ఆహార నియమాలు

జబ్బుని బట్టీ, శరీర తత్వాన్నిబట్టీ ఆహారం ఉండాలని పూర్వం అనుకునేవారు. ఇప్పుడు ఆ సమస్య లేదు. ఎవరికైనా ఆహారనియమాలు స్థూలంగా ఒకటే.

  1. తక్కువగా తినండి
  2. తక్కువగా వండండి
  3. బయటి ఆహార పదార్ధాలు తినకండి
  4. ప్రకృతిలో తయారైనవి తినండి. మనుషులు తయారు చేసినవి (processed foods) తగ్గించండి.

తక్కువగా తినండి.

తినటానికి అనేక కారణాలు:

జంతువులు అవసరమైన దానికన్నా ఎప్పుడూ ఎక్కువ తినవు. చంటిపిల్లలూ అంతే. వయసు పెరిగినకొలదీ, అనేక కారణాల వలన మనం అవసరమైన దానికన్నా ఎక్కువ తింటాం. దీనిని ఒక చెడు పరిణామం. (degradation or corruption) అని చెప్పవచ్చును.

ఆకలి తీర్చుకోవటానికి మాత్రమే తినాలి. ఐతే అలా జరగటల్లేదు. ఆకలి కాకుండా మనకి తినటానికి ఇంకా అనేకమైన ఇతర కారణాలు ఉంటున్నాయి. సంతోషం వస్తే తింటాము. నీరసంగా ఉంటే తింటాము. మనసులో బాగోక పోతే తింటాం. బోరు కొడితే తింటాము. టీవీ చూస్తూ తినేస్తుంటాము. లావెక్కటానికి ఒక ప్రధాన కారణం డిప్రెషన్.

వ్యసనం: త్రాగుడు, సిగరెట్టు లాగానే తిండి కూడా చాలా మందికి ఒక వ్యసనం. దురదృష్టవశాత్తూ ఇది సమాజానికి తప్పుగా కనిపించని వ్యసనం. (Socially acceptable addiction). ఇతర వ్యసనాల్లాగానే, తిన్నకొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది. తిండి తగ్గిస్తే ఇతర వ్యసనాల్లాగానే నీరసం (withdrawal symptom) వస్తుంది, శరీరంలో అవసరానికి మించి నిలువలు ఉన్నప్పటికీ.

సమాజ ప్రభావం: తిండికి పెద్ద సామాజిక కోణం ఉంది. ఏ వేడుకైనా విందులేకుండా ఉండదు. ఎవరైనా బంధువులు వస్తే వారికి తినిపించకుండా ఉండలేము. చిన్న పిల్లలను తినమని పీడిస్తాము.

అలవాటులో పొరపాటు: పెరిగే వయసులో అంటే 12-20 సంవత్సరాల మధ్య శరీరానికి తిండి అవసరం ఎక్కువగా ఉంటుంది. ఆ వయసులో బరువు తక్కువగా ఉంటారు. 25 దాటిన తరవాత శరీరానికి ఆహారం అవసరం క్రమేపీ తగ్గిపోతుంది. కండ (muscle mass) క్షీణిస్తూ ఉంటుంది. ఐతే అలవాటు ప్రకారం మనం ఎప్పుడూ తిన్నట్లే తింటాము. తగ్గించం. అందుకే మనందరికీ వయసుతో బాటూ నడుము చుట్టుకొలత విషవృక్షం లాగా పెరుగుతూనే ఉంటుంది. కండ (muscle mass) తగ్గటం వలన వయసుతో బాటు బరువు తగ్గవలసినది పోయి పెరుగుతున్నాం. వయసుతోపాటు బరువు తగ్గితే మంచిది, కనీసం పెరగకుండా ఉండాలి.

చిన్నప్పటి అలవాట్లు: తిండి అలవాట్లు (eating habbits) చిన్న వయసులోనే (5 సంవత్సరాలలోపులోనే) ఏర్పడతాయి. అంటే ఆ వయసులో తీపి అలవాటు ఐతే జీవితాంతం తీపి మీద ప్రీతి (sweet tongue) ఉంటుంది. చిన్నప్పుడు తినని పదార్ధాలమీద పెద్దైనాక ఆసక్తి ఎక్కువ ఉండదు. ఉదాహరణకు శాకాహార కుటుంబాల్లో పుట్టిన వాళ్లకు మాంసం సాధారణంగా రుచించదు.

ఆకలి ఉన్నప్పుడే తినాలి. పిల్లలు తినేటప్పుడు వారి దృష్టి తిండిమీదే ఉండాలి. పిల్లలకు టీవీ చూపిస్తూ తినిపిస్తూ ఉంటే, వాళ్లకు మనం ఎంత అన్యాయం చేస్తున్నామో గ్రహించండి. చిన్న పిల్లలు ఇంకా చెడిపోలేదు. ఎలా తినాలో మనం వాళ్ళనుండి నేర్చుకోవాలి. మన దురలవాట్లు వాళ్లకు నేర్పకూడదు.

వినిమయతత్వం (consumer culture): మనకి రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, బిస్కట్ కంపెనీలు, హార్లిక్స్ కంపెనీలు ఎందుకు ఉన్నాయి? మనని ఎదో రకంగా మభ్యపెట్టి తినిపించడానికే . లేకపోతె వాటికీ మనుగడ లేదు.

పూర్వం మనవాళ్ళు గుహల్లో బతికినప్పుడు, పిల్లలని పులులనుండి తోడేళ్ళనుండి నుండి రక్షించుకునే వారు. ఇప్పుడు మీరు మీ పిల్లలని TV నుండి, junk food (పిచ్చితిళ్లు) నుండి రక్షించుకోవాలి.

ఇంకా తక్కువగా వండండి, బయటివి తినకండి, ప్రకృతిలో తయారైనవి తినండి, మనుషులు తయారు చేసినవి తగ్గించండి.

మనిషి భూమి మీదకి వచ్చి సుమారుగా 100000 సంవత్సరాలు అయిఉంటుంది. వ్యవసాయం మొదలు పెట్టింది, మహా ఐతే 10000 సంవత్సరాల క్రితం. హోటళ్లు, రెస్టారెంట్లు, ఆహార సంబంధమైన పరిశ్రమలు వచ్చింది 200 లేదా 300 సంవత్సరాల క్రితం. (wikipedia)

అంటే 90000 సంవత్సరాలు మానవ జాతి తిండికి కాయలు, ఆకులు, పళ్ళు, దుంపలు, వేట మీద ఆధారపడింది. (hunter/gatherer stage). ఆ దశలో మనుషులు సన్నగా ఉండేవారు. వాళ్లు ఎలా ఉండేవారు, ఏం తినేవారు తెలుసుకోవాలంటే ఎక్కడైనా మారుమూల అడవులకెళ్లి అక్కడ ఉండే కొండవారిని చూడండి. మనిషి 60 కెజిలు ఉంటే ఎక్కువ.

10000 సంవత్సరాల క్రితం వ్యవసాయం వచ్చినప్పటికీ జనబాహుళ్యానికి ఆహారం సమృద్ధిగా ఉండేది కాదు. ఊబకాయం బహుతక్కువగా ఉండేది.

పారిశ్రామిక విప్లవం తరవాత అంటే గత 200 సంవత్సరాల్లోనూ ప్రజలు తినే ఆహారంలో పెనుమార్పులు వచ్చినయ్యి. శరీరానికి శ్రమ తగ్గిపోయింది. ఊబకాయం పెరిగిపోయింది. ఈ మార్పు కంప్యూటర్ యుగంలో మరీ ఎక్కువైపోయింది.

ప్రకృతి మన శరీరాలను తిండి లేమికి, కందమూలాలు, కాయగూరలు, గింజలు తిని బతకడానికి అనువుగా నిర్మించింది. దీనిని genetic and epigenetic selection in evolution అని అంటారు. మిఠాయిలు తినటానికి అనువుగా నిర్మించలేదు. అలాగే మన శరీర నిర్మాణం బరువు ఎక్కువ ఉంటే తట్టుకోలేదు. గత రెండు వందల ఏళ్లలోను మార్పులు వచ్చినయ్యి కదా అని 100000 సంవత్సరాలనుండి ఏర్పడిన శరీర నిర్మాణం వేగంగా మారదు.

అందుకని food processing అంటే ఆహారం తయారీలో పొయ్యి, యంత్రాల వాడకం సాధ్యమైనంత తక్కువగా ఉండాలి.

ఆధునిక ఆహారంలో ఇంధన శక్తి అంటే క్యాలోరీ డెన్సిటీ ఎక్కువ. దీని వలన బరువు ఎక్కువ పెరుగుతుంది. యాంటిఆక్సిడెంట్ల లాంటి పోషకపదార్ధాలు తక్కువ. వీటి వలన శరీరం రోగగ్రస్తం కావటానికి అవకాశాలు ఎక్కువ. ఈ జబ్బు ఆ జబ్బు అని కాదు. ఆహారం సరిగా లేకపోతె అన్ని జబ్బులూ ఎక్కువే.

ఐతే పొయ్యి, యంత్రాల వాడకం పూర్తిగా లేకుండా వీలు కాదు. వంట అనేది సుమారుగా 50000 సంవత్సరాల క్రితం వచ్చిన తరవాతనే మనం తిన అరిగించుకోగలిగిన పదార్ధాలు పెరిగినయ్యి . తృణధ్యాన్యాలు మన ఆహారంలో భాగమయ్యాయి. మానవ జాతి నశించకుండా మనగలిగింది.

మనకు మేలు చేసే యంత్రాలు (technology) వాడవచ్చును. ఉదాహరణకు ఫ్రిజ్, గ్రైండర్ లాంటివి వాడటంలో తప్పు లేదు.

ఇతర విషయాలు:

చక్కర: పంచదార, బెల్లంలాంటివాటిలో ఇంధన శక్తి అంటే కెలొరీ డెన్సిటీ ఎక్కువ. ఇతర విలువలు సున్నా. పూర్వం మనుషులకి ఆహారం కరువుగా ఉండేది. శారీరక శ్రమకి ఇంధనశక్తి అవసరం ఎక్కువగా ఉండేది. పంచదార అమృతం లాగా పనికి వచ్చేది. పంచదార ఇష్టంలేని వారు పరిణామక్రమంలో అంతమైపోయారు. పంచదార రుచి మరిగిన వాళ్ళు మిగిలిపోయారు. (genetic and epigenetic selection). అందుకే మనందరికీ తీపి అంటే మహా ప్రీతి.

గత 200 సంవత్సరాలోనూ మారిన పరిస్థితుల్లో పంచదార చెడ్డదైపోయింది. ఇప్పుడు మద్యం ఎలా చెడ్డదో, తీపి పదార్ధ్యాలు కూడా ఇంచు మించుగా అంతే చెడ్డవి అని చెప్పవచ్చును. ఐతే శ్రమ జీవులకు పంచదార, బెల్లం అంత చెడ్డవి కావు. మిగిలిన వాళ్ళు వీటిని మద్యం లాగానే వదులుకోవాలి.

మాంసాహారం: మాంసాహారం మంచిదా చెడ్డదా అనేది విజ్ఞాన శాస్త్రంలో చాల చర్చ జరుగుతున్నది. ఇది ఇంతలో తేలే విషయం కాదు. మాంసం తినవచ్చును. మాంసం చెడ్డదని రుజువులు ఏమీ లేవు. శాకాహారులు మాంసం తినే అవసరం లేదు. మాంసంలో అధికంగా వాడే ఉప్పు వలన అనర్ధం ఉండవచ్చును.

నెయ్యి, వెన్న: ఇవి చెడ్డవి. జంతు సంబంధమైన కొవ్వు పదార్ధాలన్నీ చెడ్డవి. ఆవు నెయ్యి ఏమీ ఎక్కువ కాదు. వెన్నతక్కువ పాలు వాడటం మెరుగు.

నూనెలు: పరిమితులలో వాడితే అన్నీ మంచివే. కానీ గడ్డ కట్టే నూనెలు అంటే కొబ్బరి నూనె లాంటి వాటి గురించి విజ్ఞాన శాస్త్రంలో కొన్ని సందేహాలున్నాయి. కొబ్బరి నూనెను వాడితే, అతిగా వాడకండి. కొబ్బరితో సహా నూనె గింజలన్నీ ఆరోగ్యానికి మంచివే. సుమారుగా 20-35 శాతం ఆకలిని నూనెల(Fats)తో తీర్చుకోవాలి. నూనె గింజలలో విలువైన పోషకపదార్ధాలు ఉంటాయి. నూనె వలన ఆకలి బాగా తీరుతుంది. ఎప్పుడైనా నూనె కన్నా నూనె గింజలు మంచివి.

కాక నూనె, డాల్డా మంచివి కావు. నూనెతో ఏదయినా అతిగా వేయించడం (deep fry) కూడా మంచిది కాదు.

బియ్యం, ఇతర తృణధాన్యాలు: ఇవి పూర్వం నుండీ చౌక. మన భారత దేశ చరిత్రలో కరువులు ఎక్కువగా ఉండటం వలన వీటిని ఎక్కువగా తినటానికి అలవాటు పడ్డాం. దీనికి వీలుగా అవకాయలు సృష్టించుకున్నాము. కూరలు కారంగా వండుకుంటున్నాము. సాధారణంగా మన తెలుగు వారి ఆహారంలో బియ్యం వాడకం అవసరమైన దానికన్నా ఎక్కువ. బియ్యం ఎక్కువగా వాడేవాళ్లు తగ్గించాలి. తెల్లబియ్యంకన్నా ముడి బియ్యం మెరుగు. బియ్యంతో పాటు ఇతర గోధుమ, జొన్న లాంటి ఇతర తృణధాన్యాలుకూడా వాడి వైవిధ్యం పెంచుకుంటే మంచిది.

పప్పులు: అన్నిరకాల పప్పులు, చిక్కుళ్ళు, నూనె గింజలు మంచివే. వీటిని మనం తక్కువగా వాడుతున్నామేమోనని నా అనుమానం. బియ్యం స్థానంలో వీటి వాడకం పెంచుకోవాలి.

పళ్ళు: పళ్ళు మంచివే. ఐతే మరీ తియ్య్యగా ఉండే పళ్ళను అతిగా వాడకపోతే మంచిది. డయాబెటిస్ ఉంటె పళ్ళు మానెయ్యనక్కరలేదు.

కూరగాయలు: కూరగాయలు మంచివి. ఐతే మంచితనం వంటలో కొంత పోతుంది. వీలైనంతవరకు పచ్చివి లేదా తక్కువగా వండినవి వాడండి. పచ్చి కూరలు తిన్నప్పుడు బాగా కడగవలసి ఉంటుంది.

గుడ్లు: తెల్లసొన అందరికీ మంచిదే. పచ్చసొన గురించి కొన్ని సందేహాలున్నాయి. పచ్చసొనలు సగటున రోజుకి ఒకటి కన్నా తక్కువ తింటే ఇబ్బంది ఏమీ ఉండదు. శాకాహారులు గుడ్లు తినకపోయినా ఫరవాలేదు.

ఉప్పు: ఉప్పు లేకుండా మనిషి బ్రతకటం కష్టం. ఐతే రక రకాల కారణాల వలన మనం తినే తిండిలో ఉప్పు బాగా ఎక్కువైపోయింది. వీలైనంత తగ్గించండి. బీపీ ఉంటె ఇంకా తగ్గించండి.

