మాఘమాసం

సనాతన హిందూ ధర్మంలో స్నానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. మనం రోజూ చేసే స్నానం దేహాన్ని శుద్దిచేసి మనలోని ప్రకోపాన్ని తగ్గించి, ప్రశాంతతను చేకూరుస్తాయి.మాఘమాసంలో చేసే స్నానాలకు ప్రత్యేకత ఉంది. దేవతలు తమ శక్తులను తేజస్సులను మాఘమాసంలో జలాల్లో ఉంచుతారు. అందువల్ల మాఘస్నానం చాలామంచిది. పౌర్ణమి చంద్రుడు మఘ (మఖ) నక్షత్రంలో ఉండే మాసమే మాఘమాసం. ఈ సమయంలో సూర్యోదయం వేళల్లో సూర్యకిరణాలు ప్రత్యేక కోణాల్లో భూమిపై పడతాయి. అందువల్ల సాధారణ సూర్యకిరణాలకంటే వీటి సాంద్రతలో చాలా తేడా ఉంటుంది. కిరణాలు నీటిపై పడటం వల్ల నీరు చాలా శక్తివంతమవుతుందట. అందుకే జనవరి 20 నుంచి మార్చి 30 వరకు సూర్యోదయానికి ముందుచేసే స్నానాలు చాలా మంచివని చెబుతారు. మాఘమాసంలో సర్యోదయానికి ముందు నక్షత్రాలున్నపుడు చేసేస్నానం అత్యత్తమైనది. సూర్యోదయం తరువాత చేసే స్నానం వల్ల ఉపయోగంలేదు. ఇలాంటి స్నానాలు ప్రవాహజలాల్లో మరియు సాగరసంగమ ప్రదేశాల్లో చేస్తే ఇంకా మంచిదని పెద్దలు చెబుతారు. ఈ నెలలో ఆదివారం చాలా పవిత్రమైనది. ఈరోజున తలస్నానం చేసి సూర్యభగవానునికి నమస్కరించాలి. కృష్ణా నది సాగరసంగమంలో – కృష్ణాజిల్లా అవనిగడ్డ, కోడూరు మండలంలోని హంసలదీవిలో కృష్ణానది సాగరంలో కలుస్తుంది. మాఘమాసంలో రాష్ర్టం నలుమూలల నుండి ఇక్కడ స్నానం చేయటానికి లక్షలాదిమంది వస్తారు. ఇక్కడ ప్రధాన ఆలయం వేణుగోపాల స్వామి. హంసలదీవికి వెళ్ళే మార్గం : కృష్ణాజిల్లా విజయవాడ నుండి అవనిగడ్డకు వరకు వెళ్ళి అక్కడ నుండి కోడూరుదాకా వెళ్లి కోడూరు నుండి ఉల్లిపాలెం మీదుగా హంసలదీవి వెళితే అక్కడ నుండి 5 కి.మీ. దూరంలో సాగరసంగమం ఉంటుంది.

భాద్రపద మాసం

భాద్రపద మాసంలో రెండు విశేషాలున్నాయి. ఒకటి వరాహ జయంతి. దశావతారాల్లో ఇది మూడవది. కల్పాంత సమయంలో భూమి జలమయమైపోయింది. అప్పుడు బ్రహ్మదేవుడు మనువును పిలిచి… భూమిని పాలించమన్నాడు. భూమి నీటిలో ఉంది..ఎవరు పైకి తెస్తారు అంటాడు మనువు. సరిగ్గా అదే సమయంలో బ్రహ్మకు తుమ్ము వచ్చింది. ఆయన ముక్కులోంచి యజ్ఞవరాహమూర్తి పుట్టాడు. యజ్ఞవరాహము అంటే యజ్ఞంలో వాడే పదార్థాన్నీ శరీరంలో భాగాలుగా ఉన్నవాడు. అందుకే ఆయనది మంగళ స్వరూపం. బొటన వేంత దేహంతో పుట్టిన అతడు క్షణకాంలోనే భూమ్యాకాశాలకు పెరిగిపోయాడు. సముద్రంలో ఉన్న భూమిని బయటకు తీయడానికి వెళ్ళాడు. అదే సమయానికి హిరణ్యాక్షుడు ఆ భూమి నాది అని వరాహమూర్తితో యుద్దానికి దిగాడు. అప్పుడు హిరణ్యాక్షుణ్ణి సంహరించి భూమిని పైకెత్తి తన కోరలమీద నిలబెట్టాడు. ఆ రూపాన్ని స్మరిస్తే ఎంతో మంచిదట. శ్రీహరి భాద్రపద శుద్ధ తదియనాడు ఈ అవతారాన్ని స్వీకరించాడు.

ఆ మరునాడు పదహారు కుడుమల తద్దె. స్త్రీలు ఈ రోజున గౌరీ దేవిని పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్ముతారు. తరువాత వచ్చేది చవితి. అదే వినాయక చవితి. ఈ రోజున గణపతిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే విద్యాబుద్దులు సంపదలు అభిస్తాయి.

మరునాడు రుషి పంచమి. ఈ వ్రతం గురించి శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్పాడట. ఇది చేసేటప్పుడు కశ్యపుడు, అత్రి, భరధ్యాజుడు మొదలైన సప్తర్షులతోపాటూ అరుంధతీదేవిని కూడా పూజించాలి. ఇలా చేస్తే సకల పాపాలు నశిస్తాయని చెబుతారు.ఈ వ్రతం చేయలేనివారు ఈ రోజున ఈ మహర్షులను ఒక్కసారైనా తలచుకోవాలి. మర్నాడు షష్టి. దీన్ని సూర్యషష్టి అంటారు. నిజానికి భాద్రపద మాసంలోని ప్రతి ఆదివారం నాడు సూర్యుణ్ణి ఆరాధిస్తే ఎంతో మంచిది.

ఈ నెలలో వచ్చే ఏకాదశిని పరివర్తన ఏకాదశి అంటారు. తొలి ఏకాదశినాడు పాలసముద్రంలో శయనించిన శ్రీహరి ఈ రోజున మరోప్రక్కకు ఒత్తిగిల్లుతాడట. అందుకే ఇది పరివర్తన ఏకాదశి. ఈ రోజు ఉపవాసం చేసి శ్రీహరిని పూజిస్తే కరవుకాటకాలు తొలగిపోతాయట.

ఆ మరునాడు ద్వాదశి శ్రవణా నక్షత్రం ఉన్న ఈ రోజునే వామనావతార శ్రీకారం చేశాడు శ్రీహరి. ప్రహ్లాదుడి మనుమడైన బలిచక్రవర్తి పరమ ధార్మికుడు. అతడు స్వర్గాన్ని జయించడంతో దేవతలు అక్కణ్ణుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. బలిచక్రవర్తిని సంహరించకుండానే అతడి నుంచి స్వర్గాన్ని దేవతలకు ఇచ్చేందుకు బ్రాహ్మణులైన అదితి, కశ్యప ప్రజాపతులకు బిడ్డగా జన్మించాడు శ్రీహరి. బలిచక్రవర్తి నుంచి సకల భూమండలాన్ని స్వర్గలోకాన్ని దానంగా పొందాడు. సుత లోకాన్ని బలిచక్రవర్తికి ఇస్తున్నాను. నా సుదర్శన చక్రం అతడికి ఎల్లప్పుడూ రక్షణగా ఉంటుంది. సావర్థి మన్వంతరంలో నేనే అతడ్ని ఇండ్రుణ్ణి చేసి తరువాత మోక్షమిస్తాను అని అనుగ్రహించాడు. అందుకే, ఈ రోజున వామనావతారాన్ని స్మరించుకుంటే మోక్షం భిస్తుంది.

పితృదేవతల పక్షం: మరునాడు చతుర్థశి ఇదే అనంత పద్మనాభ చతుర్థశి. ఈ రోజున అనంత పద్మనాభవ్రతం చేసి శేషతల్పశాయి అయిన శ్రీహరిని కొలిస్తే సకల సిరిసంపదలు కలుగుతాయి.
పౌర్ణమినాడు ఉమామహేశ్వరుల వ్రతం చేస్తారు. పార్వతీ దేవి ఈ వ్రతం చేసి శివుడి శరీరంలోని అర్థభాగాన్ని పొందిందట.

ఆ మర్నాటినుంచి అంటే కృష్ణపక్షం పితృదేవతలకు ఇష్టమైన కాంల. దీన్ని మహాలయ పక్షం అంటారు. ఈ పక్షమంతా నిత్యం తర్పణాలు వదలడం, శ్రాద్ధవిధులు నిర్వహించడం వంటివాటి ద్వారా పితృదేవతలను ఆరాధించాలి. అలా పక్షం రోజులు చేయలేకపోతే కనీసం మహాలయ అమావాశ్య దాకా అన్నశ్రాద్ధం పెట్టాలట.

భాద్రపద బహుళ తదియ ఉండ్రాళ్లతద్దె. కన్నె పిల్లలు ఈ రోజున గౌరీదేవిని పూజించి ఉండ్రాళ్ళు నైవేద్యంగా పెడతారు.

శ్రావణమాసం

శ్రావణమాసంలో ప్రతి ఇల్లూ లక్ష్మీనివాసమే. పెళ్ళిప్రయత్నాలు, సేద్యపు పనులు …మంచి పనులు ప్రారంభించటానికి ఇదే మంచిమాసమంటారు వేదపండితులు. ఈ మాసంలో చంద్రుడు పౌర్ణమి రోజున శ్రవణా నక్షత్రంలో ఉంటాడు. అందుకే శ్రావణమాసమని పేరు. మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. దశావతారాల్లో కృష్ణావతారం ఈ మాసంలోనే మెదయ్యింది. శ్రీకృష్ణుడు శ్రావణబహుళ అష్టమినాడు దేవకీ వసుదేవు అష్టమగర్భంలో జన్మిస్తాడు. శ్రావణపౌర్ణమి నాడు హయగ్రీవ జయంతి.

శ్రావణ శుక్రవారాలు : శ్రావణం దేవుడికి, భక్తుడికి అనుసంధానం కావించే మాసం.ఉపవాసం అంటే పరమాత్మకు దగ్గరగా వెళ్ళటం. లక్ష్మీదేవి కటాక్షంకోసం శ్రావణపౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీవ్రతం చేస్తారు. అలా కుదరకపోతే ఎదో ఒక శుక్రవారం వరలక్ష్మీవ్రతం చేస్తారు. పోలాల అమావాస్య : శ్రావణ బహుళ అమావాస్యను పోలాల అమావాస్య అంటారు. ఈ రోజు పాడిపశువులను శుభ్రంగా కడిగి కుంకుమదిద్ది హారతులిస్తారు. మనిషికి-పశువుకు మధ్యవుండే అనుబంధాన్ని చాటే పండుగ పోలాల అమావాస్య.

భానుసప్తమి : సమస్త ప్రపంచానికి వెలుగులు పంచే ప్రత్యక్ష భగవానుడైన సూర్యునికి నమస్కారాలు సమర్పిస్తూ భానుసప్తమిని ఘనంగా నిర్వహిస్తారు. శ్రావణ మంగళవారాలో గౌరిదేవి వ్రతమాచరిస్తారు. శ్రావణమాసం సోమవారాలలో శివుణ్ణి ఆరాధిస్తారు.

శ్రావణపౌర్ణమి : ఇస్తినమ్మ వాయనం…పుచ్చుకొంటినమ్మ వాయనం… శ్రావణమాసపు వాయన దానాల్లో ముత్తైదువలు చెప్పుకునే మాట నిజానికి ఇది వాయనం కాదని వాహనం అని అంటారు. అంతిమ ఘడిల్లో వైకుంఠం నుంచి దేవదూతలుల తీసుకొచ్చే దివ్యవాహనం. కడదాకా నీ దాతృత్వమే నిన్ను కాపాడుతుంది అన్న సత్యాన్ని మన పెద్దలు ఇలా చెప్పించారన్నమాట.

శ్రావణపౌర్ణమి రోజే రక్షాబంధనం లేక రాఖీపౌర్ణమి. శ్రీకృష్ణుడు ధర్మరాజుకు రక్షాబంధనం యెక్క ప్రాధాన్యతను వివరిస్తాడు. సోదరీమణులు సోదరులకు రాఖీకట్టి రక్షకోరతారు. ఈ వేడుక గురించి పురాణాల్లో కూడా చెప్పబడింది.

మార్గశిరమాసం

మార్గశిరమాసం మార్గానాం మార్గశీర్షోహం అర్జునా మాసాలలో మార్గశిరాన్ని నేను అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు ప్రకటించుకొన్నాడు. మార్గశిరంలో వ్రతాలకు, పూజలకూ కొదవలేదు. చంద్రుడు ఈ మాసానికి అధిపతి. ధనుర్మాసం సూర్యుడు వృశ్ఛికరాశి నుండి ధనూరాశిలోకి ప్రవేశిస్తాడు. దీనినే ధనుస్సంక్రమణం అంటారు. సూర్యడు మరలా మకరరాశిలోకి ప్రవేశించేదాకా ఉన్న 30 రోజులూ పరమ పవిత్రం. మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరం. గోదాదేవిది మధురభక్తి. తండ్రి విష్ణుచిత్తుడు శ్రీరంగనాధునికి పూజకోసం సిద్ధం చేసిన మాలలను మెడలో వేసుకొని మురిసిపోయేది. ఆ సంగతి తండ్రికి తెలిసింది. మందలించాడు ఐనా వినలేదు. గోదాదేవి ధనుర్మాస వ్రతాన్ని చేపట్టింది. రోజుకో పాశురంతో నారాయణుకి పారాయణ జరిపింది. భక్తవత్సలుడు బాసికం కట్టుకొని మరీ భువికి దిగివస్తాడు. గోదాదేవిని తనదాన్ని చేసుకొని తనలో ఐక్యం చేసుకున్నాడు. ఇదంతా జరిగింది ఈ మాసంలోనే. 

మార్గశిర విశేషాలు :
మార్గశిరమాసంలో ప్రతిరోజూ పవిత్రమైనదే. శుక్లపక్ష పాడ్యమి రోజు నదీస్నానం శ్రేష్టమని అంటారు. తదియనాడు మామహేశ్వర వ్రతాన్ని ఆచరిస్తారు. అలా మార్గశిరం కేశవుడికే కాదు. శివుడికి కూడా ప్రీతికరంగా మారింది. తారకాసుర వధ జరిగింది కూడా ఈ మాసంలోనే. ఇలాగే 30రోజులకు ప్రత్యేకత ఉంది.

వైశాఖ మాసం

తెలుగునెలల్లో రెండో మాసం వైశాఖం. వసంత రుతువులో వచ్చే ఈ మాసంలో ఎండ తీవ్రత ఎక్కువగా వుంటుంది. నిర్మలమైన ఆకాశంతో పాటు రాత్రిళ్లు ఆహ్లాదకరంగా వుంటాయి. ఈ మాసంలో పండ్లకు రాజైన మామిడిపండు దిగుబడులు ఎక్కువగా వస్తుంటాయి.

వైశాఖంలోనే మహామహులు జన్మించడం విశేషం. ప్రపంచానికి శాంతి మార్గం ప్రబోధించిన గౌతమబుద్దుడు, అద్వైత సిద్ధాంతాన్ని ఆ సేతు హిమాచలం ప్రచారం చేసి హైందవ మత పటిష్టతకు కృషి చేసిన శంకర భగవత్పాదులు, విశిష్టాద్వైత ప్రచారకర్త రామానుజాచార్యులు, పదకవితా పితామహుడు అన్నమాచార్యులు, కర్ణాటక సంగీత దిగ్గజం త్యాగయ్య… తదితరులు భువిపై అవతరించిది ఈ మాసంలోనే కావడం గమనార్హం.

శివుని తలపై వున్న గంగానది కూడా ఈ మాసంలోనే భువిపైకి అడుగిడిందని పురాణాలు తెలుపుతున్నాయి.శ్రీమహావిష్ణువు పరశురాముడిగా జన్మించింది, అక్షయతృతీయ తిథి కూడా ఈనెలలోనే వస్తాయి. తిరుమలేశుని సేవలో తరించిన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ జన్మించింది వైశాఖమాసంలోనే.

అక్షయమంటే తరగదని అని అర్ధం. త్రేతాయుగం ఈ తిధి నాడే ప్రారంభమయింది. అందుకునే అక్షయతృతీయను భాగ్యవంతమైన దినంగా భావించి పూజలు చేస్తుంటారు. ఎండ తీవ్రత ఎక్కువగా వున్నా ఈ మాసంలో పిల్లలకు సెలవులు వుంటాయి.

అందుకనే పెద్దలు, పిల్లలు తీర్థయాత్రలు చేస్తుంటారు. దీంతో ఆధ్యాత్మిక విజ్ఞానంతో పాటు వివిధ ప్రదేశాల్లోని సంస్కృతి, కట్టుబాట్లు పిల్లలకు తెలుస్తాయి.

ధనుర్మాసం

ధనుర్మాసం సూర్యుడు ధనురాశిలో ప్రవేశించే పుణ్యసమయం (డిసెంబర్‌ 16 నుండి) అదే ధనుస్సక్రమణం. నాటి నుంచి భోగి పండగ వరకూ పరమపవిత్ర కాలం తెలుగు వారి లోగిళ్లలో దీనిని నెలగంట అంటారు.

ఈ మాసంలోనే పరమాత్ముడు గోదాదేవిని ప్రేమగా స్వీకరించింది. గోదాదేవిని ఆండాళ్‌ అని పిలుస్తారు. ఈమె తమిళనాడులోని శ్రీవిల్లీపుత్తూరులో తులసి మొక్కలమధ్య దర్శనమిచ్చింది. ఈమెకు గోదాదేవి అని పేరుపెట్టి విష్ణుచిత్తుడనే పరమభక్తుడు పెంచి పెద్దచేశాడు. గోదాదేవి బాల్యం నుంచి శ్రీరంగనాధుడే సర్వస్వమని భావించింది. ఆ భగవంతుడే తన భర్త అని విశ్వసించింది. స్వామిని పొందటానికి ధనుర్మాస వ్రతం చేసింది. ముప్పైరోజులు ముప్పై పాశురాలతో కొలిచింది. పూజకోసం తండ్రి సిద్ధం చేసిన దండల్ని మెడలో వేసుకుని అందచందాల్లో తాను రంగనాధస్వామికి సరిజోడి అని మురిసిపోయింది. ఓ సారి విష్ణుచిత్తుడు పూలదండలో గోదాదేవి వెంట్రుకలను చూశాడు మహాపరాధం జరిగిందని బాధపడ్డాడు. రంగనాథస్వామికి మాత్రం విరుల సౌరభాకన్నా గోదాదేవి కురుల పరిమళమే నచ్చింది. విష్ణుచిత్తుడికి కలలో కనిపించి గోదా కళ్యాణానికి అనతి ఇచ్చాడు. ఆండాళమ్మ ఆ అనంతకోటి బ్రహ్మాండనాయకుడిలో అదృశ్యమైంది. పన్నిద్దరు ఆళ్వారులో ఒకే ఒక మహిళ గోదాదేవి.

గోదాదేవి మధురభక్తికి ప్రతీక. శ్రీకృష్ణదేవరాయలు ఈ అంశాన్ని తీసుకుని అముక్తమాల్యద అనే కావ్యాన్ని రాశారు. రాయలవారు కళింగయుద్దాన్ని ముగించుకుని విజయవాడ దగ్గరలోని శ్రీకాకుళం అనే గ్రామంలో ఆంధ్రమహావిష్ణువు ఆలయంలో విడిదిచేశాడు. ఆ రాత్రి ఆంధ్రమహావిష్ణువు కలలో కనిపించి అండాళ్‌ మధురగాథను తెలుగులో ప్రబంధంగా రాసి సమర్పించమని ఆదేశించాడు. అలా తెలుగువారికి గోదాదేవితో ఆధ్యాత్మిక అనుబంధం ఏర్పడింది.

తిరుప్పావై : తిరు అంటే శ్రీ పావై అంటే వ్రతం తిరుప్పావై వ్రతాన్ని శ్రీవ్రతమని అంటారు. సూర్యోదయానికి ముందే లేచి ఆరాధన మొదలు నివేదన దాకా అన్నీ పూర్తి చేసుకుంటారు. గోదాదేవి పాడుకున్న 30 పాశురాల్ని రోజుకొక్కటి చొప్పున ఆలపిస్తారు. వయో లింగబేధాలు లేకుండా ఎవరైనా ఈ వ్రతాన్ని జరుపుకోవచ్చుంటారు వైష్ణవ గురువు. ఇష్టఫలములను అందుకొనుటకు కష్టపడవలె చెల్లెలా.. అంటుంది గోదాదేవి చెలికత్తెతో ఓ పాశురంలో. ఆధ్యాత్మిక ఉన్నతికి శారీరక క్రలమశిక్షణ కూడా చాలా అవసరం ఓ వైపు వణికించే చలి. తెల్లవారుజామునే మేల్కొనాలి. ఆహార నియమాల్ని పాటించాలి. మితభాషణ చేయాలి. ఇతరులకు సాధ్యమైనంత ఇబ్బందిలేకుండా చూడాలి. అంటే ప్రియభాషణ కూడా అవసరమే. దానధర్మాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. భోగాలకు దూరంగా ఉండాలి.

ఆలయాలో : రేపల్లెలో గోపికలు కాత్యాయనీ వ్రతాన్ని నోచినట్లే.. గోదాదేవి పాశురాలతో శ్రీరంగనాథుని కొలుస్తుంది. తిరుప్పావై కృష్ణుడికీ గోపికకూ సంబంధించిన మామూలు కథలా అనిపించవచ్చు కానీ, పత్తిపువ్వును విప్పుతూ పోతే పత్తి ఎలా విస్తరిస్తుందో ప్రతి పాశురానికీ అంత విస్తారమైన అర్థం ఉంది అంటారు చిన జియర్‌స్వామి. ఇందులో రామాయణ, భారత సారాంశం ఉంది. అంతర్లీనంగా శ్రీవైష్ణవతత్వం, ఉపనిషత్‌ రహస్యాలు ఉన్నాయి.

వైష్ణావాలయాలు ధనుర్మాసంలో ఆధ్యాత్మికశోభతోపాటు వెలిగిపోతుంటాయి. విష్ణుసహస్రనామ పారాయణాలు, పాశురగానాలూ, గీతా ప్రవచనాలు ప్రతిధ్వనిస్తుంటాయి. తిరుమలలో ధనుర్మాసమంతా సుప్రభాతానికి బదుగా తిరుప్పావైతోనే స్వామిని మేల్కొలుపుతారు. ధనువు అన్న మాటకు ధర్మమనే అర్థమూ ఉంది. ఈ మాసంలో ఆచరించే ధర్మమే..మనలను మిగతా మాసాల్లోనూ కాపాడుతుందనీ సత్యమార్గంలో నడిపిస్తుందని పండితులు చెబుతారు.

తెలుగు నెలలు (తెలుగు మాసములు)

తెలుగు నెలలు పన్నెండు. ప్రతి నెల శుక్ల పక్ష పాడ్యమి (అమావాస్య తర్వాత వచ్చే తిథి) తో మొదలై అమావాస్యతో ముగుస్తుంది.
 
 
ప్రతి నెలలో రెండు పక్షాలు ఉంటాయి:
 
 
 1. శుక్ల పక్షం లేదా శుద్ధ పక్షం (ప్రతి నెల మొదటి తిథి పాడ్యమి నుంచి పున్నమి వరకు): రోజు రోజుకూ చంద్రుడి తో పాటు వెన్నెల పెరిగి రాత్రుళ్ళు తెల్లగా, కాంతివంతంగా అవుతాయి. (శుక్ల అంటే తెల్లని అని అర్థం).
 2. కృష్ణ పక్షం లేదా బహుళ పక్షం (ప్రతి నెల పున్నమి తరువాత వచ్చే పాడ్యమి తిథి నుంచి అమావాస్య వరకు): రోజు రోజుకూ చంద్రుడి తో పాటు వెన్నెల తరిగి రాత్రుళ్ళు నల్లగా చీకటితో నిండుతాయి. (కృష్ణ అంటే నల్లని అని అర్థం).
 
తెలుగు నెలలు
 
 
 1. చైత్రము
 2. వైశాఖము
 3. జ్యేష్ఠము
 4. ఆషాఢము
 5. శ్రావణము
 6. భాద్రపదము
 7. ఆశ్వయుజము
 8. కార్తీకము
 9. మార్గశిరము
 10. పుష్యము
 11. మాఘము
 12. ఫాల్గుణము
 
ఈ నెలల పేర్లు ఒక్కో నక్షత్రం పేరు మీద ఒక్కొక్క నెల ఏర్పడినట్లు సులభంగా గుర్తించవచ్చు.
 
 • పౌర్ణమి రోజున చిత్తా నక్షత్రం (అనగా చంద్రుడు చిత్తా నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల చైత్రము .
 • పౌర్ణమి రోజున విశాఖ నక్షత్రం (అనగా చంద్రుడు విశాఖ నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల వైశాఖము.
 • పౌర్ణమి రోజున జ్యేష్ఠ నక్షత్రం (అనగా చంద్రుడు జ్యేష్ఠా నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల జ్యేష్ఠము .
 • పౌర్ణమి రోజున పూర్వాషాఢ నక్షత్రం (అనగా చంద్రుడు పూర్వాషాఢా నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల ఆషాఢము.
 • పౌర్ణమి రోజున శ్రవణం నక్షత్రం (అనగా చంద్రుడు శ్రవణం నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల శ్రావణము .
 • పౌర్ణమి రోజున పూర్వాభాద్ర్హ నక్షత్రం (అనగా చంద్రుడు పూర్వాభాద్రా నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల భాద్రపదము.
 • పౌర్ణమి రోజున అశ్వని నక్షత్రం (అనగా చంద్రుడు అశ్వనీ నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల ఆశ్వయుజము.
 • పౌర్ణమి రోజున కృత్తిక నక్షత్రం (అనగా చంద్రుడు కృత్తికా నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల కార్తీకము.

 • పౌర్ణమి రోజున మృగశిర నక్షత్రం (అనగా చంద్రుడు మృగశిరా నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల మార్గశిరము .
 • పౌర్ణమి రోజున పుష్యమి నక్షత్రం (అనగా చంద్రుడు పుష్యమీ నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల పుష్యము.
 • పౌర్ణమి రోజున మఖ నక్షత్రం (అనగా చంద్రుడు మఖా నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల మాఘము.
 • పౌర్ణమి రోజున ఉత్తరఫల్గుణి (ఉత్తర) నక్షత్రం (అనగా చంద్రుడు ఉత్తరఫల్గుణీ నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల ఫాల్గుణము