‘నమస్తే యానాం’ పేరుతో రాజకీయ అరంగేట్రం.. సీఎం అభ్యర్థిపై గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ విజయం

పుదుచ్చేరి శాసనసభ ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమి విజయం సాధించింది. బీజేపీ, అన్నాడీఎంకే, ఎన్నార్ కాంగ్రెస్ కూటమి 16 స్థానాల్లోనూ, కాంగ్రెస్ కూటమి 8 చోట్ల, ఇతరులు 6 స్థానాల్లోనూ విజయం సాధించారు. యానాం అసెంబ్లీ ఎన్నికల్లో యువకెరటంలా దూసుకొచ్చిన స్వతంత్ర అభ్యర్థి గొల్లపల్లి శ్రీనివాస్‌ అశోక్‌ అనూహ్య విజయం సాధించారు. ఇక్కడ మాజీ మంత్రి మద్దతుతో పోటీచేసిన సీఎం అభ్యర్థిపైనే అశోక్ గెలుపొందడం విశేషం. పుదుచ్చేరి ఎన్నార్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఎన్‌.రంగసామిపై 655 ఓట్లతో గెలుపొందారు.

ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటానని మల్లాడి కృష్ణారావు ప్రకటించడంతో యానాంలో ఏర్పడిన రాజకీయ లోటును అవకాశంగా మలుచుకున్న శ్రీనివాస్‌ అశోక్‌ తెరపైకి వచ్చారు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబానికి చెందిన విద్యావంతుడైన శ్రీనివాస్ అశోక్ ‘నమస్తే యానాం’ అంటూ ఈ ఏడాది జనవరిలో రాజకీయ ఆరంగేట్రం చేశారు. అన్ని గ్రామాల్లో తిరుగుతూ.. అక్కడవారి కష్టసుఖాలు అడిగి తెలుసుకుంటూ ప్రజలకు దగ్గరయ్యారు. ఆయన గెలుపునకు సోషల్‌ మీడియా కూడా ఉపయోగపడింది.

ఎన్నార్ కాంగ్రెస్ అభ్యర్ధి రంగస్వామికి 16,477 ఓట్ల రాగా.. స్వతంత్ర అభ్యర్థి గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్‌కు 17,132 ఓట్లు వచ్చాయి. లెక్కింపు మొదలైనప్పటి నుంచి గొల్లపల్లి ఆధిక్యం నిలుపుకుంటూ వచ్చారు. ఒక దశలో రంగస్వామి 3వేలకుపైగా ఓట్లు వెనుకబడ్డారు. చివరికు 655 ఓట్లతో అశోక్ విజయం సాధించారు. యానాంలో తిరుగులేని నేతగా ఉన్న మల్లాడికి ఈ అసెంబ్లీ ఎన్నికల పరిణామం రాజకీయంగా గట్టి ఎదురుదెబ్బని ప్రత్యర్థులు అభివర్ణిస్తున్నారు. రంగసామిని యానాం అభ్యర్థిగా మల్లాడి బరిలోకి దింపి ప్రతిష్ఠాత్మకంగా ప్రచారం నిర్వహించారు.

తమిళనేతను తెలుగు గడ్డపై పోటీకి నిలపడం పట్ల చాలామందిలో వ్యతిరేకతకు కారణమైంది. దీంతో యానాంలో సరైన వారెవరూ ఎమ్మెల్యేగా పోటీ చేయడానికే లేరా అంటూ ప్రత్యర్థులు చేసిన ప్రచారం ఫలించింది. మల్లాడికి మంచి పట్టున్న గ్రామాల్లోనూ అశోక్‌కు ఆధిక్యత రావడంతో రంగసామి ఓటమిపాలయ్యారు.

శ్రీనివాస్‌ అశోక్‌ తండ్రి గంగాధర ప్రతాప్‌ 2000 యానాం ఉప ఎన్నికల్లో అప్పటి కాంగ్రెస్‌ సీఎం అభ్యర్థి పి.షణ్ముగంపై బీజేపీ అభ్యర్థఇగా గట్టిపోటీ ఇచ్చారు. ఆ తర్వాత 2001లో ఎమ్మెల్యే ఎన్నికల్లో మల్లాడి కృష్ణారావు చేతిలో ఓటమి పాలయ్యారు. యానాంలో మల్లాడికి ప్రధాన ప్రత్యర్థిగా ప్రజల పక్షాన పోరాడిన గంగాధర ప్రతాప్‌ 2004లో గుండెపోటుతో చనిపోయారు. బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌లో పీజీ డిప్లొమో చేసిన అశోక్ రాజకీయాలపట్ల ఆసక్తితో సేవాకార్యక్రమాలు ప్రారంభించారు. తన తండ్రి మద్దతుదారులు, సన్నిహితుల అండతో ఎన్నికల్లో పోటీచేసి సీఎం అభ్యర్థిపైనే గెలుపొందారు.

List votes polled boothwise

%d bloggers like this:
Available for Amazon Prime