ఆఫీస్ టేబుల్ మీద చిన్నగా, బుజ్జిగా, అందం గా ఉండే చిన్న మొక్కలు

 • అలోవెరా

అదేంటీ? నర దిష్టి కోసం ఉపయోగించే మొక్కను ఇంట్లోను ఆఫీస్ లోనూ పెట్టుకుంటారా …? అని తిట్టుకోవద్దు. ఆ నమ్మకాల సంగతి అటు ఉంచితే, ఇది చాలా మంచి మొక్క, గాలిని కూడా పరిశుభ్రం చేస్తుంది. నాసా వారి క్లీన్ ఎయిర్ స్టడీ లో కూడా ఈ మొక్క ఉన్నది. పెద్ద జాగ్రత్తలు కూడా అవసరం లేదు ఈ మొక్కకు, ఒకసారి నీళ్ళు పోసిన తరువాత పూర్తిగా మట్టి ఎండిన తరువాత మాత్రమే మళ్ళీ నీళ్ళు పోయాలి.మట్టిలో నీరు నిలవ ఉండకుండా చూసుకోండి. వారానికి ఒకసారైనా ఎండలో పెట్టండి.

ఐనా కూడా దీనిని మీ ఆఫీస్ లో పెట్టుకోడానికి మీ మనసు ఒప్పుకోక పోతే ఇందులో రెడ్, వైట్ అని రెండు రకాలు ఉన్నాయి… వాటిని పెట్టుకోండి, వాటి చిత్రాలు కింద ఉన్నవి.

 • లక్కీ బాంబూ

వెలుపల పెంచుకొనే మొక్కలలో నాకు నచ్చిన మొక్కలలో ఇది ఒకటి. ఆఫీస్ టేబుల్ మీద అద్భుతంగా ఉంటుంది.

దీనికి, మట్టి కూడా అవసరం లేదు… నీళ్ళలోను బతుకుతోంది. ప్రతి రెండు రోజులకు ఒకసారి నీళ్ళు మారిస్తే సరిపోతుంది. ఎండ కూడా అవసరం లేదు… కేవలం వెలుగు ఉంటే చాలు…

 • సక్యులేంట్

చూసారా ఎంత అందం గా ఉన్నాయో..! పెంచడం సులువు… నేను చూసిన వాటిల్లో అందమైన మొక్కలు

మూడు లేదా నాలుగు రోజులకు ఒకసారి ఎండలో పెట్టాలి

వీటికోసం మట్టి మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి… ఆ మట్టి మిశ్రమం లో నీరు నిలవ ఉండకుండా ఇసుక, perlite, బొగ్గు, ఎండిన ఆవు పేడ లను ఉపయోగించాలి.

వీటికి నీళ్ళు అంటే నచ్చవు… మొక్క మీద నీళ్ళు పడకుండా కేవలం మట్టి లో మాత్రమే నీరు పోయాలి…

నేను వీటికి నీళ్ళు పోయాలంటే, సిరంజీ (ఇంజెక్షన్) ఉపయోగిస్తాను. వేసవిలో 7 నుంచి 10 రోజులకు, చలి కాలం లో ఐతే సుమారు 20 రోజులకు నీళ్ళు పోయాలి.

 • కాక్టస్

నీటితో ఎక్కువ పని లేదు, ప్రతి రెండు ,మూడు రోజులకు ఒకసారి ఎండ లో పెట్టండి.

 • పోతస్ / డెవిల్స్ ఐవి / మని ప్లాంట్

అందరికీ తెలిసిన మొక్కే కదా… మట్టి లోనే కాదు, నీటిలో కూడా పెరుగుతుంది .

 • స్పైడర్ ప్లాంట్

నాసా వారి క్లీన్ ఎయిర్ స్టడీ లో కూడా ఈ మొక్క ఉన్నది.

 • స్నేక్ ప్లాంట్ / మదర్ ఇన్ లా టంగ్

ఇందులో చాలా రకాలు ఉంటాయి.నాసా వారి క్లీన్ ఎయిర్ స్టడీ లో కూడా ఈ మొక్క ఉన్నది.

 • Z Z ప్లాంట్

వీటిలో తక్కువ మొత్తం లో విష పదార్థాలు ఉంటాయి. చిన్న పిల్లలకి , పెంపుడు జంతువు లకు హానికరం.

 • స్టింగ్స్ ఆఫ్ పెరల్స్

చాలా అందం గా ఉంటుంది. వీటిలో తక్కువ మొత్తం లో విష పదార్థాలు ఉంటాయి. చిన్న పిల్లలకి , పెంపుడు జంతువు లకు హానికరం.

 • జాడే ప్లాంట్

స్నేహానికి గుర్తు గా ఈ మొక్క బహుమతి గా ఇచ్చుకొంటారు. వీటిని బోన్సాయ్ గా కూడా మార్చవచ్చు.

 • ఎయిర్ ప్లాంట్స్

వీటికి మట్టితోను, నీళ్ళ తోను పనిలేదు. నీటిని పిచికారి ( water spray) చేస్తే సరిపోతుంది. ఇంకో విషమేమిటంటే ప్రతి వారం రోజుల కొకసారి, మొక్కల ఆకులను కాటన్ టవల్ తో తుడవాలి.

కోలియస్

Koliasరకరకాల వర్ణాల్లో, వర్ణమిశ్రమాలతో, అలరారే ఆకులుండే జాతి కోలియస్. ప్రకృతి శ్రద్ధతో గీసిన వర్ణచిత్రాల్లా మనోహరంగా ఉండే మొక్కలజాతి ఇది. దీని శాస్త్రీయనామం కోలియన్ బ్లూమి
వివిధ ప్రత్యేక వర్ణాల్లోనూ, బోలెడు రంగులతో హోలీ ఆడినట్టు గీతలు గీసినట్లు అంచులు వైవిధ్యంగా ఈనెలు వేరే వర్ణంలో ప్రస్పుటంగా ఇలా ఎన్నెన్నో సొగసులతో….లేత పసుపు మొదలుకుని ముదురు చాక్లెట్ రంగువరకూ…. ఇన్ని వన్నె చిన్నెలు ప్రదర్శించగల మొక్క ఇది ఒక్కటేమోనేమో. అలాగే ఆకుల ఆకారం, పరిమాణంలో కూడా ఎంతో వైవిధ్యం మొత్తంమీద మీరు ఎక్కువ పెంచదలుచుకున్నా అందుకు సరిగ్గా అనువైన రకం. తప్పనిసరిగా దొరికే మొక్క కోలియస్. అందమైన ఆకులుండే మొక్కలలో బిగోనియాలు, ఫిటోనియాలు, ఫోల్రాడాట్ లకు సరిజోడి ఈ మొక్క.
ఎండతట్టుకునే లేతరంగు ఆకుల రకాలు
కోలియస్ అడుగున్నర నుంచి రెండడుగుల ఎత్తువరకూ మొత్తని కాండంతో పెరిగే మొక్క బహువార్షికమైనా ప్రతి సంవత్సరం కత్తిరింపులను నాటుకుని పెంచుకుంటే అందంగా ఉంటుంది. ముదిరిన మొక్కలు అంత చక్కగా ఉండవు. ఎండ సూటిగా తగలకుండా కొద్దిగా నీడగా ఉండే చోటు కోలియస్ లకు బాగా అనుకూలం. పూర్తినీడలో పెంచినప్పుడు కొమ్మలు సాగిపోయి అందవిహీనంగా ఉంటుంది. ముదురు రంగు ఆకులుండే రకాలు లేతరంగు రకాలకంటే ఎండను తట్టుకోగలవు. నీరునిలవని సారవంతమైన మట్టిమిశ్రమంలో కోలియస్ బాగా పెరుగుతుంది. నీళ్లు క్రమం తప్పకుండా పోయాలి. నీటి ఎద్దడిని అసలు తట్టుకోలేని మొక్క ఇది. సులభంగా వాడిపోయి తలవేలాడేస్తుంది. మళ్లీ కొద్దిగా నీళ్లుపోయగానే పుంజుకుని చైతన్యంతో తుళ్లిపడుతుంది.
గుబురుగా అందంగా
పూలు వచ్చిన మొక్క త్వరగా పాకి ముదిరిపోయి అందవిహీనంగా మారుతుంది. రెండు మూడు వారాలకోసారి కొమ్మల చివర్లు తుంచివేస్తుంటే పూలు రాకుండా ఉంటాయి. ఎక్కువ కొమ్మలతో గుబురుగా, అందంగా పెరుగుతాయి కూడా కోలియస్ ను కుండీలలో పెంచుకునేటపుడు క్రమం తప్పకుండా పాలీసీడ్ వంటి సమ్రగ ఎరువును నెలకోసారి నీళ్లలో కలిపి పోస్తూ ఉండాలి. నేలలోనైతే వర్మీకంపోస్టు కానుగ పిండి ఆముదం పిండి వంటివి అప్పుడప్పుడూ కలుపుతూ వుంటే సరిపోతుంది. ఎరువులు మరీ ఎక్కువైతే ఆకు రంగులు ప్రకాశవంతంగా ఉండవు. ఎరువులు ఎక్కువగాకుండా జాగ్రత్తపడాలి. కోలియస్ కొమ్మ కత్తిరింపులతోనూ, గింజలతోనూ సులువుగా ప్రవర్ధం చేయవచ్చు. తగినంత వెలుతురు, సరిపడా నీళ్లు ఉంటే కోలియస్ ను పెంచడడం సులభం. చీడపీడలు పెద్దగా ఆశించవు కూడా. అయినా ముందుజాగ్రత్తగా ఆకుకషాయాలు అప్పుడప్పుడూ చల్లుతూ ఉంటే మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది. కోలియస్ ను బోర్డరుగా నాటుకున్నా, కుండీలలోనైనా, హ్యంగింగ్ తొట్లలోనైనా, అస్పరాగ్ లు, పెరన్ లు, లిల్లీలు, రిబ్బన్ గ్రాస్ వంటివాటితో కలిపి నాటుకున్నా బాగుంటుంది. లెఫోమియా గ్రౌండ్ కవర్ తో కలిపి కుండీల్లో నాటుకున్నా, చెట్లకింద పెంచుకున్నా ముచ్చటగా ఉంటుంది. తోటను తక్కువ సమయంలో, సులువుగా వర్ణభరితం చేసుకోవడానికి కోలియస్ ను మించినది మరొకటి ఉండదు. మీరూ ప్రయత్నించి చూడండి. కోలియస్ తో ప్రేమలో పడకుండా ఉండటం అసాధ్యం.

ముచ్చటైన మోండోగ్రాస్

monda grassఎలాంటి ల్యాండ్ స్కేప్ లో అయినా సులువుగా ఇమిడిపోయి అదనపు ఆకర్షణను అందించే మోండోగ్రాస్….. మోండోగ్రాస్ ఎలాంటి నేలలో అయినా మూడునుండి ఆరు అంగుళాల ఎత్తుమాత్రమే పెరుగుతుంది. ఇది ఎప్పుడూ పచ్చగా ఉండే బహువార్షికం. ఇది కాడలు లేని నిండాకుపచ్చ రంగు గడ్డిలాంటి ఆకులతో కుదురులా పెరుగుతుంది. ఇది పెద్దగా శ్రద్ధ చూపనవసరం లేకుండా సులువుగా పెరిగే మొక్క.
మోండోగ్రాస్ ఎలాంటి నేలల్లో ఐనా పెరుగుతుంది. కానీ నీళ్లు నిలవకుండా ఉంటే చాలు. ఎండను తట్టుకున్నా నీడ దీనికి అనుకూలం. పూర్తినీడలో చాలా తక్కువ నీటితోనూ చక్కగా పెరుగుతుంది. మట్టిమిశ్రమంలో కోకోపిట్, వాడేసిన కాఫీపోడి, టీపొడి వంటివి కలిపి నాటితే దీనికి మంచిది. దీన్ని చిన్న గ్రౌండ్ లో కవర్ గానూ, పొట్టి బోర్డరుగానూ, పేవింగ్ రాళ్లమధ్య కూడా నాటుకోవచ్చు. లాన్ కు, పూలబెడ్ల మధ్య నాటుకోవచ్చు. కుండీలలో పెద్ద మొక్కలు నాటినప్పుడు కింద వరకుసగానూ పెంచుకోవచ్చు. మోండోగ్రాస్ ను చిన్న చిన్న కుదుళ్లలాగా నాటితే కొంతకాలానికి మొత్తం కలిసిపోయి లాన్లాగా కనిపిస్తుంది. నిజానికి మోండోగ్రాస్ లాన్ చూడటానికి అద్భుతంగా ఉంటుంది. పైగా దీనికి మోవింగ్ అంటే కత్తిరించడం అవసరం లేదు. చాలా తక్కువ నీటితో పెరుగుతుంది. ఇంకా పూర్తి నీడకు కూడా ఎంతో అనుకూలం. కానీ ఒకే ఒక్క సమస్య…ఇది చాలా నెమ్మదిగా పెరుగుతుంది.
నీళ్లు నిలవకూడదు…
మోండోగ్రాస్ లో వరిగేటెడ్ రకాలు, నల్లరకం కూడా ఉన్నాయి. బ్లాక్ మోండోగ్రాస్ తక్కువ గుబురుగా ఎనిమిది నుండి తొమ్మిది అంగుళాల ఎత్తులో పెరుగుతుంది. కుండీలలో ఇతర మొక్కలతో కలిపి నాటడానికి లాండ్ స్కేప్ గానూ అద్భుతంగా ఉంటుంది. దీనికి వర్షాకాలంలో చిన్న చిన్న ఊదారంగుపూలు గుత్తులు గుత్తులుగా వస్తాయి. కానీ ఇవి కనపడకుండా ఆకులతో కప్పివేయబడతాయి. మోండోగ్రాస్ ను సాధారణంగా చీడపీడలేవి ఆశించవు. నీళ్లు ఎక్కువైతే వేరు కుళ్లుతుంది.
కనుక నీళ్లునిలవకుండా చూసుకోవాలి. తక్కువగా పోయాలి. దీనికి ఎరువులు పెద్దగా అవసరం లేదు. మూడు నాలుగు నెలలకోసారి ఎన్ పీ కె ఉండే పాలీఫీడ్ వంటి నీటిలో కరిగే ఎరువును లీటరుకు ఐదుగ్రాముల చొప్పున కలిపి చల్లితే సరిపోతుంది.
మోండోగ్రాస్ కుదుళ్లను విడదీసి చక్కగా ప్రవర్ధనం చేయవచ్చు.

కెలాధియా

కెలాధియా

మరాంతాలను, అగ్లోనిమాలను పోలి ఉండి, ఇంట్లో పెంచుకోవడానికి అనువైన అందమై మొక్క కెలాధియా. ఆకుల మీద ఉండే మచ్చలు లేదా చారల వల్ల దీన్ని నెమలిమొక్క, జీబ్రా మొక్క అని కూడా అంటారు. వీటిని సాధారణంగా అందమైన ఆకులకోసం పెంచుతారు. ఈ ఆకులు రకాన్నిబట్టి వివిధ పరిమాణాల్లో ఆకారాల్లో ముచ్చట గొలుపుతాయి. ఏ రకానికదే మనోహరంగా, సహజమైనది కాదు కృత్రిమమైనదేమో అనిపిస్తూ ఎవరైనా చేయి తిరిగిన కళాకారుడి అద్భుతమైన సృష్టేమో అని భ్రమింప చేస్తుంది.
రెండడుగుల వరకూ పెరుగుతుంది.
కెలాధియాలు నీడలో పెరిగే సున్నితమైన మొక్కలు ఎండ తీవ్రతను అస్సలు తట్టుకోలేవు. సూటిగా పడే ఎండలో ఉన్నపుడు ఆకులు కాలినట్లు అయిపోతాయి. చెట్లు కిందగానీ, ఇతర మొక్కల మధ్యగానీ నాటుకోవడమో, షెడ్ నెట్ కింద పెంచుకోవడమో చేస్తే చక్కగా పెరుగుతాయి. ఇది సాధారణంగా ఒకటిన్నర నుంచి రెండు అడుగుల వరకు పెరుగుతుంది. కెలాధియాలకు అగ్లోనిమాలలాగా ప్రత్యేకమైన కాండం ఉండదు. నేలలో ఉన్న దుంపనుంచి ఒకే కుదురు నుంచి గట్టిగా ఉన్న కాడలతో అనేక ఆకులు వస్తాయి. లేత ఆకులు గుండ్రంగా చుట్టుకుని ఉండి పెరిగే కొద్దీ నెమ్మదిగా విచ్చుకుంటాయి.
శ్రద్ధ అవసరం
వీటి ఆకులు సుకుమారంగా మృధువుగా ఉంటాయి. ఆకుల పైభాగం లేతాకుపచ్చ ముదురాకుపచ్చ మీగడ రంగులలో, చారికలు, మచ్చలతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. అఢుగుభాగం వంకాయ రంగులో అందంగా ఉంటుంది. కెలాధియా క్రొకెటా రకం మాత్రం అందమైన అరుదైన పూలు పూస్తుంది. ఈ రకాన్ని పూల కెలాధియా అని కూడా అంటారు. కంపోస్టు, ఇసుక మట్టి లేదా కోకోపిట్ సమపాళ్ళలో ఉండే సారవంతమైన, నీరు నిలవని మట్టి మిశ్రమంలో ఇది బాగా పెరుగుతుది. ఎన్ పి కె ఉండే సమగ్ర ఎరువును నీటిలో కలిపి రెండు వారాలకోసారి పోస్తూ ఉంటే మంచిది. మట్టి ఎప్పుడూ పొడిబారకుండా చూసుకోవాలి. అలాగే గాలిలో తేమ శాతం తగినంత ఉండేందుకు నీళ్ళు అప్పుడప్పుడూ పిచికారీ చేస్తూ ఉండాలి.
కెలాధియా కొంచెం శ్రద్ధ తీసుకుని పెంచుకోవలసిన మొక్క. ఎండ ఎక్కువైనా, ఎరువులు ఎక్కుమైనా, నీటిలో లవణాల శాతం పెరిగినా ఆకుల అంచులు, చివర్లు మాడిపోతాయి. అలాగే ఆకుల మీద కుళ్ళినట్లయి రంధ్రాలు పడుతుంటే నీళ్ళు పై నుంచి కాకుండా మొదలు దగ్గర పోయాలి. ఆకు కషాయాలు తరచూ చల్లుతూ జాగ్రత్తగా చూసుకోవాలి. కెలాధియా ఆకులను ప్రకాశవంతంగా ఉంచుకోవాలంటే తడివస్త్రంతో తుడిస్తే సరిపోతుంది.
లీఫ్ షైన్ వంటి కృత్రిమ ఉత్పత్తులను వాడితే సున్నితమైన ఈ మొక్క త్వరగా దెబ్బతింటుంది. కెలాధియాను దుంపను విడదీసి సులువుగా ప్రవర్ధనం చేసుకోవచ్చు.

సైకస్

సైకస్ అలంకరణ మొక్కలలో అత్యంత ఆదరణ పొందినది సైకస్. అతి పురాతనమైనది ఈ మొక్క శాస్త్రీయనామం సైకస్ రెవల్యూటా. దీనినే కింగ్ సాగో పామ్ అని కూడా అంటారు. ఇది కోనిఫర్ జాతికి చెందినది. సుమారు 20 కోట్ల సంవత్సరాల నుండి మొక్క ఉన్నట్లు చెబుతారు. అందుకే సజీవ శిలాజం అంటారు. సైకస్ లోని అనేక రకాలు ప్రపంచమంతా వ్యాపించి ఉన్నా తూర్పు ఆసియా ప్రాంతానికి చెందిన సైకస్ రెవల్యూటా మాత్రమే శతాబ్ధాలుగా తోటల రూపకల్పనలో ఉపయోగపడుతుంది. ఏ వాతావరణంలో నైనా …
ఈ మొక్క ఎలాంటి వాతావరణంలోనైనా పెరుగుతుంది. మనం అశ్రద్ధ చేసినా తట్టుకుంటుందీ. సైకస్ కాండం ముందు కోన్ లాగా మొదలై పెరిగే కొద్దీ దాదాపు 12 అంగుళాల వ్యాసం వరకూ వస్తుంది. గుండ్రని వరసలలో బిరుసుగా ఉండే దీని ఆకులు చాలా కాలం వరకు అలాగా నిలిచి ఉంటాయి. సైకస్ ఏడాదికి ఒక అంగుళం వ్యాసం కంటే ఎక్కువ పెరగదు. కొత్త ఆకులు కూడా సంవత్సరానికి ఒకటి రెండు సార్లే వస్తాయి. ఒకోసారి అవి కూడా రావు. ఈ ఆకులు వచ్చినపుడు ఒక వరుస మొత్తం ఒకేసారి వస్తాయి. మొక్క కొంత పెరిగి, కాండం స్పష్టంగా స్ధూపంలా కనబడటం మొదలయ్యాక దాని చుట్టూ పిలకలు వస్తూ ఉంటాయి వీటిని జాగ్రత్తగా విడదీసి కొత్త మొక్కలు పెంచుకోవచ్చు.
జాగ్రత్తలు…
సైకస్ లో ఆడ మగ మొక్కలు వేర్వేరుగా ఉంటాయి. ఆడ మొక్కలలో పూలు, మగ మొక్కలలో కోన్ మొక్క మధ్యభాగంలో వస్తాయి. ఆడ మొక్కలలో తయారైన విత్తనాలను కూడా ప్రవర్ధమానానికి వాడుకోవచ్చు. సైకస్ మట్టి మిశ్రమం ఎలా ఉన్నా ఫరవాలేదు. కానీ నీరు మాత్రం నిలవ ఉండకూడదు. నేల పూర్తిగా పొడిబారిన తరువాత మాత్రమే నీళ్ళు పోయాలి. కానీ కొత్త ఆలె వస్తున్నపుడు మాత్రం ముందే నీళ్ళు పోయాల్సి ఉంటుంది. సైకస్ పెద్ద కుండీలలో కంటే చిన్న కుండీల్లోనే బాగా పెరుగుతుంది. కానుగ పిండీ, వేప పిండి, వర్మీకం కంపోస్టు అపుడపుడూ మట్టి మిశ్రమంలో కలుపుతూ ఉంటే సరిపోతుంది. చీడపీడలూ పెద్దగా ఆశించవు. ఏడాదికి ఒకసారి కింది వరుసలోని పాత ఆకులను కాండానికి దగ్గరగా కత్తిరించి తీసివేయాలి. సైకస్ మొక్కలను తొట్లలో నాటుకునేప్పుడు నీరు నిలిచే ప్రాంతం కాకుండా ఎత్తుగా ఉన్న చోట గానీ, మట్టికుప్ప లేదా రాళ్ల మధ్య గానీ నాటితే మంచిది. దారి పక్కన గానీ, గోడపక్కన గానీ కాకుండా కొంచెం దూరం ఉంచి నాటుకుంటే మున్ముందు పెరుగుదలకు ఆటంకం ఉండదు.

పోల్కాడాట్

చూడచక్కని పోల్కాడాట్

చూడచక్కని పోల్కాడాట్ గులాబీ, ఎరుపు లేదా తెలుపు మచ్చలూ, చుక్కలతో కూడిన చిత్రపటం లాంటి ఆకులు దీని సొంతం. అందుకే దీన్ని పోల్కాడాట్ అని పిలుస్తుంటారు.
పోల్కాడాట్ శాస్త్రీయనామం హైపోస్టెస్ ఫైలోస్టాకియా. ఇది ఏకవార్షికం. ఆరు అంగుళాల నుంచి అడుగున్నర ఎత్తువరకూ పెరిగే ఈ సుకుమారమైన ముచ్చటైన మొక్క కొద్దిపాటి నీడలో చక్కగా పెరుగుతుంది. అయినా ప్రకాశవంతమైన వెలుతురు మాత్రం తప్పనిసరి. పోల్కాడాట్ కు గాలిలోనూ, నేలలోనూ తేమ ఎక్కువగా ఉండాలి. మట్టి మిశ్రమం నీరు నిలవనిదై ఉండాలి. తరచూ మొక్కల చుట్టూ నీటిని పిచికారీ చేస్తూ ఉంటే ఆ తేమకు అవి నవనవలాడుతూ ఉంటాయి.
మొదట్లో పోల్కాడాట్ అంటే ముదురాకుపచ్చ మీద ప్రకాశవంతమైన గులాబీ రంగు చుక్కలతో మాత్రమే ఉండేది. ఇప్పుడు అనేక రంగుల చుక్కలతో మచ్చలతో ఇంకా ఆకర్షణీయమైన కొత్త రకాలు వచ్చాయి. పోల్కాడాట్ ను సాధారణంగా లోతు తక్కువ కుండీల్లో పెంచుకుని ఇంట్లో అలంకరించుకుంటారు. బయట తోటలో వెలుతురు పడేలా చెట్లకింద ఇతర మొక్కలతో కలిపి నాటుకోవడానికి కూడా బాగుంటుంది. దీని ప్రకాశవంతమైన, ఆకర్షణీయమైన ఆకుల వల్ల ఎలాంటి మొక్కల మధ్య ఐనా కుదురుకుంటుంది. ముఖ్యంగా ఫెర్రస్ లు, మోండా గ్రాస్, రిబ్బన్ గ్రాస్ వంటి వాటి మధ్య అద్భుతంగా ఉంటుంది.
పోల్కాడాట్ పూలు పెద్దగా పట్టించుకోవలసినవి కావు. పైగా పూలు వచ్చాక మొక్క చనిపోవటమో, ఎదుగుదల ఆగిపోవటమో జరుగుతుంది. అందువల్ల పూలు రాకుండా చివర్లు తుంచివేస్తుంటే మంచిది. దీని వల్ల మొక్క సాగినట్లు పెరిగి కళావిహీనంగా మారే ప్రమాదం తప్పుతుంది.
క్లోరిన్ కలిపిన నీళ్ళవల్ల పోల్కాడాట్ త్వరగా దెబ్బతింటుంది. అందువల్ల పంపునీళ్ళను పట్టి ఒక గంట నిలవ ఉంచి పోయటం మంచిది. పోల్కాడాట్ ను పిండి పురుగులూ, తెల్లదోమ వంటి రసం పీల్చే పురుగులు ఆశించవచ్చు. ఆకు కషాయాలను క్రమం తప్పకుండా చల్లుతూ ఉంటే ఆ సమస్యను చాలావరకూ నివారించవచ్చు. మొక్క పెరుగుతున్నపుడు పాలీఫీడ్ వంటి నీటిలో కరిగే సమగ్ర ఎరువును వారానికోసారి లీటరు నీటికి ఒక గ్రాము చొప్పున కలిపి పోస్తుంటే ఆరోగ్యంగా పెరుగుతుంది. పోల్కాడాట్ ను విత్తనాలతో సులువుగా ప్రవర్ధనం చేయవచ్చు. శీర్ష కత్తిరింపుల ద్వారా కూడా సులువుగానే వేళ్ళూను కుంటాయి. సుకుమారంగానే కనిపిస్తూనే సులువుగా పెరిగే అందాల మొక్క పోల్కాడాట్.