త్రీ పిన్ ప్లగ్‌లోని ఎర్త్ పిన్ పెద్దగా ఎందుకు ఉంటుంది?

ఎర్త్ పిన్ నేరుగా ఉపకరణ యొక్క బయటి భాగం, అంటే వినియోగదారుడు తాకే అవకాశం ఉన్న భాగానికి కలపబడి ఉంటుంది. అలాగే సాకెట్ లోని ఎర్త్ పిన్ కనెక్టర్ ఎర్త్ పిట్ కి కలపబడి ఉంటుంది. ఉపకరణలో పొరపాటున లైవ్ వైర్ వదులు అవ్వడం వల్ల కానీ లేదా మరో కారణంగా కానీ, ఉపకరణ యొక్క లోహపు భాగానికి తగిలితే, ఆ లోహపు భాగాన్ని వినియోగదారుడు తాకినప్పుడు షాక్ తగిలే అవకాశం ఉంటుంది. అందుకే ఈ లోహపు భాగలని ఎర్త్ వైర్ ద్వారా ఎర్త్ పిట్ కి కలిపినట్లైతే, లోహపు భాగంలో పొరపాటున కరెంట్ ప్రవహిస్తే, అది ఎర్త్ వైర్ ద్వారా ఎర్త్ పిట్ కి చేరుకుంటుంది.

ఎర్త్ పిన్ పెద్దగా ఎందుకు ఉంటుంది?

గమనిస్తే ఎర్త్ పిన్ పెద్దగా ఉండడమే కాదు, మిగిలిన రెండు పిన్ ల కన్నా కొంచం పొడుగుగా కూడా ఉంటుంది. ఉపకరణానికి విద్యుత్ సరఫరాని ఇచ్చే ముందే, ఎర్త్ పిన్ ని సాకెట్లోకి పంపించడం ద్వారా ఒకవేళ ఉపకరణపు బయట భాగంలో కరెంట్ ప్రవహిస్తూ ఉంటే, వినియోగదారుడు తాకడానికి ఆస్కారం ఉన్న లోహాభాగాన్ని ఎర్త్ కి కలపబడుతుంది. అలాగే ప్లగ్ సాకెట్ లో నుండి పీకేటప్పుడు మిగిలిన రెండు పిన్ లు బయటకి వచ్చాక మాత్రమే ఎర్త్ పిన్ బయటకి వస్తుంది. ఈ రకమైన ఏర్పాటు కారణంగా ఉపకరణం యొక్క బయట భాగంలో పొరపాటున విద్యుత్ ప్రవహిస్తున్నపటికీ, వినియోగదారుడికి షాక్ నుండి రక్షణ ఉంటుంది.

ఇక ఎర్త్ పిన్ పెద్దగా ఉండడానికి రెండు కారణాలు ఉన్నాయి.

  1. పొరపాటున ఎర్త్ పిన్ ని సాకెట్ లోని లైవ్ రంధ్రంలో పెడితే, ఎర్త్ పిన్ ఉపకరణ యొక్క లోహపుభాగానికి కలిపి ఉంటుంది కనుక అది వినియోగదారున్ని షాక్ కి గురి చేసే ప్రమాదం ఉంది. కాబట్టి సాకెట్ లో ఒకటే పెద్ద రంధ్రం, ప్లగ్ లో ఒకటే పెద్ద పిన్ ఉండేలా డిజైన్ చేయబడింది.
  2. ఎర్తింగ్ కోసం వాడే వాహకం, సాధారణంగా లీకేజీ కరెంట్ ని సమర్థవంతంగా ఎర్త్ చేయాలి కనుక మంచి వాహకతను కలిగి ఉండాలి. అంటే నిరోధకత సాధ్యమైనంత తక్కువగా ఉండాలి.
  R=ρL/A 

నిరోధకత(R), వహాకం యొక్క వైశాల్యానికి(A) విలోమానుపాతంలో ఉంటుంది. వాహకానికి ఎక్కువ వైశాల్యం ఉంటే తక్కువ నిరోధకత ఉండటం వల్ల లీకేజీ కరెంట్ ని సమర్థవంతంగా ఎర్త్ చేయగలుగుతుంది.