మైసూర్ పాక్ అనేది 1935 లో మొదటిసారి తయారు చేయబడిందిని ఆహార చరిత్రకారులు చెబుతారు. ఇలా వంద సంవత్సరాలు కూడా పూర్తి కాని మైసూర్ పాక్, దక్షిణాది తీపి పదార్థాలలో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకొంది. గట్టిగా, మెత్తగా, గుల్లగా,, జీడి పప్పు, మాల్ట్, క్యారట్ ఇలా ఎన్నో రకాలు మైసూర్ పాక్ లో.
చేయడానికి తేలిక, పెద్ద సమయమూ పట్టదు, ప్రత్యేకమైన వస్తుసామాగ్రీ అవసరంలేదు దీని తయారీలో. పైగా ఎలా వచ్చినా తినడానికీ ఎటువంటి ఇబ్బందీ వుండదు.
మైసూర్ అంటే అందరికీ తెలిసిందే. అక్కడి రాజుగారి దసరా ఉత్సవాలు విశ్వవిఖ్యాతం. పాకం అంటే చక్కెర/బెల్లంతో నీటిని కలిపి ఒక నిర్ధిష్టమైన చిక్కదనం తీసుకు రావడం. దీని తయారీ వెనుక మైసూరు రాజుగారి పాకశాల వుంది; కనుకనే మైసూర్ పాక్ అనే పేరు తెచ్చుకొంది. అసలు విషయానికి వెడితే, 4వ కృష్ణరాజ ఉడియార్ మైసూరు సంస్థానాధిపతిగా వున్న రోజులలో ఆయన ఆస్ఖానంలో పాకశాలాధిపతిగా కాకాసుర మాదప్ప వుండేవాడు. ఆయన తీపి పదార్థాల తయారీకి పేరుగాంచినవాడు. 1935 వ సంవత్సరంలో ఒక రోజు మాదప్ప శనగపిండి, చక్కెర మరియు నెయ్యిలను కలిపి ఒక కొత్త తీపి పదార్థాన్ని ప్రయోగంగా చేసాడు. చల్లారిన ఆ పదార్థం గట్టి పడి కేక్ లాగా తయారవగా, దానిని రాజుగారికి రుచి కొరకు అందించగా ఆది ఆయనకు విపరీతంగా నచ్చడంకో, మైసూరు పాక / మైసూర్ పాకం/ మైసూర్ పాక్ గా రూపు దిద్దుకొంది.
రాజుగారు తానేకాక ప్రజలూ ఆ తీపిని రుచి చూడాలని మాదప్పకి దానిని అమ్మేందుకు దుకాణం తెరవమని చెప్పారట. గురు స్వీట్ మార్ట్ అనే పేరుతో ఆ దురాణం మైసూరులో ఇప్పటికీ ఆయన వారసుల ద్వారా నడపబడుతున్నది. మైసూర్ పాక్ తయారీకి మాదప్ప విధానాన్నే ఇప్పటికీ అనుసరిస్తున్నరట అక్కడ.
మైసూర్ పాక్ తయారీ: ముఖ్యంగా మూడు పదార్థాలు కావాలి. శనగపిండి, చక్కెర, నెయ్యి (కాదంటే డాల్డానో, రీఫైన్డ్ నూనో లేక అన్నటినీ కలుపుకొని అయినా), 1:2:3 నిష్పత్తిలో తీసుకోవాలి. చక్కెర, నెయ్యి మరీ ఎక్కువనుకొంటే కొంచంగా తగ్గించుకోవచ్చు. మరీ తగ్గితే రుచి బాగుండక పోవచ్చు.
శనగపిండి కావాలంటే పచ్చి వాసన పోయేదాకా సన్న సెగ మీద వేపుకోవాలి. తరువాత సరిపోయేన్ని నీళ్ళు పోసుకొని (తక్కువయితే పాకం చెడే ప్రమాదం వుంది లేక ఎక్కువయితే పాకం వచ్చే దానికి సమయం ఎక్కవ పట్టవచ్చు)పంచదారవేసి వేడి చేయండి. పక్కనే ఇంకో గిన్నెలో నేతిని కూడా బాగా మరగబెట్టాలి. మరిగే నేతిని పాకంలో వేయడం వలన మైసూర్ పాక్ గుల్లగా వస్తుంది. చక్కెర పాకం తీగలాగా వచ్చినప్పుడు శనగపిండిని వుండకట్టకుండా కలుపుతూ పాకంలో వేసుకోవాలి. తరువాత మధ్యమధ్య మరగ కాచిన నెయ్యిని పోసుకోంటూ కలుపుకోవాలి. నెయ్యి పోసినప్పుడు బాగా పొంగుతుంది. పొంగు తగ్గేదాకా కలిపి, మరలా నెయ్యి పోసి కలుపుతూ వుండాలి. పాకం గట్టి పడుకుందనిపించేలోగా మిగతా నెయ్యి మొత్తం పోసి కలిపి, మందుగా నెయ్యి పూసి వుంచుకొన్న పళ్ళం లోకి ఈ మిశ్రమాన్ని పోసి ఐదు నిమిషాలు చల్లార్తి గట్టి పడిన తరువాత మనకు నచ్చిన ఆకారంలో కోసుకొంటే మైసూర్ పాక్ తయ్యారు. వేడిగా తింటే ఒక రుచిలో వుండే మైసూర్ పాక్ చల్లారిన తరువాత ఇంకో రుచిలో వుంటుంది. ఇలా చేసుకొన్న మైసూర్ పాక్ వారం పది రోజుల దాకా నిలువ వుంటుంది.
సుమారు 45-50 గ్రాముల మైసూర్ పాక్ లో 195 కేలరీలు, 10 గ్రాముల కొవ్వు. వుంటాయి, కాబట్టి రుచిగా వుందని అదే పనిగా తినేయకండి. అది వచ్చింది రాజుగారి భోజనశాల నుంచనేది గుర్తుంచుకోవాలి.
You must log in to post a comment.