విశాఖపట్నం అనేది సముద్ర తీర ప్రాంతం. పైగా బంగాళాఖాతానికి పూర్తిస్థాయి సరిహద్దు ప్రాంతం కూడా. కాబట్టి శత్రువులు లేదా ఆగంతకులు సముద్ర మార్గాన చొరబడకుండా ఉండాలంటే, రక్షణ ఏర్పాట్లు కూడా చాలా అవసరం. ఈ రక్షణ అవసరాలను తీర్చడానికే భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో తూర్పు నావికా దళం అనేది ఏర్పడింది. ఇది భారతదేశపు అది పెద్ద నావికాదళం. భారత నావిక దళాలలో దీనికి ఒక ప్రత్యేక స్థానం ఉంది.
వీరి ప్రధానమైన కర్తవ్యం సముద్ర మార్గాన పహారా కాస్తూ, ఆగంతకులు ఎవరూ ఆ మార్గాన మన దేశ సరిహద్దులలోకి రాకుండా చూడడం. అలాగే ఉగ్ర దాడులను ఎదుర్కోవడం. అందుకోసం నిరంతరం కొన్ని వందల మంది నావికాదళ సైనికులు ఈ ప్రాంతం చుట్టూ సముద్ర మార్గాన పహారా కాస్తూనే ఉంటారు. ఇందుకోసం ఆర్మీ, వైమానిక దళ సహాయం కూడా తీసుకుంటూ ఉంటారు. అలాగే ఆ అంశాలలో కూడా తమ సైనికులకు శిక్షణ ఇస్తుంటారు.
తూర్పు నావికాదళం పరిధిలో ఆంధ్రపదేశ్, ఒడిస్సా, పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలు.. అలాగే అండమాన్, నికోబర్ కూడా దీవులు ఉన్నాయి. అయితే వీటి అన్నింటికి ప్రధాన స్థావరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం మాత్రమే.
1971లో పాకిస్తాన్‌పై యుద్దంలో భారత్ గెలుపు సాధించడంలో తూర్పు నావికా దళం పాత్ర ఎంతో ఉంది. అలాగే ఈ మధ్యకాలంలో విశాఖపట్నంలో కోస్టల్ భద్రతను, పెట్రోలింగ్‌ను పటిష్టపరిచడానికి అధునాతన ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకే నావికా దళానికి చెందిన ఏ ప్రాంతాలలోకి ఇతరులు రావడానికి వీలులేదు. అనుమతి లేకుండా ఎవరైనా అలా ప్రవేశిస్తే, వారు శిక్షార్హులు. అలాగే డ్రోన్ కెమెరాలు కూడా వాడకూడదు.
తూర్పు నావికా దళానికి సంబంధించి ఎన్నో జలాంతర్గాములు, ఓడలు, నౌకలు విశాఖలో ఉన్నాయి. వాటికి సంబంధించిన మరమ్మత్తులు, రిపేర్లు మొదలైనవాటిని నేవల్ డాక్‌యార్డులో చేస్తుంటారు. అలాగే విశాఖపట్నంలో హిందుస్తాన్ షిప్ యార్డు అనే ప్రభుత్వ సంస్థ ఉంది. ఇక్కడ ఇతర నౌకా నిర్మాణాలు కూడా చేస్తుంటారు. ఒకప్పుడు ఇది షిప్పింగ్ శాఖ వారి ఆధ్వర్యంలో నడిచేది. కానీ 2010 లో భద్రతా అంశాలు ఇత్యాది కారణాల వల్ల, దీనికి కూడా భారత రక్షణ శాఖ తమ పరిధిలోకి తీసుకొచ్చేసింది. అలాగే విశాఖపట్నంలో పోర్టు కూడా ఉంది. ఇక్కడ ఇతర దేశాల నుండి, రాష్ట్రాల నుండి కూడా నౌకలు వస్తుంటాయి.
విశాఖపట్నంలోని తూర్పు నావికా దళంలో అనేక బేస్‌లు ఉన్నాయి. అందులో ఐఎన్ఎస్ సర్కార్స్ అనేది లాజిస్టక్స్ మరియు పరిపాలన కేంద్రం. ఇక్కడ నావికాదళ అడ్మినిస్ట్రేటివ్ సిబ్బంది ఉంటారు. అలాగే ఐఎన్ఎస్ డేగా అనేది నేవల్ ఎయిర్ స్టేషన్. ఇక్కడ నుండే నావికా దళ విమానాలు బయలుదేరతాయి. అలాగే ఐఎన్ఎస్ వీరాబాహు అనేది జలాంతర్గాముల కేంద్రం. ఇక ఐఎన్ఎస్ శాతవాహనలో నేవీ ఉద్యోగులకు శిక్షణ ఇస్తుంటారు. అలాగే ఐఎన్ఎస్ కళింగలో మిసైల్స్ అందుబాటులో ఉంటాయి. ఐఎన్ఎస్ ఏకశిలలో మెరైన్ గ్యాస్ టర్బైన్ మెయిన్‌టెనెన్స్ చేస్తుంటారు. ఐఎన్ఎస్ కర్ణలో మెరైన్ కమాండోలు శిక్షణ పొందుతూ ఉంటారు. అలాగే యుద్ధ నౌకలను నడిపే శిక్షణ కేంద్రం కూడా విశాఖలో ఉంది.
You must log in to post a comment.