మసాలాలు: పసుపు, కారం ఇంకా ఇతర మసాలా దినుసులు మంచివే, అవి ప్రక్రుతి సిద్ధంగా దొరికే ఆహార పదార్ధాలు కాబట్టి. చాలా మందికి మసాలా దినుసుల్లో ఔషధ గుణాలున్నాయని నమ్మకం. అమెరికా వాళ్ళకి ఈ నమ్మకం ఎక్కువ. దీనికి రుజువులు లేవు.

సమతుల్యం (Balanced diet): ఆహారంలో పిండి పదార్ధాలు (carbohydrates), నూనె పదార్ధాలు (fats) మాంసకృత్తులు (proteins), విటమిన్లు సమ పాళ్ళలో ఉండాలి. అలా అని మనం లెక్క వేసుకుని తిననక్కర లేదు. పైన చెప్పిన నియమాలు పాటించి మిశ్రమాహారం తినే వాళ్లకు సమతుల్యం ఖచ్చితంగా ఉంటుంది.

బొమ్మలో చూపించిన నిష్పత్తులకు కాస్త అటూ ఇటూ గా ఉండవచ్చును.

మిశ్రమాహారం అంటే బియ్యం లాంటి తృణ ధాన్యాలు, పప్పుగింజలు, ఆకు కూరలు, కాయగూరలు, పళ్ళు, నూనె గింజలు లాంటివి. వైవిధ్యం మంచిది. రకరకాలైన తృణధాన్యాలను, పప్పుగింజలను, నూనె గింజలను వాడవచ్చును. వైవిధ్యం అంటే రక రకాలైన బిస్కట్లు, చాకోలెట్లు, ఐస్క్రీములు, హల్వాలు, పిండి వంటలు అనుకోవద్దు.

ఎంత మంచి పదార్దాన్నైనా అతిగా తిన కూడదు.

బాదం పప్పులు, సబ్జిగింజలు, ఆలివ్ నూనె, కొర్ర గింజలు, ఆపిల్ పళ్ళూ వాడాలా?

వీటివలన ప్రత్యేకించి లాభం ఏమీ ఉండదు. స్థానికంగా చౌకగా లభించేవి తినికూడా మంచి ఆరోగ్యాన్ని పొంద వచ్చును.

డయాబెటిస్ ఉన్నవాళ్లకు ప్రత్యేకించి జాగ్రత్తలు: డయాబెటిస్ ఉన్నా, ఉండకపోయినా ఆహారానియమాలు ఒక్కటే.

కీటోడైట్(ketodiet): కీటోడైట్ వలన తాత్కాలికంగా బరువు తగ్గవచ్చును. దీర్ఘకాలంలో ఆచరణ సాధ్యం కాదు. అంతే కాకుండా సమతుల్యం (కీలకమైన పోషక పదార్ధాలు) లోపించటం వలన ఆరోగ్యం దెబ్బతింటుంది. కీటోడైట్ కి వైద్యశాస్త్రం వ్యతిరేకం. చెదురు మదురు డాక్టర్లు ఇది మంచిదని చెప్పవచ్చును. అది వారి వ్యక్తిగత అభిప్రాయం.

Mediteranian diet మంచిదా? మంచిదే, కానీ పైన చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటే ఆంధ్రా డైట్ దీనికి ఎంతమాత్రం తీసిపోదు.

Organic food: ఆర్గానిక్ ఆహారం వలన ప్రయోజనం ఏమీ ఉండదని అనేక పరిశోధనలలో తేలింది. ఐతే నష్టం కూడా ఏమీ ఉండదు.

ఆయుర్దాయం కేవలం తిండి మీదే ఆధార పడిఉండదు. శరీర తత్త్వం ప్రధానం. వ్యాయామం, మనశ్శాంతి కూడా ఆవరమే. సరైన ఆహారం తినటం వలన ఆరోగ్యం, ఆయుర్దాయం ఎంతో కొంత పెరుగుతాయనేది ఖాయం. ఖచ్చితంగా ఎంతనేది లెక్కల్లో ఇంకా తేలలేదు.

%d bloggers like this: