డేట్స్‌ హల్వా

కావలసినవి: ఖర్జూరం – 2 కప్పులు(గింజలు తొలగించి, శుభ్రం చేసుకోవాలి), నెయ్యి – 1 కప్పు, మొక్కజొన్న పిండి – 2 టేబుల్‌ స్పూన్లు(1 కప్పు నీళ్లలో బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి), నీళ్లు – సరిపడినన్ని, నెయ్యి – 2 టేబుల్‌ స్పూన్లు, జీడిపప్పు – 10(ముక్కలు కట్‌ చేసుకుని నేతిలో దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి), ఏలకుల పొడి – పావు టీ స్పూన్

తయారీ: ముందుగా ఖర్జూరంలో ఒక కప్పు వేడి నీళ్లు వేసుకుని 30 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. తర్వాత మిక్సీ పెట్టుకుని మెత్తటి పేస్ట్‌లా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్‌ ఆన్‌ చేసుకుని.. ఆ మిశ్రమాన్ని మొత్తం బౌల్లో వేసుకుని, అందులో పావు కప్పు నెయ్యి వేసుకుని గరిటెతో తిప్పుతూ చిన్న మంటపైన ఉడికించుకోవాలి. దగ్గర పడేసరికి మళ్లీ 2 టేబుల్‌ స్పూన్ల నెయ్యి వేసుకుని తిప్పుతూ ఉండాలి. తర్వాత మొక్కజొన్న మిశ్రమాన్ని వేసుకుని తిప్పుతూ ఉండాలి. మళ్లీ 2 టేబుల్‌ స్పూన్లు నెయ్యి వేసుకుని, వేయించి పక్కన నెట్టుకున్న జీడిపప్పు ముక్కలు, ఏలకుల పొడి వేసుకుని బాగా దగ్గర పడిన తర్వాత స్టవ్‌ ఆఫ్‌ చేసుకుని.. ఒక బౌల్‌లోకి తీసుకుని 30 నిమిషాలు చల్లారిన తర్వాత నచ్చిన షేప్‌లో కట్‌ చేసుకుంటే సరిపోతుంది.

టమాటో హల్వా

కావలసినవి:  పండిన టమాటోలు – 5 (నీళ్లలో మెత్తగా ఉడికించి, మిక్సీలో గుజ్జు చేసుకోవాలి), పంచదార , నెయ్యి – పావు కప్పు చొప్పున, ఫుడ్‌ కలర్‌ – కొద్దిగా (మీకు నచ్చిన రంగు), బొంబాయి రవ్వ – పావు కప్పు, డ్రై ఫ్రూట్స్‌ – 2 టేబుల్‌ స్పూన్లు (అభిరుచిని బట్టి), ఏలకుల పొడి – అర టీ స్పూన్‌

తయారీ: ముందుగా స్టవ్‌ ఆన్‌ చేసుకుని, కళాయిలో కొద్దిగా నెయ్యి వేడి చేసి.. అందులో డ్రై ఫ్రూట్స్, బొంబాయి రవ్వలను వేర్వేరుగా వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్‌ మీద కాస్త లోతుగా ఉండే పాత్రని పెట్టి.. అందులో ఒక కప్పు నీళ్లు వేసుకోవాలి. అవి కాస్త మరిగాక వేయించిన బొంబాయి రవ్వ కొద్దికొద్దిగా వేస్తూ గరిటెతో కలుపుతూ ఉండాలి. రవ్వ చిక్కబడుతున్న సమయంలో టొమాటో గుజ్జు, పంచదార, ఫుడ్‌ కలర్, సగం నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమం హల్వాలా చిక్కబడుతున్న సమయంలో ఏలకుల పొడి, మిగిలిన నెయ్యి వేసుకుని బాగా కలిపి, స్టవ్‌ ఆఫ్‌ చేసుకోవాలి. సర్వ్‌ చేసుకునే ముందు డ్రై ఫ్రూట్స్‌తో గార్నిష్‌ చేసుకుంటే సరిపోతుంది.

ఆపిల్‌ కోవా హల్వా

కావలసినవి: ఆపిల్స్‌ – 3 (పైతొక్క తొలగించి గుజ్జులా చేసుకోవాలి)
బాదం గుజ్జు – 3 టేబుల్‌ స్పూన్లు
కోవా – అర కప్పు
దాల్చినచెక్క పొడి – అర టీ స్పూన్‌ 
పంచదార – అర కప్పు
నెయ్యి – 4 లేదా 5 టేబుల్‌ స్పూన్లు.

తయారీ: ముందుగా స్టవ్‌ ఆన్‌ చేసుకుని.. 3 టేబుల్‌ స్పూన్ల నెయ్యి వేడికాగానే.. ఆపిల్‌ గుజ్జు, బాదం గుజ్జు వేసుకుని గరిటెతో తిప్పుతూ.. ఉడికించుకోవాలి. అందులో పంచదార యాడ్‌ చేసుకుని, బాగా కరిగే వరకూ తిప్పుతూ ఉండాలి. కోవా, దాల్చిన చెక్క పొడి వేసుకుని బాగా కలుపుతూ దగ్గరపడే వరకూ తిప్పుతూ మిగిలిన నెయ్యి వేసుకుని స్టవ్‌ ఆఫ్‌ చేసుకోవాలి. 

భారత దేశం లో వివిధ హల్వా రకాలు

కేంద్ర బడ్జెట్‌ ప్రతుల ముద్రణకు ముందు నిర్వహించే హల్వా వేడుక ఒకటి ఉంది. అది ఏమిటంటే బడ్జెట్ తయారీ లో అందులోని అంశాల గోప్యత కోసం ఆర్ధిక శాఖ లో బడ్జెట్ రూపకల్పన లో పాల్గొనే ఉద్యోగులు పది రోజుల పాటు ఆర్ధిక శాఖ బేస్మెంట్ లోనే ఉండిపోతారు. ముద్రణ ప్రారంభించిన రోజు ఆర్ధిక మంత్రి సమక్షం లో హల్వా అందరికి పంచి వేడుక చేసుకోవడం ఒక సంప్రదాయం.

బందర్ హల్వా మచిలీ పట్నం లో దొరికే హల్వా వెరైటీ .ఇలాగే విశాఖ కు దగ్గరలో ఉన్న మాడుగుల లో కూడా మాడుగుల హల్వా ఫేమస్ అండీ. 125 ఏళ్ళ చరిత్ర ఉన్న దగ్గేటి ధర్మా రావు షాప్ బాగా స్పెషల్. ఈ హల్వా లో రకరకాల పప్పులు కూడా వేసి చేస్తారు.

ఇక దేశం లో అయితే చేసే పదార్ధం కుడా మారుతుంది.రవ్వ తో చేసే హల్వా ,గోధుమలు,పెసర పప్పు ,కేరట్(గాజర్)ఇది ఎక్కువగ్గా పంజాబ్ లో చేస్తారు, అక్కడ గజ్రేలా అని అంటారు. ఇంకా వేపిన శనగ పప్పు,జీడిపప్పు తో కాజు హల్వా , బెంగాల్ లో మోహన్ భోగ్ , ,కర్నాటక లో దొరికే బూడిద గుమ్మడి హల్వా , దీన్ని కాశి హల్వా గా పిలుస్తారు.ఇదే కాక కేసరి బాత్ అని లేదా సుజీ హల్వా అని అన్ని శుభ కార్యాల్లో, హోటల్ లలో చేస్తారు. ఉత్తరాన నవరాత్రులలో హల్వా పూరి ఆడపిల్లలకు తప్పక పెడతారు. ఈ కేసరి బాత్ ని పైన్ ఆపిల్ ఫ్లవర్ తో చేయడం ఓ స్పెషల్ .సిఖ్ గురుద్వారాల్లో ఆటే కా హల్వా అని కడా ప్రసాద్ గా ఇస్తారు.బొంబాయి లో స్వీట్ షాప్ ఓనర్ లను హల్వాయీ లు గా పిలుస్తారు.బాంబే హల్వా ఇకాడ బాగా ప్రసిద్ది.

తమిళ బ్రాహ్మల వివాహాలలో సొజ్జి బజ్జి అని హల్వా తో బజ్జీ ఇచ్చే సాంప్రదాయం ఉంది .కర్నాటక లో హోటల్ లలో ఉప్మా కేసరి బాత్ అని ఉప్మా తో రవ్వ కేసరి పెడతారు.మన సత్యనారాయణ స్వామి ప్రసాదం రవ్వకేసరి లాంటిదే కదా.

దేశం లో చేసే హల్వా రకాలలో కారట్,బీట్రూట్,బాదం,కరాచి ,మిల్క్,బ్రెడ్ హల్వా (డబల్ క మీటా),గోస్ట్ (మాంసం )చెప్పుకో దగ్గవి.

(అయేషా కుకింగ్ వారి చిత్రం)

కాశి హల్వా (వెరీగుడ్ రెసిపీస్ చిత్రం)

(కాలిమిర్చ్ నుంచి చిత్రం)

కారట్ హల్వా

తమిళ నాట తిరునల్వేలి ,కేరళ కోజికోడ్ రెండు దక్షిణాన హల్వా రాజధానులు.

తిరునల్వేలి హల్వా గోధుమ లా తో చేస్తారు. అక్కడ తామ్రపర్ణి నది నీరు హల్వా కి ప్రత్యెక రుచి నిస్తుంది అంటారు. అక్కడ ప్రధానం గా పెద్ద బాణలి లో జారుడుగా ఉండే హల్వా అరటి ఆకులో వేసి ఇస్తారు.బాగా ప్రాచుర్యం పొందిన దుకాణం ఇరుట్టు కడాయి గా పిలుస్తారు. అంటే తమిళం లో చీకటి గా ఉండే కొట్టు అని పేరు. ఇది అక్కడ నునే దీపాలు మాత్రమె ఉండటం వల్ల వచ్చిన పేరు. ఈ షాప్ కేవలం కొన్ని గంటలు మాత్రమె తెరిచినా బాగా అమ్ముడు పోతుంది.

మదురై లో ఒత కడాయి అని ఇంకో షాప్ ఉంది.పచిరాజ విలాస్ /లక్ష్మి విలాస్ అని పేరున్న ఈ షాపు కు 50 ఏళ్ళ చరిత్ర ఉన్నది.

ఈ గోధుమ హల్వా తయారీ బాగా శ్రమ తో కూడిన వ్యవహారం.2 రోజులు సాంబా గోధుమ ని నానేసి మెత్తని పిండి లాగ రాతి రుబ్బు రోళ్ళలో చేసి ,ఒక రోజు అలాగే వదిలేస్తారు. మర్నాడు నీటిని గుడ్డతో వేసి పిండేస్తారు.అలా వచ్చిన నీటిని గోధుమ పాలు అంటారు.ఈ గోధుమ పాలు చిక్కగ్గా ఉండి హల్వా తయారీ లో ప్రధాన పాత్ర వహిస్తుంది .అందుకే ఈ హల్వా నోటిలో ఐస్ క్రీమ్ లా కరిగి పోతుంది.

కోజికోడ్ హల్వా కి జామోరిన్ రాజ్యం నాటి నుంచి ప్రాచుర్యం ఉంది.ఆయన గుజరాత్ నుంచి వంటవాళ్లు తెప్పించుకుని విందులలో వండటానికి కొంత భూమిని ఇచ్చాడట. వాళ్ళున్న ప్రదేశమే ఈ రోజు SM వీధి (అంటే స్వీట్ మీట్ ) లేదా మిటాయి తెరువు అని అంటారు. కోజికోడ్ హల్వా మొత్తం నేయి తో కాక కొబ్బరి నూనే తో చేస్తారు.అక్కక దొరికే నల్ల హల్వా లేదా కరుత హల్వా బియ్యం నుంచి చేస్తారు. ఇది మధ్య ప్రాచ్యం లోని టర్కీ నుంచి దిగుమతి అయిన అలవాటు .మన రాష్ట్రం నుంచి వెళ్ళిన అయ్యప్ప భక్తులు అక్కడ నుంచి హల్వా, చిప్స్ తెచ్చుకుంటారు.

హల్వా మన దేశం లో ఢిల్లీ సుల్తానుల కాలం అయిన 13వ శతాబ్ది లో ఇండియా లో కాలు పెట్టింది.దాని మూలాలు ఓట్టోమాన్ సామ్రాజ్యం కాలం లో ఉన్నాయి. 10వ సులేమాన్ గొప్ప తీపి ప్రియుడని అతనికి ఇష్టమైన వాటిలో హల్వా ఒకటి అని చరిత్ర చెపుతోంది.అతని రాజ్యం లో తీపి వంటలు వండటానికి కి ఒక ప్రత్యెక వంటశాల ఉందంటే ఆశ్చర్యం కలగుతుంది కదా .

ఇప్పటి కాలం లో పూణే లో పచ్చి మిరప తో హరి మిర్చ్ హల్వా ,బెంగాల్ లో చోలార్ దాల్ హల్వా , కర్నాటక లో కాశి హల్వా ,ఉత్తర ప్రదేశ్ , బిహార్ లలో గుడ్డు తో అండా హల్వా, కేరళ లో కరుత హల్వా, హల్వా గారి విభిన్న అవతారాలు గా మనం భావించ వచ్చు. దీన్న్నే ఇండియన్ జుగాడ్ ( భారతీయ అన్వేషణ ప్రియత్వం) అనుకోవచ్చు.

Mango Halva….మామిడి హల్వా

కావలిసినవి :
మామిడిగుజ్జు: 4 కప్పులు
బాదం పప్పు : పావుకప్పు
యాలకులపొడి: అరటీస్పూను
జీడిపప్పు: పావుకప్పు
కార్న్‌ఫ్లోర్‌: కప్పు
నెయ్యి: అరకప్పు
పంచదార: 2 కప్పులు
మంచినీళ్లు: కప్పు

తయారుచేసే విధానం
ఓ పాన్‌లో పావు కప్పు నెయ్యి వేసి మామిడిపండు గుజ్జు వేసి కొద్దిగా వేడి చేయాలి. కార్న్‌ఫ్లోర్‌లో నీళ్ళు పోసి ఉండలు కట్టకుండా కలిపి పాన్‌లో వేసి మొత్తం మిశ్రమం చిక్కగా అయ్యేవరకూ ఉడికించాలి. తరవాత పంచదార వేసి మిశ్రమం అంచుల నుంచి వేరయ్యేవరకూ ఉడికించాలి. తరవాత మిగిలిన నెయ్యి కూడా వేసి కలుపుతూ పది నిమిషాలపాటు ఉడికించాలి. ఇప్పుడు సన్నగా తరిగిన బాదం, వేయించిన జీడిపప్పు, యాలకులపొడి వేసి కలపాలి. మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేటులోకి తీసి పూర్తిగా చల్లారాక అందించాలి.

Bottle Gourd Halva…సొరకాయ హల్వా

కావలిసినవి :
సొరకాయ: అరకిలో
పంచదార: కప్పు
కోవా: కప్పు
పాలు: అరలీటరు
ఎండుద్రాక్ష: పది
నెయ్యి: 3 టీస్పూన్లు
వేరుశెనగ పప్పు : 50 గ్రాములు
యాలకులపొడి: టీస్పూను.

తయారు చేసే విధానం
ముందుగా సొరకాయ తొక్కతీసి తురుముకోవాలి. నాన్‌స్టిక్‌ పాన్‌లో నెయ్యి వేసి వేరుశెనగపప్పు, ఎండుద్రాక్ష వేసి వేయించాలి. తరవాత సొరకాయ తురుము వేసి పది నిమిషాలు సిమ్‌లో ఉడికించాలి. తరువాత పాలు పోసి బాగా కలపాలి. పంచదార, కోవా, యాలకుల పొడి వేసి దగ్గరగా ఉడికించి దించితే హల్వా రెడీ.

బీట్ రూట్ హల్వా

కావల్సినవి

రెండుకప్పుల తురిమిన బీట్ రూట్ పంచదార : మూడుచెంచాలు
ఏలకుల పొడి : పావుస్పూన్
పాలు : ఒక కప్పు
నెయ్యి : ఒక స్పూన్
బాదం, పిస్తా, జీడిపప్పు, కిస్మిస్ లు : కొద్దిగా

తయారు చేసే విధానం
పాలను తక్కువమంటపై కొద్దిగా చిక్కగా అయ్యేవరకు మరగపెట్టాలి. కళాయిలో నెయ్యివేసి అందులో జీడిప్పులు, బాదం, కిస్మిస్ లు, పిస్తాపప్పులు వేసి దోరగా వేయించాలి. తరువాత వీటిని విడిగా పెట్టుకొని బీట్ రూట్ ను కూడా కొంచెం సువాసన వచ్చేవరకు రెండు మూడు నిమిషాలపాటు వేయించాలి. ఇప్పుడు బీట్ రూట్ తురుములో మరిగించిన పాలను పోసి పాలతో పాటు బీట్ రూట్ బాగా కలిసిపోయేంతవరకు ఉడకనివ్వాలి. పంచదార, ఏలకులపొడి కలిపి బాగా కలియబెట్టాలి పంచదార కరిగి కలిసేవరకు ఉంచి, తరువాత నీరంతా ఆవిరి అయ్యేదాకా ఉంచండి. ఈ హల్వాను నెయ్యిరాసిన ప్లేట్ లో ఉంచి దానిపై జీడిపప్పు, కిస్మిస్, పిస్తాపప్పు, బాదం పప్పులు సమానంగా పరచాలి.

బొంబాయి రవ్వ హల్వా

కావలిసినవి :
బొంబాయి రవ్వ : పావు కిలో
పంచదార : 150 గ్రాములు
నెయ్యి : 150 గ్రాములు
సిట్రిక్ ఆమ్లం : పావు స్పూన్
జీడిపప్పు : 50 గ్రాములు
పిస్తాపప్పు : కొద్దిగా
యాలకులపొడి : అరస్పూను

తయారు చేసే విధానం
బొంబాయి రవ్వను శుభ్రంగా కడిగి ఒక గంటసేపు నాన బెట్టుకోవాలి.తరువాత రవ్వలో నీరు మొత్తం ఒంపేసి ఉంచుకోవాలి. పొయ్యిమీద బాణాలి పెట్టి సగం నెయ్యివేసి వేడెక్కిన తరువాత మంటను తగ్గించి రవ్వను నెమ్మదిగా పోస్తూ గడ్డకట్టకుండా కలియబెడుతుండాలి. తరువాత మిగిలిన నెయ్యి పోసి పంచదార కూడా పోసి కలియబెట్టాలి. పంచదార పూర్తిగా కలిసిన తరువాత సిట్రిక్ ఆమ్లం,మిగిలిన నెయ్యి జీడిపప్పు, పిస్తాపప్పు, యాలకుల పొడి వేసి అన్నీ కలియబెట్టి దింపుకోవాలి. దీనిని నెయ్యి రాసిని ప్లేట్ లోనికి సమానంగా పరచి ముక్కలుగా కోసుకోవచ్చు.

గోధుమ పిండితో హల్వా

కావలిసినవి :
గోధుమ పిండి : 200 గ్రాములు
నీళ్ళు : 5 కప్పులు
పంచదార : కప్పు
నెయ్యి : 50 గ్రాములు
జీడిపప్పు, బాదం, పిస్తా పప్పులు : అన్నీ 50 గ్రాములు
ఎండుకొబ్బరి ముక్కలు : 50 గ్రాములు
యాలకుల పొడి : అరస్పూను.

తయారు చేసే విధానం
ఎండు కొబ్బరి ముక్కలు, బాదం, జీడిపప్పు, పిస్తా పప్పులు అన్నిటినీ మిక్సీలో వేసి మెత్తగా కాకుండా పలుకులుగా మిక్సీ పట్టుకోవాలి. మందపాటి బాణాలిలో కొద్దిగా నెయ్యివేసి వేడెక్కిన తరువాత గోధుమపిండిని పోసి కొద్దిగా సువాసన వచ్చేదాకా వేయించి కొద్ది కొద్దిగా నీరు కలుపుతూ కొద్దిగా జావగా చేసి, పంచదార కూడా కలిపి చక్కగా ఉడికించాలి. తరువాత మిగిలిన నెయ్యి, మిక్సీ వేసిన జీడిపప్పు, బాదం, పిస్తా పప్పులు, యాలకుల పొడి, ఎండుకొబ్బరి ముక్కలు కలిపి సన్నని మంటమీద చక్కగా ఉడికించాలి. మిశ్రమం చిక్కబడ్డాక దించుకోవాలి. నెయ్యిరాసిన ప్లేటులో సమానంగా పరచి మన ఇష్టం వచ్చిన ఆకారంలో కోసుకోవచ్చు.

బ్రెడ్ హల్వా

కావలసినవి
బ్రెడ్ : 1 (రాగి లేక గోధుమ బ్రెడ్)
పాలు : 1 లీటరు
చక్కెర : 150 గ్రాములు
జీడిపప్పు : 50 గ్రాములు
నెయ్యి : 50 గ్రాములు
యాలకుల పొడి : 5 లేక 6 యాలకులు.

తయారు చేసే విధానం
ముందుగా బ్రెడ్ ను అంచులు తీసివేసి నాలుగు ముక్కలుగా చేసికొని పెనంమీద నెయ్యివేసి రెండు వైపులా కాల్చాలి. ఈ ముక్కలు చల్లారిన తరువాత చేత్తో నలిపితే పొడుంలాగా అవుతాయి. ఇప్పుడు పొయ్యిమీద వెడల్పాటి పాత్రలో పాలుపోసి బాగా మరిగించాలి. మరిగిన తరువాత చక్కెర కలిపి మంటను తగ్గించాలి. ఇందులో బ్రెడ్ పొడిని కలుపుతూ ఉండకట్టకుండా అట్లకాడతో త్రిప్పుతుండాలి. ఇప్పుడు మిగిలిన నెయ్యి, జీడిపప్పు, యాలకులు వేసి బాగా కలిసేటట్లు త్రిప్పి దించుకోవాలి.

బాదం హల్వా

కావలిసిన పదార్ధాలు
బాదం పప్పు : కప్పు
నెయ్యి : అరకప్పు
పాలు: కప్పు
గోధుమ పిండి : 1 టేబుల్ స్పూన్
పంచదార : ముప్పావు కప్పు
కుంకుమపువ్వు : కొద్దిగా
యాలకుల పొడి: అరస్పూన్
ఆల్మండ్ సిల్వర్స్ : టేబుల్ స్పూన్లు

తయారు చేసేపద్దతి
బాదం పప్పులను నీళ్ళలో ఎనిమిది గంటలసేపు నానబెట్టి, నీళ్ళుఒంపేసి బాదం పప్పుల తోలు తీసి ఉంచుకోవాలి. తరువాత నీరుకానీ, పాలు కానీ వాడకుండా బాదం పప్పులు బ్లెండ్ చేసి ఉంచుకోవాలి.
పాన్లో మధ్యస్థంగా గల సెగపై ఏడెనిమిది నిమిషాలు ఉడికించాలి. మధ్యలో కలుపుతుండాలి.పంచదార,పాలు కలిపి అదేసెగపై ఐదు నిమిషాలు ఉంచి కుంకుమ పువ్వు వేసి బాగా కలిపి మరో నిమిషం ఉడికించాలి.స్టవ్ కట్టివేసి యాలకుల పొడి వేసి కలపాలి. దీనిని ఆల్మండ్ సిల్వర్తో అలంకరించాలి.