ప్రవేశ పరీక్షలు

ఇంజినీరింగ్ సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్ పూర్తిచేసిన వారిలో ఎక్కువ శాతం మక్కువ చూపేది ఇంజినీరింగ్ పైనే. అందుకే ఏటా ఇంజినీరింగ్‌కు రహదారి అయిన ఎంసెట్‌కు లక్షల్లో పోటీ పడుతుంటారు. సీట్లు పెరుగుతున్నా పోటీ మాత్రం తగ్గడంలేదు. ఉన్నతమైన భవిష్యత్తుకు స్థిరమైన బాటను వేస్తున్న ఇంజినీరింగ్ అంటే తల్లిదండ్రుల్లోనూ ఆసక్తి ఎక్కువే. ఇంజినీరింగ్ చేయడానికి జాతీయ, రాష్ట్రస్థాయుల్లో అనేక అవకాశాలు ఉన్నాయి.
పొరుగు రాష్ట్రాల్లో చదవాలంటే…
తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో చేరేందుకు ఆయా ప్రభుత్వాలు ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నాయి. వీటిలో ర్యాంక్ ఆధారంగా ముందు స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యం ఇచ్చి తరువాత మిగతా రాష్ట్రాల వారికి సీట్లు కేటాయిస్తారు.
జాతీయస్థాయి పరీక్షలు
జాతీయ స్థాయిలో ఐ.ఐ.టి., ఎన్.ఐ.టి., ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్, బిట్స్ లాంటి సంస్థలు అత్యున్నత సాంకేతిక పరికరాలతో, ఉత్తమ నాణ్యతా ప్రమాణాలతో ఇంజినీరింగ్, మెడికల్, ఇతర డిగ్రీ, పీజీ కోర్సులను అందిస్తున్నాయి.
అఖిల భారత స్థాయిలో జరిగే ప్రవేశ పరీక్షల ద్వారా వీటిలో సీటు లభిస్తుంది.
జాతీయ స్థాయి పరీక్షలకు… సహజంగా డిసెంబరు- జనవరిలో ప్రకటనలు వస్తాయి. పరీక్షలు ఏప్రిల్, మే జూన్‌లో జరుగుతాయి.

రాష్ట్రస్థాయి పరీక్షలకు ప్రకటనలు జనవరి – ఫిబ్రవరి మధ్య వస్తాయి. పరీక్షలు మే, జూన్‌లలో ఉంటాయి. అడ్మిషన్లు జూన్, జులైల్లో మొదలవుతాయి.
ఎంసెట్
ఇంజినీరింగ్ కాలేజీల్లో చేరాలంటే ప్రవేశ పరీక్షలు రాయాల్సిందే. మంచి ర్యాంక్ తెచ్చుకుంటే కోరుకున్న కాలేజీలో సీటు వస్తుంది. రాష్ట్రంలో… కొన్ని డీమ్డ్ యూనివర్సిటీల్లో తప్ప ఇంజినీరింగ్ డిగ్రీ చేయాలంటే ఏకైక మార్గం – ఎంసెట్.
ఇంజినీరింగ్, అగ్రికల్చరల్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ – ఎంసెట్ పూర్తి రూపం. జె.ఎన్.టి.యు. ఎంసెట్‌ను నిర్వహిస్తుంది. ఈ పరీక్ష ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని ఇంజినీరింగ్, వ్యవసాయ, వైద్య కళాశాలల్లో చేరవచ్చు.
కోర్సులు:
1. బి.ఇ./ బి.టెక్.
2. బి.వి.ఎస్‌సి. అండ్ ఎ.హెచ్./ బి.ఎస్‌సి.(అగ్రి)/ బి.ఎస్‌సి.(హార్టికల్చర్)/ బి.ఎఫ్.ఎస్‌సి./ బి.టెక్. (ఎఫ్ఎస్.అండ్ టి)/ బి.ఎస్‌సి. (సి.ఎ.అండ్ బి.ఎం.)
3. ఎం.బి.బి.ఎస్/ బి.డి.ఎస్./ బి.ఎ.ఎం.ఎస్./ బి.హెచ్.ఎం.ఎస్/ బి.ఎన్.వై.ఎస్.
4. బి.ఫార్మా/ బి.టెక్(బయోటెక్నాలజీ), ఫార్మా-డి (డాక్టర్ ఆఫ్ ఫార్మసీ).
అర్హతలు
ఇంజినీరింగ్ కోర్సుల్లో చేరడానికి ఇంటర్‌లో కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్ చదివి ఉండాలి. ఇతర కోర్సుల్లో చేరేందుకు బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులు చదివి ఉండాలి. పూర్తి వివరాలకు వెబ్‌సైట్… http://www.apeamcet.org/
ఎంసెట్ రాయకపోయినా
ఎంసెట్ రాయకపోయినా, సీటు సాధించలేకపోయినా ఇంజినీరింగ్ కలగానే మిగలాల్సిన పనిలేదు. నిజం చేసుకోవచ్చు. మరెన్నో మార్గాలు ఈ కోర్సు చేయడానికి ఉన్నాయి. అనుకోని కారణాల వల్ల ఎంతోమంది ఇంజినీరింగ్ చదవలేకపోతున్నారు. అంతమాత్రాన ఆ లక్ష్యం అక్కడితో ఆగిపోవాల్సిన అవసరంలేదు. ఇంజినీరింగ్‌తో సమానమైన డిగ్రీని అందించే సంస్థలు ఇంకా అనేకం ఉన్నాయి. వీటిలో ఇంజినీరింగ్ డిగ్రీ చదివిన విద్యార్థులకు రెగ్యులర్ ఇంజినీరింగ్ డిగ్రీతో సమానమైన గుర్తింపు ఉంది.
వీరు అన్ని రకాల పరీక్షలకు, ఉద్యోగాలకు దరఖాస్తు చేయవచ్చు.
దేశంలో ప్రస్తుతం అనేక‌ సంస్థలు రెగ్యులర్ ఇంజినీరింగ్ కోర్సులతో సమానమైన ప్రత్యామ్నాయ కోర్సులను నిర్వహిసున్నాయి. ఇవి బి.ఇ./ బి.టెక్, డిప్లొమా సర్టిఫికెట్‌లను ప్రదానం చేస్తున్నాయి. మెకానికిల్ రంగంలో భారతదేశం సాంకేతికంగా అభివృద్ధి చెందడానికి కావాల్సిన నిపుణులను తీర్చిదిద్దడానికి 1914లో భారత్‌లో మొట్టమొదట ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ మెకానికల్ ఇంజినీర్స్ (ఇండియా – ఐ.ఎం.ఇ.ఐ.) ఏర్పడింది. తరువాత 1920లో ఆవిర్భవించిన ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ (ఇండియా) వృత్తి నిపుణులను అందించడంలో ప్రముఖ సంస్థగా పేరు గాంచింది. ఈ సంస్థలు అందించే కోర్సుల్లో తమకు నచ్చిన వాటిని విద్యార్థులు ఎంపిక చేసుకోవచ్చు.
దరఖాస్తు విధానం
విద్యార్థులు తాము చేరదలుచుకున్న కోర్సుకు సంబంధించిన సంస్థలో మొదట తమ పేరు నమోదు చేసుకోవాలి. వీరిని స్టూడెంట్ మెంబర్‌గా పిలుస్తారు. తర్వాత ఆయా సంస్థలు నిర్వహించే పరీక్షలతోపాటు, ప్రాక్టికల్ పరీక్షల్లో కూడా అర్హత పొందితే గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇస్తారు. డిగ్రీ అందుకున్న వారిని ‘కార్పొరేట్ మెంబర్’గా గుర్తిస్తారు.
పరీక్షల పద్ధతి
సాధారణంగా రెండు భాగాలుంటాయి. ఒక్కోభాగాన్ని సంస్థ నిర్దేశించిన సమయంలో పూర్తిచేయాలి.అభ్యర్థులు అన్ని పేపర్లలో కనీస, సగటు మార్కులు సాధిస్తే సంబంధిత సంస్థ నిబంధనలకు అనుగుణంగా ‘అసోసియేటెడ్’ హోదా లభిస్తుంది.
నిర్ణీత కాలంలో అన్ని పరీక్షల్లో పూర్తి అర్హత సాధిస్తే మెంబర్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ (ఎం.ఐ.ఇ.)గా గుర్తింపు పొందుతారు.
ఈ సంస్థల నిర్వాహకులు ఏవిధమైన స్టడీమెటీరియల్‌ను అందించరు. సబ్జెక్టులకు సంబంధించిన పుస్తకాలను సూచిస్తారు. కొన్ని సంస్థలు తమ ప్రధాన కార్యాలయంలో లైబ్రరీ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. మెటీరియల్ సమస్యను దృష్టిలో పెట్టుకుని ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ (ఇండియా), ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ మెకానికల్ ఇంజినీర్స్ (ఇండియా), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజినీర్స్, ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా మొదలైన సంస్థలు తమ విద్యార్థులకు స్వయంగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాయి.
జేఈఈ – మెయిన్, జేఈఈ అఢ్వాన్స్ డ్
భారతదేశం సాంకేతికంగా ఉన్నత స్థానానికి ఎదిగేందుకు నిపుణుల కొరత చాలా ఎక్కువగా ఉంది. మౌలిక వనరులు, ముడి పదార్థాలు పుష్కలంగా ఉన్నా సరైన పద్ధతిలో ఉపయోగించి దేశ ఆర్థిక వ్యవస్థను, ప్రజల జీవన ప్రమాణాన్ని పెంచే మానవ వనరులే తక్కువగా ఉన్నాయి. దీనివల్ల నిర్ణీత అభివృద్ధి లక్ష్యాలను చేరుకోవాలంటే చాలా సమయం పడుతోంది. నిపుణులను తీర్చిదిద్దితే దేశ పురోగతి వేగంగా సాగుతుందనే సంకల్పంతో ఐ.ఐ.టి.(ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)లకు అంకురార్పణ జరిగింది.
దేశంలో తొలిసారిగా 1950లో ఖరగ్‌పూర్‌లో మొట్టమొదటి ఐ.ఐ.టి.ని ఏర్పాటు చేశారు. తదనంతరం విద్యార్థుల సంఖ్యకు, అవసరాలకు తగినట్లు అనేక ఐ.ఐ.టి.లు వచ్చిచేరాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 15 ఐ.ఐ.టి.లు పనిచేస్తున్నాయి. అదనంగా బెనారస్ హిందూ యూనివర్సిటీని కూడా ఐ.ఐ.టి.గా మార్చడంతో ఈ సంఖ్య 16కి చేరింది.
పాతవి
1. ఐ.ఐ.టి ఖరగ్‌పూర్ (http://www.iitkgp.emet.in/)
2. మద్రాస్ (http://www.iitm.ac.in/)
3. ముంబయి (http://www.iitb.ac.in/)
4. కాన్పూర్ (http://www.iitk.ac.in/)
5. న్యూఢిల్లీ (http://www.iitd.ac.in/)
6. గౌహతి (http://www.iitg.ac.in/)
7. రూర్కీ. (http://www.iitr.ac.in/)
2008లో ఏర్పడినవి: 1) హైదరాబాద్; 2) రాజస్థాన్; 3) బీహార్; 4) ఒరిస్సా; 5) హిమాచల్‌ప్రదేశ్; 6) మధ్యప్రదేశ్ (ఇండోర్); 7) గుజరాత్ (గాంధీనగర్); 8) పంజాబ్ (రూప్‌నగర్). హిమాచల్‌ప్రదేశ్
ఇండోర్ సంస్థలు 2009 నుంచి ప్రవేశాలు ప్రారంభించాయి. మిగతా సంస్థలు 2008 నుంచే కార్యక్రమాలు కొనసాగిస్తున్నాయి.
ఐ.ఐ.టి. కోర్సులు: బి.ఇ., బి.టెక్., బి.ఆర్క్, బ్యాచ్‌లర్ ఆఫ్ డిజైన్.
సీట్లు: 5500 (ఐ.ఐ.టి.లకు చెందినవి 4000 ఉండగా, మిగతావి అనుబంధ సంస్థలకు చెందినవి).
అర్హతలు: ఇంటర్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ సబ్జెక్టులతో కనీసం 60 శాతం మార్కులుండాలి.
జేఈఈ – మెయిన్, జేఈఈ అఢ్వాన్స్ డ్
ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఐఐఐటీలు, తదితర విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం జేఈఈ మెయిన్‌, జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షల ద్వారా ఆయా సంస్థల్లో సీట్లను భర్తీ చేస్తారు.
పరీక్ష విధానం
2013-14 విద్యా సంవత్సరం నుంచి జేఈఈ రెండు విభాగాలుగా జరుగుతోంది. అవి… జేఈఈ మెయిన్‌, జేఈఈ అడ్వాన్స్‌డ్‌. జేఈఈ మెయిన్‌లో అగ్రస్థానంలో నిలిచిన 1.5 లక్షల మంది అభ్యర్థులను జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు అనుమతిస్తారు. ఐఐటీలలో ప్రవేశానికి.. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో సంబంధిత కేటగిరీలో ర్యాంకుతోపాటు, అర్హత పరీక్షలో అగ్రశ్రేణిలో నిలిచిన 20 శాతం మంది అభ్యర్థుల్లో ఉంటేనే పరిగణనలోకి తీసుకుంటారు. ఈ 20 శాతం మందిని కూడా కేటగిరీల వారీగా తీసుకుంటారు. ఈ శాతం ఏటా మారవచ్చు, బోర్డులను బట్టి వేర్వేరుగా ఉండొచ్చు. ఎన్‌ఐటీలు, ఐఐఐటీలు, ఇతర సంస్థల్లో ప్రవేశాల కోసం గతంలో నిర్వహించే ఏఐఈఈఈని జేఈఈ మెయిన్‌గా భావించవచ్చు. అలాగే గతంలోని ఐఐటీ – జేఈఈ పరీక్షను జేఈఈ అడ్వాన్స్‌డ్‌గా అర్థం చేసుకోవచ్చు.
ఎన్‌ఐటీలలో ప్రవేశానికి బోర్డు మార్కులు, జేఈఈ మెయిన్‌ మార్కుల ఆధారంగా నిర్ధారించిన ఆలిండియా ర్యాంకులను పరిగణనలోకి తీసుకుంటారు. బోర్డు మార్కులకు 40 శాతం, జేఈఈ మెయిన్‌కు 60 శాతం వెయిటేజీ ఉంటుంది. కేంద్ర నిధులతో నిర్వహిస్తున్న సంస్థలు, రాష్ట్ర స్థాయి యూనివర్సిటీలకు అనుబంధంగా కొనసాగే కాలేజీలు కూడా జేఈఈ మెయిన్‌ ఆధారంగా ప్రవేశాలు నిర్వహించవచ్చు. రాష్ట్రాలు కోరితే, వారి నిబంధనల ప్రకారం వెయిటేజీ కేటాయించి, ప్రత్యేక మెరిట్‌ లిస్ట్‌ను తయారుచేస్తారు. ప్రస్తుతానికి గుజరాత్‌ ఒక్కటే ఇలాంటి మెరిట్‌ లిస్ట్‌ కోసం అభ్యర్థించింది. ఇంగ్లిష్‌, హిందీ భాషల్లో జేఈఈ మెయిన్‌ పరీక్షను నిర్వహిస్తారు. ఏదైనా రాష్ట్రం కోరితే సంబంధిత ప్రాంతీయ భాషలో కూడా ప్రశ్నపత్రం రూపొందిస్తారు. ఆయా రాష్ట్రాలు తమ పరిధిలోని యూనివర్సిటీలు, ఇంజినీరింగ్‌ కాలేజీల్లో ప్రవేశాలకు జేఈఈ మెయిన్‌ స్కోరును ప్రాతిపదికగా తీసుకుంటేనే ఇది వర్తిస్తుంది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌, హిందీలో మాత్రమే ఉంటుంది.
ఇంతవరకూ ఉన్న ఏఐఈఈఈ లాగా జేఈఈ-2013 మెయిన్స్‌ పరీక్ష ఉంది. అలాగే ఇంతవరకూ ఉన్న ఐఐటీ-జేఈఈలాగా జేఈఈ-2013 అడ్వాన్స్‌డ్‌ పరీక్ష ఉంది. కాకపోతే జేఈఈ మెయిన్స్‌ పరీక్ష, జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ముఖద్వారం (గేట్‌వే) అవుతుంది. ఏఐఈఈఈ, ఐఐటీ-జేఈఈలు ఎంతోకాలంగా విద్యార్థులు రాస్తున్న పరీక్షలే కాబట్టి ఇంక విద్యార్థులు తగిన జాగ్రత్త తీసుకుంటే ఐఐటీల్లో ప్రవేశం ఏమంత కష్టం కాదు. ప్రవేశపరీక్షలో జరగబోతున్న మార్పులు అర్హతా నిబంధనలకు సంబంధించిన సాంకేతికపరమైనవే కానీ సబ్జెక్టు పరమైనవి కాదు!
ఐఐటీల్లో ప్రవేశం పొందాలంటే…
1. ఇంటర్‌ లేదా సమానమైన బోర్డు పరీక్షలో ఆ సంవత్సరం ఉత్తీర్ణులైన టాప్‌ 20 పర్సంటైల్‌ విద్యార్థుల్లో ఉండాలి.
2. జేఈఈ మెయిన్స్‌లో ర్యాంకు సాధించాలి. అంతేకాకుండా మొదటి లక్షా యాబైవేలమందిలో ఒకడవ్వాలి.
3. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలో ర్యాంకు సాధించాలి.
తుది పరీక్ష అయిన అడ్వాన్స్‌డ్‌లో సాధించే ర్యాంకు ఆధారంగానే సీటును కేటాయిస్తారు. మొదటి రెండూ eligibility conditions గానే ఉంటాయి. అంటే జేఈఈ మెయిన్స్‌ ర్యాంకు, ఇంటర్‌ మార్కులకు ఐఐటీలో సీటు కేటాయించడంలో ప్రాధాన్యం ఉండదు.
అర్హతా నిబంధనల్లో తేడా
ఈ పరీక్షలన్నిటికీ చదివే సిలబస్‌ ఒకటే అయినా బహుముఖ వ్యూహం అవసరం. ఇక్కడ విద్యార్థులు గమనించదగ్గ విషయం ఏమిటంటే- ఎన్‌ఐటీలూ, ఐఐఐటీల్లో ప్రవేశం పొందడానికీ; ఐఐటీల్లో ప్రవేశం పొందడానికీ ఉన్న అర్హత నిబంధనల్లో వ్యత్యాసం! ఎన్‌ఐటీలూ, ఐఐఐటీల్లో ప్రవేశం పొందడానికి బోర్డు పరీక్షలో టాప్‌ 20 పర్సంటైల్‌ ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఈ సంస్థల్లో సీటు కేటాయించడం కోసం ఇంటర్‌ మార్కులకు 40 శాతం వెయిటేజీ, జేఈఈ మెయిన్స్‌ పరీక్ష మార్కులకు 60 శాతం వెయిటేజీ ఉంటుంది. ఇంటర్‌ మార్కుల వెయిటేజీ నార్మలైజేషన్‌ జరిగిన తర్వాతే ఉంటుంది. ఐఐటీల్లో సీటు పొందడానికి ఇంటర్‌ మార్కులతో, జేఈఈ మెయిన్స్‌ ర్యాంకుతో ప్రత్యక్షంగా సంబంధం లేదు. కానీ జేఈఈ మెయిన్స్‌లో ఉత్తీర్ణులైనవారిలో మొదటి లక్షాయాబైవేలమందిలో, ఇంటర్లో ఉత్తీర్ణులైనవారిలో టాప్‌ 20 పర్సంటైల్‌లో ఉండాలి. ఇవీ అర్హతా నిబంధనలు. వీటిని అర్థం చేసుకుని తగిన ప్రిపరేషన్‌ వ్యూహం రూపొందించుకోవాలి.
సబ్జెక్టుపరంగా ప్రాధాన్యం
మెయిన్స్‌, అడ్వాన్స్‌డ్‌ పరీక్షల్లో గణిత, భౌతిక, రసాయన శాస్త్రాలకు సమ ప్రాధాన్యమే ఉంది. అయితే సబ్జెక్టుపరంగా ఆలోచిస్తే- భౌతికశాస్త్రంలోని ప్రశ్నలు మన రాష్ట్ర విద్యార్థులకు కఠినంగా ఉంటాయి. అందుకనే వీరు దీనిపై కాస్త ఎక్కువ శ్రద్ధ పెట్టడం మంచిది.
గణితం స్కోరింగ్‌ సబ్జెక్టని తెలిసిందే. మంచి ర్యాంకు సాధనకు ఈ సబ్జెక్టును నమ్ముకోవాల్సిందే. మూడో ప్రాధాన్యం రసాయనశాస్త్రానిది. ఎందుకంటే- మిగిలిన రెండు సబ్జెక్టుల్లో ఎక్కువగా కాల్‌క్యులేషన్‌ ఆధారిత ప్రశ్నలుంటే దీనిలో కంటెంట్‌ ఆధారిత ప్రశ్నలు ఎక్కువ. కాల్‌క్యులేషన్లలో పొరపాట్లు జరిగే అవకాశం అధికం. ఇక ఇంటర్‌ పరీక్షలో కూడా టాప్‌ 20 పర్సంటైల్‌లో ఉండాలి కాబట్టి ఈ మూడు సబ్జెక్టులతో పాటు లాంగ్వేజెస్‌లో కూడా మంచి మార్కులు తెచ్చుకోవాలి.
జేఈఈ మెయిన్‌లో రెండు పేపర్లు ఉంటాయి
పేపర్‌ 1: ఇది బీఈ / బీటెక్‌ కోర్సులకు సంబంధించింది. ఇందులో మేథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ నుంచి ఆబ్జెక్టివ్‌ మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు ఇస్తారు. అన్ని సబ్జెక్టులకు సమాన వెయిటేజీ ఉంటుంది. పరీక్ష వ్యవధి 3 గంటలు.
పేపర్‌ 2: ఇది ఆర్కిటెక్చర్‌ / ప్లానింగ్‌ కోర్సులకు సంబంధించిన పేపర్‌. ఇందులో మూడు విభాగాలు ఉంటాయి. అవి… మేథ్స్‌ టెస్ట్‌, ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌, డ్రాయింట్‌ టెస్ట్‌. దీని వ్యవధి కూడా 3 గంటలు. ఈ. పరీక్షలో నాలుగు ఆప్షన్‌లతో కూడిన ఆబ్జెక్టివ్‌ టైప్‌ ప్రశ్నలు ఇస్తారు. వీటిలో సరైన సమాధానం ఒకటే ఉంటుంది. తప్పుగా గుర్తించిన ప్రతి సమాధానానికి 1/4 శాతం మార్కును తీసేస్తారు.
జేఈఈ మెయిన్‌ పరీక్షను మూడుసార్లు రాయవచ్చు. వీటిని ఏటా వరుసగా రాయాలి. గత ఏడాది ఏఐఈఈఈ రాసుంటే, ఒక ప్రయత్నం పూర్తయినట్టే.
జేఈఈ మెయిన్‌ను ఆన్‌లైన్‌ (కంప్యూటర్‌ ఆధారితం), ఆఫ్‌లైన్‌ (పేపర్‌, పెన్ను) పద్ధతుల్లో నిర్వహిస్తున్నారు.
మెయిన్‌ పరీక్షకు సంబంధించిన తాజా సమాచారాన్ని(www.jeemain-edu.in) లో ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేస్తారు. ఇతర వివరాలు, సందేహాల నివృత్తికి (jeemain2013@gmail.com) కు మెయిల్‌ చేయవచ్చు. అడ్వాన్స్‌డ్‌ పరీక్ష సమాచారం (jee.iitd.ac.in) లో లభిస్తుంది. ఏవైనా సందేహాలుంటే (jeeadv@admin.iitd.ac.in) కు మెయిల్‌ చేయవచ్చు.
ట్రిపుల్ ఐటీలు
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) మార్కెట్‌కు కావాల్సిన సుశిక్షితులైన మానవ వనరులను తీర్చిదిద్దడానికి ఏర్పడినవే ట్రిపుల్ ఐటీలు (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ). 1998-2000 మధ్య కాలంలో వీటిని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. మొదటి ట్రిపుల్ ఐటీని హైదరాబాద్‌లోనే నెలకొల్పారు.
మొత్తం కేంద్రాలు: 1) ఐ.ఐ.ఐ.టి. హైదరాబాద్ 2) బెంగళూరు 3) ట్రిపుల్ ఐటీ అండ్ మేనేజ్‌మెంట్, గ్వాలియర్ 4) ఐ.ఐ.ఐ.టి. అండ్ ఎం. కేరళ. 5) పుణే 6) అలహాబాద్ 7) భువనేశ్వర్ 8) ఢిల్లీ 9) ఐ.ఐ.ఐ.టి. డిజైన్ అండ్ మేనేజ్‌మెంట్, కాంచీపురం 10) ఐ.ఐ.ఐ.టి డిజైన్ అండ్ మాన్యుఫాక్చరింగ్, జబల్‌పూర్. హైదరాబాద్, బెంగళూర్‌ల్లోని ట్రిపుల్ ఐటీలు, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో నడుస్తుంటే, మిగతావి మొత్తంగా ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. అందుకనే ఈ రెండు సంస్థలు 2004-05 సంవత్సరం నుంచి పూర్తిస్థాయి యూనివర్సిటీలుగా మారిపోయాయి. యు.జి.సి. సలహా ప్రకారం వాటి పేరును ‘ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్’ నుంచి ‘ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్’గా మార్చుకున్నాయి. వీటిలో చేరడానికి కూడా ఎ.ఐ.ఇ.ఇ.ఇ. రాయాల్సిందే. ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశానికి నవంబర్, డిసెంబర్‌లలో ప్రకటనలు వెలువడతాయి. ఇవి కాకుండా రాష్ట్రంలో మరో మూడు ట్రిపుల్ ఐటీలు బాసర, నూజివీడు, ఇడుపులపాయల్లో ఉన్నాయి. వీటిలో ప్రవేశానికి పదో తరగతి సరిపోతుంది.
ఏరోనాటికల్ సోసైటీ ఆఫ్ ఇండియా
1948లో ఏర్పడిన ఈ సంస్థ అసోసియేట్ మెంబర్ షిప్ ఎగ్జామ్ ఇన్ ఏరోనాటికల్ సోసైటీ ఆఫ్ ఇండియా (ఎ.ఎం.ఎ.ఇ.ఎస్.ఐ)’ నిర్వహించి సర్టిఫికెట్ జారీ చేస్తోంది. ఇది బి.టెక్.(ఏరోనాటికల్ ఇంజినీరింగ్)తో సమానం. అర్హతలు: మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో ఇంటర్‌లో కనీసం 50 శాతం మార్కులుండాలి. ప్రతి సంవత్సరం రెండుసార్లు అసోసియేట్ మెంబర్‌షిప్ పరీక్ష నిర్వహిస్తోంది. దీన్లో రెండు సెక్షన్లు (ఎ, బి) ఉంటాయి.
సెక్షన్-ఎ: మొత్తం 10 కంపల్సరీ పేపర్లు ఉంటాయి. అన్నీ తప్పనిసరిగా రాయాలి. సెక్షన్-బి: సెక్షన్-ఎ పాసైనవారు మాత్రమే ఈవిభాగానికి అర్హులు. పరీక్షలు ప్రతి సంవత్సరం జూన్, డిసెంబర్ నెలల్లో జరుగుతాయి. అన్ని పేపర్లలో అర్హత పొందిన వారిని ఎ.ఎం.ఎ.ఇ.ఎస్.ఐ.గా గుర్తిస్తుంది.
చిరునామా:
The Programme Director ‘AD’.
DRDL Complex, PO. Kanchanbagh,
Hyderabad-058
http://www.aesi-hyd.com/