శాస్త్రంలో సందిగ్ధతకి తావు లేదు. ఆధునిక విజ్ఞాన శాస్త్రంలో మనం ముఖ్యంగా చేసే పని “పేర్లు పెట్టడం.” అనగా, మన అనుభవ పరిధి లోకి వచ్చిన దృగ్విషయాలకి నిర్ద్వందంగా ఉండేటట్లు పేర్లు పెట్టడం. ఇప్పుడు మనం గాలివాన, తుపాను, టైడల్ వేవ్, సునామీ, ఉప్పెన అన్న పేర్లకి నిర్ధిష్టమైన అర్థాలు నిర్దేశిద్దాం.
గాలివాన, తుపాను, చక్రవాతం
గాలితో వచ్చే వాన గాలివాన (storm or windstorm). ఈ గాలి వేగం ఒక హద్దు (గంటకి 75 మైళ్లు లేదా 120 కిలోమీటర్లు) మీరి ఉంటే అది తుపాను. హిందూ మహాసముద్రంలో పుట్టే తుపానులని “సైక్లోనులు” (cyclones) అంటారు. అట్లాంటిక్ మహాసముద్రంలో పుట్టే తుపానులని “హరికేన్” (hurricane) అనిన్నీ, పసిఫిక్ మహాసముద్రంలో – అంతర్జాతీయ తేదీ రేఖకి తూర్పున – పుట్టేవాటిని “టైఫూన్” (typhoon) అనిన్నీ అంటారు. అనగా, మౌలికంగా ఈ మూడు మాటల అర్థాలలోను తేడా లేదు. ఒకొక్క చోట ఒకొక్క మాటని వాడుతున్నారు. (బొమ్మ చుడండి.)
బొమ్మ: తుపానుకి రకరకాల పేర్లు
తుపానులలో వీచే గాలి జోరు ఒక హద్దు (గంటకి 40 మైళ్లు లేదా 65 కిమీ) దాటితే దానికి పేరు పెడతారు. అంటే, అన్ని గాలివానలూ తుపానులు కావు, అన్ని తుపానులకీ పేర్లు పెట్టరు.
కొన్ని చోట్ల వాన ఉన్నా లేకపోయినా కేవలం సుడిగాలి అతి వేగంతో తిరుగుతూ వస్తుంది. గరాటు ఆకారంలో ఉన్న ఆ సుడిగాలి అడుగు భాగం భూమిని తాకుతూ, పై భాగం మేఘాలని తాకుతూ ఉంటుంది. ఆ సుడిగాలి వేగం ఒక హద్దు (సుమారుగా గంటకి 40 మైళ్లు లేదా 65 కిమీ) దాటినప్పుడు దానిని చక్రవాతం (tornado) అంటారు (దిగువ బొమ్మ చూడండి). చక్రవాతానికీ తుపానుకీ ఒక ఉమ్మడి లక్షణం ఉంది; రెండింటి మధ్య ఒక అల్ప పీడన ద్రోణి (low pressure trough) ఉంటుంది.
బొమ్మ: బొమ్మలో ఎడమ పక్క తుపాను, కుడి పక్క చక్రవాతం
సాధారణంగా తుపాను (cyclone) వచ్చినప్పుడు ఆ గాలి తాకిడికి సముద్రంలో పెద్ద కెరటాలు లేస్తాయి. ఈ కెరటాల వల్ల తీర ప్రాంతాలలో ముంపు కలుగుతుంది: ఈ కెరటాలు భూమి లోపుకి ఎక్కువగా చొచ్చుకుని రావు. గాలివాన, తుపానుల వల్ల కలిగే నష్టం ముఖ్యంగా గాలి వల్ల, కొంత వరకు వాన వల్ల; సముద్రపు కెరటాల వల్ల కాదు. హుద్ హుద్ వల్ల విశాఖ ప్రాంతాలకి కలిగిన నష్టం ఇటువంటిదే.
