Credit Cards: మ‌రో క్రెడిట్ కార్డు అవసరమా?

ఇప్పటికే క్రెడిట్ కార్డు వాడుతున్నవారు.. మరొక క్రెడిట్ కార్డు తీసుకోవాలనుకున్నప్పుడు ముందుగా ఎదురయ్యే ప్రశ్న.. మరో క్రెడిట్ కార్డు అవసరమా?.. అని. నగదు రహిత లావాదేవీలు ఎక్కువగా జరుగుతున్న ఈ రోజుల్లో క్రెడిట్ కార్డుల అవసరం ఉందనే చెప్పాలి. అయితే మరి ఒక వ్యక్తి ఒక క్రెడిట్ ఉండగా మరో క్రెడిట్ కార్డు తీసుకోవచ్చా? అసలు ఒక వ్యక్తికి ఎన్ని క్రెడిట్ కార్డులు ఉండాలి? రెండో కార్డు తీసుకోవడం వల్ల లాభామా.. నష్టమా అన్నదే ప్రశ్న? ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉంటే వారి ఆదాయానికి మించి ఖర్చు చేసే ఆస్కారం ఉంటుందని, దీంతో వారు రుణ ఉచ్చులో చిక్కుకు పోయే ప్రమాదం ఉందనే కారణంతోనే & ఒక వ్యక్తికి ఒక క్రెడిట్ కార్డు సరిపోతుందని కొంతమంది సలహా ఇస్తుంటారు. నిజానికి, ఖర్చులను నియంత్రించుకోగల సామర్ధ్యం మీకుంటే ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులను ఉండడం మంచిదే.

వడ్డీ లేని రుణ కాలం ఎక్కువ ఉండే అవకాశం..

క్రెడిట్ కార్డుతో ఏమైనా వస్తు, సేవను కొనుగోలు చేస్తున్నామంటే.. బ్యాంకు/క్రెడిట్ జారీ సంస్థ వద్ద అప్పు తీసుకొనట్లే భావించాలి. కార్డు ద్వారా వినియోగించిన మొత్తాన్ని తిరిగి చెల్లించడానికి బ్యాంకులు కొంత సమయం ఇస్తాయి. ఆ సమయం లోపల చెల్లింపులు చేసేనట్లయితే ఎలాంటి వడ్డీ ఉండదు. రెండు క్రెడిట్ కార్డులు కలిగి ఉండడం ద్వారా మీ వడ్డీ లేని చెల్లింపుల కాలవ్యవధిని పెంచుకోవచ్చు.

ఉదాహరణకి మీ బిల్లింగ్ సైకిల్ (ఖర్చుచేసి, తిరిగి చెల్లించే కాల వ్యవధి) చివరి తేది సెప్టెంబరు 30, అనుకుంటే, మీ వడ్డీ లేని చెల్లింపులకు అక్టోబరు 21, వరకు గడువు ఉంటుంది. మీరు సెప్టెంబరు 1 వ తేదీన క్రెడిట్ కార్డు వినియోగించి వస్తువులను కొనుగోలు చేశారనుకుందాం. మీ వడ్డీ లేని చెల్లింపుల గుడువు తేది అక్టోబరు 21వరకూ ఉంటుంది. అంటే మీ క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించడానికి దాదాపు 50 రోజుల సమయం లభిస్తుంది. ఒక వేళ మీరు సెప్టెంబరు 30న కొనుగోళ్లు చేసినట్లయితే గుడువు తేది.. అక్టోబరు 21 అయినందువల్ల మీకు 21 రోజుల సమయం మాత్రమే లభిస్తుంది. నెలలో ఒక్కోరోజు గడుస్తున్నప్పుడు మీ వడ్డీ లేని రుణ కాలవ్యవధి కూడా తగ్గిపోతుంది. అదే బిల్లింగ్ సైకిల్ చివరి తేది 15 గా వున్న మరొక కార్డు మీ వద్ద ఉన్నట్లయితే అప్పుడు సెప్టెంబరు 30 తేది కొనుగోళ్ళను ఈ కార్డు ఉపయోగించి చేస్తే మీ వడ్డీ లేని కాలవ్యవధిని పెంచుకోవచ్చు.

క్రెడిట్ కార్డు బిల్లును నిర్ణీత తేది లోపు చెల్లించడం ద్వారా అధిక వడ్డీ రేటు నుంచి ఉపశమనం పొందవచ్చు. కొన్నిసందర్భాల్లో వ్యక్తులు క్రెడిట్ కార్డు మొత్తం బిల్లు చెల్లించలేక కనీసం 5 శాతం బిల్లును చెల్లిస్తారు. ఇలా చేయడం వల్ల బ్యాంకు వారు 2 నుంచి 3 శాతం వడ్డీ విధిస్తారు. ఇది మీరు చెల్లించని బిల్లులకు మాత్రమే కాకుండా తరువాత చేయబోయే కొనుగోళ్ళకు కూడా వర్తిస్తుంది. మీరు మరొక క్రెడిట్ కార్డు కలిగివుంటే మీ పాత బిల్లును చెల్లించేంత వరకు, మీ వద్ద ఉన్న రెండవ కార్డుపై తరువాతి నెల కొనుగోళ్ళు చేయడం ద్వారా అధిక వడ్డీ రేట్ల బారిన పడకుండా తప్పించుకోవచ్చు.

తక్కువ వడ్డీతో నగదు బదిలీ..

