లెక్కలు నేర్చుకునేందుకు…… ఉచిత వెబ్సైట్లు

అన్ని సబ్జెక్టుల్లో నాకు మంచి మార్కులు వస్తాయి. ఒక్క లెక్కల వల్లే ర్యాంకును పోగొట్టుకుంటున్నాను ఆల్జీబ్రా గుండె గాబ్రా అని ఎందుకు అంటారో ఇప్పుడు అర్థమవుతోంది. టెన్త్ అయిపోయాక నేనిక మ్యాథ్స్ నే తీసుకోను. ఇలా తరగతి పెరిగేకొద్దీ లెక్కల విషయంలో పిల్లలకు ఉండే భయమూ, కంగారూ అంతాఇంతా కాదు. ఏ వయసుకా కష్టం అన్నట్లుగా… చిన్న పిల్లలకు అంకెలూ, కూడికలూ, తీసివేతలూ నేర్చుకోవడం సమస్య అయితే… క్లాసులు పెరిగేకొద్దీ జామెట్రీ, ఆల్జీబ్రా, రియల్నంబర్స్, ట్రిగ్నామెట్రీ… వంటి పాఠాలను నేర్చుకోవడానికి పిల్లలు తలకిందులవుతుంటారు. అలాంటివన్నీ వీలైనంత సులభంగా అర్థమయ్యేలా నేర్పించేందుకే కొన్ని వెబ్సైట్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో మ్యాథ్ ఈజ్ ఫన్, ఫొటో మ్యాథ్, ఖాన్ అకాడమీ, డౌట్ నట్, మాటిఫిక్ వంటివి కొన్ని. ఈ రోజుల్లో ఒక్క మ్యాథ్స్ అనే కాదు, సైన్స్, సోషల్ స్టడీస్ వంటివి నేర్పించేందుకూ ఎన్నో సంస్థలు ఆప్ లనూ, వెబ్సైట్లనూ అందుబాటులోకి తెచ్చాయి. ఇవి అలాంటివి కాదా అంటే… అలాంటివే కానీ ఇవన్నీ పూర్తిగా ఉచిత సేవల్ని అందిస్తున్నాయి. పైగా నేర్పించే పద్ధతిని వీలైనంత సులభతరం చేయడంతో మిగతా సబ్జెక్టుల్లానే లెక్కల్నీ ఇట్టే ఒంటబట్టించేసుకుంటున్నారు పిల్లలు.

ఎలా నేర్పిస్తాయంటే…

పిల్లల లెక్కల పుస్తకాలను గమనిస్తే… పాఠం పూర్తయ్యాక ఆఖరున కొన్ని ఎక్సర్ సైజుల్ని ఇస్తారు. ఈ వెబ్ సైట్లలో కూడా అంతే. తరగతి, సబ్జెక్టుల వారీగా లెక్కలు నేర్పిస్తూనే అవి వాళ్లకు వచ్చాయో లేదో తెలుసుకునేందుకు అదనంగా పజిల్స్, క్విజ్, వర్క్ షీట్లు వంటివన్నీ ఉంటాయి. అవి కూడా ఏదో మొక్కుబడిగా కాకుండా ఆసక్తికరంగా ఉంటాయి కాబట్టి పిల్లలు లెక్కల్ని ఇష్టంగా నేర్చుకుంటారని అంటారు నిపుణులు. ఉదాహరణకు మ్యాథ్ ఈజ్ ఫన్ ని తీసుకుంటే.. ఈ వెబ్ సైట్ చిన్నారుల నుంచి పన్నెండో తరగతి వరకూ లెక్కల్ని నేర్పిస్తుంది. ఆ తరువాత పాఠాల వారీగా వర్క్ షీట్లను కూడా అందుబాటులో ఉంచుతుందీ వెబ్ సైట్. వాటిని ప్రింటు కూడా తీసుకోవచ్చు. ఆటలూ, పజిల్స్…. వంటివి ఇందులో అదనం. ఇక, ఖాన్ అకాడమీ అయితే… ఆప్, వెబ్ సైట్ రూపంలోనూ లభ్యమవుతోంది. తరగతిలో టీచర్ చెప్పినట్లుగా ఇక్కడా టీచర్లు బ్లాక్ బోర్డుమీద లెక్కల్ని చేసి చూపిస్తారు. ఇది కేవలం పదో తరగతి వరకే కాకుండా జెఈఈ, నీట్…పరీక్షలకు హాజరయ్యేవారికీ పాఠాలను చెబుతుంది. కేవలం ఆరు నుంచి పన్నెండో తరగతి వరకూ లెక్కలు నేర్పించే మరో వెబ్ సైట్ డౌట్ నట్ . ఇంగ్లిష్ తోపాటు తెలుగు, హిందీ, బెంగాలీ, తమిళం, పంజాబీ వంటి భాషల్లోనూ లెక్కల్ని నేర్పించే ఈ సంస్థను ఆదిత్యశంకర్, తనుశ్రీ అనే జంట అందుబాటులోకి తెచ్చింది. ఈ వెబ్ సైట్ లో టీచర్లు కూడా అందుబాటులో ఉండి… పిల్లల సందేహాలను తీరుస్తారు. ఇది ఆప్ రూపంలోనూ ఉంది. అదేవిధంగా ఎల్ కేజీ నుంచీ ఆరో తరగతి వరకూ లెక్కల్ని ఆటల రూపంలో నేర్పిస్తుంది మాటిఫిక్. ఇందులో ఉన్న వీడియోలను డౌన్ లోడ్ చేసుకునే సదుపాయం కూడా ఉంటుంది. పైగా ఓ వారం గడిచాక… పిల్లలు ఎంతవరకూ లెక్కలు నేర్చుకున్నారనేదీ పెద్దవాళ్లు తెలుసుకునే విధంగా వీక్లీ స్కోర్ కూడా అందిస్తుంది మాటిఫిక్. కాబట్టి… ఈసారి పిల్లలు ఏదయినా లెక్క అర్థంకాలేదని చెప్పినప్పుడు ఇలాంటివాటిని ట్రై చేయమంటే సరి.

%d bloggers like this:
Available for Amazon Prime