పిల్లల పేరిట బ్యాంకు ఖాతా

What are the advantages of kids saving account - Sakshi

‘నగదు నిర్వహణ’ (మనీ మేనేజ్‌మెంట్‌/ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌)కు జీవితంలో ఎంతో ప్రాధాన్యం ఉంది. ‘మనీ’ పాఠాలను ఎంత ముందుగా నేర్చుకుంటే ఆర్థికంగా అంత మెరుగైన స్థానానికి బాటలు వేసుకోవచ్చు. తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్న నాటి నుంచే డబ్బు విషయాలను తెలియజేస్తూ వెళితే భవిష్యత్తులో వారికి స్పష్టమైన బాట ఏర్పాటు చేసినవారవుతారని నిపుణులు సూచిస్తున్నారు. సాధారణంగా స్కూళ్లలో మనీ పాఠాలకు చోటుండదు. కనుక తల్లిదండ్రులే ఈ విషయంలో చొరవ చూపించాలి. ఎక్కువ మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు పాకెట్‌ మనీ ఇస్తుంటారు. కొందరు అయితే పిగ్గీ బ్యాంకు (డిబ్బీ) ఇచ్చి అందులో పొదుపు దిశగా ప్రోత్సహిస్తుంటారు. ప్రేమతో ఇలా ఇచ్చే డబ్బును పిల్లల పేరిట బ్యాంకులో సేవింగ్స్‌ ఖాతాను ప్రారంభించి.. అందులోకి మళ్లించడం మంచి ఆలోచన అవుతుంది.  

పిల్లలకు బ్యాంకులో సేవింగ్స్‌ ఖాతా ప్రారంభించడం వల్ల వారి కంటూ తల్లిదండ్రులు ఓ ఆదాయ వనరును సమకూర్చినవారు అవుతారు. దీనివల్ల బ్యాంకు ఖాతా అవసరం, ప్రయోజనాలను చిన్నారులు తెలుసుకుంటారు. సంపాదన వయసుకు వచ్చే నాటికి బ్యాంకింగ్‌ లావాదేవీలపై వారికి చక్కటి అవగాహన ఏర్పడుతుంది. చిన్నప్పుడే బ్యాంకు లావాదేవీలకు సన్నిహితంగా మెలగడం వారిపై ఆర్థికంగా సానుకూల ప్రభావాన్ని చూపిస్తుందని నిపుణుల విశ్లేషణ. పిగ్గీ బ్యాంకులో ఎంత వేస్తే అంతే ఉంటుంది. కానీ, బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన మొత్తంపై ఎంతో కొంత వడ్డీ జమ అవుతూ, కాంపౌండింగ్‌తో మరింత వృద్ధి చెందుతుంది. అందుకే పిల్లలకు ఇచ్చే పాకెట్‌ మనీని బ్యాంకు పొదుపు ఖాతాలో పొదుపు చేసుకునే దిశగా పిల్లలను ప్రోత్సహించాలి. అసలు.. వడ్డీ.. వడ్డీపై వడ్డీ అంతా కలసి.. మైనర్లు కాస్తా మేజర్లు అయ్యే నాటికి కొద్ది మొత్తమే మంచి నిధిగా మారుతుంది. పిల్లలు దీన్ని బాగా అర్థం చేసుకుంటే, వారి భవిష్యత్తుకు ప్రయోజనం. 

అర్హతలు 
పిల్లల పేరిట తల్లిదండ్రులు లేదా సంరక్షకులు బ్యాంకులో ఖాతాను ప్రారంభించుకునేందుకు అవకాశం ఉంది. పిల్లలకు ఎంత వయసు ఉండాలి? అన్న సందేహం అక్కర్లేదు. రోజుల వయసు ఉన్నా కానీ ఎటువంటి అభ్యంతరం లేదు. చాలా బ్యాంకుల్లో మైనర్‌ ఖాతా గరిష్ట వయసు 18 ఏళ్లుగా అమలవుతోంది. 18 ఏళ్లు నిండిన తర్వాత మైనర్‌ ఖాతాను పూర్తి స్థాయి సాధారణ ఖాతాగా మార్చేందుకు అర్హత లభిస్తుంది. కాకపోతే ఆ సమయంలో పూర్తి స్థాయి కేవైసీ వివరాలను సమరి్పంచాలి.

వార్షిక వడ్డీ ఆదాయం సంగతి…
మైనర్‌ ఖాతాలకు సంబంధించి తల్లిదండ్రులు లేదా సంరక్షకులు తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన అంశం పన్ను. పిల్లల పేరిట బ్యాంకు ఖాతాల్లోని డిపాజిట్లపై వడ్డీ ఆదాయం తల్లిదండ్రులు లేదా సంరక్షకుల వార్షిక ఆదాయానికే కలిపి చూపించుకోవాల్సి ఉంటుంది.   

