త్యం స్టాక్ మార్కెట్లను అధ్యయనం చేసేవారు, అందులో పెట్టుబడులు పెట్టేవారు, క్రయవిక్రయాలు జరిపేవారికి ఐపీఓ అనే పదం కొత్తేమీ కాదు. ‘ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్’ అనేదానికి సంక్షిప్త రూపమే ఐపీఓ. వ్యాపార సంస్థలు మూలధన సమీకరణ, వ్యాపార విస్తరణ వంటి అవసరాల కోసం నిధులు సేకరించడానికి ఎంచుకునే మార్గంలో భాగంగా మొట్టమొదటిసారి స్టాక్ మార్కెట్‌లో నమోదవడమే ఈ ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్. ఈ విధానంలో ప్రజలకు (డీమ్యాట్ ఖాతాలు ఉండి దరఖాస్తు చేసుకున్నవారికి) తమ సంస్థ షేర్లను విక్రయించడం ద్వారా నిధులు సమీకరిస్తారు. కాబట్టి దీన్ని పబ్లిక్ ఆఫర్ అంటారు.
సాధారణంగా ఐపీఓ షేర్ ధర నిర్ణయం రెండు పద్ధతుల్లో ఉంటుంది. మొదటిది బుక్ బిల్డింగ్ పద్ధతి. ఇందులో ఐపీఓకు వచ్చిన సంస్థకు చెందిన షేర్ ధరను నిర్ణీత వ్యవధిలో నిర్ణయిస్తారు. అంటే కనిష్ఠ, గరిష్ఠ ధర ఉంటుందన్నమాట. దరఖాస్తు చేసుకునేవారు ఆ రేంజ్‌లోనే కోట్ చేయాలి. రెండోది ఫిక్స్‌డ్ ప్రైస్ పద్ధతి.. ఈ విధానంలో ముందే ధరను కచ్చితంగా నిర్ణయిస్తారు. కంపెనీ తన ఆఫర్ డాక్యుమెంట్‌లో ఈ ధర, కనీసం ఎన్ని షేర్లు కొనాలి.. కనీసం ఎంత పెట్టుబడి పెట్టాలి.. వంటి వివరాలన్నీ స్పష్టం చేస్తుంది. దాని ప్రకారం దరఖాస్తు చేసుకున్న తరువాత డిమాండ్‌ను అనుసరించి కేటాయింపులు చేస్తుంది.
ఐపీఓ కావాలనుకున్నవారు దరఖాస్తు చేసుకోవాలంటే డీమ్యాట్ ఖాతా తప్పనిసరిగా ఉండాలి. డీమ్యాట్ ఖాతా ఉన్నవారు ఐపీఓ ప్రకటించిన సంస్థ వెల్లడించిన తేదీలలో తమ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ ట్రేడింగ్ ఖాతా ద్వారా కానీ ఆ ఐపీఓకు దరఖాస్తు చేసుకోవచ్చు. నెట్ బ్యాంకింగ్ ద్వారా దరఖాస్తు చేసుకున్నప్పుడు ఐపీఓ దరఖాస్తు ప్రకారం ఎంత మొత్తం పెట్టుబడికి నిర్దేశించారో అదంతా మీ ఖాతాలో బ్లాక్ అవుతుంది. ఐపీఓలో మీకు కేటాయించిన షేర్లను బట్టి అందులో మినహాయించుకుని మిగతాది ఖాతాలో రిలీజ్ చేస్తారు. అసలు కేటాయింపు లేకపోతే మొత్తం డబ్బు రిలీజ్ అవుతుంది. అంటే ఇతర లావాదేవీలకు ఆ డబ్బు ఎప్పటిలా అందుబాటులోకి వస్తుంది.
షేర్ల కేటాయింపు లాటరీ పద్ధతిలో జరుగుతుంది. కాబట్టి దరఖాస్తు చేసుకున్నవారందరికీ షేర్లు రాకపోవచ్చు. సంస్థ ఐపీఓకు వచ్చినప్పుడే కనీస షేర్ల సంఖ్యను వెల్లడిస్తుంది.. దాన్నే లాట్ అంటారు. ఆ లాట్ కంటే తక్కువ షేర్లు కోరుతూ దరఖాస్తు చేస్తే ఆ దరఖాస్తు తిరస్కరిస్తారు. అలాగే లాట్ ప్రకారమే దరఖాస్తు చేసినా ఒక్కోసారి కోరుకున్నన్ని షేర్లు కేటాయించకపోవచ్చు. మొత్తం ఎన్ని షేర్లు అందుబాటులో ఉన్నాయి.. ఎన్ని బిడ్‌లు దాఖలయ్యాయి.. అనేదాన్ని బట్టి షేర్ల కేటాయింపు ఉంటుంది. సంస్థ కేటాయించిన ప్రకారం ఇష్యూ ముగిసినప్పటి నుంచి 5 రోజుల్లోగా మదుపరుల డీమ్యాట్ ఖాతాలోకి షేర్లు జమ అవుతాయి.
షేర్ల జారీ విషయంలో ఏవైనా పొరపాట్లు జరిగినా, డబ్బులు రీఫండ్ కావడంలో సమస్యలు ఏర్పడినా ఐపీఓ జారీ చేసిన కంపెనీ ఫిర్యాదుల విభాగాన్ని సంప్రదించాలి. అక్కడ పరిష్కారం కాకపోతే సెబీకి ఫిర్యాదు చేయాలి. ‘ఆఫీస్ ఆఫ్ ఇన్వెస్టర్ అసిస్టెన్స్ అండ్ ఎడ్యుకేషన్, సెబీ, సీ-4, జీ బ్లాక్, కుర్లా కాంప్లెక్స్, ఈస్ట్ బాంద్రా, ముంబయి’ అనే చిరునామాకు పూర్తి వివరాలతో ఫిర్యాదు పంపించాలి.
You must log in to post a comment.