నీటికాసుల సమస్య (Glaucoma)

టికాసుల్లో నొప్పి, వాపు, ఎరుపు వంటి ఇబ్బందులేవీ ఉండవు. అసలు కంట్లో జబ్బు ఉన్న సంగతైనా తెలియదు. కానీ తెలియకుండానే చూపు తగ్గటం ఆరంభమవుతుంది. ముందుగా చుట్టుపక్కల నుంచి చూపు తగ్గటం మొదలవుతుంది. దీంతో చూపు పరిధి.. అంటే మనం చూసే వస్తువులకు చుట్టుపక్కల ఉండేవి కనిపించటం (పరిధి) తగ్గుతూ వస్తుంది. ఇది నెమ్మది నెమ్మదిగా తగ్గుతూ రావటం వల్ల చాలామంది దీన్ని గుర్తించలేరు. పక్కన ఉన్నవారిని ఢీకొట్టటం, మెట్లు కనిపించక జారిపడటం వంటివి జరుగుతున్నా సమస్యను పోల్చుకోలేరు. నిజానికివన్నీ సమస్య తీవ్రమయ్యాక ఎదురయ్యే అనుభవాలు. వీటిని గుర్తించేసరికే జరగాల్సిన అనర్థం జరిగిపోతుంది. చివరికి చూపు పూర్తిగానూ పోవచ్చు. మామూలుగా శుక్లాలతో చూపు తగ్గితే శస్త్రచికిత్స అనంతరం తిరిగి వస్తుంది. కానీ గ్లకోమాలో అలాకాదు. ఒకసారి చూపు పోతే తిరిగి రాదు. ఇలా చూపు శాశ్వతంగా కోల్పోవటానికి దారితీస్తున్న కంటి సమస్యల్లో తొలిస్థానం గ్లకోమాదే.

అరుదైన సమస్య కాదు

నీటికాసులు అనగానే అదేదో అరుదైన సమస్యని అనుకుంటుంటారు. కానీ తరచూ చూసేదే. మనదేశంలో సుమారు 1.2 కోట్ల మంది నీటికాసులతో బాధపడుతున్నారని అంచనా. వీరిలో 11 లక్షల మంది పూర్తిగా చూపు కోల్పోయినవారే. ఇది లెక్కలోకి వచ్చినవారి సంఖ్య మాత్రమే. లెక్కలోకి రానివారు ఇంకా ఎక్కువే ఉంటారనటంలో సందేహం లేదు. వయసు ఎక్కువవుతున్నకొద్దీ దీని బారినపడుతున్న వారి సంఖ్యా పెరుగుతూ వస్తుండటం గమనార్హం. 80 ఏళ్లు పైబడ్డవారిలో దాదాపు 10% మందిలో గ్లకోమా బయటపడటమే దీనికి నిదర్శనం. వీరిలో 95-98% మందికి గ్లకోమా ఉన్నట్టయినా తెలియదు. ఇతరత్రా సమస్యల కోసం పరీక్షలు చేస్తే తప్ప ఇది బయట పడటం లేదు. కాబట్టి మనకెందుకు వస్తుందని అనుకోవటం తగదు.

ఎందుకొస్తుంది?

గ్లకోమాకు మూలం కంట్లో ఒత్తిడి పెరగటం. మనం కంటితో చూసేవన్నీ దృశ్యనాడి ద్వారా మెదడుకు చేరతాయి. అప్పుడే ఆయా దృశ్యాలు మనకు కనిపిస్తాయి. అయితే కంట్లో ఒత్తిడి పెరిగితే ఈ దృశ్యనాడి దెబ్బతినటం ఆరంభిస్తుంది. దీంతో చూపు పరిధి తగ్గటం మొదలవుతుంది. నెమ్మది నెమ్మదిగా.. చివరికి పూర్తి అంధత్వానికి దారితీస్తుంది. ఇంతకీ కంట్లో ఒత్తిడి ఎందుకు పెరుగుతుంది? కంట్లో నిరంతరం పారదర్శక ద్రవం (అక్వియస్ హ్యూమర్) ఉత్పత్తి అవుతుంటుంది. ఇది కార్నియాకు, కటకానికి అవసరమైన పోషకాలు అందిస్తుంది. అలాగే కన్ను ఒకే విధమైన ఒత్తిడి స్థితిలో తేలి ఉండటానికీ తోడ్పడుతుంది. అవసరం తీరాక ఈ ద్రవం కంట్లో ఒక మూలన (యాంగిల్) ఉండే ప్రత్యేకమైన నాళాల ద్వారా బయటకు పోతుంది. ఎంత ద్రవం ఉత్పత్తి అవుతుంటే అంత ద్రవం బయటకు పోతుంటుంది. ఇది ఎప్పటికప్పుడు బయటకు వెళ్లిపోతే ఎలాంటి ఇబ్బందీ ఉండదు. లోపల ఉండిపోతేనే సమస్య. ద్రవం బయటకు సరిగా వెళ్లకపోయినా, నాళాల్లో అడ్డంకి ఏర్పడినా, ద్రవం ఎక్కువగా ఉత్పత్తి అవుతున్నా కంట్లో ద్రవం పరిమాణం పెరుగుతుంది. దీంతో లోపల ఒత్తిడి ఎక్కువవుతుంది. ఫలితంగా కంటి వెనకాల మీదుండే దృశ్యనాడి (ఆప్టిక్ నర్వ్) నొక్కుకుపోయి, చూపు దెబ్బతింటుంది.

ప్రధానంగా రెండు రకాలు

గ్లకోమాలో చాలారకాలు ఉన్నాయి. ప్రధానంగా చెప్పుకోవాల్సింది రెండింటి గురించి. 1. ఓపెన్ యాంగిల్ గ్లకోమా. ఇందులో ద్రవం వెళ్లే మార్గం మూసుకుపోదు గానీ సన్నబడుతుంది. దీంతో ద్రవం సరిగా బయటకు వెళ్లదు. ఇది చాలా నెమ్మదిగా ముదురుతూ వచ్చే సమస్య. దృశ్యనాడి బాగా దెబ్బతినే వరకూ చూపు తగ్గిందన్న విషయమే తెలియదు. 2. యాంగిల్ క్లోజర్ గ్లకోమా. ఇందులో ద్రవం వెళ్లే మార్గం దాదాపుగా మూసుకుపోతుంది. కొన్నిసార్లు ఇది ఉన్నట్టుండి హఠాత్తుగానూ మూసుకుపోవచ్చు (అక్యూట్& యాంగిల్ క్లోజర్). వీరిలో తీవ్రమైన తలనొప్పి, కంటి నొప్పి, వాంతి, వికారం, చూపు మసకబారటం, కళ్లు ఎరుపెక్కటం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

అధిక రక్తపోటు గలవారికి కంట్లో రక్తనాళాలు చిట్లటం వల్ల , మధుమేహం మూలంగా రెటినోపతీ తలెత్తినవారికి నియోవాస్క్యులర్ గ్లకోమా వచ్చే అవకాశముంది. దీనికి చికిత్స కష్టం.

నిర్ధరణ ఎలా?

టోనోమెట్రీ పరీక్ష ద్వారా కంట్లో ఒత్తిడిని గుర్తిస్తారు. అలాగే కంట్లో చుక్కల మందు వేసి కనుపాప పెద్దగా అయ్యాక లోపల దృశ్యనాడి ఎలా ఉందో చూస్తారు. దృశ్యనాడిలో ఏదైనా తేడా ఉంటే చూపు పరిధిని తెలిపే పెరిమెట్రీ పరీక్ష చేస్తారు. గ్లకోమా నిర్ధరణకు ఇది ముఖ్యమైన పరీక్ష. నీటికాసుల్లో చుట్టుపక్కల నుంచి చూపు పరిధి తగ్గుతూ వస్తుంది. అందుకే తల తిప్పకుండా చూస్తున్నప్పుడు చుట్టుపక్కల ఉన్నవి కనిపించే పరిధి తగ్గుతోందా? అనేది ఇందులో బయటపడుతుంది. జబ్బు నిర్ధరణకే కాదు.. తీవ్రత తెలుసుకోవటానికి, మందుల పనితీరును గుర్తించటానికీ ఇది ఉపయోగపడుతుంది.

చికిత్స- చుక్కల మందు ప్రధానం

కంట్లో ఒత్తిడిని తగ్గిస్తే దృశ్యనాడి దెబ్బతినకుండా చూసుకోవచ్చు. చికిత్సల ఉద్దేశం ఇదే. గ్లకోమాలో ఉన్న చూపును కాపాడుకోవటం తప్పించి చేయగలిగిందేమీ లేదు. అందుకే ఎంత త్వరగా చికిత్స తీసుకుంటే అంత మంచిది.

కంట్లో ఒత్తిడి తగ్గటానికి చుక్కల మందులు ఉపయోగపడతాయి. వీటిల్లో ద్రవం ఉత్పత్తి తగ్గించేవి, ద్రవం తేలికగా కంట్లోంచి బయటకు వెళ్లేలా చేసేవీ ఉన్నాయి. వీటిని వాడుకోవటం చాలా తేలిక. క్రమం తప్పకుండా వాడుకుంటే గ్లకోమా బారినపడకుండా చూసుకోవచ్చు. ఒకవేళ జబ్బు ఉన్నా ముదరకుండా చూసుకోవచ్చు. ద్రవం బయటకు వెళ్లే దారి మూసుకుపోతే లేజర్ చికిత్సతో తిరిగి తెరచుకునేలా చేయొచ్చు. కొందరికి పాక్షికంగానే మార్గం తెరచుకోవచ్చు. వీరికి మందులు కొనసాగించటం అవసరం. దాదాపు 80-90% మందికి మందులు, లేజర్ చికిత్సతోనే సమస్య నియంత్రణలో ఉంటుంది. ఒకవేళ వీటితో ఫలితం లేకపోతే శస్త్రచికిత్స అవసరమవుతుంది. ఇందులో కంట్లోంచి ద్రవం ఇతర కణజాలంలోకి వెళ్లిపోవటానికి ప్రత్యామ్నాయ మార్గాన్ని సృష్టిస్తారు. దీంతో ఒత్తిడి తగ్గుతుంది.

నివారించుకోవచ్చా?

క్రమం తప్పకుండా కంటి పరీక్ష చేయించుకోవటం ద్వారా గ్లకోమాను తొలిదశలోనే గుర్తించొచ్చు. గ్లకోమా నివారణకు ఇదే ఉత్తమమైన మార్గం. చత్వారం గలవారు కళ్లద్దాలు తీసుకోవటంతోనే సరిపెట్టుకోకుండా కంట్లో ఒత్తిడి, దృశ్యనాడిని క్షుణ్నంగా పరిశీలించే సమగ్ర కంటి పరీక్ష కూడా చేయించుకోవాలి.

రక్త సంబంధికుల్లో ఎవరైనా గ్లకోమా బాదితులు గలవారు 30, 40 ఏళ్లు దాటాక ఏటా కంటి పరీక్ష చేయించుకోవటం మంచిది.

కంట్లో ఒత్తిడి ఎక్కువగా గలవారు, గ్లకోమా నిర్ధరణ అయినవారు చుక్కల మందును క్రమం తప్పకుండా వేసుకోవాలి.

క్రమం తప్పకుండా వ్యాయామం, యోగా చేయాలి. దీంతో కంట్లో ఒత్తిడి తగ్గుతుంది. ఇది గ్లకోమా ముప్పు తగ్గటానికి తోడ్పడుతుంది.

కంటికి గాయాలు కాకుండా చూసుకోవాలి. కంటికి దెబ్బలు తగిలి, రక్తస్రావమైనవారైతే ఒకట్రెండు సంవత్సరాలకు ఓసారి కంటి పరీక్ష చేయించుకోవాలి.

%d bloggers like this:
Available for Amazon Prime