Credit Crad: ముందుగా తెలుసుకోవాల్సిన అంశాలు..

1. కార్డు రకం..

భారతదేశంలో అనేక రకాల క్రెడిట్ కార్డులు అందుబాటులో ఉన్నాయి. రివార్డ్ పాయింట్స్ క్రెడిట్ కార్డులు, క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డులు, ట్రావెల్ క్రెడిట్ కార్డులు, స్టూడెంట్ క్రెడిట్ కార్డులు, కో-బ్రాండెండ్ క్రెడిట్ కార్డులు, బిజినెస్ క్రెడిట్ కార్డులు, స్టోర్ క్రెడిట్ కార్డులు ఇలా.. అనేక రకాల క్రెడిట్ కార్డులు అందుబాటులో ఉన్నాయి. ఇందులో నుంచి మీ అవసరాలకు సరిపోయే కార్డును ఎంచుకోవాలి. మొదటి సారి కార్డు తీసుకుంటున్నవారు జీరో లేదా తక్కువ వార్షిక రుసుముతో వచ్చే ప్రాథమిక స్థాయి (బిగినర్ లెవల్) కార్డులను ఎంచుకోవడం మంచిది.

2. ఆదాయం..

క్రెడిట్ కార్డ్ జారీ చేసే సంస్థలు.. వినియోగదారుని తిరిగి చెల్లింపు సామర్థ్యాన్ని చూస్తాయి. అందువల్ల క్రెడిట్ కార్డు ఎంపికలో ఆదాయం ముఖ్య పాత్ర పోషిస్తుంది. మీ ఆదాయ బ్రాకెట్లో నిర్దిష్ట పెరుగుదల కనిపిస్తుంటే.. కార్డు ఎంపికలో ఎక్కువ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి.

3. క్రెడిట్ కార్డు పరిమితి..

బ్యాంకులు కొంత పరిమితితో కార్డులను మంజూరు చేస్తాయి. పరిమితి మేరకు అవసరాలకు తగిన క్రెడిట్ కార్డులను పొందడం మంచిది. పరిమితి ఎక్కువగా ఉంటే..ఖర్చు ఎక్కువగా చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మొదటిసారి క్రెడిట్కార్డు తీసుకునే వారు తక్కువ లిమిట్తోనే క్రెడిట్ కార్డును తీసుకోవడం మంచిది.

4. వడ్డీ..

క్రెడిట్ కార్డులకు వడ్డీ లేకుండా సొమ్ము తిరిగి చెల్లించేందుకు కొంత గడువు ఉంటుంది. ఈ లోపుగా బకాయిలు చెల్లిస్తే ఎలాంటి వడ్డీ వర్తించదు. అయినప్పటికీ..గడువు తర్వాత ఎంత వడ్డీ విధిస్తారో ముందే తెలుసుకోవడం మేలు.

5. రుసుములు..

ప్రారంభ, వార్షిక నిర్వహణ ఛార్జీలు, ఏటీఎంలో నగదును విత్డ్రా చేసినప్పుడు, చెల్లింపులు ఆలస్యం అయినపుడు రుసుములు ఎంత వరకు విధిస్తారో అడిగి తెలుసుకోవాలి. వీలయినంత వరకూ తక్కువ ఛార్జీలు ఉన్న కార్డును ఎంచుకోవాలి.

6. చెల్లింపు గడువు..

అప్పు చేసిన సొమ్మును తిరిగి చెల్లించేందుకు క్రెడిట్ కార్డు సంస్థలు వడ్డీ పడకుండా కొంత గడువునిస్తాయి. ఎక్కువ రోజులు గడువు ఉన్న కార్డును ఎంచుకోవడం లాభదాయకం.

7. కార్డు పొందాక ..

కార్డును పొందిన వెంటనే అది మనం దరఖాస్తు చేసుకున్న రకానికి చెందినదా.. లేదా.. అని పరిశీలించాలి. కార్డుతో పాటు ఇచ్చిన నియమనిబంధనల పత్రాన్ని క్షుణ్నంగా చదవాలి. కార్డు అందుకున్న వెంటనే దాని మీద మన పేరు స్పష్టంగా ఉందో లేదో చూసుకోవాలి. ప్రస్తుతం చాలా వరకు క్రెడిట్ కార్డులు సెల్ఫ్ పిన్ జనరేషన్ తో వస్తున్నాయి. ఆన్ లైన్ నెట్ బ్యాంకింగ్ ద్వారా లేదా సంబంధిత బ్యాంక్ ఏటీఎమ్ దగ్గర గానీ పిన్ జెనరేట్ చేసుకోవచ్చు. పిన్ నెంబరు..కార్డుపైన గానీ మరే ఇతర చోట గానీ రాసుకోవడం ప్రమాదకరం. పిన్ నంబరును గుర్తుపెట్టుకోవడం మేలు.

