ఇంజనీరింగ్.. ఈ బ్రాంచులు చదివితే పోటీ తక్కువ.. అవకాశాలు ఎక్కువ

ఇంజనీరింగ్లో ఎక్కువ మంది విద్యార్థుల ఆప్షన్లు.. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ బ్రాంచ్లే.
Edu news

ఈ కోర్ బ్రాంచ్ల్లో ఇంజనీరింగ్ పూర్తిచేస్తే భవిష్యత్తుకు ఢోకా ఉండదనే భావనే దీనికి కారణం. అయితే బీటెక్ స్థాయిలో వినూత్న బ్రాంచ్ల్లో ఇంజనీరింగ్ చేయాలనుకునేవారికి.. ఏరోనాటికల్, మైనింగ్, కెమికల్, మెటలర్జికల్, బయోటెక్నాలజీ తదితర స్పెషలైజ్డ్ బ్రాంచ్లు అందుబాటులో ఉన్నాయి. స్వీయ ఆసక్తితోపాటు అవకాశాలపై అవగాహన ఉన్న విద్యార్థులు ఈ వినూత్న బ్రాంచ్లను ఎంచుకోవచ్చు. ఈ నేపథ్యంలో.. స్పెషలైజ్డ్ ఇంజనీరింగ్ బ్రాంచ్ల వివరాలు, కెరీర్ అవకాశాల గురించి తెలుసుకుందాం..
కెమికల్ ఇంజనీరింగ్..
రసాయన శాస్త్రాన్ని(కెమిస్ట్రీ) టెక్నాలజీకి అనుసంధానించే ప్రక్రియలోంచే ‘కెమికల్ ఇంజనీరింగ్’ ఆవిర్భవించింది. సిరామిక్స్, ఇంధనాలు, పెట్రోకెమికల్స్, ఎరువులు, ప్లాస్టిక్స్, పేలుడు పదార్థాలు వంటి ఉత్పత్తుల తయారీలో కెమికల్ ఇంజనీరింగ్ అప్లికేషన్స్ ప్రధాన పాత్ర పోషిస్తాయి. కెమికల్ ప్లాంట్ల నిర్వహణ, రసాయన ముడిపదార్థాలను పెద్దఎత్తున వినియోగ వస్తువులుగా మార్చే ప్రాసెసింగ్ విధానం వంటివి ఈ ఇంజనీరింగ్ పరిధిలోకి వస్తాయి. పెట్రోలు, రసాయన, పెట్రోకెమ్ పెట్టుబడులను ప్రోత్సహించడానికి ప్రత్యేక ఆర్థిక మండళ్లకు రూపకల్పన జరుగుతున్న తరుణంలో రానున్న రోజుల్లో కెమికల్ ఇంజనీర్లకు డిమాండ్ ఏర్పడనుందని అంచనా.
 • కోర్ సబ్జెక్టులు: కెమికల్ ప్రాసెస్ ప్రిన్సిపుల్స్, ఇనార్గానిక్ అండ్ ఫిజికల్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫ్లూయిడ్ అండ్ పార్టికల్ మెకానిక్స్, కెమికల్ ఇంజనీరింగ్, థర్మోడైనమిక్స్, ప్రాసెస్ డైనమిక్స్ అండ్ కంట్రోల్, బయో కెమికల్ ఇంజనీరింగ్.
 • నైపుణ్యాలు: రసాయనాలపై ఆసక్తి అవసరం. వివిధ రకాల ఆర్గానిక్, ఇనార్గానిక్ రసాయనాలతో పనిచేయగల నేర్పు ఉండాలి. డిస్టిలేషన్ కాలమ్స్, ఎవాపరేటర్స్, హీట్ ఎక్సే్ఛంజర్స్, రియాక్టర్లు, పంపులు, వాల్వ్లు, ఇంకా ఇతర క్లిష్టమైన ఆపరేషన్లలో పాల్గొనాల్సి ఉంటుంది. పరిశోధన, ఉత్పత్తులను మిళితం చేసి.. ఫలితాలను విశ్లేషణ చేసేందుకు కంప్యూటర్ పరిజ్ఞానం కూడా అవసరం.
 • అవకాశాలు: కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారికి ఫుడ్ ప్రాసెసింగ్, మినరల్ ప్రాసెసింగ్, ఎక్స్ప్లోజివ్స్ మ్యానుఫ్యాక్చరింగ్, ఫెర్టిలైజర్ పరిశ్రమలు, పెయింట్లు, డైలు, ల్యూబ్రికెంట్లు, ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ పరిశ్రమల్లో ఉద్యోగావకాశాలు లభిస్తాయి.

బయోటెక్నాలజీ..
బయోటెక్నాలజీ రంగం శరవేగంగా విస్తరిస్తోంది. సృష్టికి ప్రతి సృష్టి చేయగల క్లోనింగ్ ప్రక్రియ మొదలుకొని.. బయో ఫెర్టిలైజర్స్, బయో పెస్టిసైడ్స్, బయో ఫ్యూయల్స్, బయో ఫార్మాస్యూటికల్స్, వ్యాక్సీన్స్, ఎంజైమ్స్, హెల్త్కేర్ ప్రొడక్ట్స్, బయో కాస్మోటిక్స్, హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్టు, జన్యుచికిత్స, జన్యుపరీక్ష, ఔషధ ఉత్పత్తులు, జన్యుపరివర్తిత పంటలు… ఇవన్నీ బయోటెక్నాలజీ పరిశోధనల ఫలితాలే. మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు, పర్యావరణ వనరుల్ని అన్వేషించి..వాటిని సమాజానికి ఉపయోగపడే ఉత్పత్తులుగా మార్చడమే బయోటెక్నాలజీ ఉద్దేశం.

 • కోర్ సబ్జెక్టులు: కల్చరింగ్/బయలాజికల్ సిస్టమ్స్/కణాలు/వాటి సహ ఉత్పన్నాలను పెద్ద బయోరియాక్టర్లలో బయోప్రాసెస్ టెక్నాలజీని ఉపయోగించి ఉత్పత్తి చేయడాన్ని బయోటెక్నాలజీ కోర్సులో భాగంగా అధ్యయనం చేస్తారు. బయోలాజికల్ సిస్టమ్స్, కల్చరింగ్ మెథడ్స్లో భాగంగా ఉష్ణోగ్రత, ఒత్తిడి(ప్రెజర్), ఆక్సీజన్ కంటెంట్, పీహెచ్, వాల్యూమ్.. తదితరాల నియంత్రణపైనా విద్యార్థులకు అవగాహన కల్గిస్తారు.
 • నైపుణ్యాలు: బయోటెక్నాలజీలో రాణించాలంటే.. మంచి లాజికల్, అనలిటికల్ నైపుణ్యాలు ఉండాలి. డిటైల్డ్ ఓరియెంటెడ్, అబ్జర్వేషన్ స్కిల్స్ తప్పనిసరి. ఎంతటి ఒత్తిడిలోనైనా పనిచేయగలగాలి. బృందంలో పనిచేసే ఓర్పు కావాలి. ప్రతి అంశాన్ని క్షుణ్నంగా పరిశీలించే దృక్పథం, పరిశోధనల పట్ల ఆసక్తి ఉండాలి. సమస్య పరిష్కారంలో ప్రయోగాత్మక విధానాలను అనుసరించాలి. బయోటెక్నాలజీ ల్యాబ్ ప్రక్రియపై అవగాహన అవసరం. ప్రాబ్లమ్ సాల్వింగ్, కంప్యూటర్ స్కిల్స్ కావాలి. టెక్నికల్ రైటింగ్ స్కిల్స్, రికార్డు కీపింగ్ స్కిల్స్ ఉండాలి.
 • కెరీర్ అవకాశాలు: బయోటెక్నాలజీలో ఇంజనీరింగ్ పూర్తిచేసిన అభ్యర్థులు ఫార్మాస్యూటికల్, కెమికల్, వ్యవసాయం–అనుబంధ పరిశ్రమలు, బయో ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, రీసెర్చ్ ల్యాబొరేటరీల్లో పనిచేయొచ్చు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోనూ వీరికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అలాగే మెడిసిన్, వ్యాక్సిన్, నాణ్యమైన విత్తనాలు, పురుగుమందులు, ఫెర్టిలైజర్ ఉత్పాదక పరిశ్రమల్లో కొలువులు దక్కించుకోవచ్చు.

మెటలర్జికల్ ఇంజనీరింగ్..
కార్లు, బైకుల దగ్గరి నుంచి విమానాల వరకు.. వాటికి ఉపయోగపడే లోహ ఉత్పత్తుల డిజైనింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, ఉత్పత్తులను అధ్యయనం చేసే ఇంజనీరింగ్ విభాగం.. మెటలర్జికల్ ఇంజనీరింగ్. భిన్న లోహాలు.. వాటి మిశ్రమాలు, వివిధ రంగాల్లో ఆ లోహాల అనువర్తితాలకు సంబంధించిన విస్తృత పరిజ్ఞానాన్ని ఇది విద్యార్థికి అందిస్తుంది. లోహాలు, వాటి స్వభావాలను అధ్యయనం చేస్తుంది. ముడి ఖనిజాల నుంచి అవసరమైన మూలకాలను సేకరించడంలో మెటలర్జికల్ ఇంజనీర్లు కీలకపాత్ర పోషిస్తారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పరిశ్రమలకు అవసరమైన మెటల్స్ను తయారు చేయడం; లోహాలు, వాటి మిశ్రమాలను పరీక్షించడం వంటి విధులు నిర్వహిస్తారు.

 • కోర్ సబ్జెక్టులు: ఎక్స్ట్రాక్టివ్ మెటలర్జి(ముడి ఖనిజాల నుంచి మూలకాలను సేకరించే ప్రక్రియ ఇది); ఫిజికల్ మెటలర్జి(ప్రాబ్లమ్ స్వాలింగ్ అంశాన్ని చర్చిస్తుంది); మెకానికల్ మెటలర్జి(లోహాలు, వాటి మిశ్రమాలను పరీక్షించే పద్ధతులు/ మెకానిజమ్లను అధ్యయనం చేస్తుంది); వెల్డింగ్ మెటలర్జి (మెటల్ జాయినింగ్ ప్రాసెసింగ్ పద్ధతుల్ని అధ్యయనం చేస్తుంది); కరోజిన్ మెటలర్జి, పాలిమర్స్, సిరామక్స్, కాంపోజిట్, నానో మెటీరియల్స్ వంటివి.
 • నైపుణ్యాలు: మెటలర్జీ రంగంలో ఆధునిక పరిశోధనలు,ఆవిష్కరణలపై అవగాహనను కలిగి ఉండాలి. విశ్లేషణ సామర్థ్యం, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, జియాలజీపై పట్టు ఉండాలి. అత్యాధునిక పరికరాల గురించి తెలుసుకోవాలి. లోహాలు, ఇతర పదార్థాల ఉపయోగాలు, లక్షణాలను నిర్ధారించే విశ్లేషణ సామర్థ్యం, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి.
 • కెరీర్ అవకాశాలు: మెటలర్జి విభాగంలో ఇంజనీరింగ్ పూర్తిచేసిన వారికి ఉపాధి అవకాశాలు పుష్కలం. లోహ సంగ్రహణ పరిశ్రమలు, మిశ్రమధాతు ప్లాంట్లలో ఇంజనీర్లుగా అవకాశాలు లభిస్తాయి.

ఏరోనాటికల్ ఇంజనీరింగ్..
ఏరోనాటికల్ ఇంజనీరింగ్.. విమానాలు, ఇతర స్పేస్ వెహికల్స్ అధ్యయనం, డిజైనింగ్, నిర్మాణం తదితరాలకు సంబంధించిన విభాగమిది.

 • కోర్ సబ్జెక్టులు: ఈ కోర్సులో విమానాల నిర్మాణం, స్పేస్ వెహికల్స్ను కంప్యూటర్ టెక్నాలజీ ఉపయోగించి ఎలా డిజైన్ చేయాలి అనే అంశాలపై శిక్షణ ఇస్తారు. ఇందులో ఏరోడైనమిక్స్, ఏయిర్క్రాఫ్ట్ స్ట్రక్చర్స్, ఏయిర్క్రాఫ్ట్ ప్రొపల్షన్, ఏయిర్క్రాఫ్ట్ సిస్టమ్స్ వంటి స్పెషలైజేషన్స్ ఉన్నాయి.
 • నైపుణ్యాలు: విమానాలపై ఆసక్తి, మ్యాథమెటికల్, అనలిటికల్, సమస్య పరిష్కార నైపుణ్యాలు అవసరం. సృజనాత్మకత, భద్రత అంశాలపై అవగాహన, కమ్యూనికేషన్ స్కిల్స్, సమయపాలన, ఎప్పటికప్పుడు సాంకేతిక పరిజ్ఞానంలో వస్తున్న మార్పులను అవగాహన చేసుకోవడం ముఖ్యం.
 • కెరీర్ అవకాశాలు: ఏరోనాటికల్ ఇంజనీర్స్కు విమానయాన సంస్థల్లో, విమానాల తయారీ విభాగాల్లో, ఎయిర్ టర్బైన్ ప్రొడక్షన్ ప్లాంట్స్, ఏవియేషన్ పరిశ్రమలో డిజైన్ అండ్ డెవలప్మెంట్లో మంచి డిమాండ్ ఉంది.

మైనింగ్ ఇంజనీరింగ్..

 • చురుకైన, ఉత్సాహవంతులు, చొరవచూపే ప్రతిభావంతులైన యువకులకు మైనింగ్ రంగంలో ఉపాధి అవకాశాలు పుష్కలం. అతి పురాతన, అతి పెద్ద పరిశ్రమ అయిన మైనింగ్ రంగంలో.. నిత్యం పరిశోధనలకు పెద్దపీట వేస్తారు. ఆధునిక అవసరాలకు అనుగుణంగా యువతకు మైనింగ్లో శిక్షణ ఇవ్వడం, కొత్త గనుల అన్వేషణ, ఆధునిక టెక్నాలజీ వినియోగం, ఆధునికీకరణ దిశగా మైనింగ్ ఇంజనీరింగ్ విభాగం కృషిచేస్తోంది.
 • కోర్సు అంశాలు: మైన్ ప్లానింగ్, మైన్ ఎన్విరాన్మెంట్, సర్ఫేస్ మేనేజ్మెంట్, సేఫ్టీ మేనేజ్మెంట్, ఆపరేషన్స్ రీసెర్చ్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, మైన్ వెంటిలేషన్, మైనింగ్ మెషినరీ, మైన్ సిస్టమ్స్ అండ్ కంప్యూటర్అప్లికేషన్స్, ఓపెన్ పిట్ మైనింగ్, అండర్గ్రౌండ్ మైనింగ్ మెథడ్స్, కోల్, యూఎంఎం (మెటల్), రాక్ ఎక్స్కవేషన్ ఇంజనీరింగ్, మైనింగ్ జియాలజీ, మైన్ లెజిస్లేషన్ అండ్ సేఫ్టీ, æమైన్ సర్వేయింగ్, మైన్ ఎక్స్కవేషన్ ఇంజనీరింగ్, మైన్ సర్ఫేస్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ వంటివి.
 • అవకాశాలు: మైనింగ్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులు కోర్ మైనింగ్తోపాటు అనుబంధ సంస్థల్లో ఉద్యోగాలు పొందొచ్చు. మైనింగ్ ఇంజనీరింగ్ తర్వాత పరిశోధన రంగంలోనూ అవకాశాలు లభిస్తాయి.

ఆసక్తి, పట్టుదల ప్రధానం!యూజీ స్థాయిలో ఏరోనాటికల్, మైనింగ్ తదితర స్పెషలైజ్డ్ బ్రాంచ్లు ఎంచుకోవాలనుకునే అభ్యర్థులకు ఆయా బ్రాంచ్లపై అమితమైన ఆసక్తి, గట్టి పట్టుదల ఉండాలి. కొన్ని కళాశాలల్లో కొన్ని బ్రాంచ్లకు మంచి పేరుంటుంది. అలాంటి ప్రత్యేక కళాశాలల్లో స్పెషలైజ్డ్ బ్రాంచ్లు చదివితే ప్రయోజనం ఉంటుంది. బీటెక్ స్థాయిలో మెకానికల్ తదితర కోర్ బ్రాంచ్లు చదివితే… పీజీ స్థాయిలో ఎక్కువ సంఖ్యలో ఉన్న స్పెషలైజేషన్ల నుంచి నచ్చిన దాన్ని ఎంపిక చేసుకోవచ్చు. స్పెషలైజ్డ్ బ్రాంచ్ల్లో యూజీ కోర్సులు అభ్యసించిన వారికి పీజీ స్థాయిలో పరిమిత సంఖ్యలో స్పెషలైజే షన్లు ఉంటాయి. ఏ బ్రాంచ్ ఎంచుకున్నా… సంబంధిత సబ్జెక్ట్లలో నైపుణ్యం సాధిస్తే∙మంచి కెరీర్ అవకాశాలు పొందొచ్చు.

ఇంజనీరింగ్‌లో ఏ బ్రాంచ్ మంచిది.. దేనికి ఉద్యోగ అవకాశాలు ఎక్కువ

ఈతరం విద్యార్థులు చదువుతున్న… చదవాలనుకుంటున్న కోర్సు… ఇంజనీరింగ్. ఇంజనీరింగ్‌లో బ్రాంచ్‌లు అనేకం. దీంతో విద్యార్థుల్లో ఏ బ్రాంచ్‌ను ఎంచుకోవాలి.. ప్రస్తుతం అవకాశాల పరంగా ఏ బ్రాంచ్‌కు స్కోప్ ఎక్కువ.. ఎవరికి ఏ బ్రాంచ్ సూట్ అవుతుంది?!
Career guidanceతదితర సందేహాలు విద్యార్థులకు ఎదురవుతుంటాయి. ఈ నేపథ్యంలో.. ఎక్కువ మంది విద్యార్థులు ఆసక్తి చూపుతున్న కోర్ బ్రాంచ్‌లు, వాటి ప్రత్యేకతలు, ఉద్యోగ అవకాశాలు, కెరీర్ స్కోప్ గురించి తెలుసుకుందాం..

ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్..
ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్(ఈసీఈ)లో విద్యుత్ ప్రవాహం, సెమి కండక్టర్లు, కండక్టింగ్ అండ్ నాన్ కండక్టింగ్ మెటీరియల్స్ తదితరాలపై ప్రధానంగా దృష్టిపెడతారు. సమాచారం, ఇంధనం, వ్యవసాయ రంగం సహా ప్రతి విభాగంలో ప్రస్తుతం ఈసీఈ పాత్ర కీలకంగా మారుతోంది. ఉక్కు, పెట్రోలియం, రసాయన పరిశ్రమల్లోనూ, ఆరోగ్య రంగంలోనూ ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం తప్పనిసరి. సురక్షిత రవాణా, ఫ్యాక్టరీలు, గనులు, గృహాల్లో ఎలక్ట్రానిక్ పరికరాల పాత్ర గణనీయం.

 • ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో అనలాగ్ ట్రాన్స్‌మిషన్, డిజిటల్ ట్రాన్స్‌మిషన్, రిసెప్షన్ ఆఫ్ వీడియో, వాయిస్ అండ్ డాటా, బేసిక్ ఎలక్ట్రానిక్స్, సాలిడ్ స్టేట్ డివెసైస్, మైక్రో ప్రాసెసర్స్, డిజిటల్ అండ్ అనలాగ్ కమ్యూనికేషన్, అనలాగ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, శాటిలైట్ కమ్యూనికేషన్, మైక్రోవేవ్ ఇంజనీరింగ్, ఆంటెన్నా అండ్ వేవ్ ప్రొగ్రెషన్ తదితర అంశాలను అధ్యయనం చేస్తారు. దాంతోపాటు ఎలక్ట్రానిక్ పరికరాలు, సర్క్యూట్స్, ప్రసార ఉపకరణాలైన ట్రాన్స్‌మీటర్, రిసీవర్, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, మైక్రోవేవ్స్, ఫైబర్ వంటి వాటి తయారీలో ఈసీఈ కీలకపాత్ర పోషిస్తుంది.
 • నైపుణ్యాలు: ఈసీఈలో రాణించాలనుకునే విద్యార్థికి ఫిజిక్స్, మ్యాథ్స్‌లపై పట్టుతో పాటు ఎలక్ట్రానిక్స్, టెక్నాలజీ పట్ల మక్కువ ఉండాలి. అలాగే శ్రమించేతత్వం, సృజనాత్మకత, నిరంతరం నేర్చుకోవాలనే తపన, టెక్నాలజీ రంగంలో వస్తున్న మార్పుల్ని పసిగట్టి నిత్యనూతనంగా ఉండటం, చక్కటి తార్కిక విశ్లేషణా సామర్థ్యం వంటివి తప్పనిసరి.
 • ఉపాధి వేదికలు: ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లోనూ, వాటి అనుబంధ సంస్థలు, కార్పొరేషన్లలోనూ ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ప్రైవేటు రంగంలోనూ ఉపాధి అవకాశాలు పుష్కలం. అలాగే ఎంటర్‌టైన్‌మెంట్, ఎలక్ట్రానిక్స్, కన్‌స్యూమర్ డ్యురబుల్స్, ట్రాన్స్‌మిషన్ ఇండస్ట్రీ, పరిశోధన సంస్థలు, సిగ్నలింగ్ ఎక్విప్‌మెంట్స్, రాడార్ కంట్రోల్ ఎక్విప్‌మెంట్స్ తదితర విభాగాల్లోనూ అవకాశాలు విస్తృతం. టెలికాం సెక్టార్, సాఫ్ట్‌వేర్ అండ్ హార్డ్‌వేర్, నెట్‌వర్కింగ్ రంగాల్లోనూ పనిచేయవచ్చు.

ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్…
ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్-వాటి అనువర్తనాల గురించి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అధ్యయనం చేస్తుంది. ఇంజనీరింగ్‌లో ఎలక్ట్రికల్‌ను ఆసక్తిదాయక బ్రాంచ్‌గా చెప్పొచ్చు. ప్రస్తుతం ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పరిధి రోజురోజుకీ విస్తృతమవుతోంది. బీటెక్ స్థాయిలో ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌ను కలిపి చదువుతారు. ఇందులో కంప్యూటర్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ట్రాన్స్‌మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీల గురించి అధ్యయనం చేస్తారు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ప్రధానంగా విద్యుత్ పంపిణీ చుట్టూ తిరిగితే.. ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్‌లు, కంప్యూటర్లు, ఇతర మోడ్రన్ టెక్నాలజీల గురించి పేర్కొంటుంది. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్‌ల్లో పట్టున్న అభ్యర్థులు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్‌ను ఎంచుకుంటే మంచి భవిష్యత్ ఉంటుంది.

 • ఉపాధి వేదికలు: పవర్ ప్లాంట్‌లు, రైల్వేలు, విద్యుత్ పంపిణీ బోర్డులు, ఎలక్ట్రికల్ డివెజైస్, ప్రొడక్షన్ కంపెనీలు, మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీలు వంటివి.
 • టాప్ రిక్రూటర్స్:
 • ఓఎన్‌జీసీ
 • పీజీసీఐఎల్
 • కోల్ ఇండియా లిమిటెడ్
 • బెల్
 • సెయిల్
 • సీమెన్స్ లిమిటెడ్
 • బజాజ్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్
 • కాంప్టన్ గ్రీవ్స్ లిమిటెడ్
 • రిలయన్స్ పవర్ లిమిటెడ్ తదితరాలు.

కెమికల్ ఇంజనీరింగ్…

 • ప్రస్తుతం డిమాండ్ ఉన్న బ్రాంచుల్లో కెమికల్ ఇంజనీరింగ్ ఒకటి. ప్రపంచవ్యాప్తంగా కెమికల్ ఇంజనీర్లకు అవకాశాలు లభిస్తున్నాయి. కెమికల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఇండస్ట్రియల్ ఇంజనీర్స్, అప్లికేషన్స్ ఇంజనీర్, పేటెంట్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్లాస్టిక్, మైనింగ్, మెటీరియల్ సైన్స్, నానోటెక్నాలజీ తదితర విభాగాలు, పరిశ్రమల్లో ఉద్యోగాలు లభిస్తాయి.
 • టాప్ రిక్రూటర్స్:
 • ఎల్ అండ్ టీ
 • హిందుస్థాన్ యూనిలీవర్
 • డా.రెడ్డీస్ ల్యాబ్స్
 • క్యాడ్బెరీ ఇండియా
 • రిలయన్స్ ఇండస్ట్రీస్ తదితర కంపెనీల్లో కొలువులు దక్కించుకోవచ్చు.

కంప్యూటర్ సైన్స్..

 • ప్రస్తుతం మన జీవితాల్లో కంప్యూటర్ విడదీయలేని భాగమైంది. అదెంతలా అంటే కంప్యూటర్ లేకుండా ఒక్క క్షణం గడపలేని పరిస్థితి. ఏ రంగంలో చూసినా.. కంప్యూటర్ ఇంజనీర్ల సేవలు తప్పనిసరిగా మారుతున్నాయి. అందుకే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్(సీఎస్‌ఈ) పూర్తి చేసిన అభ్యర్థులకు భవిష్యత్ పరంగా ఎలాంటి ఢోకా ఉండదని నిపుణులు పేర్కొంటున్నారు. నెట్‌వర్క్ నిర్వహణ, సాఫ్ట్‌వేర్ రూపకల్పన, కోడింగ్ వంటి నైపుణ్యాలు కలిగిన అభ్యర్థులకు ఐదంకెల జీతాలతో కార్పొరేట్ రంగం స్వాగతం పలుకుతోంది.
 • ఇంటర్ పూర్తయిన వారిలో అధిక శాతం మంది సీఎస్‌ఈలో చేరి ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థల్లో స్థిరపడాలని కలలు కంటున్నారు. సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ సమాచార వ్యవస్థల రూపకల్పన, అనువర్తనం, నిర్వహణ తదితరాల సమాహారాన్ని కంప్యూటర్ సైన్స్‌గా పేర్కొనొచ్చు. అనలిటికల్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ నైపుణ్యాలు, క్రియేటివిటీ, క్రిటికల్ థికింగ్ తదితర నైపుణ్యాలున్న అభ్యర్థులకు సీఎస్‌ఈ బ్రాంచ్ చక్కగా సరితూగుతుంది. కంప్యూటర్ ఇంజనీరింగ్‌పై ఆసక్తి ఉన్న విద్యార్థులు మ్యాథ్స్ నైపుణ్యాలను పెంచుకోవడంతోపాటు కోడింగ్, ఆపరేటింగ్ సిస్టమ్స్, డేటాబేస్ మేనేజ్‌మెంట్ వంటి వాటిపై అవగాహన పెంచుకోవడం మేలు.
 • జాబ్ ప్రొఫైల్స్: సీఎస్‌ఈ అభ్యర్థులకు కంప్యూటర్ ప్రోగ్రామర్, సిస్టమ్ డిజైనర్, సాఫ్ట్‌వేర్ డెవలపర్, ఇంజనీరింగ్ సపోర్ట్ స్పెషలిస్ట్, ఇ-కామర్స్ స్పెషలిస్ట్, డేటా వేర్‌హౌజ్ అనలిస్ట్, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తదితర కొలువులు లభిస్తాయి.
 • రిక్రూటర్స్:
 • టీసీఎస్
 • ఇన్ఫోసిస్
 • విప్రో
 • హెచ్‌సీఎల్
 • యాక్సెంచర్
 • కాగ్నిజెంట్
 • మైక్రోసాఫ్ట్
 • ఐబీఎం
 • అడోబ్
 • గూగుల్
 • సిస్కో
 • ఒరాకిల్
 • సన్ మైక్రోసిస్టమ్స్
 • యాహూ
 • టెక్‌మహీంద్రా.

మెకానికల్ ఇంజనీరింగ్..
మెకానికల్‌ను ‘మదర్ ఆఫ్ ఆల్ బ్రాంచెస్’ అని పిలుస్తారు. ఇది ఇంజనీరింగ్ బ్రాంచుల్లోకెల్లా అత్యంత ప్రాచీనమైనది. ప్రస్తుతం అవకాశాలు, భవిష్యత్ కెరీర్ పరంగా మెకానికల్ మెరుగైన స్థానంలోనే ఉంది. మెకానికల్ ఇంజనీరింగ్.. డిజైన్, మాన్యుఫ్యాక్చరింగ్, టెస్టింగ్, మెకానికల్ సిస్టమ్స్ డెవలప్‌మెంట్ తదితరాల చుట్టూ తిరుగుతుంది. దీన్ని పూర్తి చేసిన వారికి కన్‌స్ట్రక్షన్, ఆటోమోటివ్, రోబోటిక్స్, ఎనర్జీ సెక్టార్ తదితర రంగాల్లో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆటోమొబైల్, ఆటోమేషన్, రోబోటిక్స్, తయారీ రంగాల విస్తరణతో నైపుణ్యాలున్న మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు అవకాశాలకు కొదవలేదని చెప్పొచ్చు.

 • ఉపాధి వేదికలు: థర్మల్ పవర్, ఆటోమొబైల్, ఆయిల్, గ్యాస్ ఎక్స్‌ప్లొరేషన్ అండ్ రిఫైనింగ్, గ్యాస్ టర్బైన్, ఎయిర్ కండీషన్ అండ్ రిఫ్రిజిరేషన్, ఏరోస్పేస్, అగ్రికల్చర్, ఆర్మ్‌డ్ ఫోర్సెస్, షిప్పింగ్, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలు ప్రధాన ఉపాధి వేదికలు.
 • పీఎస్‌యూలు: ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్‌యూ) మెకానికల్ ఇంజనీర్లకు ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. అవి…
 • ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్
 • సీమెన్స్
 • ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్
 • భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్
 • బీహెచ్‌ఈఎల్
 • ఎన్‌టీపీసీఎల్ తదితరం.

మైనింగ్ ఇంజనీరింగ్…

 • మైనింగ్ ఇంజనీరింగ్‌లో విద్యార్థులు ప్రధానంగా భూమి నుంచి ఖనిజాలను వెలికితీసే పద్ధతుల గురించి అధ్యయనం చేస్తారు. భారతదేశంలో సహజ వనరులు పుష్కలం. దీంతో దేశీయంగా మైనింగ్ ఇంజనీరింగ్ అవసరం పెరిగింది. ప్రస్తుత దేశ జీడీపీలో మైనింగ్ రంగం గణనీయ వాటా కలిగుండటమే దీనికి నిదర్శనం. కాబట్టి రాబోయే సంవత్సరాల్లో నైపుణ్యవంతులైన మైనింగ్ ఇంజనీర్లకు చక్కటి అవకాశాలు లభిస్తాయనడంలో సందేహం లేదు. సైన్స్, మ్యాథ్స్ నైపుణ్యాలున్న అభ్యర్థులు మైనింగ్ స్పెషలైజేషన్‌ను ఎంచుకోవచ్చు.
 • టాప్ రిక్రూటర్స్:
 • ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్
 • జియోగ్రాఫికల్ సర్వే ఆఫ్ ఇండియా
 • కోల్ ఇండియా లిమిటెడ్
 • నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్
 • నాల్కో
 • హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్
 • యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
 • దామోదర్ వ్యాలీ కార్పొరేషన్
 • హిందుస్థాన్ జింక్ లిమిటెడ్.

సివిల్ ఇంజనీరింగ్..

 • కోర్ బ్రాంచుల్లో సివిల్ ఇంజనీరింగ్ ప్రముఖమైంది. ఇది రోడ్లు, వంతెనలు, కాలువలు, ఆనకట్టలు, విమానాశ్రయాలు, మురుగునీటి వ్యవస్థలు, పైప్‌లైన్లు, కన్‌స్ట్రక్షన్ విభాగాల్లో డిజైన్, నిర్మాణ కార్యకలాపాల గురించి అధ్యయనం చేస్తుంది. సివిల్ ఇంజనీర్ గ్రాడ్యుయేట్లకు బిల్డింగ్ కంట్రోల్ సర్వేయర్, సీఏడీ టెక్నీషియన్, కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్, డిజైన్ ఇంజనీర్, సైట్ ఇంజనీర్, స్ట్రక్చరల్ ఇంజనీర్ కొలువులు లభిస్తాయి. ప్రైవేట్‌తోపాటు ప్రభుత్వ విభాగాల్లోనూ సివిల్ ఇంజనీర్లకు ఉద్యోగాలు దక్కుతాయి.
 • టాప్ రిక్రూటర్స్:
 • హిందూస్తాన్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ
 • పెస్టీజ్ ఎస్టేట్స్
 • ఒబెరాయ్ రియాలిటీ
 • డీఎల్‌ఎఫ్
 • ఎల్ అండ్ టీ
 • హీరానందాని కన్‌స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్
 • గోద్రేజ్ ప్రాపర్టీస్ తదితర సంస్థల్లో ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు.

ఇంజనీరింగ్

వినూత్న కోర్సులు, విభిన్న ఉద్యోగావకాశాలకు వేదిక ఇంజనీరింగ్. అందుకే ఇంటర్మీడియెట్ పూర్తిచేసిన విద్యార్థుల హాట్ టాపిక్.. ఇంజనీరింగ్! దాంతోపాటు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు దేశ విదేశాల్లో లభిస్తున్న ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలు.. విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఆకర్షిస్తున్నాయ్. దేశవ్యాప్తంగా సుమారు మూడువేల ఐదు వందల ఇంజనీరింగ్ కాలేజీల్లో పదిహేను లక్షల వరకు సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఐఐటీల వాటా మాత్రం పదివేలే. 
కాలేజీ ఎంపికలో…మౌలిక సదుపాయాలు:
ఒక ఇన్‌స్టిట్యూషన్ లేదా కళాశాల విజయంలో మౌలిక సదుపాయాల పాత్ర కీలకం. క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, ఎక్విప్‌మెంట్, లైబ్రరీ, హాస్ట ల్, సెమినార్ రూమ్స్, ఇంటర్నెట్, ట్రాన్స్‌పోర్ట్, ప్లే గ్రౌండ్ మొదలైనవి చాలా అవసరం.

ఫ్యాకల్టీ:ఇంజనీరింగ్ కాలేజీకి మౌలిక సదుపాయాలు అస్థిపంజరమైతే… ఫ్యాకల్టీ శరీరం అని చెప్పొచ్చు. విద్యార్థిని సరైన దిశలో నడిపించడంలో ఫ్యాకల్టీది ప్రధాన బాధ్యత. ఫ్యాకల్టీ బృందం సీనియర్, జూనియర్ల సమ్మిళితంగా ఉంటే బోధన ప్రభావవంతంగా ఉంటుంది. ఎంత మంది పీహెచ్‌డీ చేశారు? ప్రస్తుతం పీహెచ్ డీ చేస్తున్న వారెందరు? ఏయే ఇన్‌స్టిట్యూట్‌ల నుంచి పీహెచ్‌డీ పూర్తి చేశారు? అనుభవం? తదితర వివరాలను తెలుసుకోవాలి.

ప్రారంభించిన సంవత్సరం:రెండు-మూడేళ్ల క్రితం కొత్తగా స్థాపించిన ఇన్‌స్టిట్యూషన్స్‌తో పోల్చితే కొన్నేళ్ల క్రితం ప్రారంభించిన కాలేజీలు సౌకర్యాల పరంగా మెరుగ్గా ఉంటాయి. అనుభవ జ్ఞులైన అధ్యాపకులు కూడా పాత కాలేజీల్లో లెక్చర్స్ ఇవ్వడానికి ప్రాధాన్యతనివ్వడంతోపాటు లైబ్రరీ, ల్యాబ్ వంటి సపోర్టింగ్ సిస్టమ్స్ ప్రభావవంతంగా ఉంటాయి. అంతేకాకుండా కనీసం రెండు పాస్ అవుట్ బ్యాచ్‌లు ఉంటేనే టాప్ ఎంఎన్‌సీలు క్యాంపస్ ప్లేస్‌మెంట్ నిర్వహిస్తాయి.

అక్రెడిటేషన్:అక్రెడిటేషన్‌ను బట్టి ఆ ఇన్‌స్టిట్యూషన్ స్థాయిని చెప్పొచ్చు. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఏఐసీటీఈ), నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రెడిటేషన్(ఎన్‌బీఏ), నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్(నాక్).. మొదలైన ఏజెన్సీలు విద్యారంగంలో నాణ్యతా ప్రమాణాలను నిర్దేశిస్తున్నాయి. ఈ ఏజెన్సీలు నిర్దేశించిన ప్రమాణాల మేరకు సౌకర్యాలు ఉంటే అక్రెడిటేషన్ స్టేటస్‌ను ఇస్తాయి.

ప్లేస్‌మెంట్ అండ్ ట్రైనింగ్ సెల్:ప్రస్తుత జాబ్ మార్కెట్ అవసరాలకనుగుణంగా వివిధ రకాల స్కిల్స్‌లో ప్రత్యేక శిక్షణతోపాటు ప్లేస్‌మెంట్ సెల్ ఉన్న కాలేజీలను ఎంపిక చేసుకోవాలి. ఇందుకోసం మూడేళ్ల కాలంలో ఆ ఇన్‌స్టిట్యూట్‌లో ఎంతమంది క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో ఎంపిక అయ్యారు అనే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. జేకేసీలు ఉన్నాయో లేవో కూడా పరిశీలించాలి.

పనితీరు:గత కొంతకాలంగా కాలేజీ సాధించిన ఫలితాలు, ఎంత మంది విద్యార్థులు యూనివర్సిటీ స్థాయిలో గోల్డ్‌మెడల్స్ పొందారు, క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ శాతం, ఇండస్ట్రీ లింకేజ్ ప్రాజెక్ట్స్ వంటి అంశాలాధారంగా కాలేజీ పనితీరును విశ్లేషించుకోవాలి.

కో-కరిక్యులర్ – ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్:కాలేజీలు విద్యార్థి సమగ్రాభివృద్ధి కోసం దోహదపడేలా క్విజ్, ఎస్సే రైటింగ్, ప్రెజంటేషన్ ఆఫ్ పేపర్స్ వంటి కో-కరిక్యులర్ యాక్టివిటీస్‌తోపాటు గేమ్స్, కల్చరల్ ప్రోగ్రామ్‌లు, ఎన్‌ఎస్‌ఎస్ తరహా ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌కు కూడా ప్రాధాన్యం ఇవ్వాలి. ఇటువంటి యాక్టివిటీస్ వల్ల విద్యార్థుల్లో ఒక రకమైన ఆత్మవిశ్వాసంతోపాటు ప్రెజంటేషన్ స్కిల్స్, ఆర్గనైజ్డ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, సోషలైజేషన్ స్కిల్స్ వంటి ప్రస్తుత జాబ్ మార్కెట్‌కు అవసరమైన స్కిల్స్ మెరుగవుతాయి.

రీసెర్చ్-హయ్యర్ ఎడ్యుకేషన్:విద్యార్థులను పరిశోధనల పట్ల ప్రోత్సహిస్తున్న ఇన్‌స్టిట్యూషన్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. అంతేకాకుండా గేట్, క్యాట్, ఐఈఎస్ వంటి పరీక్షల్లో ఆ కాలేజీ విద్యార్థుల ప్రతిభను కూడా పరిగణించాలి. దీన్నిబట్టి ఆ కాలేజ్ విద్యార్థుల భవిష్యత్‌కు ఉపయోగపడే విధంగా ఎలాంటి ఇన్‌పుట్స్ ఆ కాలేజ్ ఇచ్చిందో అవగాన చేసుకోవచ్చు.

ఇతర సంస్థలతో అవగాహన:పరిశ్రమ అవసరాలకు తగ్గట్టుగా విద్యార్థులను తీర్చిదిద్దడానికి..సదరు పరిశ్రమలతో కలిసి ఆ ఇన్‌స్టిట్యూషన్ పని చేయాలి. తద్వారా విద్యార్థికి కావల్సిన ఇండస్ట్రీ ఎక్స్‌పోజర్ లభించడంతోపాటు.. పరిశ్రమ కోరుకునే పరిపూర్ణ ఇంజనీర్‌గా రూపొందుతాడు. అంతేకాకుండా జేకేసీ, వివిధ ఆర్ అండ్ డీ సంస్థలతో ఉన్న అవగాహన కూడా విద్యార్థి కెరీర్‌కు ఇతోధికంగా తోడ్పడుతుంది.

ప్రవేశమిలా…ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరేందుకు కనీస అర్హత… మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలు సబ్జెక్ట్స్‌గా ఇంటర్మీడియెట్ లేదా త త్సమాన సబ్జెక్టు ఉత్తీర్ణత. ఇప్పటి వరకు రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి ఎంసెట్, ఐఐటీల్లో ప్రవేశానికి ఐఐటీ-జేఈఈ, ఎన్‌ఐటీల్లో ప్రవేశానికి ఏఐట్రిపుల్‌ఈ, బిర్లా సంస్థల్లో ప్రవేశానికి బిట్‌శాట్, ఇవే కాకుండా డీమ్డ్ యూనివర్సిటీల్లో ప్రవేశానికి ఆయా యూనివర్సిటీలు/సంస్థలు నిర్వహించే పరీక్షల ద్వారా ప్రవేశం లభించేది. కానీ 2013 నుంచి దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్‌లో ప్రవేశానికి ఒకే ఉమ్మడి పరీక్ష నిర్వహించాలని భావించారు. దీంతో రకరకాల పరీక్షల స్థానంలో ఒకే పరీక్ష రాస్తే సరిపోతుంది.

ప్రముఖ సంస్థల్లో సీట్ల వివరాలు సుమారుగా…

ఇన్‌స్టిట్యూట్ సీట్లు
ఐఐటీలు 10000
ఐఐఎస్‌ఈఆర్ 386
ఎన్‌ఐటీలు 13,248
ట్రిపుల్‌ఐటీలు 698
బిట్స్ 1970
వీఐటీ 2043
ఎస్‌ఆర్‌ఎం 4965


పాపులర్ బ్రాంచ్‌లు:

 • కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్
 • ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్
 • ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్
 • మెకానికల్ ఇంజనీరింగ్
 • సివిల్ ఇంజనీరింగ్
 • ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
 • బయోటెక్నాలజీ
 • ఏరోనాటికల్ ఇంజనీరింగ్
 • కెమికల్ ఇంజనీరింగ్

అప్‌కమింగ్ బ్రాంచ్‌లు:

 • అగ్రికల్చర్ ఇంజనీరింగ్
 • బయోమెడికల్ ఇంజనీరింగ్
 • లెదర్ టెక్నాలజీ
 • టెక్స్‌టైల్ టెక్నాలజీ
 • మెరైన్ ఇంజనీరింగ్
 • ప్యాకేజింగ్ అండ్ ప్రింటింగ్ టెక్నాలజీ
 • మెకట్రానిక్స్
 • ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్స్
 • ఆటోమొబైల్ ఇంజనీరింగ్
 • బయోకెమికల్ ఇంజనీరింగ్
 • ఆయిల్ అండ్ పెట్రోలియం ఇంజనీరింగ్
 • డెయిరీ టెక్నాలజీ
 • మైనింగ్ ఇంజనీరింగ్
 • ఎలక్ట్రానిక్స్ అండ్ టెలిమాటిక్స్(ఈటీఎం)
 • ప్రొడక్షన్/ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్
 • ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్
 • ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్
 • మెటలర్జికల్ ఇంజనీరింగ్ – కెమికల్ పెట్రో ఇంజనీరింగ్

బ్రాంచ్ ఎంపికలో…ఆసక్తి:బ్రాంచ్ ఎంపికలో విద్యార్థి ఆసక్తే ప్రధానమనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎటువంటి అవగాహన లేకుంటే.. బ్రాంచ్ ఎంపికలో కొంత కసరత్తు తప్పదు. ప్రస్తుతం డిమాండ్ ఉన్న బ్రాంచ్‌లు..అవకాశాలు, భవిష్యత్ కెరీర్, దీనికి సంబంధించి వివిధ సంస్థలు ఇచ్చే నివేదికలు తదితర అంశాలతో అవగాహనకు రావొచ్చు.

ఆప్టిట్యూడ్:స్కిల్స్, అప్టిట్యూడ్ మదింపు చేసుకుని తదనుగుణంగా ఉన్న బ్రాంచ్‌ను ఎంపిక చేసుకోవాలి. మ్యాథ్స్,ఫిజిక్స్‌పై మంచి పట్టు ఉంటే..ఈసీఈ, ఈఈఈ, మెకానికల్ వంటి బ్రాంచ్‌లను ఎంచుకోవచ్చు. మ్యాథ్స్, లాజికల్ విషయాల్లో ఆసక్తి ఉంటే సీఎస్‌ఈ, ఐటీ బ్రాంచ్‌ల్లో చేరొచ్చు.

బలం-బలహీనత:కొన్ని బ్రాంచ్‌లకు ఎక్కువ సమయం కేటాయిస్తూ బాగా హార్డ్ వర్క్ చేయాలి. కొన్ని బ్రాంచ్‌లకు అంతగా అవసరం ఉండదు. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ వంటి కోర్ బ్రాంచ్‌లకు సమయస్ఫూర్తితో వ్యవహరించే చతురతతోపాటు అనలిటికల్ స్కిల్స్ అవసరం. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి.

జాబ్ పొటెన్షియల్:బ్రాంచ్‌ను ఎంపిక చేసుకునేటప్పుడు..కోర్సు పూర్తయ్యాక నాలుగేళ్ల తర్వాత ఎటువంటి ఉద్యోగావకాశాలు ఉంటాయనే అంశం మీద ఒక అవగాహనకు రావాలి. ఈ విషయంలో కచ్చితమైన విశ్లేషణకు రావడం కొంత కష్టతరమైన విషయమైనప్పటికీ.. సీనియర్లు, ఇంటర్నెట్, ఫ్యాకల్టీ, తల్లిదండ్రులు, నిపుణుల సలహాలను తీసుకోవాలి.

హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్:ఎంచుకున్న బ్రాంచ్‌లో ఉండే హయ్యర్ ఎడ్యుకేషన్ అవకాశాల గురించి విశ్లేషించుకుని సరైన బ్రాంచ్‌ను ఎంచుకోవాలి.

ఆఫ్టర్ బీటెక్…బీటెక్ తర్వాత ఉన్నత విద్యను అభ్యసించాలనుకుంటే… గేట్ రాసి, ఎంటెక్‌లో చేరొచ్చు. జీ-మ్యాట్, జీఆర్‌ఈ వంటి పరీక్షల్లో ఉత్తీర్ణత ద్వారా మేనేజ్‌మెంట్ కోర్సుల్లో, విదేశీ వర్సిటీల్లో ఉన్నత విద్య అభ్యసించొచ్చు. లేదంటే… చదివిన బ్రాంచ్‌ను బట్టి ఆయా రంగాల్లో అవకాశాల కోసం ప్రయత్నించొచ్చు. బీఎస్‌ఎన్‌ఎల్, బీహెచ్‌ఈఎల్, ఇస్రో వంటి సంస్థలు… నవరత్న కంపెనీలు ఏటా క్రమం తప్పకుండా ఫ్రెషర్స్‌ను ట్రైనీలుగా నియమించుకుంటున్నాయి.

గేట్-గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్:బీటెక్ పూర్తయ్యాక ఎంటెక్/ఎంఈలో చేరాలంటే గేట్ రాయాలి. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు(ఐఐటీలు), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ)-బెంగళూరు వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో విద్యనభ్యసించాలంటే.. ఏకైక మార్గం గేట్. ఇవికాకుండా గేట్ స్కోర్ ఆధారంగా ఎన్‌ఐటీలు, ఇతర ఇంజనీరింగ్ కాలేజీలు కూడా ఎంఈ/ఎంటెక్ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తున్నాయి.

విదేశాల్లో ఇంజనీరింగ్‌లో పీజీ చేయాలంటే.. టోఫెల్/జీఆర్‌ఈ/ఐఈఎల్‌ఈటీఎస్ వంటి పరీక్షల ద్వారా ఎంఎస్ కోర్సులో చేరొచ్చు. చాలా విదేశీ యూనివర్సిటీలు తక్కువ మొత్తానికే విద్యనందించడంతో పాటు స్కాలర్‌షిప్స్/ఫెలోషిప్స్ అందిస్తున్నాయి. బ్యాంకులు కూడా రుణాలు మంజూరు చేస్తున్నాయి.

మేనేజ్‌మెంట్ కోర్సుల్లో చేరదలిస్తే:మేనేజ్‌మెంట్ కోర్సులపై ఆసక్తి ఉంటే.. వివిధ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌ల్లో ప్రవేశానికి నిర్వహించే కామన్ అడ్మిషన్ టెస్ట్(క్యాట్) రాయొచ్చు. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ఐఐఎంలతోపాటు ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఎంబీఏ చదవొచ్చు. జేవియర్ లేబర్ రిలేషన్స్ ఇన్‌స్టిట్యూట్ నిర్వహించే ఎక్స్‌ఏటీ పరీక్షలో విజయం సాధించి వివిధ విద్యాసంస్థల్లో ఎంబీఏ చేయొచ్చు లేదా అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ మేనేజ్‌మెంట్ స్కూల్స్ నిర్వహించే ‘ఎయిమ్స్ టెస్ట్ ఫర్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్స్(ఏటీఎంఏ)’ పరీక్ష రాసి దేశవ్యాప్తంగా ఉన్న వివిధ బిజినెస్ స్కూళ్లలో ప్రవేశం పొందొచ్చు. ఇంకా సింబయాసిస్ నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (స్నాప్) రాసి దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న సింబయాసిస్ క్యాంపస్‌ల్లో ఎంబీఏ చేయొచ్చు. విదేశాల్లో మేనేజ్‌మెంట్ కోర్సులు అభ్యసించాలంటే జీమ్యాట్ రాయాలి. ఇందులో వచ్చిన స్కోరు ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రతిష్టాత్మక యూనివర్సిటీలు/విద్యాసంస్థల్లో ఎంబీఏ చేయొచ్చు. హైదరాబాద్‌లో ఇండియన్ బిజినెస్ స్కూల్ కూడా జీమ్యాట్ స్కోర్ ఆధారంగా ప్రవేశం కల్పిస్తోంది.

ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్:కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఇండియన్ రైల్వేస్, సెంట్రల్ వాటర్ వర్క్స్, సెంట్రల్ ఇంజనీరింగ్, మిలిటరీ ఇంజనీరింగ్, బోర్డర్ రోడ్స్ ఇంజనీరింగ్, ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్, జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా… తదితర విభాగాల్లో ఇంజనీర్ ఉద్యోగ నియామకాలకు ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ పరీక్షను యూపీఎస్సీ నిర్వహిస్తుంది. ఇంజనీరింగ్‌లో ఈఈఈ, ఈసీసీ, సివిల్, మెకానికల్ బ్రాంచ్ ఉత్తీర్ణులు ఈ పరీక్షకు అర్హులు. చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

సివిల్ సర్వీసెస్:జాతీయ స్థాయిలో అత్యున్నత పరీక్ష సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్. దీని ద్వారా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్, ఇతర కేంద్ర సర్వీసులకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఏటా డిసెంబర్ చివర్లో ప్రకటన విడుదలయ్యే ఈ పరీక్షకు బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు. ఇటీవల గత కొన్నేళ్లుగా సివిల్స్ విజేతల్లో 20 నుంచి 30 శాతం మంది ఇంజనీరింగ్ నేపథ్యం ఉన్న అభ్యర్థులుంటున్నారనేది గమనించాల్సిన విషయం. మొత్తం మూడు దశల్లో (ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ) ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

బ్యాంక్ పరీక్షలు:బీటెక్ అభ్యర్థులకు బ్యాంక్ పరీక్షలు కూడా ఓ ప్రధాన అవకాశంగా పేర్కొనచ్చు. కొన్ని బ్యాంకులు స్పెషలిస్ట్ ఆఫీసర్ పేరిట ఐటీ, కంప్యూటర్స్, అగ్రికల్చరల్, సివిల్ ఇంజనీరింగ్ విభాగాల్లో బీటెక్ ఉత్తీర్ణులను ప్రత్యేకంగా నియమిస్తున్నాయి.

రాష్ట్ర స్థాయిలో ఏపీపీఎస్సీ ద్వారా:ఏపీపీఎస్సీ నిర్వహించే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పరీక్ష ద్వారా నీటి పారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖ, రోడ్లు భవనాల శాఖ, ప్రజారోగ్య శాఖ, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌ల్లో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, అగ్రికల్చరల్, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీర్లను నియమిస్తారు. ఆయా బ్రాంచ్‌ల్లో బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. వీటితోపాటు మెట్రో వాటర్‌వర్క్స్ ఇంజనీరింగ్ పరీక్షలకు కూడా పోటీ పడొచ్చు. గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షకు కూడా హాజరు కావొచ్చు.