పలు రకాల ఖాతాలు.. 
తల్లి లేదా తండ్రి ఉమ్మడి ఖాతాదారుగా జాయింట్‌ అకౌంట్‌ను ప్రారంభించుకునేందుకు వీలుంది. లేదా చిన్నారి పేరు మీదే ఖాతాను తెరవొచ్చు. ఎస్‌బీఐ ‘పెహ్లాకదమ్‌’, ఐసీఐసీఐ బ్యాంకు ‘యంగ్‌ స్టార్స్‌ సేవింగ్స్‌ అకౌంట్‌’లకు కచ్చితంగా తల్లిదండ్రులు జాయింట్‌ అకౌంట్‌ హోల్డర్‌గా ఉండాలన్న నిబంధన అమల్లో ఉంది. మరి కేవలం చిన్నారి పేరుతోనే ఖాతా తెరవాలనుకుంటే ఎస్‌బీఐలో పెహ్లీఉడాన్‌ అనే పథకం ఉంది. కాకపోతే 15-18 ఏళ్ల వయసు వారికే ఇది పరిమితం. అదే పదేళ్లు దాటిన చిన్నారులకు ప్రత్యేకమైన ఖాతా తెరవాలనుకుంటే ఐసీఐసీఐ బ్యాంకు ‘స్మార్ట్‌స్టార్‌ సేవింగ్స్‌ అకౌంట్‌’ పథకం అందుబాటులో ఉంది.  యాక్సిస్‌ బ్యాంకు ‘ఫ్యూచర్‌ స్టార్స్‌ సేవింగ్స్‌ అకౌంట్‌’లో అయితే పిల్లలకు పదేళ్లు వచ్చే వరకు వారి తరఫున తల్లిదండ్రులు లేదా సంరక్షకులే లావాదేవీలు నిర్వహించేందుకు వీలుంటుంది. ఒకవేళ చిన్నారుల పేరిట ఖాతాను ప్రారంభించేట్టు అయితే.. అదే బ్యాంకు శాఖలో వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకులకు సైతం ఖాతా ఉండాలని చాలా బ్యాంకులు కోరుతున్నాయి.  

వడ్డీ రేట్లు/ చార్జీలు 
చాలా బ్యాంకులు సాధారణ సేవింగ్స్‌ ఖాతాల మాదిరే వడ్డీ రేటును మైనర్‌ ఖాతాలకూ అమలు చేస్తున్నాయి. ప్రస్తుతం సేవింగ్స్‌ ఖాతాలపై వడ్డీ రేట్లు వివిధ బ్యాంకుల పరిధిలో 2.7 శాతం నుంచి 7 శాతం మధ్యలో ఉన్నాయి. కాకపోతే పిల్లల పేరిట తెరిచే ఖాతా విషయంలో వడ్డీ రేటుకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఖాతాకు ఉన్న సదుపాయాలు, సౌకర్యాలనే ప్రధానంగా చూడాలి. ప్రారంభ డిపాజిట్‌ ఎంత చేయాలి?, కనీస నెలవారీ బ్యాలన్స్‌ నిర్వహించలేకపోతే విధించే చార్జీలు ఎలా ఉంటాయి?, నగదు ఉపసంహరణకు పరిమితులు? ఇతరత్రా నియమ నిబంధనలను ప్రధానంగా చూడాలి. ఉదాహరణకు ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంకులో మైనర్‌ సేవింగ్స్‌ ఖాతా ప్రారంభానికి రూ.25,000 ఉండాలి. 

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు అయితే ‘కిడ్స్‌ అడ్వాంటేజ్‌ అకౌంట్‌’లో మైనర్లు నెలవారీ కనీసం రూ.5,000ను బ్యాలన్స్‌గా నిర్వహించాలని కోరుతోంది. రూ.5,000 నిర్వహణలో విఫలమైతే తిరిగి కనీస బ్యాలన్స్‌ ఖాతాలో చేరే వరకు రూ.150–300 మధ్య చార్జీలను అమలు చేస్తోంది. అదే ఎస్‌బీఐ ‘పెహ్లీ ఉడాన్‌’ ఖాతాలో ఎటువంటి బ్యాలన్స్‌ ఉంచాల్సిన అవసరం లేదు. అంటే ఇది జీరో బ్యాలన్స్‌ అకౌంట్‌. గరిష్టంగా ఖాతాలో రూ.10లక్షల వరకు బ్యాలన్స్‌ను నిర్వహించుకోవచ్చు. సాధారణ ఖాతాలకు మాదిరే మైనర్‌ ఖాతాదారులూ చెక్కు బుక్, ఏటీఎం కార్డు, మొబైల్, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ సేవలను పొందొచ్చు. ఉపసంహరణ పరిమితులు, తల్లిదండ్రుల ప్రమేయం అన్నది బ్యాంకుల మధ్య మార్పు చెందొచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ‘కిడ్స్‌ అడ్వాంటేజ్‌ అకౌంట్‌’ అయితే చిన్నారుల పేరిటే ఏటీఎం/డెబిట్‌ కార్డులను జారీ చేస్తారు. రోజువారీ ఉపసంహరణ పరిమితి రూ.2,500గా ఉంది. వర్తకుల వద్ద ఒక్కరోజులో రూ.10,000కు మించి కార్డుతో చెల్లించడానికి అవకాశం లేదు. అదే ఎస్‌బీఐ అయితే పీవోఎస్‌ వద్ద రోజువారీ పరిమితిని రూ.5,000గానే అమలు చేస్తోంది. 

తల్లిదండ్రుల నియంత్రణలు 
చాలా బ్యాంకులు మైనర్‌ ఖాతాలకు సంబంధించి ఎటువంటి ఆంక్షల్లేకుండా ఏటీఎం/డెబిట్‌ కార్డుల సదుపాయాలను కలి్పస్తున్నాయి. కనుక కార్డుల దురి్వనియోగం రిస్క్‌ ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే బ్యాంకులు మైనర్‌ ఖాతాల లావాదేవీలపై తల్లిదండ్రులు లేదా సంరక్షకుల మొబైల్‌ నంబర్లకు అలర్ట్‌ సందేశాలను పంపిస్తున్నాయి. అంతేకాదు, నెట్‌బ్యాంకింగ్‌ ద్వారా లావా దేవీలను పరిశీలించుకునేందుకు అనుమతిస్తున్నా యి. తమ పిల్లల కార్డు ల పరిమితులను ఎప్పటికప్పుడు మా ర్చుకునేందుకూ అవకాశం కల్పిస్తున్నాయి. సిటీ బ్యాంకు జూనియర్‌ అకౌంట్, ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌కు చెందిన ఏయూ కిడ్స్‌ అకౌంట్‌ ఇందుకు ఉదాహరణలు. పిల్లల చేతికే తాళాలు ఇవ్వడం నచ్చని తల్లిదండ్రులు ఖాతాల కంట్రోలింగ్‌ను తమ చేతుల్లోనే ఉంచుకునే సదుపాయం ఉంది. 

అదనపు ప్రయోజనాలు.. 
కొన్ని బ్యాంకులు మైనర్‌ ఖాతాలపై అదనపు ప్రయోజనాలను ఆఫర్‌ చేస్తున్నాయి. ఎస్‌బీఐ ‘పెహ్లీ ఉడాన్‌’ పెహ్లాకదమ్‌’ ఖాతాలకు ఆటో స్వీప్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ (బ్యాలన్స్‌ కనీస పరిమితి మించిన సందర్భాల్లో అదనపు బ్యాలన్స్‌ను డిపాజిట్‌గా మార్చే ఆటో సదుపాయం) సదుపాయాన్ని అందిస్తోంది. రికరింగ్‌ డిపాజిట్‌పై స్టాండింగ్‌ ఇన్‌స్ట్రక్షన్‌ సదుపాయాన్ని కూడా కలి్పస్తోంది. వ్యక్తిగత ప్రమాద బీమా కవరేజీని, ఎస్‌బీఐ లైఫ్‌ తరఫున మార్కెట్‌ లింక్డ్‌ ప్లాన్‌ ‘స్మార్ట్‌ స్కాలర్‌’ను ఆఫర్‌ చేస్తోంది. పెహ్లాకదమ్‌ ఖాతాలో అయితే ఎఫ్‌డీపై ఓడీ సదుపాయాన్ని తల్లిదండ్రులు/సంరక్షకులు తీసుకునే ఆప్షన్‌ కూడా ఉంది. ఇక హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కిడ్స్‌ అడ్వాంటేజ్‌ ఖాతాదారులకు రూ.లక్ష విలువతో ఉచితంగా ఎడ్యుకేషన్‌ ఇన్సూరెన్స్‌ను అందిస్తోంది. తల్లిదండ్రులు లేదా సంరక్షకులు మరణించినట్టయితే మైనర్‌ ఖాతాదారులకు బ్యాంకు రూ.లక్ష పరిహారంగా చెల్లిస్తుంది.

%d bloggers like this: