పూల మొక్కలు

 • దేశీయ మందారం ( నాటు మందార)

ఇది రేఖ మందారం… ఇందులో ముద్ద మందారం ఉంటుంది.

ప్రత్తి మందారం

పొద్దున్న తెల్లగా… సాయంత్రానికి గులాబీ రంగులోకి మారిపోతుంది.

సముద్ర మందార ( sea hibiscus)

ఇది కూడా ఇంతే …పొద్దున్న పసుపు రంగులో.. సాయంత్రానికి కుంకుమ రంగులో కి మారుతుంది.

పైన చెప్పిన మందార రకాలు చాలా సులభంగా పెంచవచ్చు… ఒకసారి మనం వేస్తే, ఇంకో పాతిక, ముప్పై సంవత్సరాలు చూసుకోవలసిన అవసరం రాదు.

వీటికి వచ్చే చీడ పీడలు గురించి సమాధానం చివరలో వివరిస్తాను.

గమనిక:

కొత్తగా అన్ని రకాల రంగులలోను మందారాలు దొరుకుతున్నాయి…ఇవన్నీ కూడా చైనా దేశం నుంచి వచ్చినవి. వాటిని చైనా రోజ్ అని పిలుస్తారు. వాటికి రోగ నిరోధకశక్తి తక్కువ గా ఉండటం వల్ల 2 లేదా 3 సంవత్సరాలకే రోగాల బారిన పడి చనిపోతున్నాయి. కాబట్టి వాటిని గుర్చి ఇక్కడ ప్రస్తావించడం లేదు.

 • నంది వర్ధనం / గరుడ వర్ధనం

ఈ మొక్కను చాలా చోట్ల చూసే ఉంటారు…

 • చుక్క మల్లి
 • కరివేరు

ఇవి 5 లేదా 6 రకాల రంగులలో దొరుకుతాయి

 • బిళ్ళ గన్నేరు

ఇవి కూడా చాలా రంగులలో దొరుకుతాయి… వీటికి ఎరువులు ఎక్కువగా అందించాల్సిన అవసరం ఉంది… వీటిని ఆయుర్వేదం లో కూడా ఉపయోగిస్తారు.

 • చామంతి

ఇవి కేవలం చలికాలం లోనే పూస్తాయి… కానీ పెంచడం చాలా తేలిక…NASA వాళ్ళు చేసిన CLEAN AIR STUDY లో మొత్తం 10 మొక్కలను ప్రస్తావించారు… అందులో చామంతి ఒకటి…

ఇది వాతావరణం లో ఉండే అన్ని రకాల రసాయనాలను, విష గాలులను (బెంజీన్ ,ఫార్మాల్డిహైడ్ , ట్రైక్లోరెథైలీన్ , జిలీన్, టోలున్ , అమ్మోనియం) వడపోసి చక్కని గాలిని వదులుతుంది.

 • పీస్ లిల్లీ

ఇది కూడా సులభం గా పెరుగుతుంది NASA CLEAN AIR STUDY లో ఈ మొక్క కూడా ఉన్నది.

 • శంకు పుష్పం

ఇందులో కూడా 3 లేదా 4 రకాల రంగులు ఉంటాయి…

ఈ పూలను ఎండపెట్టి , టీ చేసుకొంటారు. అలాగే చామంతి పూలను కూడా ఎండపెట్టీ టీ చేసుకొంటారు…

విదేశాల్లో ఈ టీ లకు చాలా గిరాకీ ఉంది,

ఇప్పుడు ఇప్పుడే ఈ టీ లకు మన దేశం లో గిరాకీ పెరుగుతుంది.

 • బౌగైన్విల్లే (Bougainville)

మనం కాగితం పూలు అంటాం కదా… అవి

ఇందులో చాలా రంగులు ఉంటాయి…

 • గుత్తి పువ్వుల చెట్టు

ఇందులో చాలా రంగులు , మరగుజ్జు రకాలు కూడా ఉన్నాయి.

 • పారిజాతం

పురాణాల ప్రకారం క్షీర సాగర మధనం లో, పాల కడలి నుంచి ఉద్భవించినది.

సాక్షాత్తు లక్ష్మి స్వరూపం గా ఈ చెట్టు నీ బావిస్తారు. ఈ చెట్టు పువ్వులు కోయరు, కింద పడినవి మాత్రమే తీసి దేవుడికి అలంకరిస్తారు.

పెంచడం చాలా సులభం…

ఇకపోతే పై మొక్కలను ఆశించే చీడ పీడల గురించి

ఈ పై మొక్కలను ఎక్కువ గా ఆశించే కీటకాలు రెండు ఉన్నాయి

 • గొంగళి పురుగు
 • పిండి నల్లి

గొంగళి పురుగు తీసి దూరంగా పారవేయవచ్చు. అలా చేయలేక పోతే, ఈ రెంటికీ వాడే రసాయన మందు ఒకటి తేపుతాను propinophos ఇది అన్ని పురుగు మందుల కొట్టులలో దొరుకును. 5ml మందును 1 లీటరు నీటికి కలిపి పిచికారీ చేయవచ్చు. వీటికి పట్టే అన్ని రకాల పురుగులకు చాలా సమర్థవంతంగా పనిచేయును.

వేప నూనె లాంటి సేంద్రియ పురుగు మందులు పని చేస్తాయి గానీ, సమయం ఎక్కువ తీసుకొంటాయి.

Fruity Koja Flowers…… బిళ్లగన్నేరు పొద

fruity kojaFruity Koja Flowers…… బిళ్లగన్నేరు పొద సీతాకోక చిలుకలకు ప్రియనేస్తం…
స్వచ్ఛమైన లేత గులాబీ రంగు పూలతో విభిన్నంగా, మనోహరంగా కనిపించే పొద గులాబీ గరుడవర్థనం. దీన్ని గులాబీ కాప్సియా అనీ, బిళ్లగన్నేరు పొద అనీ అంటారు. దీని శాస్త్రీయనామం కాప్సియా ఫ్రూటీకోజా లేదా సెర్బెరా ఫ్రూట్‌కోజా.
గులాబీ గరుడవర్థనం నెమ్మదిగా పెరిగే పెద్దపొద. సుమారు పది అడుగుల ఎత్తు వరకూ పెరుగుతుంది. గుబురుగా కాకుండా వ్యాపించినట్లుండే కొమ్మలతో ఉంటుంది. దీని ఆకులు కోలగా, లేతాకుపచ్చరంగులో ప్రస్ఫుటంగా కనిపించే ఈనెలతో ఉంటాయి. దీని పూలు లేత గులాబీ రంగులో ఐదురెక్కలతో, ముదురు గులాబీ కంఠంతో నాజూగ్గా ఉంటాయి. ఇవి గరుడవర్థనాలను, బిళ్లగన్నేరు(వింకారోజియా)పూలను తలపించడమే కాదు. చిన్న సైజులో ఉన్న స్వర్ణగన్నేరు (ఫ్లుమేరియా) పూలా అని భ్రమింపచేస్తాయి కూడా.
వెలుతురు కావాలి
గులాబీ గరుడ వర్థనానికి సారవంతమైన మట్టి మిశ్రమం కావాలి. నేల ఎప్పుడూ తేమగా ఉంటే ఈ మొక్క అంత ఆనందంగా ఉంటుంది. నీరు సరిగా లేకున్నా సర్దుకుపోతుంది కూడా. ఎక్కువగా కత్తిరించడాన్ని ఈ మొక్క ఇష్టపడదు. అలా చేస్తే గిడసబారిపోయి బలహీనంగానూ, వికారంగానూ తయారవడమే కాదు, పూలు పూయడం కూడా బాగా తగ్గిపోతుంది. దీనికి సూర్యకాంతి కూడా ఎక్కువే కావాలి. కొద్దిపాటి నీడను తట్టుకుంటుంది గానీ రోజులో సగంసేపైనా వెలుతురు సరిగా సోకకపోతే పూలు సరిగారావు. ఏడాదంతా పూస్తుంది…
కొమ్మల చివరన వదులుగా ఉండే చిన్న చిన్న గుత్తుల్లో పూసే ఈ మొక్క సంవత్సరమంతా పూస్తూనే ఉంటుంది. గులాబీ గరుడవర్థనం గుంపుల్లో నాటుకోవడానికి చాలా బాగుంటుంది. కుండీలోనూ దీన్ని చక్కగా పెంచుకోవచ్చు. దీన్ని గొంగళి పురుగుల వంటివి తప్ప మరీ ఇబ్బంది పెట్టే చీడపీడలేవీ ఆశించవు. వాటిని కూడా వేపకషాయం అప్పుడప్పుడూ చల్లుతూ నియంత్రణలో ఉంచుకోవచ్చు. దీనికి రెండునెలలకోసారి ఎన్‌పీకే ఉండే సమగ్ర ఎరవును కొద్దిగా వేస్తుంటే సరిపోతుంది. వాడేసిన టీ పొడి, కాఫీ పొడి మట్టి మిశ్రమంలో కలిపితే మంచిది. దీన్ని విత్తనాల ద్వారానూ, కొమ్మంట్లు కత్తిరింపుల ద్వారానూ ప్రవర్థనం చేయవచ్చు. మరోవిషయం ఈ గులాబీ గరుడవర్థనం సీతాకోక చిలుకలకు కూడా ప్రియనేస్తమే!

సొగసరి సాల్వియా

సొగసరి సాల్వియా

వర్షాకాలపు ఆహ్లాదకరమైన వాతావరణానికి ప్రకాశవంతమైన రంగుల సొగసుని జోడించే మొక్కల్లో ఎర్రసాల్వియా ప్రధానమైనది. ఎర్ర సాల్వియా శాస్త్రీయనామం సాల్వియా స్పెండెన్స్‌. అడుగు నుంచి రెండడుగుల ఎత్తువరకూ పెరిగే ఈ మొక్కను అన్ని రుతువుల్లోనూ నాటుకోవచ్చు.
సీజనల్‌ మొక్కలో ఎక్కువకాలం పూసే మొక్క ఇది. కొన్ని ప్రాంతాల్లో బహువార్షికంగానూ పెరుగుతుంది. ప్రకాశవంతమైన ఆకుపచ్చని ఆకులు, మురిపించేఎరుపు రంగులో కంకుల్లో పూసే పూలతో సాల్వియా కనువిందు చేస్తుంది. బాగా వెలుతురులో పెరిగే ఈ మొక్క కొద్దిపాటి నీడలోనూ చక్కగా పెరుగుతుంది.
సారవంతమైన, నీరు నిలవని మట్టి మిశ్రమం దీనికి అనువుగా ఉంటుంది. నేల పొడిబారినా, నీళ్లు నిలిచినా సాల్వియాకు నచ్చదు. వర్షాలు పడగానే సాల్వియాను నాటుకోవచ్చు. దీనిని ముందుగా నారు పోసుకుని కావలసిన చోట నాటుకుంటారు. బెడ్‌ను ఆరు అంగుళాల లోతువరకూ తవ్వుకొని పశువుల ఎరువు లేదా వర్మీకంపోస్టు, వేపపిండి, కొద్దిగా సూపర్‌ఫాస్ఫేటు, కలుపుకోవాలి. చదునుచేసుకొని మొక్కను నాటుకోవాలి. పది నుంచి పన్నెండు అడుగుల ఎడంతో నాటాలి. ఆపై రెండు అంగుళాల లోతువరకూ తడిచేలా నీరు పెట్టుకోవాలి.
వరుసల్లో అందంగా...
దీనికి ఎన్‌పీకే ఉండే సమగ్ర ఎరువును అందించాలి. కొబ్బరిపొట్టు లేదా ఎండాకులతో మల్చింగ్‌ వేసుకుంటే తేమ ఆవిరైపోదు. కలుపూరాదు. బెడ్‌ల్లో నాటినప్పుడు నిటారుగా పెరిగే చిన్న చిన్న కంకుల్లో, ఎర్రని పూలతో నిండుగా ఎర్ర తివాచీలా కనిపిస్తుంది బోర్డరుగాను, కుండీల్లోకి, మిశ్రమాల్లో నాటడానికీ ఇది బాగుంటుంది.
ఎన్నో రంగుల్లో
పూలు పూయడం అయిపోయాక కంకులను ఎప్పటికప్పుడు కత్తిరించేస్తుంటే ఎక్కువ పూలతో పాటు ఎక్కువ రోజులూ పూస్తుంది. అలాగే ఈ అయిపోయిన కంకులను తీసేయకపోతే, బోట్రైటిస్‌ తెగులతో పాటు, రసం పీల్చే పురుగులు ఆశించే ప్రమాదం ఎక్కువే. సేంద్రియ కషాయాన్ని క్రమం తప్పకుండా చల్లుకోవాలి. ఆకులు పసుపుపచ్చగా మారి వాలిపోతుంటే కొంచెం నీళ్లు ఎక్కువ ఇవ్వాలి.
దీన్ని ఎర్ర సాల్వియా అని పిలిచినా తెలుపు, గులాబీ, లావెండర్‌, వూదా, నారింజ వంటి అనేక రంగుల్లో పూసే రకాలున్నాయి. నిండు రంగులు వేడి ప్రదేశాలకు అనువుగా ఉంటాయి. శీతల ప్రాంతాల్లో అన్ని రంగుల రకాలూ చక్కగా పెరుగుతాయి. గొట్టాలవంటి సాల్వియా పూలు మకరందానికి నెలవులు. అందుకే సీతాకోక చిలుకలూ, హమ్మింగ్‌ పిట్టలూ సాల్వియాల చుట్టూ ప్రదక్షిణం చేస్తుంటాయి. తాజాపూలనే కాదు, పూలకంకులను నీడలో ఎండబెట్టి కూడా అలంకరణలో వాడవచ్చు.
సాల్వియాలను విత్తనాలతో సులువుగా ప్రవర్థనం చేసుకోవచ్చు. సంచుల్లో పెంచిన మొక్కలతోపాటు పెద్ద నర్సరీలలో నారు కూడా దొరుకుతుంది.

డిసెంబరాలు

డిసెంబరాలు

డిసెంబరాలు ఊదా, లావెండర్ రంగులలో ఊదా తెలుపు చారలతో ఉండే నాజూకైన పూలతో సంక్రాంతి సమయంలో విరగబూసే డిసెంబరాలు తెలియని తెలుగు ఆడపడుచులుండరేమో. వీటిని గొబ్బిపూలు, పెద్దగోరింట అని కూడా అంటారు. ఫిలిఫైన్స్ వయోలెట్, బ్లూబెల్, బర్లేరియా అని కూడా పిలుస్తారు. వీటి శాస్త్రీయనామం బర్లేరియా క్రిస్టేటా. డిసెంబరాల జన్మస్థానం మనదేశమే. పల్లెటూళ్లలో ఇళ్లముందు రోడ్లపక్కగా ఎక్కువగా కనిపించే మొక్కలు ఇవి. ఈ పూలను ఎక్కువగా మాలలు కట్టి జడలో అంకరించుకోవడానికి, దేవుడికి అర్పించడానికీ వాడతారు. విపరీతంగా పూసే ఈ పూలు లేత రంగులో ఆహ్లాదకరంగా ఉండటమే కాకుండా ఎన్ని పెట్టుకున్నా బరువనిపించవు. ఇక చాలనిపించవు. డిసెంబరాలు రెండు నుంచి మూడు అడుగుల ఎత్తువరకు పెరిగే చిన్న పొద. ఆకులపైవైపు కంటే కిందివైపు లేత రంగులో ఉంటాయి. గరాటు ఆకారంలో గుత్తులుగా పూసే పూలుసాధారణంగా ఊదా, గులాబీ రంగుల్లో ఉంటాయి. అలాగే తెలుపు రంగులోపూసే అల్ఫారకం కూడా సాధారణమే. ఇది ఎండతోపాటు కొద్దపాటి నీడలో కూడా పెరుగుతుంది. చీడపీడలు తక్కువే……. డిసెంబరాలు తేమగా ఉన్నచోట చక్కగా పెరుగుతాయి. అయితే నీళ్లు నిలవకూడదు. పూలు పూసిన వెంటనే కత్తిరిస్తూ ఉంటే మంచిది. ఎండలలో తప్ప సంవత్సరం అంతా పూసే ఈ మొక్క డిసెంబరు మాసంలో విపరీతంగా పూయడం వల్ల దీనికి డిసెంబరాలు అనే పేరు వాడుకలో ఉంది. దీన్ని అప్పుడప్పుడూ కత్తిరిస్తూ ఉంటే క్రమపద్ధతిలో గుబురుగా పెరుగుతుంది. అలాగే కత్తిరించి వేర్వేరు ఆకారాల్లో పెంచుకోవడానికి కూడా అనువుగా ఉంటుంది. బోర్డరుగా పెంచుకున్నా చక్కగా ఉంటుంది. రెండు మొక్కలు కుండీల్లో నాటుకుంటే పూజకు పూలగురించి ఆలోచించనవసరం లేదు. డిసెంబరాలుకు చీడపీడలు తక్కువే. రసంపీల్చే పురుగులు ఆశించకుండా అప్పుడప్పుడూ ఆకు కషాయం చల్లుతూ ఉంటే సరిపోతుంది. అక్టోబర్ నుంచి రెండు వారాలకోసారి పాలీఫెడ్ వంటి సమగ్ర ఎరువును నీళ్లలో కలిపి పోస్తుంటే బాగాపూస్తుంది. వర్మీకం పోస్టు ఎముకలపొడి, వర్మీవాష్ వంటి సేంద్రియ ఎరువులను ఉపయోగించినా ఫరవాలేదు. డిసెంబరాలను గింజలు, కొమ్మ కత్తిరింపులు, పిలకలు, ఇలా వేటి ద్వారానైనా సరే సులువుగా ప్రవర్థనం చేయవచ్చు. తేనెటీగలను, సీతాకోకచిలుకలను, హమ్మింగ్ పక్షులను విపరీతంగా ఆకర్షించే డిసెంబరాలకు ఔషధగుణం కూడా ఎక్కువే. ఆకుల రసాన్ని కాలిన గాయాలకు వాపు తగ్గడానికి రాస్తారు. దీని గింజలను పాముకాటుకు విరుగుడుగా వాడతారు.

Firespike……అగ్నిశిఖ

firespikeఅగ్నిశిఖ మెరిసే నిండాకుపచ్చరంగులో సున్నితమైన పెద్ద పెద్ద ఆకులతో ప్రకాశవంతమైన పండుమిరప ఎరుపు రంగులో కంకుల్లో పూసే గొట్టాలాంటి సన్నని పూలతో లాంటి స్థలాన్నైనా వర్ణభరితం చేయగల మొక్కలే అగ్నిశిఖ ఒకటి. దీని శాస్త్రీయనామం బడాంటోనియా లాంగిఫోలియం లేదా జస్టీషియా ట్యూబిఫార్మస్ . దీన్ని ఫైర్ స్పైక్ అని, స్కార్లెట్ ఫ్లేమ్ అనికూడా అంటారు.
అగ్నశిఖ లేత కొమ్మలతో మూడు నుంచి నాలుగు అడుగల ఎత్తువరకు పెరిగే బహువార్షికం. సరైన మట్టిమిశ్రమంలో ఒకసారి నాటితే తర్వాత అట్టే పట్టించుకోనవసరం లేని మొక్క ఇది. కంపోస్టు లేదా పశువుల ఎరువు ఎక్కుగా ఉండే సారవంతమైన నీరు నిలవని మట్టి మిశ్రమంలో ఇది బాగా పెరుగుతుంది. నీటి ఎద్దడిని తట్టుకున్నా కొంచెం తేమ ఉంటే దీనికి సరిపోతుంది. వేగంగా పెరిగే ఈ మొక్క సూటిగా ఎండపడనిచోట చక్కగా పెరుగుతుంది.
పెద్ద పెద్ద తొటల్లో చెట్లకింద గుంపుగాను, బోర్డరుగానూ పెంచుకోవడానికి ఇది అత్యంత అనువుగా ఉంటుంది. కుండీల్లో ఇతర మొక్కలతో కలిపి నాటుకుంటే చాలాబాగుంటుంది. బోర్డరుగా నాటుకునేటప్పుడు రెండేసి అడుగుల దూరంతో ఉండేలా చూసుకుంటే రెండుమూడు సంవత్సరాల్లో ఆకుపచ్చని గోడలాగా పెరిగి ప్రకాశవంతమైన ఎర్రని పూలతో అద్భుతంగా ఉంటుంది. ఎలాంటి నేలయినా…..
అగ్నిశిఖ దాదాపు ఎలాంటి నేలలోనైనా పెరుగుతుంది. వర్షాకాలం, చలికాలం అంతా పూస్తూనే ఉంటుంది. ఒక సారి పూస్తే ఈ పూలు ఎక్కువకాలం తాజాగా నిలిచి ఉంటాయి. నీడను తట్టుకునే మొక్కల్లో ఇంత నిండురంగుల్లో పూలుపూసే మొక్కలు సాధారణంగా అరుదు. ఈ పూల కంకులను ఫ్లవర్ వాజులలో కూడా చక్కగా అమర్చుకోవచ్చు. ఇది వేగంగా పెరుగుతుంది. కనుక ఇతరమొక్కల మీద ఆధిక్యత ప్రదర్శించకుండా దీన్ని అదుపులో ఉంచడం తప్పనిసరి. క్రమం తప్పకుండా తేలిగ్గా గానీ, సంవత్సరానికి రెండు మూడుసార్లు బాగా కిందకి కత్తిరిస్తూ ఉంటే ఒక క్రమపద్ధతిలో పెరిగి అందంగా ఉంటుంది. అంతేకాదు. ఈ మొక్కకు పూలు కొమ్మల చివర్లలో, ఆకు గ్రేవాల్లో రావటం వల్ల కత్తిరిస్తే ఉంటే ఒక ఎక్కువపూలు పూస్తాయి.
చీడపీడలు అంతగా ఆశించని ఈ మొక్కకు ఆకుకషాయాలు అప్పడప్పుడూ చల్లుతూ ఉంటే రసం పీల్చే పురుగులు కూడా పెద్దగా నష్టం కలిగించలేవు. పూలు పూసే సమయంలో వర్మీవాష్ వంటి సేంద్రీయ ఎరువులు నెలకోసారి చల్లుతూ ఉంటే పూలు విపరీతంగా వస్తాయి. పూలు పూయడం మొదలెట్టగానే అద్భుతంగా మారిపోతుంది. ఆకుపచ్చని నిండు ఎరుపులతో ప్రకాశవంతమైన వర్ణ మిశ్రమంతో ప్రత్యేకంగా కనిపించడంతో పాటు సీతాకోక చిలుకలు, హమ్మింగ్ పిట్టలు, తేనెటీగల సందడితో ఒక్కసారిగా పరిసరాలను సమ్మోహనం చేస్తుంది. అలాగే బట్టర్ ఫ్లై గార్డెన్లలలో నాటటానికి ఈ మొక్క ఒక మంచి ఎంపిక.
సులువుగా పెంచగలిగిన ఈ మొక్క ప్రవర్ధనానికి కూడా కష్టపడక్కరలేదు. కొమ్మ కత్తిరింపులను నాటినా, కుదురును విడదీసి నాటినా మరుసటి సంవత్సరానికే పూలతో మీ తోటకు రంగులు వేసేందుకు సంసిద్ధమైపోతుంది.

జాకోబినియా

jacobiniaనీడలో కూడా అతితక్కువ అందమైనే పూలతో కనువిందుచేయగల అతితక్కువ రకాలలో జాకోబినాయా కూడా ఒకటి. మన ప్రాంతానికి అనువైన మొక్క ఇది. జాకోబినియాను బ్రెజీలియన్ ఫ్లూమ్ అని కూడా అంటారు. దీని శాస్త్రీయనామం జస్తీషియా కార్నియా. ఇది నీడలో పెరిగే చిన్నపొద. రెండు నుండి మూడు అడుగుల ఎత్తువరకూ పెరుగుతుంది.
అండాకారంలో ఉండే పెద్ద పెద్ద ఆకులతో ఎప్పుడూ పచ్చగా ఉంటుంది. కంకులవంటి పూల గుత్తులు, ఆకర్షణీయమైన తెలుపు, లేత గులాబీ, నిండుగులాబీ, పసుపువంటి రంగులతో ముచ్చటగా ఆకట్టుకుంటాయి. నీరు నిలవని సారవంతమైన తేమగా ఉండే మట్టిమిశ్రమం జాకోబినియాలకు అత్యంత అనుకూలం. క్రమం తప్పకుండా నీళ్లుపోయాలి. కానీ మరి ఎక్కువ పోయకూడదు. నీరు మరీ ఎక్కువైనా తక్కువైనా ఆకులు కాలిపోయి మొక్క దెబ్బతింటుంది.
ఎండలో పెరిగినా నీడకూడా దీనికి ఎక్కువ అనువుగా ఉంటుంది. ఇది వేగంగా పెరిగే మొక్క. జాకోబినియాను గుంపులుగా వాడటానికి బొర్డరుగా నాటడానికి చాలా బాగుంటుంది. ఇది హైడ్రాంజియా ఫ్లెక్లాంధస్, ఫెరన్, కమేలియాలతో కలిపి నాటినపుడు చక్కగా ఉంటుంది. ధవళ వర్ణంలో పూలు పూసే రకమైతే వెండి రంగు ఆకులుండే ఫ్లెక్లాంధస్ ఫైలియా రకాలతో కలిపితే అద్భుతంగా కనిపిస్తుంది.
ఏడాదంతా….
జాకోబినియా సంవత్సరమంతా పూస్తూనే ఉంటుంది. కొత్తగా వచ్చే కొమ్మలకే పూలు వస్తాయి. అందుకే పూలు పూయడం అయిపోయిన కొమ్మలను ఎప్పటికప్పుడు కత్తిరిస్తూ ఉంటే చిగుళ్లు వచ్చి పూలు బాగా రావడమే కాకుండా మొక్కకూడా ముద్దుగా గుబురుగా పెరుగుతుంది.
బాల్కనీలకు, వరండాలకు చెట్లకింద నీడలో పెంచుకోవటానికి అత్యంత అనుబైన మొక్కను కుండీలలో పెంచుకున్నపుడు అప్పుడప్పుడూ గదుల్లో కూడా అమర్చుకోవచ్చు. ఎన్ పీ కె ఉండే సమగ్ర ఎరువును నెలకోసారి వేస్తుంటే సరిపోతుంది. అశ్రద్ధ చేసినా తట్టుకునే ఈ మొక్క చక్కగా ఎరువులు వేసి నీళ్ళుపోస్తే ఆనందంగా పెరిగి విరగబూస్తుంది. అప్పుడప్పుడూ నీళ్లు పిచికారీ చేస్తూ ఉంటే తాజాగా ఉంటుంది.
జాకోబినియాలను కత్తిరింపులతో సులువుగా ప్రవర్థనం చేయవచ్చు. గింజలు మొలకెత్తడానికి వెలుతురు కావాలి. అందుకే గింజలను మట్టితో కప్పకూడదు. ఇరవై నుంచి ఇరవై అయిదు రోజుల్లో మొలకలు వస్తాయి. ఏ తోటకైనా అందాన్నిచ్చే జాకోబినియాలు సీతాకోక చిలుకలకు సైతం ఆప్తబంధువులే

గడ్డిగులాబి

portulaka, Gross Roseపోర్చులక, నాచుమొక్క, గడ్డిగులాబి….. ఈ మొక్కలు ఎలాంటి ల్యాండ్ స్కేప్ లోనైనా అత్యంత సహజంగా పెరిగి అందరినీ ఆకట్టుకొంటుంది. దీన్నే సన్ రోజ్ మాస్ రోజ్ అనికూడా అంటారు. ఈ మొక్కలు పూర్తిగా సూర్యకాంతిలో పెరుగుతాయి. గడ్డిగులాబీ శాస్త్రీయనామం పోర్చులక. వీటిలో గ్రాండీఫ్లోరా. ఒలరేషియా రకాలుంటాయి. గ్రాండీఫ్లోరా ఆకులు సన్నగా సూదుల్లాగా ఉంటాయి. ఒలరేషియా ఆకులు కొంచెం కోలగా ఉంటాయి. ఒలరేషియా ఆకులను సలాడ్లలో కూడా వాడతారు. వీటి గింజలను కూడా సలాడ్లలో సూపులలో వాడతారు. మనం ఆకుకూరగా వాడే గంగపాయల కూరకు ఇది సమీప బంధువు.
నీటిని నిల్వ ఉంచుకుంటుంది
ఈ మొక్కలు అన్ని నేలల్లోనూ పెరిగినా ఇసుక కలిసిన, నీరు, నిలవని మట్టి మిశ్రమం దీనికి అనుకూలం. నిస్సారమైన నేలల్లో కూడా ఈ మొక్కలు చక్కగా పెరుగుతాయి. నీటి ఎద్దడిని తట్టుకోవడంలో కూడా దీనికిదే సాటి. ఒకసారి చిన్నమొక్కనో, గింజనో నాటితే దానంతట అదే చుట్టూ వ్యాపిస్తుంది. మందంగా ఉండే దీని ఆకులు నీటిని నిల్వ ఉంచుకుంటాయి. కనుక తరచూ నీళ్లు పోయనవసరం లేదు. నీళ్లు పోసినప్పుడు కూడా పైపైన పోస్తే చాలు. ఎందుకంటే దీని వేళ్లు ఎక్కువ లోతుకు వెళ్లవు. రాళ్లమధ్య కొంచెం మట్టిలో నాటినా చక్కగా పెరిగి అందమైన పూలతో కనువిందు చేస్తాయి. గులాబీ, ఎరుపు, పసుపు, నారింజ, వంగపూవు రంగు, మీగడ రంగు, తెలుపు ఇలా ఈ పూలు ఎన్నో రంగులలో విరబూస్తాయి. వాటన్నింటిని కలిపి నాటితే ఇంద్రధనస్సు మీ ముంగిట్లో పరచుకున్నట్లే కనువిందు చేస్తుంది.
ఎడాదంతా పూలు
ఈ మొక్క మూడునుంచి నాలుగు అంగుళాల ఎత్తులో పెరిగి దాదాపు రెండు అడుగుల వరకూ వ్యాపిస్తుంది. నిజానికి ఏకవార్షికం. అయితే ఎప్పటికప్పుడే విత్తనాలు పడి పెరుగుతూ బహువార్షికాన్ని తలపిస్తుంది. దీని ఆకులు ముదురు రంగుల్లోనూ కొమ్మలు కొద్దిగా ఎరుపురంగు కలిసిన పసుపు రంగులోను ఉంటాయి. పగలు విచ్చుకుని రాత్రికి ముడుచుకునే వీటిపూలు ఆకారంలో కాక్టస్ పూలను పోలి ఉంటాయి. ఈ పూలు ఒంటి రెక్కలతో ఉన్నా ముద్దగా ఉన్నా ఒకే రంగులోనైనా, మిశ్రమ రంగులలోనైనా వీటికివే సాటి. ఈ మొక్కలను లాన్ పక్కన, బోర్డరుగాను, గ్రౌండ్ కవర్ గాను, బెడ్లలో, రాకరీల్లో, కుండీలలో, వేలాడే కుండీలలో, మిశ్రమ అమరికల్లో పెంచినా కూడ ఇట్టే ఒదిగిపోతుంది. సులువుగా పెంచుకోవచ్చు
కటింగ్ ద్వారాగానీ, గింజల ద్వారాగానీ, దీన్ని సులువుగా ప్రవర్థనం చేయవచ్చు. దీన్ని నాటినప్పుడు కొద్దిగా డి ఏ పి, తర్వాత పూలు పూస్తున్నప్పుడు సింగిల్ సూపర్ ఫాస్పేట్ ఎరువుని కొద్దికొద్దిగా వేస్తే చాలు. లేదా వర్మీకం పోస్టు, కోడిగుడ్డు పెంకులను మట్టిలో కలిపినా సరిపోతుంది. ఈ మొక్కకు చీడపీడలు పెద్దగా ఆశించవు. వేరుకుళ్లు మాత్రం ఆశించవచ్చు. అందుకే నీళ్లు నిలవకుండా చూసుకోవడం చాలా అవసరం. మరీ గుబురుగా అల్లుకుపోతుంది. కనుక మధ్య మధ్య కొన్ని కొమ్మలు తీసేస్తే గానీ గాలి సరిగా తగలదు. అప్పుడే తెగుళ్లు రాకుండా ఉంటాయి. ఈ గడ్డి గులాబీలు అతిసాధారణమైనవైనా వీటిని చూస్తుంటే ఆ విషయమే గుర్తుకు రాదు. ఎవరి చూపులనైనా ఇట్టే కట్టిపడేస్తాయనవి. వీటి అందం మిరుమిట్లు గొలిపేలా కాకుండా పసిపిల్లల్ని చూసినంత ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక గడ్డి గులాబీలున్నప్పుడు తోటను సీతాకోకచిలుకలు ఇట్టే శాశ్వతస్థావరం చేసుకుంటాయి.

పున్నమి చంద్రుడు

punnami chandruduతక్కువ శ్రద్ధతో, సులువుగా పెంచుకోగలిగిన అందమైన మొక్కల్లో మరొకటి పున్నమి చంద్రుడు. దీన్ని ‘‘మ్యూజికల్ నోట్’’ అనీ, ‘‘మార్నింగ్ కిస్’’ అనికూడా అంటారు. దీని శాస్త్రీయనామం క్లీరో డెండ్రమ్ ఇన్సిజమ్
పున్నమి చంద్రుడు 2 నుంచి 3 అడుగుల ఎత్తువరకు పెరగగల చిన్నపొద. పచ్చని ఆకులతో గుబురుగా పెరుగుతుంది. దీని ఆకులు రంపపు పళ్లవంటి అంచులతో ఉంటాయి. ఈ మొక్క ప్రత్యేకత అంతా దీని పూలు, మొగ్గలే. ఈ మొగ్గల సన్నని పొడవాటి కాడల చివర గుండ్రని బిళ్ళల్లాగా ‘‘మ్యూజికల్ నోట్’’ ఆకారంలో ఉండటం వల్ల దీనికా పేరు వచ్చింది. దీని పూలు అందంగా, తెల్లగా ఉండి గుత్తులుగా విరగబూస్తాయి. ఇవి రాత్రిపూట విచ్చుకుంటాయి. పున్నమి వెన్నెలను తలపించేలా రాత్రిపూట తెల్లని పూలు, మొగ్గలతో నిండి ఉండటవం వలన దీన్ని ‘‘పున్నమి చంద్రుడు’’ అంటారు. దీని కేసరాలు సన్నగా, పొడవుగా, ఎరుపురంగులో పూలలో నుంచి బయటకు వచ్చి అందంగా కనిపిస్తాయి.
డాది పొడవునా….
పున్నమిచంద్రుడు తక్కువ శ్రద్ధతో పెరిగే మొక్క. పూర్తి సూర్యకాంతిలో పెరిగినా కొద్దిపాటి నీడను తట్టుకుంటుంది కూడా. నీరు నిలవని సారవంతమైన మట్టి మిశ్రమంలో చక్కగా పెరుగుతుంది. తక్కువగా అయినా క్రమం తప్పకుండా నీరు పోయడం మంచిది. ఈ మొక్కను విడిగా నాటుకున్నా గుంపుగా నాటుకున్నా బోర్డరుగా పెంచుకున్నా, ఇతర రంగుపూల మొక్కలతో కలిపి పెంచుకున్నా చక్కగా ఉంటుంది. కుండీల్లో కూడా సులువుగా పెంచుకోవచ్చు. ఇది సంవత్సరం పొడవునా పూస్తూనే ఉంటుంది. ప్రత్యేకంగా అనిపించే తెల్లని మొగ్గలు, పూలవల్ల రాత్రిపూట ఇంకా అందంగా కనిపిస్తుంది. ఎక్కువగా పూస్తుంది. కనుక నెలకోసారి ఎన్ పీ కె ఉండే సమగ్ర ఎరువుని వేస్తూ ఉంటే చక్కగా పెరుగుతుంది. వేప, కానుగ, లేదా పొగాకు కషాయం వంటి కషాయాలను తరచుగా చల్లుతూ ఉంటే పిండి పురుగులు, రసం పీల్చేపురుగులు ఆశించకుండా ఉంటాయి. ఈ మొక్కను విత్తనాలు లేదా కొమ్మ కత్తిరింపుల ద్వారా సులువుగా ప్రవర్థనం చేయవచ్చు. ప్రత్యేకంగా కనిపించే మొక్కలు కోరుకునే వారికి ఇది కూడా ఒక చక్కని ఎంపిక.

Rose Cactus ………గులాబీ బాల ….ముళ్ళచెట్టు

rose cactusరోజ్ కాక్టస్…..ఒళ్ళంతా ముళ్ళుండే కాక్టస్ జాతికి చెందినది. కాకపోతే ఇది కాక్టస్ లా ఉండదు. నున్నగా ఉండే కాండం మీద ముళ్ళుంటాయి. దీనికి. ఇది కాక్టస్ జాతికి చెందిన మొక్క అని చేప్పే ఏకైక అంశం ఇదొక్కటే. అది తప్ప దీని ఆకులు, పూలు, కొమ్మలు, దేన్ని చూసినా మనకు అలా అనిపించవు. అంతేకాదు ఆకులతో నిండుగా ఉండే కాక్టస్ రకం కూడా ఇదొక్కటే. అరుదైన ఈ కాక్టస్ శాస్త్రీయనామం పెరెస్కియా బ్లియో. ఆకు కాక్టస్, మైనం గులాబీ అనే పేర్లు కూడా దీనికి ఉన్నాయి ఎనిమిది నుంచి పది అడుగుల ఎత్తువరకు పెరిగే ముళ్ళతో కూడిన చిన్న చెట్టు ఇది. కత్తిరించి పొదలా పెంచుకోవచ్చు. పూర్తి సూర్యకాంతిలోనే కాకుండా కొద్దిపాటి నీడలో కూడా చక్కగా పెరుగుతుంది. సారవంతమైన నీరు నిలవని మట్టి మిశ్రమం అవసరం. రెండు పాళ్ళ ఇసుక, ఒకపాలు ఎర్రమట్టి, ఒక పాలు వర్మీకం పోస్టు ఉండే మిశ్రమం అనువుగా ఉంటుంది. రోజ్ కాక్టస్ నీటి ఎద్దడిని తట్టుకుంటుంది. కానీ ఎక్కువ రోజులు నీళ్ళు పోయకపోతే ఆకులు రాలిపోతాయి. రోజ్ కాక్టస్ పళ్ళని తింటారు
దీని అందమైన పెద్ద నారింజ రంగుపూలు గులాబీలను పోలి ఉంటాయి. అందుకే దీనికి రోజ్ కాక్టస్ అన్నపేరు. దీని పళ్ళు కూడా బంగారు రంగులో అందంగా ఉంటాయి. చక్కటి పైనాపిల్ సువాసనతో పుల్లగా ఉండే ఈ పళ్ళను తింటారు. ఆకులను కూడా ఉడికించి కూరలా చేసుకుంటారు. వేగంగా పెరిగే కాక్టస్ ఇది. ఎక్కువకాలం బతుకుతుంది కూడా. చీడపీడలు దాదాపు ఆశించవు. క్రమం తప్పకుండా ఎన్ పీ కె ఉండే సమగ్ర ఎరువు వేస్తూ ఉంటే చక్కగా పూస్తుంది. ఏడాదంతా పూసే మొక్క ఇది. కత్తిరింపుల ద్వారా సులభంగా ప్రవర్ధనం చేయవచ్చు. ఇతర కాక్టస్ లాగా కత్తిరించిన తర్వాత ఒకటి రెండు రోజులు ఆరనివ్వకుండా వెంటనే నాటాలి. విత్తనాల ద్వారా కూడా ప్రవర్ధం చేయవచ్చు. నాటిన విత్తనాలు మూడు నుండి నాలుగు వారాలలో మొలకెత్తుతాయి. రోజ్ కాక్టస్ కుండీలలో కూడా చక్కగా పెరుగుతాయి. రెండుమూడు అడుగుల ఎత్తులో కత్తిరించి పెంచుకుంటే గుబురుగా పెరిగి చక్కగా పూస్తుంది. అందమైన అరుదైన ఈ మొక్కకు ఔషధగుణాలు కూడా ఎక్కువే.

రంగురంగుల హైడ్రాంజియా

రంగురంగుల హైడ్రాంజియా

రంగురంగుల హైడ్రాంజియా ఏడాదంతా పూస్తూ, ముదురాకుపచ్చ ఆకులతో కనువిందు చేస్తుంది హైడ్రాంజియా. ఇది బహువార్షిక పొద. వర్షాకాలం, చలికాలంలో పూత ఎక్కువగా ఉంటుంది. చల్లని వాతావరణం ఈ పొద పెరగడానికి చాలా అనుకూలం. దీన్ని పెంచే నేల తేమగా, సారవంతంగా, గుల్లగా ఉండాలి. ఇసుక పాలు ఎక్కువగా ఉండే మట్టిలో కంపోస్టు లేదా వర్మీకం పోస్టు, కొంచెం వేపపిండి, కొద్దిగా సూపర్ ఫాస్పేట్ కలిపి నాటుకోవాలి. రెండు మూడు నెలలకొకసారి ఒక టేబుల్ స్పూన్ 14-35-14 శాతంలో ఫాస్పరస్ ఎక్కువగా ఉండే ఎరువును మట్టిలో కలిపితే ఆరోగ్యంగా పెరుగుతాయి.
హైడ్రాంజియాను ఉదయం ఎండపడి, మద్యాహ్నం నీడ వచ్చే చోట నాటుకోవాలి. సూటిగా ఎండపడని బాల్కనీలలోనూ చక్కగా పెంచుకోచ్చు. కుండీలలో పెంచినా, నేలపై నాటినా నీరు ఎక్కువగా కాకుండా చూసుకోవాలి. హైడ్రాంజియాను ప్రూనింగ్ చేసుకోవచ్చు. మరీ ఎక్కువగా చేస్తే పూలు తగ్గపోతాయి. ఈ పొదకు బూడిద, తుప్పూ, ఆకుమచ్చ తెగులూ ఆశించే ప్రమాదముంది. మొక్క బలంగా ఉంటే తెగుళ్ళ వల్ల ప్రమాదం ఉండదు. ఒక టీ స్పూను బేకింగ్ సోడాగానీ రెండు ఆస్ర్పిన్ బిళ్ళలు గానీ లీటరు నిటిలో కలిపి చల్లితే తెగుళ్ళను నియంత్రించవచ్చు.
పలు రంగులలో ఉండే ఈ పువ్వులలో తెల్లనివి ప్రత్యేకంగా కనబడతాయి. నీలం రంగు పూలు పూసే హైడ్రాంజియాను మట్టి మిశ్రమంలో కొంచెం సున్నంగానీ, బూడిదను గానీ కలపటం ద్వారా గులాబీ రంగు పూలు వచ్చేటట్లు చేయవచ్చు. వాడేసిన కాఫీ పొడి కలిపితే నీలం పూలు పూస్తాయి. హైడ్రాంజియా కొమ్మల శీర్ష కత్తిరింపులను రూటింగ్ పౌడర్ లో ముంచి నీడలో నాటుకుని సులభంగా ప్రవర్ధనం చేయవచ్చు. నర్సరీలలో కూడా ఈ మొక్కలను కొనుగోలుచేయవచ్చు.

శంఘుపూల చెట్టు

sankupooluసీతాకోక చిలుక చెట్టు శంఘుపూల చెట్టు దాదాపు ఐదు నుంచి ఆరు మీటర్ల ఎత్తువరకు పెరగగలదు. దీని పూలు శంఖుపూల మాదిరిగానే ఉన్నా ఇంకా అందంగా, పెద్దగా ఊదారంగులో ఉంటాయి. దీని ఆకులు పెద్దగా అండాకారంలో, ముదురాకు పచ్చ రంగులో మెరూస్తూ కనువిందు చేస్తాయి. పూలతో ఉన్నప్పుడు అద్భుతంగా కనిపించే ఈ చెట్టు పూలు లేనప్పుడు కూడా పచ్చగా ఉండి ఆకర్షణీయంగా కనిపిస్తుంది. గొడుగు ఆకృతిలో … శంఖుపూల చెట్టు వేగంగా పెరుగుతుంది. కొద్దిగా సాగినట్లుండే కొమ్మలతో పెరిగే ఈ చెట్లు మొదట్లో తీగలా భ్రమింపచేసినా కొద్దికాలంలోనే చెట్టు రూపం సంతరించుకొంటుంది. గొడుగు ఆకారంలో పరుచుకున్నట్లు ఉండే కొమ్మలతో నిండుగా కనిపిస్తుంది. నీడనిచ్చే ఈ చెట్టును కొద్దిగా తోటకు ఒకమూల నాటుకుంటే దీని కింద కూర్చుని చక్కగా ప్రకృతిని ఆస్వాదించవచ్చు. శ్రద్ధ పెట్టాలిలా… సారవంతమైన నీరు నిలవని నేలల్లో ఈ చెట్టు బాగా పెరుగుతుంది. అన్న వాతావరణాల్లోనూ పెరిగినా మరీ పొడి వాతావరణం దీనికి అంతగా పనికిరాదు. శంఖు పూల చెట్టు పూర్తి సూర్యకాంతిలో చక్కగా పెరుగుతుంది. ఎండ మరీ విపరీతంగా ఉంటే మొక్క చుట్టూ ఉండే వాతావరణంలో నీళ్ళు స్ప్రే చేసి చల్లగా ఉంచగలిగితే బాగుంటుంది. శంఖుపూల చెట్టుకు చీడపీడలు పెద్దగా ఆశించవు. అప్పుడప్పుడు వేపనూనె పిచికారీ చేస్తే సరిపోతుంది.వర్షాకాలం నుంచి శీతాకాలం వరకూ నెలకోసారి వర్మీకం పోస్టు, ఎన్ పీ కె ఉండే సమగ్ర ఎరువును వేస్తూ ఉండాలి. ఇలా చేస్తుంటే దాదాపు డిసెంబర్ వరకూ చక్కగా పూస్తుంది. శంఖుపూల చెట్టును కొమ్మలతో ప్రవర్ధనం చేయవచ్చు. బెంగుళూరులోని లాల్ బాగ్ గార్డెన్స్ లో ఉన్న చెట్టును చూస్తే ఎవరైనా ప్రేమలో పడితీరాల్సిందే.

Parsian Shield-స్ట్రోబిలాంతస్

vadamalliఈ మొక్కనే పర్షియన్ షీల్డ్ అనికూడా అంటారు. ఇది అందమైన ఆకులు ఇష్టపడే ప్రతి ఒక్కరి దగ్గరా తప్పక ఉండవలసిన మొక్క. మొత్తని కొమ్మలతో గుబురుగా పెరిగే చిన్నపొద ఇది.
అడుగు నుండి రెండడుగుల ఎత్తువరకూ పెరుగుతుంది. కాండం పలకలుగా ఉంటుంది.ఆకుల చివర్లు సాగి మొనదేలి ఉంటాయి. ఇవి ఆకుపచ్చ, గులాబీ, ఊదా, వెండి రంగుల మిశ్రమంతో లోహపు మెరుపుతో అద్భతంగా కనిపిస్తాయి. ఈ మెరుపు వలనే దీనికి పర్షియన్ షీల్డ్ అన్నపేరు వచ్చింది. పేరులో పర్షియా ఉన్నా దీని జన్మస్ధలం మయన్మార్. ఆకుల అడుగు భాగం ఊదా రంగులో ఉంటుంది. దీనికి శీతాకాలంలో గొట్టాల్లాంటి అందమైన లేత నీలిరంగు పూలుచిన్న చిన్న కంకుల్లో పూస్తాయి. ఈ పూలు చూడ్డానికి బాగుంటాయి. కానీ పూలు పూస్తున్నపుడు ఆకుల పరిమాణం తగ్గుతుంది. అవి వద్దనుకుంటే మొగ్గలోనే తుంచేస్తే ఆకులు చక్కగా పెరుగుతాయి.

చీడపీడలు తక్కువే :
స్ట్రోబిలాంధస్ ను ఇంటిలోపలా, బయటా చక్కగా పెంచుకోవచ్చు. ఇది నీడలో పెరిగే మొక్క. చెట్లకిందా, బాల్కనీలలో, వరండాలలో నచ్చిన చోట ఎక్కడైనా పెంచుకోవచ్చు.
దీనిని విడిగా కంటే కుండీలలోనూ, ఇతర మొక్కలతోనూ కలిపి నాటుకుంటే భలే అందంగాను ఉంటుది. చెట్ల నీ కిందా నాటుకోవచ్చు. ముఖ్యంగా ఫెర్న్ లు, ఇంపేషన్స్, బిగోనియా, అస్సరాగస్, పసుపు రంగుల పోమియాలతో మిశ్రమ అమరికలలో అద్భతంగా ఉంటుంది. స్ట్రోబిలాంధస్ సులువుగాపెరిగే మొక్క. మనవేడి వాతావరణానికి అనువైంది. దీనికి రోజూ నీరు అవసరంలేదు. చీడపీడల భయమూ తక్కువే. కంపోస్టు ఎక్కువగా ఉండేనీరు నిలవని మట్టి మిశ్రమంలో బాగాపెరుగుతుంది. నీరు నిలవకుండా చూసుకోవాలి. లేకపోతే వేరుకుళ్ళు ఆశించే ప్రమాదం ఉంది. అప్పుడపుడు వేపకషాయం, కానుగ కషాయం వంటివి చల్లుతూ ఉంటే రసం పీల్చే పురుగులు ఆశించవు. స్ట్రోబిలాంధస్ కు గాలిలోతేమ ఎక్కువగా కావాలి.

కుండీలలో పెంచేటపుడు అడుగున ప్లేటులో ఇసుక గానీ గులకరాళ్ళు గానీ పోసి తడుపుతూఉంటే కావల్సిన తేమ అందుతుంది. బయట పెంచేటపుడు ఎండు ఆకులను, కొబ్బరి పీచును మల్చింగ్ లాగా చేసుకోవాలి. చిగుళ్ళు తుంచితే చక్కగా గుబురుగాపెరుగుతుంది. కత్తిరింపులతోనూ సులువుగా ప్రవర్ధనంచేసి మనకు నచ్చినట్లుగా పెంచుకోవచ్చు.

Painted Leaf Bigonia – రెక్స్ బిగోనియా

vadamalli

వర్ణచిత్రాలు అనిపించే ఆకులతో అందంగా అలరించేవే రెక్స్ బిగోనియా. పెయింటింగ్ బిగోనియా అని పిలిచే ఇవి తగినంత వెలుతురు కనుక అందితే ఇంటిలోపలా చక్కగా పెరుగుతుంది. కాంతి ధారాళంగాతగిలే ప్రదేశాలైన వరండాలు, బాల్కనీలు, కిటికీల పక్కన పెంచుకోవడానికి బాగుంటుంది. వీటిల్లో అనేక సంకర రకాలు ఉన్నాయి. ఎరుపు, ఊదా, గులాబీ, వెండి వంటి ప్రకాశవంతమైన రంగులు కలిసిన ఆకులతో కంటికింపుగా కనిపిస్తుంది. దీని ఆకులు పెద్దగా పెద్దగా ఉండి చారలు,చుక్కలు, అంచులతో వివిధ ఆకృతుల్లో కనిపిస్తూ కిందకి వాలినట్లుగా ఉంటాయి.

వీటి పూలు కొంచెం చిన్నగా చూడ్డానికి సొగసుగా ఉంటాయి. ఐతే ఆకులేఈ మొక్కకు ప్రధాన ఆకర్షణ. అందుకే చాలామంది మొగ్గలను తుంచేసి ఆకులే చక్కగా పెరిగేలా శ్రద్ధ తీసుకుంటారు.

రెక్స్ బిగోనియా మొక్కలను నేరుగా కాంతి తగిలే చోట నాటుకోవాలి. ఒకవేళ సూర్యకాంతి తగలనపుడు కృత్రిమంగా కాంతి తగిలే చోట నాటుకోవాలి. సూర్యకాంతి తగలకపోతే కృత్రిమంగా కాంతి అందించినా సరిపోతుంది. కుండీలు, నేలల్లో విడిగాగానే కాకుండా వీటిని ఇతర మొక్కల మధ్య నాటుకున్నా చక్కగా కనిపిస్తాయి. దీనిని నాటుకునేందుకు నీరు నిలవని తేలికపాటిమట్టి మిశ్రమం అనుకూలం. అంటే మట్టితో పాటు కోకోపీట్, వర్మీకం పోస్ట్, ఇసుక, ఇటుక ముక్కలు కలపాలి. వీటిని ఆకుల కత్తిరింపుల ద్వారా సులభంగా ప్రవర్ధనం చేయవచ్చు.

రెండువారాల కొకసారి ఐదు గ్రాముల ఫాలీఫీడ్ ను లీటరునీటిలో కలిపి మొక్కకు పోస్తే ఆరోగ్యంగా ఎదుగుతాయి. ఇవి సులభంగాపెరిగేమొక్కలే కానీచాలాసున్నితమైనవి.వీటిని పెంచే ప్రదేశంలో గాలిలో తేమ కూడా తగినంతగా అవసరం. కానీ మొక్కకు నీరు కొద్దిగా ఎక్కువైనా కుళ్ళిపోతాయి. చుట్టూ ఉన్నమొక్కలను ఆరోగ్యంగా ఉంచుతూ కుళ్ళిపోయిన ఆకులను ఎప్పటికప్పుడు తీసేస్తే చీడపీడల భయం ఉండదు. రకాన్నిబట్టి వీటిధర రూ.75- నుండి రూ.150-వరకుఉంటుంది.

మోనా లావెండర్ ఇంటికే అందాలు

vadamalliమోనా లావెండర్ ను 1990లో ఆఫ్రికాలో సృష్టించినా మన దగ్గర వాడకంలో వచ్చింది మూడు, నాలుగేళ్ళ క్రితమే. మోనా లావెండర్ పుదీనా కుటుంబానికి చెందినది. సాధారణంగా ఈ కుటుంబానికి చెందిన మొక్కలన్నింటిని ఆకుల కోసం పెంచుతారు కానీ ఈ మొక్కలను మాత్రం పూల కొరకే పెంచుతారు. ఇది చిన్న పొదలాపెరిగే బహువార్షికం. ఒకటి నుండి రెండడుగుల ఎత్తువరకు పెరుగుతుంది.అదీ వేగంగా, దీని ఆకులు అండాకారంలో ముదురాకుపచ్చ రంగులో మెరుస్తూ ఉంటాయి. ఆకుల అడుగు భాగం ఊదారంగులో ఉంటుంది. అందంగా ఉండే దీని పూలు లావెండర్ రంగులో కంకుల్లా పూస్తాయి.

మోనా లావెండర్ గుల్లగా ఉండే నేలలో బాగా పెరుగుతుంది. దీనికి నీరు ఎక్కువ అవసరం లేదు. కానీ క్రమం తప్పకుండా ఉండాలి. ఎండలో కంటే ఇదినీడలో బాగా పెరుగుతుంది. ఇది పుదీనా కుటుంబంలోని ఇతర మొక్కల్లాగా తీగలా సాగకుండా నిలువుగా గుబురుగా పెరుగుతుంది. పూలు లేనపుడు కూడా అందమైన ఆకులతో సంవత్సరమంతా కనువిందు చేస్తుంది మోనా లావెండర్ ఎక్కువకాలం పూస్తుంది.

వర్షాకాలంలో, చలికాలంలోనూ పూలు పూస్తాయి. పూలు పూసేటప్పుడు ఎరువులు వేయరాదు. పూత అయిపోయాక రెండుమూడు వారాలకు ఒకసారి పాలీఫీడ్ వంటి నీటిలో కరిగే సమగ్ర ఎరువును లీటరు నీటికి ఐదు గ్రాముల చొప్పున కలిపి వేయాలి. వాడేసిన టీ ఆకులు, కాఫీ పొడి వంటివి మట్టి మిశ్రమంలో కలిపితే ఈ మొక్క బాగా పెరుగుతుంది. వాడిన పూలను ఎప్పటికప్పుడు కత్తిరించాలి. మోనా లావెండర్ కు చీడపీడల సమస్య తక్కువే. పిండిపురుగులు గానీ, రసం పీల్చే పురుగులు గానీ ఆశిస్తే వేప, వెల్లుల్లి కషాయం వాడితే సరిపోతుంది. దీనిని నాలుగు అంగుళాల పొడవుండే కొమ్మ చివరి కత్తిరింపుల ద్వారా సులభంగా ప్రవర్ధనం చేయవచ్చు.

ఇది కుండీలలోకి, హ్యాంగింగ్ బాస్కెట్లలోకి చాలా బాగుంటుంది. నేలలో నాటేటపుడు అంచులుగానూ, ఇతర మొక్కలతో కలిపి బెడ్ ల మాదిరి నాటుకోవడానికి చక్కగా ఉంటుంది. నీడలో పూసే మొక్కలే అరుదు అయితే మోనా లావెండర్ లాగా నీడలో విరగబూసే మొక్కలు ఇంకా అరుదు.

Flaming Sword – కత్తిలాంటి పూలు

vadamalliచూడ చక్కని ఆకృతి, ఆకట్టుకునే రంగుల్లో ఆకులు కొన్ని నెలల పాటు తాజాగా ఉండే పూలూ…ఫ్లేమింగ్ స్వోర్డ్ ప్రత్యేకతలు. బాల్కనీలూ, కిటికీలూ,మెట్ల దగ్గర పెంచుకునేందుకు అనువైన మొక్కలు ఇవి.
వీటిలో ఆకు, పువ్వులు,రంగులను బట్టి వందల రకాలున్నవి.ఎర్రని కత్తిలాంటి పుష్పగుచ్ఛం మొక్కకు పూయడం వల్ల ఈ పేరు వచ్చింది. ఇంటి లోపల పెంచుకోవటానికి అనువైనది. సుమారు రెండువందల యాభై రకాలలో లభించే ఈ మొక్క సహజంగా అడవులలో ఇతర మొక్కల మీద ఆధారపడి పెరుగుతుంది. ఇంట్లో పెంచేందుకు ప్రత్యేకమైన మట్టిని తయారు చేసుకోవాలి. మూడువంతుల కోక్ పిట్ కు రెండుపాళ్ళ చొప్పున వర్మీకం పోస్టు, ఎర్రమట్టి, సున్నం, ఇటుక ముక్కలు, ఒకవంతు వేపపిండి కలిపిన మిశ్రమాన్ని కుండీలో నింపుకోవాలి. ఎండిపోయన దుంగలో రంధ్రం చేసి దానిలో ఈ మొక్కను పెట్టి పెంచినా బాగా పెరుగుతుంది. కొత్తగానూ కనిపిస్తుంది.

నీళ్ళు తప్పనిసరి
ఫ్లేమింగ్ స్వోర్డ్ ను వెలుతురు బాగా ఉండి నేరుగా ఎండ పడని ప్రదేశంలో పెంచుకోవాలి. దీని ఆకులు గుత్తిలా ఉండి మధ్యలో గుంటలా ఉంటుంది. మొక్కకు అందించే నీళ్ళు మట్టిలో కాకుండా ఈ గుంటలోనే పోయాలి. ఎప్పుడూ గుంటలో కొద్దిగానైనా నీళ్లుండేలా చూసుకోవాలి. మట్టికి కొద్దిపాటి తేమ అవసరం మట్టి పూర్తిగా పొడిబారకుండా చూసుకోవాలి. గాలిలో తేమ ఎక్కువగా ఉంటే మంచిది.అందుకే దీన్ని ఇతర మొక్కల మధ్య ఉంచడమో లేక మధ్య మధ్యలో నీళ్లు చల్లుతుండడమో చేయాలి. ఈ మొక్కకు మరీ ఎక్కువగా ఎరువులు వేయాల్సిన అవసరం లేదు.నెలకోసారి పాలీఫీడ్ ను లీటరు నీటిలో ఎనిమిది నుండి పది గ్రాములు కలిపి పిచికారీ చేస్తే సరిపోతుంది. దీనికి పిండి పురుగులూ, పొలుసు పురుగులు ఆశించవచ్చు. అలాంటప్పుడు వంటసోడాను నీళ్ళలో కలిపి గానీ, వెల్లుల్లి కషాయాన్ని గానీ చల్లాలి. ఈ ఆకుల మీద కొన్ని సార్లు గోధుమ రంగు మచ్చలు రావచ్చు. సమస్య నివారణకు మొక్క మధ్య గుంటలో నీళ్ళు ఉండేలా చూసుకోవాలి. ఆకుల మీద నీళ్ళు పిచికారీ చేయాలి. ఒకవేళ ఆకుల మీద గోధుమ రంగు మచ్చలు వస్తే ఎండ ఎక్కువైందని తెలుసుకొని వెంటనే నీడలోని మార్చాలి. నాటిన మూడు నుంచి ఐదేళ్ళపాటు పూలు రావు. కానీ ఒకసారి పూలు పూసాక కొన్ని నెలలపాటు తాజాగా టాయి. తరువాత చనిపోతుంది. ఈలోగా చిన్నచిన్న పిలకలు దాని చుట్టూ వస్తాయి. తల్లి మొక్క ఎత్తులో సగం ఉన్నప్పుడు పిలకలను వేరుచేసి నాటుకుంటే మంచిది. ఇది కొంచెం ప్రత్యేకంగా కనిపించే మొక్క కాబట్టి ధరకూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. సాధారణంగా ఏ అలంకరణ మొక్కనైనా అందమైన ఆకుల కోసమో లేదా చూడచక్కని పూలకోసమో పెంచాలనుకుంటారు. ఈ మొక్క విషయంలో ఇవి రెండూ ఒకదాన్ని మించి మరొకటి ఆకర్షిస్తాయి.

Haricane, Chees Plants, Monsterani Plants…..అందమైన హరికేన్


vadamalliపెరట్లో నిండుదనం రావాలంటే మాన్ స్టెరాని హరికేన్ మొక్కను పెంచుకోవాల్సిందే. దీనినే చీజ్ ప్లాంట్ అనికూడా అంటారు. ఇతర చెట్లను ఆధారంగా చేసుకుని గాలివేర్ల సాయంతో ఎదుగుతుంది. ఇది ఉష్ణమండలానికి చెందిన మొక్క. ఇంట్లో పెంచుకునే మొక్కలలో దీనిదే ఆగ్రస్థానం.అనుకూల పరిస్ధితులలో 20 మీటర్ల వరకూ పెరుగుతుంది. దీని ఆకులు హృదయాకారంలో, ముదురాకుపచ్చ రంగులో పెద్దగా ఒకటినుండి రెండడుగుల పొడవు, దాదాపు అంతే వెడల్పుతో మెరుస్తూ ఉంటాయి. మధ్యలో తెలుపూ,మరికొన్ని రంగులతో వరిగేషన్ రకాలుగా వస్తున్నవి చాలా అందంగా ఉంటున్నాయి. లేత ఆకులు మామూలుగా ఉంటాయి కానీ అవి ముదిరే కొద్దీ దాదాపు మధ్య ఈనె వరకూ చీలికలతో అక్కడక్కడా రంధ్రాలతో తయారవుతాయి.ఆకులూ ఇలా ఉండటం వల్ల మాన్ స్టెరా పెద్దపెద్ద గాలులను కూడా తట్టుకోగలదు. అందుకే దీనిని హరికేన్ ప్లాంట్ అంటారు.
తగిన వెలుతురు..
మాన్ స్టెరా సామాన్యంగా పెద్ద పెద్ద చెట్లను చుట్టుకొని, గాలి వేర్లను చెట్ల బెరడులోకి చొప్పించి పెరుగుతుంది. ఇళ్ళలో పెంచేటపుడు పీట్ మాస్ లేదా కొబ్బరిపీచుతో కప్పిన కర్రలను ఆధారంగా అమర్చితే గాని ఆరోగ్యంగాపెరుగుతుంది. ఈ మొక్కలకు గాలిలో తేమ ఎక్కువ అవసరం. ఇంట్లో పెంచినపుడు ఆకులను స్పాంజీతో తరచూ తుడుస్తుండాలి, పెరట్లో పెంచుకునేటపుడు నీళ్ళు చల్లుతూఉండాలి. మాన్ స్టెరా పెరగటానికి వెలుతురు కావాలి గానీ ఎండ నేరుగా పడకూడదు వెలుతురు మరీ తక్కువగా ఉంటే ఆకులు చిన్నవిగా, చీలికలు లేకుండా ఉంటాయి. ఎండ ఎక్కువగా పడితే ఆకులు మాడిపోయి మచ్చలు పడతాయి.ఈ మొక్కలకు సేంద్రియ ఎరువు ఎక్కువగా ఉండే సారవంతమైన మట్టి అవసరం. క్రమం తప్పకుండా వర్మీకం పోస్టు, కుళ్ళిపోయిన ఆకులు మట్టి మిశ్రమంలో కలుపుతూ ఉండాలి. వీలైనంతవరకూ వేర్లు తడారి పోకుండా చూసుకోవాలి, అలాగని నీరునిల్వ ఉండకూడదు. తగినన్నీ నీళ్ళు పోస్తుండాలి. మాన్ స్టెరాను అలాగే వదిలేస్తే అడవిలాగా పెరుగుతుంది. పక్కకు వచ్చిన కొమ్మలను ఎప్పకప్పుడు కత్తిరిస్తూ ఆధారాన్ని చక్కగా పట్టుకుని పెరిగేలా చూసుకోవాలి. అప్పుడప్పుడూ వేప కషాయం చల్లితే చీడపీడలు పెద్దగా ఆశించవు.
నీళ్ళు సరిపోకపోతే….
సాధారణంగా ఇంటి లోపల పెంచినపుడు మాన్ స్టెరాకు పూతరాదు. కానీ బయట పెరిగినపుడు మీగడ రంగు డొప్పతో కప్పిన అడుగు పొడుగున్న పూలకాడలు వస్తాయి. ఇవి తెల్లని పండ్లలా మారతాయి. కొద్దిగా అనాస రుచితో ఉండే వీటిని తింటారు కూడా. వీటిని కత్తరింపుల ద్వారా ప్రవర్ధనంచేయవచ్చు. రెండు మూడు ఆకులున్న శీర్ష కత్తిరింపులు బాగా నాటుకుంటాయి. మాన్స్ స్టెరా ఆకులు పసుపు రంగుకి మారుతుంటే నీరు ఎక్కువైందని, ఎరువులు వేయాల్సిన అవసరంఉందని కానీ తెలుసుకోవాలి. అలాగే ఆకుల అంచులు కొనలూ ఎండిపోతుంటే గాలిలో తేమ తక్కువగా ఉండటం గానీ, కుండీ సరిపోకపోవటం గానీ కారణాలు. ఆకులకుచీలికలూ,రంధ్రాలు రాకపోతుంటే వెలుతురుగానీ, నీళ్ళు గానీ ఎరువులు గానీ సరిపోక పోవడం జరగవచ్చు. మొక్క ఎక్కువగా సాగిపోతుంటే వేళ్ళు ఆధారాన్ని సరిగా పట్టుకోలేదని అర్ధం. ఇంకెందుకు మీ మొక్కలకు మాన్ స్టెరాను జతచేసి నిండుదనాన్ని తెచ్చుకోండి.

అందమైన జీబ్రా మొక్కలు

zeebra flowersమనం సాధారణంగా చూసే మొక్కలలో చాలావరకు పువ్వులు లేకపోతే ఆకులలో ఏదో ఒకటి అందంగా ఉంటుంది. రెండూ అందంగాఉండే మొక్కలు చాలా అరుదు. జీబ్రా మొక్క అలాంటి అరుదైనది. ముదురాకు పచ్చరంగు మీద ప్రస్పుటంగా కనిపించే తెల్లని చారలున్న ఆకులు దీని సొంతం. ఇవి జీబ్రాని తలపిస్తాయి కాబట్టే ఈ మొక్కలకు ఆపేరు. దీని శాస్త్రీయనామం స్వ్కారోజా. అందుకే ఎపిలాండ్రా అనికూడా అంటారు. ఇది నీడలో పెరిగేమొక్క. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే ఇంట్లోకూడా చక్కగా పెంచుకోవచ్చు. సాధారణంగా రెండు నుంచి మూడు అడుగుల ఎత్తువరకు పెరిగే చిన్నపొద ఇది. వీటిని నీడలో నాటుకున్నా కుండీలలో పెంచుకున్నా బాల్కనీలు, వరండాలలో ఎక్కడ పెట్టుకున్నా ఆకట్టుకుంటుంది.
పూల, ఆకుల సోయగం :
జీబ్రా ఆకులు అందమైన చారలతో దాదాపు తొమ్మిది అంగుళాల పొడవు, మూడు అంగుళాల వెడల్పుతో మొనదేలిన శీర్షంతో ఉంటాయి. బంగారు రంగులో శంఖాకారపు గుర్తుల్లో మురిపించే దీనిపూలు…అసలు పూలు కావు. అవిరూపాంతరం చెందిన బ్రాక్టులు. అసలు పూలేమో సన్నగా బంగారురంగులో ఉంటాయి. పూసిన వారం రోజులలోనే రాలిపోతాయి. బ్రాక్టులు మాత్రం ఐదునుంచి ఆరువారాలపాటు కనువిందుచేస్తూ ఉంటాయి. జాబ్రామొక్క సాధారణంగా శీతాకాలంలో పూస్తుంది. నీడలోనే చక్కగా పెరిగినా…కొంత సూర్యకాంతి, కనీసం కృత్రిమ కాంతి అయినా తగలనివ్వాలి. గాలిలో తేమ కూడా ఎక్కువగాఉండాలి. తడిగా ఉండి నీరు నిలవనిమట్టి మిశ్రమం కావాలి. కోకోపిట్, వేపపిండి, కంపోస్టు లేదావర్మీకం పోస్టు కొద్దిగా ఇసుక కలిసిన మట్టిమిశ్రమం ఉపయోగించాలి.
జాగ్రత్తలు తప్పనిసరి ….
కొద్దిగా అశ్రద్ధచేసినా ఆకులు రాలిపోయి పీలగా మారిపోతుంది. నీటిలో లవణాలు ఎక్కువగా ఉన్నా దెబ్బతింటుంది. ఆకులు రాలిపోతున్నట్లయితే నేల పొడిబారడమో ఎండ ఎక్కువ కావడమో కారణాలు కావచ్చు. ఆకు చివర్లు విడిపోతుంటే గాలిలో తేమ తక్కువైందని గ్రహించాలి. వెంటనే మొక్క చుట్టూ గాలిలోని నీళ్ళు పిచికారీ చేయాలి. లేదా కుండీ కింద ప్లేటులో గులకరాళ్ళు పోసి తడుపుతూ ఉండాలి. జీబ్రా మొక్కకు రసం పీల్చే పురుగులు బెడద ఎక్కువ. వేప, పొగాకు, కానుగ కషాయాలు చల్లుకోవాలి. పూలు వాడిపోగానే కత్తిరించుకోవాలి. కొమ్మలను అప్పుడప్పుడు కిందికి కత్తిరించాలి. దీనివల్ల మొక్క సాగిపోయినట్లు కాకుండా ముద్దుగా గుబురుగా పెరుగుతుంది. చాలా మొక్కలలో సూర్యకాంతి చాలకపోతే కృత్రిమ వెలుతురును ఎక్కువ, తక్కువ సేపు పడేలా చేయడం ద్వారా పూలుపూసే సమయాన్నిపెంచవచ్చు. కానీ జీబ్రా మొక్క మాత్రంకాస్త ప్రకాశవంతమైన వెలుతురు ఉంటేనే పూలు పూస్తుంది.వెలుతురు మరీఎక్కువైతే ఆకులు ముడుచుకుపోతాయి. ఇది చిన్నకుండీలోనే బాగాపూస్తుంది. అందుకే కుండీ మార్చటానికి తొందరపడక్కరలేదు.. ఆకులను అప్పుడప్పుడు తడిగుడ్డతో తుడుస్తూ ఉంటే మొక్క చక్కగా కనపడుతుంది. నెలకు ఒకసారి ఎన్ పి కె ఉండే 17:17:17 శాతం చొప్పున సమగ్ర ఎరువును అందిస్తే ఆరోగ్యంగా ఉంటుంది. కొమ్మల శీర్షిక కత్తిరింపుల ద్వారా దీనిని ప్రవర్ధనం చేయవచ్చు.

Marigold Plants…ముద్ద బంతులు

marigold plantsబంతి శాస్త్రీయ నామం టాజిటస్. ఇందులో ఆఫ్రికన్, ఫ్రెంచ్ రకాలున్నవి. ఫ్రెంచ్ రకాలంటే మన కారబ్బంతులన్న మాట. బంతి అన్ని రకాల నేలలోనూ పెరుగుతుంది.అందుకు సారవంతమైన నీరు నిలవని మట్టి అవసరం పూర్తి సూర్యకాంతి తప్పనిసరి బంతి మొక్కలు 40 నుండి 45 రోజులలో పూతకు వచ్చి తరువాత రెండు నెలల వరకు పూస్తూనే ఉంటాయి.పూలు చక్కగా రావాలంటే సరైన రకాలను ఎన్నకోవాలి. విత్తనాల ఎంపికలో జాగ్రత్త లు పాటించాలి. విత్తనాలు 1-2 సంవత్సరాలు వాడుకోవచ్చు. తరువాత మొలక శాతం తగ్గుతుంది. హైబ్రీడ్ విత్తనాల ధర కొంచెం ఎక్కువ. కనుక విత్తనాలను కుండీలలో గానీ, సీడ్లింగ్ ట్రేలలో కానీ చల్లుకోవడం మంచిది. తరువాత నేలలో నాటుకోవచ్చు.
బంతిలో ఏడాది పొడవునా పెంచుకోగలిగిన రకాలు ఉన్నాయి. ఎండాకాలంలో మాత్రం మరీ అధికఉష్ణోగ్రతలు ఉన్నపుడు పాక్షికంగా నీడ తగిలేలా ఏర్పాటు చేసుకొవాలి. చలికాలంలో పూసా, నారంగి, గైండా, ఆఫ్రికన్ జైంట్, డబల్ ఎల్లో, డబుల్ ఆరెంజ్, టైగర్ రకాలు ఎక్కువగా పూస్తాయి. ఎండా కాలంలో క్రాకర్ జాక్, ప్రాంతీయ రకాలు అనువైనవి. ఆఫ్రికన్, జెయింట్ టాల్ ఆరెంజ్, జాఫ్రి, లడ్డు గైండా రకాలు కూడా చక్కగా పూస్తాయి. వర్షాకాలంలో పూలు రావాలంటే జూన్ మధ్యలో నారుపోసుకొని, జులైలో నాటుకోవాలి. చలికాలంలో పూలు కావాలంటే సెప్టెంబర్ మధ్యలో నారుపోసుకొని అక్టోబర్ మధ్యలో నాటుకోవాలి.
ఎండాకాలంలో పూలకోసం జనవరి-ఫిబ్రవరి నెలలో నారుపోసుకొని ఫిబ్రవరి మార్చిలో నాటుకోవాలి.. హైబ్రీడ్ రకాలు మామూలుగా విత్తనాల నివ్వవు కనుక ఎప్పటికప్పుడు కొత్త విత్తనాలు కొనుగోలు చేసి నారు పెంచుకోవాలి.
త్వరగా ఎదుగుతుంది :
బంతి మొక్కలు త్వరగా పెరుగుతాయి. కనుక ఎరువులు ఎక్కువగా కావాలి. మట్టి, పశువుల ఎరువు లేదా వర్మీకం పోస్టను సమానంగా తీసుకుని కొంచెం వేపపిండి, ఎముకల పొడి కలిపితే మంచిది. నారు పోసాక పదిహేను రోజుల కొకసారి ఎన్ పీకె ఉండే సమగ్ర ఎరువును నీటిలో కలిపి చల్లాలి. బంతికి సాధారణంగా చీడపీడలు ఆశించవు. నీరు నిలవకుండా ఎండ బాగా తగిలేలా చూసుకుంటే సరిపోతుంది. వేపకషాయం పదిరోజులకొకసారి చల్లుతుంటే ఆరోగ్యంగా పెరుగుతుంది.

Roses…గులాబీలు

marigold plantsగులాబీ రకాలలో సువాసనకు పేరొందినవి డమాస్కస్ గులాబీలు. వీటిని గులాబీ నూనె, రోజ్ వాటర్, గుల్కండ్ వంటివి తయారు చేయడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు. హెర్బల్ టీలలోనూ వాడతారు. డమాస్కస్ గులాబీలలో జ్వాల, హిమ్రోజ్, హాట్ హిమ్రోజ్ వంటి హైబ్రీడ్ రకాలు ఉన్నాయి. ఈ గులాబీలు చూడడానికి అందంగా ఉంటాయి. చాలా పరిమళాన్ని ఇస్తాయి. ఔషధ గుణాలు కూడా ఎక్కువే.
సువాసనతో కూడిన హైబ్రీడ్ టీ గులాబీలూ అందుబాటులోకి వచ్చాయి. వాటీలో ముఖ్యమైనవి షర్బత్, రక్తిమా, అనురాగ్, జవహర్, నూర్జహాన్, రాజహంస, కనకాంజి రకాలు విరివిగా లభిస్తున్నాయి. సుగంధ రకాల గులాబీ మొక్కలు. మామూలు వాటికంటే కొంచెం పెద్దగా పొదలా పెరుగుతాయి. డమాస్క్ రకం లేత గులాబీ, లేత ఎరుపు రంగులలోనే లభిస్తాయి. మిగిలిన హైబ్రీడ్ రకాలు వివిధ రంగులలో లభిస్తాయి.
ఏటా రెండుసార్లు : సుగంధ గులాబీలకు కూడాసాధారణ గులాబీలలాగేనే ఎక్కువ వెలుతురు, సారవంతమైన నేలా అవసరం పూర్తిగా నేల పొడిబారాకే నీరు పెడితే సరిపోతుంది. ఎరువులు ఎక్కువగా వేయవలసి ఉంటుంది. సూక్ష్మ పోషక ఎరువులను తరచూ వేస్తూ మొక్క ఆరోగ్యంగా పెరిగేలా చూసుకోవాలి. గులాబీ మొక్కలను ఎక్కువగా పెంచేవారు రోజ్ మిక్స్ ఎరువుని తయారు చేసుకుని వాడితే మంచిది. చవకగా కూడా తయారవుతుంది. వేప కషాయం చల్లడం, మట్టిలో జీవరసాయనాల ఎరువులను కలపడం ద్వారా చీడపీడల నుంచి రక్షణ పొందవచ్చు. ఇతర గులాబీ మొక్కలలాగానే సుగంధ గులాబీ మొక్కలను కూడా ఏప్రియల్, అక్టోబర్ నెలలలో ప్రూనింగ్ చేసుకోవాలి. ఎండిపోయిన కొమ్మలనూ, పూలనూ ప్పటికప్పుడు తీసివేయాలి. డమాస్కస్ రకమైతే ముదురు కొమ్మలను నాటడం ద్వారా … హైబ్రీడ్ రకాలను బడ్డింగ్ ద్వారా ప్రవర్ధనం చేయవచ్చు

పరిమళాల జూకామల్లె

vadamalliజూకామల్లె మనదేశానికి చెందిన లత. పచ్చని ఆకులతో గుబురుగా అల్లుకొని గిన్నెలాంటి చిన్నచిన్న మీగడరంగు పూలతో విరగబూస్తుంది.సాయంకాలాలను తన మనోహరమైన సువాసనతో మరపురానివిగా మార్చేస్తుంది. గిన్నె మాలతికి ఎండ బాగా తగలాలి. కొద్దిపాటి నీడలోనూ ఎదుగుతుంది. ఇది కుండీలలో చక్కగా పెరుగుతుంది. పందిరి మీదికి, కంచెల మీదకి అల్లుకునేలా చేస్తే బాగుంటుంది. పొదలాపెరిగే తత్వం వల్ల ఎక్కువగా తీగలు సాగకుండా, నిండుగా కనిపిస్తుంది. దీన్ని కత్తిరిస్తూ సులభంగా మనకు కావలసినట్లు పెంచుకోవచ్చు.దీనికి సారవంతమైన నేల ఉంటే బాగుంటుంది. నీరు మాత్రం బాగా పోస్తుండాలి. ఈ మొక్కలు డిసెంబర్ నుండి ఏప్రిల్ వరకూ పూస్తాయి. ఆక్టోబరు నుండి మార్చి వరకు నెలకు ఒకసారి ఎన్ పీ కె ఉండే సమగ్ర ఎరువును కొద్దిగా మట్టి మిశ్రమంలో కలుపుతుంటే చాలు.
గిన్నె మాలతికి చీడపీడలు పెద్దగా ఆశించవు. అప్పుడప్పుడు వేప కషాయం చల్లితే సరిపోతుంది. దీని పూలవాసన మొగలిపూల పరిమళానికి కొంచెం దగ్గరగా ఉంటుంది. ఆసక్తి కలిగించే విషయమేమంటే, బాస్మతి బియ్యానికి ఆ సువాననిచ్చే రసాయనాలే మొగలి పువ్వులోను, గిన్నెమాలతిలోనూ ఉంటాయట.మ ఔషధపరంగాకూడా ఈ మొక్క ఎంతో ఉపయోగ పడుతుంది. గిన్నె మాలతి ఆకుల రసాయనాన్ని గాయాలకు, దెబ్బలకూ పూతగా పూస్తే త్వరగా తగ్గుతాయంటారు. ఈ పూలు సీతాకోక చిలుకలకూ,హమ్మింగ్ పిట్టలకూ ఎంతో ప్రియమైనవి.

లోరె పెటాలమ్

ముదురు గులాబీ రంగు పూలు, అండాకారంలో నిగారింపుతో కనిపించే ఆకులు లోరోపెటాలమ్ ప్రత్యేకత. వీటిలో అనేక రకాలున్నప్పటికీ, ఎక్కవ వాడుకలోకి వచ్చంది లోరోపెటాలమ్ చైనీ సుబ్రం. వీటికి బద్దెల్లాగుండే పూలరెక్కల వలన వీటికి ఆ పేరు వచ్చింది.ఈ మొక్కలు మూడునుండి ఐదుఅడుగుల ఎత్తువరకు పెరిగే పొద. ఆకులు గోధుమ కలిసిన ఎరుపు రంగులో అండాకారంలో కొనదేలి ఉంటాయి.
పూలు ముదురు గులాబీ రంగులో కంటికింపుగా కనిపిస్తాయి. ఒకటి రెండు సెంటీ మీటర్లలో బద్దెల్లాగా నాలుగు నుంచి ఆరు రేకలు ఉంటాయి. ఈ పూలుఏడాదంతా పూసినా సాధారణంగా డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఎక్కువగా పూస్తాయి.
కోరుకున్న ఆకృతిలో….లోరోపెటాలమ్ నెమ్మదిగా పెరిగే మొక్క. దీన్ని పెంచేందుకు నీరు నిలవని మట్టి మిశ్రమాన్ని తీసుకొని నాటుకునే కుండీలలో కోడిగుడ్డుపెంకులు, వాడేసిన కాఫీ పొడి కలిపితే మొక్క చక్కగా పెరుగుతుంది. అయితే ఈ మొక్కను మరీ లోతుగా నాటకూడదు.
బోర్డరుగాను,పొదగానూపెంచుకోవచ్చ. వీటిని దగ్గర దగ్గరగా నాటుకుని కావలసిట్లుగా పెంచుకోగలిగితే కోరుకున్నా ఆకృతిలో చూడముచ్చటగా అందంగా కనిపిస్తాయి.
ఈ మొక్కలను రాక్ గార్డెన్ లో రాళ్ళ మధ్య తేమఉండేలా లోతు చేసి నాటుకుంటే మంచిది. బోన్సాయ్ పద్దతిలో చక్కగా పెంచినా ఇదిప్రత్యేకంగా అందంగా కనిపిస్తుంది. పునాదుల పక్కనా, కాంక్రీట్ బాట పక్కనా ఇవి సరిగాపెరగవు. లోరోపెటాలమ్ కొద్దిగా కుదురుకుని వాతావరణాన్ని తట్టుకుంటే, సులువుగా పెరుగుతుంది. ఎండ ఛాయ ఎక్కువగా పడినప్పుడు ఎక్కువ పూలు పూస్తాయి. ఆకుల రంగు ప్రకాశవంతంగానూ ఉంటుంది. చక్కగా పెరుగుతుంది.
మొక్కకు చీడ పీడల సమస్య తక్కువ. లేత ఆకులకు రసంపీల్చే పురుగులు ఆశించకుండాఉండాలంటే నెలకోసారి వేప కషాయం చల్లాలి. నత్రజని, భాస్యరం ఎక్కువగాపోటాష్ తక్కువగా ఉన్నఅమ్మోనియం నైట్రో పాస్పేట్ 20:20:15 లేదా18:18:9 చొప్పున నెలకోసారి మొక్కలకు అందించాలి. కటింగుల ద్వారా, విత్తనాల ద్వారాఈమొక్కని ప్రవర్థనం చేయవచ్చు. నర్సరీలలో కొనుగోలుచేయవచ్చు.

మాల్ఫిజియా పూల మొక్కలు

మెరిసే ఆకులు, నక్షత్రాల లాంటి పూలు, పగడాలని గుర్తు చేసే కాయలతో నిండుగా కనిపించే మొక్కలు మాల్ఫిజియా మాల్ఫీజియా మొక్కకు . తెలుపు, గులాబీ రంగుల పూలు ఏడాదంతా పూస్తాయి. ఈ మొక్కల ఆకులు హోలీ మొక్కను పోలి ఉండటం వల్ల దీన్ని సింగపూర్ లేదా డ్వార్ఫ్ హోలీ అని పిలుస్తారు. ఇది ఒకటి నుండి మూడడుగుల ఎత్తలో పెరిగే చిన్నపొద గుబురుగాముళ్లతో ఉండి కత్తిరింపులకు బాగా తట్టుకుంటుంది. దీని చిన్న ఆకులు ముదురాకు పచ్చ రంగులోమెరుస్తూ రంపపు పళ్ళ వంటి అంచులతో ధృఢంగా ఉంటాయి.పూలు సున్నితంగా తెలుపు, గులాబీ రంగులలో నొక్కుల అంచులతో కనువిందు చేస్తాయి. పూలు ఏడాది పొడవునా పూస్తాయి.
ఎక్కడైనా అనువుగా చక్కని ఆకృతిలో గుబురుగా ఎదిగే ఈ మొక్క అన్నిచోట్లా సులువుగా పెరుగుతుంది. ముఖ్యంగా చిన్న చిన్న ఆకులు, ముళ్ళు ఉండటం వలన రాక్ గార్డెన్ కూ, చిన్నగా ఉండటం వలన గోడల పక్కనా నాటుకుంటే చూడముచ్చటగా కనిపిస్తాయి. వివిధాకృతులలో కత్తిరించుకునే వీటిని కుండీలలో సులభంగా పెంచుకోవచ్చు. బోన్సాయ్ ని పెంచుకోవాలనుకునే వారికి ఇది మొదటి ఎంపిక.
మన వాతావరణంలో చక్కగాపెరిగే ఈ మొక్కలకు ఎరువులు అవసరం లేదు.ఎలాంటి నేలలో అయినాపెరిగే ఈ మొక్క ఎండలో ప్రకాశవంతంగా ఎదుగుతుంది. కొద్దిపాటి నీడను తట్టుకోగలదు. తేమఉండి నీరు నిలవని మట్టి మిశ్రమాన్ని దీనికోసం ఎంచుకోవాలి. మొక్కను నాటుకునేటప్పుడే మట్టిలో వర్మీ కంపోస్ట్ కలుపుకోవాలి. లేదా తేమ ఉండే నీరు నిలవని మట్టి మిశ్రమంలో చక్కగాపెరుగుతుంది.రెండు నెలలకోసారి ఎన్ పీ కే ఉండే సమగ్ర ఎరువుని మొక్కకు అందించాలి. దీనికి చీడపీడలు పెద్దగా ఆశించవు. నెలకోసారి వేప కషాయాన్ని కానీపిండిని కానీ చల్లితే పురుగుల బెడద ఉండదు. ఈ మాల్ఫీజియాను కత్తిరించి నాటుకోవటం ద్వారా ప్రవర్ధనం చేయవచ్చు. నర్సరీలలో లభిస్తాయి.

తంబర్జియా

tambargiaకంటి కింపైన రంగుల పూలతో పెరిగే తీగజాతి మొక్కలివి. ఈ మొక్కలు మన దేశానికి చెందినవే. నీలి, ఊదా రంగు పూలతో ప్రకాశవంతమైన కాషాయరంగులో నల్లని కంఠం గల పూలతో అలరించే బ్లాక్ ఐడ్ సుశాన్, తెల్లపూలు కలిగిన తంబర్జియా అల్ఫా, ఊదా రంగు పూలతో నీలి తంబర్జియా అన్నీ మనోహరంగాఉంటాయి. ఇవన్నీ ఏడాది పొడవునా పూలు పూస్తూ ఉండే తీగజాతి మొక్కలు. ఈ మొక్కలు చాలా వేగంగా ఎదుగుతాయి. త్వరగా పూయడం మొదలు పెట్టి ఏడాదంతా పూలు పూస్తూనే ఉంటాయి.
పూత అయిపోయిన కొమ్మలతో పాటూ అప్పుడప్పుడూ కింది వరకూ కత్తిరిస్తూ ఉంటే మొక్కలు చక్కగా అదుపులో ఉంటాయి. ఎండ ఎక్కవగా తగిలే ప్రదేశంలో వీటిని నాటుకుంటే మంచిది. కొద్దిపాటి నీడనూ ఇవి తట్టుకోగలవు. వీటికి క్రమం తప్పకుండా నీరు పెట్టాల్సిన అవసరం లేదు. మట్టి మరీ తడారిపోకుండా చూసుకోవాలి.
వీటికి తెగుళ్ళ సమస్య పెద్దగా ఉండదు. కానీ రసం పీల్చే పురుగులు ఆశించే ప్రమాదం ఎక్కువు వేప కషాయాన్ని నెలకొకసారి సమస్య ఎక్కువగా ఉన్నపుడు 15 రోజుల కొకసారి చల్లాలి.
ఎన్ పీ కెలు ఉండే సమగ్ర ఎరువుని నెలకొక సారి వేస్తూ వర్మికం పోస్ట్ ను మట్టి మిశ్రమంలో కలుపుకోవాలి. ఇలా చేయడం వలన చక్కని పూలు పూస్తాయి. బ్లాక్ డ్ సుశాన్ నాలుగు నుంచి ఐదు అడుగులు పెరిగి కుండీలలో పెంచటానికి అనువుగా ఉంటుంది. మిగతా రెండురకాలు బలమైన ఆధారం అందిస్తే నలభై నుండి అరవై అడుగుల ఎత్తు వరకు ఎగబాకుతాయి వీటిని గోడలూ, అర్చీల మీదకు ఎక్కిస్తే చక్కగా అల్లుకు పోతాయి. తంబర్జియాల ను సులువుగా విత్తనాలద్వారానే కాకుండా కత్తింపుల ద్వారా వేళ్ళను విడదీసి నాటుకోవచ్చు. నర్సరీల నుండి కూడా కొనుగోలు చేయవచ్చు.

నోలీనా మొక్కలు

tambargiaముచ్చటైన ఆకృతితో ఎక్కడైనా పెంచుకునే అవకాశం ఉన్న మొక్కలు నోలినా.నోలినాను ముద్దుగా పోనీటైల్ పామ్, బాటిల్ పామ్,ఏనుగుపాదం మొక్క అని కూడా పిలుస్తారు. కాండం పైన సన్నగా కింద బంతి లాగా, బలంగా వెడల్పుగా ఉంటుంది. ఆహారాన్ని ఇవి కాండంలో దాచుకుంటాయి. మెక్సికో దేశానికి చెందిన ఈ మొక్కలు ఇప్పుడు అన్ని దేశాలలో లభిస్తున్నాయి. .
తక్కువ నీటితో ఆరోగ్యంగా పెరుగుతాయి నోలీనా మొక్కలు. వయసు బాగాపెరిగినప్పటి నుండి చిన్న చిన్న కొమ్మలు వస్తాయి. వీటి ఆకులు కొమ్మ చివర వలయాకారంలో అమరి ఉంటాయి. ఆకులు చూడడానికి సన్నగా బిరుసుగా, పదునైన అంచులతో చివర్ల మొనదేలి చూడడానికి పోనీటెయిల్ లాగా కనిపిస్తాయి. మొక్క ఎక్కువ ఉష్ణోగ్రతలో, అతి తక్కువ నీటితో పెరుగుంది. రోజూ నీళ్ళు పోయాల్సిన అవసరం ఉండదు. వారానికోసారి నీరు పోస్తే చాలు. ఆకుల అంచులు ఎండిపోతుంటే గాలిలో తేమ శాతం తక్కువగా ఉందని తెలుసుకుని కొద్ది రోజులపాటు ఆకుల మీద నీళ్ళు చల్లాలి. ముఖ్యంగా మన దగ్గర వేసవిలో ఆరోగ్యంగా ఎదిగే మొక్కలు ఇవి. ఈ మొక్కలను బయట పెంచుకోవాలంటే నేరుగా ఎండతగిలే ప్రపదేశంలో నాటుకోవాలి. ఇంటిలోపల అయితే ఎక్కువ కాంతి తగిలే ప్రదేశంలో ఉంచాలి. రాక్ గార్డెన్ లో ఈ మొక్కలను పెంచితే ప్రత్యేకంగా కనబడతాయి. అన్ని నేలలోను నోలినా మొక్కలు పెరుగుతాయి. నీళ్ళు నిలవని మట్టిని ఎంచుకోవాలి. నాటుకునేటప్పుడు మట్టిలో కంపోస్ట్ లేదా వర్మీకం కలిపితే మంచిది. రెండు మూడు నెలలకొకసారి 17:17:17 చొప్పున ఎన్ పీ కె నీళ్ళలో కలిపి మొక్కకు అందిస్తే ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా పెరుగుతాయి. .
కుండీలలో పెంచేవారు మొక్క రెండు మూడేళ్ళు ఎదిగిన తరువాత వెడల్పు మూతి గల కుండీలలోకి మార్చుకోవాలి. మొక్కల వేళ్ళు పైపైనే ఉంటాయి కాబట్టి లోతైన కుండీలు అవసరం లేదు.కుండీల నుండి వేరేకుండీల లోనికి మార్చేటపుడు మాత్రం వేర్లు తెగిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రూనింగ్ చేసేటపుడు ఆకుల చివర్లను కత్తిరించకూడదు. మిలీబగ్ వంటివి దాడి చేసే అవకాశం ఉంది. ఈ ఇబ్బందిని వేపనూనె నీటిలో కలిపి చల్లుకోవటం ద్వారా నివారించుకోవచ్చు. ఈ మొక్కలు పూలు పూయటానికి చాలా సంవత్సరాలు పడుతుంది. నోలీనా మొక్కలను విత్తనాల ద్వారా కాకుండా నర్సరీల నుండి కోనుగోలు చేసి పెంచుకుంటే మంచిది

వాడామల్లి

vadamalliగులాబీలను పోలి ఉండి ఇంటికి కళను తీసుకు వస్తాయి ఈ పూలు. వీటిని గోమ్ ఫెర్నా అంటారు. శివుడికి, కుమారస్వామి బాగా ఇష్టమైన పూలు. ఒకసారి నాటితే ఏడాది వరకూ పూలుపూసే మొక్కలు ఇవి. నేలలోనూ, కుండీలలోనూ పెంచు కోవచ్చు. విండో ప్లాంటర్ల లో పెంచుకోవచ్చు. వెడల్పు మూతి కలిగిన వాటిని ఎంచుకుంటే మంచిది. పూలువాడిన తరువాత అవి తొట్టిలోనే పడి వాటినుంచి విత్తనాలు నేలపై పడి కొత్త మొక్కలు కొన్నివారాలలోనే పెరుగుతాయి.
ఒక మొక్క చనిపోయేలోగా దాని చుట్టూ పది మొక్కలు దాని చుట్టూ గుబురుగా పెరుగుతాయి. పూల వ్యాపారులు బంతిపూల తరువాత ఈ పూలనే ఎక్కువగా అమ్ముతారు.
భూమిలో సారాన్ని బట్టి ఇవి రెండడుగల ఎత్తులో పెరుగుతాయి. ఈ మొక్క ఎదిగి పూయడానికి మన రాష్ట్రంలోని అన్ని నేలలూ అనువైనవే. కానీ వీటిని నీడలోనే పెంచాలి. ఎక్కువ ఎండ పనికిరాదు. ఎండలు విపరీతంగా ఉండే వేసవిలో కూడా ఎండకు తట్టుకుని చక్కగాపెరుగుతాయి. తుమ్మెదలను, సీతాకోక చిలుకలను ఎక్కువగా ఆకర్షిస్తాయి.
కుండీలలో పెంచేటపుడు మట్టితో పాటు సమపాళ్ళలో సేంద్రియ ఎరువును కలిపి…దానిలో కొంచెం బోన్ మీల్, వేపపిండి వేయాలి.ఇలాంటి మట్టిలో విత్తనాలు నాటుకుంటే మరలా ఎటువంటి పోషకాలు, కీటక మందులు వాడే అవసరం ఉండదు. మొక్క ఆరోగ్యంగా అందంగా ఎదుగుతుంది. నీటి కొరత ఉన్న ప్రదేశాలలో కూడా అందుబాటులో ఉన్న నీటినే గ్రహిస్తూ పూలు పూస్తుంది. వర్షాకాలంలో చలికాలంలో రెండు రోజుల కొకసారి ఎండాకాలంలో ప్రతి రోజూ నీరు పోయాలి.
మార్చి నుండి జూన్ వరకు ఈ పూలు ఎక్కువగా పూస్తాయి .మన ప్రాంతంలో ఎక్కువగా గులాబీ రంగు పూలు పూసే మొక్కలు ఎక్కువగా లభిస్తాయి. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న విత్తనాల ద్వారా తెలుపు, ఎరుపూ, లేత గులాబీ మొక్కలు లభిస్తున్నాయి. దీనికి చీడపీడల సమస్య చాలా తక్కువ. తెల్లదోమ, పేను బంక వంటివి సోకినపుడు వేపనూనెను నీటిలో కలిపి రెండు రోజులకు ఒక సారి చొప్పున చల్లాలి. ఇలా పదిసార్లు చేయాలి.ఈ మొక్కలు నర్సరీలలో దొరకవు. ఈ మొక్కలు పెంచుకునే వారి దగ్గర నుండి విత్తనాలను సేకరించి నాటుకుంటే ఆరు నుండి ఎనిమిది వారాలలో మొలకెత్తుతాయి.

ఐస్ ప్లాంట్ మొక్కలు

చిన్న చిన్న అందమైన పూలతో ప్రకాశవంతమైన పచ్చని ఆకులతో కనువిందు చేసే మొక్కలు ఐస్ ప్లాంట్ మొక్కలు. ఇంట్లో పెంచుకోవటానికి మరియు లాండ్ స్కేపింగ్ కు అనువుగా ఉంటాయి. సారవంతం కాని, నీటి వసతి లేని భూములలో కూడా చక్కగా త్వరగా, దట్టంగా పెరుగుతాయి. ఎలాంటి పరిస్థితులలై నైనా చక్కగా పెరుగుతాయి.. రెండునుండి నాలుగడుల వరకూ విస్తరించే మొక్కలు ఇవి. వాలులో నాటటానికి, రాక్ గార్డన్ లోనూ, లాన్ల కోసం, కాలి బాటల పక్కన పెంచితే అందమైన పూలతో కనువిందుచేస్తాయి.
పెంచే విధానం :
ఈ మొక్కలు నీరు నిలవని నేలలో ఎక్కువ వెలుతురు ఉండే చోట బాగా పెరుగుతుంది. ఒకసారి కుదురుకున్నాక అప్పుడప్పుడూ నీళ్లు పోస్తే చాలు. ఈ మొక్కకు ఎరువులు అవసరం పెద్దగా లేకున్నా ఇళ్ళలో పెంచుకునేటపుడు కొద్దిగా వర్మీకం కంసోస్టు లేదా 17:17:17 శాతం ఎన్.పి.కె ఎరువు వేసి అప్పుడప్పడూ మట్టి పూర్తిగా తడారి పోయాక నీళ్ళు పెడుతూ ఉండే ఎక్కువకాలం ఎక్కువ పూలు పూస్తాయి.
ఐస్ ప్లాంట్లలో పసుపూ, తెలుపూ, ఊదా, ఎరుపు, ఆరెంజ్, గులాబీ రంగుల్లో పూలుపూసే రకాలున్నవి. చలికాలం నుంచి ఎండలు ముదిరే వరకూ ఈ మొక్కలు ఎక్కువగా పూస్తాయి..పూలు లేనప్పుడు కూడా పచ్చని ఆకులతో అందమైన తివాసీలాగా కనువిందు చేస్తాయి.
రంగురంగుల ఐస్ ప్లాంట్స్ సీతాకోక చిలుకలను ఎక్కువగా ఆకర్షిస్తాయి. వీటి ఆకులు వెలుతురు పడినప్పుడు మంచు స్పటికాలలాగా మెరుస్తూ ఉండటం వలన వీటికి ఐస్ ప్లాంట్స్ అని పేరు వచ్చింది. ఎక్కువగా ఎండలో పెరిగే మొక్కలైనా కూడా కొద్దిపాటి నీడనుమాత్రమే తట్టుకుంటాయి.
ఈ మొక్కలు ఎంతపొడి నేలలలో నైనా పెరుగుతాయి. కానీ నీరు నిలవకూడాదు. మొక్కలు కుళ్ళిపోతాయి. విత్తనాల ద్వారా మొలకెత్తించు కోవచ్చు. కానీ విత్తనాలను నేలలో పాతకూడదు. పైనే వేయాలి. ఇవి పెరగటానికి వెలుతురు అవసరం.ఈ మొక్కలకు చీడపీడలు అంతగా ఆశించవు. నర్సరీల్లో తక్కువ ధరకే దొరకుతాయి.

రాక్ క్రీపర్

Rock Kreeper Plants….రాక్ క్రీపర్
miracle fruitsఇళ్లపై అందంగా పెరిగే మొక్కే రాక్ క్రీపర్. దీని శాస్త్రీయ నామం పైకస్ ప్యుమిలా లేక పైకస్ రిటర్న్. ఈ మొక్కలను కాంక్రీట్ భవనాలను పచ్చగా మారుస్తాయి. తక్కువ సమయంలో అందమైన టోపియరీలుగా రూపొందించుకునే వెసులుబాటు ఉంది. వీటిని పెంచుకోవటం చాలా సులువు. ఎలాంటి నేలలోనైనా పెరుగుతాయి. ఎక్కువ ఎండలోనూ కొద్దిపాటి నీడలోనూ పెరుగుతాయి. సాధారణంగా రెండు నుంచి ఏడు మీటర్ల ఎత్తులో పెరుగుతాయి.ఇంకా శ్రద్ధ తీసుకుంటే రెండు, మూడు అంతస్తులపైన కూడాపెరిగి భవనాన్ని పూర్తిగా కప్పివేయగలవు.
రాక్ క్రీపర్ వర్షాకాలంలో గోడకు దగ్గరగా బాగా ఎరువు కలిపిన గుంటల్లో అడుగుమదూరంలో వర్షా కాలంలో నాటితో త్వరగా గోడకు అంటుకుని పెరుగుతుంది. దీనికున్న గాలివేర్ల ద్వారా ఆధారాన్ని గట్టిగా పట్టుకుని అల్లుకుపోతుంది.
హ్యాంగింగ్ పాట్స్ లో పెంచుకున్నా బాగుంటుంది. దీని ఆకులు చిన్నగా కోడిగుడ్డు లేదా లవ్ సింబల్ ఆకారంలో లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ముదురు కొమ్మల ఆకులు కొంచెం పెద్దగా మందంగా ముదురాకు పచ్చరంగులో ఉంటాయి. పూలు, కాయలు మామూలుగా ఉంటాయి.
రాక్ క్రీపర్ కు ప్రూనింగ్ తప్పనిసరి. జాగ్రత్తగా అదుపులో ఉంచకపోతే ఇది కీటికీలనూ, గోడలలోని కంకరను కూడా తొలిచివేస్తుంది. ఇంట్లో పెంచుకునేటపుడు రసం పీల్చే పురుగులు ఆశించ వచ్చు. వేప, కానుగ, వెల్లుల్లి కషాయాలను క్రమం తప్పక వాడితే మంచిది. ఎరువులు పెద్దగా వేయవలసిన అవసరం లేదు. అప్పుడప్పడూ నేలలో వర్మీకం పోస్టును కలపడంతో పాటూ నత్రజని ఎక్కువగా ఉండే డిఏపీవంటి ఎరువులను నెలకొకసారి వాడితే సరిపోతుంది. దీనిని కటింగ్ ల ద్వారా పెంచుకోవచ్చ. నర్సరీలలో కూడా దొరకుతాయి.

లిల్లీ పిల్లీ మొక్కలు


తెల్లటి పూలు, రంగుల ఆకులతో ఈ చెట్లు నిండుదనంగా ఉంటాయి. వీటి శాస్త్రీయ నామం సిజీయం ఫ్లోరిబండా. వీటి పుట్టుక ఆస్ట్రేలియా, మన దేశంలో ఇప్పుడిప్పుడే ప్రాచుర్యం లోనికి వస్తున్నాయి.
రెండు నుంచి మూడు మీటర్ల ఎత్తులో పెరిగే మొక్కలు ఇవి. గుబులుగా నిలువుగా పెరుగుతూ కత్తిరించేందుకు అనుకూలంగా ఉంటాయి. వీటి లేత ఆకులు ముదురు ఎరుపురంగులో ఉండి క్రమంగా ఆకుపచ్చ వర్ణంలోనికి మారి మెరుస్తూ ఉంటాయి. వీటి పూలు చిన్నవిగా, తెలుపు రంగులో ఉండి మంచి వాసన వస్తాయి. వీటి కాయలు చిన్నగా ఆకులు, పూలూ మొత్తంగా ఆకర్షణీయంగా ఉంటాయి.
లిల్లీపిల్లి మొక్కలు టోపియర్ గా మలచటానికి అనుకూలంగా ఉంటాయి. ఈ మొక్కలను వరుసగా నాటి గోడలుగా పెంచుకోవచ్చు. కత్తిరించకుండా ఉన్నా కూడా చిన్న చెట్టులా ప్రకాశవంత మైన రంగుల ఆకులతో ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఈ మొక్కలు కుండీలలో పెంచటానికి అనువుగా ఉంటాయి సులువుగా పెంచుకోవచ్చ. కొద్దిపాటి నీడ చాలు సూర్యకాంతి పడినపుడు బాగా పెరుగుతాయి. మంచిసారవంతమైన, నీరు నిలవని మట్టి మిశ్రమంలో చక్కగా పెరుగుతాయి. ఈ మొక్కలకు నత్రజని, పొటాష్, ఎక్కువగా ఉండే ఎరువులను వేసుకోవాలి. వర్మీకం పోస్ట్, బూడిదను మట్టి మిశ్రమంలో కలిపితే మంచిది. ఈ మొక్కకు ఫిల్లిడ్లు ఆశించడం వల్ల మొక్కలేత ఆకులపై చిన్న చిన్న బుడిపెలు వచ్చి వికారంగా ఉంటాయి. అందుకే ఈ సమస్య వచ్చినపుడు రోగార్ రెం డు మిల్లీలీటర్లను నీటిలో కలిపి పదిరోజుల వ్యవధిలో రెండుసార్లు చల్లాలి. నర్సరీలలో ఈ మొక్కలు దొరకుతాయి.