మడావి హిడ్మా – మావోయిస్టు

1996-97 ప్రాంతంలో తన 17వ ఏట మావోయిస్టు పార్టీలో చేరారు మడావి హిడ్మా. ఆయనకు హిద్మల్లు, సంతోష్‌ అనే మారుపేర్లు కూడా ఉన్నాయి. దక్షిణ బస్తర్ ప్రాంతంలో సుక్మా జిల్లాలో పువర్తి గ్రామం ఆయన సొంతూరు. ఆ గ్రామం నుంచి దాదాపు 40-50 మంది మావోయిస్టులు ఉంటారని అంచనా. పార్టీలోకి రాకముందు హిడ్మా వ్యవసాయం చేసుకునేవారు.

ఎక్కువగా మాట్లాడే అలవాటు లేని హిడ్మా, కొత్త విషయాలు నేర్చుకోవడానికి బాగా ఆసక్తి చూపిస్తారు. ఆ క్రమంలోనే మావోయిస్టు పార్టీతో కలసి పనిచేసిన ఒక లెక్చరర్ ద్వారా ఇంగ్లీషు నేర్చుకున్నారు. తన మాతృభాష కాని హిందీని కూడా ఎంతో ఆసక్తితో నేర్చుకున్న ఆయన చదివింది మాత్రం 7వ తరగతే. ”హిడ్మాను 2000వ సంవత్సరం ప్రాంతంలో మావోయిస్టులకు అవసరమైన ఆయుధాల తయారీ విభాగంలో వేశారు. కొత్త విషయాలను నేర్చుకోవాలనే కుతూహలం అక్కడ కూడా ప్రదర్శించారని చెబుతారు.

ఆయుధాల తయారీ, రిపేర్లు చేసేవాడు. గ్రనేడ్లు, లాంఛర్లు స్థానికంగా తయారు చేయించాడు. 2001-02 ప్రాంతాల్లో దక్షిణ బస్తర్ జిల్లా ప్లటూన్‌లో ఎదిగారు హిడ్మా. తరువాత మావోయిస్టు సాయుధ విభాగం పీఎల్‌జీఏ ( పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ)లో చేరారు.

ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌

2001-2007 ఏడు మధ్య హిడ్మా సాధారణ మావోయిస్టు పార్టీ సభ్యుడుగానే ఉన్నారు. కానీ బస్తర్ ప్రాంతంలో సల్వాజుడుం ఎదుగుదల హిడ్మాను మరింత యాక్టివ్‌గా మారడంలో కీలక పాత్ర పోషించిందంటారు మావోయిస్టు కార్యకలాపాలను విశ్లేషించిన వారు. 1990ల మధ్యలో ఒక దశలో బస్తర్‌లో దెబ్బతిన్న మావోయిస్టు పార్టీ మళ్లీ తిరిగి లేవడానికి ఒక రకంగా సల్వాజుడుంపై స్థానికుల్లో ఏర్పడ్డ ప్రతీకారేచ్ఛ కారణమని వారి విశ్లేషణ.

సరిగ్గా ఇదే పాయింట్ హిడ్మా విషయంలో కూడా పనిచేసింది అంటారు. ”తన వారిపై జరుగుతోన్న దారుణాలు అతణ్ణి అలా తయారు చేసి ఉండొచ్చు.” అని మావోయిస్టు పార్టీ మాజీ సభ్యులు ఒకరు అన్నారు. 2007వ సంవత్సరం మార్చి నెలలో ఉర్పల్ మెట్ట ప్రాంతంలో పోలీసులపై దాడి జరిగింది. ఇందులో 24 మంది సీఆర్పీఎఫ్‌ పోలీసులు మరణించారు. హిడ్మా నాయకత్వంలో ఈ దాడి జరిగిందని చెబుతారు.

”సీఆర్పీఎఫ్ వారు అక్కడ ఒక గ్రామాన్ని తగలబెట్టారు. ఆ విషయం తెలుసుకున్న హిడ్మా బృందం వారిని మార్గంలో అడ్డగించడానికి వెళ్లింది. తిరిగి వెళ్తున్న సీఆర్‌పీఎఫ్‌ బృందంపై హిడ్మా బృందం దాడికి దిగింది. ఈ ఘటనకు ఒక ప్రత్యేకత కూడా ఉంది. అప్పటి వరకూ మావోయిస్టులు ల్యాండ్ మైన్ (మందు పాతర)లపై ఎక్కువగా ఆధారపడేవారు. కానీ, మొదటిసారి తుపాకులతో తలపడి, ఎదురు ఎదురుగా యుద్ధానికి దిగిన పెద్ద ఘటనగా దీన్ని చెబుతారు. మావోయిస్టులను మందు పాతరల నుంచి తుపాకీల వైపు మళ్లించడంలో హిడ్మాది కీలక పాత్రగా చెబుతారు.

”నిజానికి హిడ్మా దూకుడు పార్టీ నాయకత్వనికి కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది. తరువాత కూడా ఆయన ఆ దూకుడును కొనసాగించాడు. అందుకే పార్టీ ఆయనకు పెద్ద బాధ్యతలు ఇస్తూ పోయింది.” అని ఒక మాజీ మహిళా మావోయిస్టు వివరించారు. 2008-09 ప్రాంతంలో మావోయిస్టు పార్టీ అప్పుడే ఏర్పాటు చేసిన ఫస్ట్ బెటాలియన్‌కి కమాండర్ అయ్యారు హిడ్మా. ఈ ఫస్ట్ బెటాలియన్ బస్తర్ ప్రాంతంలో చురుగ్గా ఉంటుంది. తరువాత 2011లో దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటిలో సభ్యుడు హిడ్మా సభ్యుడయ్యారు. 2010 ఏప్రిల్ లో జరిగిన తాడిమెట్ల ఘటనలో 76 మంది పోలీసులు మరణించారు. 2017 మార్చిలో 12 మంది సీఆర్పీఎఫ్ పోలీసుల మృతి చెందారు. ఈ రెండు ఘటనల్లో హిడ్మా పాత్ర ఉందని చెబుతారు. హిడ్మా అనేక పోరాటాల్లో క్షేత్ర స్థాయిలో పాల్గొన్నా, స్వయంగా తూటాలు పేల్చేది తక్కువ. దగ్గరుండి మిగిలిన మావోయిస్టులను నడిపిస్తారు. ఎంతో తప్పనిసరి అయితే తప్ప తన దగ్గరున్న తుపాకీ ఉపయోగించడు. ఆయన నాయకత్వంలోని దళం చాలా చురుగ్గా పని చేస్తుంది.

హిడ్మా బస్తర్ స్థానికుడు. అక్కడి ఆదివాసీ తెగకు చెందిన వ్యక్తి. స్థానికులతో కలిసిపోతారు. వారితో సత్సంబంధాలు ఉంటాయి. అతనికి స్థానిక యూత్‌లో బాగా క్రేజ్ ఉంది. ”అక్కడి వారు అతణ్ణి ఓ దేవుడిలా చూస్తారు. ప్రస్తుతం అతని తలపై లక్షల రివార్డు ఉంది. 

హర్షద్ మెహతా

1954లో గుజరాత్‌లో పుట్టి, జేబులో నలభై రుపాయలతో, కళ్ళలో కోటి కలల్తో బొంబాయికి వచ్చాడు. బీకాం చదివాక ఎనిమిదేళ్ళు ఏవేవో ఉద్యోగాలు చేస్తూ 1980లో ఒక స్టాక్ బ్రోకర్ వద్ద చిన్న ఉద్యోగంలో చేరాడు. అలా స్టాక్ మార్కెట్లపై ఇష్టం, జ్ఞానం పెంచుకుని 1984లో గ్రోమోర్ పేరుతో బ్రోకెరేజ్ సంస్థను స్థాపించాడు.

1990కి పదిహేను వేల చదరపు అడుగుల ఇల్లు, విదేశీ కార్లతో బొంబాయి సంపన్న వర్గాల్లో సూపర్‌స్టార్ అయ్యాడు. పలు ప్రముఖులు అతని సంస్థలో పెట్టుబడులు పెట్టారు. 1992లో సుచేతా దలాల్ వెలికితీసిన నిజాలతో పేకమేడలా అతని సామ్రాజ్యం కూలిపోయింది.

ఇంతకూ అతను చేసిన స్కామ్ ఏంటి?

ముందు కాస్త నేపథ్యం.

1991లో వ్యవస్థలో పెనుమార్పులకు తెరతీశారు అప్పటి ప్రధాని నరసింహారావు గారు. అయితే దానివల్ల ప్రభుత్వ రంగ సంస్థలకు ప్రైవేట్ రంగం నుంచి ఎదురైన పోటీ బాగా ఒత్తిడి తెచ్చింది. దానికి తోడు ప్రైవేట్ సంస్థల వేగవంతమైన వ్యాపార విస్తరణ బ్యాంకులకు అప్పటి వరకు చూడని కొత్త సవాళ్ళనిచ్చాయి. ఫలితంగా బ్యాంకులు వారి లాభాలను ఎక్కువ చేసుకునేందుకు కొత్త మార్గాలు కనిపెట్టాయి.

బ్యాంకులన్నీ స్టాచుటరీ లిక్విడిటీ నిష్పత్తి (SLR) పాటించవలసి ఉంటుంది (కనీస నగదు/నగదు సంబంధ హామీ అనుకోవచ్చు). ఇది 1990ల్లో ఎక్కువగా 38.5% ఉండింది. అందువల్ల బ్యాంకులు మూలధన కొరతతో అప్పటి బుల్ స్టాక్ మార్కెట్ల నుండి ప్రయోజనం పొందలేకపోయాయి. దానికి వారు కనిపెట్టిన మార్గం రెడీ ఫార్వర్డ్ డీల్స్ (RFD) – ఇవి ప్రభుత్వ బాండ్లను తనఖా పెట్టుకుని బ్యాంకులు వేరే బ్యాంకులకు ఇచ్చే స్వల్పకాలిక రుణాలు.

ఈ డీల్స్ కొరకు పబ్లిక్ డెట్ ఆఫీస్ (PDO) అనే సంస్థను RBI మొదలుపెట్టినా, అప్పట్లో ప్రభుత్వ సంస్థల్లో సర్వవ్యాప్తి అయిన రెడ్‌టేప్ దెబ్బకు PDOను వాడకుండా బ్యాంక్ రసీదులను (BR) బదిలీ చెయ్యటం మొదలుపెట్టాయి. ఈ రసీదులను అమ్మి, కొనే ధరల్లో తేడాను ఆ రుణాలకు వడ్డీ కింద జమ చేసుకునేవారు.

BRల బదిలీ ప్రక్రియలో బ్రోకర్లు ప్రవేశించారు. బ్యాంకులూ గోప్యత, ద్రవ్యత్వం వంటి ప్రయోజనాల వల్ల ఈ బ్రోకర్ల సేవలను వాడుకోవటం మొదలుపెట్టాయి. ఇక్కడే హర్షద్ మెహ్తా బ్రోకర్‌గా తన తెలివిని పనిలో పెట్టాడు. ఒక బ్యాంకు BRల కొనుగోలుకు ఇచ్చే చెక్కులను తన పేరున ఇచ్చేలా చేశాడు. ఆ నగదును స్టాక్ మార్కెట్లలో పెట్టుబడికి వాడేవాడు. మరో బ్యాంకు నుండి నగదు తెచ్చి మునుపు లావాదేవీని పూర్తి చేసేవాడు. ఇలా ఒక చెయిన్‌లా బ్యాంకుల నుండి నగదును మార్పిడి చేస్తూపోయాడు.

అలా వచ్చిన నగదుతో తన వద్దకు వచ్చిన సంస్థల షేర్లను పంప్-అండ్-డంప్ (తక్కువ ధరకు చాలా ఎక్కువ షేర్లు కొని, ఫలితంగా ఆ షేరు ధర పెంచేసి, ఎక్కువకు అన్నీ అమ్మేయటం) చేసేవాడు. ఉదాహరణకు: సిమెంటు సంస్థ ACC షేరు ధర రెండు నెలల్లో 200 నుండి 9000లకు చేరింది.

బ్యాంకులకు ఈ తతంగమంతా తెలిసినా, లాభాల్లో కొంత వారికి ఇస్తున్నందున హర్షద్ మెహ్తాను పట్టించుకునేవారు కాదు. ఏమయినా చివరకు వారి వాటాదార్లకు లాభాలు చూపటమే ముఖ్యోద్దేశ్యం ఏ సంస్థకైనా! అయితే ఇంతదాకా హర్షద్ మెహ్తా చేసింది చట్టవిరుద్ధమేమీ కాదు. వ్యవస్థలోని ఒక లొసుగును ఎక్స్‌ప్లాయిట్ చేశాడంతే.

కానీ తన విలాసవంతమైన జీవనానికి బ్యాంక్ ఆఫ్ కరాడ్, మెట్రొపాలిటన్ కో-ఆపరేటివ్ బ్యాంక్‌లతో కలిసి నకిలీ BRలను చలామణీ చెయ్యటం మొదలుపెట్టాడు. ఇది అతను చేసిన తప్పు. అయితే అతని విదేశీ కార్లు ఒకరోజు పాత్రికేయురాలైన సుచేతా దలాల్ కంట పడ్డాయి. కుతూహలం మొదలై, నెమ్మదిగా తీగ లాగి డొంకంతా కదిలించిందావిడ.

నేటికీ స్టాక్ మార్కెట్ నిపుణుల్లో కొందరు ఆయనను ప్రేరణగా చూస్తారు.