తాజా చేపలను తెలుసుకొనే విధానం, చేపలలో రకాలు

ఆరోగ్యానికి ముఖ్యంగా మెదడుకు మేలు చేసేవి చేపలు…చేపలలో సముద్రపు చేపలు వేరు. మంచినీటి చేపల ఎముకలు గట్టిగా ఉంటే సముద్రపు చేపలు మెత్తటి ఎముకలతో ఉంటాయి. మంచినీటి చేపలలో మైక్రో న్యూట్రియంట్లు మరియు ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు తక్కువగా ఉంటాయి. సముద్రపు చేపలలో ఇవి ఎక్కువ. అందుకే చెరువు చేపలకంటే సముద్రపు చేపలు మంచివి అంటారు నిపుణులు. విటమిన్లు ఖనిజాలు ఏ చేపలలోనైనా ఒకటే. చేపలు తినటం వలన రక్తనాళాలలో రక్తం గడ్డకట్టదు. ట్రైగ్లిజరేడ్లు తగ్గుతాయి. బిపిని కంట్రోల్ లో ఉంచుతాయి. చేపలు కొనే ముందు వాటి నాణ్యత, తాజాదనం పరీక్షించి కొనవలసి ఉంటుంది.
తాజా చేపలను తెలుసుకొనే విధానం :
01. చేపల మొప్పలు ఎత్తి చూసినపుడు లోపల ఎర్రగా గాని, పింక్ కలర్లో గాని కాంతివంతంగా ఉండాలి. ఎర్రగా కనపడటానికి రంగుకూడా వేస్తారు. కనుక జాగ్రత్తగా గమనించి కొనాలి.
02. చేపల ఉపరితలం మీద వేలుతో నొక్కినపుడు చొట్టపడకుండా గట్టిగా ఉండాలి. మెత్తగా ఉండరాదు వేలి నొక్కుడు పడరాదు. నొక్కుడు పడితే నిల్వ ఉన్న చేపగా భావించాలి. కొన్నిసార్లు చేపలు గట్టిగా ఉండటానికి ఫ్రాజెన్ చేస్తారు.(ఐస్)
03. కుళ్ళిన చేపలు చెడ్డవాసనతో ఉంటాయి. కుళ్ళిన చేపలను మంచి చేపలలో కలుపుతారు.
04. చేపల చర్మం తళ తళలాడుతూ ఎటువంటి మచ్చలు లేకుండా ఉండాలి. చేపల కళ్ళు మెరుస్తూ కాంతిగా ఉండాలి, వాడిన, ఎర్రగా లేక పీక్కుపోయిన కళ్ళతో ఉన్నవి తాజావి కాదు.
చేపలలో రకాలు… రోహ (శిలావతి), ఎర్రమట్ట, కోయంగ, మోసు, వాలుగ, పాలబొంత, వంజరం , మట్టగడిస, వానమట్ట, సవ్వలు, టేకుచేప, కట్టిపరిగ, పిత్తపరిగ, బొచ్చెలు, మెత్తాళ్ళు, పండుగప్పలు, సాల్మన్, కొరమీనులు ఇంకా ఎన్నో రకాలున్నాయి.

వీటిలో కొన్నిటి గురించి:

బొచ్చెలు 

botche fish

అందరికీ అందుబాటు ధరలో ఉండే ఈ చేపలు మంచినీటిలో పెరుగుతాయి. ముళ్ళు కొద్దిగా ఎక్కువ. మంచి రుచిగా ఉండి పోషకాలు కలిగి ఉంటాయి. రైతులు చెరువులలో పెంచుతారు. నదులలో దొరకే చేపలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. మరలా వీటిలో రాగండి, తెల్ల బొచ్చలు అనే రెండు రకాలుంటాయి.

మెత్తాళ్ళు

mettalu fish

చిన్న సైజులో ఉండే మెత్తాళ్ళను ఎక్కవగా ఎండబెట్టి చింతచిగురుతో కలిపి వండుకుంటారు. చిన్నవే కానీ పోషకాలు ఎక్కుగా ఉంటాయి. ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, క్యాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం, ఐరన్ ఇంకా ఎన్నో వీటినుండి లభిస్తాయి. ఎండబెట్టిన వాటిలో ఉప్పు ఎక్కువగా ఉండటం వలన వీటిని వండే ముందు నీటిలో బాగా నానబెట్టి శుభ్రంగా కడిగి వాడటం మంచిది.

పండుగప్ప 

pandukappa  fish

బర్రమండి చేపలనే పండుగప్పగా కూడా పిలుస్తారు. వీటి ఖరీదు కొంచెం క్కువగా ఉంటుంది. పుట్టాక కొంతకాలం మగచేపలుగా ఉండి తరువాత ఆడచేపలుగా మారటం ఈ చేపలలో ఉండే ప్రత్యేక లక్షణం. ఉప్ఫు చేపగా కూడా లభిస్తుంది.

కొరమీను 

korameenu  fish

మంచినీటిలో మాత్రమే పెరిగే ఈ చేపలు నల్లగా తళతళలాడుతూ తల పాము తలను పోలి ఉంటుంది. ఒకటే ముల్లు కలిగి ఉండే ఈ చేపలకు డిమాండ్ మరియు ధరకూడా ఎక్కువే. శస్త్రచికిత్సలు జరిగిన తరువాత ఈ చేపను తినడం వల్ల గాయాలు, కోతలు త్వరగా మానుతాయంటారు.

బొమ్మిడాయిలు 

pulasa fish

చేపలలో బొమ్మిడాయిల రుచే వేరు. చింతకాయతో చేసే వీటిపులుసు తినాల్సిందేనంటారు. వేలంత లావుగా ఉండి చిన్నసైజు పాములులాగా ఉంటాయి. ఒకే సన్నని ముల్లుతో ఉంటాయి. వీటిలో మగచేపలు కొంచెం సన్నగా ఉంటాయి.

చందువాలు 

chanduva fish

వైట్ పాంప్రెట్, బటర్ ఫిష్, తెల్లచందువాలు, నల్లచందువాలుగా పిలువబడే ఈ చేపలు సముద్రాలలో మాత్రమే దొరకుతాయి. ఈ చేపలు జీర్ణకోశానికి మేలు చేస్తాయి. విటమిన్ ఎ, బి3, డి, ఇ విటమిన్లు వీటిలో ఎక్కువ. వీటిల్లో నల్లచందువాలు కూడా ఉంటాయి.

నూనెకవ్వలు : (సార్టెన్)ఈ చేపలలో ఔషధ గుణాలు ఎక్కువ. ఒమేగా 3, ఫ్యాటీ ఆమ్లాల శాతం చాలా ఎక్కువ. బీపిని కంట్రోల్ లో ఉంచుతాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఇవి మంచివని నిపుణులు చెపుతారు. జీవప్రక్రియ వేగాన్ని ఈ చేపలలోని ప్రోటీన్లు తగ్గిస్తాయి. తద్వార క్యాలరీలు తగ్గుతాయి. డయాబెటిస్ వారికి కూడా మంచివి. ఓ చిన్నచేపనుంచి నాలుగు గ్లాసుల పాలలో ఉండే క్యాల్షియం లభిస్తుంది. వీటిల్లో ఎండుచేప రకాలలో పోషకాలు పెరగటంతో పాటు, రుచి కూడా పెరుగుతుంది. పిల్లల పెరుగుదలకు మంచిదంటారు నిపుణులు.

పులసచేపలు 

pulasa fish

చేపలలోనే రారాజు చేపలు పులసచేపలు. కేవలం ఆంధ్రప్రదేశ్ లోని గోదావరి జిల్లాలలోనే దొరికే ఈ చేపలే అత్యంత ఖరీదైనవి. ఆగస్ట్ మరియు సెప్టెంబర్ నెలలలోనే గోదావరి నదిలోనే దొరకుతాయి. గొదావరికి వరద పోటెత్తే సమయంలో వరదనీరు సముద్రంలో కలిసే చోట ప్రవాహానికి ఎదురీదుతూ గోదావరి జలాల్లోకి వస్తాయి పులస చేపలు. వీటి శరీరం వెండిలా మెరుస్తుంది. చేప పరిమాణాన్నిబట్టి రెండు వేల నుండి ఆరువేల రూపాయల దాకా ధరపలుకుతాయి. ఈ చేపలలోని ఫ్యాటి అమ్లాలకు చెడు కొలస్ట్రాలును తగ్గించే గుణం కలదు.

సాల్మన్ చేపలు 

salmon

ప్రపంచంలోనే ఆరోగ్యకరమైన ఆహారాలలో ఒకటి సాల్మన్ చేపలు. ఈ విషయం ప్రపంచ ఆరోగ్య సంస్థచే ధృవీకరించపడింది. ఈ చేపలలో ఫసిఫిక్, అట్లాంటిక్ అనే రెండు రకాలుంటాయి. వీటిలో ఆడచేపలు గుడ్లు పెట్టిన తరువాత మగచేపలు వాటిని పిల్లలయ్యేటట్లు చేస్తాయి. తరువాత ఆడ, మగ రెండు చేపలు చనిపోతాయి. సాల్మన్ చేపలలో ప్రొటీన్లు, ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్ డిలు పుష్కలంగా లభిస్తాయి. వీటి మాంసం ఎరుపురంగులో ఉంటుంది. కారణం వీటిలో ఉండే కెరటోనాయిడ్లు. తెల్ల మగచేపలనే ఇండియన్ సాల్మన్ చేపలంటారు. రవ్వచేపలని కూడా పిలుస్తారు.