ఒత్తిడి(STRESS)ని తగ్గించుకోండి ఇలా!

ఒత్తిడి సహజం. దీన్ని మనమంతా ఎదుర్కొంటూనే ఉంటాం. పరీక్ష తప్పినప్పుడో, ఉద్యోగం దొరకనప్పుడో, పని భారం పెరిగినప్పుడో, సంబంధాలు దెబ్బతిన్నప్పుడో, ఆర్థికంగా కుదేలైనప్పుడో, పిల్లలు మాట విననప్పుడో.. ఇలా దైనందిన వ్యవహారాల్లో ఎప్పుడో అప్పుడు ఒత్తిడికి లోనవుతూనే ఉంటాం. నిజానికి ఎంతో కొంత ఒత్తిడి మంచిదే. స్వల్పస్థాయిలో మనకు మేలే చేస్తుంది. పనులు త్వరగా ముగించేలా, ప్రమాదాలను తప్పించుకునేలా, అప్రమత్తంగా ఉండేలా తోడ్పడుతుంది. అదే తీవ్రమై.. అనవసరంగా పలుకరిస్తుంటే.. దీర్ఘకాలం వెంటాడుతూ వస్తుంటే మానసికంగా, శారీరకంగా ఎన్నో సమస్యలకు దారితీస్తుంది. పెద్ద చిక్కేంటంటే- ఒత్తిడి గురించి, దాని పర్యవసానాల గురించి చాలామందికి తెలియకపోవటం. తెలిసినా పెద్దగా పట్టించుకోకపోవటం. ఆ అదేం చేస్తుందిలే అని అనుకోవటం. ఒత్తిడి పెరిగిపోతున్నా ఎవరికీ చెప్పుకోవటానికి ఇష్టపడక, చెబితే ఏమనుకుంటారోనని దాచిపెట్టుకోవటం. ఇది అత్యంత ప్రమాదకరం. నివురు గప్పిన నిప్పులా.. లోలోపలే రాజుకుంటూ వచ్చే ఒత్తిడి ఏదో ఒకనాడు అగ్నిపర్వతంలా పేలటం ఖాయం. ఇది తలనొప్పి, నిద్రలేమి, గుండెజబ్బు, క్యాన్సర్ల వంటి సమస్యలకు దారితీయటమే కాదు.. ఆత్మహత్యలకూ ప్రేరేపించొచ్చు. అందుకే ఒత్తిడిని అదుపులో ఉంచుకోవటం సాధ్యం కావటం లేదని అనిపించినప్పుడు నిస్సంకోచంగా దాన్ని బయటకు చెప్పుకోవటం.. నిర్లక్ష్యం చేయకుండా మానసిక నిపుణుల సలహా తీసుకోవటం ఉత్తమం. చిన్న జ్వరం వచ్చినా వెంటనే డాక్టర్ దగ్గరికి పరుగెత్తే మనం మనసుకు బాధ కలిగితే మౌనంగా భరించటం ఎందుకు? వేగంగా మారిపోతున్న సామాజిక, ఉద్యోగ పరిస్థితుల నేపథ్యంలో మనకు మనమే వేసుకోవాల్సిన ప్రశ్న ఇది.

అసలు ఒత్తిడి అంటే ఏంటి?

ఒక్కమాటలో చెప్పాలంటే- ప్రమాదకర పరిస్థితులకు శరీరం స్పందించే తీరు. అవి వాస్తవ పరిస్థితులే కానక్కర్లేదు. కాల్పనికమైనవైనా కావొచ్చు. సాధారణంగా మనకేదైనా ప్రమాదం ముంచుకొచ్చినప్పుడు మెదడులోని హైపోథాలమస్ స్పందించి.. నాడీ వ్యవస్థ ద్వారా అడ్రినల్ గ్రంథిని ఉత్తేజితం చేసి.. పెద్దఎత్తున అడ్రినలిన్, కార్టిజోల్ హార్మోన్లు విడుదలయ్యేలా చేస్తుంది. దీంతో గుండె వేగం, శ్వాస వేగం, రక్తపోటు బాగా పెరిగిపోతాయి. కండరాలు బిగుతుగానూ అవుతాయి. ఇవన్నీ ప్రమాదాన్ని ఎదుర్కోవటానికి.. లేదూ అక్కడ్నుంచి పారిపోవటానికి అవసరమైన తక్షణ శక్తిని అందిస్తాయి. ఇది మంచిదే. అత్యవసరం కూడా. ప్రమాదం తొలగిన తర్వాత హార్మోన్ల ఉద్ధృతి తగ్గిపోయి తిరిగి సాధారణ స్థితి నెలకొంటుంది. ఎప్పుడో అప్పుడు, స్వల్పస్థాయిలో ఎదురయ్యే ఇలాంటి ఒత్తిడి ప్రతిస్పందనలను శరీరమూ బాగానే తట్టుకుంటుంది. చిక్కంతా దీర్ఘకాల ఒత్తిడితోనే. అవసరం లేకపోయినా నిరంతరం ఒంట్లో ఒత్తిడి ప్రతిస్పందనలు చెలరేగటం తీవ్ర దుష్పరిణామాలకు దారితీస్తుంది.

కారణమేంటి?

మానసిక ఒత్తిడికి ఇదమిత్థమైన కారణమంటూ ఏదీ లేదు. ఉద్యోగం పోవటం, ఆర్థిక, కుటుంబ సమస్యలు.. ఏవైనా ఒత్తిడికి దారితీయొచ్చు. ప్రతికూల పరిస్థితులను ఎలా చూస్తున్నాం? ఎలా అధిగమిస్తున్నాం? అనే దాని మీదే ఒత్తిడి ప్రభావం తీవ్రత ఆధారపడి ఉంటుంది. కొందరు చిన్న విషయాలకే ఒత్తిడికి లోనవ్వొచ్చు. మరికొందరు పెద్ద కష్టం వచ్చినా నిమ్మకు నీరెత్తినట్టు ఉండొచ్చు. ఏదేమైనా వివిధ పరిస్థితులకు విపరీతంగా స్పందించే స్వభావమే ఒత్తిడికి మూలం.

లక్షణాలు అనేకం

జీవితంలో అన్ని పార్శ్వాల మీదా ఒత్తిడి ప్రభావం చూపుతుంది. భావోద్వేగాలు, ప్రవర్తన, ఆలోచనా సామర్థ్యం, శారీరక ఆరోగ్యం అన్నింటినీ దెబ్బతీయొచ్చు. ఒత్తిడి ఒక్కొక్కరిలో ఒక్కోలా ప్రత్యక్షం కావొచ్చు. కొందరిలో చిరాకుగా, మరికొందరిలో కోపంగా.. వేర్వేరు రూపాల్లో బయటపడొచ్చు. అందువల్ల అందరినీ ఒకే గాటన కట్టటం సాధ్యం కాదు. ఒత్తిడి మన బలహీనతలను చూసి మరీ దెబ్బకొడుతుంది. ఉదాహరణకు.. తరచుగా తలనొప్పి, దురదల బారినపడేవారిలో అవి మరింత రెచ్చిపోయేలా చేయొచ్చు. ఓపిక, సహనం తక్కువగా ఉన్నవారిలో అసహనాన్ని, కోపాన్ని త్వరగా ప్రేరేపించొచ్చు. ఇలాంటి ప్రతికూల మార్పులను, లక్షణాలను ముందుగానే గుర్తించగలిగితే త్వరగా మేలుకోవచ్చు.

తగ్గించుకోవటమెలా?

సానుకూల ధోరణి:

పరిస్థితులను బట్టి సానుకూల ధోరణితో వ్యవహరించటం.. మన చేతుల్లో లేనివాటిని నిజాయతీగా అంగీకరించటం అలవాటు చేసుకోవాలి.

యోగా, ధ్యానం:

వీటితో కార్టిజోల్ హార్మోన్, రక్తపోటు, గుండె వేగం తగ్గుతాయి. మనసును లగ్నం చేసి, శ్వాస గట్టిగా తీసుకునే ప్రాణాయామం వంటి పద్ధతులతో పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థ ఉత్తేజితమై ప్రశాంతత చేకూరుతుంది.

కంటి నిండా నిద్ర:

ఇది మూడ్ను, ఉత్సాహాన్ని, ఏకాగ్రతను మెరుగు పరుస్తూ ఒత్తిడి తగ్గటానికి తోడ్పడుతుంది.

మంచి వ్యాపకం:

సంగీతం వినటం, బొమ్మలు వేయటం వంటి వ్యాపకాలు మానసిక ప్రశాంతతకు దోహదం చేస్తాయి.

రోజూ వ్యాయామం:

ఇది ఒత్తిడి హార్మోన్లను తగ్గిస్తుంది. మంచి నిద్ర పట్టటానికి, ఆత్మ విశ్వాసం ఇనుమడించటానికీ తోడ్పడుతుంది.

నలుగురితో సాన్నిహిత్యం:

కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు, ఇరుగు పొరుగుతో సన్నిహిత సంబంధాలు కలిగుండటం, మనసు విప్పి మాట్లాడుకోవటం ద్వారా ఆత్మ స్థైర్యం ఇనుమడిస్తుంది.

కాఫీ, చాక్లెట్లు పరిమితం:

కాఫీ, చాక్లెట్ల వంటి వాటిల్లోని కెఫీన్ ఆందోళన పెరిగేలా చేస్తుంది. వీటిని అతిగా తీసుకోకపోవటం మంచిది.

ఆరోగ్యకరమైన ఆహారం:

కూరగాయలు, పండ్లు, పొట్టుతీయని ధాన్యాలతో కూడిన ఆహారంతో బరువు, ఆక్సీకరణ, వాపు ప్రక్రియ తగ్గుతాయి. ఫలితంగా ఒత్తిడి ప్రతికూల ప్రభావాలూ తగ్గుతాయి.

దురలవాట్లకు దూరం:

ఒత్తిడిని తగ్గించుకోవటానికి చాలామంది మద్యం, సిగరెట్ల వంటి వాటిని ఆశ్రయిస్తుంటారు గానీ వీటితో ఊరట తాత్కాలికమే. ఇలా దురలవాట్లతో సమస్యకు మసిపూయటం తగదు.

%d bloggers like this:
Available for Amazon Prime