయిస్తే సమస్య ఏదైనా ఉంటే వెంటనే పట్టుకోవచ్చు. దృష్టిదోషం గల పిల్లలకైతే.. ముఖ్యంగా హ్రస్వదృష్టి గలవారికి ఆర్నెల్లకోసారి విధిగా కంటి పరీక్ష చేయించాలి. ఎందుకంటే కన్ను సైజు పెరుగుతుంటే దానికి అనుగుణంగా అద్దాల పవర్ కూడా మార్చాల్సి ఉంటుంది. లేకపోతే అద్దాలు ధరిస్తున్నా కూడా సరిగా కనబడక పిల్లలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలా 18 ఏళ్ల వరకూ క్రమం తప్పకుండా కంటి పరీక్ష చేయించాలి.
ముదరకుండా జాగ్రత్తలు
హ్రస్వదృష్టికి అద్దాలు వాడుతున్నా సమస్య ముదరకుండా చూసుకోవటం చాలా ముఖ్యం. సాధారణంగా ఇలాంటి పిల్లలకు కంటికి మరీ దగ్గరగా పుస్తకాలు పెట్టుకొని చదవటం వంటివి అలవాటై ఉంటాయి. దీంతో అద్దాలు పెట్టుకున్నా అలాగే చేస్తుంటారు. ఇలాంటి అలవాటు నుంచి పిల్లలను మాన్పించాలి. అలాగే మరీ ముందుకు వంగి రాయటం, చదవటం చేయకూడదు. పుస్తకం మీద వెలుతురు సరిగా పడేలా చూసుకోవాలి. టీవీలు, కంప్యూటర్ల వంటివి కొంతసేపు చూడటంలో తప్పులేదు. కాకపోతే తగినంత దూరం ఉండేలా చూసుకోవాలి. ఇటీవలి కాలంలో పిల్లలు స్మార్ట్ఫోన్లు, ట్యాబ్స్ వాడకానికి అలవాటు పడుతుండటం పెద్ద సమస్యగా మారింది. వీటిని అదేపనిగా ముఖానికి దగ్గరగా పెట్టుకొని వీడీయోగేమ్స్ ఆడటం, వీడియోలు చూడటం మంచిది కాదు. దీంతో కంట్లోని కండరాలు ఆయా దూరాలకు అలవాటుపడి, కనుగుడ్డు పెరగటం ప్రేరేపితమై మైనస్ పవర్ ఎక్కువయ్యే అవకాశముంది. ఎప్పుడూ ఇంట్లో, నీడపట్టున ఉండేవారితో పోలిస్తే ఆరుబయట గడిపే పిల్లలకు హ్రస్వదృష్టి పెరగటం తగ్గుతున్నట్టు కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అందువల్ల పిల్లలను కనీసం రోజుకు 2, 3 గంటలైనా ఆరుబయట ఆడుకునేలా ప్రోత్సహించాలి.
కొత్తగా ఆర్థోకెరటాలజీ వంటి కొత్త విధానాలు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. ఇందులో రాత్రంతా నల్లగుడ్డు మీద కాంటాక్ట్ లెన్సులను పెట్టి, తెల్లారాక తీసేస్తారు. దీంతో అద్దాలు లేకుండానే చదవటం వంటి పనులు చేయటానికి వీలవుతుంది. కాంటాక్ట్ లెన్సు పెట్టటం వల్ల కార్నియా వంపు మారి చూపు మెరుగవుతుంది. అయితే దీని ప్రభావం ఒక రోజే ఉంటుంది. అందువల్ల వీటిని ప్రతి రాత్రి పెట్టుకోవాల్సి ఉంటుంది. దీనిపై ఇంకా అధ్యయనాలు సాగుతున్నాయి. మనదగ్గర ఇదింకా అందుబాటులోకి రాలేదు.
అట్రోపిన్ చుక్కల మందుతో హ్రస్వదృష్టి మరింత ముదరకుండా చూడటంపైనా ప్రయోగ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ చుక్కల మందు వేసినపుడు కంట్లోని సీలియరీ కండరాల సంకోచ వ్యాకోచాలు ఆగిపోతాయి. దీంతో దూరంగా ఉన్నవి బాగానే కనబడతాయి గానీ దగ్గరివి మసక మసకగా కనబడతాయి. అప్పుడు బైఫోకల్ అద్దాలు ఇవ్వటం ద్వారా హ్రస్వదృష్టి ముదరకుండా చూసుకోవచ్చని భావిస్తున్నారు. అట్రోపిన్ మోతాదును తగ్గించటం ద్వారా దగ్గరి వస్తువులు కనబడకపోవటం వంటి దుష్ప్రభావాల బారినపడకుండా చూసుకోవటం మీదా అధ్యయనాలు సాగుతున్నాయి.

Retina diseases / కంటి జబ్బులు –రెటీనా

Retina diseases / కంటి జబ్బులు –రెటీనా

retina

మధుమేహం కారణంగా కంటి చూపు దెబ్బతినటం, ముఖ్యంగా రెటీనోపతి’ అన్నది చాలా తీవ్రమైన సమస్య. కంటి లోపల రెటీనా పొర దెబ్బతింటున్నా కూడా తొలిదశలో పెద్దగా లక్షణాలేం ఉండకపోవచ్చు. కానీ లోలోపల సమస్య ముదురుతూ, చూపు మొత్తం దెబ్బతిని, అంధత్వంలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుతుంది? అసలు మధుమేహానికీ, కంటిలోని రెటీనా పొరకూ లంకె ఏమిటి? వివరంగా చూద్దాం.
లంకె ఎక్కడుంది?
–రెటీనా: మన కనుగుడ్డులో వెనకాల వైపున ఉండే సున్నితమైన పొర ఇది. ఒక రకంగా ఇది మన కంట్లో ఉండే సినిమా తెరలాంటిది. కంటి ముందున్న వస్తువుల ప్రతిబింబం దీని మీద పడి, సంకేతాల రూపంలోకి మారితే.. ఆ సంకేతాలు మెదడును చేరి.. అప్పుడు మనకు ఎదురుగా ఉన్నదేదో కనబడుతుంది’. కాబట్టి చూపు మొత్తానికి ఈ రెటీనా పొర అత్యంత కీలకం.
–మధుమేహం: రక్తంలో గ్లూకోజు ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉంటుండటమే మధుమేహం. ఈ మధుమేహం- రెటీనా’ పొరను రకరకాలుగా పాడుచేస్తుంది. దాని పనితీరును చెడగొడుతుంది. ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కావాలంటే మన శరీరంలో జరుగుతుండే సహజ ప్రక్రియలను, మధుమేహం వల్ల వచ్చే మార్పులను కొద్దిగా అర్థం చేసుకోవటం అవసరం.
మన శరీరంలో ప్రతి కణానికీ, ప్రతి అవయవానికీ శక్తి అవసరం. ఈ శక్తి అనేది ఎక్కడి నుంచి వస్తుంది? మనం తిన్న ఆహారం గ్లూకోజుగా మారి, అది రక్తంలో కలుస్తుంది. రక్తం.. ఆ గ్లూకోజును శరీరంలోని అణవణువుకూ తీసుకువెళుతుంది. కాబట్టి రక్తాన్ని సరఫరా చేసేందుకు మన శరీరమంతా కూడా చిన్నాపెద్దా రక్తనాళాలు బోలెడన్ని ఉంటాయి. శరీరంలోని చిట్టచివ్వరి, సున్నిత భాగాలక్కూడా రక్తసరఫరా చేసేందుకు చాలా సన్నటి, సూక్ష్మ రక్త కేశ నాళాలుంటాయి. మధుమేహ బాధితుల్లో- రక్తంలో గ్లూకోజు ఉండాల్సిన దానికంటే ఎక్కువ మోతాదులో ఉంటుంది కాబట్టి.. గ్లూకోజు అధికంగా ఉన్న రక్తం ఈ రక్తనాళాలు, కేశనాళాల గుండా నిరంతరం ప్రవహిస్తున్నప్పుడు క్రమేపీ ఈ నాళాలు దెబ్బతింటాయి. కంటిలోని రెటీనా’ పొర నిండా కూడా రక్తకేశనాళికలు పెద్ద సంఖ్యలో ఉంటాయి. మధుమేహుల్లో ఈ కేశనాళాలు దెబ్బతిని, రెటీనా పొర మీద కొన్ని రకాల సమస్యలు బయల్దేరతాయి. క్రమేపీ ఇవే చూపు దెబ్బతినటానికి దారి తీస్తాయి.
–రెండోది- మన రక్తంలోని ఎర్ర కణాల్లో హిమోగ్లోబిన్‌ ఉంటుంది. శరీర భాగాలన్నింటికీ ఇది ఆక్సిజన్‌ను సరఫరా చేస్తుంటుంది. రక్తంలో ఎప్పుడైతే గ్లూకోజు స్థాయిలు ఎక్కువైపోతాయో.. అప్పుడా గ్లూకోజు ఎర్ర కణాల్లో కూడా చేరిపోతుంది (గ్లైకేషన్‌). ఫలితంగా ఎర్ర కణాలు సరిగా పనిచెయ్యలేవు. దీంతో శరీర భాగాలకు ఆక్సిజన్‌ సరఫరా తగ్గిపోతుంది, వాటి పని మందగిస్తుంది. రెటీనా పొరకు కూడా ఇలాగే ఆక్సిజన్‌ అందక, దాని పనితీరు దెబ్బతింటుంది.
లక్షణాలు
తొలిదశలో ఎలాంటి లక్షణాలూ ఉండవు. చూపు బానే ఉంటుంది. క్రమేపీ ముదురుతున్న దశలో- అక్షరాలు వంకరగా అగుపించటం, పక్క పదం కనబడకపోవటం వంటి లక్షణాలు తలెత్తుతాయి. ఇలాంటి సూక్ష్మమైన మార్పులను గుర్తించటం కీలకం. నిజానికి లక్షణాలు కొద్దిగా కనబడటం ఆరంభమయ్యే సరికే లోపల సమస్య తీవ్రమై ఉంటుందని, చూపు దెబ్బతినటాకి దారితీస్తోందని గుర్తించాలి. ఈ సమయంలో జాగ్రత్త పడితే సమస్య ఇంకా ముదిరి చూపు పూర్తిగా పోయే స్థితి రాకుండా చూసుకోవచ్చు. కాబట్టి చూపులో ఎలాంటి తేడా కనబడినా అశ్రద్ధ చేయకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించి, తప్పకుండా రెటీనా పరీక్ష చేయించుకోవాలి.
ఇలా ఎప్పుడు జరుగుతుంది?
కంటి సమస్యలు మధుమేహులు ఎవరికైనా రావచ్చుగానీ… దీర్ఘకాలంగా మధుమేహం ఉన్నవారికి, ముఖ్యంగా మధుమేహం నియంత్రణలో లేని వారికి ఈ సమస్యల ముప్పు చాలా ఎక్కువ. మధుమేహం వచ్చిన పదేళ్ల తర్వాత దుష్ప్రభావాలు మొదలవ్వచ్చు. అయితే మధుమేహాన్ని నియంత్రణలో పెట్టుకోకపోతే 10 ఏళ్ల తర్వాత రావాల్సిన మార్పులు ఐదేళ్లకే రావచ్చు. అవి పదేళ్లకల్లా చూపును దెబ్బతీసే స్థాయికి చేరుకోవచ్చు. ఉదాహరణకు 40 ఏళ్ల వయసులో మధుమేహం వచ్చి, పదేళ్ల పాటు నియంత్రణలో లేకపోతే 50 ఏళ్లకల్లా చదవటానికి అవసరమైన సున్నితమైన చూపు దెబ్బతినొచ్చు. ఆ తర్వాత పనులు చేసుకోవటానికి అవసరమైన చూపూ పోవచ్చు. దీంతో కుటుంబం మొత్తం అస్తవ్యస్తమైపోతుంది. ఇలా ఎంతోమంది ఉపాధి కోల్పోతున్నారు. అందుకే దీన్ని ఏమాత్రం విస్మరించటానికి లేదు.
పరీక్షలు
నేరుగా రెటీనా పొరను చూడటం చాలా ముఖ్యం. దీన్ని ఫండస్‌ ఎగ్జామినేషన్‌’ అంటారు. ఇందుకు ఫండోస్కోపీ, అలాగే డైరెక్ట్‌-ఇన్‌డైరెక్ట్‌ ఫండస్‌ కెమేరాలు బాగా ఉపయోగపడతాయి. స్లిట్‌ల్యాంప్‌లో కూడా కటకాల సాయంతో కంటిపాపను పెద్దదిగా చేసి పరీక్షిస్తే రెటీనా మధ్యభాగంలో (మాక్యులాలో) ఏదైనా సమస్య ఉంటే తెలుస్తుంది. ఈ పరీక్షలను తరచుగా చేస్తుంటే రెటీనా సమస్యలను ముందుగానే పసిగట్టే వీలుంది. –ఫ్లోరొసిన్‌ యాంజియోగ్రఫీ:
రెటీనా పొర మీద మధుమేహం కారణంగా మార్పులు మొదలై.. రక్తనాళాలు అక్కడక్కడ ఉబ్బుతున్నాయని గుర్తించిన వారికి తప్పనిసరిగా చెయ్యాల్సిన పరీక్ష ఇది. దీన్ని రెటీనల్‌ యాంజియోగ్రామ్‌’ అంటారు. ఇందులో ముందుగా ముంజేతి రక్తనాళంలోకి ఒక రకం రంగు పదార్థాన్ని (సోడియం ఫ్లోరొసిన్‌) ఎక్కిస్తారు. ఇది 15-20 సెకండ్లలోపే కంటిలోని రెటీనాను చేరుకుంటుంది. ఈ సమయంలో చకచకా రెటీనాను ఫొటోలు తీస్తారు. దీనిలో కేశరక్తనాళాలు ఎలా ఉన్నాయి? అవి ఎక్కడెక్కడ ఉబ్బాయి? వాటిల్లోంచి రక్తం లేదా ద్రవం లీకవుతోందా? రక్తనాళాలు ఎక్కడన్నా మూసుకుపోయాయా? వాటిస్థానంలో కొత్తవి పుట్టుకొస్తున్నాయా? తదితర సమాచారం అంతా తెలుస్తుంది. రెటినోపతి ఏ దశలో ఉందన్నది ఇందులో బయటపడుతుంది.
–ఆప్టికల్‌ కొహెరెన్స్‌ టోమోగ్రఫీ (ఓసీటీ): ఇందులో ఇన్‌ఫ్రారెడ్‌ కిరణాలను రెటీనా మీద పడేలా చేస్తారు. ఇవి పరావర్తనం చెంది.. స్కానింగు చిత్రం వస్తుంది. ఇందులో రెటీనా పొరల్లో, ముఖ్యంగా రెటీనా మధ్య భాగం మాక్యులాలో- వాపు ఏమైనా ఉందా? అక్కడ నీరు చేరిందా? అన్నది తెలుస్తుంది. ఈ పరీక్షల ఆధారంగా రెటీనోపతి సమస్య ఏ దశలో ఉందన్నది తెలుస్తుంది. దశను బట్టి చికిత్స చెయ్యాల్సి ఉంటుంది.

ముంచుకొచ్చే ముప్పులో తొలి దశ.. మలి దశ!
మధుమేహం కారణంగా వచ్చే రెటినోపతీ సమస్యను రెండు దశల్లో చూడొచ్చు.

retina

–తొలిదశలో- రెటీనా పొర మీద ఉండే కేశ నాళికల గోడలు దెబ్బతిని, అవి ఉబ్బుతుంటాయి. ఆ ఉబ్బిన చోట నుంచి రక్తంలోని కొవ్వులు, ద్రవాలు రెటీనా పొర మీదికి లీక్‌ అవుతుంటాయి. దీన్ని నాన్‌ ప్రోలిఫరేటివ్‌’ దశ అంటారు. ఈ దశలో చూపు క్రమక్రమంగా తగ్గుతుంటుందిగానీ మొత్తం పోదు.
మలిదశలో- రక్తనాళాలు మొత్తం మూసుకుపోతాయి. దీంతో వాటి లోటును భర్తీ చేసేందుకు కొత్త రక్తనాళాలు పుట్టుకురావటం, వాటి నుంచి రెటీనా పొర మీద రక్తస్రావం కావటం వంటి లక్షణాలు కనబడుతుంటాయి. ఇది తీవ్రమైన దశ. దీన్ని ప్రోలిఫరేటివ్‌’ దశ అంటారు. ఈ దశలో హఠాత్తుగా చూపు మొత్తం పోతుంది. మార్పులు పలు రకాలు
మధుమేహం కారణంగా రెటీనా పొర దెబ్బతినిపోవటమన్నది పలు రకాలుగా జరగొచ్చు. ఇవేమిటో చూద్దాం. –గోడల ఉబ్బటం: రెటీనా మీది కేశరక్తనాళాల గోడలు దెబ్బతిని, అక్కడక్కడ పల్చబడతాయి. దీంతో ఆ భాగంలో గోడలు బయటకు తోసుకొచ్చినట్టు.. ఉబ్బినట్టు కనబడుతుంటాయి. వీటినే మైక్రో అనూరిజమ్స్‌’ అంటారు. మధుమేహ రెటీనోపతీ సమస్యలో కనబడే తొలి లక్షణం ఇదే. ఈ స్థితిలోనే మేలుకోవటం ఉత్తమం.
–కొవ్వులు, ద్రవాలు లీకవ్వటం: రక్తనాళాలు పల్చబడి, ఉబ్బిన చోటు నుంచి రక్తంలోని కొవ్వులు, ద్రవాలు లీకయ్యి.. రెటీనా పొరలోకి చేరుకుంటాయి. ఇవి రెటీనా పొర మధ్యభాగం ‘మాక్యులా’ మీద పేరుకుంటాయి. (మ్యాక్యులోపతీ). దీంతో అక్కడ ఒత్తిడి పెరిగి, వాచి.. ఆ భాగం సరిగా పనిచేయదు. ఇలాంటివారికి చుట్టుపక్కల దృశ్యాలన్నీ బాగానే కనిపిస్తుంటాయి గానీ మధ్యలో మబ్బుగా ఉంటుంది. చిన్నచిన్న వస్తువులూ కనబడవు. అద్దాలు పెట్టుకున్నా ఉపయోగం ఉండదు. వీరికి తక్షణం రెటీనా మీది వాపును తగ్గించటమే మార్గం. వాపును తగ్గించినా కూడా చూపు కొంత మెరుగవుతుందేగానీ మునుపటి స్థాయిలో ఉండదు. అందువల్ల అసలీ స్థితికి రాకుండా చూసుకోవటం ఉత్తమం.
–నాళాలు మూసుకుపోవటం: రక్తంలో గ్లూకోజు ఎక్కువగా ఉండటం వల్ల కేశ నాళికలు మూసుకుపోవచ్చు. దీంతో రెటీనా పొర మీద కొన్నికొన్ని భాగాలకు రక్తసరఫరా ఆగిపోయి, దెబ్బతింటుంది. ఇలా రెటీనా మధ్యభాగానికి (మాక్యులాకు) రక్తసరఫరా నిలిచిపోతే- చూపు పోతుంది. చదవటం, రాయటం వంటివన్నీ కష్టమైపోతాయి. రెటీనా మీద మధ్యభాగం బాగానే ఉండి చుట్టుపక్కల దెబ్బతింటే- ఎదురుగా ఉన్న దృశ్యాలు బాగానే కనబడుతున్నా చూట్టూతా అంతా మసకగా కనబడతుంది. దీనివల్ల అటూఇటూ తిరగటం వంటివన్నీ కష్టమవుతాయి.
–కొత్త నాళాలు పుట్టటం: కేశనాళాలు మూసుకుపోయినప్పుడు రెటీనాకు ఆక్సిజన్‌ సరఫరా తగ్గుతుంది. దీంతో శరీరం ఆ లోటును భర్తీ చేసుకునేందుకు కొత్త రక్తనాళాలను తయారుచేసుకునే పని ఆరంభిస్తుంది. దీనికోసం వ్యాస్కుల్యార్‌ ఎండోథిలియల్‌ గ్రోత్‌ ఫ్యాక్టర్స్‌’ అనేవి విడుదల అవుతాయి. ఇవి పాతనాళాల పక్క నుంచి కొత్త నాళాలు పుట్టుకొచ్చేలా చేస్తాయి. అయితే ఇలా కొత్తగా పుట్టే నాళాలు పాత వాటికన్నా పల్చగా, బలహీనంగా ఉంటాయి. అందువల్ల ఇవి త్వరగా చిట్లి, వీటి నుంచి రక్తస్రావం అయ్యే అవకాశం ఎక్కువ. ఈ రక్తం రెటీనా ముందు భాగంలో ఉండే ద్రవంలో గూడు కట్టుకుంటుంది (విట్రియజ్‌ హెమరేజ్‌). దీంతో హఠాత్తుగా చూపు పోయే ప్రమాదముంది.
–రెటీనా వూడిపోవటం: మధుమేహులకు వచ్చే రెటినోపతీ’లో చివరిదశ ఇది. రెటీనా పొర ముందున్న ద్రవంలోకి రక్తస్రావం అయిపోయి.. అది గూడుకట్టినప్పుడు.. క్రమేపీ అది పొరలు పొరలుగా ఏర్పడుతుంది. అవి కరిగే క్రమంలో రెటీనా పొర ముందుకు ముందుకు గుంజినట్లవుతుంది. దీంతో రెటీనా పొర వడివడిపోయి, ¬డినట్లవుతుంది. ఇది చాలా తీవ్రమైన దశ.

retina

రెటీనా మీద వాపు, రక్తనాళాల నుంచి లీకేజీ వంటి మార్పులేం లేకపోతే.. కేవలం మధుమేహాన్ని కచ్చితంగా నియంత్రించుకుంటే చాలు. వీరికి ప్రత్యేకించి కంటి చికిత్సలేం అవసరముండదు. కానీ కేశనాళాలు ఉబ్బి, వాటి నుంచి రెటీనా మీదికి లీకేజీలు, వాపు ఉంటే.. ప్రత్యేక చికిత్సలు తప్పవు.
–లేజర్‌ చికిత్స: రక్తకేశనాళాలు అక్కడక్కడ ఉబ్బి, వాటి నుంచి ద్రవాలు రెటీనా పొర మీదకు లీకవుతూ, వాపు వస్తుంటే- ఈ స్థితిలో చూపు బాగానే అనిపించొచ్చు. అయినా దాన్ని వదిలెయ్యకూడదు. లేజర్‌తో వాటిని మాడ్చేసి, ఆ లీకేజీలను మూసెయ్యటం అవసరం. దీన్నే మ్యాక్యులర్‌ ఫొటోకొయాగ్యులేషన్‌’ అంటారు. ఇలా రెటీనా మధ్యభాగంలో ఉబ్బిన కేశ నాళికలన్నింటినీ లేజర్‌ చికిత్సతో మూసేస్తారు. ఈ చికిత్స చెయ్యకపోతే సమస్య మరింత తీవ్రమవుతుంది.
–మొత్తానికి లేజర్‌: రెటీనా పొర మీది రక్తకేశనాళాలు ఎక్కడన్నా మూసుకుపోతున్నట్టు గుర్తిస్తే- ఈ స్థితిలో కొత్త రక్తనాళాలు పుట్టుకురాకుండా చూడటం, వాటిని అడ్డుకోవటం చాలా అవసరం. అంటే రెటీనా పొరకు ఆక్సిజన్‌ అవసరాన్ని బాగా తగ్గించాలి. లేకపోతే అది కొత్త రక్తనాళాలను పుట్టించే పని మొదలుపెట్టేస్తుంది. అందుకని.. రెటీనా పొర మీద ఎక్కడ రక్తసరఫరా బాగా తగ్గిందో గుర్తించి.. ఆ భాగాన్ని లేజర్‌తో కొద్దిగా మాడ్చేస్తారు. దీంతో అక్కడ ఆక్సిజన్‌ అవసరం తగ్గుతుంది, కొత్త రక్తనాళాలు పుట్టుకొచ్చి, కొత్త సమస్యలు రాకుండా ఉంటాయి. దీన్నే ప్యాన్‌ రెటీనల్‌ కొయాగ్యులేషన్‌’ చికిత్స అంటారు. దీంతో పోయిన చూపు రాకున్నా.. మున్ముందు చూపు మరింత తగ్గకుండా చూసుకోవచ్చు. ఈ చికిత్స తీసుకున్నవాళ్లు చీకట్లో కాస్త ఇబ్బంది పడతారు. చుట్టూ చూపు కూడా కొద్దిగా తగ్గుతుంది. కాబట్టి సొంతగా వాహనాలు నడపకుండా డ్రైవర్‌ను పెట్టుకోవటం, బస్సుల్లో ప్రయాణించటం వంటి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలి.

retina

–యాంటీ-వీఈజీఎఫ్‌ ఇంజెక్షన్లు: రెటీనా పొర మీద అక్కడక్కడ రక్తసరఫరా తగ్గినప్పుడు, కొత్త రక్తనాళాలు పుట్టుకురాకుండా ఆపటానికి కొత్తగా యాంటీ-వేజఫ్‌ ఇంజెక్షన్లు అందుబాటులోకి వచ్చాయి. వీటిని ఇస్తే కొత్త రక్తనాళాలు పుట్టవు. వాపు కూడా కొంత తగ్గుతుంది. ఆ తర్వాత అవసరాన్నిబట్టి లేజర్‌ చికిత్స చెయ్యాల్సి ఉంటుంది.
–విట్రెక్టమీ: రెటీనా పొర నుంచి రక్తస్రావమై, అది కనుగుడ్డులోని ద్రవంలో గూడు కడితే- శస్త్రచికిత్స చేసి ఆ ద్రవాన్ని తొలగించాల్సి ఉంటుంది. ఈ సమయంలో రెటీనా పొర ఊ¬డి రాకుండా ఉండేందుకు అవసరాన్ని బట్టి సిలికాన్‌ ఆయిల్‌, లేదా గ్యాస్‌ నింపుతారు. అవి రెటీనాను నొక్కి పట్టి ఉంచుతాయి. క్రమంగా అక్కడ ద్రవం భర్తీ అవుతుంది, అప్పుడు ఆయిల్‌ను తీసేస్తారు. ఈ శస్త్రచికిత్స సమయంలో కూడా- రెటీనా పొరకు లేజర్‌ ఇవ్వచ్చు. దాంతో మళ్లీ రక్తస్రావమయ్యే ముప్పు తగ్గుతుంది.
కంటిలో పరిస్థితిని బట్టి ఇలా రకరకాల చికిత్సలు చెయ్యాల్సి ఉంటుంది. లేజర్‌తో పూర్తిగా తగ్గినట్టు కాదు!
చాలామంది కంటికి లేజర్‌ చికిత్స చేయించుకున్నాం.. చూపు మళ్లీ బ్రహ్మాండంగా వచ్చేస్తుందని భావిస్తుంటారుగానీ అది ఏమాత్రం నిజం కాదు. రెటీనోపతీకి చేసే చికిత్సలన్నీ కూడా సమస్య మరింతగా ముదరకుండా చూసేవేగానీ తగ్గిన చూపును పూర్తిగా తెచ్చిపెట్టేవి కాదు.పైగా ఈ చికిత్సలతో సమస్య పూర్తిగా తొలగిపోయినట్లూ కాదు. మధుమేహం కారణంగా మరోచోట.. అంటే చికిత్స చేసిన చోట కాకుండా వేరే చోట సమస్యలు బయల్దేరుతుండొచ్చు. ఈసారి వచ్చే సమస్య ఇంకాస్త ఉద్ధృతంగానూ ఉండొచ్చు. కాబట్టి చికిత్సతో అంతా అయిపోయిందనుకోకుండా.. మధుమేహాన్ని కచ్చితంగా నియంత్రణలో పెట్టుకోవాలి. వైద్యులు చెప్పినట్లుగా తరచూ కంటి పరీక్షలు చేయించుకుంటూ.. లోపల పరిస్థితి ఎలా ఉందో చూసుకుంటుండాలి. జీవితాంతం కంటి మీద ఈ శ్రద్ధ తప్పదు. లేదంటే చూపుకు ఎప్పుడైనా ఎసరు ముంచుకురావచ్చు.

Eye Allergies……కంటి అలర్జీలు.

అలర్జీ కావచ్చు.. దురద కావచ్చు.. అలవాటు కావచ్చు… కారణమేదైనా తరుచుగా, విపరీతంగా కళ్లు నులిమితే చాలా సమస్యలు మొదలవుతాయి. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కనుగుడ్డు మీద ఉండే పై పొర కార్నియా అక్కడక్కడ బాగా పల్చబడి పోయి, సాగి బయటకు తీసుకురావటం! ఒకసారి ఈ సమస్య తలెత్తితే దాన్ని జాగ్న్రత్తగా నెగ్గుకు రావటమేకాని పూర్తిగా మళ్లీ తగ్గించటం చాలా కష్టం. అందుకే దీని గురించి అందరూ అవగాహన పెంచుకోవటం అవసరం.
ముఖ్యంగా తరుచూ కంటి అలర్జీతో బాధపడేవారు దీన్ని ఎట్టి పరిస్థితుల్లోను విస్మరించటానికి వీల్లేదు. అలర్జీ మనకు సుపరిచితం! తుమ్ములతో మొదలై ముక్కు కారుతూ వేధిస్తుంది. ముక్కు అలర్జీ, దద్దుర్లు, బెందుతో వేధిస్తుంది.
ఇలాగే మన కంటికి కూడా అలర్జీ వస్తుంది. ఇది సాధారణం కూడా! కళ్లు దురద, నీరు కారటంతో మొదలయ్యే ఈ సమస్య కొందరిని విపరీతంగా, నిరంతరం వేధిస్తుంటుంది కూడా చాలామంది దురదకు తాళలేక కళ్లు నులుముకుంటూ నిర్లక్ష్యంగా తిరిగేస్తుంటారు గాని దీని వల్ల తీవ్రమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని గుర్తించటం లేదు. ముఖ్యంగా అలర్జీ కారణంగా కళ్లు విపరీతంగా రుద్దుతుండటం వల్ల కనుగుడ్డు మీద ఉండే ‘కార్నియా’ పొర బాగా పల్చగా తయారై అక్కడి నుంచి ముందుకు తోసుకొస్తూ ‘కెరటోకోనస్‌’ అనే అనర్ధం తలెత్తుతుంది. కంటి వైలుద్యు చాలా తరుచుగా చేసే సమస్యే ఇది.అసులు పరిస్థితి ఇక్కడి వరకూ రాకుండా చూసుకోవటం ఒక ముఖ్యమైన అంశం.
అలాగే ఒకవేళ ‘కెరటోకోనస్‌’ ఆరంభమైతే దీన్ని సత్వరమే గుర్తించి చికిత్స తీసుకోవటం ద్వారా పరిస్థితి మరింత ముదరకుండా చూసుకోవడం ముఖ్యం.
ఏమిటీ కెరటోకోనస్‌? : మన కనుగుడ్డు మీద రక్షణగా పట్టి ఉండే తెల్లనిపొరను ‘కార్నియా’ అంటారు. ఇదీ, దీని కిందుగా ఉండే సహజమైన లెన్సు… రెండూ కలిసి మన కంటి ముందున్న దృశ్యాన్ని లోపల ఉండే రెటీనా పొర మీద కేంద్రీకృతమయ్యేలా చూస్తాయి. దీంతో మనకు దృశ్యం కనపడుతుంది. విపరీతంగా కంటిని నులమటం, నలపటం వల్ల కనుగ్నుడ్డు మీద ఉంటే ఈ కార్నియా పొర పల్చపడే అవకాశం ఉంటుంది. ఇలా ఎక్కడ పల్చబడితే అక్కడ దీని బిగువు స్వభావం తగ్గి లోపలి నుంచి ముందుకు తోసుకురావటం మొదవుతుంది. దీన్నే ‘కెరటోకోనస్‌’ అంటారు. ఇది సాధారణంగా 20,30 ఏళ్ల వయసులో రావచ్చు. దీనివ్ల మైనస్‌ పవర్‌లో తేడాలు వస్తుంటాయి. (సిలిండ్రికల్‌ పవర్‌ తోడవుతుంటుంది) కాబట్టి ఎవరికైనా చూపు మసకగా ఉందనిపిస్తే వైద్యుతో పరీక్ష చేయించుకోవడం మంచిది. కంటి పరీక్షలో వారికి సిలిండ్రికల్‌ పవర్‌ ఉండి అది క్రమేపీ పెరుగ్నుతున్నట్టనిపిస్తే వైద్యులు కెరటోకోనస్‌ ఉందేమో అనుమానించి కొన్ని ప్రత్యేక పరీక్షలు చేస్తారు. కెరటోకోనస్‌ నిర్లక్ష్యం చేస్తే ఇది క్రమేపి పెరుగ్నుతూ చివరికి కార్నియా లోపలి పొర ఎండీథీలియం చిరగినట్లైపోతుంది. దీన్ని ‘కార్నియల్‌ హైడ్రాప్స్‌’ అంటారు. కార్నియా పొర బాగా ముందుకు తోసుకొచ్చినప్పుడు అందులోకి నీరు తోసుకొచ్చి వాపు వచ్చి, వెంటనే చూపు తగ్గి పోతుంది.
ఇవన్నీ కూడా కన్నును ఎక్కువగా రుద్దడం వల్ల వచ్చే విపరిణామాలు, అయితే రుద్దేవాళ్లందరికి కెరటోకోనస్‌ రాకపోవచ్చు. అందుకే వైద్యు దీనికి జన్యుపరమైన అంశాలు కూడా తోడవుతాయని భావిస్తున్నారు. తరుచూ తల్లీ పిల్లలల్లో, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లలో చూస్తుంటాం ఇది జన్యువు ప్రమేయాన్ని పట్టి చెప్పే అంశం.
కళ్లెందుకు రుద్దుతారు? : 1. కొందరు ఒక్కసారి కళ్లు నులుముకుంటే చూపు బాగా కనబడుతుందని భావిస్తూ తరుచూ, అప్రయత్నంగా కళ్లు నులుముకుంటుంటారు.
2. కంటి అలర్జీన్నవారు వాళ్లు దురదతో తరచూ కళ్లను నలుపుతుంటారు.
3. డౌన్స్‌ సిండ్రోమ్‌ వంటి సమస్యున్న వారికి కూడా ఈ సమస్య ఎక్కువ. చాలాసార్లు పిల్లలు రుద్దీ, రుద్దీ లోపలి పొర చినిగిన తర్వాత గాని తల్లిదండ్రులు వైద్యుల వద్దకు తీసుకురారు.
4. కొందరికి నోట్లో వేలు పెట్టుకోవటం లాగే కన్ను రుద్దుకోవటం కూడా ఒక అలవాటుగా ఉంటుంది. వీరిలో కూడా ‘కెరటోకోనస్‌’ ఉండొచ్చు.
మొత్తం మీద దీర్ఘకాలం కంటిని రుద్దుతుంటే కెరటోకోనస్‌ వస్తుందని కచ్ఛితంగా చెప్పవచ్చు
నిర్ధారించుకునేదెలా? : కెరటోకోనస్‌ ఉందేమో అని అన్న అనుమానం బలంగా ఉన్నప్పుడు ‘టోపోగ్రఫీ’ అనే పరీక్ష చేస్తారు. దీనిలో గుండ్రంగా ఉండాల్సిన కార్నియా వంపు మారిందా? ఎక్కడ ఎలా ఉందన్నది క్షుణ్ణంగా పరీక్షిస్తారు. కెరటోకోనస్‌ తొలిదశలో ఉన్నప్పుడు సాధారణంగా కనుగుడ్డు కింది అర్థభాగంలో ముందుకు తోసుకొచ్చినట్లు స్పష్టంగా కనపడుతుంది.
కొంచెం ముదిరితే కంటి వైద్యులు సాధారణంగా చేసే ‘స్లిట్‌ ల్యాంప్‌’ పరీక్షలోనే కార్నియా పొర పల్చబడినట్లు కనబడటం, కార్నియా మీద నాడులు బాగా కనబడటం, బయటకు తోసుకొస్తున్న చోట ఆ చుట్టూ ఒక రింగ్‌లా కనబడటం, మచ్చులు రావటం వంటి లక్షణాలు కనబడతాయి. టార్చ్‌లైట్‌తో రెటినోస్కోప్‌ తో చూసినప్పుడు కూడా వైద్యులకు కొన్ని ప్రత్యేక లక్షణాలు కనబడతాయి.
కెరటోమెట్రీ అనే పరీక్షలో కార్నియా వంపు ఎక్కడెక్కడ ఎంత ఉందో స్పష్టంగా తెలుస్తుంది. టోపోగ్రఫీ లోనే ఇప్పుడు ‘అబ్‌స్కాన్‌’ అనే కొత్త పద్దతి వచ్చింది. దీనిలో మొత్తం వివరాన్నీ తెలుస్తాయి.
ఈ మూడింటిని బట్టి ‘కెరటోకోనస్‌’ అని నిర్ధారిస్తారు. చికిత్స
1. అలర్జీ ఉంటే దానికి చికిత్స చేసి తగ్గిస్తారు ముందు చూపు చక్కబడేందుకు అద్దాలు ఇస్తారు. సిలిండ్రికల్‌ పవర్‌ మరీ ఎక్కువగా ఉంటే దృష్టిని సరిచేయటానికి ‘కాంటాక్ట్‌ లెన్సు’ ఇస్తారు. దీనిలో కూడా ‘సాఫ్ట్‌ లెన్సు’ తో ఉపయోగం ఉండదు. హార్డ్‌ లెన్సు అవసరం గానీ వాటితో ఇతరత్రా సమస్యలు రావచ్చు. కాబట్టి ఇప్పుడు ‘ఆర్‌జీపీ రిజిడ్‌ గ్యాస్‌ పర్మియబుల్‌’ లెన్సు, సాఫ్ట్‌ `హార్ట్‌ లెన్సు కలిసి వచ్చే పిగ్గీ బ్యాక్‌ లెన్సు వంటివి ఉపయోగ పడతాయి. కొత్తగా గుడ్డు మొత్తాన్ని ఆవరించి పెద్దగా ఉండే ‘స్ల్కీరల్‌’ లెన్సు వస్తున్నాయి.వీటితో ప్రయోజనం అధికమే కాని ఇవి ఖరీదైనవి, క్రమేపీ బాగా ప్రాచుర్యంలోకి వస్తున్నాయి.
2. సర్జరీ : కార్నియా నుంచి తోసుకొచ్చిన ఉబ్బు భాగాన్ని సరిచేసేందుకు లోపల రింగ్స్‌ అమర్చే విధానం ఉంది. దీంతో చూపు మెరుగవుతుంది. దీనిపైన కాంటాక్స్‌ లెన్సు పెట్టుకోవటం కూడా తేలిక అవుతుంది. మరీ ఎక్కువగా పొడుచుకొస్తే మాత్రం కార్నియా మార్పిడి సర్జరీ చెయ్యాల్సివస్తుంది. ఇటీవల కాలంలో ఈ సర్జరీ మొత్తం కార్నియా అంతా మార్చకుండా కొంతభాగమే మార్పిడి చేసే ‘డీఎల్‌కేపీ’ తరహా ఆధునిక పద్దతులు వచ్చాయి. ఫలితాలు బాగుంటున్నాయి.
3. ముదరకుండా : కెరటోకోనస్‌ మరితంగా ముదరకుండా చూసేందుకు తాజాగా ‘కొలాజెన్‌ క్రాస్‌లింకింగ్‌’ అనే విధానం అందుబాటులోకి వచ్చింది. ఇందులో ఒక ప్రత్యేక పధ్దతిలో కనుగుడ్డు మీదకు అతినీలోహిత కిరణాలను ప్రసరింపచేస్తారు. దీంతో పొరను ధృఢంగా పట్టి ఉంచే ఫైబర్స్‌ అన్నీ బలంగా ఒకదాంతో మరోటి అతుక్కుని (క్రాస్‌ లింకింగ్‌) కొలాజెన్‌ ధృఢంగా అవుతుంది. సాగటం కొంత తగ్గుతుంది. దీంతో కెరటోకోనస్‌ మరింత ముదరకుండా నివారిస్తుంది. మొత్తమ్మీద… అసలు పరిస్థితి ఇక్కడి వరకూ రాకుండా చూసుకోవడం, కన్నును నలపకుండా అలర్జీ తగ్గటానికి చికిత్స తీసుకోవటం అత్యుత్తమం.
4. అలర్జీ దశలోనే అడ్డుకట్ట మేలు : మిగతా అలర్జీల్లాగే కంటి అలర్జీ కూడా ఎక్కువగా పుప్పొడి రాలే కాలంలో కనిపిస్తుంటుంది. అయితే కొందరిలో ఇది ఏడాదంతా (పెరీనియల్‌) ఉంటుంది కూడా. కంటి అలర్జీ వర్నల్‌ కెరటో కంజెక్టివైటిస్‌ (వీకేసీ) చాలా తీవ్రమైంది. ఇది మనదేశంలో ఎక్కువ సాధారణంగా ఇది 8-12 ఏళ్లవయస్సులో వస్తుంటుంది. ఇతర దేశాల్లో ఇది వయసుతో పాటు తగ్గిపోతుంది. కాని మన దగ్గర చాలా ఏళ్లపాటు కొనసాగుతూనే వుంటుంది.
5. కంటి అలర్జీ ముదిరిపోతే కెరటోకోనస్‌ తో సహా ఎన్నో అనర్ధాలు పొంచివుంటాయి. కాబట్టి అలర్జీని విస్మరించకూడదు. చాలామందికి దుమ్ము, ధూళి, కాలుష్యం, పొగ వంటివి పడవు. దీంతో కంటిలోని వివిధ భాగాల్లో వాపు, చికాకు ఆరంభమవుతుంది. సాధారణంగా ఇది కనుగుడ్డు మీద ఉండే పారదర్శక పైపొర కార్నియా , రెప్పల్లోపల ఉండే కంజెక్ల్తెవా పొర, నల్లగుడ్డు, తెల్లగుడ్డు కలిసే లింబస్‌ వంటివి అన్ని అలర్జీకి ప్రభావితమవుతుంటాయి. కన్ను దురద పెట్టడం, మంట, ఎరుపెక్కడం, నీళ్లుకారడం, వెలుతురు చూడలేకపోవడం తరుచూ కళ్లు నులమటం, రుద్దటం దీని లక్షణాలు .
6. ఈ అలర్జీకి ప్రధానంగా తవిటిపురుగలు (డస్ట్‌మైడ్స్‌) పుప్పొడి , కుక్క, పిల్లి వంటి జంతువుల బొచ్చు, పత్తి, దూది వంటి ధూళి కణాలు, కొన్ని రకాల రసాయనాలు కారణమవుతుంటాయి.
7. పుండు పడొచ్చు: కంటి అలర్జీతో బాధపడే వారిలో కనురెప్ప లోపలి భాగం (పాల్‌పెబ్రల్‌ కంజెక్లైవా) లో అక్కడక్కడా ఎర్రగా అయి, వాచి, ఉబ్బినట్టుగా ఉంటాయి. వీటినే పాపిలే అంటారు. అలర్జీ తీవ్రంగా ఉంటే ఇవి పెద్దపెద్దగా కూడా ఏర్పడతాయి. కళ్లనుంచి తీగ సాగుతూ జిగురు స్రవాలు రావడం మొదవుతుంది. అలర్జీ దీర్ఘకాలంగా ఉంటే రెప్పలోపలి భాగంలో మచ్చులు వస్తాయి. లింబస్‌ ప్రాంతం మందంగా అవుతుంది. పైన రెప్పలోపల ఉండే వీటినే షీల్డ్‌ అ్సర్స్‌’’ అంటారు. దీని మీద తెల్లగా పొర పేరుకుని పుండు మానకుండా తయారవుతుంది. దీనికి చికిత్స చేయకపోతే ఇన్ఫ్‌క్షన్లు వస్తాయి. దీనివలన పిల్లలల్లో కార్నియా మీద మచ్చ ఏర్పడటం, మెల్ల రావడం వంటి దుష్ప్రభావాలు వుంటాయి. కంటిని అతిగా రుద్దడం వల్ల కెరటోకోనస్‌ రావచ్చు. ఇంకా చాలా రకాల దుష్ప్రభావాలు పొంచి వుంటాయి.
చికిత్స: అలర్జీ తెచ్చిపెడుతున్న కారకాలకు దూరంగా ఉండటం ప్రధానం. దుమ్ము, ధూళి, కాలుష్యాల్లోకి వెళ్లకపోవడం, ఇల్లు దులిపినపుడు దూరంగా వుండడం, పుప్పొడి తగలకుండా చూసుకోవడం వంటి జాగ్రత్తలు పాటించాలి. చేతుతో కళ్లను అసలే రుద్దకూడదు. ఐసు, లేదా చల్లని నీటితో కళ్లకు కాపడం పెట్టుకుంటే ఉపశమనంగా ఉంటుంది. చికిత్సలో భాగంగా వైద్యుల అలర్జీతో అతిగా స్పందిస్తున్న కణాలను నెమ్మదింపచేసేందుకు ‘‘క్రోమాల్‌ ఫోర్ట్‌’ వంటివి ఇస్తారు. ఇప్పుడు యాంటీ హిస్టమిన్‌, మాస్ట్‌సెల్‌, స్టెబిలైజర్లతో కూడిన ఓలోప్యాటాడిన్‌ మందులు కూడా అందుబాటులోకి వచ్చాయా. కళ్లు పొడి బారకుండా చూసేందుకు, అలర్జీ కారకాలను బయటకు పంపించేందుకు ‘ఆర్టిఫిషియల్‌ టియర్స్‌’ వంటి చుక్కల మందు ఇస్తారు. వీటితో వాపు మూలంగా వచ్చే మంట నుంచి కూడా ఉపశమనం ఉంటుంది. అవసరాన్ని బట్టి లివోసిట్రజిన్‌ వంటి యాంటీ హిస్టమిన్‌ మాత్రలు కూడా ఇస్తారు. వాపు మరీ ఎక్కువగా ఉంటే కొద్దిరోజు పాటు స్టిరాయిడ్స్‌ చుక్కల మందుకూడా ఇవ్వాల్సివుంటుంది. కానీ వీటిని ఎక్కువగా వాడితే నీటికాసులు, శుక్లాలు వంటివి వచ్చే ప్రమాదముంది.
కాబట్టి వీటిలోతక్కువ ప్రభావం కల వాటిని ఇస్తారు. వీటితో ఫలితం లేకపోతే కనురెప్ప క్రింద స్టిరాయిడ్‌ ఇంజక్షన్ ఇస్తారు. వాపు మరీ ఎక్కువగా వుంటే సైక్లోస్పోరిన్‌ చుక్కల మందు బాగా ఉపయోగపడుతుంది. ఆస్తమా బాధితుకు ఇచ్చే మాంటికాస్ట్‌ తరహా మందులతోను ప్రయోజనం ఉంటుంది. వీటన్నింటిని వైద్య పర్యవేక్షణలో వాడుకోవడం అవసరం. మరీ పెద్దపుండ్లు పడితే పై పొరను తొలగించి అక్కడ మాయనుంచి తయారు చేసిన పలచటి పొరను ( అమ్నియాటిక్‌ మెంబ్రేన్స్‌) పొరను అమర్చుతారు. ఇవి పుండు త్వరగా మానేందుకు దోహదం చేస్తాయి.
మందపాటి అద్దాలు ధరించాల్సిన అవసరం లేకుండా చేసే ‘లాసిక్‌’ సర్జరీ ఇటీవ కాలంలో విస్తృతంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అయితే ‘కెరటోకోనస్‌’ సమస్య ఉన్నవారికి లాసిక్‌ సర్జరీ చెయ్యకూడదు. అందుకే లాసిక్‌ సర్జరీకి ముందు కార్నియా పొర తగినంత మందం ఉందా? లేదా? అన్నదీ చూడటంతో పాటు కెరటోకోనస్‌ లేదని కూడా నిర్ధారించుకున్న తర్వాతే లాసిక్‌ సర్జరీ చేస్తారు.

Cataract…..క్యాటరాక్ట్‌

వయసుతోపాటు సహజంగా వచ్చే కంటి సమస్య క్యాటరాక్ట్‌. ప్రపంచంలో 60 శాతం మందిలో క్యాటరాక్ట్‌ వలన అంధత్వం వస్తుంది. ఇది చాలా సాధారణ శస్త్రచికిత్సతో సరిచేయగలిగిన సమస్య.
మన కంట్లో సహజమైన/పారదర్శకమైన లెన్స్‌ ఉంటుంది. ఆ లెన్స్‌ ద్యారానే కాంతి ప్రయాణం చేసి రెటీనా అనే తెరపై పడుతుంది. ఈ రెటీనా అనే తెరపై ఏర్పడే ప్రతిబింబం ద్వారానే మనం చూడగలుగుతుంటాం. స్వాభావికంగా మన కంట్లో ఉన్న ఈ లెన్స్‌ ఒక అద్భుతమైన అవయవం. ఈ లెన్స్‌ క్రమంగా మందం అయిపోవటం దాని పారదర్శకతను కోల్పోవటం జరుగుతుంది. ఫలితంగా కాంతి దానిగుండా ప్రయాణం చేయడం సాధ్యం కాదు. దీనితో క్రమంగా చూపు మసకబారుతుంది. దీనినే క్యాటరాక్ట్‌ అంటారు. ఇది వయసుతో పాటు సహజంగా వస్తుంది.
చికిత్స : గతంలో ఈ లెన్స్‌ను తొలగించి కార్నియాపై కుట్లు వేసేవారు. ఆ కుట్లు కార్నియాపై 13-14 ఎం.ఎం. మేరకు ఉండేవి. తరువాత ఆక్రిలిక్‌ టెక్నాలజీలో వచ్చిన మార్పులతో కృత్రిమ లెన్స్‌ తయారుచేశారు. పాత స్వాభావిక లెన్స్‌ స్ధానంలో వీటిని అమర్చటం చేస్తారు. దీంతో ఆపరేషన్‌ తరువాత కనుచూపు మెరుగవ్వటం జరిగేది. ఈ విధానంలో కూడా 10-12 ఎం.ఎం. కుట్లు వేయాల్సి వుంది.
ఫ్యాకో ఎమల్సిఫికేషన్‌ (పిఈ) : క్యాటరాక్ట్‌ చికిత్సలో ఫ్యాకో ఎమల్సిఫికేషన్‌ ఒక ఆధునిక ప్రక్రియ. కంప్యూటర్‌ సహాయంతో నిర్వహిస్తారు. అయితే ఇది కాస్తంత ఖరీదైనది. క్యాటరాక్ట్‌కు ఫ్యాకో ఎమల్సిఫికేషన్‌ ద్వారా చికిత్స అందిస్తున్న దక్షిణాసియా దేశాల్లో భారతదేశం మొట్టమొదటి దేశం. ఈ ప్రక్రియలో క్యాటరాక్ట్‌ను ఫ్యాకో ఎమల్సిఫికేషన్‌ ప్రోబ్‌ సహాయంతో చిన్న చిన్నముక్కలుగా చేసి వాటన్నింటిని సక్షన్‌ ప్రక్రియ ద్వారా తొలగిస్తారు. ఆ స్థానంలో కొత్త లెన్స్‌ అమరుస్తారు. చాలా తక్కువ వ్యవధిలో దీనిని చేస్తారు. ఇందుకోసం కార్నియాపై 3 ఎం ఎం గాటు మాత్రమే పెడతారు. గాటు చిన్నది కావటం, కుట్లు వేయాల్సిన అవసరం లేక పోవటంతో గాయం త్వరగా మానుతుంది. దీనిలో రిస్క్‌ కూడా తక్కువ. పేషంట్లు చాలా త్వరగా తమ వృత్తి, ఉద్యోగాలకు వెళ్లవచ్చు.
IOL : ఇంట్రా ఆక్యులర్‌ లెన్స్‌ మరింత ఆధునికమైనవి (ఐఓయల్‌) మడత పెట్టగలిగేవి, ఎలాస్టిక్‌ లెన్స్‌లు, ఇంజెక్టబుల్‌ లెన్స్‌ రూపొందిస్తున్నారు. గతంలో లాగా క్యాటరాక్ట్‌ చికిత్సకు పూర్తిగా మత్తు ఇవ్వవలసిన అవసరం లేదు కూడా. కేవలం లోకల్‌ అనస్థీషియా ఇస్తారు. నొప్పి కూడా తక్కువ. ఆపరేషన్ చేయించుకున్న తరువాత హాస్పటల్ లో ఉండనవసరం లేదు. వెంటనే వెళ్లిపోయి తిరిగి డాక్టర్ సలహా ప్రకారం పరీక్షలకు రావలిసి ఉంటుంది.

కంటి జాగ్రత్తలు

ఆధునిక జీవనశైలిలో పిల్లల నుంచి పెద్దల దాకా అందరిమీదా ఒత్తిడి, భారం పడుతున్నాయి. అన్నిటి ప్రభావం చివరకు కళ్ళమీదనే పడుతుంది. కంటిపై ప్రభావం చూపించడానికి నిద్రలేమి, అలసట, ఒత్తిడి, దిగులు, ఆందోళన, ఇలా కారణాలెన్నో.
నిర్లక్ష్యం కొన్నిసార్లు కంటి సమస్యలకు కారణమవుతుంది. మన ప్రతి కదలిక కంటి చూపుపై ఆధారపడి ఉంది. కళ్ళు అవి ఎంత చిన్నవైన, చెంపకు చారెడేసైనా మన జీవితానికి అవే వెలుగులు. కళ్ళులేని జీవనాన్ని ఊహించుకోలేము. మన కళ్ళు శరీరానికి అమరిన సహజ సౌందర్యాభరణాలు. ఆరోగ్యానికి ఆనవాళ్ళు. ఏ దృశ్యాన్నయినా, సన్నివేశాన్నయినా, వ్యక్తిత్వాన్నయినా సహజంగా చూపించడంలో కళ్ళు ప్రధాన భూమిక అవుతాయి.
కళ్ళకు శత్రువు సూర్యుడు : జీవకోటికి ఎంతో మేలుచేసే సూర్యుడే కళ్ళకు శత్రువు. సూర్యుడి నుంచి ప్రసరించే అతినీలలోహిత కిరణాలవలన కళ్ళు పాడవుతాయి. ఆకాశం మేఘావృతమైనా కళ్ళకు ఈ పరిస్థితి తప్పదు. బయట ఎండలో తిరిగేటప్పుడు ఆల్ట్రావయెలెట్ రేస్‌ నుంచి రక్షణనిచ్చే సన్‌గ్లాసెస్‌ పెట్టుకోవటం మంచిది. ఎండలోని అతినీలలోహిత కిరణాలనుంచి కంటికి రక్షణ కావాలి. ఇక గాలిలో ఉండే దుమ్ము, ధూళి కంటి శుక్ల పటలానికి ఇబ్బంది కలిగిస్తాయి.
దుమ్ము, ధూళి, అధిక సూర్యరశ్మి నుంచి కళ్ళను కాపాడుకోవానికి రక్షణగా కళ్ళద్దాలు ధరించాలి. ఇవి కంటికి రక్షణ కవచంలా పనిచేస్తాయి. వాహన చోదకులు ప్రయాణాలలో తప్పకుండా కళ్ళద్దాలు ధరించాలి. లేకపోతే ఎదురుగాలి వలన కంట్లో తేమ ఆవిరవుతుంది. కళ్ళపై వత్తిడి పెరుగుతుంది. దాంతో కంటి చూపు మందగిస్తుంది. ఎండల్లో ఎక్కువగా తిరిగేవారు చలవ కళ్ళద్ధాలు పెట్టుకోవడం వలన ఎండలోని ఆల్ట్రావయోలెట్ కిరణాల ప్రభావం గణనీయంగా తగ్గిపోతుంది.
చూపు తిప్పుకోలేని కళ్ళు : చూపుతిప్పుకోలేని కళ్ళు అందాలు, నయన సోయగాలు కొందరికే దక్కే సౌందర్య నిక్షేపాలు. అలసటను నివారించటమే నయనాల మెరుపుకి అసలైన కీలకం. ఆధునిక జీవనసరళిలో ‘లాప్ టాప్‌’ అంతర్భాగమైంది. అది లేకపోతే ఇవాళ చాలా మందికి అసలు పని ముందుకే సాగదు. అలా అని మితిమీరి పనిచేయడం కళ్ళకు విశ్రాంతి లేకుండా తదేక ధ్యాసంతో పనిచేయడం వలన కళ్ళు అలసిపోతాయి. మండుతాయి. చూపు మందగించడం లాంటి సమస్యలు ఎదురవుతాయి. కొంతమంది ఆఫీసులో తాము చేసే పని చాలదన్నట్లు ఇంటికి వచ్చాక కూడా కంప్యూటర్‌ ముందు తిష్టవేస్తారు. గంటల తరబడి చాటింగ్ చేస్తుంటారు. కాకపోతే రిలాక్సేషన్‌ పేరుతో టివి.కి కళ్ళు అతికించేసుకుంటారు.
ఇవన్నీ ఇవాల్టి జీవనశైలిలో భాగమే కావచ్చు కాని వెలుగునిచ్చే కళ్ళును నిర్లక్ష్యం చేస్తే ముప్పు తప్పదు. యాంటీగ్లేర్‌ గ్లాస్‌లు పోలరైజ్డ్‌ సన్‌గ్లాస్‌లు ధరించడం వలన కంప్యూటర్‌, సూర్యకాంతి, అతినీలలోహిత కిరణాల నుంచి కళ్ళకు కొంతమేరకు రక్షణ వుంటుంది. కంటిపై ఒత్తిడి కూడా తగ్గుతుంది. కళ్ళకు విశ్రాంతి చాలా ముఖ్యం. ఏ పని చేస్తున్నా మధ్యమధ్యలో ప్రతి పదినిమిషాలకొకసారి కళ్ళను ఓ నిమిషంపాటు మూసుకొని ఉంచాలి.
కంప్యూటర్‌ ముందు పనిచేసేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు : కంప్యూటర్‌ దగ్గర గంటలతరబడి పని చేసే కళ్ళకు రక్షణ అవసరమే. కంప్యూటర్‌ ముందు కూర్చొని పనిచేసేవారు క్రమం తప్పకుండా కళ్ళ రెప్పలను ఆడిస్తూ ఉండాలి. కళ్ళపై మరీ ఎక్కువ కాంతి పడకుండా జాగ్రత్త తీసుకోవాలి. పరిసరాలలో తగినంతగా కాంతి ఉండేలా చూసుకోవాలి. లేకపోతే కళ్ళు అధిక శ్రమకు ఒత్తిడికి లోనై కంటి చూపు మందగించే ప్రమాదం కూడా ఉంది. కంటి సమస్యలున్న వాళ్ళలో కొందరికి కళ్ళద్దాలు తప్పనిసరి.
విశ్రాంతి అవసరం : మధ్య మధ్యలో కనురెప్పలను ఆడించకుండా తదేక ధ్యాసతో కంపూటర్స్‌పై పనిచేస్తే కళ్ళ పొడిబారుతాయి. కళ్ళుమూసి, తెరుస్తూ రెప్పలను ఆడించడం వలన కళ్ళలో నీళ్ళు చేరుతాయి. కళ్ళు తేమగా వుంటాయి.
కళ్ళు మూసుకున్నపుడు సహజమైన తేమను కలిగి వుంటాయి. అందువల్ల కళ్ళు శుభ్రపడతాయి. కాబట్టి తరచుగా కనురెప్పలను ఆడిస్తూ ఉండాలి. ఆందోళన, అలసట, నిద్రలేమి, దిగులు, ఒత్తిడి… కారణం ఏదైనా కావచ్చు, చాలామందికి కళ్ళ కింద నల్ల వలయాలు ఏర్పడతాయి. ఇవి ముఖంమీద ఇబ్బందికరంగా కనిపిస్తూ ఉంటాయి.
సూర్యరశ్మి ప్రభావం వలన ముఖంమీద చర్మం దెబ్బతింటుంది. ఎక్కువగా ఎండలో తిరగడంవలన సూర్యరశ్మి ప్రభావానికి అధికంగా గురికావటం వలన కంటి కింద వున్న పలుచని చర్మం మరింత పలుచన అవుతుంది. మడతలు పడుతుంది. కంటి కింద నరాలు ఉబ్బుతాయి. కొన్ని సందర్భాలలో ఎలర్జీలు కూడా కళ్ళకింద నల్ల వలయాలు రావానికి కళ్ళు ఉబ్బటానికి కారణమవుతుంటాయి. నాసికా రంధ్రాలలోని ఏవైనా అడ్డంకులూ కారణం కావచ్చు, సైనసైటిస్‌ వున్నా, జలుబు భారం ఉన్నా అవి కళ్ళకింద వాపులకు దారి తీస్తాయి.
ధూమపానం చేసే హాని : మీరు పొగ తాగకపోవచ్చు, ధూమపానం చేసే అలవాటు లేకపోవచ్చు కాని ధూమపానం చేసేవారి పక్కన నుంచున్నా సిగరెట్ పొగకు అతిసమీపంలో ఉన్నా అది కంటి చూపుపై దుష్ప్రభావాన్ని చూపుతుంది. సిగరెట్ పొగబారిన పడ్డవారిలో కళ్ళు ఎర్రబడటమో, నీరు కారడమో లేక కళ్ళు ఉబ్బడమో జరుగుతాయి. రాత్రిపూట నిద్రపోయే ముందు తల ఎత్తులో ఉండేందుకు తలకింద రెండు దిండ్లు పెట్టుకుని పడుకుంటే కళ్ళకింద నీరు చేరదు, వాపు కూడా ఏర్పడదు. రాత్రికి రాత్రే కళ్ళలోని ద్రవాలు ఆరిపోతాయి.
కంటికి రక్షణ కావాలి : ఆధునిక జీవనశైలి తెచ్చిపెడుతున్న రోగాల సరసన నేటి కంప్యూటర్‌ యుగం కనిపించని కంటి సమస్యలను తెచ్చిపెడుతోంది. ఒత్తిడి, ఊబకాయం, కంటి చూపు సమస్యలు ఈ జీవనశైలి పుణ్యమే. ఈ ఆధునిక జీవన పద్ధతి పిల్లలలో కంటి జబ్బులను పెంచుతుంది. పిల్లలకు ఆరుబయట ఆడుకునే సమయం తగ్గిపోవటం, ఎక్కువ సమయం తరగతి గదుల్లోనే, ఇండోర్లోనే అధికసమయం పుస్తకాలు, కంప్యూటర్లు, టీవీల ముందు దగ్గర దగ్గర వస్తువులను తదేకంగా చూడడానికి అలవాటుపడటంతో ఈ తరం పిల్లలలో కంటి సమస్యలు పెరుగుతున్నాయి.
కనుగుడ్లు ముందు భాగంలో లెన్స్‌ పారదర్శకత కోల్పోయి, మందంగా తయారవటం వలన దీనిగుండా కాంతికిరణాలు ప్రసరించలేవు. ఫలితంగా కంటి చూపు తగ్గిపోయి కళ్ళలో శుక్లాలు ఏర్పడవచ్చు.
శుక్లాలు : సర్వసాధారణంగా శుక్లాలు అనేవి వయస్సుతో వచ్చే సమస్య. మధుమేహం, ధూమపానం,, మద్యపానం ఎక్కువకాలం ఎండలో గడపడం వంటి వాటి వలన ఈ ముప్పు ముందే ముంచుకొస్తుంది. నేత్రవైద్య నిపుణులచే తరచుగా కళ్ళపరీక్ష చేయించుకుంటే కళ్ళు ఆరోగ్యంగా ఉండానికి దోహదం చేస్తాయి. తరచుగా తలనొప్పి వస్తుంటే నేత్రవైద్యుణ్ణి సంప్రదించాలి, ఒత్తిడి, కంటి చూపులో తేదాలు, మైగ్రేన్‌, నరాల సంబంధిత సమస్యలు ఇలా ఎన్నో తలనొప్పికి కారణమవుతాయి. కంటి కండరాలు బలహీనమైతే చూపు త్వరగా మందగిస్తుంది. డాక్టర్‌ సిఫార్సు చేసిన అద్దాలను ధరించిడంవల్ల కళ్ళకు బలం చేకూరుతుంది.
ఏమేం తినాలి : కనుపాపపై ఒత్తిడి తగ్గాలంటే వ్యాయాయం అవసరం. తేలికపాటి వ్యాయామాలు చేస్తే కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి. కంటిపై ఒత్తిడి తీవ్రమైతే గ్లకోమా సమస్య వస్తుంది. కాబట్టి వ్యాయామం తప్పనిసరి. కళ్ళను పైకి, కిందకు కుడి, ఎడమలకు గుండ్రంగా తిప్పుతూ వ్యాయామం చేస్తే కళ్ళ అలసట దూరమవుతుంది.
నీళ్ళు ఎక్కువగా తాగకపోతే శరీరంతో తేమ తగ్గుతుంది. ఆ ప్రభావం కళ్ళమీద పడుతుంది. కళ్ళుకాంతి హీనమవుతాయి. కళ్ళు బాగా అలసిపోతే విశ్రాంతిగా కనుగుడ్లు కదలిస్తూ వ్యాయామం చేయాలి. కళ్ళు, కళ్ళు చుట్టూ ఉన్న కండరాలకు చాలినంత విశ్రాంతి ఇవ్వాటానికి కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఉండాలి. తర్వాత కళ్ళు తెరచి దూరంగా చూడాలి. ఇలా రోజూ నాలుగైదుసార్లు చేస్తే కంటికి మంచిది. కళ్ళ ఆరోగ్యాన్ని కాపాడడంలో బీటారోటిన్‌ కీలక భూమిక వహిస్తుంది. కంటి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు సంతులిత ఆహారం తీసుకొవాలి. ఆహారంలో క్యారెట్స్, బొప్పాయి, మామిడి, పాలకూర, క్యాలీఫ్లవర్‌, క్యాబేజి, బ్రొకోలి, బీన్స్‌, దోసకాయ, వీటితో పాటు మీగద, పాలు,ఛీజ్‌ తీసుకోవాలి, A విటమిన్‌ సమృద్ధిగా ఉన్న ఆహారం కంటి కెంతో మంచిది.
సర్వేంద్రియాణాం నయనం ప్రధానం కాని మారుతున్న జీవనశైలి ప్రభావమో.. వయస్సు ప్రభావమో…పోషకాహార లోపమో.. ఒత్తిడి పుణ్యమో..కంటి సమస్యలు ఎదురవుతున్నాయి. కళ్ళు తమ సహజసిద్ధమైన మెరుపును, చురుకును కోల్పోతున్నాయి. ఇంద్రియాలలో కెల్లా ప్రధాన ఇంద్రియమైన కళ్ళగురించి, కంటి ఆరోగ్యం గురించి తప్పక శ్రద్ధ వహించాలి.