మామిడి కాయ పులిహోర

కావలిసినవి
బియ్యం : 2 కప్పులు (లేక ఆరుకప్పుల ఉడికిన అన్నం)
పుల్లమామిడి తురుము : 2 కప్పులు
ఉప్పు : రుచికి సరిపడ
పసుపు : అరటీ స్పూన్
పోపుగింజలు : కొద్దిగా
పచ్చిమిర్చి : నిలువుగా చీల్చినవి 6
అల్లం : రెండు అంగుళాలు
వేరుశెనగ గుండ్లు : 50 గ్రాములు
కరివేపాకు
ఎండుమిర్చి : 4
ఇంగువ : చిటికెడు
తయారు చేసే పద్దతి
ముందుగా బియ్యాన్ని నానబెట్టి అన్నం పొడి పొడిగా ఉండేటట్లు వండుకోవాలి. వండిన అన్నాన్ని వెడల్పాటి గిన్నెలో వేసి పూర్తిగా చల్లారిన తరువాత కొద్దిగా నూనె పసుపు కలుపుకోవాలి.
వేరుశెనగ గుళ్ళను దోరగా వేయించి పైన పొట్టుతీసి పెట్టుకోవాలి.
ముందుగా పొయియమీద బాణాలి పెట్టి నూనె వేసి నూనె వేడెక్కిన తరువాత ఎండుమిర్చి, తాలింపుగింజలు వేసి అవి కూడా వేగిన తరువాత, వేరుశెనగ గుండ్లు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి అన్నీ దోరగా వేగిన తరువాత ఉప్పు, మామిడి తురుము వేసి 2-3 నిమిషాలు ఉంచాలి. తరువాత ఈ మిశ్రమాన్ని దించుకొని వెడల్పాటి పాత్రలో ఉన్న అన్నంలో కలుపుకోవాలి.
చేతులు శుభ్రంగా కడుక్కొని పొడి చేతులతో అన్నీ కలిసేటట్లు నెమ్మదిగా చక్కగా కలపాలి లేదా అన్నం ముక్కలుగా మారుతుంది. ఇష్టమైన వారు ఇందులో కొత్తిమీర, క్యారెట్ తురుము కలుపుకోవచ్చు. పులుపు మామిడి కాయల సైజ్, మామిడి రకాలను బట్టి ఉంటుంది కనుక అవసరాన్ని బట్టి మామిడి తురుము కలుపుకోవాలి.

నిమ్మ పులిహోర

lemon rice

కావలసిన పదార్థాలు
అన్నం : 4 కప్పులు (అన్నం పొడిపొడిగా వండుకోవాలి)
నిమ్మకాయలు : 2 పెద్దవి
పచ్చిమిర్చి : 4 కాయలు సన్నగా నిలువుగా చీల్చాలి
వేరుసెనగ గుళ్ళు : 50 గ్రా.
ఉప్పు : తగినంత
పసుపు : చిటికెడు
పోపు దినుసులు : కొద్దిగా
కరివేపాకు : కొద్దిగా
కొత్తిమీర : సగం పెద్దకట్ట
నూనె : 50 గ్రాములు
తయారుచేయు విధానం
ముందుగా ఒక వెడల్పాటి పాత్రలో అన్నం వేసి, ఉప్పు, పసుపు, నిమ్మ రసం(విత్తనాలు తీసివేయాలి), కొంచెం నూనె వేసి కలుపుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి బాణలి పెట్టి నూనె వేసి నూనె వేడెక్కిన తరువాత పోపుదినుసులు, వేరుసెనగ గుళ్ళు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించి ఈ మిశ్రమాన్ని అన్నం పైన వేసి కలుపుకోవాలి. పోపుగింజలు నిమ్మరసం అన్నీ బాగా కలిసేటట్లు కలుపుకోవాలి.

సేమ్యా పులిహోర

semya pulihora

కావలసిన పదార్థాలు
సేమ్యా : పావు కిలో
నిమ్మకాయలు : 2 పెద్దవి
పచ్చిమిరపకాయలు : 4 నిలువుగా చీల్చకోవాలి
వేరుశెనగ గుండ్లు : 50 గ్రాములు
కరివేపాకు : 4 రెబ్బలు
పోపుదినుసులు : కొద్దిగా
ఎండుమిర్చి : 2
ఇంగువ : చిటికెడు
పసుపు : చిటికెడు
ఉప్పు : తగినంత
నూనె : పావు కప్పు
తయారు చేసే విధానం
ముందుగా స్టవ్ వెలిగించి ఒక వెడల్పాటి పాత్రలో లేక పాన్ లో, నాలుగు గ్లాసుల నీళ్లు పోసి మరిగించాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు సేమ్యా వేసి 5 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. తర్వాత సేమ్యాను చిల్లుల గిన్నెలో వేసి వెంటనే వెంటనే చల్లటినీళ్లు పోయాలి. ఇందువల్ల సేమ్యా మరింత ఉడికి మెత్తబడకుండా విడివిడిగా అంటుకోకుండా ఉంటుంది. నీరంతా పోయినతర్వాత ఒక పళ్ళెంలో వేసి, తగినంత ఉప్పు, నిమ్మరసం, పసుపు వేసి కలిపి పెట్టాలి. పాన్ లో నూనె వేసి వేడి చేసి పోపుదినుసులు వేసి, వేరుశెనగ గుళ్ళు ఎండుమిర్చి, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, చిటికెడు పసుపు వేసి, బాగా వేయించి ఉడికించి పక్కన పెట్టుకున్న సేమ్యాలో వేసి కలియబెట్టాలి. పుల్లపుల్లగా సేమ్యా పులిహార రెడి.

చింతపండు పులిహోర

కావలసిన పదార్థాలు
పొడిపొడిగా వండిన అన్నం : 2 కప్పులు
చింతపండు గుజ్జు : అర కప్పు
పచ్చిమిర్చి – 6 నిలువుగా చీల్చుకోవాలి
ఎండుమిర్చి : 2
పోపుదినుసులు : కొద్దిగా
వేరుశెనగ గుళ్ళు : పావుకప్పు వేయించి పొట్టుతీసి ఉంచుకోవాలి
కరివేపాకు : కొద్దిగా
పసుపు
ఉప్పు : రుచికి తగినంత
ఇంగువ : పావుస్పూన్
నూనె : 50 గ్రాములు
తయారు చేసే విధానం
ముందుగా చింతపండును నానబెట్టి మెత్తగా పిసికి గుజ్జు తీసుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించుకొని బాణలిలో కొద్దిగా నూనె వేసి వేడెక్కినతరువాత చింతపండు గుజ్జులో కొద్దిగా ఉప్పు, పసుపు వేసి దగ్గరపడేవరకు ఉడికించి పక్కనపెట్టుకోవాలి. ఇప్పుడు మరలా బాణలి పెట్టి నూనెవేసి, పోపుదినుసులు, వేరుశెనగగుళ్ళు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఇంగువ, అన్నీ వేసి బాగా వేగాక కొంచెం పోపును తీసి పక్కన పెట్టుకోవాలి, మిగిలినపోపులో మగ్గించి పక్కనపెట్టుకున్న చింతపండుగుజ్జును వేసి, 5 నిముషాలు ఉంచి, దించి ఒక వెడల్పాటి పాత్రలో ఉంచుకొన్న అన్నంవేసి దాని మీద పోపుని, చింతపండుతో కలిసిన పోపుని వేసి బాగా కలియబెట్టాలి. అంతా కలిసాక పైన మిగిలిన నూనెను వేసి మరొక్కసారి కలపాలి. అంతే కమ్మని వాసనగల చింతపండు పులిహోర రెడీ. ఇష్టమున్న వారు సన్నగా తురిమిన కొత్తిమీర, క్యారెట్ తురుమును కూడా కలుపుకోవచ్చు. ప్రతి పండుగకు తెలుగువారి ఇళ్ళలో తప్పనిసరిగా చేసే వంట ఇది. ఇంకా ఎక్కువ పరిమాణంలో కావలసినవారు అన్నం మిగిలిన పదార్ధాలు పెంచుకోవచ్చు. అన్నం కొద్దిగా పొడిగా ఉండాలి మెత్తగా ఉంటే పులిహోర ముద్దగా తయారవుతుంది.

అటుకుల పులిహోర

atukula pulihora

కావలసిన పదార్థాలు
అటుకులు : 4 కప్పులు
ఉల్లిపాయముక్కలు : 2 కప్పులు
కారెట్ తురుము : 1 పెద్ద క్యారెట్ తురుము
వేరుశనగ గుళ్ళు : 50 గ్రాములు
పచ్చిమిర్చి : 6 నిలువుగాచీలికలు చేసుకోవాలి
పోపుదినుసులు : కొద్దిగా
కరివేపాకు
ఇంగువ : చిటికెడు
ఉప్పు : సరిపడినంత
పసుపు : కొద్దిగా
నిమ్మకాయలు : 2 రసం కాయలు
కొత్తిమీర : 1 కట్ట
నూనె : తిరగమాతకు కొద్దిగా
తయారీ విధానము
ముందుగా అటుకులను శుభ్రంగా బాగుచేసి కడిగిపెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలి పెట్టి, నూనె వేసి కాగిన తరవాత పోపుదినుసులు, కరివేపాకు వేసి, వేగిన తరవాత, వేరుసెనగ గుళ్ళు, ఇంగువ వేసి, క్యారెట్ అన్ని వేసి బాగా కదిపి, అన్ని వేగాక అటుకులు, ఉప్పు పసుపు వేసి బాగా కదిపి, అన్ని కలిసాక స్టవ్ మీద నుండి దించుకొని సన్నగా తురిమిన కొత్తిమీర చల్లుకోవచ్చు. ఇష్టమైన వాళ్ళు నిమ్మకాయ రసం వేసుకోవచ్చును.