కందిపప్పు పచ్చడి – తయారీవిధానం

కావలసిన దినుసులు:

కందిపప్పు-ఒక కప్పు

ఎండు మిర్చి -10 నుంచి 12

చింతపండు నానపెట్టి -చిన్ననిమ్మ సైజు ముద్ద

ధనియాలు-ఒక స్పూను

వెల్లుల్లి -6-7

ఉల్లిపాయ -ఒకటి

ఆవాలు,జీలకర్ర,మినప్పప్పు -అర స్పూను (తిరగమాత కు )

ఇంగువ,పసుపు చిటికెడు నుంచి మీ ఓపిక వరకు

తయారీవిధానం :స్టవ్ వెలిగించుకుని తక్కువ మంట లో ధనియాలు,జీలకర్ర నూనే లో దోరగా వేయించుకుని ఆ తర్వాత ఎండుమిర్చి వేసి కొద్దిగా వేయించి,ఆపైన వెల్లుల్లి వేసి వేగాక స్టవ్ ఆపి ఈ మిశ్రమాన్ని చల్లార్చాలి. బాగా కడిగి ఆరబెట్టిన కందిపప్పును ఒక స్పూన్ నూనె లో మీడియం మంటలో, మంచి సువాసన వచ్చి, బంగారు రంగులోకి మారే వరకు వేయించి స్టవ్ ఆపి పప్పు వేడి తగ్గే దాకా చర్చాలి. ఇప్పుడు ఈ రెండు మిశ్రమాల్ని మిక్సీ లో వేసి కొద్దిగా ఉప్పు మీరుచికి తగినంత (అన్నిట్లోకి పలాయన వాదం ఇక్కడే ఇది ఎవ్వరు చెప్పరు కాబట్టి సరిగా రాపోతే మీ ఖర్మ అంతే కాని చెప్పిన వాడు బాధ్య్డుడు కాదు.ఇన్వెస్ట్ మెంట్స్ అర్ సబ్జెక్టేడ్ టు … అని స్పీడు గా చదివే అడ్వర్టైస్ మెంట్ లాగా )వేసి బరకగా అయెంత వరకు తిప్పాలి.మిక్సి మూత తీసి ఇంతకూ ముందే తడిపి ఉంచిన చింతపండు (వేన్నీళ్ళ లో తడిపితే బాగా మెత్త పడితే రసం లో పులుపు బాగుంటుంది)రసాన్ని తొలికెలు రాకుండా పిండి ,అవసరాన్ని బట్టి నీటిని చేర్చి మరల మిక్సి వేయాలి..పైన చెప్పినట్లు ముద్దగా /జారుడుగా చేసుకోవాలి.మరీ మెత్తగా పిండిలా పట్టటం వల్ల రుచి పోతుంది.కొంచెం నలిగి నలగని రకమైతే అన్నం లోకి రుచి బాగుంటుంది.మెత్తటి పచ్చడి టిఫిన్స్ లోకి బెటర్ .కొద్దిగా రుచి చూసి ఉప్పు ,పులుపు లను సరిచేయండి .

చివరగా బాణలి లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర చిటపటలాడే వరకు వేడిచేసి ,కరివేపాకు,వెల్లుల్లి,పసుపు,ఇంగువ దఫాల వారీగా చేర్చండి.కరివేపాకు మాడేలోగా బాగా కలియబెట్టి రెడీ గా ఉన్న మిక్సి లోని కంది పచ్చడి మాతృక ని ఇందులో వేసి బాగా కలియ తిప్పండి. కందిపప్పును,జీలకర్ర,ధనియా,మిర్చి కలిపి వేయించుకున్న దాని కంటే ఇలా విడివిడిగా వేయించుకున్న పధ్ధతి లో రుచి ఇంకో అంతస్తు ఎక్కువే మరి.(next level).

వేడి అన్నం లోకి నెయ్యి కాంబినేషన్ తో ఇదొక అద్భుతమైన అధరువు. భోజనం దీంతోనే మొదలు పెట్టటమే కాదండోయ్ ముగించే ముందు పెరుగన్నం లోకి కూడా కిక్కు నిచ్చే అలవాటు దీని కున్న మరి సుగుణం . దీన్లో పాలకూర కలిపి కొందరు, కొత్తిమీర కలిపి కొందరు ,కొత్త పుంతలు తొక్కారు.

%d bloggers like this: