చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌గా తప్పుకొన్న ధోనీ.. కొత్త సారథి రవీంద్ర జడేజా

పీఎల్-2022 సీజన్ ప్రారంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు మహేంద్ర సింగ్ ధోని షాక్ ఇచ్చాడు. ఐపీఎల్ ప్రారంభమైన 2008 సీజన్ నుంచి చెన్నై జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్న ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించాడు. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు జట్టు పగ్గాలు అప్పగించాడు. ఈ విషయాన్ని సీఎస్కే యాజమాన్యం ట్విటర్ ద్వారా వెల్లడించింది. సీఎస్కే జట్టును ధోని నాలుగు సార్లు 2010, 2011, 2018, 2021 సీజన్లలో ఛాంపియన్ గా నిలిపాడు. 2012 నుంచి జడేజా చెన్నై జట్టులో సభ్యుడిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.

కెప్టెన్ గా ధోని చెన్నై జట్టును అత్యంత విజయవంతమైన జట్టుగా తీర్చిదిద్దాడు. చెన్నై తరఫున 12 సీజన్లకు కెప్టెన్ గా వ్యవహరించిన ధోని.. 196 మ్యాచుల్లో 117 విజయాలు సాధించాడు. 77 మ్యాచుల్లో చెన్నై ఓటమి పాలైంది. 59.69 శాతం విజయాలతో సీఎస్కేను అగ్రస్థానంలో నిలిపాడు. 58.82 శాతంతో ముంబయి ఇండియన్స్ రెండో స్థానంలో కొనసాగుతోంది.

ధోనీ గెలిపించాడిలా…

సీఎస్కే పగ్గాలు చేపట్టిన తొలి సీజన్ లో ధోని జట్టుని ఫైనల్ వరకు తీసుకెళ్లాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరిగిన ఫైనల్ పోరులో త్రుటిలో చెన్నై జట్టు ఓటమి పాలైంది. ఆ తర్వాత 2010లో తొలి సారిగా చెన్నై జట్టును విజేతగా నిలిపాడు. ముంబయి ఇండియన్స్ తో జరిగిన తుది పోరులో చెన్నై 22 పరుగుల తేడాతో గెలుపొందింది. 2011లో రెండో సారి టైటిల్ సాధించిన సీఎస్కే.. ఫైనల్ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును 58 పరుగుల తేడాతో ఓడించింది.

మూడో టైటిల్ సాధించడానికి చెన్నై కాస్త ఎక్కువ సమయం తీసుకుంది. 2012, 2013, 2015 సీజన్లలో రన్నరప్ గా నిలిచింది. 2016, 2017 సీజన్లలో నిషేధం ఎదుర్కొన్న సీఎస్కే.. 2018లో గొప్పగా పునరాగమనం చేసింది. సన్ రైజర్స్ హైదారాబాద్ తో జరిగిన ఫైనల్ మ్యాచులో 8 వికెట్ల తేడాతో భారీ విజయం సాధించి.. మూడోసారి విజేతగా నిలిచింది. 2019లో రన్నరప్ గా నిలిచిన చెన్నై.. 2020 సీజన్ లో దారుణ ప్రదర్శనతో ఏడో స్థానంలో ముగించింది. 2021లో మరోసారి గొప్పగా పుంజకున్న సూపర్ కింగ్స్ నాలుగో సారి కప్ ఎగురేసుకుపోయారు. కోల్ కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)తో జరిగిన ఫైనల్ పోరులో 3 వికెట్ల తేడాతో చెన్నై విజయం సాధించింది. మొత్తం మీద ధోని సారథ్యంలో 4 సార్లు టైటిల్ సాధించిన చెన్నై జట్టు.. 5 సార్లు రన్నరప్ గా నిలిచింది.

%d bloggers like this: