చిన్ననాటి ఆటలు – అచ్చెనగండ్లు , అష్టా-చెమ్మ, దాడి ఆట, ఏడు పెంకులాట, తొక్కుడు బిళ్ళ, కర్రాబిళ్ళ

అచ్చెనగండ్లు
 

అచ్చెనగండ్లు ఆడపిల్లలకు చాలా ఇష్టమైన ఆట. ఈ ఆట ఆడటానికి కావలసినవి ఐదు చిన్న చిన్న రాళ్ళు లేదంటే కుంకుడు/చింత గింజలు. ఈ ఆటయెక్క మూలాలు కొరియా లో ఉన్నట్లు చెపుతారు.

 

ఈ ఆట ఆడే వ్యక్తి ఒకే చేతిని ఉపయోగించవలసి ఉంటుంది.

మొదటి అంకం:

ఆట ఆడే వ్యక్తి రాళ్ళను నేలపై పరచి ఒక రాయిని తీసుకొని గాలిలోకి ఎగురవేయాలి. ఆ రాయి తిరిగి నేలకు తాకేలోపుగా కింద పరచివున్న రాళ్ళలో ఒకదానిని ఒడిసిపట్టుకొని గుప్పెట్లోకి తీసుకోవాలి. ఇలా గుప్పెట్లోకి తీసుకొనేటప్పుడు పక్కగా ఉన్న ఏ ఇతర రాయి కదలకూడదు. అదే సమయంలో పైనున్న రాయి నేలకు తాకకుండా అదె గుప్పెటతో మరల అందుకోవాలి. అదే విదంగా మిగిలిన రాళ్ళు అన్ని ఒక్కొక్కటి తీసుకోవాలి. పైకి ఎగురవేసిన రాయి నేలకు తాకినా, లేక కిందనున్న ఏ ఇతర రాళ్ళు కదలినా ఆ వ్యక్తికి ఆట కొనసాగించే అవకాశం పోతుంది.

 
 

రెండవ అంకం:

ఇందులో కూడా మొదటి అంకంలో మాదిరి గానే రాళ్ళను నేలపై పరచి ఒక రాయిని తీసుకొని పైకి ఎగురవేసి కింద పరచివున్న రాళ్ళలో రెండింటిని వడిసిపట్టాలి. అదే విదంగా మిగిలిన రాళ్ళు అన్ని రెండేసి తీసుకోవాలి.

 మూడవ మరియు నాల్గవ అంకం:

అలాగే మూడవ అంకంలో మూడేసి రాళ్ళను నాల్గవ అంకంలో నాలుగేసి రాళ్ళను వడిసిపట్టాలి.

ఐదవ అంకం: 

ఈ అంకంలో ఆటగాళ్ళకు పాయింట్లు వస్తాయి. మొత్తం ఐదు రాళ్ళను పైకి ఎగురవేసి అవి కిందపడేలోపు అరచేతిని వెనుకకుతిప్పి ఎన్ని రాళ్ళను వడిసిపట్టగలరో అన్ని పట్టాలి. తరువాత మరలా వాటిని పైకి ఎవురవేచి ఈసారి అరచేతితో మొత్తం అన్ని రాళ్ళను వడిసిపట్టాలి. ఇలా ఎన్ని రాళ్ళూ పట్టగలిగారో వారికి అన్ని పాయింట్లు వచ్చినట్లు లెక్క.

ఈ విధంగా ఆట ఒకరినుంచి ఇంకొకరికి మారుతూ కొనసాగుతుంది. చివరగా ఏ వ్యక్తికి పాయింట్లు ఎక్కువ వస్తాయో ఆవ్యక్తి గెలిచినట్లన్నమాట.

అష్టా-చెమ్మ

 

“అష్టా-చెమ్మ” దీనినే “గవ్వలాట” అనికూడా అంటారు.

 

ఈ ఆట ఆడడానికి కావలసిన ముఖ్యవస్తువులు: 5 అడ్డు వరుసలు, 5 నిలువు వరుసలతో కూడి చతురస్రాకారంలో ఉన్న పటం. నప్పులు, గవ్వలు. [నప్పు ని కొన్ని ప్రాంతాలలో పావులు అని అంటారు]. “నప్పు” ఒక ఆటగాడియొక్క చిహ్నం. ఈ ఆటలో పాల్గొనే ప్రతీ ఆటగాడికీ వేరే వేరే ఆకారాలు లేదా రంగులున్న నప్పులు ఉంటాయి. ఇక ఈ నప్పులను ఎంత దూరం నడపాలో నిర్ణయించడానికి కావలసినవి గవ్వలు. సాధారణంగా నాలుగు ఒకే పరిమాణం గల గవ్వలను ఆటకు ఉపయోగిస్తారు. ఈ గవ్వలను ఆటగాడు విసిరినప్పుడు ఎన్ని గవ్వలు వెల్లకిల పడితే నప్పు అంత దూరం జరపవలసి ఉంటుంది. నాలుగు గవ్వలూ వెల్లకిల పడితే “చెమ్మ” అనీ, నాలుగూ బోర్లా పడితే “అష్ట” అనీ అంటారు. “చెమ్మ” అంటే నాలుగు, “అష్ట” అంటే ఎనిమిది. ఇవి పడినప్పుడు ఆ ఆటగాడికి మరల గవ్వలు విసిరే అవకాశం ఉంటుంది. కానీ అదే, మూడు సార్లు అష్ట లేదా చెమ్మ పడితే, నప్పును జరిపే అవకాశాన్ని కోల్పోతాడు.

                         
 

గవ్వలు

3 వెల్లకిలా, 1 బొర్లా పడితే – నప్పును ఒక గడి జరపవచ్చును లేదా ఒక నప్పును ఆటలోనికి ఎక్కించవచ్చును.

2 వెల్లకిలా, 2 బోర్లా పడితే – నప్పును రెండు గడులు జరపవచ్చును

1 వెల్లకిలా, 3 బోర్లా పడితే – నప్పును మూడు గడులు జరపవచ్చును

4 వెల్లకిలా(చమ్మ) పడితే – నప్పును నాలుగు గడులు జరపవచ్చును లేదా రెండు నప్పులను ఆటలోనికి ఎక్కించవచ్చును.

4 బోర్లా(అష్ట) పడితే – నప్పును ఎనిమిది గడులు జరపవచ్చును లేదా నాలుగు నప్పులను ఆటలోనికి ఎక్కించవచ్చును.

 

ఈ ఆటలో ఇద్దరు నుంచి నలుగురు ఆటగాళ్ళు, పటానికి నాలుగు వైపులా కూర్చొని ఆడతారు. ప్రతీ ఆటగాడికీ, తనవైపుగా బయట వరుసలో ఉన్న 5 గళ్ళలో, మధ్య గడిలో “X” గుర్తు వేసి ఉంటుంది. ఇది ఆ ఆటగాడి “ఇల్లు” అంటారు. ఈ గడే కాక, పటంలో లోపలగా మధ్యలో ఉన్న గడిలోనూ, మరి కొన్ని గళ్ళలోనూ “X” గుర్తు వేసి ఉంటుంది. వీటిని విరామ స్థానాలు అనవచ్చు. ప్రతీ ఆటగాడూ, తన నాలుగు నప్పులనూ బయటి గడులలో అపసవ్య(anti clockwise) దిశ లోను, లొపటి గడులలో సవ్య(clockwise) దిశ లోనూ నడుపుకొంటూ, చివరకు మధ్యలో “X” గుర్తు ఉన్న గడికి చేర్చవలసి ఉంటుంది.

 

ఏ ఆటగాడి నప్పులు ముందుగా గమ్యస్థానాన్ని చేరుకొంటే అతడే విజేత. ఆటగాడు తన నాలుగు నప్పుల్లో దేనిని జరుపుతాడు అనేది అతని ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. కానీ ఒకసారికి ఒక నప్పునే జరుపవలసి ఉంటుంది. ఈ ఆటలో నియమాలు ఇవే అయితే మజా ఏముంటుంది..? అసలు మజా అల్లా ఒక ఆటగాడి నప్పులను మరొకరు చంపుకోవడంలో ఉంటుంది. ఒక ఆటగాడి నప్పు “X” గుర్తు లేని గడిలో ఉన్నప్పుడు, రెండవ ఆటగాడి నప్పు అదే గడిలోకి వచ్చి చేరితే, రెండవ ఆటగాడి నప్పు, మొదటి ఆటగాడి నప్పును చంపినట్టు లెక్క. అప్పుడు మొదటి ఆటగాడి ఆ నప్పు, అతని ఇంటికి చేరుతుంది..!! ఆ నప్పును అతడు మరల మొదటినుంచే నడుపుకు రావలసి ఉంటుంది. “X” గుర్తు గడిలో ఉన్న నప్పును ఏ నప్పూ చంపలేదు. ఇలా ఒకరి నప్పులు ఒకరు చంపుకొంటూ, కసితో, ఉత్సాహంతో, రసవత్తరంగా సాగుతుంది ఈ ఆట.

దాడి ఆట

 

ఇందులో ఇద్దరు ఆటగాళ్ళు వుంటారు. ఒక్కొక్కరికి తొమ్మిది తొమ్మిది చొప్పున చింత పిక్కలో/గింజలో/రాళ్ళో ఇవ్వబడతాయి. (అయితే ఒకరు చింత పిక్కలు తీసుకుంటే ఇంకొకరు వేరే నప్పులు తీసుకోవాలి.. ఏ పావు ఎవరిదో తెలిసేట్టు). పైన బొమ్మలో పసుపు రంగు సున్నాలలో ఒకరి తరువాత ఒకరు తమ పావుల్ని పెట్టాలి. అడ్డంగాకాని, నిలువుగా కాని, క్రాస్‌గా కాని మూడూ ఒకే రకం పావులు వస్తే ఒక దాడి జరిగినట్లు. దాడి జరిపిన వాళ్ళు ఎదుటివారి నప్పులలోంచి ఒక నప్పును (దాడి జరగనిది మాత్రమే) తీసుకుంటారు.

పలక - బలపం: తాతలు ఆడిన ఆటలు: దాడి

ఇలా ఆడుతూ ఆడుతూ తొమ్మిది పావులు పేర్చడం అయ్యాక నప్పులకు కదలిక వస్తుంది. ఒక కూడలి నుంచి మరో కూడలికి కదలొచ్చు. మళ్ళీ మూడూ ఒక వరుసలోకి చేరగానే అవతలి వాడి నప్పును తీసుకోవచ్చు. ఒకసారి దాడి జరిపిన నప్పుని, ప్రక్కకు జరిపి, దానితో మరల దాడి చెయ్యవచ్చును. ఇలా ఆడే ఇద్దరిలో ఎవరివో ఒకరి నప్పులు పూర్తయ్యేవరకు ఆడుకోవచ్చును.

 

ఏడు పెంకులాట

 

Friends & Family: చిన్ననాటి ఆటలు - [Seven Stones ...ఈ ఆటలో రెండు జట్లు ఉంటాయి. ఒక్కొక్క జట్టులో దాదాపు అయిదు మంది సభ్యులు ఉంటారు. ఆట ముందుగా నిర్ణయించుకొన్న సరిహద్దులలో జరుగుతుంది. ఈ ఆటకు కావలసిన ముఖ్య వస్తువులు: ఏడు పెంకులు, ఒక బంతి..!! ఈ ఆట ప్రారంభంలో ఏడు పెంకులు మైదానం మధ్యలో ఒకదానిపై మరొకటి పేర్చి ఉంచుతారు. ఈ పెంకులకు అటూ ఇటూ అయిదారు అడుగుల దూరంలో గీతలు ఉంటాయి.

 

ఆట ఏ జట్టు మొదలు పెట్టాలో నిర్ణయించడానికి “టాస్” వేస్తారు. ఒక పెంకు ముక్క తీసుకొని, దానికి ఒకవైపు ఉమ్మి రాసి, గాలిలోకి ఎగురవేయాలి. ఇరు జట్ల నాయకులూ “తడి” లేదా “పొడి” లో ఒక దాన్ని ఎన్నుకొంటారు. పెంకు ఏవైపుగా తిరగబడిందన్న దాన్ని బట్టి టాస్ ను నిర్ణయిస్తారు.

టాస్ గెలిచిన జట్టు సభ్యుడొకడు గురిచూసి పెంకుల వైపు బంతిని విసురుతాడు. ఆ సమయంలో అతని కాలు, అతని వైపు ఉన్న గీతను దాటకూడదు. ఈ విసిరిన బంతిని అవతలి జట్టు సభ్యులు క్యాచ్ చేయటానికి ప్రయత్నిస్తారు. క్యాచ్ పట్టుకొంటే మొదటి జట్టు బంతి విసిరే అవకాశాన్ని కోల్పోతుంది. లేకుంటే, మొదటి జట్టుకే మరల బంతిని విసిరే అవకాశం వస్తుంది. ఒక జట్టు మూడుసార్ల కన్న ఎక్కువ అవకాశాలను పొందలేదు. ఒకవేళ, బంతి విసిరిన వ్యక్తి పెంకులను పడకొట్టగలిగితే అసలు ఆట ప్రారంభం అవుతుంది..!!

 

పెంకులను పడకొట్టిన జట్టు సభ్యులు మరల పెంకులను యధాస్థానంలో ఒకదానిపై మరొకటి నిలబెట్టవలసి ఉంటుంది. అదే సమయంలో, రెండవ జట్టు సభ్యులు, బంతిని వెతికి పట్టుకొని, మొదటి జట్టు సభ్యులలో ఎవరినైనా బంతితో కొట్టగలగాలి. మొదటి జట్టు సభ్యులు పెంకులను నిలబెట్టగలిగేలోగా ఇది జరగాలి. పెంకులను నిలబెట్టగలిగితే మొదటి జట్టుకు పాయింటు, ప్రత్యర్థి జట్టు సభ్యుడిని బంతితో కొట్టగలిగితే రెండవ జట్టుకు పాయింటు. ఆట ముగిసే సమయానికి ఏ జట్టు ఎక్కువ పాయింట్లను గెలుచుకొంటుందో వారే విజేత.

పెంకులను పడగొట్టగానే, ఆ జట్టువారందరూ నలుమూలలకూ పరిగెడతారు. అదే పొరపాటున ఒకే వైపుకు పరిగెడితే అవతలి జట్టుకే విజయం సాధించే అవకాశం ఎక్కువ. అదే విధంగా బంతిని వేటాడే జట్టువారు సాధ్యమైనంతగా బంతిని మైదానం మధ్యనే ఉండేట్టు చూసుకొంటారు. లేదా, బంతిని వెతికి పట్టుకొనే లోపు, మొదటి జట్టువారు పెంకులను నిలబెట్టే అవకాశం మెండు.

ప్రత్యర్థులను ఏమార్చడం, వ్యూహ, ప్రతివ్యూహాలను రచించడం ఈ ఆటలో ఇమిడి ఉంటాయి. పెంకులను ఒకదానిపై ఒకటి పేర్చగలిగితే, దానికి సంకేతంగా చప్పట్లు కొట్టవలసి ఉంటుంది. అప్పటి దాకా ఎంతో టెన్షన్‌తో సాగిన ఆట ఆ చప్పట్లతో ముగుస్తుంది.

  తొక్కుడు బిళ్ళ

 


Hopscotch – Traditional Games Federation of India

తొక్కుడు బిళ్ళను ఎవరికి వారుగా, ఇద్దరు చొప్పన ఒక జట్టుగా ఆడతారు. ఇది పూర్తిగా ఆడపిల్లల ఆట. చెరోవైపు ఐదేసి గడులుంటాయి. ఆటకు వినియోగించే రాతి బిళ్ళను మొదటి గడిలో వేసి ఆటను ప్రారంభిస్తారు. గడి దాటుకుని మిగిలిన గడులలో ఒంటికాలిపై కుంటుకుంటూ వెళతారు. మొత్తం గడులను విజయవంతంగా పూర్తిచేసిన తరువాత బిళ్ళను చేతులపైనా, తలపైనా, కాళ్ళపైనా, నుదుటిపైనా పెట్టుకుని గడులలో ఒంటికాలిపై కుంటుకుంటూ దాటాల్సి ఉంది. ఇవన్నీ విజయవంతంగా పూర్తిచేసిన వారు ఈ ఆటలో విజేతలుగా నిలుస్తారు.

కర్రాబిళ్ళ

Childhood Memories

నిజానికి ఇది క్రికెట్‌కు జేజమ్మ. కర్రాబిళ్లను ఆడేందుకు చిన్న పిల్లలు పోటాపోటీగా ముందుకు వస్తారు. ఇందులో రెండు గ్రూపులు ఉంటాయి. మొదటి గ్రూపు చేసిన స్కోర్‌ను రెండో గ్రూప్‌ ఛేజ్‌ చేస్తుంది. మొదటి గ్రూపు చేసిన స్కోరును పూర్తి చేయలేకపోయినా, చేసేలోపలే ఆటగాళ్లందరూ అవుటైనా మొదటి గ్రూపు విజేతగా మారుతుంది.