
ఎలిఫెంటా కేవ్స్ దీవికి చేరాలంటే ముంబయిలోని గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గర టికెట్ తీసుకోవాలి. ఫెర్రీలో ప్రయాణాన్ని ఆస్వాదిస్తూ వెళ్తుంటే పది కిలోమీటర్లు చాలా త్వరగా వచ్చేసినట్లనిపిస్తుంది. ఫెర్రీ ప్రయాణంలో ఎలిఫెంటా కేవ్స్‌ను చేరేలోపు హార్బర్‌కు వచ్చిన పెద్ద పెద్ద షిప్పులను చూడవచ్చు. పోర్టులో బెర్త్ క్లియరెన్స్ కోసం ఎదురు చూస్తూ తీరానికి రెండు కిలోమీటర్ల వరకు పెద్ద షిప్పులు లంగరు వేసుకుని ఉంటాయి. వాటిలో క్రూ డెక్ మీదకు వచ్చి సముద్రాన్ని చూస్తూ కాలక్షేపం చేస్తుంటారు. మామూలుగా అయితే అంతపెద్ద ఇంటర్నేషనల్ కార్గోలను అంత దగ్గరగా చూడడం కుదరని పని.
సోమవారం సెలవు
ఎలిఫెంటా కేవ్స్ పర్యటనకు సోమవారం సెలవు. ఫెర్రీలు ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకే గుహల దగ్గరకు తీసుకెళ్తాయి. శీతాకాలం ఫెర్రీ పై అంతస్తులో ప్రయాణించడం బాగుంటుంది. అరబిక్ కడలి చిరు అలలతో నిశ్శబ్దంగా పలకరిస్తుంది. ఎలిఫెంటా కేవ్స్ ఉన్న దీవి ఎత్తు విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయితే అది పర్యాటకుల తప్పు కాదు. అమావాస్య, పౌర్ణముల్లో సముద్రం ఆటుపోట్లను బట్టి నీటి ఉపరితలం పైకి ఉబికినప్పుడు ఐలాండ్ ఎత్తు తక్కువగా కనిపిస్తుంది. ఫెర్రీ దిగిన తర్వాత దాదాపు కిలోమీటరు దూరం నడవాలి. ఆ దారిలో టాయ్‌ట్రైన్ ఎప్పుడో ఒక ట్రిప్పు తిరుగుతుంది.
అంతదూరం నుంచి మనం వదిలి వచ్చిన తీరాన్ని చూడడం, సముద్రపు అలలు, మరోవైపు కొండలను చూస్తూ సాగే ఆ నడక కూడా ఆహ్లాదకరంగానే ఉంటుంది. ఆ దారిలో ఉండే టూరిస్టు మార్కెట్‌లో చిరు వ్యాపారులను, వారు చెప్పే ధరలను చూస్తే దేశంలో వర్తకవాణిజ్య మేధావులంతా ఇక్కడే ఉన్నారా అని నోరెళ్లబెట్టాల్సిందే. పర్యాటక ప్రదేశాల్లో ధరలు ఎక్కువగానే ఉంటాయి. ఐదు నుంచి పదిశాతం ధర ఎక్కువ ఉండడాన్ని ఆక్షేపించకూడదు. కానీ మన దగ్గర శిల్పారామంలో రెండు వందలకు అమ్మే హ్యాండ్‌బ్యాగ్‌కు అక్కడ పదిహేను వందలు చెప్పారు.
You must log in to post a comment.