బ్యాంకుల్లో – లాకర్లు

మనకు, మన ఆస్తులకు సంబంధించిన పత్రాలు, విలువయిననగలు, వస్తువులు భద్రపరుచుకునేందుకు బ్యాంకు లాకర్లు ఉపయోగపడతాయి. మనం ఇల్లు తాళం వేసుకుని రోజులతరబడి వేరే ఊళ్లకు వెళ్లినప్పుడు మన విలువయిన వస్తువులు, నగలు లాకరులో భద్రపరుచుకోవచ్చు.

బ్యాంకుల్లో లాకర్లు అద్దె ప్రాతిపదికన ఇవ్వబడతాయి. బ్యాంకు లాకర్లలో మనకు రక్షణ ఏమిటంటే మనం తీసుకున్న ఒక లాకరు తాళం మనదగ్గర ఉంటే ఇంకో మాస్టర్ కీ (ఆ యూనిట్ లో ఉన్న అన్ని లాకర్లకీ సంబంధించిన ఒకే ఒక తాళం) బ్యాంకువారి దగ్గర ఉంటుంది. అందుచేత మనం తీసుకున్న లాకర్ తెరవాలంటే మన కీ బ్యాంకు వాళ్ల మాస్టర్ కీ రెండూ ఒకేసారి పెట్టి తెరవాల్సిఉంటుంది. రెండింట్లో ఏఒక్క కీతోమాత్రమే లాకర్ తెరవడం అసంభవం. అందుచేత మనకీ జాగ్రత్తగా దాచుకుంటే అందులో మనం పెట్టుకున్నవస్తువులకు ఢోకా ఉండదు.

ఈ లాకర్లు కూడా చిన్నవి, కొంచెం పెద్దవి, అంతకన్న పెద్ద లాకర్లు కూడా ఉంటాయి. సాధారణంగా ఆ బ్యాంకుతో ఎక్కువ సంబంధం పెట్టుకుని పెద్ద మొత్తాల్లో డిపాజిట్లు, ఎకౌంట్లతో లావాదేవీలు జరిపేవారు మేనేజ్ మెంటుతో మాటలాడుకుని లాకరు యూనిట్ రావడానికి ముందే ఏర్పాట్లు చేసుకుని పెద్దలాకర్లు తీసుకుంటారనేది నా అనుభవంలో గ్రహించిన విషయం.

సాధారణంగా బ్యాంకు లాకరు కావాలంటే మనకి ఎకౌంట్ ఉండి ఒక ఖాతాదారుగా ఉన్నవారికే లాకరు ఇవ్వడానికి ఆ బ్యాంకువారు సుముఖత చూపిస్తారు. ఎందుకంటే బ్యాంకింగు నిబంధనలను అనుసరించి ఆ బ్యాంకువారితో అంతకు ముందే మీకు పరిచయం ఉండటం గురించి ఒక రికార్డ్ ఉండటం మీ లావాదేవీలు సంతృప్తికరంగా ఉన్నాయి అనే విషయాలకు ప్రాముఖ్యత ఉంటుంది. ఏడాదికి సరిపోయే అద్దె ఒకేసారి అడ్వాన్సుగానే చెల్లించాల్సిఉంటుంది. అదికాకుండా లాకరు కీ డిపాజిట్ గా కూడా కొంత మొత్తాన్ని మీదగ్గర వసూలు చేసి బ్యాంకువారు వారిదగ్గర పెట్టుకుంటారు. మీరు లాకరు రద్దుచేసుకున్నప్పుడు అది మీకు తిరిగి ఇచ్చేస్తారు.

మీరెప్పుదైనా కీ పోగొట్టుకున్నా, లేక అద్దె కట్టకుండానూ బ్యాంకుకి రాకుండానూ ఒక కాలపరిమితికిమించి వ్యవహరిస్తే బ్యాంకువారు మీకు కొంచెం ముందు ఒక నోటీసు పోస్టులో మీరు లాకర్ తీసుకున్నప్పుడు ఇచ్చిన ఎడ్రసుకి పంపించి కొన్నిరోజుల తరవాత ఆ లాకరుని ఇద్దరు ముగ్గురు తగిన స్థాయి కలిగిన సాక్షుల సమక్షంలో పగులకొట్టి తెరిపించి అందులో దాచిన వస్తువుల లిస్టు వివరాలు రాసి బ్యాంకువారు, ఆ సాక్షులు అందులో దృవీకరిస్తూ రికార్డుచేసి ఒక పేకెట్ లో సీలు చేయించి ఉంచి సేఫ్ లో భద్రపరుస్తారు. ఈ విషయంలో అయ్యే ఖర్చు మనమే భరించాలి. అవసరమైతే లాకరు కీ డిపాజిట్ లో ఉన్న డబ్బు దీనికి వాడేస్తారు. ఇలాంటి అన్ని విషయాలకు సంబంధించి ఒక స్టాంపుపేపరుమీద మీరు లాకరు తీసుకున్నరోజునే బ్యాంకువారితో ఒక ఎగ్రిమెంటుచేసుకుని ఉంటారు. ఆ విధంగా బ్యాంకు వారికి హక్కు ఉంటుంది.

లాకరులో ఉన్నవి అవసరానికి బయటకు తీసుకోవడం, లేదా ఇంకొకటి ఏమన్నా పెట్టుకోవడం వంటివి ఎవరిపేరుమీద లాకరు తీసుకున్నారో ఇంకా ఎవరికైనా అధికారం ఇస్తూ మేండేట్ బ్యాంకు వారి దగ్గర నిబంధనలప్రకారం ముందుగానే ఇచ్చివుంటే ఆటువంటివారికి మాత్రమే లాకరు తెరిచే అధికారం ఉంటుంది. మనకు విలువయిన ఆస్థిపత్రాలూ ఇతర లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్లు ఉంచుకోవడానికి ఉపయోగకరం. డబ్బు, బంగారం నగలు కూడా చాలామంది దాచుకుంటారు. ఎందుకంటే ఒకసారి మీరు ఆ లాకరు మూసేసిన తర్వాత మళ్లీ మీరూ బ్యాంకు అధికారీ ఇద్దరు తాళం తిప్పితేగానీ ఆ లాకరు తెరుచుకోబడదు. బ్యాంక్ అధికారి తన మాస్టర్ కీ తీసుకుని వెళ్లి పోతాడు. మీరు లాకరు గదిలోనే ఉండి మీ పని చూసుకోవచ్చు.

%d bloggers like this: