ఉగాది

Ugadi 2021 Special Story In Telugu By Gumma Prasada Rao - Sakshi

చైత్రశుద్ధ పాడ్యమి అనగా ఉగాది పర్వదినం. కాలగమన సౌధానికి తొలి వాకిలి. ఋతు సంబంధ ప్రథమ ఆరోగ్యకోకిల గానం నూతన సంవత్సరానికి శ్రీకారం. ప్రజల మధ్య పెంపొందించే మమకారం. బహు సాంప్రదాయాలకు సాకార క్రియారూపం. ఆబాలగోపాలం ఆనందంగా చేసుకునే పండుగ ఉగాది. పౌర్ణమిరోజున చంద్రుడు ఏ నక్షత్రంలోఉంటాడో ఆ మాసానికి అదే పేరు ఉంటుంది. చంద్రుడు చిత్తా నక్షత్రంతో కలిసి ఉండటం వలన ఈ మాసావికి చైత్రమాసం అని పేరు.

అన్ని ఋతువులకన్నా విశేషమైన ఋతువు వసంత ఋతువు. ఋతూనాం కుసుమాకరః– ఋతువుల్లో చెట్లు చిగిర్చి పూవులు పూయు వసంత ఋతువును నేనే అని తన ముఖ్య విభూతులు చెప్తూ భగవద్గీతలో శ్రీకృష్ణుడు అన్నాడు. కోకిల పాటలు, సన్నజాజి, మల్లెల పరిమళాలు, చిగురించిన ఆకులతో పచ్చని చెట్లతో ప్రకృతిమాత కొత్త అందాలు సంతరించు కుంటుంది. వసంత ఋతువు చైత్రమాసంతో మొదలవుతుంది. మనిషిని, మనస్సును, బుద్ధిని వికసింపజేసే అహ్లాదభరిత వాతావరణంలో ఉగాది నాడు మనం నూతన సంవత్సరంలో ప్రవేశిస్తాం. 

వసంతుడికి స్వాగతం చెబుతూ తెలుగు లోగిళ్లు జరుపుకునే పండగే ఉగాది.. ఉగాది అచ్చమైన ప్రకృతి పండగ. ఈ రోజు నుంచే తెలుగువారికి కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండగ. చైత్ర శుద్ధ పాడ్యమినే ఉగాదిగా పేర్కొంటారు. ఈ రోజునే బ్రహ్మ సమస్త సృష్టినీ ప్రారంభించాడని చెబుతారు. వైకుంఠనాథుడు మత్స్యావతారాన్ని ధరించి, సోమకుడిని సంహరించి వేదాలను కాపాడింది కూడా ఉగాది రోజునే. శాలివాహనుడు పట్టాభిషిక్తుడైంది కూడా ఉగాదినాడే…

ఉగాది, తెలుగువారు జరుపుకునే పండుగలలో ముఖ్యమయినది. ఈ పండుగ తెలుగు వారికి తెలుగు సంవత్సరము ప్రకారముగా తొలి పండుగ. ఈ పండుగ ప్రతీ సంవత్సరము చైత్ర శుద్ధ పాడ్యమి (అనగా చైత్రమాసములో శుక్ల పక్షము నందు పాడ్యమి తిథి కలిగిన మొదటిరోజు) రోజున వస్తుంది.   ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. ఉగాది రోజున కొత్తగా పనులు ప్రారంభించుట పరిపాటి. ఉదయాన లేచి తలంటి స్నానం చేసి, కొత్త బట్టలు ధరించి, ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు. దేవస్థానములకు వెళ్ళి పూజలు చేయిస్తారు. కొత్త సంవత్సరంలో రాశిఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలసుకొని గ్రహశాంతుల లాంటివి జరిపించుకొని సుఖంగా ఉండటానికి పంచాగశ్రవణాన్ని చేస్తారు.

ఉగాది పండగకు సంబంధించిన ఎన్నో ఐతిహ్యాలు మన పురాణాల్లో కనిపిస్తాయి. ప్రకృతి పరంగా చూస్తే… మోడువారిన చెట్లు చిగురిస్తూ, పూల పరిమళాలతో గుబాళిస్తూ పుడమితల్లిని పులకింపచేసే వసంతరుతువు కూడా చైత్రశుద్ధ పాడ్యమి నుంచే మొదలవుతుంది.

ఉగాదిని కొత్తదనానికి నాందిగా అభివర్ణిస్తారు. ఒక్క తెలుగు సంప్రదాయంలోనే కాకుండా మరాఠీలు గుడి పడ్వా, మలయాళీలు విషు, సిక్కులు వైశాఖీ, బెంగాలీలు పాయ్‌లా బైశాఖ్‌, తమిళులు పుత్తాండు అనే పేర్లతో ఉగాదిని జరుపుకోవడం విశేషం.

షడ్రుచుల సమ్మేళనం ‘త్వామష్ఠ శోక నరాభీష్ట, మధుమాస సముద్భవ నిబామి శోక సంతప్తాం మామశోకం సదాకురు’
అన్న శ్లోకాన్ని పఠిస్తూ ఉగాది పచ్చడి తినాలని చెబుతోంది శాస్త్రం. మధుమాసంలో పుట్టినటువంటి, శోక బాధలను దరిచేరనివ్వకుండా చేసేటటువంటి ఓ నింబ కుసుమమా, నన్ను ఎల్లప్పుడూ శోక రహితుడిగా చెయ్యమని దీని అర్థం. ఈ పండగకు మాత్రమే ప్రత్యేకంగా తినే పదార్థం ఉగాది పచ్చడి.

కొత్త చింత పండు, బెల్లం, మామిడి పిందెలు, వేపపువ్వు, మిరియాలు లేదా కారం లేదా పచ్చిమిర్చి, అరటిపండ్లు… మొదలైన పదార్థాలను ఉపయోగించి ఈ పచ్చడిని తయారుచేస్తారు. ఇది షడ్రుచుల సమ్మేళనం. తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులూ జీవితంలోని బాధ, సంతోషం, ఉత్సాహం, నేర్పు, సహనం, సవాళ్లకు సంకేతాలు. సంవత్సరం పొడవునా ఎదురయ్యే మంచి చెడులను, కష్టసుఖాలనూ ఒకేలా స్వీకరించాలన్న సందేశాన్ని చెప్పకనే చెబుతుందీ ఉగాది పచ్చడి.

ఉగాది రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేవాలి. పెద్దవారితో నువ్వుల నూనెను తలమీద పెట్టించుకుని, నలుగుపిండితో అభ్యంగన స్నానం చేయాలి. తర్వాతకొత్త బట్టలు ధరించి, ఇష్టదైవాన్ని ప్రార్థించాలి. పరగడుపునే షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిని ప్రసాదంగా స్వీకరించాలి. ప్రకృతి మార్పులకు అనుగుణంగా మన శరీరాన్ని సంసిద్ధం చేసే శక్తి ఈ పచ్చడికి ఉందని పురాణాలు చెబుతున్నాయి.

సాయంత్రం వేళ దేవాలయంలో జరిగే పంచాంగ శ్రవణాన్ని తప్పక వినాలని చెబుతారు పెద్దలు. తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే ఈ అయిదు అంగాల కలయికనే పంచాంగం అంటారు. మనకు పదిహేను తిథులు, ఏడు వారాలు, ఇరవై ఏడు నక్షత్రాలు, ఇరవై ఏడు యోగాలు,

పదకొండు కరణాలు ఉన్నాయి. వీటన్నింటి గురించీ పంచాంగం వివరిస్తుంది. వీటితోపాటు నవగ్రహాల సంచారం, వివాహాది శుభకార్యాల ముహూర్తాలూ, ధరలూ, వర్షాలూ, వాణిజ్యం… ఇలా ప్రజలకు అవసరమైన వాటికి అధిపతులు ఎవరూ, అందువల్ల కలిగే లాభనష్టాలు ఏమిటీ వంటి విషయాలతోపాటు దేశ స్థితిగతులను కూడా పంచాంగంలో ప్రస్తావిస్తారు.

ఉగాది పచ్చడి  :   ఉగాదినాడు షడ్రుచుల సమ్మేళనం – తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తింటారు. మానవ జీవితంలో కష్టాలు, కన్నీళ్లు, సంతోషం, బాధ, అవమానాలు అన్ని ఉంటాయి. వీటిన్నంటిని ఒక్కో రుచితో మేళవించారు పెద్దలు. షడ్రుచుల మిళితమైన శ్రేష్ట పదార్ధమే ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడి సేవనం తెలియజెప్పే నిజం. ‘కష్ట సుఖాలు జీవితంలో చవిచూడాలి’. కాబట్టి ఈ పచ్చడి కొరకు చెరకు, అరటి పళ్ళు, మామిడి కాయలు, వేప పువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం మొదలగునవి వాడుతుంటారు.  

This image has an empty alt attribute; its file name is 39ee6-ugaadi.jpg

కావాల్సిన పదార్థాలు: తగినన్ని మామిడి ముక్కలు, 2 టీ స్పూన్ల వేప పువ్వు, 100 గ్రాముల కొత్త చింతపండు, 30 గ్రాముల బెల్లం, టీ స్పూను కారం, తగినంత ఉప్పు, అరటిపండు ముక్కలు   తయారీ విధానం: ముందుగా కొత్త చింతపండుని ఓ గ్లాసు నీళ్లలో వేసి నానబెట్టాలి. ఆ తర్వాత చింతపండు పులుసు పిండి ఓ గిన్నెలో వేయాలి. ఈ పులుసులో సన్నగా తరిగిన మామిడి ముక్కలు, వేప పువ్వు, కారం, ఉప్పు కలపాలి. ఆ తర్వాత దానికి బెల్లం, అరటి పండు ముక్కలు కలిపితే ఉగాది పచ్చడి సిద్ధమమైనట్లే.

https://yanamtakshashila.com/2022/04/02/షడ్రుచుల్లో-దాగున్న-ఆరోగ/

షడ్రుచులు దేనికి సంకేతం అంటే..

  • బెల్లం తీపి – ఆనందానికి సంకేతం 
  • ఉప్పు – జీవితంలో ఉత్సాహమ, రుచికి సంకేతం 
  • వేప పువ్వు – చేదు -బాధకలిగించే అనుభవాలు 
  • చింతపండు – పులుపు – నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులు 
  • పచ్చి మామిడి ముక్కలు – వగరు – కొత్త సవాళ్లు 
  • మిరియాలు – కారం – సహనం కోల్పోయేట్టు చేసే పరిస్థితులు

షడ్రుచుల్లో దాగున్న ఆరోగ్యం!

ఉగాది పచ్చడిలో వాడే ఆరు రుచుల్లో.. మధుర రసం అంటే చెరకు, అరటిపండు, బెల్లం; ఆమ్ల రసంగా.. చింతపండు; లవణ రసంగా.. ఉప్పు; కటు రుచిగా.. పచ్చిమిర్చి/కారం; తిక్తరుచి (చేదు)గా.. వేప పువ్వు; కషాయం (వగరు) రుచిగా.. మామిడి పిందెలను వాడతాం. వీటిని ఎక్కువ, తక్కువ పరిమాణంలో నిత్యం ఆహారం ద్వారా తీసుకుంటూ ఉండాలి. అప్పుడే ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చు.

వేప పువ్వే ప్రధానం..

వసంత రుతువు, చైత్రమాసం, పాడ్యమితో మొదలయ్యే తెలుగు సంవత్సరాది రోజున ఆరు రుచుల కలయికతో చేసే ఉగాది పచ్చడి ప్రత్యేకమైంది. ఇందులో వేపపువ్వు పాత్ర కీలకం. ఈ కాలంలో శరీరంలో పెరిగే కఫ దోషాన్ని వేప పువ్వు తగ్గిస్తుంది. మలినాల్ని పోగొట్టి, రక్తాన్ని శుద్ధి చేస్తుంది. దీనివల్ల కడుపులో పురుగులు నశిస్తాయి.

1. తీపి

మానసిక ఉల్లాసానికి అతి ముఖ్యమైంది తీపి. అలాగని చక్కెరతో తయారయ్యే స్వీట్లు, కేకులు, చాక్లెట్లకు బదులుగా.. బియ్యం, గోధుమ వంటి ధాన్యాలు, పండ్లు, కూరగాయలు మొదలైనవి తీసుకోవాలి. శరీరానికి అవసరమైన చక్కెర(పిండి పదార్థాలు) వీటి నుంచి అందుతుంది. ఇది శరీరంలోని కణాలు నశించిపోకుండా, కొత్త కణాల పెరుగుదలకు.. వాతం, పిత్తం పెరగనివ్వకుండా అదుపులో ఉంచుతుంది. డైటింగ్‌ పేరుతో వీటిని ఆహారంలో తీసుకోకుండా ఉండడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. అందుకే తీపిని పరిమితంగా తీసుకుంటే మంచిదన్న విషయం గుర్తుంచుకోవాలి.

2. పులుపు

ఈ రుచి ఆహారం జీర్ణం కావడానికి, మలబద్ధకం లేకుండా ఉండడానికి, మానసిక ఉల్లాసానికి ఉపయోగపడుతుంది. దీన్ని తక్కువగా తీసుకోవాలి. ఈ రుచిని ఆహారంలో చేర్చుకోకపోతే జీర్ణశక్తి దెబ్బతింటుంది. అలాగే ఎక్కువగా తీసుకున్నా కూడా రక్తంపై ప్రతికూల ప్రభావం పడి.. పలు అనారోగ్యాలకు దారి తీస్తుంది.

3. ఉప్పు

శరీరానికి కావాల్సిన ఖనిజ లవణాలను ఉప్పు అందిస్తుంది. ఆకలి, జీర్ణశక్తిని పెంచుతుంది. అయితే దీన్ని కొద్ది పరిమాణంలోనే తీసుకోవాలి. ఖనిజ లవణాలు మనం వాడే ఉప్పు నుంచే కాకుండా కాయగూరలు, పండ్ల నుంచి కూడా అందుతాయి. ఉప్పును ఎక్కువగా వినియోగించే ఊరగాయలు, చిప్స్‌, నిల్వ ఉంచే ఆహార పదార్థాలు, రసాయనాలు చేర్చిన వాటిని ఎక్కువగా తీసుకుంటే మూత్రపిండాలకు హాని కలుగుతుంది. చర్మం ముడతలు పడి వృద్ధాప్య ఛాయలు త్వరగా వస్తాయి. కీళ్ల వాతం, గ్యాస్ట్రిక్‌.. వంటి సమస్యలు దరిచేరతాయి.

4. కారం

ఉత్తేజాన్నిచ్చి, శరీరంలో వేడిని పుట్టిస్తుంది కారం. ఇది జీర్ణశక్తిని పెంచుతుంది. దీనివల్ల చెమట ఎక్కువగా పడుతుంది. బరువు తగ్గడానికి తోడ్పడుతుంది. అయితే దీన్ని కూడా కొద్ది పరిమాణంలోనే తీసుకోవాలి. లేదంటే కడుపులో మంట, పిత్త సంబంధిత వ్యాధులు వస్తాయి. శరీరం బలహీనమవుతుంది. కోపం పెరుగుతుంది.

5. చేదు

దీన్ని కొద్దిగానే తీసుకోవాలి. ఇది రక్తాన్ని శుద్ధి చేసి, మలినాలను బయటికి పంపుతుంది. అధిక బరువును తగ్గిస్తుంది. వేప, మెంతులు, గోరుచిక్కుడు.. వంటివి చేదు రుచికి ఉదాహరణలు. చేదును ఎక్కువగా తింటే శరీరం ఎండిపోయినట్లుగా మారి, బలహీనమవుతుంది. బాధ, దిగులు ఎక్కువవుతాయి.

6. వగరు

వగరు కూడా ఆహారంలో మితంగా ఉండేలా చూసుకోవాలి. రక్తస్రావం ఎక్కువ కాకుండా, అలాగే చెమట అధికంగా పట్టకుండా, శరీరం దృఢంగా ఉండడానికి ఇది అవసరం. గాయాలు మాని, మంట తగ్గడానికి ఈ వగరు రుచి ఉన్న పదార్థాలు తోడ్పడతాయి. అయితే అతిగా తీసుకుంటే వాత వ్యాధులు, పేగుల్లో సమస్యలు వస్తాయి. పలు మానసిక సమస్యలూ ఎక్కువవుతాయి.

%d bloggers like this: