Tomoto -టొమాటోలు

టొమాటోలో పోషకాలు ఎక్కువ. గుండె జబ్బులూ, క్యాన్సర్ను నిరోధించే లైకోపిన్ అధికం. విటమిన్లు – బి, సి, కె లతోపాటు పొటాషియం కూడా ఎక్కువే. కొలెస్ట్రాల్ను తగ్గించడం, రక్తప్రసరణను క్రమబద్ధం చేయడం, మూత్రపిండాలను సంరక్షించడం… లాంటి ఎన్నో ప్రయోజనాలు దీనివల్ల కలుగుతాయి.
ప్రపంచంలో అత్యధికంగా సాగులో ఉన్న కూరగాయల్లో అధిక పోషకాలున్న కూరగాయ టొమాటో. దీని శాస్త్రీయ నామం లైకోపెర్సికమ్ ఎస్క్యులెంటమ్. అధిక వర్షాలూ, అత్యధిక ఉష్ణోగ్రతలు టొమాటో పండించడానికి ఆటంకాలైనా… ఈ పరిస్థితులను తట్టుకునే రకాల రూపకల్పన వల్ల దీన్ని అన్ని కాలాల్లోనూ పండించవచ్చు.
టొమాటోకు సాధారణంగా చీడపీడల బెడద ఎక్కువ. సేంద్రియ పద్ధతిలో పెంచుకునేటప్పుడు దేశవాళీ రకాలు లేదా తెగుళ్లను తట్టుకోగలిగిన సంకర రకాలను ఎంచుకోవాలి. మనమే నారు పోసుకోదలచుకున్నప్పుడు ట్రైకోడెర్మా పొడి కొద్దిగా విత్తనాలకు కలిపి నారు పోసుకోవాలి. సాధారణంగా 20-25 రోజుల వయసున్న నారును నాటుకుంటే మంచిది. నాటిన రెండు నెలలకు కాపు మొదలై మరో రెండో నెలల వరకూ కొనసాగుతుంది. నేలలో అయితే పశువుల ఎరువూ, జీవ ఎరువులు కలిపి చక్కగా తయారుచేసిన మళ్లలో, బోదెల మీదా అడుగున్నర దూరంతో నాటుకోవచ్చు. అదే కుండీలో అయితే ముందే తయారుచేసి పెట్టుకున్న సారవంతమైన మట్టి మిశ్రమంలో కుండీ సైజును బట్టి 2 – 3 మొక్కలు నాటుకోవాలి.
మూడు రకాల్లో
టొమాటోలో నిలువుగా పెరిగేవి, కొద్దిగా సాగేవి, ఎక్కువగా సాగేవి అని మూడు రకాలుంటాయి. సాగే రకాలైనా కొద్దిగా పెరగ్గానే వెదురు బద్దలు లేదా కర్రలను ఆధారంగా కట్టుకుంటే చక్కగా పెరుగుతాయి. 2-3 రోజులకొకసారి నీళ్లు పోస్తే చాలు. ఎరువులు ముందే కలుపుతాం కాబట్టి నాటిన వారం, పది రోజులకోసారి జీవామృతం, వర్మివాష్, వీలైతే పంచగవ్వ లాంటివి ఇస్తుంటే మొక్క ఆరోగ్యంగా పెరిగి బాగా కాస్తుంది. సేంద్రియ పద్ధతిలో పెంచుకునేటప్పుడు ఒకసారి టొమాటో నాటిన మట్టిలో రెండోసారి వేరే కూరగాయలేవైనా అంటే… వంగా, మిరపా, క్యాప్సికమ్, (ఒకే కుటుంబానికి చెందినవి) కాకుండా నాటుకోవాలి. ఫ్రెంచ్ బీన్స్, గుట్టచిక్కుడూ, గోరు చిక్కుడు లాంటివి నాటుకుంటే నేల సారవంతం కావడమే కాదు, తెగుళ్ల సమస్యా తగ్గుతుంది. ఈ పంటలు తీసేశాక మళ్లీ టొమాటోను అదేచోట నాటుకోవచ్చు.
మొక్కలే రక్షణగా
ఎండుటాకులు ఎప్పటికప్పుడు తీసేసి మొక్క చుట్టూ శుభ్రంగా ఉంచుకోవాలి. కుండీలయితే దూరం దూరంగా అమర్చి మొక్కలకు సరిగా గాలి తగిలేలా చూసుకోవాలి. వర్షాలు పడుతున్నప్పుడు కుండీల్లో నీరు నిలవనివ్వకూడదు. పురుగులూ, తెగుళ్లు ఆశిస్తున్నాయా లేదా అనేది ఎప్పటికప్పుడు గమనించుకోవాలి. ఈ జాగ్రత్తల వల్ల పురుగు మందులు ఎక్కువ వాడనవసరం లేకుండా మొక్కలు ఆరోగ్యంగా పెంచుకోవచ్చు. తీపి జొన్న మొక్కలు కొన్ని, బంతి మొక్కలు కొన్ని టొమాటో మొక్కలతో కలిపి పెంచుకోవడం వల్ల కాయ తొలిచే పురుగు ఆశించే ప్రమాదం తగ్గుతుంది. అలాగే తోటకూరా, పుదీనా వంటివి కలిపి నాటుకోవడం వల్ల కూడా చాలా పురుగులు దూరంగా ఉంటాయి. వేప కషాయం, కానుగ కషాయం అప్పుడప్పుడూ చల్లుతూ ఉండాలి. వెల్లుల్లి కషాయం వాడటం వల్ల ఆకుమచ్చ ఎండుతెగులు లాంటివి అదుపులో ఉంటాయి. స్టికీట్రాప్స్ రెండు-మూడూ అమర్చుకోవడం వల్ల రసం పీల్చే పురుగుల సమస్య తగ్గుతుంది.
టొమాటోలోనూ చాలా రకాలున్నాయి. మనదగ్గర పులుపు ఎక్కువ ఉండే రకాలు కొందరికి నచ్చితే, తక్కువ కండతో తియ్యగా ఉన్నవాటికి మరికొందరు ప్రాధాన్యం ఇస్తారు.
పుల్లని రకాలు పూసారూబీ, పూసా ఎర్లీ డ్వార్ఫ్, స్వీకార్, అర్క విశాల్, సెలెక్షన్ 12.
తీపి రకాలు మనీషా, సదా బహార్, గుల్ మొహర్, రూపాలీ, అర్క రక్షక్.
బాగా పండిన కాయల నుంచి విత్తనాలు తీసి కడిగి నీడలో ఆరబెట్టి మళ్లీ పంటకు వాడుకోవచ్చు.
క్యారెట్లను టొమాటోతో కలిపి నాటుకుంటే, వాటి రుచి పెరుగుతుందట. మీ ఇంట్లో గులాబీ మొక్కలుంటే టొమాటో ఆకుల రసాన్ని నీళ్లలో కలిపి వాటిపై చల్లండి. అలా చేస్తే గులాబీ ఆకుల మీద వచ్చే నల్ల మచ్చ తగ్గుతుంది.

Snake Gourd ,Bottle Gourd, Ridge Gourd పొట్ల..సొర…బీర..కాకర

ఎక్కువ కెలొరీలూ, ఎక్కువ విటమిన్లూ, ఖనిజ లవణాలతో ఆరోగ్యానికి మారుపేరు పందిరి కూరగాయలు. ఇవి సులువుగా జీర్ణమవుతాయి. పైగా శరీరానికి చల్లదనం కూడా.
పందిరి కూరగాయల్లో ముఖ్యమైనవి సొరా, బీరా, పొట్లకాయా, కాకర. వీటిని అన్ని కాలాల్లో పెంచుకోవచ్చు. కుండీల్లోనూ నాటుకోవచ్చు. వీటికి పందిరి లేదా జాలీ వంటి సరైన ఆధారం ఇవ్వగలిగితే పెంచుకోవడం సులువే. ఈ పాదులకు ఆరేడు గంటలపాటు ఎండా, సారవంతమైన మట్టి మిశ్రమం అవసరం. వీటిని పెంచే కుండీలు అడుగున్నర లోతూ, పెంచుకునే మొక్కల సంఖ్యను బట్టి కనీసం అడుగు వ్యాసంతో ఉండాలి. పెద్ద ప్లాస్టిక్‌ పెయింట్‌ బకెట్లు బాగుంటాయి.
ఏడాదంతా కాసేలా… సొరా, బీరా, పొట్లకాయా, కాకర… ఏదయినా సరే కుండీకి లేదా పాదుకు నాలుగైదు గింజలు నాటుకోవాలి. ఇవి మొలకెత్తాక రెండు మొక్కలుంచుకుని బలహీనంగా ఉన్నవాటిని తీసేయాలి. నాటే ముందు విత్తనాలను బీజామృతంతో కలిపి ఆరబెట్టాలి. నాటిన 45-70 రోజుల్లో రకాన్ని బట్టి కాపు కొస్తాయి. ఇలా రెండుమూడు నెలలపాటు కాస్తూనే ఉంటాయి. వీటిని రకానికో కుండీలో ప్రతినెలా నాటుకుంటే ఏడాదంతా తాజా కూరగాయలు అందుతాయి.
పిందె వేసిన పది రోజుల్లోపు కోసుకుంటే కాయలు లేతగా ఉంటాయి. ఈ కూరగాయలను పందిరీ/జాలీ/కంచె మీదికి అల్లించేటప్పుడు పది కణుపుల వరకూ పక్కకొమ్మలూ, నులితీగలు తీసి తల తుంచివేయాలి. మొక్క ఆధారం కోసం కర్ర లేదా జాలీకి పురికొసతో కట్టి, తరువాత వచ్చే ప్రతి పక్క కొమ్మనూ 10-12 కణుపుల తరువాత తుంచేస్తే ఎక్కువ కాపు ఉంటుంది. నులితీగలను తీసేస్తే పూతా, పిందె ఎక్కువగా వస్తుంది.
విత్తనాల్లో రకాలు… పదిరోజులకొకసారి జీవామృతం, వర్మివాష్‌ లాంటివి పోస్తూ ఉంటే మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి. పొగాకు కషాయం, పచ్చిమిర్చి కషాయం, గోమూత్రం చీడపీడలను అదుపులో ఉంచుతాయి. మజ్జిగా, వంటసోడా నీళ్లూ, బూడిద తెగులును చాలా వరకూ దూరంగా ఉంచుతాయి. ఫిరమోన్‌ ట్రాపు ఒకటి పెట్టుకోవడం వల్ల పండు ఈగ ప్రమాదం ఉండదు. స్టిక్కీట్రాపులు రెండుమూడు పెట్టుకుంటే రసం పీల్చే పురుగులు చాలావరకు అదుపులో ఉంటాయి. ముదిరిపోయి తీగ మీదే ఎండిపోయిన సొరా, బీరకాయలను దాచుకుంటే… కావాల్సినప్పుడల్లా విత్తనాలు నాటుకోవచ్చు.
కాకర, పొట్ల మాత్రం ముదిరి, పండిపోయిన కాయల నుంచి గింజలు తీసి, శుభ్రంచేసి, బూడిద కలిపి నీడలో ఆరబెట్టి వాడుకోవాలి. లేదంటే ఈ కిందివాటిని ఎంచుకోవచ్చు.
సొర – పొడవు కాయలకు ఇండమ్‌204 (ఇండో అమెరికన్‌), నరేంద్రజ్యోతి(విఎన్‌ఆర్‌), పీకేఎం1, సీవో1, కోలగా ఉండేవి: కోహినూర్‌ (విజ్ఞాన్‌), పూర్ణిమ (విఎస్‌ఆర్‌), గుండ్రని కాయలకు: నం.85
బీర – సన్నగా, పొడవుగా ఉండే కాయలకు జగిత్యాల లాంగ్‌, ఆర్తి, సురేఖ, మహిమ…
గుత్తుల్లో కాసేవి సాత్పూలియా
పొట్ల – తెల్లపొట్టి కాయలకు సీవో 2, శ్వేత, తెల్ల పొడవు కాయలకు: పీఎల్‌ఆర్‌1, కౌముది, ఆకుపచ్చ మీద తెల్లచారలుండే పొడవు కాయలకు సీవో1, ఎండీయూ1
కాకర – పొడవాటి ఆకుపచ్చ కాయలకు ఇండమ్‌ కోహినూర్‌, విఎస్‌ఆర్‌ 28,
తెల్ల కాయలకు ఇండమ్‌ తాజ్‌, చాందిని,
పొట్టిగా, గుండ్రంగా ఉండే ఆకుపచ్చ కాయలకు విఎస్‌ఆర్‌ కన్హయ్య

Pumpkin – గుమ్మడి కాయ

గుమ్మడి కాయని చాలామంది కూరగాయ అనే దృష్టితోనే చూడరు. కానీ ప్రపంచంలో గుమ్మడిని అధికంగా పండించే దేశాల్లో చైనా తరువాత స్థానం మనదే! గుమ్మడిలో చాలా రకాలున్నాయి. రకరకాల ఆకారాల్లో, పరిమాణాల్లో, గోధుమా, ఆకుపచ్చ రంగుల్లో లభిస్తుంది. మనం ఎక్కువగా పులుసూ, కూర చేసుకుంటాం. అయితే ప్రపంచవ్యాప్తంగా దీంతో ఎన్నో రకాల స్వీట్లూ, కేకులూ, ఇతర బేకింగ్‌ పదార్థాలూ, పానీయాలు తయారు చేస్తారు. విదేశాల్లో హాలోవీన్‌ పండగకు ముఖ్య అలంకరణ దీంతోనే.
గుమ్మడిలో పోషకాలూ, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. దీన్ని తినడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. కంటిచూపు మెరుగవడం మాత్రమే కాదు నిద్ర కూడా బాగా పడుతుంది. దీని కాయలే కాదు ఆకులూ, పూలూ, కొమ్మలూ, గింజలు… ఇలా అన్నీ ఔషధ గుణాలున్నవే.
ఎప్పుడు నాటుకోవచ్చు!
గుమ్మడిని దాదాపు సంవత్సరం పొడవునా పండించొచ్చు. రకాన్ని బట్టి నాటిన దగ్గర్నుంచి కాయ పూర్తిగా తయారవడానికి 70 నుంచి 120 రోజులు పడుతుంది. అన్ని నేలల్లోనూ పండినా, నీరు నిలవని సారవంతమైన మట్టి మిశ్రమం దీనికి అనుకూలం. కుండీలో పెంచుకునేటప్పుడు ఎర్రమట్టి, పశువుల ఎరువులతోపాటు ఇసుక కూడా కలిపిన మట్టి మిశ్రమం తయారు చేసుకుంటే మంచిది. దీనిలో పిండి ఎరువులూ, ఎముకల పొడి కూడా కలిపితే రసాయన ఎరువుల అవసరం ఉండదు. కుండీల కంటే పెద్దపెద్ద రీపర్‌ చెక్కపెట్టెలు గుమ్మడి పాదుకు అనువుగా ఉంటాయి.
పాదులో లేదా కుండీలో మూడునాలుగు గింజలు నాటుకోవాలి. మొలకలు పెరిగి నాలుగైదాకులు వేశాక ఆరోగ్యంగా ఉన్న మొక్కను ఉంచి మిగిలిన వాటిని తీసేయాలి. సాధారణంగా నాటిన 10-12 రోజుల్లో గుమ్మడి విత్తనాలు మొలకెత్తుతాయి. విత్తనాలను బీజామృతం లేదా ట్రైకోడెర్మా పేస్టుతో కలిపి, నీడలో ఆరబెట్టి నాటుకోవడం మంచిది. ఇప్పుడు జులై-ఆగస్టులో నాటుకోవచ్చు.
తొట్టెలో లేదా నేలలో దీంతోపాటు మొక్కజొన్నా, గోరుచిక్కుడూ, ముల్లంగి కూడా ఒకటి రెండు మొక్కలు కలిపి నాటుకుంటే మంచిది. ఇవి చక్కని స్నేహితుల్లా చీడపీడల నుంచి ఒకదానినొకటి రక్షించుకుంటాయి. అయితే అన్ని మొక్కలు నాటినప్పుడు అన్నిటికీ సరిపడా పోషకాలు ఇస్తుండాలి. అన్నిటి వేరు వ్యవస్థకూ సరిపడేలా తొట్టె పరిమాణం ఉండాలి.
మొక్కకు పది కాయలు!
గుమ్మడికి క్రమం తప్పకుండా నీళ్లు పోయాలి. కుండీల్లో మట్టి త్వరగా పొడిబారుతుంది కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండాలి. గుమ్మడిలో ఆడపూలూ, మగపూలు వేర్వేరుగా ఉంటాయి. పూత వచ్చే సమయంలో పలచగా చేసిన పుల్లటి మజ్జిగను చల్లుతూ ఉండటం వల్ల ఆడపూలు ఎక్కువగా వస్తాయి. గుమ్మడి పాదు ఆరు నుంచి పది కాయలు కాస్తుంది. జీవామృతం, పంచగవ్వ, వర్మివాష్‌ లాంటివి మొదట్లో పదిరోజులకు ఒకసారి, పిందె పడ్డాక వారానికొకసారి ఇస్తూ ఉంటే చక్కగా పెరిగి పెద్దకాయలు వస్తాయి. అర్క సూర్యముఖి, అర్క చందన్‌, సరస్‌, సువర్ణ, సూరజ్‌, అంబి… గుమ్మడిలో అభివృద్ధి పరచిన రకాలు.
కషాయాలు చల్లాల్సిందే!
మిరపా, గన్నేరు, జట్రోపా ఆకుల కషాయాలు చల్లుతూ ఉండటం వల్ల ఆకు తినే పురుగులూ, రసం పీల్చే పురుగులు అదుపులో ఉంటాయి. లాంటానా ఆకుల కషాయం పొడ తెగులును తగ్గిస్తుంది. వెల్లుల్లీ, పుదీనా, లేదా మునగాకు కషాయాలు ఆకుమచ్చను, ఇతర తెగుళ్లను అదుపులో ఉంచుతాయి. ఈ కషాయాలన్నీ అప్పుడప్పుడూ చల్లుతూ ఉండటం వల్ల చీడపీడలు మొదట్లోనే అదుపులో ఉండి మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి. వేప కషాయం మాత్రం గుమ్మడి మీద వాడకపోవడమే మంచిది. దీనివల్ల ఒక్కోసారి ఆకులు మాడిపోతాయి.
రసాయన పురుగు మందులు వాడకుండా ఉన్నప్పుడు సీతాకోక చిలుకలూ, తేనెటీగలే పరాగ సంపర్కపు బాధ్యత తీసుకుంటాయి. గుమ్మడిలో కొవ్వుశాతం చాలా తక్కువ ఎ, సి, ఇ, బి1, బి2, బి6, బి12 విటమిన్‌లతోపాటు పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్‌, మాంగనీస్‌, ఇనుము, రాగి లాంటి ఖనిజ లవణాలూ అధికంగా ఉంటాయి. గుమ్మడి గింజల్లో ఒమేగా3 ఫ్యాటీ ఆసిడ్లు అపారంగా ఉంటాయి. సరిగ్గా చెప్పాలంటే ఇదో పోషకాల గని. ఆరోగ్యంగా, నాజుగ్గా ఉండాలనుకుంటే వెంటనే గుమ్మడిని తినడం అలవాటు చేసుకోండి.

Chillies – మిరప కాయలు

మిరపను సంవత్సరం పొడవునా పెంచుకోవచ్చు. కుండీలోనూ చక్కగా పెరుగుతాయివి. ఒకవేళ అవసరానికి మించి కాసినా వృథా అయిపోవు. కోయడం కొంచెం ఆలస్యమైతే ముదిరి, పనికి రాకుండా పోతాయనే భయం లేదు. పచ్చిమిర్చిగా కాకుంటే పండు మిరప, ఆ తరువాత ఎండుమిర్చిలా హాయిగా వాడుకోవచ్చు.
మిరప అనగానే ఘాటే గుర్తుకొస్తుంది కానీ ఆ ఘాటుకు కారణం వాటిలో ఉండే ‘క్యాప్సిసిన్‌’ అనే రసాయనమే. దీన్ని చాలా ఔషధాల్లో వాడతారు. మనకు మిర్చి అంటే కారం కోసం అనుకుంటాం కానీ అది చాలా రకాలుగా మేలు చేస్తుంది. మిరపలో కెలొరీలు తక్కువ. జీవక్రియలను వేగవంతం చేస్తుంది. అంటే సులువుగా బరువు తగ్గుతామన్నమాట. బోలెడన్ని విటమిన్లూ, యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. క్యాన్సర్‌ రాకుండా కాపాడుతుంది. ప్రోస్టేట్‌ గ్రంథిని ఆరోగ్యంగా ఉంచుతుంది.
వీటిలోని రకాలు
మిరప కూడా వంగా, టొమాటోల కుటుంబానికి చెందిందే. కొన్నిచోట్ల నేరుగా విత్తనాలే నాటుకుంటారు గానీ సాధారణంగా నారు పెంచుకుని నాటుకోవచ్చు. ఈ నారుని ఎత్తుగా చేసిన బెడ్లలో లేదా ప్రోట్రేలలో తయారు చేసుకుంటారు. మన పెరటి తోట కోసం కొన్ని గింజలు చాలు కాబట్టి రంధ్రాలు చేసిన మూడు అంగుళాల లోతు ప్లాస్టిక్‌ ట్రేలో కూడా నారు పోసుకోవచ్చు. లేదా దగ్గరలోని నర్సరీ నుంచి కొంచెం నారు తెచ్చుకోవచ్చు. మిరపలో ఎన్నో రకాలుంటాయి. బజ్జీలుగా, కూరలా చేసుకునేవీ, కారం ఎక్కువగా ఉన్నవీ, వివిధ రంగుల్లో అందంగా ఉండేవి…
ఇలా ఎన్నో. వాటిల్లో జి3, భాగ్యలక్ష్మి, కిరణ్‌, ప్రకాష్‌, జ్వాల రకాలు బాగా కాయడంతోపాటు చీడపీడలనూ కొంతవరకు తట్టుకుంటాయి. తక్కువ కారం ఉండాలంటే సూర్య (ఇండో అమెరికన్‌), గాయత్రి (సిరిజెంటా), సోనాక్షి (విఎస్‌ఆర్‌) బాడగి రకాలు బాగుంటాయి. మీ దగ్గర నాటు రకాలున్నా, ఒకటి రెండు ఇంట్లో వాడే మిరపకాయలైనా నారుపోసుకోవచ్చు. .
వారం రోజుల్లో… .
మీరే నారు పోసుకునేటట్లయితే ఇసుకా, కోకోపీట్‌, వర్మికంపోస్టు కలిపిన మిశ్రమాన్ని ట్రే లేదా ప్రో ట్రేలలో నింపి బాగా తడపాలి. ట్రేలో అయితే పల్చగా, ప్రోట్రేలలో అయితే గుంటకు ఒకట్రెండు విత్తనాలు తీసుకుని పైన మళ్లీ పల్చగా ఇసుక చల్లి షేడ్‌ నెట్‌తో కప్పాలి. విత్తనాలు నాటిన వారం రోజుల్లో మొలుస్తాయి. 40-45 రోజుల వయసున్న నారును ఒకట్రెండు గ్రాముల ట్రైకోడెర్మా పొడి కలిపిన నీళ్లలో అరగంట ఉంచి మొక్కకు మొక్క మధ్య అడుగున్నర దూరం ఉండేలా బోదెల మీద నాటుకోవాలి.
అదే కుండీల్లో అయితే కుండీ సైజును బట్టి 1 నుంచి 3 మొక్కలు నాటుకోవాలి. మిరపకు కనీసం ఆరు గంటలపాటు ఎండ ఉండాలి. నీరు నిలిచే మట్టి మిశ్రమం వాడాలి. ఎక్కువగా నీళ్లు పోయకూడదు. 3 నుంచి 4 రోజులకోసారి లేదా సాయంత్రంపూట ఆకులు వడలినట్లు కనిపిస్తే నీళ్లు పోయాలి. మిర్చికి నేల బాగా సారవంతంగా ఉండాలి. మట్టి మిశ్రమంలో ముందే జీవ ఎరువులూ, పశువుల ఎరువూ, వేరుశనగ పిండి ఎరువులూ, ఎముకల పొడి కలిపి పెట్టుకుని ఉంటారు కాబట్టి 15 రోజుల కొకసారి జీవామృతం, వర్మివాష్‌ లాంటివి పోస్తుంటే సరిపోతుంది. .
చీడపీడలూ ఆశించకుండా పది రోజులకొకసారి వేపకషాయం చల్లుతూ ఉండాలి. స్టిక్కీట్రాపులు ఒకట్రెండు పెట్టుకుంటే రసం పీల్చే పురుగులు అదుపులో ఉంటాయి. దానివల్ల వైరస్‌ తెగులు కూడా అదుపులో ఉంటాయి. ఫిరమోన్‌ ట్రాపులు కూడా 1 నుంచి 2 పెట్టుకుంటే (స్థలాన్ని బట్టి ) అన్ని మొక్కలకూ కాయ తొలిచే పురుగుల నుంచి రక్షణ ఉంటుంది.
ఒకసారి మిర్చి నాటుకున్న స్థలంలో లేదా కుండీలో ఇంకోసారి ఆకుకూరలూ, బెండా, చిక్కుడూ, బీన్స్‌ – ఇంకేదైనా (వంగ, టొమాటో కాకుండా) వేసుకోవచ్చు. దీనివల్ల తెగుళ్లు వచ్చే అవకాశం తగ్గుతుంది. మిర్చి సాధారణంగా రకాన్ని బట్టి విత్తినం నుంచి పంట పూర్తవడానికి 150 నుంచి 180 రోజులు పడుతుంది. నారు నాటిన 30 నుంచి 40 రోజుల్లో కాపు రావడం మొదలై 2 నుంచి 3 నెలలపాటు కాస్తుంది. ఇంకా త్వరగా కాపు వచ్చే హైబ్రిడ్‌ రకాలు కూడా ఉన్నాయి. .
– బోడెంపూడి శ్రీదేవి, ల్యాండ్‌స్కేప్‌ కన్సల్టెంట్‌…సౌజన్యంతో
Different Chilli Plants …Mirch Plants…పచ్చి మిర్చి… రోజువారీ వాడే మిర్చి మాదిరిగానే అనేక రకాల మిరపకాయలు ఉన్నాయి…వాటి ఎలా పెంచుకోవాలి ..?
బ్లాక్‌పెరల్‌ ముదురు ఊదా లేదా నలుపురంగు ఆకులతో ఉండే ఈ మొక్కకి చిన్నసైజు రేగు పండ్ల మాదిరిగా నల్లని మిర్చి కాసి, అవి పండేకొద్దీ ఎరుపురంగులోకి మారతాయి. సాధారణ జలపెనో రకంతో పోలిస్తే వీటి ఘాటు ఎక్కువే. ఈ రకాన్ని ఉద్యానవనం అంచుల్లో పెంచుకోవచ్చు.
చిల్లీ చిలి ఏనుగు దంతం లేదా లేత పసుపు రంగు నుంచి క్రమంగా ఎరుపురంగులోకి మారే ఈ రకం, అస్సలు కారం లేకుండా మిరియాల ఘాటుతో మంచి రుచిగా ఉంటాయి.
చైనీస్‌ ఫైవ్‌ కలర్‌: చెట్టునిండుగా గులాబీలో మందారాలో విరబూసినట్లుగా పూసే ఈ మొక్క చూడ్డానికి చాలా బాగుంటుంది. ఊదా రంగులో కాసిన కాయలు క్రమంగా లేతపసుపు, నారింజ, ఎరుపు, ముదురు ఎరుపు రంగుల్లోకి మారుతూ పంచ రంగుల్లో కనువిందు చేస్తుంటాయి.
పొయిన్‌సెటియా మధ్యలో ఎర్రని ఆకులతో ముద్దొచ్చే పొయిన్‌సెటియా క్రోటన్‌ మొక్కలానే మధ్యలో గుత్తులు గుత్తులుగా కాయలు కాస్తుంటాయి. ఆకుపచ్చనుంచి ఎరుపు, నారింజ వర్ణాల్లోకి మారుతుంటాయివి.
ప్రెయిరీ ఫైర్‌: నింగిలోని చుక్కల్లా మొక్కంతా గుండ్రని కాయలు కాయడమే కాకుండా అవి తెలుపు నుంచి నారింజ, ఎరుపు, ముదురు గులాబీ, ఊదా, వంకాయ వర్ణాల్లోకి మారుతుంటాయి.
ఇంకా చిన్నగా గుండ్రంగా ఉండే హాట్‌పాప్‌, కాస్త పెద్ద సైజులో మెరిసే విక్‌డ్‌ క్యాప్సికమ్‌, నారింజరంగులోని టాంజరిన్‌ డ్రీమ్‌, సన్నగా పొడవుగా ఉండే మెడుసా, పొట్టిగా రంగురంగుల్లో ఉండే న్యూమెక్స్‌ ట్విలైట్‌, మరీ పొట్టీ పొడవూ కాకుండా ఉండే బొలీవియన్‌ రెయిన్‌బో, ఊదా రంగు ఆకులతో అదే రంగులో కాసే పర్పుల్‌, ఒకేదాంట్లో రెండుమూడు రంగుల్లో కనిపించే అజి ఓమ్నికలర్‌… ఎన్నో రకాలు. రకాల్ని బట్టి వీటిల్లోనూ అంతో ఇంతో కారం ఉంటుంది. బ్లాక్‌ పెరల్‌, బొలీవియన్‌ రెయిన్‌బో, న్యూమెక్స్‌ ట్విలైట్‌, ప్రెయిరీ ఫైర్‌… వంటి వాటిల్లో సాధారణ మిర్చి కన్నా ఘాటెక్కువే.

Micro Greens…చిట్టిమొక్కలు

కేవలం రెండు, మూడు వారాలలోనే పంట దిగుబడి అందించేవి మైక్రోగ్రీన్స్. అని రకాల మొక్కలను మైక్రో గ్రీన్స్ గా పెంచవచ్చు. అయితే ఎక్కువగా ఆవకూర, ఎర్రతోటకూర, క్యాబేజీ, ముల్లంగి, బీట్ రూట్, తెల్లముల్లంగి, ఉల్లి రకాలను ఎక్కువగా పెంచుతున్నారు.
కొద్దిపాటి స్థలం ఉంటే మైక్రోగ్రీన్స్ ను పెంచవచ్చు. ఏదైనా కంటైనర్, మట్టి, విత్తనాలు ఉంటే చాలు. నాటిన పదిహేను రోజులలోనే చిట్టిమొక్కలు వస్తాయి. అయితే వీటికి గాలి, వెలుతురు తప్పనిసరి కాబట్టి డాబాల మీద పెంచుకోవచ్చు.
వీటిని మూడు, నాలుగు అంగుళాల దాకా పెరగనిచ్చి అన్నిరకాల వంటలలో వాడుకోవచ్చు, లేక నేరుగా తినవచ్చు. ఆకుకూరల కంటే 40శాతం పోషకాలు ఎక్కువంటున్నారు పోషకాహార నిపుణులు.
వీటిని పెంచే మట్టి కలుషితం కాకుండా చూసుకోవాలి. మనదేశంలో క్యాన్సర్లు పెరగటానికి కారణం పురుగుమందులతో కలుషితమైన నేలే అని అనేక అధ్యయనాలలో తేలింది. మొలకలకన్నా పెద్దగాను ఆకుల కన్నా చిన్నగాను ఉండే మైక్రో గ్రీన్స్ లో విటమిర్ కె,ఇ,సి తో పాలు కెరటోనాయిడ్లు నాలుగు నుండి ఆరుశాతం దాకా ఎక్కువని పరిశోధనలలో తేలింది. ఎర్ర క్యాబేజీ, ఎర్రతోటకూర, ఆకపచ్చ ముల్లంగి వీటి మైక్రో గ్రీన్స్ లో ఎక్కువ పోషకాలు ఉన్నాయంటారు పోషకాహార నిపుణులు.
రెండు, మూడు అంగుళాలు పెరిగిన ఈ చిట్టి మొక్కలు ఘూటైన సువాసన కలిగి ఉన్నందున రుచిగా ఉంటాయి. ముఖ్యంగా మైక్రోగ్రీన్స్ లోని యాంటీ ఆక్సిడెంట్లు, ఫినాలిక్ పదార్ధాలు, కెరటోనాయిడ్లు …క్యాన్సర్లు, హృద్రోగాలు, ఊబకాయం, హార్మోన్ల కొరత, మధుమేహం, ఆల్జీమర్స్, బి.పి వంటి అనేక వ్యాధుల నుండి రక్షిస్తాయని జీర్ణక్రియకు అవసరమైన ఎంజైమ్ లు వీటి నుండి లభిస్తాయని పరిశోధనలు తెలియచేస్తున్నాయి.

Yam Growing….చేమదుంపల సాగు

దుంపజాతికి చెందిన అధిక పోషకాలుండే కూరగాయల్లో చేమదుంప (చేమగడ్డ) ప్రముఖంగా చెప్పొచ్చు. సాధారణంగా దుంపల్లో పిండిపదార్థాలు ఎక్కువ. దాంతో బరువు పెరుగుతామనుకుంటాం. కానీ చేమదుంపలో పీచు అధికంగా ఉండటంతో బరువు తగ్గడం కూడా సులువే.
చేమదుంపను ఆర్వి, టారో, ఎలిఫెంట్‌ ఇయర్‌ అని రకరకాలుగా పిలుస్తారు. మూడు అడుగుల ఎత్తు పెరిగే ఈ మొక్క లేతాకు పచ్చరంగులో ఉండే పెద్దపెద్ద ఆకులతో అలంకరణ మొక్కలా కనిపిస్తుంది. ఎండతోపాటు కొద్దిపాటి నీడ ఉన్నా చేమదుంపను చక్కగా నాటుకోవచ్చు. లావుగా, గుండ్రంగా ఉండే తల్లి దుంపల కంటే, కొంచెం పొడవుగా, కోలగా ఉండే పిల్ల దుంపలే నాటుకోవడానికి శ్రేష్ఠమైనవి.
నేలలో నాటుకునేటప్పుడు అడుగున్నర దూరంతో బోదెల మీదా, అదే కుండీలో అయితే వెడల్పాటి కుండీలో నాటుకోవాలి. కుండీ కనీసం అడుగులోతు ఉండాలి. దుంపల్ని 2-3 అంగుళాల లోతులో నాటుకోవాలి. దుంపలను బీజామృతం లేదా ట్రైకోడెర్మా విరిడి కలిపిన నీళ్లలో అరగంట నానబెట్టి, ఆ తరువాత ఆరబెట్టి నాటుకోవాలి. దుంపలు నాటిన దగ్గర్నుంచి పంట తీసుకోవడానికి ఆరేడు నెలలు పడుతుంది. అందువల్ల మట్టిమిశ్రమంలో పశువుల ఎరువు, పిండి ఎరువులు కలిపి సారవంతంగా ఉండేలా చూసుకోవాలి.
సాధారణంగా జూన్‌-జులై, ఫిబ్రవరి-మార్చి నెలల్లో నాటుకుంటారు. ఇంటిల్లిపాదికీ సరిపడా చేమదుంపలు కావాలంటే మనిషికి రెండుమూడు కుండీల్లో చొప్పున (10-15 మొక్కలు) నాటుకోవాలి. ఆకులూ ఉపయోగమే!
చేమదుంపకు నేల సారవంతంగా, తేమగా ఉండాలి. ఇసుక పాలు ఎక్కువగా ఉంటే దుంపలు బాగా తయారవుతాయి. ఆమ్లతత్వం ఉన్న నేల అనుకూలం. అందువల్ల వాడేసిన టీపొడి, కాఫీ పొడి, మట్టి మిశ్రమంలో కలపడంతోపాటు ఎరువుగా కుండీలో కూడా వేయచ్చు. చేమదుంపలో దుంపలే కాకుండా ఆకులు కూడా కూరగాయగా వాడుకోవచ్చు. దుంపలో కంటే ఆకుల్లోనే విటమిన్లు అధికం. అన్ని ఆకులు ఒక్కసారిగా కోయకుండా ఉంటే కొత్త ఆకులు మళ్లీ మళ్లీ వస్తుంటాయు.
కషాయాలు తప్పనిసరి!
చేమదుంపకు ఎక్కువ బలం కావాలి. వర్మికంపోస్టు, ఆముదం పిండి, వేరుశనగ పిండి, వేప పిండి కలిపిన మిశ్రమాన్ని నెలకొకసారి వేయడంతోపాటు పది రోజులకోసారి పంచగవ్వ, జీవామృతం, వర్మివాష్‌లను మార్చి మార్చి చల్లాలి. చేమదుంపను దుంపకుళ్లు తెగులు ఆశించకుండా నిమ్మగడ్డి లేదా బొప్పాయి ఆకులు మరగించి చల్లార్చిన నీళ్లను చల్లుతూ ఉండాలి. అలాగే ఆకుమచ్చ రాకుండా మునగాకు కషాయం, మందార ఆకు కషాయం చల్లాలి. వేప, మిరప కషాయాలు చల్లుతుంటే రసం పీల్చే పురుగులు తగ్గుముఖం పడతాయి. చేమదుంపలో అనేక ఖనిజలవణాలు, విటమిన్లు ఉంటాయి. యాంటీఆక్సిడెంట్లు, పీచు అధికం, కెలొరీలు బాగా తక్కువ.

Brinjal – వంకాయలు

మరీ చల్లని ప్రాంతాల్లో తప్ప ప్రపంచమంతటా విరివిగా పండే వంకాయ శాస్త్రీయ నామం సొలానమ్‌ మెలాంజినా. బ్రింజాల్‌ అనే పేరు మనదేశంలో ఎక్కువగా వాడుకలో ఉంది. అబర్‌గెన్‌ అన్నా ఇదే. దీన్ని ఎగ్‌ ప్లాంట్‌ అనీ అంటారు. ఒక రకం వంకాయలు తెల్లగా, అండాకారంలో అచ్చంగా కోడిగుడ్లు మొక్కకు వేలాడుతున్నాయా అన్నట్లు ఉంటాయి మరి. మనదేశంలో ఎన్నో రకాల వంకాయలు – రంగూ, ఆకారం, పరిమాణం, ప్రాంతం, అభిరుచిని బట్టి ఎవరి ఎంపిక వారిదే. అలాగే కొన్ని వంటలు కొన్ని రకాలతో చేస్తేనే బాగుంటాయి కూడా.
వంకాయల్ని అన్ని కాలాల్లోనూ పండించుకోవచ్చు. వర్షాకాలం పంటగా జూన్‌-జులై నెలల్లో నాటుకోవాలి. కావాల్సిన రకం విత్తనాలు తెచ్చి నారు పోసుకోవడమో లేదా షేడ్‌నెట్లలో పెంచి అమ్ముతున్న నారు తెచ్చి నాటుకోవడమో చేయాలి. నారు వయసు 25-30 రోజుల మధ్య ఉన్నప్పుడు కుండీల్లో లేదా ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న మళ్లలో నాటుకోవాలి. నేలలో నాటుకుంటే, మొక్కకూ మొక్కకూ మధ్య అడుగున్నర దూరం ఉండేలా చూసుకోవాలి. కుండీలో అయితే దాని పరిమాణాన్ని బట్టి 2-3 మొక్కలు నాటుకోవచ్చు.
ఎప్పుడైనా సరే సాయంత్రం పూట మట్టిని తడిపి నాటుకుంటే తెల్లారేసరికి చక్కగా కుదురుకుని ఉంటాయి. వంగకు ఎండ సరిగ్గా తగలాలి. మట్టి పూర్తిగా పొడిబారి పోకుండా నీళ్లు పోస్తూ ఉండాలి. వంగ నాటిన 45-50 రోజుల్లో కాయడం మొదలెట్టి రెండు నెలలపాటు బాగా కాస్తుంది. మళ్లీ అక్టోబరు-నవంబరు నెలల్లో నాటుకుని కాపు వచ్చేవరకూ కావాలంటే అలాగే ఉంచి నీళ్లూ, ఎరువులు సరిగా ఇవ్వాలి. మొక్క మీదే ముదిరిన కాయలను అలాగే ఉంచి, పండాక విత్తనాలు తీసి బాగా కడిగి నీడలో ఎండబెట్టి దాచుకుంటే మళ్లీ నాటుకోవడానికి పనికొస్తాయి.
ఎరువూ ఉండాలి: కుండీలో లేదా మడిలో ముందుగానే తగినంత పశువుల ఎరువూ, ఎముకల పొడీ, పిండి ఎరువులూ, జీవ ఎరువులు కలపడం వల్ల తరువాత పోషకాలను ఇవ్వాల్సిన అవసరం అంతగా రాదు. అప్పుడప్పుడూ జీవామృతం, వర్మీవాష్‌ వంటివి అందించడం వల్ల మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి. కుండీలో లేదా మడిలో పుదీనా కొమ్మలు నాటుకోవడం వల్ల పురుగులు దరిచేరవు. అలాగే బంతి మొక్కలు ఒకటి రెండింటిని అదే కుండీలో నాటుకుంటే నులిపురుగుల నుంచి రక్షణ దొరుకుతుంది.
మునగాకు రసాన్ని 24 గంటలు నిల్వ ఉంచి 2-3 సార్లు చల్లడం వల్ల వడలు తెగులూ, సీతాఫలం ఆకు కషాయం చల్లడం వల్ల కాండం లేదా కాయతొలిచే పురుగు అదుపులో ఉంటాయి. వంగకు ప్రమాదం కలిగించే సమస్యలు ప్రధానంగా ఇవే. అయితే గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే – సేంద్రియ పద్ధతిలో కూరగాయలు పెంచదలుచుకున్నప్పుడు సమస్యను ముందుగానే గుర్తించాలి. అంటే తప్పకుండా మీరు తీరిక చేసుకుని మీ మొక్కలతో రోజూ ముచ్చటించాలి.
దేశవాళీ రకాలతోపాటు ప్రతి విషయంలోనూ అధిక దిగుబడిని ఇచ్చే సంకర రకాలున్నాయి. సంకర రకాల్లో ఈ కిందవి
దొరుకుతాయోమో చూడండి. ఇవి అధిక దిగుబడిని ఇవ్వడంతోపాటు కొన్ని రకాల చీడపీడలను తట్టుకుంటాయి .
ఊదారంగు సన్నని, పొడవు కాయల కోసం – పూసాపర్పుల్‌ లాంగ్‌, పూసా పర్పుల్‌ క్లస్టర్‌, హైబ్రిడ్‌ 5
ఊదారంగు లావు, పొడవు కాయల కోసం – పూసాక్రాంతి
ఊదారంగు గుండ్రని కాయలకు – శ్యామల, అర్కనవనీల్‌, అంబారా
చారల అండాకారపు కాయలకు – మహి సూపర్‌ 10, కల్పతరు, మంజుశ్రీ
ఆకుపచ్చని అండాకారపు కాయలకు – ఆర్తి, మహి99, అర్క కుసుమాకర్‌
ఆకుపచ్చని పొడవు కాయలకు – అర్క షిరీన్‌
తెల్లని అండాకారపు కాయలకు – వైట్‌ పొన్ని

బ్రకోలి

పోషక విలువల్లో ప్రథమస్థానంలోనూ, రుచికీ, ఆరోగ్యానికీ మారుపేరుగా ఉండే కూరగాయల కోసం వెతికే వారికి మొదటి ఎంపిక బ్రకోలి. దీని శాస్త్రీయ నామం బ్రాసికా ఒలరేషియా ఇటాలికా. క్యాబేజీ కుటుంబానికి చెందిన ఈ కూరగాయను ఒకసారి రుచి చూసినవాళ్లెవ్వరూ మరిక వదలరు. ఇంతకు ముందు ఎక్కడో తప్ప దొరకని ఈ కూరగాయ ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో సులువుగా దొరుకుతోంది. అంటే దీన్ని మనం కూడా పెంచుకోవచ్చన్నమాట.
బ్రకోలీ రుచికరమైందే కాకుండా పోషకాలకూ, ఔషధ గుణాలకూ సాటిలేనిది కూడా. రొమ్మూ, గర్భాశయ క్యాన్సర్లు రాకుండా చేయడంలో దీని పాత్ర అమోఘం. ఇది కొలెస్ట్రాల్‌తోపాటు ఎలర్జీలూ, కీళ్లనొప్పుల్ని తగ్గిస్తుంది. దీనిలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండటంతో వృద్ధాప్యాన్ని త్వరగా దరిచేరనివ్వదు. ఎముకల ఆరోగ్యానికి తోడ్పడుతుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆస్టియోపొరోసిన్‌ను రానివ్వదు.
విటమిన్లూ, ఖనిజలవణాలు సమృద్ధిగా ఉండటంతో పసిపిల్లలూ, పాలిచ్చే తల్లులూ, వృద్ధులకు ఎంతో మంచిది. కళ్లకూ, చర్మానికి కూడా ఇది చాలా మేలు చేస్తుంది. మరి ఇన్ని మంచి లక్షణాలున్న బ్రకోలీని మన ఆహారంలో ఈ రోజునుంచే భాగం చేసుకుందాం. సేంద్రియ పద్ధతిలో మనమే పెంచుకుందాం.
ఆవాల్లాంటి విత్తనాలు!
బ్రకోలీ తక్కువ ఉష్ణోగ్రతలోనే పెరుగుతుంది. క్యాబేజీ, కాలీఫ్లవర్‌లాగానే పెంచుకుంటాం. కానీ ఇది ఇంకొంచెం సున్నితమైంది కాబట్టి మన ప్రాంతాల్లో పెంచుకునేటప్పుడు మరి కాస్త జాగ్రత్త తీసుకోవాలి.
బ్రకోలీ పూర్తి ఎండలో పెరిగినా, మన ప్రాంతంలో కొద్దిపాటి నీడ దీనికి అనువుగా ఉంటుంది. నీరు నిలవని తేలికపాటి నేలలు దీనికనువుగా ఉంటాయి. పెరటి తోటలో పెంచుకునేటప్పుడు ఒక వంతు వర్మీకంపోస్టూ, రెండు వంతులు కోకోపీట్‌, ఒక వంతు ఇసుక కలిపిన సారవంతమైన, తేమగా ఉండే, నీరు నిలవని మట్టి మిశ్రమంలో నాటుకోవాలి.
దీని గింజలు చూడటానికి పెద్ద ఆవాల్లా ఉంటాయి. ఇవి వారంలోపే మొలకెత్తుతాయి. నీడలో ఉంచిన ట్రేలలో నారు పోసుకుని 20-30 రోజుల తరువాత నాలుగైదు ఆకులున్నప్పుడు అడుగున్నర దూరంతో నాటుకోవాలి. కుండీల్లో కాకుండా నేలలో నాటుకునేటప్పుడు ఎత్తయిన బెడ్లు ఎంచుకోవాలి. కుండీలో మట్టిని గానీ, ఈ బెడ్లను గానీ నారు నాటుకునే ముందు పూర్తిగా తడిపి సాయంత్రంపూట నారు నాటుకోవాలి. నాటిన వారానికి ఒకసారి, ఆ తరువాత పదిహేను రోజులకోసారి వర్మీవాష్‌ లేదా వేరుశనగ పిండీ, బోన్‌మీల్‌ లాంటివి ఆవుపేడతో కలిపి నానబెట్టిన స్లర్రీని గానీ పోస్త్తుండాలి. నేల పూర్తిగా పొడారిపోకుండా నీళ్లు పోస్తూ ఉండాలి.
వెల్లుల్లి కషాయంతో
బ్రకోలీకి ఉష్ణోగ్రత ఎక్కువ ఉండకూడదు. కాబట్టి బెడ్‌ని లేదా కుండీలో మొక్క చుట్టూ ఎండుటాకులతో కప్పితే నేల త్వరగా పొడారిపోకుండా ఉండటమే కాకుండా చల్లగా ఉంటుంది కూడా. బ్రకోలీకి వేళ్లు పైపైనే ఉంటాయి. అందువల్ల చుట్టూ మట్టిని ఎక్కువగా కదిలించకూడదు. ఈ మొక్కకు ఆకు తినే పురుగులు, రసం పీల్చే పురుగులు ఇబ్బంది కలిగించకుండా వారం, పదిరోజులకొకసారి పచ్చిమిరపకాయల కషాయం, వెల్లుల్లి కషాయం లాంటివి చల్లుతూ ఉండాలి.
నీళ్లు పోసేటప్పుడు నీళ్లు మొక్క మీద పోయకుండా నేల తడిచేలా పోస్తే కుళ్లు తెగులు రాకుండా ఉంటుంది. నాటిన రెండు నెలల్లో బ్రకోలీని కోసుకోవచ్చు. పక్క కొమ్మలను పెరగనిస్తే వాటి నుంచి కూడా బ్రకోలీ తయారవుతుంది కానీ పరిమాణం కొంచెం చిన్నగా ఉంటుంది.

Ladies Fingers….. Okra… బెండకాయలు

బెండకాయలను పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకూ అందరూ ఇష్టపడతారు. తక్కువ కెలొరీలూ, ఎక్కువ పోషకాలతో ఉండే బెండ క్రమం తప్పకుండా తినాల్సిన కూరగాయ. ఇంట్లో పెంచుకుంటే తాజాగా, లేతగా, పురుగు మందులు లేని రుచికరమైన బెండకాయలు సొంతమవుతాయి.
బెండకాయను లేడీస్‌ ఫింగర్‌ అనే కాదు, ఓక్రా అనీ అంటారు. ఇది గోంగూర కుటుంబానికి చెందింది. బెండను ఏడాది పొడవునా పండించుకోవచ్చు. దీనికి ఎండ బాగా కావాలి. కనీసం 5-6 గంటలన్నా ఎండ పడేలా చూసుకోవాలి. బలంగా పెరిగే తల్లివేరు వల్ల నారు కాకుండా నేరుగా విత్తనాలే నాటుకోవాలి. దీనికి నీరు నిల్వకూడదు. నేలలో అయితే అడుగున్నర దూరంతో బోదెల మీద నాటుకోవాలి. విత్తనాలను అంగుళం లోతులో నాటుకోవాలి.
నేల తయారు చేసుకునేటప్పుడే పశువుల ఎరువూ, వేపపిండి వంటివి కలిపి మట్టిని బాగా తిరగేసి సారవంతంగా చేసుకోవాలి. కుండీలయితే లోతు ఎక్కువగా ఉన్నవి ఎంచుకోవాలి. 20 లీటర్ల పాత పెయింట్‌ బక్కెట్లు కూడా బెండను పెంచుకోవడానికి బాగా అనువుగా ఉంటాయి. పాదుకు 2-3 విత్తనాల చొప్పున నాటుకుని 3-4 ఆకులు వచ్చాక బలహీనమైన మొక్కలను తీసేసి ఒక్కో బలమైన మొక్క చొప్పున ఉంచుకోవాలి. కుండిలోనైనా 1-2 మొక్కలకు మించి నాటుకోకపోవడం మంచిది.
రెండు నెలలకో కాపు… నాటిన 5-8 రోజుల్లో బెండ గింజలు మొలకెత్తుతాయి. మొలకెత్తిన నెలరోజులకు పూత రావడం మొదలవుతుంది. పూత వచ్చిన వారానికే కాయలు తయారవుతాయి. అప్పటి నుంచి దాదాపు రెండు నెలలపాటు కాపు ఉంటుంది. బెండకాయలు లేతగా ఉంటేనే రుచిగా ఉంటాయి. అందుకే రెండురోజులకోసారి కోస్తుండాలి. ఓ పది మొక్కలుంటే చాలు, ఇంటి అవసరానికి సరిపోతాయి. పూత రావడం మొదలయ్యాక 10 రోజులకొకసారి జీవామృతం పోస్తూ ఉంటే కాపు బాగా వస్తుంది. మనం ముందుగానే మట్టి మిశ్రమంలో వేపపిండీ, ఆముదం పిండీ, జీవ కీటక, శిలీంద్ర నాశనులను పశువుల ఎరువు లేదా వర్మికంపోస్టుకలుపుతాం కాబట్టి చీడపీడలు ఆశించే ప్రమాదం చాలా తక్కువ. అప్పుడప్పుడూ వేపకషాయం చల్లుతూ ఉంటే ఆ భయం కూడా ఉండదు.
రకాలున్నాయి… ఇంట్లో పెంచుకునే మొక్కలే కాబట్టి పూర్తిగా నేల పొడారిపోకుండా 2 – 3 రోజులకోసారి నీళ్లు పోస్తుంటే సరిపోతుంది. ఏడాది పొడవునా బెండకాయలు మనింట్లో ఉండాలంటే రెండు నెలలకొకసారి గింజలు నాటుకుంటే ఒక పంట అయ్యేలోపు మళ్లీ కొత్త మొక్కల నుంచి కాపు రావడం మొదలవుతుంది.
మీకు నాణ్యమైన నాటు విత్తనాలు దొరికితే సరే, లేకపోతే హైబ్రిడ్‌ రకాలైన జనార్ధన్‌, హరిత, అర్క అభయ్‌, అర్క అనామిక లాంటి వాటికోసం ప్రయత్నించండి. ఈ రకాలు వైరస్‌ తెగుళ్లను కూడా తట్టుకుంటాయి. కో1 రకం బెండకాయలు గులాబి ఎరుపు రంగులో ఉంటాయి. రుచిలో తేడా ఏమీ ఉండదు. కానీ ఆకుపచ్చ కాయలతో పాటు చూస్తే అందంగా ఉంటాయి కదా. కాయలు ముదిరిపోతే వాటిని మొక్క మీద అలానేఉంచి ఎండిన తరువాత విత్తనాలు తీసి మళ్లీ వాడుకోవచ్చు.