మీరు ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డలను కలిగి వున్నట్లయితే చెల్లించని క్రెడిట్ కార్డు బిల్లులపై అధిక వడ్డీ రేట్లను తగ్గించుకోవచ్చు. చాలా సంస్థలు వారి వ్యాపారాన్ని పెంచుకోవడానికి గాను మీరు చెల్లించని మొత్తాన్ని వారి కార్డులకు బదిలీ చేసుకోవడానికి వీలు కల్పిస్తున్నాయి. కొన్ని బ్యాంకులు మొదటి రెండు నెలలకు ఎటువంటి ఛార్జీలు విధించకుండా ఈ సౌకర్యాన్ని అందిస్తున్నాయి. తరువాత కూడా నెలకు 1.5 నుంచి 2 శాతం వడ్డీ మాత్రమే చెల్లించే వీలుకల్పిస్తున్నాయి. ఇది మొదటి కార్డుపై 2 నుంచి 3 శాతంగా వుంటుంది. చెల్లించని మొత్తాలను ఒక కార్డు నుంచి మరొక కార్డుకు బదలీ చేయడం అనేది ఒక అలవాటుగా మార్చుకోవద్దు, ప్రతీ సారి ఇలా చేయడం వల్ల మీరు రుణ ఉచ్చులో పడే అవకాశం ఉంది.

కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులు..

కొన్ని క్రెడిట్ కార్డు సంస్థలు.. కొన్ని బ్రాండెడ్ కంపెనీలు, సర్వీస్ ప్రొవైడర్లతో అనుసంధానం అయ్యి కార్డులను అందిస్తాయి. వీటినే కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులు అంటారు. ఇక్క అన్ని కార్డులు ఒకేలా ఉండవు. కొన్ని కిరాణా దుకాణాలలో కొనుగోళ్ళకు, మరికొన్ని ఆన్లైన్లో షాపింగ్కు, ఇంకొన్ని వాహన ఇంధన కొనుగోళ్లకు లాభదాయకంగా ఉండొచ్చు. కొన్ని కార్డులను ఉపయోగించి పెట్రోలు కొనుగోలు చేసినప్పుడు, సర్ఛార్జ్ రద్దు యుటిలిటీ బిల్లుల చెల్లింపు కోసం రివార్డు పాయింట్లను ఇస్తుంటాయి. మీరు ఎక్కువగా ఎక్కడ ఖర్చు చేస్తున్నారో.. దానికి సంబంధించిన మరో క్రెడిట్ కార్డును వాడడం వల్ల ఎక్కువ ప్రయోజ;నాలు పొందొచ్చు.

ప్రత్యమ్నాయ చెల్లింపుల కోసం..

టెక్నాలజీ ఉపయోగించి డిజిటల్ లావాదేవీలు చెల్లించడం సులభం కానీ ఒక్కోసారి ఊహించని సాంకేతిక కారణాల వల్ల ఒక క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపులు జరగకపోవచ్చు. కార్డు సర్వీస్ లోపం వల్ల కాని, పీఓఎస్ మిషన్ కార్డుపై ఉన్న చిప్ రీడ్ కాకపోవడం వల్ల కాని ఇలాంటి ఇబ్బంది రావచ్చు. అలాంటి పరిస్థితులలో రెండో కార్డు ఉపయోగ పడుతుంది.

స్కోరు పెంచుకోవడం కోసం..

క్రెడిట్ కార్డు సరైన రీతిలో వినియోగిస్తే క్రెడిట్ స్కోరు పెంచుకోవచ్చు. ముఖ్యంగా క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో ( రుణ వినియోగ నిష్పత్తి) క్రెడిట్ స్కోరుపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది. క్రెడిట్ యుటిలైజేషన్ అంటే.. మీ క్రెడిట్ కార్డుపై మీరు వినియోగించుకోగల మొత్తంలో మీరు వినియోగించిన మొత్తం. మీ క్రెడిట్ యుటిలైజేషన్ 50శాతం మించకుండా చూసుకోవడం వల్ల క్రెడిట్ స్కోరు పెంచుకోవచ్చు. ఉదాహరణకు మీ క్రెడిట్ కార్డు లిమిట్ రూ. 1 లక్ష ఉందనుకుందాం. మీరు వినియోగించింది మాత్రం రూ.60 వేలు అప్పుడు మీ క్రెడిట్ యుటిలైజేషన్ 60 శాతం అవుతుంది. ఒకవేళ మీ వద్ద రూ.50 వేలు లిమిట్ కలిగిన మరో క్రెడిట్ కార్డు ఉందనుకుందాం. అప్పుడు మీ క్రెడిట్ యుటిలైజేషన్ 40శాతానికి తగ్గుతుంది.

చివరిగాఒక కార్డు తీసుకున్నా, రెండు లేదా అంతకంటే ఎక్కువ కార్డులు ఉపయోగించినా ఖర్చులపై నియంత్రణ, నిర్వహణ సరిగ్గా ఉంటే ప్రయోజనాలు పొందొచ్చు. నెలవారీ ఆదాయం ఎంత ఎంత ఖర్చు చేస్తున్నాం.. అనే విషయాలపై ఖచ్చితమైన సమాచారం ఉండడం.. అలాగే సరైన సమయానికి బిల్లు చెల్లించగలడం ముఖ్యం. 2-3 క్రెడిట్ కార్డులు తీసుకోవడం తప్పనిసరి కాదు. రెండో కార్డు వల్ల ఉపయోగం లేదనిపించినా, కొత్తగా క్రెడిట్ కార్డు తీసుకున్నా, ఖర్చులపై నియంత్రణ లేక;పోయినా రెండో క్రెడిట్ కార్డుకి వెళ్లకపోవడమే మంచిది.

%d bloggers like this:
Available for Amazon Prime