హోమ్ లోన్

హోమ్ లోన్ అప్లై 

5 Important Things And Tips To Know Before Applying For Home Loan - Sakshi

ఇల్లు కొనుగోలు అన్నది ఒక పెద్ద నిర్ణయం. దీనికోసం మనలో చాలా మంది ఆర్థిక సాయం కోసం గృహ రుణాల(హోమ్ లోన్)పై ఆధారపడుతుంటాం. హౌసింగ్ లోన్ అన్నది ఒక తెలివైన ఎంపిక. ఇది మీ కలల గృహాన్ని సొంతం చేసుకునేందుకు, మీరు డబ్బుల కోసం ఇబ్బంది పడకుండా చూసే ఒక అవకాశం. ప్రస్తుతం రెపోరేట్లను 4 శాతానికి తగ్గిస్తూ ఆర్బీఐ తీసుకున్ననిర్ణయం కారణంగా హోమ్ లోన్ వడ్డీరేట్లు ఇప్పుడు ఆల్ టైమ్ “లో”గా ఉన్నాయి. ఏది ఏమైనా, హౌసింగ్ లోన్ అన్నది ఒక కీలకమైన అడుగు. అది దీర్ఘకాలిక ఆర్థిక కమిట్మెంట్ కాబట్టి హౌసింగ్ లోన్ కోసం దరఖాస్తు చేసుకునే వారు ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఎందుకంటే రానున్న ఏళ్లలో వారి ఆదాయంలో పెద్ద మొత్తం దానికే పోతుంది.

హోమ్ లోన్ కోసం దరఖాస్తు చేసేటప్పుడు రుణ గ్రహీత పరిశీలించాల్సిన కొన్ని అంశాలు ఇవి:

1. వడ్డీ చెల్లింపులు

హోమ్ లోన్ తక్కువ వడ్డీరేట్లు పొందేందుకు ఆర్థిక సంస్థలను కంపేర్ చేయడం ముఖ్యం. అంతేకాదు రెండు రకాల వడ్డీరేట్లలో ఏది ఎంపిక చేసుకోవాలనేది కూడా అంతే ముఖ్యం:

● ఫ్లోటింగ్
● ఫిక్స్డ్

ఫ్లోటింగ్ రేట్లు అనేవి ఆర్బీఐ బేస్ రేట్లలో మార్పులు చేసినప్పుడు, మొత్తంగా మార్కెట్ పరిస్థితులకు లోబడి కాలానుగుణంగా మారుతూ ఉంటాయి. ఫిక్స్డ్ రేట్స్ అనేవి ఎప్పుడు మారవు అన్నమాట. భవిష్యత్ లో వడ్డీరేట్లు తగ్గుతాయనే అంచనాలు ఉన్నప్పుడు ఫ్లోటింగ్ రేట్లు ఎంచుకోవడం మంచిదని ఆర్థికనిపుణులు సిఫార్సు చేస్తారు. సాధారణంగా ఫిక్స్డ్ రేట్లతో పోల్చితే ఫ్లోటింగ్ రేట్లు 1శాతం నుంచి 2 శాతం వరకు తక్కువుంటాయి. దీర్ఘకాలంలో సొమ్ము ఆదాచేస్తాయి. వడ్డీ రేట్లు పెరుగుతాయనే సంకేతాలు ఆర్థికవ్యవస్థలో కనిపించినప్పుడు ఫిక్స్డ్ రేటు ఎంచుకోవడం మేలు. ఫిక్స్డ్ వడ్డీ రేటులో రుణ గ్రహీతలు తమకు అనుగుణంగా ఉండేలా బడ్జెట్ రూపొందించుకోవచ్చు. ఈఎంఐ మొత్తాలు చెల్లించేందుకు దరఖాస్తులు సౌకర్యవంతంగా ఉంటారా అన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకొని ఫ్లోటింగ్, ఫిక్స్డ్ రేట్ల మధ్య ఎంపిక చేసుకోవాలి.

2. వ్యవధి
హౌసింగ్ లోన్ రీపేమెంట్ వ్యవధి 30 ఏళ్ల వరకు ఉంటుంది, అంటే 360 వాయిదాలు. ఈఎంఐ భారం తక్కువుంటుంది కాబట్టి దీర్ఘకాలిక వ్యవధి ఎంచుకోవడం మేలు. అయితే వడ్డీ చెల్లింపును తగ్గించుకునేందుకు స్వల్పవ్యవధి అనువైనది. ఎందుకంటే ఇందులో వడ్డీ చెల్లింపును స్వల్పకాలానికే లెక్కిస్తారు. ఉదాహరణకు, 15 సంవత్సరాల వ్యవధికి రూ.80 లక్షల హౌసింగ్ లోన్ ను 8.25 శాతం వార్షిక రేటు లెక్కన తీసుకుంటే ఈఎంఐ రూ.77,611 ఉంటుంది. అలాగే, చెల్లించే మొత్తం వడ్డీ రూ.59,70,000గా ఉంటుంది. 

ఒకవేళ ఈ రుణవ్యవధిని 20 ఏళ్లకు పెంచినట్టు అయితే, ఇన్స్టాల్మెంట్ మొత్తం రూ.68,165కు తగ్గుతుంది. కాని చెల్లించే వడ్డీ మొత్తం రూ.83.59,760 అవుతుంది. దరఖాస్తు చేసుకునేందుకు దరఖాస్తుదారులు హోమ్ లోన్ కాలిక్యూలేటర్ ఉపయోగించాలి. ఇన్స్టాల్మెంట్ మొత్తం తమ ఆదాయంలో 30 శాతం కంటే ఎక్కువ ఉండకుండా చూసుకోవాలి. తమ వయస్సు, ఆదాయ అవకాశాలు, తాము పూర్తి చేయాల్సిన ఇతర బాధ్యతలను దృష్టిలో పెట్టుకొని వ్యవధిని ఎంచుకోవాల్సి ఉంటుంది.

3. డౌన్ పేమెంట్
రుణమిచ్చే సంస్థలు ఆస్తివిలువలో కొంతమొత్తాన్ని మాత్రమే రుణంగా ఇస్తాయి, మిగిలిన మొత్తాన్ని దరఖాస్తుదారు స్వయంగా సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఆస్తిధర, దరఖాస్తుదారు అర్హతను బట్టి ఇది75 శాతం నుంచి 90శాతం మధ్యన ఉంటుంది. రుణ గ్రహీతలు కనీస మొత్తాన్ని డౌన్ పేమెంట్ గా చెల్లించవచ్చు లేదా ఎక్కువ మొత్తాన్ని చెల్లించవచ్చు. రుణంగా ఎంత మొత్తం తీసుకోవాలి, బిల్డర్ లేదా అమ్మకందారుకు తన దగ్గరనున్న సొమ్ములోఎంత చెల్లించాలనే విషయాన్ని కొనుగోలుదారులు తెలివిగా ఆలోచించాల్సి ఉంటుంది.

గణనీయస్థాయిలోడౌన్ పేమెంట్ చెల్లించేందుకు ముందుకు వస్తే హోమ్ లోన్(Home Loan) అర్హత అవకాశాలు మెరగువుతాయి. కాబట్టి, కుదిరిన పక్షంలో ఎక్కువ మొత్తం డౌన్ పేమెంట్ గా చెల్లించడం మంచిది. ఇలా చేయడం వలన రీపేమెంట్ భారం కూడా తగ్గుతుంది. అర్హత విషయానికి వస్తే తమకు ముందుస్తు ఆమోదిత ఆఫర్ తో కూడిన హోమ్ లోన్ అందుబాటులోఉందా అన్నది పరిశీలించుకోవాలి. ఇలా చేయడం వలన అప్లికేషన్ ప్రాసెసింగ్ వేగంగా జరుగుతుంది. ఇలాంటి ఆఫర్లు అనేక ఫైనాన్సింగ్ ఆప్షన్స్ పై ఉంటాయి, ఉదాహరణకు ఆస్తిపై లోన్. ముందస్తు ఆమోదిత ఆఫర్ గురించి తెలుసుకునేందుకు దరఖాస్తుదారులు తమపేరు, ఫోన్ నెంబర్ అందించాల్సిఉంటుంది.

4. అనుబంధఛార్జీలు
హోమ్ లోన్ పై కేవలం వడ్డీ మాత్రమే ఉండదు. దానికి సంబంధించి ప్రాసెసింగ్ ఫీజులు, లేట్ పేమెంట్ పెనాల్టీలు, ఫోర్ క్లోజర్ ఛార్జీలు కూడా ఉంటాయి. ప్రారంభంలోనే దీనిని రుణదాతతో చర్చించడం మంచిది.
ఫిక్స్డ్ రేట్ హోమ్ లోన్ పైన మాత్రమే ఫోర్ క్లోజర్ లేదా ప్రీపేమెంట్ ఛార్జీలు వర్తిస్తాయనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. కాబట్టి, ఫిక్స్డ్, ఫ్లోటింగ్ రేటువిషయంలో నిర్ణయం తీసుకునేటప్పుడు ప్రీపేమెంట్ ఆప్షన్ ఉండేలా చూసుకోవడం మంచిది. తద్వారా వ్యవధి తగ్గించుకోవచ్చు దాని వలన పెద్ద మొత్తంలో డబ్బు ఆదా చేసుకోవచ్చు.

5. క్రెడిట్ స్కోర్
హోమ్ లోన్ అప్లై చేయడానికి ముందు దరఖాస్తుదారు తన క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకోవాలి. ఆరోగ్యకరమైన స్కోర్ అంటే 750 కంటే ఎక్కువుంటే తక్కువ వడ్డీ రేట్లకు రుణాన్ని పొందవచ్చు. హోమ్ లోన్ తీసుకోవ డానికి ముందు అన్ని బకాయిలు క్లియర్ చేసుకొని ఆరోగ్యకరమైన క్రెడిట్ స్కోర్ పెంపొందించుకోవడం మంచిది.  అవసరమైన డాక్యుమెంట్లు చెక్ చేసుకోవాలి, అలాగే లోన్ ఒప్పంద పత్రాన్ని క్షుణ్ణంగా చదవాలి. హోమ్ లోన్ తీసుకోవడమన్నది చాలాపెద్ద నిర్ణయం, అది రానున్న సంవత్సరాల్లో వారి ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపుతుంది. కాబట్టి దానికి సంబంధించిన అన్ని విషయాలు తెలుసుకోవడం, రుణం తీసుకుంటున్న వ్యక్తి ఆర్థికప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరించడం చాలాముఖ్యం.

పైన పేర్కొన్న విషయాలన్నీ మీరు అర్థంచేసుకున్నారు కాబట్టి, హోమ్ లోన్ సంబంధించి అవగాహనతో కూడిన నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు ముఖ్యం. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ అందిస్తున్నహోమ్ లోన్ ఎంచుకోవడమన్నది పరిగణనలోకి తీసుకోవాల్సిన ఒక సౌకర్యవంతమైన ఆప్షన్. మీ కలల ఇంటిని కొనుగోలు చేసేందుకు లేదా నిర్మించుకునేందుకు మీరు రుణం తీసుకోవచ్చు. ఆకర్షణీయమైన వడ్డీరేట్లతో పాటు సౌకర్యవంతంగా 30 ఏళ్లవ్యవధిలోపు తీసుకున్న మొత్తాన్ని తిరిగి చెల్లించవచ్చు. 

పిల్లల పేరిట బ్యాంకు ఖాతా

What are the advantages of kids saving account - Sakshi

‘నగదు నిర్వహణ’ (మనీ మేనేజ్‌మెంట్‌/ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌)కు జీవితంలో ఎంతో ప్రాధాన్యం ఉంది. ‘మనీ’ పాఠాలను ఎంత ముందుగా నేర్చుకుంటే ఆర్థికంగా అంత మెరుగైన స్థానానికి బాటలు వేసుకోవచ్చు. తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్న నాటి నుంచే డబ్బు విషయాలను తెలియజేస్తూ వెళితే భవిష్యత్తులో వారికి స్పష్టమైన బాట ఏర్పాటు చేసినవారవుతారని నిపుణులు సూచిస్తున్నారు. సాధారణంగా స్కూళ్లలో మనీ పాఠాలకు చోటుండదు. కనుక తల్లిదండ్రులే ఈ విషయంలో చొరవ చూపించాలి. ఎక్కువ మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు పాకెట్‌ మనీ ఇస్తుంటారు. కొందరు అయితే పిగ్గీ బ్యాంకు (డిబ్బీ) ఇచ్చి అందులో పొదుపు దిశగా ప్రోత్సహిస్తుంటారు. ప్రేమతో ఇలా ఇచ్చే డబ్బును పిల్లల పేరిట బ్యాంకులో సేవింగ్స్‌ ఖాతాను ప్రారంభించి.. అందులోకి మళ్లించడం మంచి ఆలోచన అవుతుంది.  

పిల్లలకు బ్యాంకులో సేవింగ్స్‌ ఖాతా ప్రారంభించడం వల్ల వారి కంటూ తల్లిదండ్రులు ఓ ఆదాయ వనరును సమకూర్చినవారు అవుతారు. దీనివల్ల బ్యాంకు ఖాతా అవసరం, ప్రయోజనాలను చిన్నారులు తెలుసుకుంటారు. సంపాదన వయసుకు వచ్చే నాటికి బ్యాంకింగ్‌ లావాదేవీలపై వారికి చక్కటి అవగాహన ఏర్పడుతుంది. చిన్నప్పుడే బ్యాంకు లావాదేవీలకు సన్నిహితంగా మెలగడం వారిపై ఆర్థికంగా సానుకూల ప్రభావాన్ని చూపిస్తుందని నిపుణుల విశ్లేషణ. పిగ్గీ బ్యాంకులో ఎంత వేస్తే అంతే ఉంటుంది. కానీ, బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన మొత్తంపై ఎంతో కొంత వడ్డీ జమ అవుతూ, కాంపౌండింగ్‌తో మరింత వృద్ధి చెందుతుంది. అందుకే పిల్లలకు ఇచ్చే పాకెట్‌ మనీని బ్యాంకు పొదుపు ఖాతాలో పొదుపు చేసుకునే దిశగా పిల్లలను ప్రోత్సహించాలి. అసలు.. వడ్డీ.. వడ్డీపై వడ్డీ అంతా కలసి.. మైనర్లు కాస్తా మేజర్లు అయ్యే నాటికి కొద్ది మొత్తమే మంచి నిధిగా మారుతుంది. పిల్లలు దీన్ని బాగా అర్థం చేసుకుంటే, వారి భవిష్యత్తుకు ప్రయోజనం. 

అర్హతలు 
పిల్లల పేరిట తల్లిదండ్రులు లేదా సంరక్షకులు బ్యాంకులో ఖాతాను ప్రారంభించుకునేందుకు అవకాశం ఉంది. పిల్లలకు ఎంత వయసు ఉండాలి? అన్న సందేహం అక్కర్లేదు. రోజుల వయసు ఉన్నా కానీ ఎటువంటి అభ్యంతరం లేదు. చాలా బ్యాంకుల్లో మైనర్‌ ఖాతా గరిష్ట వయసు 18 ఏళ్లుగా అమలవుతోంది. 18 ఏళ్లు నిండిన తర్వాత మైనర్‌ ఖాతాను పూర్తి స్థాయి సాధారణ ఖాతాగా మార్చేందుకు అర్హత లభిస్తుంది. కాకపోతే ఆ సమయంలో పూర్తి స్థాయి కేవైసీ వివరాలను సమరి్పంచాలి.

వార్షిక వడ్డీ ఆదాయం సంగతి…
మైనర్‌ ఖాతాలకు సంబంధించి తల్లిదండ్రులు లేదా సంరక్షకులు తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన అంశం పన్ను. పిల్లల పేరిట బ్యాంకు ఖాతాల్లోని డిపాజిట్లపై వడ్డీ ఆదాయం తల్లిదండ్రులు లేదా సంరక్షకుల వార్షిక ఆదాయానికే కలిపి చూపించుకోవాల్సి ఉంటుంది.   

పలు రకాల ఖాతాలు.. 
తల్లి లేదా తండ్రి ఉమ్మడి ఖాతాదారుగా జాయింట్‌ అకౌంట్‌ను ప్రారంభించుకునేందుకు వీలుంది. లేదా చిన్నారి పేరు మీదే ఖాతాను తెరవొచ్చు. ఎస్‌బీఐ ‘పెహ్లాకదమ్‌’, ఐసీఐసీఐ బ్యాంకు ‘యంగ్‌ స్టార్స్‌ సేవింగ్స్‌ అకౌంట్‌’లకు కచ్చితంగా తల్లిదండ్రులు జాయింట్‌ అకౌంట్‌ హోల్డర్‌గా ఉండాలన్న నిబంధన అమల్లో ఉంది. మరి కేవలం చిన్నారి పేరుతోనే ఖాతా తెరవాలనుకుంటే ఎస్‌బీఐలో పెహ్లీఉడాన్‌ అనే పథకం ఉంది. కాకపోతే 15-18 ఏళ్ల వయసు వారికే ఇది పరిమితం. అదే పదేళ్లు దాటిన చిన్నారులకు ప్రత్యేకమైన ఖాతా తెరవాలనుకుంటే ఐసీఐసీఐ బ్యాంకు ‘స్మార్ట్‌స్టార్‌ సేవింగ్స్‌ అకౌంట్‌’ పథకం అందుబాటులో ఉంది.  యాక్సిస్‌ బ్యాంకు ‘ఫ్యూచర్‌ స్టార్స్‌ సేవింగ్స్‌ అకౌంట్‌’లో అయితే పిల్లలకు పదేళ్లు వచ్చే వరకు వారి తరఫున తల్లిదండ్రులు లేదా సంరక్షకులే లావాదేవీలు నిర్వహించేందుకు వీలుంటుంది. ఒకవేళ చిన్నారుల పేరిట ఖాతాను ప్రారంభించేట్టు అయితే.. అదే బ్యాంకు శాఖలో వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకులకు సైతం ఖాతా ఉండాలని చాలా బ్యాంకులు కోరుతున్నాయి.  

వడ్డీ రేట్లు/ చార్జీలు 
చాలా బ్యాంకులు సాధారణ సేవింగ్స్‌ ఖాతాల మాదిరే వడ్డీ రేటును మైనర్‌ ఖాతాలకూ అమలు చేస్తున్నాయి. ప్రస్తుతం సేవింగ్స్‌ ఖాతాలపై వడ్డీ రేట్లు వివిధ బ్యాంకుల పరిధిలో 2.7 శాతం నుంచి 7 శాతం మధ్యలో ఉన్నాయి. కాకపోతే పిల్లల పేరిట తెరిచే ఖాతా విషయంలో వడ్డీ రేటుకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఖాతాకు ఉన్న సదుపాయాలు, సౌకర్యాలనే ప్రధానంగా చూడాలి. ప్రారంభ డిపాజిట్‌ ఎంత చేయాలి?, కనీస నెలవారీ బ్యాలన్స్‌ నిర్వహించలేకపోతే విధించే చార్జీలు ఎలా ఉంటాయి?, నగదు ఉపసంహరణకు పరిమితులు? ఇతరత్రా నియమ నిబంధనలను ప్రధానంగా చూడాలి. ఉదాహరణకు ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంకులో మైనర్‌ సేవింగ్స్‌ ఖాతా ప్రారంభానికి రూ.25,000 ఉండాలి. 

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు అయితే ‘కిడ్స్‌ అడ్వాంటేజ్‌ అకౌంట్‌’లో మైనర్లు నెలవారీ కనీసం రూ.5,000ను బ్యాలన్స్‌గా నిర్వహించాలని కోరుతోంది. రూ.5,000 నిర్వహణలో విఫలమైతే తిరిగి కనీస బ్యాలన్స్‌ ఖాతాలో చేరే వరకు రూ.150–300 మధ్య చార్జీలను అమలు చేస్తోంది. అదే ఎస్‌బీఐ ‘పెహ్లీ ఉడాన్‌’ ఖాతాలో ఎటువంటి బ్యాలన్స్‌ ఉంచాల్సిన అవసరం లేదు. అంటే ఇది జీరో బ్యాలన్స్‌ అకౌంట్‌. గరిష్టంగా ఖాతాలో రూ.10లక్షల వరకు బ్యాలన్స్‌ను నిర్వహించుకోవచ్చు. సాధారణ ఖాతాలకు మాదిరే మైనర్‌ ఖాతాదారులూ చెక్కు బుక్, ఏటీఎం కార్డు, మొబైల్, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ సేవలను పొందొచ్చు. ఉపసంహరణ పరిమితులు, తల్లిదండ్రుల ప్రమేయం అన్నది బ్యాంకుల మధ్య మార్పు చెందొచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ‘కిడ్స్‌ అడ్వాంటేజ్‌ అకౌంట్‌’ అయితే చిన్నారుల పేరిటే ఏటీఎం/డెబిట్‌ కార్డులను జారీ చేస్తారు. రోజువారీ ఉపసంహరణ పరిమితి రూ.2,500గా ఉంది. వర్తకుల వద్ద ఒక్కరోజులో రూ.10,000కు మించి కార్డుతో చెల్లించడానికి అవకాశం లేదు. అదే ఎస్‌బీఐ అయితే పీవోఎస్‌ వద్ద రోజువారీ పరిమితిని రూ.5,000గానే అమలు చేస్తోంది. 

తల్లిదండ్రుల నియంత్రణలు 
చాలా బ్యాంకులు మైనర్‌ ఖాతాలకు సంబంధించి ఎటువంటి ఆంక్షల్లేకుండా ఏటీఎం/డెబిట్‌ కార్డుల సదుపాయాలను కలి్పస్తున్నాయి. కనుక కార్డుల దురి్వనియోగం రిస్క్‌ ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే బ్యాంకులు మైనర్‌ ఖాతాల లావాదేవీలపై తల్లిదండ్రులు లేదా సంరక్షకుల మొబైల్‌ నంబర్లకు అలర్ట్‌ సందేశాలను పంపిస్తున్నాయి. అంతేకాదు, నెట్‌బ్యాంకింగ్‌ ద్వారా లావా దేవీలను పరిశీలించుకునేందుకు అనుమతిస్తున్నా యి. తమ పిల్లల కార్డు ల పరిమితులను ఎప్పటికప్పుడు మా ర్చుకునేందుకూ అవకాశం కల్పిస్తున్నాయి. సిటీ బ్యాంకు జూనియర్‌ అకౌంట్, ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌కు చెందిన ఏయూ కిడ్స్‌ అకౌంట్‌ ఇందుకు ఉదాహరణలు. పిల్లల చేతికే తాళాలు ఇవ్వడం నచ్చని తల్లిదండ్రులు ఖాతాల కంట్రోలింగ్‌ను తమ చేతుల్లోనే ఉంచుకునే సదుపాయం ఉంది. 

అదనపు ప్రయోజనాలు.. 
కొన్ని బ్యాంకులు మైనర్‌ ఖాతాలపై అదనపు ప్రయోజనాలను ఆఫర్‌ చేస్తున్నాయి. ఎస్‌బీఐ ‘పెహ్లీ ఉడాన్‌’ పెహ్లాకదమ్‌’ ఖాతాలకు ఆటో స్వీప్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ (బ్యాలన్స్‌ కనీస పరిమితి మించిన సందర్భాల్లో అదనపు బ్యాలన్స్‌ను డిపాజిట్‌గా మార్చే ఆటో సదుపాయం) సదుపాయాన్ని అందిస్తోంది. రికరింగ్‌ డిపాజిట్‌పై స్టాండింగ్‌ ఇన్‌స్ట్రక్షన్‌ సదుపాయాన్ని కూడా కలి్పస్తోంది. వ్యక్తిగత ప్రమాద బీమా కవరేజీని, ఎస్‌బీఐ లైఫ్‌ తరఫున మార్కెట్‌ లింక్డ్‌ ప్లాన్‌ ‘స్మార్ట్‌ స్కాలర్‌’ను ఆఫర్‌ చేస్తోంది. పెహ్లాకదమ్‌ ఖాతాలో అయితే ఎఫ్‌డీపై ఓడీ సదుపాయాన్ని తల్లిదండ్రులు/సంరక్షకులు తీసుకునే ఆప్షన్‌ కూడా ఉంది. ఇక హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కిడ్స్‌ అడ్వాంటేజ్‌ ఖాతాదారులకు రూ.లక్ష విలువతో ఉచితంగా ఎడ్యుకేషన్‌ ఇన్సూరెన్స్‌ను అందిస్తోంది. తల్లిదండ్రులు లేదా సంరక్షకులు మరణించినట్టయితే మైనర్‌ ఖాతాదారులకు బ్యాంకు రూ.లక్ష పరిహారంగా చెల్లిస్తుంది.

బ్యాంకుల్లో – లాకర్లు

మనకు, మన ఆస్తులకు సంబంధించిన పత్రాలు, విలువయిననగలు, వస్తువులు భద్రపరుచుకునేందుకు బ్యాంకు లాకర్లు ఉపయోగపడతాయి. మనం ఇల్లు తాళం వేసుకుని రోజులతరబడి వేరే ఊళ్లకు వెళ్లినప్పుడు మన విలువయిన వస్తువులు, నగలు లాకరులో భద్రపరుచుకోవచ్చు.

బ్యాంకుల్లో లాకర్లు అద్దె ప్రాతిపదికన ఇవ్వబడతాయి. బ్యాంకు లాకర్లలో మనకు రక్షణ ఏమిటంటే మనం తీసుకున్న ఒక లాకరు తాళం మనదగ్గర ఉంటే ఇంకో మాస్టర్ కీ (ఆ యూనిట్ లో ఉన్న అన్ని లాకర్లకీ సంబంధించిన ఒకే ఒక తాళం) బ్యాంకువారి దగ్గర ఉంటుంది. అందుచేత మనం తీసుకున్న లాకర్ తెరవాలంటే మన కీ బ్యాంకు వాళ్ల మాస్టర్ కీ రెండూ ఒకేసారి పెట్టి తెరవాల్సిఉంటుంది. రెండింట్లో ఏఒక్క కీతోమాత్రమే లాకర్ తెరవడం అసంభవం. అందుచేత మనకీ జాగ్రత్తగా దాచుకుంటే అందులో మనం పెట్టుకున్నవస్తువులకు ఢోకా ఉండదు.

ఈ లాకర్లు కూడా చిన్నవి, కొంచెం పెద్దవి, అంతకన్న పెద్ద లాకర్లు కూడా ఉంటాయి. సాధారణంగా ఆ బ్యాంకుతో ఎక్కువ సంబంధం పెట్టుకుని పెద్ద మొత్తాల్లో డిపాజిట్లు, ఎకౌంట్లతో లావాదేవీలు జరిపేవారు మేనేజ్ మెంటుతో మాటలాడుకుని లాకరు యూనిట్ రావడానికి ముందే ఏర్పాట్లు చేసుకుని పెద్దలాకర్లు తీసుకుంటారనేది నా అనుభవంలో గ్రహించిన విషయం.

సాధారణంగా బ్యాంకు లాకరు కావాలంటే మనకి ఎకౌంట్ ఉండి ఒక ఖాతాదారుగా ఉన్నవారికే లాకరు ఇవ్వడానికి ఆ బ్యాంకువారు సుముఖత చూపిస్తారు. ఎందుకంటే బ్యాంకింగు నిబంధనలను అనుసరించి ఆ బ్యాంకువారితో అంతకు ముందే మీకు పరిచయం ఉండటం గురించి ఒక రికార్డ్ ఉండటం మీ లావాదేవీలు సంతృప్తికరంగా ఉన్నాయి అనే విషయాలకు ప్రాముఖ్యత ఉంటుంది. ఏడాదికి సరిపోయే అద్దె ఒకేసారి అడ్వాన్సుగానే చెల్లించాల్సిఉంటుంది. అదికాకుండా లాకరు కీ డిపాజిట్ గా కూడా కొంత మొత్తాన్ని మీదగ్గర వసూలు చేసి బ్యాంకువారు వారిదగ్గర పెట్టుకుంటారు. మీరు లాకరు రద్దుచేసుకున్నప్పుడు అది మీకు తిరిగి ఇచ్చేస్తారు.

మీరెప్పుదైనా కీ పోగొట్టుకున్నా, లేక అద్దె కట్టకుండానూ బ్యాంకుకి రాకుండానూ ఒక కాలపరిమితికిమించి వ్యవహరిస్తే బ్యాంకువారు మీకు కొంచెం ముందు ఒక నోటీసు పోస్టులో మీరు లాకర్ తీసుకున్నప్పుడు ఇచ్చిన ఎడ్రసుకి పంపించి కొన్నిరోజుల తరవాత ఆ లాకరుని ఇద్దరు ముగ్గురు తగిన స్థాయి కలిగిన సాక్షుల సమక్షంలో పగులకొట్టి తెరిపించి అందులో దాచిన వస్తువుల లిస్టు వివరాలు రాసి బ్యాంకువారు, ఆ సాక్షులు అందులో దృవీకరిస్తూ రికార్డుచేసి ఒక పేకెట్ లో సీలు చేయించి ఉంచి సేఫ్ లో భద్రపరుస్తారు. ఈ విషయంలో అయ్యే ఖర్చు మనమే భరించాలి. అవసరమైతే లాకరు కీ డిపాజిట్ లో ఉన్న డబ్బు దీనికి వాడేస్తారు. ఇలాంటి అన్ని విషయాలకు సంబంధించి ఒక స్టాంపుపేపరుమీద మీరు లాకరు తీసుకున్నరోజునే బ్యాంకువారితో ఒక ఎగ్రిమెంటుచేసుకుని ఉంటారు. ఆ విధంగా బ్యాంకు వారికి హక్కు ఉంటుంది.

లాకరులో ఉన్నవి అవసరానికి బయటకు తీసుకోవడం, లేదా ఇంకొకటి ఏమన్నా పెట్టుకోవడం వంటివి ఎవరిపేరుమీద లాకరు తీసుకున్నారో ఇంకా ఎవరికైనా అధికారం ఇస్తూ మేండేట్ బ్యాంకు వారి దగ్గర నిబంధనలప్రకారం ముందుగానే ఇచ్చివుంటే ఆటువంటివారికి మాత్రమే లాకరు తెరిచే అధికారం ఉంటుంది. మనకు విలువయిన ఆస్థిపత్రాలూ ఇతర లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్లు ఉంచుకోవడానికి ఉపయోగకరం. డబ్బు, బంగారం నగలు కూడా చాలామంది దాచుకుంటారు. ఎందుకంటే ఒకసారి మీరు ఆ లాకరు మూసేసిన తర్వాత మళ్లీ మీరూ బ్యాంకు అధికారీ ఇద్దరు తాళం తిప్పితేగానీ ఆ లాకరు తెరుచుకోబడదు. బ్యాంక్ అధికారి తన మాస్టర్ కీ తీసుకుని వెళ్లి పోతాడు. మీరు లాకరు గదిలోనే ఉండి మీ పని చూసుకోవచ్చు.

గోల్డ్ లోన్ – గుర్తుంచుకోండి కొన్ని విషయాలు

Gold Loan: Things to Keep in Mind Before Taking Gold Loan - Sakshi

మన దేశంలో అందరికి బంగారంపై మక్కువ ఎక్కువ. తరతరాల నుంచి బంగారాన్ని కొని దాచుకోవడం ఒక అలవాటు. ఇంట్లో ముఖ్యమైన వేడుకలు జరిగినప్పుడు బంగారం కొనుగోలుకు ఎక్కువ ఇష్టపడతారు. అలాగే ఇది ఒక ఆభరణంగా మాత్రమే కాకుండా తాత్కాలికంగా సమస్యలు ఎదురైనప్పుడు దీనిని తాకట్టు పెట్టి రుణాలు తీసుకుంటారు. ఇది చాలా సమస్యలను పరిష్కరించడానికి ఎక్కువ ఉపయోగిస్తారు. బ్యాంకులు, నాన్‌-బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీలు(ఎన్‌బీఎఫ్‌సీ) కూడా బంగారంపై రుణాలు ఇవ్వడానికి ఎక్కువ ఆసక్తి చూపుతాయి.

బంగారంపై రుణాలను జారీ చేసేందుకు బ్యాంకులు కూడా క్రెడిట్‌ స్కార్‌లను పరిగణలోకి తీసుకోవు. బంగారంపై రుణం ఇచ్చేటప్పుడు రుణ గ్రహిత తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని కూడా అంచనా వేయవు. ప్రస్తుతం మణప్పురం, ముత్తూట్‌ ఫైనాన్స్‌ వంటివి బంగారు రుణ వ్యాపారంపైనే ప్రధానంగా దృష్టి సారించాయి. అయితే మనం బంగారంపై కొన్ని విషయాలు గురుంచుకోండి.  

బ్యాంకులు వర్సెస్ ఎన్‌బీఎఫ్‌సీ
బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల మధ్య ఒక ముఖ్యమైన వ్యత్యాసం ఉంది. బ్యాంకులు తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తే ఎన్‌బీఎఫ్‌సీలు ఎక్కువ మొత్తంలో రుణాలు అందజేస్తాయి. అలాగే బ్యాంకులు ఎక్కువ మొత్తం రుణాలు అందజేస్తాయి. కాకపోతే బ్యాంకులతో పోలిస్తే వడ్డీరేటు 1 నుంచి 2 శాతం ఎక్కువ ఉంటుంది. ఉదాహారణకు మీ దగ్గర ఉన్న 20గ్రాముల బంగారానికి రుణాలు తీసుకుంటే బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీ రెండు వాస్తవిక బంగారం విలువలో 75 శాతం అందిస్తుంటాయి. మీకు ప్రభుత్వ బ్యాంకులు 10 గ్రాముల బంగారానికి రూ.40వేలు అందిస్తే, ఎన్‌బీఎఫ్‌సీలు కొంచెం ఎక్కువ అందించే అవకాశం ఉంటుంది. కానీ ఎన్‌బీఎఫ్‌సీల కంటే బ్యాంకులు తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తాయి. రుణ మంజూరు విషయంలో ఎన్‌బీఎఫ్‌సీలు ముందు ఉంటాయి. 

ఎలాంటి బంగారం తాకట్టు పెట్టొచ్చు?
బంగారం రుణం కావాలంటే బంగారం కనీస స్వచ్ఛత 18 క్యారెట్లు ఉండాలి. మనం సాధారణంగా ధరించే బంగారం 22 క్యారెట్లు ఉంటుంది. 18 క్యారెట్ల కంటే తక్కువ నాణ్యత ఉంటే బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు రుణాలు మంజూరు చేయవు. అభరణాలు, బంగారు నాణేలను తాకట్టు పెట్టవచ్చు కానీ బంగారు కడ్డీలపై చాలా బ్యాంకులు రుణాలు ఇవ్వవు. అలాగే తనఖా పెట్టిన అభరణాల్లో భాగమైన వజ్రాలు, రాళ్లకు విలువ ఉండదు. కేవలం బంగారం విలువను మాత్రమే లెక్కిస్తారు. నాణేల విషయంలో కూడా స్వేచ్ఛత అడగవచ్చు. 50 గ్రాముల కంటే ఎక్కువ బరువున్న నాణేలను అంగీకరించరు. బంగారంపై ఛార్జీలు బ్యాంకులను, ఫైనాన్సింగ్ సంస్థలను బట్టి మారుతుంటాయి. వ్యాల్యుయేషన్ ఛార్జెస్, ప్రాసెసింగ్ ఫీజ్ లాంటివి ఉంటాయి.

రీపేమెంట్ 
రుణం తిరిగి చెల్లించే విషయంలో రకరకాల ఆప్షన్లు ఉంటాయి. నెలవారీగా వాయిదాలలో(ఈఎంఐ) చెల్లించవచ్చు లేదా రుణ కాలపరిమితి ఉన్నంత వరకు వడ్డీని మాత్రమే చెల్లించి చివరలో ఒకేసారి మొత్తం రుణం చెల్లించవచ్చు. అసలుతో పాటు వడ్డీ కలిపి చివరలో చెల్లించవచ్చు. 

గోల్డ్ లోన్ చెల్లించకపోతే ఏమవుతుంది?
రుణాన్ని సమయానికి తిరిగి చెల్లించకెపోతే రుణదాతలకు మీ బంగారాన్ని విక్రయించే హక్కు ఉంటుంది. విక్రయించే ముందు బ్యాంకు లేదా ఫైనాన్సింగ్ సంస్థలు నోటీసులు ఇస్తాయి. బంగారం ధర పడిపోతే రుణదాత అదనపు బంగారాన్ని తాకట్టు పెట్టాలని బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల కోరే అవకాశం ఉంది. రుణం, బంగారం విలువ నిష్పత్తిని ఎప్పటికప్పుడు నిబంధనల మేరకు కొనసాగించాలని బ్యాంకులు కోరుతుంటాయి. 

సిబిల్ (CIBIL) స్కోర్

ఒక వ్యక్తి యొక్క అప్పు తీర్చు సమర్థత, క్రమశిక్షణల ప్రమాణమే సిబిల్ స్కోర్. ఇక్కడ అప్పు అంటే బ్యాంకు నుండి తీసుకున్న అప్పులే కాదు. క్రెడిట్ కార్డ్, ఫోన్ బిల్లు వంటి చెల్లింపులు కూడా.

వెరసి మీ ప్యాన్ కార్డుకు అనుసంధానమై ఉన్న ప్రతి ఒక్క ఖాతా, సేవల లావాదేవీల చరిత్ర మొత్తాన్ని కూర్చి, అందులో మీరు సమయానికి కట్టినవి, సమయానికి కట్టనివి, కట్టకుండా ఎగవేసినవి (ఏవైనా ఉంటే) ఇలా వర్గీకరించి, తదనుగుణంగా ఒక స్కోర్‌ను ఆపాదిస్తారు.

అంతే కాక, మీ స్కోర్ కొరకు వివిధ సంస్థలు సిబిల్ వారిని ఎక్కువ సార్లు విచారించినట్లైతే (మీరు రుణం కొరకు బాగా ప్రయత్నిస్తున్నందున మీ చెల్లింపు సామర్థ్యం తగ్గే అవకాశం ఉన్నది కాబట్టి) స్కోర్‌పై ప్రతికూల ప్రభావం ఉంటుంది.

దేశంలో ఆర్థిక, సంబంధిత సేవాసంస్థలు (బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు, స్టాక్ మార్కెట్ బ్రోకర్లు, పోస్ట్‌పెయిడ్ మొబైల్ సేవ, వగైరా) మీ ఈ స్కోర్ బట్టి మీరు అప్పు కోసం చేసిన దరఖాస్తును ఆమోదిస్తారు.

ఈ స్కోర్ ఎంత ఎక్కువుంటే అంత మంచిది. 750కి పైన ఉంటే మీరు దరఖాస్తు చేసుకున్న అప్పు సులభంగా వస్తుంది. చాలా మందికి తెలియనిది – మీ స్కోర్ 750 పైన ఉంటే మీరు తీసుకునే అప్పుపై వడ్డీ గురించి నిక్కచ్చిగా బేరమాడవచ్చు.

బ్యాడ్ సిబిల్ స్కోర్‌ని ఎలా సరిజేసుకోవాలి?

దీనికి ఒకటే మార్గం – మీ రుణ వాయిదాలు, బిల్లులు అన్నీ సమయానికి కట్టేయటం. కాస్త సమయం పట్టినా స్కోర్ మెరుగు పడుతుంది.