అటు పోట్లు (టైడ్స్)
గాలి వల్ల సముద్రంలో కలిగే చలనం ఒక రకం అయితే సూర్య చంద్రుల ఆకర్షణ వల్ల మరొక రకం చలనం కలుగుతుంది. మనం బీచికి షికారుకి వెళ్లినప్పుడు ఈ రకం చలనం కనిపించదు. కాని సముద్రంలో ప్రయాణం చేసే పడవలకి ఇది ముఖ్యం. ఇంగ్లీషులో ఈ రకం చలనాన్ని టైడ్స్ (tides) అంటారు. టైడ్స్ అంటే సముద్రంలో వచ్చే ఆటుపోటులు. ఇవి కెరటాలు కావు; కెరటాలలా జోరుగా వచ్చి ఒడ్డుకి కొట్టుకోవు. టైడ్ అంటే ఒక రకమైన “పొంగు.” సముద్రం ఇలా పొంగినప్పుడు సముద్ర మట్టం అంతా పైకి లేస్తుంది – పాలు పొంగినట్లు. ఇలా సముద్రం పొంగినప్పుడు దానిని తెలుగులో “పోటు” అంటాం, ఇంగ్లీషులో, ఏకవచనంలో, “టైడ్” (tide) అని కానీ, “ఫ్లో” (flow) అని కాని అంటాం. పుట్టుట గిట్టుట కొరకే అన్నట్లు పైకి లేచిన పొంగు పడి, కిందకి దిగాలి. అలా సముద్ర మట్టం తగ్గడాన్ని “ఆటు” అని కాని “తీత” అని కాని తెలుగులోనూ, “ఎబ్” (ebb) అని ఇంగ్లీషులోనూ అంటారు. అందుకనే ebb and flow అనే పదబంధాన్ని ఆటుపోట్లు అని తెలిగించవచ్చు.
“సముద్రం పొంగుతోంది” అంటే సముద్రపు నీటి మట్టం పైకి లేస్తోంది అని అర్థం. పొంగు అంటే జోరుగా కాకుండా నెమ్మదిగా సముద్రమట్టం లేవడం; భూమి మీద ఉన్న మన సముద్రం రోజుకి రెండు సార్లు లేస్తుంది (పొంగుతుంది). లేచిన మట్టం మళ్లా తరుగుతుంది. ఈ ఆటుపోట్లు ఏ వేళప్పుడు వస్తాయో లెక్క కట్టి చెప్పవచ్చు. ఈ సమాచారాన్ని వాడుకుని రేవులోకి పడవలు ఎప్పుడు వస్తే సదుపాయంగా ఉంటుందో నావికులు నిర్ణయిస్తారు. కనుక సముద్రంలో వచ్చే ఆటుపోట్లు ప్రమాదం కాదు, మనకి ఎంతో ఉపయోగం.
ఆటుపోట్ల వల్ల సముద్రమట్టం లేచినప్పుడు సముద్రం ముందుకి వస్తుంది, పడినప్పుడు వెనక్కి వెళుతుంది. ఇలా ఎంత ముందుకి వస్తుంది, ఎంత వెనక్కి వెళుతుంది అనేది ఆ ప్రదేశం యొక్క భౌగోళిక అమరిక మీద కొంతా, ఆ రోజు పౌర్ణమా, అమావాశ్యా, గ్రహణమా అనే ఖగోళ పరిస్థితుల మీద కొంతా ఆధారపడి ఉంటుంది. ఈ రకం కదలికని ఉపయోగించుకుని విద్యుత్తుని పుట్టించవచ్చు. ముఖ్యంగా గుర్తు పెట్టుకోవలసినది ఏమిటంటే ఈ ఆటుపోట్లు అకస్మాత్తుగా జరిగే సంఘటనలు కావు; వీటి రాకపోకలని మనం లెక్క కట్టి చెప్పవచ్చు.
ఉప్పెన (టైడల్ వేవ్)
1960 దశకంలో, అమెరికాలో “టైడల్ వేవ్” అన్న మాటే వాడుకలో ఉండేది. మొదటి సారి సునామీ అన్న మాట పరిశోధన పత్రాలలో 1976 లో చూసేను. జపానీ భాషలో సునామీ అంటే “రేవులని ముంచేసే పెద్ద కెరటం” అని అర్థం. మనకి ఇంగ్లీషు మాటలు వాడటం అంటే ఎంత వ్యామోహమో అలాగే ఇంగ్లీషు మాతృభాషగా ఉన్న వాళ్లకి విదేశీ మాటల మీద మోజు. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత జపానుకీ అమెరికాకి సత్సంబంధాలు, రాకపోకలు పెరగటంతో జపానీతో పరిచయం పెరిగి ఈ “సునామీ” ఇంగ్లీషులో ప్రవేశించడంతో అప్పటివరకు వాడుకలో ఉన్న “టైడల్ వేవ్” కి కొత్తగా వచ్చిన సునామీకి మధ్య తేడా తెలియక కొంత తికమకకి దారి తీసింది.
ఉప్పెన అంటే సముద్రం పోటు పెడుతూన్న సమయంలో తుపాను కారణంగా వచ్చిన ముంపు అని నా నిర్వచనం. బందరు, దివిసీమ – ఈ రెండూ – సముద్రమట్టంలో ఉన్న ప్రాంతాలు కాబట్టి అక్కడ సముద్రపు నీరు లోపలికి చొచ్చుకు రావడానికి అవకాశం ఎక్కువ. ఈ రకం ముంపుని ఇంగ్లీషులో “టైడల్ వేవ్” అంటారు. ఎందుకుట? సముద్రపు పోటు (tides), తుపానువల్ల వచ్చే కెరటాలు (waves) కలిసిపోయాయి కనుక! ఇలా ఆలోచిస్తే టైడల్ వేవ్ అన్న ఇంగ్లీషు మాటకి ఉప్పెన సమానార్థకమైన తెలుగు మాట – అని నా అభిప్రాయం. అనగా, సముద్రానికి పోటు వచ్చే తరుణంలోనే తుపాను కూడా వస్తే ఆ రెండింటి ప్రభావాన్ని ఉప్పెన (“టైడల్ వేవ్”) అంటారు. “అసలే కోతి, కల్లు తాగింది, నిప్పు తొక్కింది” అన్న సామెతలా పోటుతో పైకి లేచిన సముద్రం వేగంగా వీచే గాలి తాకిడికి భూమి మీదకి చొచ్చుకు వచ్చినప్పుడు గాలి, వానతో పాటు ముంపు కూడా వస్తుంది. ఈ పరిస్థితిని “ఉప్పెన” అని తెలుగు లోనూ, “టైడల్ వేవ్” అని ఇంగ్లీషులోనూ అనొచ్చు.
సునామీ
సునామీ అన్న మాట అజంతం కనుక తెలుగులో తేలికగా ఇమిడిపోతుంది. అందుకని దీనిని యథాతథంగా తెలుగులోకి దింపేసుంటే నాకు అభ్యంతరం లేదు. సముద్ర గర్భంలో, ఎక్కడో, భూమి కంపించడం వల్ల కడలి అడుగున ఉన్న భూమి కదలి పోయిన సందర్భంలో, పరిస్థితులు అనుకూలిస్తే ఒక మహత్తర కెరటం పుట్టుకొచ్చి అది మహా వేగంతో ఒడ్డుని ఢీకొంటుంది. అదీ సునామీ అంటే! అనగా, ఈ మహత్తర కెరటం గాలి వల్ల పుట్టినది కాదు. సునామీ ఒక ఊరికో, ఒక ప్రాంతానికో పరిమితం కాదు; సునామీ వల్ల భౌగోళికంగా చాల ప్రాంతాలు దెబ్బ తింటాయి. సముద్రపు ఆటుపోట్లకీ సునామీకి సంబంధం లేదు.
You must log in to post a comment.