మనిషి ముఖ్యం…..స్టేటస్ కాదు

మా ఆవిడ సినిమాకి వెళదామంటే.. సరే అని వెళ్ళాం.టికెట్స్ తీసుకొని లోపలికి వెళుతుంటే.. ఎంట్రన్స్ డోర్ దగ్గర టికెట్స్ చింపుతూ ఉన్న గోపి గాడు నన్ను గుర్తు పట్టాడు. పలకరించుకున్నాక, మా ఆవిడకి పరిచయం చేశాను. ఇంటర్లో క్లాస్ మేట్ అని..!

   హాల్లో కూర్చున్నాక అడిగింది.. "అదేమిటండి మీ క్లాస్మెట్ అంటున్నారు.....ఇలా గేట్ దగ్గర టికెట్స్ చింపే ఉద్యోగంతో పెళ్ళాం పిల్లల్ని ఎలా పోషిస్తాడో కదా పాపం.." అంది.   "ఏమో చదువు అయ్యాక, ఇప్పుడే గదా కలిసింది" అన్నాను.వాడిల్లు చిన్నప్పుడు మా వీధిలోనే...చాలా అల్లరి వెధవ....సినిమాల పిచ్చి ఎక్కువ...ప్రతి రోజు పేపర్ తిరగెయ్యటం, ఏ సినిమా ఎన్ని థియేటర్స్ లో రిలీజ్ అయ్యిందో చూడటం.

      ప్రతీ సినిమా రిలీజ్ రోజే ఉదయం ఆట చూసేయ్యటం... సినిమా హాల్స్ కేబిన్ దగ్గరకి వెళ్ళి తెగి పోయిన ఫిల్మ్ ముక్కలు ఏరు కోవటం..ఇదే పని.
     అప్పుడప్పుడు వాడి డబ్బులుతో నేల టిక్కెట్ కి  నన్ను కూడా తీసుకెళ్లేవాడు...
       "ఎందుకురా" అంటే.. "ఒక్కడిని అయితే బెంచ్ టికెట్ తీసుకునేవాడిని.. నువ్వూ వస్తే 2నేల టికెట్స్.. అంతే గదరా.." అనేవాడు నవ్వుతూ ఆప్యాయంగా...!

        "మా పెద్దోళ్ళు, వాడితో తిరిగితే ఎక్కడ  చెడి పోతామో అని వాడితో ఆడనిచ్చే వారు కాదు.చివరకు వాళ్ళు చెప్పినట్టే, వీడు లైఫ్ లో ఎదుగు బొదుగు లేకుండా ఇలా తగలడ్డాడు" అన్నాను.

    "మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అతను చాలా మంచోడులా ఉన్నాడు....లేపోతే మిమ్మల్ని తన డబ్బులతో సినిమాలకి ఎందుకు తీసుకెళుతాడు..

అయినా మీరు మటుకు చేసేది ఏమైనా పెద్ద కలక్టర్ ఉద్యోగమా ఏంటి….ఇప్పటి వరకు స్కూటర్ దాటి మరేం కొనలేదు” అంటూ భార్య దెప్పింది.

   నాకు ఉక్రోషం వచ్చి "ఎలా చూసినా వాడికంటే బెటరే కదే" అన్నాను.

    ఇంటర్వెల్లో కూల్ డ్రింక్స్ తెచ్చిచ్చిన..ఆ కుర్రోడికి డబ్బులు ఇవ్వబోతుంటే.. "వద్దు సార్" మీ ప్రెండ్ పంపాడు అని చెప్పి వెళ్లి పోయాడు.

     ఇదంతా గమనిస్తున్న మా ఆవిడ.. "నిజంగా మీ ఫ్రెండ్ మంచోడు అండీ..మీరే సరిగ్గా పలకరించ లేదు..పోజు కొడుతూ మాట్లాడారు." అన్నది.

     "కాదులేవే...వాడి పొజిషన్ ఇప్పుడు బాగా లేదేమో కదా.. నేను కాస్త ఆప్యాయంగా మాట్లాడాననుకో...రేపు ఎప్పుడైనా అప్పు అడిగితే...అదో తలనొప్పి మళ్లీ నాకు...!" అన్నాను సాలోచనగా.

       "అతను ఏ పొజిషన్ లో ఉన్నా..  స్నేహితుడు స్నేహితుడే..!  "కనీసం కూల్ డ్రింక్స్ పంపినందుకైనా వెళ్ళేటప్పుడు థాంక్స్ చెప్పండి" అంది నా శ్రీమతీ నిశ్చయంగా..

సినిమా అయిపోయింది……

          మా ఆవిడ పోరు పడలేక.. ఎంట్రన్స్ దగ్గర సిబ్బందితో, వాడి గురించి వాకబు చేస్తే...

అతను పై ఫ్లోర్ లోని ఒక రూమ్ లోకి తీసుకెళ్లాడు.

      పెద్ద ఎయిర్ కండిషనింగ్ రూమ్...ఒక సోఫాలో గోపి గాడు కూర్చుని ఉంటే....హాల్ మేనేజర్ ఆరోజు కలెక్షన్స్ లెక్కలు చెబుతున్నాడు... ఎదురుగా డిస్ట్రిబ్యూటర్ తాలూకు వాళ్ళు అనుకుంట...మేము లోపలికి వెళ్లగానే...లేచి బయటకు వెళ్లిపోయారు.

        గోపి గాడు మమ్మల్ని చూడగానే రారా.. రా.. అంటూ ఇద్దర్ని కూర్చో బెట్టి, కాఫీ తెప్పించాడు. ఇదంతా ఆశ్చర్యంగా పరికించి చూస్తున్న నాకు అప్పుడు అర్థమైంది ఆ సినిమా హాలు వాడిదేనని.!

   మొదట్లో 16mm ప్రొజెక్టర్ తో  ఊర్లలో పండగలకి పబ్బాలకి సినిమాలాడించి, ఈ స్టేజీకి ఎదిగాడుట. ఇంకా ఆంద్రా, తెలంగాణాలో ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉందట. కొత్త సినిమాలు జిల్లాల వారిగా కొంటాడుట..! అలా తను ఎదిగిన క్రమాన్ని చెపుతూ... ఈ రోజు టికట్ చింపే పనివాడు రాక పోతే తానే ఆపని చేసాడని చెప్పుకొచ్చాడు.

   నా స్నేహితుడు"ఎలా వచ్చార్రా.." అని నన్ను అడిగితే.."రిక్షాలో" అని చెప్పా తలవంచు కొంటూ.

    డ్రైవర్ని పిలిచి, వద్దన్నా వినకుండా తన కారులో మమ్మల్ని ఇంటి వద్ద దింపేసి రమ్మన్నాడు.

           అప్పుడు దారిలో మా ఆవిడ.. "ఇలా ఇంకెప్పుడూ, ఎవర్నీ తక్కువ అంచనా వేయకండి....

స్నేహితుడు ముఖ్యం. అతడి స్టేటస్ కాదు..
ముఖ్యంగా చిన్ననాటి మిత్రులను ఎప్పుడూ చిన్నచూపు చూడకూడదు…” అంది ఒకింత కోపంగా…!!
“ఎదుటివారిని చూడంగానే ఒక అంచనా వేయకండి.” మనిషి చూడానికి ఎలా వున్నా…. మీ కన్నా గొప్పవాడు కావచ్చేమో కదా….!!

%d bloggers like this:
Available for Amazon Prime