సౌందర్ రాజన్ – చిన్న చికెన్ కొట్టు నుంచి… వేలకోట్ల వ్యాపారం దాకా (సుగుణ ఫుడ్స్)

వ్యాపారాలు చేయాలంటే ఆస్తులూ… పెద్ద పెద్ద బిజినెస్ స్కూళ్లలో పట్టాలూ అక్కర్లేదు. చేయాలనే తపనా, ఎదగాలనే కసీ ఉంటే చాలు… అని నిరూపించారు వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన సుగుణ ఫుడ్స్ వ్యవస్థాపకుడు సౌందర్ రాజన్. చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా అప్పు చేసిన ఐదు వేల రూపాయలతో జీవితం మొదలు పెట్టిన ఆయన ప్రయాణం నేడు పదకొండు వేల కోట్లకు చేరుకుంది.

కోయంబత్తూరుకి డెబ్భై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది గణపతిపాలయం. అక్కడున్న ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తూ కొద్దిపాటి సొంత భూమిలో పత్తి కూడా పండించేవారు బంగారుస్వామి, కమలం దంపతులు. వారి ముగ్గురు పిల్లల్లో సౌందర్ రాజన్ పెద్దవాడు, సుందరరాజన్; రెండోవాడు, ఆఖరున ఆడపిల్ల మణిమాల. ఆ అమ్మాయికి చిన్నతనంలోనే పెళ్లి చేశారు. సౌందర్ రాజన్ కేమో బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేయాలని ఉండేది. అందుకోసం ఏడు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి కష్టపడి చదువుకునేవాడు. అయితే, అతని ఇంట్లో పరిస్థితి అందుకు భిన్నంగా ఉండేది. సాధారణంగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న తల్లిదండ్రులు తమ పిల్లల చదువు విషయంలో ఎంతో స్ట్రిక్టుగా ఉంటారు. కానీ, సౌందర్ రాజన్ తల్లిదండ్రులిద్దరూ ప్రభుత్వ టీచర్లు అయి ఉండి కూడా ఏనాడూ మార్కుల గురించి అడిగేవారు కాదు. బడి నుంచి రాగానే పొలం పనుల్లో సాయపడమనేవారు. ఇష్టమైన చదువును ప్రోత్సహించకుండా అమ్మానాన్నలు అలా ఎందుకు చేస్తున్నారో తెలియక బాధపడేవాడు.

1978లో పదో తరగతి ఫస్ట్ క్లాస్ లో పాసైన సౌందర్ రాజన్ తండ్రికి ఆ విషయం చెప్పి మంచి కాలేజీలో చేర్పించమని అడగాలనుకున్నాడు. కానీ, బంగారుస్వామి కొడుకు పాసైన విషయమే పట్టించుకోకుండా… అయితే ఇప్పుడేం చేద్దామనుకుంటున్నావ్ అని అడిగాడు. ఏముంది నాన్నా, ఇంటర్ పూర్తి చేసి డిగ్రీలో చేరతా. మరోవైపు టైప్; రైటింగ్;, షార్ట్ హ్యాండ్ కూడా నేర్చుకుంటే గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేస్తుంది… అని చెప్పుకుంటూపోతున్నాడు. అందులో నీ మార్కు ఏంటీ? నీకొచ్చే పేరేంటీ? దాని బదులు మన పొలంలో వ్యవసాయం చేసుకోవడం మేలు రా… అన్నాడు తండ్రి. దాంతో అంతా అయోమయంగా అనిపించింది సౌందర్ రాజన్; కి. చదువుకుంటానంటే వ్యవసాయం అంటాడేంటీ… నాన్న ఎందుకలా మాట్లాడుతున్నాడు. నేనిప్పుడు చదువు మానేసి వ్యవసాయం చేస్తే ఊళ్లో వాళ్లంతా ఎగతాళి చేస్తారు. ఫ్రెండ్స్ అయితే ఏడిపిస్తారు…. అని మనసులోనే బాధపడ్డాడు. తండ్రి మాట వినకుండానే చదువుకోవాలనే తపనతో ఓ కాలేజీలో చేరాడు సౌందర్ రాజన్. క్లాస్ కెళ్లి పుస్తకం తీస్తే తండ్రి మాటలే గుర్తొచ్చేవి. నాన్న మిల్లు యజమానీ కాదూ, సొంతంగా పరిశ్రమలూ లేవు.

ఓ సాధారణ స్కూలు టీచరు తన కొడుకు సొంతంగా ఏదైనా చేయాలనుకోవడం తప్పేం కాదుగా, నేనే నాన్న మాటల్ని సరిగా అర్థం చేసుకోలేకపోతున్నానేమో… అని తనకి తానే సర్దిచెప్పుకుని చివరికి ఓ నిర్ణయానికి వచ్చాడు.

చదువు మానేసి చేను బాట పట్టాడు. తమకున్న నల్లరేగడి భూముల్లో మిగతా రైతుల్లా పత్తి కాకుండా భిన్నంగా కాయగూరలు సాగు చేస్తే బాగుంటుందని ఆలోచించాడు. అయితే కూరగాయలు బాగానే పండినా మార్కెటింగ్ సరిగా చేయలేకపోవడం, గిట్టుబాటు ధర రాకపోవడంతో నష్టాలొచ్చాయి. మూడేళ్లలో దాదాపు మూడులక్షల అప్పు కూడా అయింది.

ఆ రోజుల్లో మూడు లక్షలంటే చాలా పెద్ద మొత్తం. దాంతో మానసికంగా కుంగిపోయిన సౌందర్ రాజన్ తండ్రికి మొహం చూపించలేకపోయాడు. కొడుకు బాధను చూసి తల్లేమో నా బంగారం అమ్మి అప్పు తీర్చేద్దాంలే అని ఓదార్చేది. ఆ అప్పును తన కష్టార్జితంతోనే తీర్చాలని నిర్ణయించుకున్నాడు. ఇంతలో దూరపు బంధువు ఒకరికి ఆ విషయం తెలిసి కోయంబత్తూరులో ఉన్న తమ మోటార్ల తయారీ సంస్థకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మార్కెటింగ్ చేసే అవకాశం ఇచ్చారు. దాంతో మూటాముల్లే సర్దుకుని హైదరాబాద్ లో వాలిపోయాడు. తెలుగు మాతృభాష కావడంతో రాష్ట్రమంతా తిరిగి మోటార్ల తయారీ సంస్థకు ప్రచారం చేసి అమ్మకాల్ని పెంచాడు. ఒక్కోసారి ఛార్జీలకు డబ్బుల్లేక దూరప్రాంతాలకీ నడుచుకుంటూనే వెళ్లేవాడు. తినీ తినకా దాచుకున్న డబ్బుతో అప్పు కూడా తీర్చాడు. అలా నాలుగేళ్లపాటు కష్టపడి పని చేసిన సౌందర్ రాజన్ జీవితం ఆర్థికంగా గాడిలో పడింది అనుకునేలోపు- కార్మికుల సమ్మెతో మోటార్ కర్మాగారంలో ఉత్పత్తి ఆగిపోయింది. దాంతో ఉద్యోగం మానేసి ఇంటికెళ్లక తప్పలేదు. ఈలోపు సౌందర్ రాజన్ తమ్ముడు కూడా పదో తరగతి తరవాత చదువు మానేసి తండ్రి మాట మేరకు ఏదో ఒక పని చేస్తూ ఊళ్లోనే ఉండేవాడు. దాంతో ఇద్దరూ కలిసి ఆ ఊళ్లోనే ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నారు. ఒకరోజు ఆ ఊళ్లో చికెన్ కొట్టు నడిపే వ్యక్తి అనుకోని పరిస్థితుల వల్ల దాన్ని మూసేయాల్సి వచ్చింది. ఆ ఘటనే సౌందర్ రాజన్ సోదరుల జీవితాల్ని మలుపు తిప్పింది. ఊళ్లో చికెన్ కొట్టు పెడితే అన్న ఆలోచన వచ్చిందే తడవుగా చిన్న దుకాణాన్ని అద్దెకు తీసుకుని గుడ్లు, నాటుకోడి మాంసం అమ్మడం మొదలుపెట్టారు. ఒకసారి ఒక కస్టమర్ తో మాటల మధ్యలో హోటళ్లూ, రెస్టరెంట్ల వాళ్లు చికెన్ 65 కోసం బ్రాయిలర్ కోడి మాంసాన్నే వినియోగిస్తారని తెలుసుకున్నారు. దాంతో బ్రాయిలర్ కోళ్ల ఫారాన్ని నడుపుతున్న దూరపు బంధువు దగ్గరికెళ్లి ఆ ఫామ్ ల నిర్వహణ గురించి తెలుసుకున్నాడు సుందరరాజన్. ఆ పరిజ్ఞానంతో 1986లో రూ.5000 పెట్టుబడి పెట్టి 200 కోళ్లతో సొంతూరు పక్కనే ఉన్న ఉడమల్ పేట్ లో సుగుణ పౌల్ట్రీ పేరుతో కోళ్ల ఫారానికి శ్రీకారం చుట్టారు. సుగుణ అంటే మంచి గుణాలున్నదని అర్థం.

నిజానికి ఆ అర్థం తెలియకుండానే మా పౌల్ట్రీకి ఆ పేరు పెట్టాను. అలా పెట్టడానికి కారణం నాన్న. అప్పట్లో బంధువుల అమ్మాయి మా ఇంట్లో పురుడు పోసుకుంది. తనకి పుట్టిన ఆడపిల్లకి నాన్న సుగుణ అని నామకరణం చేశారు. తమ్ముడికీ ఆ పేరు నచ్చడంతో పౌల్ట్రీకీ ఆ పేరే పెట్టాం. ఆ తరవాతే తెలిసింది తగిన పేరు పెట్టామని అంటూ ఆ రోజుల్ని గుర్తు చేసుకున్న సౌందర్ రాజన్ ఏర్పాటు చేసిన పౌల్ట్రీలోనూ, చికెన్; కొట్టులోనూ గుడ్లూ, మాంసం విక్రయాలు ఊపు అందుకున్నాయి. క్రమంగా కోయంబత్తూరులోని హోటళ్లకీ, రెస్టరెంట్లకీ బ్రాయిలర్ చికెన్ సరఫరా చేయడం మొదలుపెట్టారు. దాణా, కోళ్ల మందులను కూడా అమ్మడం ప్రారంభించారు.

నష్టాల్లోనూ నిలబడ్డారు…

1989-90 మధ్యలో వ్యాపారం మూసే పరిస్థితి వచ్చింది. అధిక సరఫరా కారణంగా కోళ్ల ధరలు పడిపోయాయి. దాణా, మందుల కోసం రుణాలు తీసుకున్న పౌల్ట్రీ రైతులు తమ బకాయిలను తీర్చలేకపోయారు. వందల ఫౌల్ట్రీ ఫారాలు మూతబడ్డాయి. రాజన్ సోదరులు కూడా చాలా వరకూ నష్టపోయారు. అంతేకాదు, అప్పటివరకూ రైతులకి ఈ అన్నదమ్ములు దాణానూ, మందుల్నీ అరువుగా ఇచ్చేవారు. వారంతా బకాయి తీర్చలేకపోయారు. వారి పౌల్ట్రీలను నిర్వహించడమూ కష్టమైపోయింది. అయినా సరే తమ నష్టాల్ని పూడ్చుకోవడంతోపాటు రైతుల్నీ ఆదుకోవాలనుకున్నారు. ఆ రోజుల్లో బ్యాంకులో లోను రావడం చాలా ప్రయాసతో కూడుకున్నది. సౌందర్ రాజన్; ఏడాదిపాటు ఎన్నో బ్యాంకుల చుట్టూ తిరిగితే రూ.18 వేల లోను వచ్చింది. దాంతో మరోసారి అన్నదమ్ములిద్దరూ ధైర్యంగా అడుగు ముందుకేశారు. సొంత భూమీ, షెడ్లూ, కనీస వసతులూ ఉన్న రైతులకు- కోడిపిల్లలూ, దాణా, మందులూ సరఫరా చేసి పెరిగిన కోళ్లను 45 రోజులకి తిరిగి తీసుకునేలా కాంట్రాక్ట్; ఫార్మింగుకు శ్రీకారం చుట్టారు. దాంతో చాలా తక్కువ సమయంలోనే ఊహించని లాభాలను కళ్లజూశారు. నష్టాలన్నింటినీ పూడ్చి పేద రైతులకు వెన్నుదన్నుగా నిలవడం మొదలుపెట్టారు. అలా తమిళనాడులో కాంట్రాక్ట్ఫార్మింగును పరిచయం చేసిన ఘనత వారికే దక్కింది. చాలా తక్కువ సమయంలోనే పౌల్ట్రీ రంగంలో మంచి పేరు తెచ్చుకోవడంతో కోళ్లను పెంచే రైతుల సంఖ్యా పెరుగుతూ వచ్చింది. ఈ క్రమంలో డిమాండ్ కి తగినన్ని కోడిపిల్లల్ని హేచరీస్ అందివ్వలేకపోయాయి. పైగా కోడిపిల్ల ధర ఎక్కువా, నాణ్యత తక్కువా ఉండటంతో అవి త్వరగా రోగాల బారిన పడి రైతులకి నష్టాల్ని తెస్తున్నాయని గమనించారు రాజన్; సోదరులు. దాంతో ఖర్చుతో కూడుకున్నా సరే సొంతంగా హేచరీస్ మొదలుపెట్టి నాణ్యమైన కోడిపిల్లల్ని ఉత్పత్తి చేసి తక్కువ ధరకే రైతులకి అందించేవారు. క్రమంగా సుగుణ సంస్థ మీద రైతులకు నమ్మకం పెరిగింది. తమ పొలాల్లో షెడ్లు వేసుకుని కాంట్రాక్ట్ ఫౌల్ట్రీ ఫార్మింగ్ కోసం బారులు తీరేవారు. ఏడేళ్లు తిరిగే సరికి ఆ సంస్థ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. ఏడు కోట్ల టర్నోవరుతో 1997 నాటికి సుగుణ చికెన్j; దక్షిణాదిన రెండో అతిపెద్ద పౌల్ట్రీగా ఎదిగింది.

వ్యాక్సిన్ల తయారీ..

>అప్పటికి కేవలం 40 మంది ఉద్యోగులు మాత్రమే ఉండేవారు. సంస్థని ఇంకా మంచి స్థాయికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో భారీగా క్షేత్రస్థాయి సిబ్బందిని నియమించి వారిని ప్రతిరోజూ ఫారాలకు పంపి, కోళ్ల ఆరోగ్యం, ఆహారం గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు. ఆ వివరాల ఆధారంగా రైతులకి మార్గనిర్దేశం చేస్తూ కోళ్లు రోగాల బారిన పడకుండా సూచనలిస్తూ రైతులు నష్టపోకుండా చూసేవారు. ఆ జాగ్రత్తలతో మూడేళ్లలో రూ.100 కోట్ల టర్నోవర్ కు చేరుకుంది సుగుణ. అంతేకాదు, సుగుణ పౌల్ట్రీ నుంచి కోడి పిల్లల్ని తీసుకుని ఫార్మింగ్ చేస్తే చాలా త్వరగా పెట్టుబడితోపాటు లాభాలని కూడా పొందొచ్చని రైతులు తెలుసుకున్నారు. దాంతో భారీగా రైతులు ముందుకు రావడంతో ఒక్కసారిగా కోళ్ల ఫారాల సంఖ్య వేలకు చేరింది. 2001కి 10కిపైనే రాష్ట్రాలకు సుగుణ చికెన్ సంస్థను విస్తరించారు. తరవాత 2004లో ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ సంస్థకు సుగుణ పౌల్ట్రీ విధివిధానాలు నచ్చడంతో భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టింది. దాంతో సొంతంగా దాణా మిల్లులూ, ఎక్కువ సంఖ్యలో హేచరీస్ ఏర్పాటు చేశారు రాజన్& సోదరులు. అలా 2010 నాటికి 3 వేల కోట్ల వార్షికాదాయం అందుకున్నారు. ఆ తరవాత క్రమంగా బంగ్లాదేశ్, కెన్యా, శ్రీలంకల్లోనూ తమ వ్యాపార సేవల్ని విస్తరించి అక్కడా దాణా మిల్లులూ, హేచరీస్ ని ప్రారంభించారు. 2012లో సుగుణ పౌల్ట్రీ పేరును సుగుణ ఫుడ్స్ గా మార్చి మరిన్ని ఉత్పత్తులకు శ్రీకారం చుట్టారు. ఎందుకంటే కేవలం పౌల్ట్రీ రంగంలోనే ఉంటే బర్డ్ ఫ్లూ వంటి కుదుపుల్నీ, ధరలు పడిపోయినప్పుడు నష్టాల్నీ తట్టుకుని నిలబడాలంటే మరికొన్ని వ్యాపారాలూ ఉండాలి. అందుకే ఆధునిక దుకాణాలను ఏర్పాటు చేసి ప్రాసెస్డ్ చికెన్, రెడీ టూ ఈట్ చికెన్ స్నాక్స్, డెయిరీ ఉత్పతులు, పెట్ ఫుడ్ వంటివి అందించడం మొదలుపెట్టారు. కోయంబత్తూరు చుట్టుపక్కల పెద్ద ఎత్తున డెయిరీ ఫారాలూ, సోయా నూనె ఉత్పత్తీ మొదలుపెట్టారు. కోళ్లూ, పశువులూ, చేపలకీ- వ్యాక్సిన్లూ, మందులూ తయారు చేయడానికి గ్లోబియానా పేరుతో హైదరాబాద్ లో పరిశ్రమను ఏర్పాటు చేసిన ఈ సంస్థ మనదేశంలో 21 రాష్ట్రాల్లో 10వేల గ్రామాల్లోని 42వేల మంది రైతులకు స్థిరమైన ఆదాయాన్ని అందిస్తోంది. 9 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్న ఆ సంస్థ ప్రస్తుత వార్షికాదాయం పదకొండు వేల కోట్లపైమాటే. దేశంలోని చికెన్ మార్కెట్ లో 15 శాతం వాటాను సొంతం చేసుకుందీ సంస్థ.

%d bloggers like this:
Available for Amazon Prime