8. కార్డు వాడేటప్పుడు..

షాపులలో, హోటళ్లలో క్రెడిట్ కార్డును వేరే చోటికి తీసుకెళ్లకుండా మన ముందే స్వైప్ చేయమని కోరాలి. బ్యాంకు ఖాతాలో ఫోన్ నెంబరు అప్ డేట్ గా ఉండేలా జాగ్రత్త పడాలి. అప్పుడే లావాదేవీలు జరిగిన వెంటనే దానికి సంబంధించిన నోటిఫికేషన్ మీ ఫోన్ కి వస్తుంది. మీ ఖర్చుల బిల్లులు, క్రెడిట్ కార్డుల స్టేట్ మెంట్లు దగ్గర ఉంచుకొని సరిచూసుకోండి. ఏవైనా తేడాలు వస్తే వెంటనే సంబంధిత సంస్థకు ఫిర్యాదు చేయాలి.

9. ఆర్థికపరమైన లావాదేవీల్లో జాగ్రత్త..

పరిమిత గడువు తర్వాత వడ్డీ కట్టాల్సి ఉంటుంది. కాబట్టి క్రెడిట్ కార్డు బిల్లులను గడువు లోపు చెల్లించే ప్రయత్నం చేయాలి. ఆన్ లైన్ లో షాపింగ్ జరిపేటప్పుడు అత్యంత జాగ్రత్త అవసరం. పిన్ నంబరు, ఖాతా వివరాలు అందించేటప్పుడు సురక్షితమైన మాధ్యమం ద్వారా చెల్లింపులు జరుగుతున్నదీ.. లేనిదీ.. సరిచూసుకోవాలి. వీటి కోసం కొన్ని గుర్తులు ఉంటాయి. https… తో మొదలయ్యే వెబ్ సైట్ లు సురక్షితం.

10. క్రెడిట్ కార్డు పోతే…

క్రెడిట్ కార్డు పోతే వెంటనే సంబంధిత సంస్థకు ఫిర్యాదు చేసి కార్డును బ్లాక్ చేయించుకోవాలి. దీంతో తదుపరి నగదు లావాదేవీలు జరగకుండా జాగ్రత్తపడచ్చు.

11. కార్డు సంరక్షణ..

కొన్ని క్రెడిట్ కార్డు సంస్థలు మనం తీసుకున్న క్రెడిట్ కార్డులపై బీమానందిస్తున్నాయి. వీటి కోసం కొంత ప్రీమియం వసూలు చేస్తారు. కార్డు పోతే అందుకయ్యే ఖర్చునే కాకుండా ఒక వేళ దుర్వినియోగం అయితే కొంత పరిమితి మేరకు బీమా రక్షణ ఉంటుంది. కొన్ని బ్యాంకులు ఉచితంగా ఈ సేవలను అందిస్తాయి. అలాంటి ఉచిత సేవలతో కూడిన కార్డును ఎంచుకోవడం మేలు.

12. క్రెడిట్ స్కోరుపై ప్రభావం..

క్రెడిట్ కార్డ్.. మీ క్రెడిట్ స్కోర్ను ప్రభావితం చేస్తుంది. క్రెడిట్ కార్డు ద్వారా పరిమితికి మించి ఖర్చు చేస్తే అవి క్రెడిట్ స్కోరుపై చెడు ప్రభావాన్ని చూపుతాయి. ఇక్కడ క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో చాలా ముఖ్యం. అంటే, మీకు అందించిన పరిమితిలో ఎంత శాతం ఉపయోగిస్తున్నారు అని అర్థం. క్రెడిట్ స్కోరు తగ్గకుండా ఉండాలంటే క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో 40శాతం మించకుండా చూసుకోవాలి.

చివరిగా..

బలమైన క్రెడిట్ స్కోరు నిర్మించుకోవడంలో క్రెడిట్ కార్డు సహాయ పడుతుంది. అందువల్ల క్రెడిట్ కార్డును తీసుకోవడం మంచిదే. అయితే, ఇందుకు ఆర్థిక క్రమశిక్షణ చాలా అవసరం. సమయానికి బిల్లు చెల్లించడం, ఏటీఎమ్ ల వద్ద కార్డుని వినియోగించక పోవడం, అతిగా ఖర్చు చేయక పోవడం మంచిది.

%d bloggers like this: