బంగాళాదుంపలు

బంగాళాదుంపలు చాలా మందికి ఇష్టమైన ఆహారం. ప్రపంచవ్యాప్తంగా అధికంగా తినే కూరగాయల్లో బంగాళాదుంప కూడా ఒకటి. కూరలు, వేపుళ్ళు, చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్… ఇలా ఎన్నో రకాలుగా మనం వీటిని తింటాం.

బంగాళాదుంపల్లో కార్బోహైడ్రేట్లు అధికం.
ఒక పదార్ధాన్ని మనం తిన్న తరువాత ఎంత త్వరగా మన రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుందో ఆ సూచీని glycemic index అంటారు. అయితే ఆ సూచీ మనం ఆ పదార్ధాన్ని ఎంత తింటున్నామన్నది పరిగణనలోకి తీసుకోదు. కాబట్టి ఆహారపదార్ధం ఎంత తింటే ఎంత గ్లూకోస్ పెరుగుతుంది అని తెలుసుకోవడానికి glycemic load (GL) అనే మరొక సూచీ వాడతారు.

GL విలువ –

10 లోపు ఉంటే తక్కువ glycemic load
11 – 19 ఉంటే మధ్యస్థ glycemic load
20 ఆ పైన ఉంటే అధిక glycemic load

భారతదేశంలో సాధారణంగా దొరికే బంగాళాదుంపలకి – 150 గ్రాములు ఒక సెర్వింగ్ అనుకుంటే GL 26 ఉంటుంది.

అయితే ఆశ్చర్యకరంగా 150 గ్రాముల చిలకడదుంప (Sweet Potato) కి GL 19 లోపు మాత్రమే.

మనం సామాన్యంగా అన్నం, రోటీలు వంటివాటితో కలిపి బంగాళా దుంపలు తీసుకుంటాం. అన్నం/రోటీలో ఉన్న కార్బోహైడ్రేట్లు, బంగాళాదుంపలో ఉన్నవీ కలిసి గ్లూకోస్ స్థాయిని బాగా పెంచుతాయి. ఈ అధిక GL ఉన్న ఆహారపదార్ధాలు తరచు తీసుకోవడం Type 2 diabetes కి దారి తీస్తుంది. ఇవే కాక గుండెజబ్బులు, ఊబకాయం వంటి సమస్యలకి కూడా అధిక కార్బోహైడ్రేట్లు కారణం అవుతాయి. చిప్స్, ఫ్రైస్ రూపేణా తీసుకున్నప్పుడు అధికంగా నూనె, సోడియం వచ్చి శరీరంలో చేరుతుంది. ఇవి కూడా గుండెజబ్బులు, రక్తపోటు ఉన్న వారికి చేటు చేస్తాయి.

మరొక కారణం బంగాళాదుంపలలో ఉండే alkaloids.

బంగాళాదుంపలు Solanaceae కుటుంబానికి చెందినవి. ఈ కుటుంబంలోని మొక్కలని nightshades అని కూడా అంటారు. ఈ కుటుంబంలోని మనం తినే కొన్ని కురగాయలకి nightshade vegetables అని పేరు.

ఇవన్నీ nightshade కూరగాయలే. వీటితో పాటు కాప్సికం లాంటివి కూడా.

ఈ nightshade కూరగాయల్లో ఉండే alkaloids శరీరంలో వాపుని పెంచుతాయి అని ఓ వాదన. అయితే దీని మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొంతమందికి ఈ కూరగాయలు అనారోగ్యాన్ని కలిగిస్తే, మరికొందరికి కలిగించవు. అందుకని మీ శరీరానికి ఇవి సరిపడతాయో సరిపడవో చూడాలంటే elimination పద్ధతిలో nightshade కూరగాయలు ఒక మూడు నాలుగు వారాల పాటు తినడం మాని, తరువాత నెమ్మదిగా మొదలు పెట్టాలి. తింటున్నప్పటికన్నా మానేసినప్పుడే బాగుంది అంటే పడలేదనే లెక్క

బంగాళాదుంపలనే తీసుకుంటే, ఉన్న alkaloids లో చాలా వరకూ పైన తొక్కలోనే ఉంటాయి. సాధారణంగా మనం తొక్క తీసేసి తింటాం కాబట్టి అది పెద్ద సమస్య కాదు. అలాగే, కూరగాయలని మనం ఉడకపెట్టి తింటే alkaloids ఇంకా నశిస్తాయి. సామాన్యంగా బంగాళాదుంపలు మనం పచ్చివి తినం కాబట్టి మనకి ఆ సమస్య కూడా ఉండదు. అయితే పచ్చబడిన బంగాళాదుంపలు మాత్రం తినకూడదు. వీటిలో alkaloid శాతం అధికంగా ఉంటుంది.

ఈ కారణాల వల్ల కొంతమంది వైద్యులు బంగాళాదుంపలు తగ్గించమని చెబుతారు. బంగాళా దుంపల్లో అధక కార్బోహైడ్రేట్లు మాత్రమే కాదు శరీరానికి మంచి చేసే విటమిన్లు, మినెరల్స్, పీచు పదార్ధాలు, anti oxidants, resistant starches లాంటివి ఎన్నో ఉంటాయి. తినే పరిమాణం, వండే పద్ధతిని కాస్త గమనించుకుంటే ఆరోగ్యానికి చేటు చేయకుండా మనం బంగాళాదుంపలని ఆస్వాదించచ్చు.

%d bloggers like this: