వ్యాయామం ఎందుకు చెయ్యాలి? ఎలా చెయ్యాలి?

100000 సంవత్సరాల మానవ చరిత్రలో వ్యాయామం ఎప్పుడూ అవసరానికి మించే ఉండేది. యంత్రయుగం వచ్చిన తరవాత, గత 200 సంవత్సరాలలోనే తగ్గిపోయింది. కంప్యూటర్ యుగం వచ్చిన తరవాత ఇంకా తగ్గిపోయింది. 100000 సంవత్సరాల కాలంలో నిరంతర శారీరక శ్రమకు అనుకూలించేలా జరిగిన శరీర నిర్మాణం, యంత్ర యుగం వచ్చిందని 200 సంవత్సరాలలో మారిపోదు కదా! వ్యాయామం లేకపోతే శరీరం చెడిపోతుంది. ఇదేమీ బ్రహ్మజ్ఞానం(rocket science) కాదు. వాడకపోతే కారైనా పాడైపోతుంది.

వ్యాయామం అనేక రకాల శారీరక, మానసిక వ్యాధులకు ఔషధం లాగా పని చేస్తుంది. చాలా సందర్భాల్లో మందులకన్నా మెరుగు. అలా అని మందులు మానెయ్యమని కాదు. బరువు తక్కువగా ఉన్న వారు కూడా వ్యాయామం చెయ్యాలి. చెప్పటానికి సులభమైనా వ్యాయామం చేయటం అంత సులభం కాదు. కొంతమందికి మరీ కష్టం.

వ్యాయామం చేయని వారు తరచుగా చెప్పే కారణాలు.

  1. బద్దకం
  2. టైముండదు
  3. ఆఫీసు లేదా పొలం లో పని సరిపోతుంది. వేరే వ్యాయామం అవసరం లేదు.
  4. మోకాళ్ళ నెప్పులు
  5. అలసట, నిస్పృహ, నిరాశ

సరైన నియమాలు, అలవాట్లు ఉంటే వ్యాయామం అంత కష్టంగా ఉండదు. అవేంటో చూద్దాం.

