బెయిల్‌ vs పెరోల్‌

ఒక వ్యక్తిపైన ఏదైనా నేరం ఆరోపించబడి, ప్రాథమిక సాక్ష్యాధారాలతో పోలీసులు అరెస్టు చేసినప్పుడు, ఇంకా నేరం ఋజువుకాని ఆ వ్యక్తిని పోలీసు కస్టడీ లేక జ్యుడిషియల్ కస్టడీలో ఉంచకుండా వదిలిపెట్టమని కోర్టు ఇచ్చే ఆదేశం “బెయిల్”. పోలీసుల కస్టడీలో అనుమానితుడిని ఉంచవలసిన నేర తీవ్రత ఆ కేసులో లేదని, అతడిని స్వేచ్ఛగా వదిలితే పారిపోవడమో, సాక్షులను/సాక్ష్యాలను ప్రభావితం చేయడమో జరగదని కోర్టు నమ్మితే ఎవరి పూచీకత్తుమీదనైనా, కొంత డబ్బు కోర్టులో జమచేసి బెయిల్ పొందవచ్చు. బెయిల్ సమయంలో ఊరు విడిచి ఎక్కడికీ వెళ్లనని, పోలీసులు ఎప్పుడు పిలిచినా వెళ్లి దర్యాప్తుకు సహకరిస్తానని కోర్టుకు ప్రమాణ పత్రం ఇవ్వవలసి ఉంటుంది. అవసరం అనుకొంటే కొన్ని ఇతర నిబంధనలు కూడా కోర్టు విధించవచ్చు.

నేరం ఋజువై, జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీని కొన్ని ప్రత్యేక సందర్భాలలో తాత్కాలికంగా విడుదల చేసి బయటకు అనుమతించడాన్ని “పెరోల్” అంటారు. ఈ మాట ఫ్రెంచి భాషలోని ‘Parole’ నుండి వచ్చింది. ఈ పదానికి ‘మాటలు’, ‘వాగ్దానం’ అన్న అర్థాలున్నాయి. జైలునుండి తాత్కాలికంగా బయటకు వెళ్లడానికి అనుమతిస్తే తాను ఎక్కడికీ పారిపోనని, పనవ్వగానే తిరిగి వచ్చి మిగిలిన శిక్షాకాలాన్ని జైల్లో గడుపుతానని మాటయిచ్చి పొందే అనుమతి అన్నమాట ‘పెరోల్’. అనారోగ్యం వలన గానీ, కుటుంబ సభ్యుల అంత్య క్రియలకు హాజరు కావడానికిగాని సాధారణంగా పెరోల్ యిస్తారు.

%d bloggers like this: