మిస్టీ దోయి – తయారు చేసుకునే విధానం

బెంగాలీ భాష లో మిస్టీ అంటే తీపి, దోయి అంటే పెరుగు = తియ్యని పెరుగు (মিষ্টি দই). 150 సంవత్సరాల క్రితం భారత దేశం లోని షేర్పుర్ జిల్లా (ఇప్పుడు ఇది బంగ్లాదేశ్ లో ఉంది.) లో ఆధునిక మిస్తీ దోయి యొక్క మూల వంటకం తయారు ఐయ్యింది. ఆధునిక భారత దేశం లోని బెంగాల్, త్రిపుర,అస్సాం,ఒడిశా రాష్ట్రాలలో అద్భుతమైన డెసెర్ట్ గా పేరుగాంచింది.

తయారు చేసుకునే విధానం:

ఒక లీటరు పాలు తీసుకొని, తక్కువ, మధ్యస్థ మంట మీద ఉంచి సగం అయ్యేదాకా మరిగించండి. ఇప్పుడు మనం ఈ పాలల్లో వేసే ఈ పదార్థమే, ఈ బెంగాలీ వాళ్ళ సీక్రెట్ అండ్ సిగ్నేచర్ ఇంగ్రిడియంట్ …ఖర్జూరబెల్లం… (dates palm jaggery).

బెంగాలీలు వాళ్ళ వంట విషయం లో చాలా particular గా ఉంటారు.కాబట్టి సంప్రదాయ మిస్టీ దోయి లో పంచదార వాడకూడదు. పంచదార వాడితే బెంగాలీ వాళ్ళు అసలు ఒప్పుకోరు, బెంగాల్ లో ఈ ఖర్జూర బెల్లం చాలా సులభంగా దొరుకుతుంది. కొంత మంది తాటి బెల్లం కూడా ఉపయోగిస్తారు.

చాలా రకాల బెంగాలీ స్వీట్లలో కూడా ఈ ఖర్జూర బెల్లం వాడతారు. ఇప్పుడు అర్థమైందా..? బెంగాలీ స్వీట్స్ ఎందుకు అంత మధురంగా ఉంటాయో..! ఇప్పుడు 300 గ్రాముల ఖర్జూర బెల్లం తీసుకుని పాలలో కరిగేదాకా కలపండి. స్టౌ ఆపివేసి పాల మిశ్రమాన్ని గది ఉష్ణోగ్రత వచ్చేవరకు చల్లారబెట్టాలి. తరువాత కొద్దిగా పెరుగు వేసి ఆ మిశ్రమాన్ని, మట్టి కుండలలో పోయాలి. మట్టి కుండలోని చిన్నచిన్న రంధ్రాల వల్ల పెరుగులోని నీరు ఆవిరైపోతుంది. అందువల్ల మిస్తీ డోయి చాలా చక్కగా వస్తుంది. ఆ మిశ్రమాన్ని ఒక 10 లేదా 12 గంటల పాటు కదపకుండా ఉంచితే మిస్తీ డోయి రెడీ… మీరు దాన్ని అలాగే తినవచ్చు లేదా ఒక రెండు గంటలు ఫ్రీజర్ లో ఉంచి తినొచ్చు.

మిస్తీ డోయి లో యాలకుల పొడి వేయరు, ఎందుకంటే మిస్తీ డోయి యొక్క సహజ రుచి ను (natural flavour) యాలకుల పొడి పాడు చేస్తుంది అంటారు బెంగాలీలు.

మైసూర్ పాక్ – చరిత్ర, తయారీ

మైసూర్ పాక్ అనేది 1935 లో మొదటిసారి తయారు చేయబడిందిని ఆహార చరిత్రకారులు చెబుతారు. ఇలా వంద సంవత్సరాలు కూడా పూర్తి కాని మైసూర్ పాక్, దక్షిణాది తీపి పదార్థాలలో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకొంది. గట్టిగా, మెత్తగా, గుల్లగా,, జీడి పప్పు, మాల్ట్, క్యారట్ ఇలా ఎన్నో రకాలు మైసూర్ పాక్ లో.

చేయడానికి తేలిక, పెద్ద సమయమూ పట్టదు, ప్రత్యేకమైన వస్తుసామాగ్రీ అవసరంలేదు దీని తయారీలో. పైగా ఎలా వచ్చినా తినడానికీ ఎటువంటి ఇబ్బందీ వుండదు.

మైసూర్ అంటే అందరికీ తెలిసిందే. అక్కడి రాజుగారి దసరా ఉత్సవాలు విశ్వవిఖ్యాతం. పాకం అంటే చక్కెర/బెల్లంతో నీటిని కలిపి ఒక నిర్ధిష్టమైన చిక్కదనం తీసుకు రావడం. దీని తయారీ వెనుక మైసూరు రాజుగారి పాకశాల వుంది; కనుకనే మైసూర్ పాక్ అనే పేరు తెచ్చుకొంది. అసలు విషయానికి వెడితే, 4వ కృష్ణరాజ ఉడియార్ మైసూరు సంస్థానాధిపతిగా వున్న రోజులలో ఆయన ఆస్ఖానంలో పాకశాలాధిపతిగా కాకాసుర మాదప్ప వుండేవాడు. ఆయన తీపి పదార్థాల తయారీకి పేరుగాంచినవాడు. 1935 వ సంవత్సరంలో ఒక రోజు మాదప్ప శనగపిండి, చక్కెర మరియు నెయ్యిలను కలిపి ఒక కొత్త తీపి పదార్థాన్ని ప్రయోగంగా చేసాడు. చల్లారిన ఆ పదార్థం గట్టి పడి కేక్ లాగా తయారవగా, దానిని రాజుగారికి రుచి కొరకు అందించగా ఆది ఆయనకు విపరీతంగా నచ్చడంకో, మైసూరు పాక / మైసూర్ పాకం/ మైసూర్ పాక్ గా రూపు దిద్దుకొంది.

రాజుగారు తానేకాక ప్రజలూ ఆ తీపిని రుచి చూడాలని మాదప్పకి దానిని అమ్మేందుకు దుకాణం తెరవమని చెప్పారట. గురు స్వీట్ మార్ట్ అనే పేరుతో ఆ దురాణం మైసూరులో ఇప్పటికీ ఆయన వారసుల ద్వారా నడపబడుతున్నది. మైసూర్ పాక్ తయారీకి మాదప్ప విధానాన్నే ఇప్పటికీ అనుసరిస్తున్నరట అక్కడ.

మైసూర్ పాక్ తయారీ: ముఖ్యంగా మూడు పదార్థాలు కావాలి. శనగపిండి, చక్కెర, నెయ్యి (కాదంటే డాల్డానో, రీఫైన్డ్ నూనో లేక అన్నటినీ కలుపుకొని అయినా), 1:2:3 నిష్పత్తిలో తీసుకోవాలి. చక్కెర, నెయ్యి మరీ ఎక్కువనుకొంటే కొంచంగా తగ్గించుకోవచ్చు. మరీ తగ్గితే రుచి బాగుండక పోవచ్చు.

శనగపిండి కావాలంటే పచ్చి వాసన పోయేదాకా సన్న సెగ మీద వేపుకోవాలి. తరువాత సరిపోయేన్ని నీళ్ళు పోసుకొని (తక్కువయితే పాకం చెడే ప్రమాదం వుంది లేక ఎక్కువయితే పాకం వచ్చే దానికి సమయం ఎక్కవ పట్టవచ్చు)పంచదారవేసి వేడి చేయండి. పక్కనే ఇంకో గిన్నెలో నేతిని కూడా బాగా మరగబెట్టాలి. మరిగే నేతిని పాకంలో వేయడం వలన మైసూర్ పాక్ గుల్లగా వస్తుంది. చక్కెర పాకం తీగలాగా వచ్చినప్పుడు శనగపిండిని వుండకట్టకుండా కలుపుతూ పాకంలో వేసుకోవాలి. తరువాత మధ్యమధ్య మరగ కాచిన నెయ్యిని పోసుకోంటూ కలుపుకోవాలి. నెయ్యి పోసినప్పుడు బాగా పొంగుతుంది. పొంగు తగ్గేదాకా కలిపి, మరలా నెయ్యి పోసి కలుపుతూ వుండాలి. పాకం గట్టి పడుకుందనిపించేలోగా మిగతా నెయ్యి మొత్తం పోసి కలిపి, మందుగా నెయ్యి పూసి వుంచుకొన్న పళ్ళం లోకి ఈ మిశ్రమాన్ని పోసి ఐదు నిమిషాలు చల్లార్తి గట్టి పడిన తరువాత మనకు నచ్చిన ఆకారంలో కోసుకొంటే మైసూర్ పాక్ తయ్యారు. వేడిగా తింటే ఒక రుచిలో వుండే మైసూర్ పాక్ చల్లారిన తరువాత ఇంకో రుచిలో వుంటుంది. ఇలా చేసుకొన్న మైసూర్ పాక్ వారం పది రోజుల దాకా నిలువ వుంటుంది.

సుమారు 45-50 గ్రాముల మైసూర్ పాక్ లో 195 కేలరీలు, 10 గ్రాముల కొవ్వు. వుంటాయి, కాబట్టి రుచిగా వుందని అదే పనిగా తినేయకండి. అది వచ్చింది రాజుగారి భోజనశాల నుంచనేది గుర్తుంచుకోవాలి.

డేట్స్‌ హల్వా

కావలసినవి: ఖర్జూరం – 2 కప్పులు(గింజలు తొలగించి, శుభ్రం చేసుకోవాలి), నెయ్యి – 1 కప్పు, మొక్కజొన్న పిండి – 2 టేబుల్‌ స్పూన్లు(1 కప్పు నీళ్లలో బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి), నీళ్లు – సరిపడినన్ని, నెయ్యి – 2 టేబుల్‌ స్పూన్లు, జీడిపప్పు – 10(ముక్కలు కట్‌ చేసుకుని నేతిలో దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి), ఏలకుల పొడి – పావు టీ స్పూన్

తయారీ: ముందుగా ఖర్జూరంలో ఒక కప్పు వేడి నీళ్లు వేసుకుని 30 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. తర్వాత మిక్సీ పెట్టుకుని మెత్తటి పేస్ట్‌లా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్‌ ఆన్‌ చేసుకుని.. ఆ మిశ్రమాన్ని మొత్తం బౌల్లో వేసుకుని, అందులో పావు కప్పు నెయ్యి వేసుకుని గరిటెతో తిప్పుతూ చిన్న మంటపైన ఉడికించుకోవాలి. దగ్గర పడేసరికి మళ్లీ 2 టేబుల్‌ స్పూన్ల నెయ్యి వేసుకుని తిప్పుతూ ఉండాలి. తర్వాత మొక్కజొన్న మిశ్రమాన్ని వేసుకుని తిప్పుతూ ఉండాలి. మళ్లీ 2 టేబుల్‌ స్పూన్లు నెయ్యి వేసుకుని, వేయించి పక్కన నెట్టుకున్న జీడిపప్పు ముక్కలు, ఏలకుల పొడి వేసుకుని బాగా దగ్గర పడిన తర్వాత స్టవ్‌ ఆఫ్‌ చేసుకుని.. ఒక బౌల్‌లోకి తీసుకుని 30 నిమిషాలు చల్లారిన తర్వాత నచ్చిన షేప్‌లో కట్‌ చేసుకుంటే సరిపోతుంది.

టమాటో హల్వా

కావలసినవి:  పండిన టమాటోలు – 5 (నీళ్లలో మెత్తగా ఉడికించి, మిక్సీలో గుజ్జు చేసుకోవాలి), పంచదార , నెయ్యి – పావు కప్పు చొప్పున, ఫుడ్‌ కలర్‌ – కొద్దిగా (మీకు నచ్చిన రంగు), బొంబాయి రవ్వ – పావు కప్పు, డ్రై ఫ్రూట్స్‌ – 2 టేబుల్‌ స్పూన్లు (అభిరుచిని బట్టి), ఏలకుల పొడి – అర టీ స్పూన్‌

తయారీ: ముందుగా స్టవ్‌ ఆన్‌ చేసుకుని, కళాయిలో కొద్దిగా నెయ్యి వేడి చేసి.. అందులో డ్రై ఫ్రూట్స్, బొంబాయి రవ్వలను వేర్వేరుగా వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్‌ మీద కాస్త లోతుగా ఉండే పాత్రని పెట్టి.. అందులో ఒక కప్పు నీళ్లు వేసుకోవాలి. అవి కాస్త మరిగాక వేయించిన బొంబాయి రవ్వ కొద్దికొద్దిగా వేస్తూ గరిటెతో కలుపుతూ ఉండాలి. రవ్వ చిక్కబడుతున్న సమయంలో టొమాటో గుజ్జు, పంచదార, ఫుడ్‌ కలర్, సగం నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమం హల్వాలా చిక్కబడుతున్న సమయంలో ఏలకుల పొడి, మిగిలిన నెయ్యి వేసుకుని బాగా కలిపి, స్టవ్‌ ఆఫ్‌ చేసుకోవాలి. సర్వ్‌ చేసుకునే ముందు డ్రై ఫ్రూట్స్‌తో గార్నిష్‌ చేసుకుంటే సరిపోతుంది.

చాక్లెట్ – ఉపయోగాలు

విభిన్న చాక్లెట్‌లు
► చాక్లెట్‌లు తెలుపు, డార్క్‌ విభిన్న రంగులలో లభిస్తున్నాయి.
► వీటిని కోకో చెట్ల నుంచి లభించే కాయల నుంచి తయారు చేస్తారు.
► విభిన్న ఆకారాలలో, అనేక ఫ్లేవర్స్‌లో మనకు అందుబాటులో ఉంటున్నాయి.
► చాక్లెట్‌లను కాఫీలు, మిల్క్‌షేక్‌లు, ఐస్‌క్రీంలు వంటి వాటిల్లోనూ ఉపయోగిస్తారు.
► చాకలెట్‌లను సింపుల్‌ టెక్నిక్‌తో ఇంటిదగ్గర కూడా తయారు చేయవచ్చు.

చాక్లెట్‌ ఉపయోగాలు:
► చర్మం కాంతివంతంగా మెరిసేందుకు దోహదపడుతుంది.
► అధిక రక్తపోటును తగ్గిస్తుంది. శరీరం నుంచి చెడు కొలెస్ట్రాల్‌ బయటకు వెళ్ళిపోయేలా చేస్తోంది.
► శారీరక బరువును తగ్గించడంతోపాటు, మానసికం ఉల్లాసానికి కారణమవుతుంది.
► ఒక చాక్లెట్‌ తిన్నాక మెదడు 2 నుంచి 3గంటలు ఆక్టివ్‌గా పనిచేస్తోందట.
► డార్క్‌ చాక్లెట్‌లో చక్కెర శాతం తక్కువగా ఉంటుంది. 

ఆపిల్‌ కోవా హల్వా

కావలసినవి: ఆపిల్స్‌ – 3 (పైతొక్క తొలగించి గుజ్జులా చేసుకోవాలి)
బాదం గుజ్జు – 3 టేబుల్‌ స్పూన్లు
కోవా – అర కప్పు
దాల్చినచెక్క పొడి – అర టీ స్పూన్‌ 
పంచదార – అర కప్పు
నెయ్యి – 4 లేదా 5 టేబుల్‌ స్పూన్లు.

తయారీ: ముందుగా స్టవ్‌ ఆన్‌ చేసుకుని.. 3 టేబుల్‌ స్పూన్ల నెయ్యి వేడికాగానే.. ఆపిల్‌ గుజ్జు, బాదం గుజ్జు వేసుకుని గరిటెతో తిప్పుతూ.. ఉడికించుకోవాలి. అందులో పంచదార యాడ్‌ చేసుకుని, బాగా కరిగే వరకూ తిప్పుతూ ఉండాలి. కోవా, దాల్చిన చెక్క పొడి వేసుకుని బాగా కలుపుతూ దగ్గరపడే వరకూ తిప్పుతూ మిగిలిన నెయ్యి వేసుకుని స్టవ్‌ ఆఫ్‌ చేసుకోవాలి. 

భారత దేశం లో వివిధ హల్వా రకాలు

కేంద్ర బడ్జెట్‌ ప్రతుల ముద్రణకు ముందు నిర్వహించే హల్వా వేడుక ఒకటి ఉంది. అది ఏమిటంటే బడ్జెట్ తయారీ లో అందులోని అంశాల గోప్యత కోసం ఆర్ధిక శాఖ లో బడ్జెట్ రూపకల్పన లో పాల్గొనే ఉద్యోగులు పది రోజుల పాటు ఆర్ధిక శాఖ బేస్మెంట్ లోనే ఉండిపోతారు. ముద్రణ ప్రారంభించిన రోజు ఆర్ధిక మంత్రి సమక్షం లో హల్వా అందరికి పంచి వేడుక చేసుకోవడం ఒక సంప్రదాయం.

బందర్ హల్వా మచిలీ పట్నం లో దొరికే హల్వా వెరైటీ .ఇలాగే విశాఖ కు దగ్గరలో ఉన్న మాడుగుల లో కూడా మాడుగుల హల్వా ఫేమస్ అండీ. 125 ఏళ్ళ చరిత్ర ఉన్న దగ్గేటి ధర్మా రావు షాప్ బాగా స్పెషల్. ఈ హల్వా లో రకరకాల పప్పులు కూడా వేసి చేస్తారు.

ఇక దేశం లో అయితే చేసే పదార్ధం కుడా మారుతుంది.రవ్వ తో చేసే హల్వా ,గోధుమలు,పెసర పప్పు ,కేరట్(గాజర్)ఇది ఎక్కువగ్గా పంజాబ్ లో చేస్తారు, అక్కడ గజ్రేలా అని అంటారు. ఇంకా వేపిన శనగ పప్పు,జీడిపప్పు తో కాజు హల్వా , బెంగాల్ లో మోహన్ భోగ్ , ,కర్నాటక లో దొరికే బూడిద గుమ్మడి హల్వా , దీన్ని కాశి హల్వా గా పిలుస్తారు.ఇదే కాక కేసరి బాత్ అని లేదా సుజీ హల్వా అని అన్ని శుభ కార్యాల్లో, హోటల్ లలో చేస్తారు. ఉత్తరాన నవరాత్రులలో హల్వా పూరి ఆడపిల్లలకు తప్పక పెడతారు. ఈ కేసరి బాత్ ని పైన్ ఆపిల్ ఫ్లవర్ తో చేయడం ఓ స్పెషల్ .సిఖ్ గురుద్వారాల్లో ఆటే కా హల్వా అని కడా ప్రసాద్ గా ఇస్తారు.బొంబాయి లో స్వీట్ షాప్ ఓనర్ లను హల్వాయీ లు గా పిలుస్తారు.బాంబే హల్వా ఇకాడ బాగా ప్రసిద్ది.

తమిళ బ్రాహ్మల వివాహాలలో సొజ్జి బజ్జి అని హల్వా తో బజ్జీ ఇచ్చే సాంప్రదాయం ఉంది .కర్నాటక లో హోటల్ లలో ఉప్మా కేసరి బాత్ అని ఉప్మా తో రవ్వ కేసరి పెడతారు.మన సత్యనారాయణ స్వామి ప్రసాదం రవ్వకేసరి లాంటిదే కదా.

దేశం లో చేసే హల్వా రకాలలో కారట్,బీట్రూట్,బాదం,కరాచి ,మిల్క్,బ్రెడ్ హల్వా (డబల్ క మీటా),గోస్ట్ (మాంసం )చెప్పుకో దగ్గవి.

(అయేషా కుకింగ్ వారి చిత్రం)

కాశి హల్వా (వెరీగుడ్ రెసిపీస్ చిత్రం)

(కాలిమిర్చ్ నుంచి చిత్రం)

కారట్ హల్వా

తమిళ నాట తిరునల్వేలి ,కేరళ కోజికోడ్ రెండు దక్షిణాన హల్వా రాజధానులు.

తిరునల్వేలి హల్వా గోధుమ లా తో చేస్తారు. అక్కడ తామ్రపర్ణి నది నీరు హల్వా కి ప్రత్యెక రుచి నిస్తుంది అంటారు. అక్కడ ప్రధానం గా పెద్ద బాణలి లో జారుడుగా ఉండే హల్వా అరటి ఆకులో వేసి ఇస్తారు.బాగా ప్రాచుర్యం పొందిన దుకాణం ఇరుట్టు కడాయి గా పిలుస్తారు. అంటే తమిళం లో చీకటి గా ఉండే కొట్టు అని పేరు. ఇది అక్కడ నునే దీపాలు మాత్రమె ఉండటం వల్ల వచ్చిన పేరు. ఈ షాప్ కేవలం కొన్ని గంటలు మాత్రమె తెరిచినా బాగా అమ్ముడు పోతుంది.

మదురై లో ఒత కడాయి అని ఇంకో షాప్ ఉంది.పచిరాజ విలాస్ /లక్ష్మి విలాస్ అని పేరున్న ఈ షాపు కు 50 ఏళ్ళ చరిత్ర ఉన్నది.

ఈ గోధుమ హల్వా తయారీ బాగా శ్రమ తో కూడిన వ్యవహారం.2 రోజులు సాంబా గోధుమ ని నానేసి మెత్తని పిండి లాగ రాతి రుబ్బు రోళ్ళలో చేసి ,ఒక రోజు అలాగే వదిలేస్తారు. మర్నాడు నీటిని గుడ్డతో వేసి పిండేస్తారు.అలా వచ్చిన నీటిని గోధుమ పాలు అంటారు.ఈ గోధుమ పాలు చిక్కగ్గా ఉండి హల్వా తయారీ లో ప్రధాన పాత్ర వహిస్తుంది .అందుకే ఈ హల్వా నోటిలో ఐస్ క్రీమ్ లా కరిగి పోతుంది.

కోజికోడ్ హల్వా కి జామోరిన్ రాజ్యం నాటి నుంచి ప్రాచుర్యం ఉంది.ఆయన గుజరాత్ నుంచి వంటవాళ్లు తెప్పించుకుని విందులలో వండటానికి కొంత భూమిని ఇచ్చాడట. వాళ్ళున్న ప్రదేశమే ఈ రోజు SM వీధి (అంటే స్వీట్ మీట్ ) లేదా మిటాయి తెరువు అని అంటారు. కోజికోడ్ హల్వా మొత్తం నేయి తో కాక కొబ్బరి నూనే తో చేస్తారు.అక్కక దొరికే నల్ల హల్వా లేదా కరుత హల్వా బియ్యం నుంచి చేస్తారు. ఇది మధ్య ప్రాచ్యం లోని టర్కీ నుంచి దిగుమతి అయిన అలవాటు .మన రాష్ట్రం నుంచి వెళ్ళిన అయ్యప్ప భక్తులు అక్కడ నుంచి హల్వా, చిప్స్ తెచ్చుకుంటారు.

హల్వా మన దేశం లో ఢిల్లీ సుల్తానుల కాలం అయిన 13వ శతాబ్ది లో ఇండియా లో కాలు పెట్టింది.దాని మూలాలు ఓట్టోమాన్ సామ్రాజ్యం కాలం లో ఉన్నాయి. 10వ సులేమాన్ గొప్ప తీపి ప్రియుడని అతనికి ఇష్టమైన వాటిలో హల్వా ఒకటి అని చరిత్ర చెపుతోంది.అతని రాజ్యం లో తీపి వంటలు వండటానికి కి ఒక ప్రత్యెక వంటశాల ఉందంటే ఆశ్చర్యం కలగుతుంది కదా .

ఇప్పటి కాలం లో పూణే లో పచ్చి మిరప తో హరి మిర్చ్ హల్వా ,బెంగాల్ లో చోలార్ దాల్ హల్వా , కర్నాటక లో కాశి హల్వా ,ఉత్తర ప్రదేశ్ , బిహార్ లలో గుడ్డు తో అండా హల్వా, కేరళ లో కరుత హల్వా, హల్వా గారి విభిన్న అవతారాలు గా మనం భావించ వచ్చు. దీన్న్నే ఇండియన్ జుగాడ్ ( భారతీయ అన్వేషణ ప్రియత్వం) అనుకోవచ్చు.

Mango Halva….మామిడి హల్వా

కావలిసినవి :
మామిడిగుజ్జు: 4 కప్పులు
బాదం పప్పు : పావుకప్పు
యాలకులపొడి: అరటీస్పూను
జీడిపప్పు: పావుకప్పు
కార్న్‌ఫ్లోర్‌: కప్పు
నెయ్యి: అరకప్పు
పంచదార: 2 కప్పులు
మంచినీళ్లు: కప్పు

తయారుచేసే విధానం
ఓ పాన్‌లో పావు కప్పు నెయ్యి వేసి మామిడిపండు గుజ్జు వేసి కొద్దిగా వేడి చేయాలి. కార్న్‌ఫ్లోర్‌లో నీళ్ళు పోసి ఉండలు కట్టకుండా కలిపి పాన్‌లో వేసి మొత్తం మిశ్రమం చిక్కగా అయ్యేవరకూ ఉడికించాలి. తరవాత పంచదార వేసి మిశ్రమం అంచుల నుంచి వేరయ్యేవరకూ ఉడికించాలి. తరవాత మిగిలిన నెయ్యి కూడా వేసి కలుపుతూ పది నిమిషాలపాటు ఉడికించాలి. ఇప్పుడు సన్నగా తరిగిన బాదం, వేయించిన జీడిపప్పు, యాలకులపొడి వేసి కలపాలి. మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేటులోకి తీసి పూర్తిగా చల్లారాక అందించాలి.

Bottle Gourd Halva…సొరకాయ హల్వా

కావలిసినవి :
సొరకాయ: అరకిలో
పంచదార: కప్పు
కోవా: కప్పు
పాలు: అరలీటరు
ఎండుద్రాక్ష: పది
నెయ్యి: 3 టీస్పూన్లు
వేరుశెనగ పప్పు : 50 గ్రాములు
యాలకులపొడి: టీస్పూను.

తయారు చేసే విధానం
ముందుగా సొరకాయ తొక్కతీసి తురుముకోవాలి. నాన్‌స్టిక్‌ పాన్‌లో నెయ్యి వేసి వేరుశెనగపప్పు, ఎండుద్రాక్ష వేసి వేయించాలి. తరవాత సొరకాయ తురుము వేసి పది నిమిషాలు సిమ్‌లో ఉడికించాలి. తరువాత పాలు పోసి బాగా కలపాలి. పంచదార, కోవా, యాలకుల పొడి వేసి దగ్గరగా ఉడికించి దించితే హల్వా రెడీ.

బీట్ రూట్ హల్వా

కావల్సినవి

రెండుకప్పుల తురిమిన బీట్ రూట్ పంచదార : మూడుచెంచాలు
ఏలకుల పొడి : పావుస్పూన్
పాలు : ఒక కప్పు
నెయ్యి : ఒక స్పూన్
బాదం, పిస్తా, జీడిపప్పు, కిస్మిస్ లు : కొద్దిగా

తయారు చేసే విధానం
పాలను తక్కువమంటపై కొద్దిగా చిక్కగా అయ్యేవరకు మరగపెట్టాలి. కళాయిలో నెయ్యివేసి అందులో జీడిప్పులు, బాదం, కిస్మిస్ లు, పిస్తాపప్పులు వేసి దోరగా వేయించాలి. తరువాత వీటిని విడిగా పెట్టుకొని బీట్ రూట్ ను కూడా కొంచెం సువాసన వచ్చేవరకు రెండు మూడు నిమిషాలపాటు వేయించాలి. ఇప్పుడు బీట్ రూట్ తురుములో మరిగించిన పాలను పోసి పాలతో పాటు బీట్ రూట్ బాగా కలిసిపోయేంతవరకు ఉడకనివ్వాలి. పంచదార, ఏలకులపొడి కలిపి బాగా కలియబెట్టాలి పంచదార కరిగి కలిసేవరకు ఉంచి, తరువాత నీరంతా ఆవిరి అయ్యేదాకా ఉంచండి. ఈ హల్వాను నెయ్యిరాసిన ప్లేట్ లో ఉంచి దానిపై జీడిపప్పు, కిస్మిస్, పిస్తాపప్పు, బాదం పప్పులు సమానంగా పరచాలి.

బొంబాయి రవ్వ హల్వా

కావలిసినవి :
బొంబాయి రవ్వ : పావు కిలో
పంచదార : 150 గ్రాములు
నెయ్యి : 150 గ్రాములు
సిట్రిక్ ఆమ్లం : పావు స్పూన్
జీడిపప్పు : 50 గ్రాములు
పిస్తాపప్పు : కొద్దిగా
యాలకులపొడి : అరస్పూను

తయారు చేసే విధానం
బొంబాయి రవ్వను శుభ్రంగా కడిగి ఒక గంటసేపు నాన బెట్టుకోవాలి.తరువాత రవ్వలో నీరు మొత్తం ఒంపేసి ఉంచుకోవాలి. పొయ్యిమీద బాణాలి పెట్టి సగం నెయ్యివేసి వేడెక్కిన తరువాత మంటను తగ్గించి రవ్వను నెమ్మదిగా పోస్తూ గడ్డకట్టకుండా కలియబెడుతుండాలి. తరువాత మిగిలిన నెయ్యి పోసి పంచదార కూడా పోసి కలియబెట్టాలి. పంచదార పూర్తిగా కలిసిన తరువాత సిట్రిక్ ఆమ్లం,మిగిలిన నెయ్యి జీడిపప్పు, పిస్తాపప్పు, యాలకుల పొడి వేసి అన్నీ కలియబెట్టి దింపుకోవాలి. దీనిని నెయ్యి రాసిని ప్లేట్ లోనికి సమానంగా పరచి ముక్కలుగా కోసుకోవచ్చు.

గోధుమ పిండితో హల్వా

కావలిసినవి :
గోధుమ పిండి : 200 గ్రాములు
నీళ్ళు : 5 కప్పులు
పంచదార : కప్పు
నెయ్యి : 50 గ్రాములు
జీడిపప్పు, బాదం, పిస్తా పప్పులు : అన్నీ 50 గ్రాములు
ఎండుకొబ్బరి ముక్కలు : 50 గ్రాములు
యాలకుల పొడి : అరస్పూను.

తయారు చేసే విధానం
ఎండు కొబ్బరి ముక్కలు, బాదం, జీడిపప్పు, పిస్తా పప్పులు అన్నిటినీ మిక్సీలో వేసి మెత్తగా కాకుండా పలుకులుగా మిక్సీ పట్టుకోవాలి. మందపాటి బాణాలిలో కొద్దిగా నెయ్యివేసి వేడెక్కిన తరువాత గోధుమపిండిని పోసి కొద్దిగా సువాసన వచ్చేదాకా వేయించి కొద్ది కొద్దిగా నీరు కలుపుతూ కొద్దిగా జావగా చేసి, పంచదార కూడా కలిపి చక్కగా ఉడికించాలి. తరువాత మిగిలిన నెయ్యి, మిక్సీ వేసిన జీడిపప్పు, బాదం, పిస్తా పప్పులు, యాలకుల పొడి, ఎండుకొబ్బరి ముక్కలు కలిపి సన్నని మంటమీద చక్కగా ఉడికించాలి. మిశ్రమం చిక్కబడ్డాక దించుకోవాలి. నెయ్యిరాసిన ప్లేటులో సమానంగా పరచి మన ఇష్టం వచ్చిన ఆకారంలో కోసుకోవచ్చు.

బ్రెడ్ హల్వా

కావలసినవి
బ్రెడ్ : 1 (రాగి లేక గోధుమ బ్రెడ్)
పాలు : 1 లీటరు
చక్కెర : 150 గ్రాములు
జీడిపప్పు : 50 గ్రాములు
నెయ్యి : 50 గ్రాములు
యాలకుల పొడి : 5 లేక 6 యాలకులు.

తయారు చేసే విధానం
ముందుగా బ్రెడ్ ను అంచులు తీసివేసి నాలుగు ముక్కలుగా చేసికొని పెనంమీద నెయ్యివేసి రెండు వైపులా కాల్చాలి. ఈ ముక్కలు చల్లారిన తరువాత చేత్తో నలిపితే పొడుంలాగా అవుతాయి. ఇప్పుడు పొయ్యిమీద వెడల్పాటి పాత్రలో పాలుపోసి బాగా మరిగించాలి. మరిగిన తరువాత చక్కెర కలిపి మంటను తగ్గించాలి. ఇందులో బ్రెడ్ పొడిని కలుపుతూ ఉండకట్టకుండా అట్లకాడతో త్రిప్పుతుండాలి. ఇప్పుడు మిగిలిన నెయ్యి, జీడిపప్పు, యాలకులు వేసి బాగా కలిసేటట్లు త్రిప్పి దించుకోవాలి.

Tapeswaram Madata Kajalu / తాపేశ్వరం మడత కాజాలు

కావలిసిన పదార్ధాలు
మైదా: కిలో
పంచదార: కిలోన్నర
నూనె: తగినంత
యాలకులపొడి: కొద్దిగా.

తయారు చేసే విధానం
మైదాలో ముందుగా కొద్దిగా నూనె వేసి కలపాలి. తరవాత తగినన్ని నీళ్లు పోసి చపాతీపిండికన్నా కాస్త గట్టిగా కలిపి ఐదు నిమిషాలు నాననివ్వాలి. ఆ సమయంలో పంచదారలో మునిగేవరకూ నీళ్లు పోసి మరిగించి లేతపాకం రానిచ్చి యాలకులపొడి కలిపి ఉంచాలి. పిండి ముద్దను పెద్ద ఉండలుగా చేసి పలుచని చపాతీలా వత్తాలి. చపాతీ వత్తేటప్పుడు పొడి పిండి చల్లుతూ చేస్తే అంటుకోకుండా ఉంటుంది. ఈ చపాతీని మళ్లీ సగానికి మడిచి వత్తేయాలి.

దానిమీద మళ్లీ పొడి పిండిని చల్లి చాపలా చుట్టాలి. ఈ చాపచుట్టలో ఎన్ని పొరలు వస్తే కాజా అంత బాగుంటుంది. ఈ చుట్టను అర అంగుళం వెడల్పు ముక్కలుగా కోయాలి. ఇలా అన్ని ముక్కలనూ కోసుకుని ఒక్కో ముక్కనీ వేలుతో వత్తి, మళ్లీ పొడవుగా వచ్చేలా అప్పడాలకర్రతో వత్తాలి. ఇలాగే అన్నీ చేసుకుని కాగిన నూనెలో సన్న సెగమీద వేయించాలి. వేగాక పాకంలో వేసి మునిగేలా చేసి ఓ పది నిమిషాలు ఉంచి తీసి పళ్లెంలో పెట్టి ఆరనివ్వాలి. మరో పదిహేను నిమిషాల తరవాత పాకంలో మరోసారి ముంచి తీయాలి.

Kakinada Kaja / కాకినాడ కాజాలు

కావలిసిన పదార్ధాలు
మైదా: అరకిలో
సెనగపిండి: 2 టేబుల్‌స్పూన్లు
సోడాబైకార్బొనేట్‌: చిటికెడు
పంచదార: అరకిలో
నెయ్యి: తగినంత
పంచదారపొడి: చల్లడానికి సరిపడా

తయారు చేసే విధానం
మైదాను జల్లించి అందులో సెనగపిండి, సోడా వేసి కలపాలి. తరవాత రెండు టేబుల్‌స్పూన్ల నెయ్యి వేసి కలపాలి. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసి పిండిని మృదువుగా కలపాలి. పిండిమీద పలుచని తడిబట్టను కప్పి ఓ రెండు గంటల సేపు నాననివ్వాలి. అదేసమయంలో మరో గిన్నెలో పంచదార, అది మునిగేవరకూ నీళ్లు పోసి మరిగించి తీగపాకం రానివ్వాలి. పిండి ముద్దను అంగుళం మందంలో తాడులా పొడవుగా చేయాలి. దీన్ని చాకుతో అంగుళం వెడల్పు ఉండేలా ముక్కలుగా కోయాలి.

ఓ ప్లేటులో పిండి వేసి అందులో ఈ ముక్కలు వేసి ఉంచాలి. ఒక్కో ముక్కనీ తీసుకుని రెండు అంగుళాల పొడవు వచ్చేలా అప్పడాల కర్రతో వత్తాలి. ఇలాగే అన్నీ చేసి, కాగిన నెయ్యిలో వేసి వేయించాలి. వేగిన వెంటనే మరిగించిన పాకంలో వేసి మునిగేలా చేయాలి. పది నుంచి పదిహేను నిమిషాలు నానాక బయటకు తీసి పంచదార పొడి చల్లి ఆరనివ్వాలి.

Malaipuri / మలైపూరీ

కావాలిసిన పదార్ధాలు

మైదా: కప్పు
పాలు: ఒకటిన్నర కప్పులు
కోవా: అరకప్పు
ఉప్పు: చిటికెడు
సోంపు: టీస్పూను
బేకింగ్‌ పౌడర్‌: చిటికెడు
నెయ్యి: వేయించడానికి సరిపడా
పంచదార పాకం కోసం: మంచినీళ్లు పావుకప్పు
పంచదార: కప్పు
యాలకులపొడి: చిటికెడు
కుంకుమపువ్వు: చిటికెడు

తయారుచేసే విధానం
ఓ గిన్నెలో పంచదార, మంచినీళ్లు పోసి మరిగించి లేతపాకం వచ్చాక కుంకుమపువ్వు, యాలకులపొడి వేసి కలిపి పక్కన ఉంచాలి. ఓ గిన్నెలో సగం పాలు గోరువెచ్చగా చేసి తీసి మరో గిన్నెలో పోయాలి. అందులోనే కోవా, మైదా వేసి కలపాలి. తరవాత పంచదార, ఉప్పు, సోంపు, బేకింగ్‌ పౌడర్‌ వేసి కలపాలి. ఇప్పుడు మిగిలిన పాలు కూడా పోసి కలపాలి. పిండి మృదువుగా అవుతుంది. దీన్ని పక్కన ఉంచి బాణలిలో నెయ్యి పోసి కాగాక, పిండి మిశ్రమాన్ని చిన్నపాటి పూరీలా చేసి, వేసి సిమ్‌లో వేయించి తీయాలి. ఇప్పుడు వీటిని పంచదార పాకంలో ముంచి తీసి, రబ్డీ వేసి అందిస్తే సరి. దీన్నే మలైపూరీ అనీ అంటారు.

Semya Kesari / సేమ్యా కేసరి

కావాలిసిన పదార్ధాలు

సేమ్యా: పావుకిలో
పంచదార: 200 గ్రా.
మంచినీళ్లు: 2 కప్పులు
వెనీలా ఎసెన్స్‌: అర టీస్పూను
యాలకులపొడి: టీస్పూను
జాజికాయపొడి: టీస్పూను(ఇష్టమైతేనే)
ఎండుద్రాక్ష: 2 టేబుల్‌స్పూన్లు
పిస్తా: 2 టేబుల్‌స్పూన్లు
బాదం: 2 టేబుల్‌స్పూన్లు
నెయ్యి: 2 కప్పులు

తయారుచేసే విధానం
బాణలిలో టేబుల్‌స్పూను నెయ్యి వేసి ఎండుద్రాక్ష, బాదం, పిస్తా విడివిడిగా వేసి వేయించి తీసి పక్కన ఉంచాలి. మిగిలిన నెయ్యిలో సేమ్యా వేసి వేయించాలి.
మరో పొయ్యిమీద మందపాటి గిన్నె పెట్టి పంచదార వేసి నీళ్లు పోయాలి. అందులోనే యాలకులపొడి, జాజికాయ పొడి వేసి కలుపుతూ పంచదార కరిగేవరకూ మరిగించాలి. మరో పాన్‌లో వేయించిన సేమ్యా వేసి అది మునిగేవరకూ నీళ్లు పోసి ఉడికించాలి.
సేమ్యా ఉడికిన తరవాత పంచదార పాకం వేసి సన్నని మంటమీద పాకం మొత్తం పీల్చుకునేవరకూ ఉడికించాలి. తరవాత మిగిలిన నెయ్యి కూడా వేసి కలపాలి. సేమ్యా పాకాన్ని పీల్చుకుని దేనికది విడిపోతుంది. ఇప్పుడు వేయించిన బాదం, ఎండుద్రాక్ష, పిస్తా వేసి అలంకరించి అందించాలి.

Badusha / బాదుషా

కావాలిసిన పదార్ధాలు

మైదా – కేజీ
వెన్న : పావుకేజీ
బేకింగ్ పౌడర్– రెండు స్పూన్లు
నూనె – కేజీ
పంచదార – కేజీ
నీళ్లు– తగినన్ని
యాలకులు – 5 (పొడి చేయాలి)

తయారు చేసే విధానం
నీళ్లు మరగపెట్టి పంచదార వేసి కొంచెం ముదురు పాకం వచ్చేంత వరకు స్టవ్పై ఉంచాలి, పాకంలో యాలకుల పొడి కలిపి దించి పక్కన పెట్టుకోవాలి. మైదాలో బేకింగ్ పౌడర్ వేసి ముద్దగా కలపాలి. కాటన్ క్లాత్ కప్పి 5 నిమిషాలు ఉంచాలి. తరువాత పిండిని మరికాస్త మృదువుగా చేత్తో అదిమి, చిన్న చిన్న ఉండలు చేయాలి. వాటిని చేత్తో గుండ్రంగా అదిమి పక్కన పెట్టుకోవాలి.

స్టవ్ వెలిగించి బాణాలి పెట్టి నూనె పోసి నూనె వేడెక్కిన తరువాత బాదూషాలను వేసి వేయించాలి. తరువాత వాటిని పంచదార పాకంలో వేయాలి. పాకంలో 15 నిమిషాలు ఉంచి తీయాలి.

Madata Kajalu / మడత కాజాలు

కావాలిసిన పదార్ధాలు

మైదా/గోధుమ పిండి – 100 గ్రాములు
నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు
పాలు – 2 టేబుల్ స్పూన్లు (కాచి చల్లార్చుకోవాలి)
ఉప్పు – చిటికెడు
నీళ్లు – తగినన్ని
నూనె – వేయించడానికి తగినంత
ఫిల్లింగ్: బియ్యప్పిండి – 2 టేబుల్ స్పూన్లు
నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు
బాదం, పిస్తాపప్పు (పలుకులు ) – 2 టేబుల్ స్పూన్లు
పాకం: పంచదార – కప్పు
నీళ్లు – అర కప్పు
రోజ్ ఎసెన్స్ – టీ స్పూన్ (లేదా) యాలకుల పొడి – టీ స్పూన్

తయారు చేసే విధానం
ముందు మైదాను జల్లించుకోవాలి. గిన్నెలో మైదా, నెయ్యి, పాలు, ఉప్పు వేసి బాగా కలపాలి. దీంట్లో కొద్దిగా నీళ్లు చల్లి, పిండి మృదువుగా అయ్యేంతవరకు కలిపి ఒక తడి కాటన్ క్లాత్లో చుట్టి 5 నిమిషాలు ఉంచాలి.

నిమ్మకాయపరిమాణంలో పిండి తీసుకొని, ఉండలా చేసి, చపాతీలా వత్తుకోవాలి ∙ఒక గిన్నెలో బియ్యప్పిండి, నెయ్యి వేసి కలపాలి. దీంట్లోనే బాదం, పిస్తాపప్పు పలుకులు వేసి కలపాలి. చపాతీ మీదుగా ఈ మిశ్రమాన్ని పోసి, రోల్ చేయాలి. తర్వాత చాకుతో రోల్ చేసినదానిని డైమండ్ షేప్లో కట్ చేయాలి ∙ఇలా బాల్స్ అన్నీ తయారుచేసుకున్నాక పాకం సిద్ధం చేసుకోవాలి.

పాకంచేయటానికి
పంచదారలో నీళ్లు కలిపి కరిగేంతవరకు ఉంచి, మరగనివ్వాలి. దీంట్లో యాలకుల పొడి 5–7 నిమిషాలు మరిగించి మంట తీసేయాలి ∙కడాయిలో నూనె, నెయ్యి పోసి కాగనివ్వాలి. దీంట్లో కట్ చేసి సిద్ధంగా ఉంచిన బాల్స్ వేసి రెండు వైపులా మంచి రంగుతేలేలా వేయించుకోవాలి. వెంటనే పాకంలో వేసి, 2 నిమిషాల సేపు ఉంచాలి. చల్లారాక తీసి సర్వ్ చేయాలి.

Sweet Gavvalu / పాకం గవ్వలు

కావాలిసిన పదార్ధాలు

మైదా లేదా గోధుమపిండి – కప్పు
బొంబాయిరవ్వ – టేబుల్ స్పూను బెల్లం తురుము – అర కప్పు
నెయ్యి – టేబుల్స్పూను
నూనె – వేయించడానికి సరిపడేంత

తయారి చేసే విధానం
ఒక పెద్ద పాత్రలో మైదా లేదా గోధుమపిండి, బొంబాయిరవ్వ, నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. తరవాతనీళ్లు పోసి ముద్దలా చేయాలి. ఈ ముద్ద గట్టిగా కాకుండా మృదువుగా ఉండేలా చూసుకోవాలి. దీనినిఅరగంటసేపు నాననివ్వాలి ∙

నానిన ముద్దను చిన్న చిన్న ఉండలుగా చేసి, గవ్వలపీట (మార్కెట్ లో చెక్కతో తయారు చేసినవి దొరుకుతాయి) మీద ఒత్తుకుని కాగుతున్న నూనెలో వేయించి పక్కన పెట్టుకోవాలి ∙ఒకగిన్నెలో బెల్లం, కొద్దిగా నీరు పోసి కరిగించి, ముదురు పాకం వచ్చేదాక మరగనివ్వాలి. వేయించిన గవ్వలను ఈ పాకంలో వేసి బాగా కలపాలి.

Gulab jammoon / గులాబ్ జామూన్

కావాలిసిన పదార్ధాలు

పాలపొడి – ఒక కప్పు
మైదా – పావు కప్పు
గోధుమపిండి – పావుకప్పు
వెన్న – మూడు టేబుల్ స్పూన్లు
పాలు – పావుకప్పు
చక్కెర – రెండు కప్పులు
నీళ్లు – ఒకటిన్నర కప్పు
యాలకులు– నాలుగు (పొడి చేయాలి), బాదం పప్పులు – పది (సన్నగా పొడవుగా తరగాలి)
నెయ్యి – వేయించడానికి సరిపడినంత

తయారు చేసే విధానం
ఒక పాత్రలో పాల పొడి, మైదా, గోధుమ పిండి వేసి సమంగా కలిపిన తర్వాత వెన్న వేసి మళ్లీ కలపాలి. దీంట్లో పాలు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. మిశ్రమంలోఎక్కడా పిండి ఉండలు లేకుండా అంతా సమంగా మృదువుగా ఉండేటట్లు కలుపుకోవాలి ∙ఈ మిశ్రమాన్ని పది నిమిషాల పాటు పక్కన ఉంచాలి. ఈ టైమ్లో పాల పొడి, పాలతో కలుస్తుంది. ఈలోపుగా పాకం సిద్ధం చేసుకోవాలి.

చక్కెర పాకం తయారీ
∙వెడల్పుగా ఉన్న పాత్రలో చక్కెర, నీళ్లు పోసి మరిగించాలి. చక్కెర కరిగి, రెండు వేళ్లతో తాకి చూసినప్పుడు పాకం అతుక్కుంటున్న దశలో యాలకుల పొడి వేసి కలిపి దించేయాలి ∙
బాణలిలో నెయ్యి వేసి అది వేడయ్యే లోపుగా పిండి మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. ఈ ఉండలను కాగిన నేయ్యిలో సన్నని మంట మీద ముదురు గోధుమరంగు వచ్చే వరకు వేయించి తీయాలి. సిద్ధంగా ఉంచిన వేడి వేడి పాకంలో ఉండలను వేసి పైన మూత పెట్టాలి. తర్వాత సర్వ్ చేయాలి.
గమనిక: గులాబ్ జామూన్లు వేగేటప్పుడు, పాకం పీల్చుకునేటప్పుడు వాటి పరిమాణం పెరుగుతాయి. కాబట్టి నేయ్యిలో వేయించేటప్పుడు ఒక్కసారిగా ఎక్కువ వేయకుండా తీసుకున్న నేతిపరిమాణాన్ని బట్టి కొన్ని వేసి తీశాక మరికొన్ని వేసి వేయించాలి.

Jangry/ జాంగ్రీ

కావాలిసిన పదార్ధాలు

మినప్పప్పు – 150 గ్రాములు
బియ్యప్పిండి – 50 గ్రాములు
కార్న్ఫ్లోర్ – 150 గ్రాములు
రెడ్ ఆరెంజ్ కలర్ – చిటికెడు (టేబుల్ స్పూన్ నీళ్లలో కరిగించి, కలపాలి)
మందపాటి కాటన్ క్లాత్
– జాంగ్రీ చేయడానికి
పాకం: పంచదార – ముప్పావు కేజీ
పాలు – అర కప్పు
రోజ్ ఎసెన్స్ – పావు టీ స్పూన్ లేదా యాలకుల పొడి – టీ స్పూన్

తయారు చేసే విధానం
మినప్పప్పును 5-6 గంటల సేపు నానబెట్టాలి. తర్వాత నీళ్లను వడకట్టి, పిండి మృదువుగా అయ్యేలా కొంచెం గట్టిగా ఉండేటట్లు రుబ్బుకోవాలి. మధ్య మధ్యలో కొద్దిగా నీళ్లు కలుపుకోవచ్చు. ∙పంచదారలో అర కప్పు పాలు, నీళ్లు పోసి కరిగేవరకు కలిపి, పొయ్యి మీద పెట్టాలి. పాకం తయారయ్యాక మంట తీసేయాలి. దీంట్లో రోజ్ ఎసెన్స్ లేదా యాలకులపొడి వేసి కలపాలి. క్లాత్కి మధ్య చిన్న బటన్ హోల్ చేయాలి. రంధ్రం పెద్దగా కాకుండా ఉండటానికి చుట్టూ కుట్టాలి ∙రుబ్బుకున్న మినపపిండిలో బియ్యప్పిండి, కార్న్ఫ్లోర్, ఆరెంజ్ కలర్ వేసి చేత్తో బాగా కలపాలి ∙

వెడల్పాటి మూకుడు పొయ్యి మీద పెట్టి నూనె పోసి కాగనివ్వాలి. సిద్ధం చేసుకున్న పిండిని హోల్ చేసిన క్లాత్ మధ్యలో వేసి మూటలా చేయాలి ∙కాగుతున్న నూనెలో పిండి ఉన్న క్లాత్ చుట్టను ఒత్తుతూ రింగులు రింగులుగా పిండాలి. ముందు చిన్న చిన్నగా ఒత్తుకుంటే జాంగ్రీలు విరిగిపోవు. వీటిని రెండువైపులా వేయించుకొని తీయాలి. పొడవాటి ఇనుప చువ్వతో జాంగ్రీలు తీసి, పాకంలో ముంచి, తీయాలి.

Paneer Laddu / పనీర్ లడ్డు

కావలిసిన పదార్ధాలు
కావల్సినవి: పనీర్ – కప్పు
చక్కెర – అరకప్పు
పాల పొడి – పావు కప్పు
పాలు – పావు కప్పు
వెన్న – ఆరు చెంచాలు
యాలకుల పొడి – చెంచా
పిస్తా పలుకులు – కొద్దిగా
ఎరువు రంగు – చిటికెడు.

తయారు చేసే విధానం
బాణలిని పొయ్యిమీద పెట్టి వెన్నా, పనీర్, చక్కెర వేసి బాగా కలపాలి. కాసేపటికి ఇది ముద్దలా అవుతుంది. అందులో పాలపొడి కలిపిన పాలు పోస్తూ ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి. పది, పదిహేను నిమిషాలకు ఇది దగ్గరకు అవుతుంది అప్పుడు యాలకులపొడీ, ఎరుపు ఆహార రంగు కలిపి దింపేయాలి. వేడి కాస్త చల్లారాక చేతికి నెయ్యి రాసుకుని లడ్డూల్లా చేసుకుని పైన పిస్తాపలుకులు అలంకరించాలి.

Milk Mysore Pak / మిల్క్ మైసూర్ పాక్

కావలిసిన పదార్ధాలు
పాలపొడి: ఒకటిన్నర కప్పులు
పంచదార: నాలుగు కప్పులు
మైదాపిండి: అరకప్పు
నెయ్యి: కప్పు
ఉప్పు: రుచికోసం చిటికెడు

తయారు చేసే విధానం :
పంచదారలో సుమారు ఓ కప్పు నీళ్లు పోసి మరిగించాలి. తరవాత సిమ్లో పెట్టి 20 నిమిషాలపాటు తీగపాకం వచ్చేవరకూ తిప్పుతూ ఉడికించాలి. విడిగా ఓ గిన్నెలో మైదా, ఉప్పు, పాలపొడి, టేబుల్స్పూను నెయ్యి వేసి కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పంచదార పాకంలో వేసి మళ్లీ సిమ్లో నాలుగు నిమిషాలు ఉడికించాలి. తరవాత మిగిలిన నెయ్యి కూడా వేసి ఉండలు కట్టకుండా ఉడికించాలి. మిశ్రమ అంచులకు అంటుకోకుండా ఉండేవరకూ ఉడికించి దించి నెయ్యి రాసిన ప్లేటులో వేసి ఆరాక ముక్కలుగా కోయాలి.

దూద్ బర్పీ

కావలిసిన పదార్ధాలు
పాలు :ల పాలుగుకప్పులు
కోవా : 100 గ్రాములు
పంచదార: ఒకటిన్నర కప్పులు
గోధుమనూక : మూడు టేబుల్ స్పూన్లు
వెన్న లేదా నెయ్యి : 4 స్పూన్లు
జీడిపప్పు :కొద్దిగా
బాదంపప్పులు :కొద్దిగా
కోకోపొడి : రెండు స్పూన్లు
పిస్తా పలుకులు : రెండు స్పూన్లు

తయారు చేసే విధానం
చిన్న పాన్లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి గోధుమనూక వేసి మంచి సువాస వచ్చే వరకు వేయించి పక్కన ఉంచుకోవాలి. తరువాత అడుగు మందం గల పాన్లో మధ్యస్థమంగా ఉండే సెగపై పాలు, కోవాలు వేడిచేయాలి.

మధ్యమధ్యలో కలియబెడుతూ మిశ్రమాన్ని చిక్కబడనివ్వాలి. ఇరవైనిమిషాలు ఉడికించాలి. అంచులకు అంటే దాకా ఉంచి,అందులో కోకోపొడివేసి బాగా కలపాలి. మిశ్రమం మృదువుగా అయ్యేదాకా ఉంచాలి.

అంచువున్న పళ్ళెంలో ఈ మిశ్రమాన్ని సమానంగా పరచి పిస్తాపప్పులు వేసి కొద్దిగా వాటిపైన నొక్కాలి. గోరు వెచ్చగా ఉన్నపుడు కట్ చేసుకోవాలి.

దిల్ కుషర్

కావలిసిన పదార్ధాలు
శెనగపిండి : 2 కప్పులు
నెయ్యి : ఒక కప్పు
కోవా : ఒకకప్పు
యాలకులపొడి: 1 స్పూన్
పంచదార : ఒకటిన్నర కప్పులు
నీళ్ళు : ఒక కప్పు
పాలు :రెండుటేబుల్ స్పూన్లు

పిస్తా పప్పులు : నాలుగు టేబుల్ స్పూన్లు

తయారు చేసే విధానం
బౌల్లో శెనగపిండి వేసి నెయ్యి వేడి చేసి శెనగపిండిలో సగం నెయ్యి వేయాలి. బాగా కలపాలు. మూకుడులో మిగతా నెయ్యి వేసి వేడిచేసి అందులో శనగపిండి మిశ్రమాన్ని వేసి, గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఉడికించాలి. నిరంతరం కలయబెడుతుండాలి.

కోవా, యాలకుల పొడివేసి మరో ఐదారు నిమిషాలు ఉంచి దించుకొని చల్లారనివ్వాలి. షుగర్ సిరప్ కోసం పాన్లో పంచదార,నీరు కలిపిపది నిమిషాలు సిమ్ లో ఉంచాలి. మరిచే పంచదార పాకంలో పాలు కలపాలి. అపరిశుభ్రాలు గ్రే లేయర్ గా పైకితేలతాయి. స్పూన్ తో ఈ లేయర్ తీసివేయాలి. తీగపాకం రానివ్వాలి.

మిశ్రమంలో షుగర్ సిరప్ వేసి చల్లారనిచ్చి కట్ చేయాలి. తరిగిన బాదంపప్పు,పిస్తాపప్పులతో అలంకరించి సర్వ్ చేయాలి.

బాదం హల్వా

కావలిసిన పదార్ధాలు
బాదం పప్పు : కప్పు
నెయ్యి : అరకప్పు
పాలు: కప్పు
గోధుమ పిండి : 1 టేబుల్ స్పూన్
పంచదార : ముప్పావు కప్పు
కుంకుమపువ్వు : కొద్దిగా
యాలకుల పొడి: అరస్పూన్
ఆల్మండ్ సిల్వర్స్ : టేబుల్ స్పూన్లు

తయారు చేసేపద్దతి
బాదం పప్పులను నీళ్ళలో ఎనిమిది గంటలసేపు నానబెట్టి, నీళ్ళుఒంపేసి బాదం పప్పుల తోలు తీసి ఉంచుకోవాలి. తరువాత నీరుకానీ, పాలు కానీ వాడకుండా బాదం పప్పులు బ్లెండ్ చేసి ఉంచుకోవాలి.
పాన్లో మధ్యస్థంగా గల సెగపై ఏడెనిమిది నిమిషాలు ఉడికించాలి. మధ్యలో కలుపుతుండాలి.పంచదార,పాలు కలిపి అదేసెగపై ఐదు నిమిషాలు ఉంచి కుంకుమ పువ్వు వేసి బాగా కలిపి మరో నిమిషం ఉడికించాలి.స్టవ్ కట్టివేసి యాలకుల పొడి వేసి కలపాలి. దీనిని ఆల్మండ్ సిల్వర్తో అలంకరించాలి.

మధుర కోవా

కావలిసిన పదార్ధాలు
పావు టీ స్పూన్ కుంకుమ పువ్వు,
కోవా : రెండుకప్పులు
పాలు: 1 టీస్పూన్
పంచదార : అరకప్పు
ఏలకుల పొడి : పావు టీ స్పూన్

తయారు చేసే విధానం :
చిన్న బౌల్ తీసుకుని అందులో టీస్పూన్ పాలు పోసి కుంకుమపువ్వు కలిపి పక్కన ఉంచుకోవాలి. తరువాత వెడల్పాటి నాన్ స్టిక్ పాన్ లో కోవా వేడిచేసి, మధ్యస్ధంగా ఉండే సెగపై ఎడెనిమిది నిమిషాలు ఉడికించాలి. పంచదార కూడా కలిపి ఒకటి, రెండు నిమిషాలు కలయబెడుతూ ఉడికించాలి.

ప్లేట్ లోకి మిశ్రమాన్ని మార్చుకుని సమంగాపరచి, మూతపెట్టి ఒక గంట పక్కనుంచుకోవాలి.
కోవా మిశ్రమాన్ని కలియబెట్టి యాలకులపొడి, కుంకుమపువ్వు, పాలు కలపాలి. మిశ్రమాన్ని 16 సమభాగాలుగాల చేసుకుని గుండ్రంగా చేసుకుని మధ్యలో ఫ్లాట్ గా నొక్కాలి. దీనిని ఎయిర్ కంటైనర్ లో ఉంచి ఫ్రిజ్ లో బధ్రపరచుకోవాలి.

చక్రపొంగలి

కావాలిసిన పదార్ధాలు

కిలో మైదాపిండి
అరకిలో బియ్యం
కిలో పెసరపప్పు
పావుకిలో నెయ్యి
50 గ్రాముల జీడిపప్పు
అరకిలో పంచదార
కొద్దిగా కిస్మిస్
యాలకులపొడి
కొద్దిగా పచ్చ కర్పూరం
లీటరు పాలు
100 గ్రాముల బాదం పప్పు

తయారుచేసేపద్ధతి
బియ్యం కడిగి నీరులేకుండా ఒంపుకోవాలి. బాదం పప్పును మందుగా నానబెట్టుకొని పొట్టు తీసి ముక్కలుగా చేసిపెట్టుకోవాలి. జీడిపప్పు, కిస్మిస్ లను కొద్దిగా నేతిలో వేయించుకోవాలి. పెద్దపాత్రలో బియ్యం, పాలు, పెసరపప్పు కలిపి అత్తెసరి నీరుపోసి స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి.

అన్నం పదునుగా ఉడికాక పంచదార, నెయ్యివేసి కలియబెట్టి మూతపెట్టాలి. కొద్దిసేపు ఆగాక జీడిప ప్పు, కిస్మిస్, బాదంపప్పులు వేసి కలియబెట్టి దించుకోవాలి. చక్రపొంగలి రెడీ.

బొబ్బట్లు

కావాలిసిన పదార్ధాలు

కిలో మైదాపిండి
ముప్పావు కిలో బెల్లం
కొద్దిగా నూనె
10 గ్రాముల యాలకులు
100 గ్రాముల నెయ్యి
అరకిలో పచ్చిశెనగ పప్పు.

తయారుచేసే పద్ధతి :
పచ్చిశెనగపప్పును శుభ్రంగాకడిగి కొద్దిగానానబెట్టి మొత్తగా ఉడికించుకోవాలి. ఉడికిన శెనగ పప్పులో బెల్లం ముక్కలు, యాలకులు కలిపి గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి. పిండిజావగా ఉండకూడదు. గట్టిగా ఉండాలి.

మైదాపిండిలో తగినంత ఉప్పు నీరు, కొద్దిగానూనె కలిపి పూరీల పిండిమాదిరిగా కలుపుకోవాలి. మైదా పిండిని ఉండగా చేసే మధ్యలో కొద్దిగా శెనగపిండి మిశ్రమాన్ని ఉంచి చిన్న చపాతీలాగారోల్ చేసుకోవాలి. లేదా మైదాపిండిని పూరీల లాగా ఒత్తుకొని రెండు పూరీల మధ్య శెనగపిండి మిశ్రమాన్ని సమానంగాపరచి అంచులు గట్టిగా ఒత్తుకోవాలి.

ఇపుడువీటిని పెనంమీద నెయ్యి లేదా నూనె వేసి వేడెక్కిన తరువాత రెండువైపులా కాలనివ్వాలి. అంతే రుచికరమైన బొబ్బట్లు తయారవుతాయి.

కొబ్బరి బూరెలు

కావలిసిన పదార్ధాలు
ఒక కొబ్బరికాయ
అరకిలో బియ్యం,
అరకిలో బెల్లం
కొద్దిగా యాలకుల పొడి
నూనె తగినంత

తయారుచేసేపద్ధతి
బియ్యాన్ని 24గంటలపాటు నానబెట్టుకొని నీరు లేకుండా శుభ్రంగా వడకట్టి పిండి పట్టించుకోవాలి. కొబ్బరి తురిమి ఉంచుకోవాలి. బెల్లంను చిన్న చిన్నముక్కలుగా పొడిగొట్టుకొని వెడల్పాటి బాణాలిలో వేసి పొయ్యిమీద ఉంచి లేత పాకం పట్టుకోవాలి. గరిటతో కొద్దిగా పాకంను నీటిలో వేస్తే తేలిగ్గా ఉండకట్టేటట్లు ఉండాలి. కొబ్బరి తురుము వేసి నాలుగైదు నిమిషాలు ఉడికించి అందులో బియ్యం పిండివేస్తూ ఉండ కట్టకుండా నెమ్మది నెమ్మదిగా వేస్తూ పొడవాటి చెక్కగరిటతో బాగా కలపాలి. యాలకుల పొడి కూడా వేసి కలిపి దించుకోవాలి. పిండి చల్లారాక చిన్న చిన్న ఉండలు చేసి పాలకవర్ పైన గుండ్రంగా వత్తుకొని నూనెలో రెండుపక్కలా వేయించుకోవాలి.

అరిసెలు

కావలిసిన పదార్ధాలు
కిలో బియ్యం
ముప్పావు కిలో బెల్లం
100 గ్రాముల నువ్వులు
కొద్దిగా యాలకుల పొడి
తయారుచేయటానికి నెయ్యి లేదా నూనె
అరిసెలకు సన్నబియ్యం పనికిరావు. బియ్యంను దాదాపు 24 గంటలపాటు నానబెట్టాలి. బియ్యం ఎంతగానానితే అంతబాగా అరిసెలు వస్తాయి.

బియ్యం దంచేదాకా ప్రతి పూటా కడిగి, తాజానీరు పోస్తుండాలి. నానిన బియ్యాన్ని వెదురుబుట్ట లేక చిల్లుల గిన్నెలో వడపోసి రోకళ్ళమీద పట్టిస్తే అరిసెలు బాగా వస్తాయి. రెండుమూడు సార్లు జల్లించి పిండి ఆరకుండా గట్టిగా నొక్కుతుండాలి. బెల్లం తురిమికొద్దిగా నీరుపోసి పొయ్యిమీద బాణాలి వేడెక్కిన తరువాత అందులో వేసి ముదురుపాకం రానివ్వాలి. అందులో ముందుగా వేయించి ఉంచుకున్న నువ్వులువేసి కలిపి బియ్యం పిండి కొద్దికొద్దిగా బెల్లం పాకంలో పోస్తూ పొడి కట్టకుండా ముద్దగా అయ్యేటట్లు పొడవాటి చెక్క గరిటతో కలుపుతుండాలి. పూర్తిగా కలిసిన తరువాత పొయ్యిమీద నుంచి దించి మూతపెట్టుకోవాలి.

తరువాత బాణాలిలో నెయ్యి లేక నూనె పోసి వెడెక్కిన తరువాత, తయారుచేసుకున్న పిండిని నిమ్మకాయంత తీసుకుని బాదం ఆకు లేదా నూనె కవర్ పైన గండ్రంగా వత్తుకుని నూనెలోవేసి రెండువైపులా చక్కని రంగు వచ్చేదాకా వేయించి తీసి అరిసెల అవకల మధ్యలో పెట్టి గట్టిగా నొక్కాలి.
ఒక్కొక్కటి విడివిడిగా పరచి ఆరనివ్వాలి. తరువాత డబ్బాలలో సర్ధుకోవాలి.

Blackgram Jilebi / మినపపప్పుతో జిలేబీ

కావాలిసిన పదార్ధాలు

ఒక కప్పు మైదా
కావలసినవి
మినప్పప్పు: 100 గ్రా.
బియ్యం: 2 టేబుల్‌స్పూన్లు
బెల్లం: పావుకిలో
ఆరెంజ్‌ ఫుడ్‌ కలర్‌: కొద్దిగా
నూనె: వేయించడానికి సరిపడా

తయారుచేసే విధానం
మినప్పప్పుని సుమారు ఎనిమిది గంటలపాటు నానబెట్టాలి. బియ్యం గంటసేపు నాననివ్వాలి. ఈ రెండింటినీ మిక్సీలో వేసి రుబ్బాలి. తరవాత అందులోనే ఆరెంజ్‌ ఫుడ్‌ కలర్‌ కూడా వేసి పావు కప్పు నీళ్లు పోసి పేస్టులా రుబ్బి సుమారు ఆరు గంటలపాటు పక్కన ఉంచితే పొంగుతుంది.
పంచదార లేదా బెల్లం తురుములో తగినన్ని నీళ్లు పోసి, కుంకుమపువ్వు వేసి తీగ పాకం వచ్చేవరకూ ఉంచి స్టవ్‌ ఆఫ్‌ చేయకుండా సిమ్‌లో ఉంచాలి.

పాల కవరుగానీ పలుచని బట్ట గానీ తీసుకుని దానికి అడుగు భాగంలో చిన్న రంధ్రం పెట్టి అందులో పొంగిన పిండి మిశ్రమాన్ని నింపి ఆపైన రబ్బరు బ్యాండుతో సీలు చేసి, కవరుని నెమ్మదిగా వత్తుతూ కాగిన నూనెలో జిలేబీల్లా చుడుతూ సిమ్‌లో వేయించి, తీసి వెంటనే పాకంలో వేయాలి. అందులో సుమారు మూడు నాలుగు నిమిషాలు ఉంచి తీయాలి.