ఐస్‌క్రీం – చరిత్ర

మేసపటేమియా లో 4000 ఏళ్ల క్రితమే ఐస్ నిలవ గదులు ఉన్నాయని అంటారు. చైనా లో,అలెక్జాండర్ ,జపాన్ చక్రవర్తుల ఇలా ఐస్ నిలవ చేసే పద్దతి పాటించేవారట.

అయితే ఐస్ కి పాలని, కలపాలని అనిపించిన పాలకులు చైనా లోని టాంగ్ వంశ రాజులు(618-907 AD).అయితే దీన్లో కలిపే వస్తువులువింటే వాంతి కొస్తుంది. అవు,గొర్రే /గేదె పాలను పులిసేట్లు చేసి,పిండి కలిపి,కర్పూరం వేసి మంచి వాసన ,రుచి కోసం డ్రాగన్ మెదడు ,కనుగుడ్లు వెసేవారట.అబ్బో ఏమిరుచో .నెవర్ బెఫోర్ ఎవర్ ఆఫ్టర్ .ఇక ఇక్కడి నుండి మార్కోపోలో(1254-1324) దీన్ని యూరోపుకి పట్టుకు పోయాడు అని ఒక గాధ ఉన్నా చాలా మంది లేదని గట్టిఘా నమ్ముతున్నారు.అరబ్బులు తాగే శర్బత్ పానీయం ఒక రకంగా ఈ ఐస్క్రీం కు దారి తీసింది అని వీరి వాదన.1600 మొదట్లో దీని ప్రస్తావన “అరియానా ఇన్ఫర్మ” అనే పద్యం లో” ఫ్రాన్సేస్కో రెడి” రాసాడు.దీని రెసిపి రాసింది “అన్తొనియో లాటిని “అనే స్పానిష్ వ్యక్తీ.ఆకాలంలో నేపుల్స్ నగరం సార్బెటో కి బాగా ఫేమస్.ఇది పాలులేని సర్బత్ లాంటి పానీయం.ఐస్ క్రీముల పుట్టిల్లు ఏదైనా ,అది వాసికెక్కింది, వన్నె దాల్చింది మాత్రం ఇటలీ అని అందరూ ఒప్పుకునే సత్యం.ఇటాలియన్ జేలాటో ఐస్‌క్రీం లు అన్నిటికి మాతృక.

ఐస్ క్రీమ్ రకాలలో ప్రధానంగా చెప్పుకోవలసినవి జేలాటో.ఇంతకూ ముందే చెప్పినట్లు ఇది ఇటాలియన్ ఐస్ క్రీమ్.దీన్లో తక్కువ గాలి ఉండి ఎక్కువ మందం గా ఉంటుంది.పాల కొవ్వు శాతం తక్కువ. అదే ఐస్ క్రీములో కొవ్వుశాతం కనిష్టంగా పది శాతం.దీన్లో గాలి ఉండటం వల్ల తేలికగా వదులుగా ఉంటుంది.సోర్బెతో లో పాలు గానీ గుడ్లు గానీ ఉండవు.పళ్ళ క్రష్,ఇంకా పంచదార, ఐస్ ఉంటాయి.యోగర్ట్ అంటే పెరుగు దీన్ని కూడా రక రకాల ఫ్లేవర్లతో ఐస్ క్రీము లా తింటారు.

ఇంకా ఆకారాన్ని బట్టి కోన్ ,స్టిక్ లు కప్ లు ,వగైరా లు గా అమ్ముతారు.

ఇంకోముఖ్యమైన ఐస్ క్రీము మనకి అన్నిచోట్ల కనపడేది సండే (SUNDAE) ఆదివారం పేరుతొ అల్లరి పెట్టే ఈ క్రీము గారి కధ ఏమంటే దీన్లో ఓ రెండుమూడు స్కూప్ (చెంచాల ) ఐస్ క్రీము, అదికూడా సాధారణంగా భిన్న రకాలదై ఉంటుంది,ఉదాహరణకి వనీల,స్ట్రాబెరి,పిస్తా లాగ.ఇది కాకుండా సాస్( హిందీ అత్త గారు కాదు ) అనబడే ఒక చిక్కటి ఫ్లేవర్ ఉండే ద్రవం,దానికి తోడూ బాదాం,పిస్తా,వంటి నట్స్ ,ఇంకా చాకో చిప్స్.

ఇన్ని కలిపి కలగాపులగంగా పులిహోర కలిపినట్లు కలిపిన పదార్ధమునే సండే అని నొక్కి వక్కాణించారు.

ఇకపోతే చివరగా దుమ్దుర్మ(dumdurma) ఇది టర్కీలో చేసే ఒక ఐస్ క్రీమ్.దీన్లో వెన్న,పాలలోని కొవ్వు,సలేప్ (ఆర్కిడ్ మొక్క వేరు దుంప),మాస్టిక్(మొక్కలలో స్రవించే రసం)

చివర్లో ఓ మాట.మార్కెట్లో కొన్ని బ్రాండులు మాత్రమె పాలనుంచి ఐస్ క్రీములు చేస్తాయన్నది కొందరికే తెలిసిన నిజం.మిగతావన్నీ పాలే లేని కృత్రిమ ఫ్లేవర్లు, కెమికల్ లు కలసిన వడబోత. వీటిలో వెజిటబుల్ నూనె లు అంటే డాల్డా ని శీతలీకరణ కోసం పాల బదులు వాడతారట.వీటిని ఎక్కువగా తింటే ఆరోగ్యం ధమాల్ అవడం గారంటీ.

బాదం కుల్ఫీ/ Badam Kulfi

కావాల్సినవి
పాలు – 4 కప్పులు
యాలకుల పొడి – 1 టేబుల్‌ స్పూన్
పంచదార – పావు కప్పు
మొక్కజొన్న పిండి – 1 టేబుల్‌ స్పూన్
బాదంపప్పులు – 10 లేదా 15
బ్రెడ్‌ – 1 (చివర్లు తొలగించి ముక్కలు చేసుకోవాలి)
తయారు చేసే విధానం
ముందుగా బ్రెడ్‌ ముక్కలు, అరకప్పు పాలు, మొక్కజొన్న పిండి కలుపుకుని మిక్సీలో పేస్ట్‌లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత బాదం పప్పులను ముక్కలు చేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక పాన్‌ తీసుకుని అందులో మిగిలిన మూడున్నర కప్పులు పాలను మరిగించి కప్పున్నర పాలుగా చేసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్‌ పేస్ట్‌ను అందులో యాడ్‌ చేసుకుని (అడుగంటకుండా) గరిటెతో తిప్పుతూ ఉండాలి. ఆ మిశ్రమం చిక్కపడిన తరువాత పంచదార వేసుకుని దగ్గర పడేదాకా గరిటెతో తిప్పాలి. ఇప్పుడు స్టవ్‌ ఆఫ్‌ చేసి అందులో బాదం ముక్కలు, యాలకుల పొడి కలుపుకుని బాగా చల్లారనివ్వాలి. తరువాత కుల్ఫీ కప్స్‌లోకి లేదా మీకు నచ్చే ఆకారంలోకి ఆ మిశ్రమాన్ని తీసుకుని ఒక పుల్ల వేసుకుని డీప్‌ ఫ్రిజ్‌లోకి పెట్టుకుంటే సరిపోతుంది.

పుచ్చకాయ ఐస్‌ క్రీమ్‌/ Watermelon Ice Cream

కావాల్సినవి
పుచ్చకాయ – 3 కప్పులు
తేనె – 1 టేబుల్‌ స్పూన్
పాలు – అర కప్పు
నిమ్మరసం – 2 టేబుల్‌ స్పూన్స్
చాక్లెట్‌ ఫ్లేక్స్‌ – 1 టేబుల్‌ స్పూన్‌
తయారు చేసే విధానం
పుచ్చకాయ ముక్కలను జ్యూస్‌ చేసుకోవాలి. అందులో తేనె, పాలు కలిపి మిక్స్‌ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్‌లోకి జ్యూస్‌ తీసుకుని అందులో నిమ్మరసం వేసి మరోసారి బాగా కలుపుకోవాలి. తరువాత ఆ బౌల్‌ను డీప్‌ ఫ్రిజ్‌లో కాసేపు ఉంచతే టేస్టీ పుచ్చకాయ ఐస్‌క్రీమ్‌ రెడీ. చాక్లెట్‌ ఫ్లేక్స్‌తో గార్నిష్‌ చేసుకోవచ్చు.

ఖర్జూరం ఐస్‌ క్రీమ్‌/ Dates Ice Cream

కావాల్సినవి
పంచదార – అర కప్పు
నీరు – 1 కప్పు
ఖర్జూరం – 10 లేదా 15 (గింజలు తీసినవి)
పాలు –2 కప్పులు
గుడ్లు – 3 (పచ్చసొన మాత్రమే)
వెనీలా – 2 చుక్కలు
తయారు చేసే విధానం
ముందుగా ఒక పాత్ర తీసుకుని అందులో పంచదార, నీరు వేసుకుని… పంచదార కరిగేదాకా మరిగించాలి. తరువాత అందులో ఖర్జూరం వేసుకుని మెత్తగా ఉడికించుకోవాలి. తరువాత మిక్సీలో (మరీ మెత్తగా కాకుండా) మిక్స్‌ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో బౌల్‌ తీసుకుని అందులో పాలు, గుడ్లు యాడ్‌ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు రెండు మిశ్రమాలను ఒక బౌల్‌లో కలుపుకొని ఐస్‌క్రీమ్‌ మేకర్‌లో కానీ డీప్‌ ఫ్రిజ్‌లో కానీ పెట్టుకుంటే నోరూరించే ఖర్జూరం ఐస్‌క్రీమ్‌ తయారుచేసుకోవచ్చు.

బొప్పాయి ఐస్‌క్రీమ్‌ / Papaya Ice Cream

కావాల్సినవి
కావాల్సినవి : బొప్పాయి – 1 (మీడియం సైజ్‌)
పంచదార పొడి – ఒక కప్పు
క్రీమ్‌ – 1 1/2 కప్పు (మార్కెట్‌లో దొరుకుతుంది)
వెనీలా – 2 చుక్కలు
తయారు చేసే విధానం
ముందుగా ఒక బౌల్‌ తీసుకుని అందులో క్రీమ్, పంచదార పొడి వేసుకుని హ్యాండ్‌ మిక్సర్‌తో మిక్స్‌ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత బొప్పాయి ముక్కలను జ్యూస్‌ చేసుకుని అందులో వెనీలా చుక్కలతో పాటు.. క్రీమ్‌ మిశ్రమాన్ని యాడ్‌ చేసుకుని ఫ్రిజ్‌లో పెట్టుకుంటే పొప్పాయ ఐస్‌క్రీమ్‌ తయారైపోతుంది.

అనాస ఐస్‌క్రీమ్‌ / Pine apple Ice Cream

కావాల్సినవి
అనాస ముక్కలు – ఒక కప్పున్నర
పాలు – 3 కప్పులు
చక్కెర – అర కప్పు
బేకింగ్‌ సోడా – అర టేబుల్‌ స్పూన్
తేనె – ఒక టేబుల్‌ స్పూన్
గుడ్డు – 1 (తెల్ల సొన మాత్రమే)
తయారు చేసే విధానం
ముందుగా ఒక పాన్‌ తీసుకుని పాలు, చక్కెర వేసుకుని బాగా (ఇంచుమించు ఒక కప్పు వాటర్‌ అయ్యేంత వరకు) మరిగించుకోవాలి. అందులో చివరిగా బేకింగ్‌ సోడా, తేనె వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అనాస ముక్కలను జ్యూస్‌ చేసుకుని వడగట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్‌ తీసుకుని అందులో జ్యూస్, గుడ్డులతో పాటు పాల మిశ్రమాన్ని జోడించి బాగా కలుపుకుని డీప్‌ ఫ్రిజ్‌లో పెట్టుకుంటే సరిపోతుంది.

ద్రాక్ష ఐస్‌క్రీమ్‌ / Draksha Ice Cream

కావాల్సినవి
ద్రాక్షపళ్లు – అర కిలో
నిమ్మకాయ – 1
పంచదార పొడి – ఒక కప్పు
పాలు – 1 కప్పు
గుడ్డు – 1 (తెల్ల సొన మాత్రమే)
తయారు చేసే విధానం
ముందుగా ద్రాక్షపళ్లను జ్యూస్‌ చేసుకుని వడగట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ జ్యూస్‌లో నిమ్మరసం, గుడ్డు కలుపుకుని ఒక 20 నిమిషాలు ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. తరువాత ఒక పాన్‌ తీసుకుని అందులో పాలు, పంచదార వేసుకుని బాగా మరిగించాలి. తరువాత జ్యూస్‌ ఫ్రిజ్‌లోంచి బయటికి తీసి అందులో ఈ పాల మిశ్రమాన్ని యాడ్‌ చేసుకుని డీప్‌ ఫ్రిజ్‌లో పెట్టుకుంటే రుచికరమైన ద్రాక్ష ఐస్‌క్రీమ్‌ మిమ్మల్ని చల్లబరుస్తుంది.

సపోటా ఐస్‌క్రీమ్‌ / Sapota Ice Cream

కావాల్సినవి
సపోటాలు – 5
పాలు – అర కప్పు
తేనె – 1 టేబుల్‌ స్పూన్
పంచదార పొడి – అర కప్పు
తయారు చేసే విధానం
ముందుగా సపోటా ముక్కలను మిక్సీలో వేసుకుని జ్యూస్‌ చేసుకోవాలి. తరువాత అందులో పాలు, పంచదార వేసుకుని మరో సారి మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్‌లోకి ఆ మిశ్రమాన్ని తీసుకుని అందులో తేనె, గ్లూకోజ్‌ యాడ్‌ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ బౌల్‌ను ఫ్రిజ్‌లో పెట్టుకుంటే టేస్టీ టేస్టీ సపోటా ఐస్‌క్రీమ్‌ సిద్ధమైపోతుంది.

దానిమ్మ ఐస్‌క్రీమ్‌ / Pamogranete Ice Cream

కావాల్సినవి
పంచదార – అర కప్పు
నీరు – ముప్పావు కప్పు
దానిమ్మ జ్యూస్‌ – 3 కప్పులు
నిమ్మకాయ – 1
తయారు చేసే విధానం
ముందుగా దానిమ్మ జ్యూస్‌ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత నీటిని 10 నిమిషాలు వేడి చేసుకుని అందులో పంచదార కలుపుకుని బాగా కరగనివ్వాలి. తరువాత దానిమ్మ జ్యూస్‌లో ఈ పంచదార నీళ్లను కలుపుకోవాలి. తరువాత నిమ్మరసం కలుపుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ఐస్‌ క్రీమ్‌ మెషిన్‌లో లేదా డీప్‌ ఫ్రిజ్‌లో పెట్టుకుంటే నోరూరించే దానిమ్మ ఐస్‌క్రీమ్‌ మీ సొంతమవుతుంది.

ఆపిల్‌ ఐస్‌క్రీమ్‌/ Apple Ice Cream

కావాల్సినవి
ఆపిల్‌ – 2
పాలు – 5 కప్పులు
పంచదార – అర కప్పు
వెనీలా – 1 టేబుల్‌ స్పూన్‌
తయారు చేసే విధానం
ముందుగా నాలుగున్నర కప్పులు పాలను బాగా మరిగించి ఒక కప్పు కంటే తక్కువగా చేసుకోవాలి. తరువాత పైన పేరుకున్న మీగడను తీసి పక్కన పెట్టుకుని మిగిలిన పాలను డీప్‌ ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. అది గడ్డ కట్టిన తరువాత ముందుగా తీసి పక్కన పెట్టిన మీగడను జోడించి మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు అందులో ఆపిల్‌ ముక్కలు, మిగిలిన అర కప్పు పాలు, పంచదార వేసుకుని మిక్సీ పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమంలో వెనీలా వేసుకుని బాగా కలుపుకుని ఒక పాత్రలో తీసుకుని డీప్‌ ఫ్రిజ్‌లో పెట్టుకుంటే ఆపిల్‌ ఐస్‌ క్రీమ్‌ రెడీ అయిపోతుంది. చివరగా ఆపిల్‌ ముక్కలు చాక్లెట్‌ పౌడర్లతో మీకు నచ్చిన విధంగా గార్నిష్‌ చేసుకోవచ్చు.

అరటి పండ్ల ఐస్‌క్రీమ్‌ / Banana Ice Cream

కావాల్సినవి
అరటిపళ్లు – 3 లేదా 4
తేనె – 1 కప్పు
పాలు – అర కప్పు
తయారు చేసే విధానం
ముందుగా అరటి పళ్లను గుండ్రటి ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. తరువాత వాటిని ఒక 10 లేదా 15 నిమిషాలు పాటు మైక్రోవేవ్‌ ఓవెన్‌లో పెట్టుకోవాలి. తరువాత ఆ అరటి ముక్కలను ఒక మిక్సీలో వేసుకుని జ్యూస్‌లా చేసుకోవాలి. తరువాత ఆ మిశ్రమంలో తేనె, పాలు కలిపి మరో సారి మిక్సీ పెట్టుకోవాలి. తరువాత ఒక బౌల్‌లోకి తీసుకుని ఫ్రిజ్‌లో పెట్టుకుంటే బనానా ఐస్‌క్రీమ్‌ రెడీ. చల్లబడ్డాక ఈ ఐస్‌క్రీమ్‌ను చక్కగా ఆస్వాదించవచ్చు