పినరాయి విజయన్ (1945)
పినరాయి విజయన్ గారు పూర్వపు మద్రాస్ రాష్ట్రంలో ఉన్న మలాబర్ జిల్లా ( ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో ఉన్న కన్నూర్ జిల్లా ) లోని పినరాయి అనే చిన్న కుగ్రామంలో నిరుపేద వస్త్ర కార్మికుల కుటుంబంలో జన్మించారు. థాలసీరి పట్టణంలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆర్థిక శాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశారు. విజయన్ తల్లిదండ్రులు తొలి నుంచి కమ్యూనిస్టు పార్టీల సానుభూతి పరులు , మలాబర్ చేనేత కార్మికుల సంఘం లో కీలకమైన పాత్ర పోషించారు. విజయన్ గారు కూడా తన తల్లిదండ్రుల ప్రభావంతో కమ్యూనిస్టు పార్టీ మీద చిన్నతనంలోనే ఆసక్తి పెంచుకున్నారు. చిన్నతనంలో వారి కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా ఒకవైపు చదువు కుంటానే మరోవైపు కొబ్బరి పీచు సహకార పరిశ్రమలో కార్మికుడిగా పనిచేశారు, కొబ్బరి పీచు పరిశ్రమలో ఏర్పాటు చేసిన కార్మిక సంఘం లో సభ్యుడిగా చేరి సంఘంలో అనతి కాలంలోనే కీలకమైన వ్యక్తి గా ఎదిగారు. డిగ్రీ చదువుతున్న సమయంలో కమ్యూనిస్టు పార్టీల రాష్ట్ర విద్యార్థుల విభాగం కేరళ విద్యార్థుల సమాఖ్య లో చేరిన విజయన్ గారు అనంతర కాలంలో కేరళ రాష్ట్ర యువత సమాఖ్య సంఘం ఏర్పాటు లో కీలకమైన పాత్ర పోషించారు. రాష్ట్ర విద్యార్థులు సంఘం నుంచి కమ్యూనిస్టు పార్టీల జాతీయ విద్యార్థుల విభాగంలో కూడా కీలకమైన భాద్యతలు చేపట్టారు.
విజయన్ లోని కార్యనిర్వహణ నైపుణ్యాలను గుర్తించిన దిగ్గజ కమ్యూనిస్టు పార్టీల నాయకులు ఏ.కె.గోపాలన్, నంబూత్రిపాడ్ గార్లు విజయన్ గారిని కన్నూర్ జిల్లా కమ్యూనిస్టు పార్టీలో కీలకమైన బాధ్యతలు అప్పగించారు. పార్టీలో అంకిత భావంతో కష్టించి పనిచేస్తున్న విజయన్ గారు పార్టీ లో అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్ర సీపీఎం కార్యదర్శిగా ఏకంగా 17 సంవత్సరాలు పనిచేసి కేరళ కమ్యూనిస్టు పార్టీలో చరిత్రలో తన పేరును సువర్ణ అధ్యయనం లిఖించుకున్నారు. అనంతరం సిపిఎం జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికయ్యారు, ప్రస్తుతం కూడా కొనసాగుతున్నారు.
1970, 1977, 1991, 1996 , 2016 మరియు 2021లలో మొత్తం 6 సార్లు కేరళ అసెంబ్లీకి ఎన్నికయ్యారు, 3 సార్లు ఓటమి పాలయ్యారు. 1996 లో ఈ. కె.నాయనర్ మంత్రివర్గంలో రాష్ట్ర సహకార శాఖ మంత్రిగా, ఇంధన శాఖ మంత్రిగా పనిచేశారు. 2016, 2021లలో వరుసగా రెండు సార్లు కేరళ ముఖ్యమంత్రి గా ఎన్నికయ్యారు.
సహకార రంగం మీద మంచి పట్టున్న విజయన్ గారు ఎమ్మెల్యే గా గెలవక ముందే అప్పటి కమ్యూనిస్టు ప్రభుత్వం లో రాష్ట్ర సహకార బ్యాంక్ అధ్యక్షుడు గా పనిచేశారు, ముఖ్యమంత్రి గా భాద్యతలు చేపట్టిన తరువాత రాష్ట్రంలో సహకార రంగానికి పెద్ద పీట వేస్తూ ప్రతి సంవత్సరం రాష్ట్ర బడ్జెట్ లో సహకార రంగానికి ఎక్కువగా నిధులను కేటాయింపులు చేయించేవారు, కేంద్ర ప్రభుత్వం ట్రావెంకర్ రాష్ట్ర బ్యాంక్ ను ఎస్.బి.ఐ బ్యాంక్ లో విలీనం చేసిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం తరపున కేరళ బ్యాంక్ ను స్థాపించారు. రాష్ట్రంలో సహకార రంగంలో పనిచేస్తున్న ప్రభుత్వ, ప్రవేటు పరిశ్రమలకు రాయితీలు ఇచ్చారు.
2016లో జరిగిన ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి , కమ్యూనిస్టు పార్టీ కురువృద్ధుడు వి.ఎస్.అచ్యుతనందన్ గారితో కలిసి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన విజయన్ గారు ముఖ్యమంత్రి గా భాద్యతలు స్వీకరించి రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు స్వీకారం చుట్టి విజయవంతంగా పూర్తి చేశారు. అలాగే, కేరళలో సంభవించిన వరదలు, నిఫా వైరస్ , కరోనా మొదటి దశ వైరస్ వంటి విపత్తులను ధైర్యంగా ఎదుర్కోవడంలో పాలనపరంగా విజయం సాధించిన విజయన్ గారికి రాష్ట్రవ్యాప్తంగా మంచి ఆదరణ లభించింది.
విజయన్ గారు ఆధునిక భావాలు కలిగిన కమ్యూనిస్టు గా పేరుగాంచారు, మార్పు కు వ్యతిరేకులు గా ముద్రపడిన కమ్యూనిస్టు నాయకులతో పోలిస్తే విజయన్ గారి వ్యవహార శైలి భిన్నంగా ఉంటుంది. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర్చుకోవడానికి ముందుటారు, ముఖ్యమంత్రి గా భాద్యతలు స్వీకరించిన తర్వాత ఆయన సామాజిక మాధ్యమాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ యువతకు దగ్గరయ్యేందుకు చేసిన ప్రయత్నాలలో సఫలీకృతం అయ్యారు అందుకు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో యువత అత్యధిక శాతం సీపీఎం పార్టీ వైపే ఉండటం .
2021లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయం సాధించడానికి ఆయన వ్యక్తిగత ప్రతిష్ట చాలా ఉపయోగపడింది , ఎన్నికల సమయంలో కాంగ్రెస్, బీజేపీ వంటి రెండు జాతీయ పార్టీల అగ్రనేతలు ప్రచారం చేసిన విజయన్ గారి నాయకత్వం లో ఎల్.డి.ఎఫ్ కూటమి రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలోనే కూటమికి అత్యంత ఘనవిజయం సాధించి పెట్టిన నేతగా చరిత్ర సృష్టించారు .
కేరళ రాష్ట్రానికి వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి గా భాద్యతలు చేపట్టిన విజయన్ గారు రానున్న రోజుల్లో జాతీయ స్థాయి రాజకీయాల్లో కీలకమైన పాత్ర పోషించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
You must log in to post a comment.