RRR Movie Review: రివ్యూ: ఆర్‌ఆర్‌ఆర్‌

చిత్రం: ఆర్ ఆర్ ఆర్, నటీనటులు: ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవ్ గణ్, అలియా భట్, ఓలివియా మోరిస్, సముద్రఖని, అలీసన్ డూడీ, రేస్టీవెన్ సన్, శ్రియ తదితరులు; సంగీతం: ఎం.ఎం.కీరవాణి; సినిమాటోగ్రఫీ: కె.కె.సెంథిల్ కుమార్. ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్, కథ: కె.వి.విజయేంద్ర ప్రసాద్, సంభాషణలు: సాయి మాధవ్& బుర్రా; నిర్మాత: డీవీవీ దానయ్య; స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రాజమౌళి; బ్యానర్: డీవీవీ ఎంటర్ టైన్ మెంట్.

స్టార్ హీరో సినిమా వస్తుందంటే బాక్సాఫీస్ వద్ద కనిపించే సందడే వేరు. అదే ఇద్దరు అగ్ర హీరోలు కలిసి నటిస్తే, ఆ సినిమాను కెరీర్ లోనే అపజయం ఎరుగని దర్శకుడు తెరకెక్కిస్తే అది RRR అవుతుంది. ఎన్టీఆర్(NTR), రామ్ చరణ్ (Ram charan) కథానాయకులుగా ఎస్&ఎస్.రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా రౌద్రం రణం రుధిరం – ఆర్ ఆర్ ఆర్(RRR). అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురం భీమ్ గా ఎన్టీఆర్ నటిస్తుండటంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. భారీ అంచనాలతో మొదలైన ఈ చిత్రం కరోనాలాంటి ఎన్నో అడ్డంకులను దాటుకుని ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి పోరాట యోధుల పాత్రల్లో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఎలా కనిపించారు? బ్రిటిష్ వారిపై ఎలాంటి పోరాటం చేశారు?ఇద్దరు స్టార్ హీరోలను దర్శకుడు రాజమౌళి ఏ విధంగా చూపించారు?ఈ కథలో అలియా భట్, అజయ్ దేవగణ్, శ్రియ తదితరుల పాత్రలు ఏంటి?

1920 నేపథ్యంలో సాగే కథ ఇది. అప్పటి బ్రిటిష్ ప్రభుత్వంలో విశాఖ పట్టణం సమీపానికి చెందిన రామరాజు (రామ్ చరణ్)(Ram charan) పోలీస్ అధికారిగా పనిచేస్తుంటాడు. పై అధికారుల మెప్పు పొంది పదోన్నతి పొందాలనేదే అతని ఆశయం. త;న మరదలు సీత (అలియాభట్)కి ఇచ్చిన మాట నెర వేరాలంటే ఆ లక్ష్యం సాధించాల్సిందే. మరోవైపు బ్రిటిష్ గవర్నర్ స్కాట్ దొర (రే స్టీవెన్ సన్) తన కుటుంబంతోపాటు ఆదిలాబాద్ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు, అక్కడ గోండు జాతికి చెందిన మల్లి అనే చిన్నారిని వాళ్లతోపాటే దిల్లీకి తీసుకెళతారు. ఇది అన్యాయమని ఎదిరించిన కుటుంబాన్ని హింసిస్తారు. గోండు జాతికి కాపరిలాంటి భీమ్ (ఎన్టీఆర్)(NTR) మల్లిని తీసుకు రావడం కోసం దిల్లీకి పయన మవుతాడు. మరి శత్రుదుర్భేద్యమైన బ్రిటిష్ కోటని భీమ్ దాటుకుని వెళ్లగలిగాడా?అక్కడే పోలీస్ అధికారిగా పనిచేస్తున్న రామరాజుకీ, భీమ్కీ మధ్య ఏం జరిగింది? ఆ ఇద్దరికీ భారత స్వాతంత్ర్య పోరాటంతో సంభంధం ఏంటి? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే:

కథ లో భావోద్వేగాల్ని పండించడంలో మాస్టర్ రాజమౌళి. ఆయన సినిమా అంటే భావోద్వేగాలతో పాటు, తెరకు నిండుదనం తీసుకొచ్చే విజువల్ గ్రాండ్ నెస్ కూడా. ఆ రెండు విష యాల్లో తనదైన ప్రభావం చూపించి తాను మాస్టర్ కెప్టెన్ అని మరోసారి చాటారు. ఆయన కి ఎన్టీఆర్(NTR), రామ్ చరణ్(Ram Charan)లాంటి మంచి నటులు కూడా తోడయ్యారు. వాళ్ల అభినయం సినిమాని మరో మెట్టు ఎక్కిస్తుంది. యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో భావోద్వేగ సన్నివేశాలు ఆద్యంతం హృదయాల్ని పిండేసేలా ఉంటాయి. పాటలు, పోరాట ఘట్టాలు… ఇలా భావోద్వేగాలు పండించడానికి కాదేదీ అనర్హం అన్నట్టుగా ప్రతీ సందర్భాన్నీ వాడుకున్నారు రాజమౌళి(Rajamouli). నిప్పు, నీరు… అంటూ రెండు శక్తుల్ని పరిచయం చేస్తూ సినిమాని ఆరంభించారు దర్శకుడు. ఆ శక్తులకి తగ్గట్టే ఉంటాయి పరిచయ సన్నివేశాలు. రామ్ చరణ్ ని భారీదనంతో కూడిన అత్యంత సహజమైన లాఠీఛార్జ్ యాక్షన్ ఘట్టంతో పరిచయం చేసిన విధానం, అందులో ఆయన నటించిన తీరు ప్రేక్షకుల తో చప్పట్లు కొట్టిస్తుంది. ఆ తర్వాత ఎన్టీఆర్ పులితో కలిసి చేసే విన్యాసాల తో కథలోకి ఎంట్రీ ఇస్తారు. ఇక అక్కడ్నుంచి ఆ రెండు పాత్రలూ ప్రేక్షకుల సొంతమైపోతాయి. ఇద్దరినీ కలిపే ఓ సంఘటన, వాళ్ల దోస్తీ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు అభిమానుల్ని మెప్పిస్తాయి.అక్కడ్నుంచి కథ లో బ్రొమాన్స్ మొదలవుతుంది. భీమ్ అమాయకత్వం, రామ్ చరణ్ అతనికి సాయం చేసే తీరు ఆకట్టుకుంటుంది. నాటు నాటు పాటలో కూడా హృదయాల్ని హత్తుకునేలా ఎమోషన్స్ పండించిన తీరు ఆకట్టుకుంటుంది. అయితే ఆ ఇద్దరి మధ్య స్నేహం చిగురించినట్టుగానే, వైరం కూడా మొదలవుతుంది. రెండు శక్తులు ఒక దానికొకటి తల పడితే అది ఎంత భీకరంగా ఉంటుందో చూపిస్తూ రామరాజు, భీమ్ మధ్య సన్నివేశాల్ని తీర్చిదిద్దారు దర్శకుడు. విరామానికి ముందు వచ్చే ఆ సన్నివేశాలు సినిమాకే హైలైట్ గా నిలుస్తాయి. రామ్ చరణ్, ఎన్టీఆర్… ఇద్దరూ పోటీపడి నటించారు. ముఖ్యంగా భీమ్ ఆ పోరాటం కోసం రంగంలోకి దిగే తీరు అద్భుతం అనిపిస్తుంది.

ద్వితీయార్ధం ఫ్లాష్ బ్యాక్ తో మొదలవుతుంది. అజయ్ దేవగణ్, శ్రియ తదితరుల నేపథ్యంలో సాగే ఆ సన్నివేశాలు అక్కడక్కడా కాస్త సాగదీసినట్టుగా అనిపిస్తాయి. కానీ, అజయ్ దేవగణ్, శ్రియ పాత్రల పరిధి తక్కువే అయినా వాళ్లు సినిమాపై చక్కటి ప్రభావం చూపిస్తారు. భీమ్ కి శిక్ష విధించే సన్నివేశాలు సినిమాని మరో స్థాయిలో నిలబెట్టాయి. కొమురం భీముడో… అంటూ ఎన్టీఆర్ నేపథ్యంలో వచ్చే పాట, ఆ క్రమంలో పండే భావోద్వేగాలు ఆకట్టుకుంటాయి. ఓ గిరిజన బాలిక ని కాపాడే అంశంతో ముడిపెడుతూ ఇద్దరి మధ్య స్నేహ బంధాన్ని, వాళ్ల పోరాటాల్ని ఆవిష్కరించే కథ ఇది. సీత పాత్ర కథలో మలుపునకు కారణమవుతుంది. పతాక సన్నివేశాలకి ముందు ఇద్దరు కథానాయకులు ఒకటయ్యే తీరు అలరిస్తుంది. ఒకరు అల్లూరి సీతారామరాజు, మరొకరు కొమరం భీమ్ని పోలినట్టుగా కనిపిస్తూ శత్రుదుర్బేధ్యమైన బ్రిటిష్ కోటపై పోరాటం చేసే తీరు మెప్పిస్తుంది. ద్వితీయార్ధం మొదలయ్యాక వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, చిన్నారిని రక్షించే సన్నివేశాలతోనే కథంతా పూర్తవుతుంది. ఆ తర్వాత అంతా పోరాటమే. కథ కంటే కూడా దర్శకుడు దాన్ని భావోద్వేగాలతో పట్టు సడలకుండా నడిపిన తీరే సినిమాకి హైలైట్ గా నిలిచింది. నీరు, నిప్పు అంటూ పాత్రల్ని పరిచయం చేశారు. అయితే, నటన పరంగా చూస్తే ఇద్దరూ నిప్పు కణికల్లాగే కనిపిస్తారు.

ఎవరెలా చేశారంటే:

ఆర్.ఆర్.ఆర్ కోసం దర్శకుడు రాజమౌళికి దొరికిన నిజమైన రెండు శక్తులు ఎన్టీఆర్(NTR), రామ్ చరణ్(Ramcharan). ఆయన మొదలు పెట్టిన RRR యుద్ధాన్ని వెదుక్కుంటూ వచ్చిన రెండు పదునైన ఆయుధాల్లాగే మారిపోయారు. వాళ్ల మధ్య స్నేహం తెరపై చూడముచ్చట గా ఉంది. వాళ్లు పాత్రల్లో ఒదిగిపోయిన తీరు, పోరాట ఘట్టాల్లో అభినయం చాలా బాగుంది. నాటు నాటు పాట లో ఇద్దరూ కలిసి సింక్ లో డ్యాన్స్ చేసిన తీరు చూస్తూ కళ్లు తిప్పుకోలేం. అలియాభట్, అజయ్ దేవగణ్ సినిమాకి కీలకం. శ్రియ చిన్న పాత్రలో మెరిశారు. భీమ్ అంటే ప్రేమభావం కలిగిన బ్రిటిష్ యువతిగా ఓలివియా మోరిస్ కనిపిస్తుంది. సముద్ర ఖని, రాహుల్ రామకృష్ణ తదితరులు పాత్రల పరిధి మేరకు చక్కటి అభినయం ప్రదర్శించారు.

సాంకేతికంగా..

సినిమా ఉన్నతంగా ఉంది. ఎం.ఎం.కీరవాణి సంగీతం నేపథ్య సంగీతం, పాటలు సినిమాకి ప్రధాన బలం. సెంథిల్ కెమెరా పనితనం మెప్పిస్తుంది. ప్రతి సన్నివేశాన్ని చాలా గ్రాండ్ లుక్ లో చూపించారు. రాజమౌళి కన్న కలను తెరపై అద్భుతంగా ఆవిష్కరించారు. అందుకు శ్రీనివాస్ మోహన్ విజువల్ ఎఫెక్ట్స్ మరింత సహజత్వాన్ని తీసుకొచ్చాయి. ఇక బ్రిటిష్ కాలం నాటి పరిస్థితులను కళ్లకు కట్టారు ప్రొడక్షన్ డిజైనర్ సాబు శిరిల్. సెట్స్ చాలా గ్రాండ్ గా ఉన్నాయి. పాత్రల కోసం రమా రాజమౌళి ఎంపిక చేసిన కాస్ట్యూమ్స్ ఆ పాత్రలను తెరపై మరింత సహజంగా కనిపించేలా చేశాయి. సాల్మన్ పోరాట ఘట్టాల కొరియోగ్రఫీ బాగుంది. నాటు పాటలో నృత్యరీతులు అలరిస్తాయి. సీత కనిపించిందా? అని అడిగితే కాదు, కళ్లు తెరిపించింది తరహా సంభాషణల తో బుర్రా సాయిమాధవ్ మాటల మెరుపు చాలా చోట్ల కనిపిస్తుంది. కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు పాత్రలతో ముడిపెడుతూ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ కథని అల్లిన తీరు మెప్పిస్తుంది. దర్శకుడు రాజమౌళి మరోసారి తన పర్ ఫెక్షనిజాన్ని ప్రదర్శిస్తూ… ప్రేక్షకులు ఎక్కడ ఏం కోరుకుంటారో అవన్నీ పక్కాగా జోడిస్తూ ఈ సినిమాని తీర్చిదిద్దారు. నిర్మాణం పరంగా హంగులు అడుగడుగునా కనిపిస్తాయి.

బలాలు:

ఎన్టీఆర్, రామ్ చరణ్ నటన

కథ లోని భావోద్వేగాలు… పోరాట ఘట్టాలు

రాజ మౌళి మార్క్ విజువల్ గ్రాండ్ నెస్

కీరవాణి సంగీతం, సెంథిల్ సినిమాటోగ్రఫీ, ఇతర సాంకేతిక బృందం పనితీరు

బలహీనతలు

గేమ్ అఫ్ థ్రోన్స్ ను పోలి ఉండటం

హీరోయిన్ పాత్రకు అంతగా ప్రాముఖ్యత కల్పించకపోవడం,
ఫామిలీ ఆడియన్స్ కి అభిరుచి కి తగినట్లు గా హీరో హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ లేకపోవడం, కామెడీ లేకపోవడం
ముఖ్యం గా బాహుబలి రేంజ్ లో లేకపోవడం.

ద్వితీయార్ధంలో కొన్నిచోట్ల కాస్త సాగదీత గా అనిపించే సన్నివేశాలు.

నా రేటింగ్: 2 .75

(ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రేమే)

%d bloggers like this:
Available for Amazon Prime