  1. వ్యాయామాన్ని దినచర్యలో భాగంగా చేసుకోవాలి. స్నానం లాగానే. వ్యాయామం చేయని రోజున తిండి కొంత తగ్గించాలని పెట్టుకోవాలి. స్నానం జీవితాంతం చేసినట్లు వ్యాయామం కూడా ఎల్లప్పుడూ చెయ్యాలి.
  2. వ్యాయామానికి మీకు నచ్చిన పని చేయండి. నడవవచ్చును. సైకిల్ తొక్కవచ్చును. ఆటలాడవచ్చును. యోగాభ్యాసం కూడా చేయవచ్చును. వ్యాయామం మీకు ఎంతోకొంత ఉల్లాసాన్ని కలిగించాలి. లేకపోతే ఎల్లకాలం చేయలేరు.
  1. వీలైనప్పుడు మిత్రులతో కలసి చేయటం అలవాటు చేసుకోండి, ఉత్సాహంగా ఉండటానికి.
  1. వారానికి కనీసం 5 రోజులు, రోజుకు కనీసం 30 నిముషాలు వ్యాయామం చెయ్యాలని సిద్ధాంతము. ఎంతో కొంత చేయాలి. ఈ రోజు 5 నిమిషాలే టైముంది అని మానెయ్యకూడదు. ఆ ఐదు నిమిషాల్లోనే వీలైనంత చెయ్యాలి. తక్కువ స్థాయిలో మొదలు పెట్టాలి. క్రమేపీ ఎక్కువ చెయ్యాలి.
  1. వ్యాయామం ఇంట్లోనే చేసుకోవచ్చును. హాల్ లోనూ, లేదా వరండాలోనూ నడవవచ్చును. ఎక్కువగా వ్యాయామం చేసేవాళ్ళు ట్రెడ్మిల్, ఎలిప్టికల్, స్టేషనరీ బైక్ లాంటివి కొనుక్కోవచ్చును.
  1. వాతావరణం బాగా లేదు, సావాసం(company) లేదు లాంటి వంకలతో వ్యాయామానికి నాగాలు పెట్టకూడదు. వాతావరణం బాగులేని రోజున ఇంట్లోనే చేసుకోవాలి.
  1. వ్యాయామం చేసినప్పుడు ఎంతో కొంత చెమట పట్టాలి. గుండె వేగం ఒక మాదిరిగా పెరగాలి. కొద్దిగా ఆయాసం రావాలి. ఎవరి స్థాయిని బట్టి వారు చెయ్యాలి, ఐతే లిమిట్ లోపులోనే. మీ లిమిట్ 100 ఐతే 50 లేదా 60 లెవెల్లోచెయ్యండి. చేస్తున్నకొద్దీ మీ లిమిట్ పెరుగుతూ ఉంటుంది. వ్యాయామం మరీ సులభంగా కూడా ఉండకూడదు.
  2. బరువైన వ్యాయామం అంటే మీ లిమిట్ ని మించి చేయటం వలన ఏమీ మేలు ఉండదు. ఒకోసారి హాని కూడా జరగవచ్చును.
  1. మీ లిమిట్ ఏమిటో మీకు తెలియకపోతే డాక్టర్ ని అడగండి. డాక్టర్ మీకు ట్రెడ్మిల్ టెస్ట్ చేయవచ్చును.
  2. తక్కువ స్థాయిలో వ్యాయామం చేసే వారు వీలయితే రోజుకు రెండు సార్లు చేస్తే మంచిది.
  3. వ్యాయామంలో వైవిధ్యం ఉంటే మంచిది. నడక మంచిదే. నడకతో పాటు ఒకోరోజు ఇతర వ్యాయామాలు అంటే చేతులు నడుము ఎక్సర్సిజులు కూడా చేస్తే మెరుగు. కండరాలను సాగదీసే ఎక్సరసైజులు కూడా వ్యాయామానికి ముందూ, తర్వతా చేస్తే మంచిది. (stretching)
  1. వారమంతా పడుకుని వారానికి సరిపడా వ్యాయామం ఒకే రోజు చేద్దామని అనుకోకూడదు. విరామం ఎక్కువ రోజులు వచ్చినప్పుడు మళ్ళీ నెమ్మదిగా మొదలు పెట్టాలి.
  2. వ్యాయామం వలన కండరాల్లో కాస్త నెప్పి రావటం సహజం. ఈ నెప్పి చేసినకొద్దీ తగ్గుతుంది. నెప్పి ఎక్కువగా ఉంటె 1-2 రోజులు విశ్రాంతి తీసికొన వచ్చును. నెప్పులు ఎక్కువవుతుంటే ముఖ్యంగా కీళ్ల నెప్పులు వస్తుంటే, వ్యాయామం కాస్త తగ్గించాలి.
  1. వ్యాయామం చేయకూడని జబ్బులు అంటూ ఏమీ ఉండవు. ఒకోసారి జబ్బులని బట్టి వ్యాయామంలో మార్పులు చేసుకోవలసిన అవసరం ఉంటుంది. ఉదాహరణకు మోకాళ్ళు నెప్పులు ఉన్నవారు నడక తగ్గించి, కూర్చుని లేదా పడుకుని ఎక్సరసైజులు చేసుకోవచ్చును. యోగాభ్యాసం కూడా చేసుకోవచ్చును.
  1. నాకు ఇంట్లో పని ఎక్కువ, లేదా ఆఫీసులో/పొలంలో పని ఎక్కువ అందుకని వ్యాయామం చేయనక్కరలేదు అనుకోకండి. రోజుకు ఒక గంట ప్రత్యేకించి వ్యాయామానికి కేటాయించాలి. పనిలో చేసే వ్యాయామం మంచిదే. ఐతే ప్రత్యేకించి చేసే వ్యాయామానికి విలువ ఇంకా ఎక్కువ.
  2. కేవలం వ్యాయామం వలన బరువు తగ్గవచ్చని ఆశపడొద్దు. బరువు తగ్గితే మంచిదే. బరువు తగ్గాలంటే వ్యాయామం చేస్తూ, ఆహారాన్ని కూడా నియంత్రించాలి. బరువు తగ్గకపోయినా వ్యాయామం విలువ తగ్గదు.
  1. అలసట,నిరాశ, నిస్పృహ ఉన్నవారికి వ్యాయామం ఇంకా ఎక్కువ అవసరం. వ్యాయామం ఎంతోకొంత మొదలు పెడితే, ఈ సమస్యలను క్రమేపీ అధిగమించవచ్చును. అలసట మరీ ఎక్కువగా ఉంటె, ఒకసారి డాక్టర్ ని సంప్రదించాలి.

సరిగా వ్యాయామం చేస్తే ఆరోగ్యం, ఆయుర్దాయం ఎంతో కొంత పెరగటం ఖాయం. ఖచ్చితంగా ఇంత అని చెప్పటానికి పరిశోధనలు లేవు.

%d bloggers like this: