మ్యూచువల్ ఫండ్స్ – పరిశీలించే అంశాలు

ప్రతి ప్రయాణానికీ గమ్యం ఉన్నట్టే ప్రతి పెట్టుబడికీ లక్ష్యం ఉండాలి. మరే పెట్టుబడి లాగానే మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడికి కూడా లక్ష్యం ముఖ్యం.

లక్ష్యానికి అనుగుణంగా పెట్టుబడి కాలం నిర్ణయించుకుని అందుకు తగ్గ ఫండ్లు ఎంచుకోవాలి.

స్వల్పకాలం (ఏడాది లోపు):

ఈక్విటీల రిస్క్ వద్దనుకునేవారికి ద్రవ్యోల్బణాన్ని ఓడించే, ఎఫ్‌డీని మించిన రాబడికి కొన్ని రోజులకైతే లిక్విడ్ ఫండ్లు, కొన్ని నెలలకైతే డెట్ ఫండ్లు ఉపయుక్తం.

దీర్ఘకాలం (కనీసం అయిదేళ్ళు):

పోర్ట్‌ఫోలియో విస్తృతీకరణకు లార్జ్‌క్యాప్ ఫండ్లు, మిడ్/స్మాల్‌క్యాప్ ఫండ్లు, పన్ను ఆదా (ELSS) ఫండ్లు తగిన మోతాదుల్లో ఎంచుకోవాలి. దీర్ఘకాలానికి క్రమానుగుణ పెట్టుబడి (SIP) అత్యుత్తమం.

ఫలానా ఫండ్ మంచిదా కాదా ఎలా తెలుసుకోవటం?

కొన్ని సరళమైన పరామితులతో ఒక ఫండ్ నాణ్యతను బేరీజు వెయ్యవచ్చు:

గత పనితీరు

గడిచిన అయిదు, పదేళ్ళలో రాబడి శాతం మాత్రమే కాకుండా నిలకడగా ఆ ఫండ్ మూలాధార సూచీని మించిన రాబడి ఇచ్చిందా అన్న విషయం పరిశీలించాలి.

లార్జ్‌క్యాప్ ఫండ్లకు మూలాధార సూచీ BSE 100, మిడ్‌క్యాప్ ఫండ్లకు BSE 150 MidCap, స్మాల్‌క్యాప్ ఫండ్లకు BSE 250 SmallCap, ఇలా.

ఉదాహరణ:

గత ఎనిమిదేళ్ళుగా ఆక్సిస్ బ్లూచిప్ ఫండ్ BSE 100 సూచీని మించిన రాబడి ఇచ్చింది.

అదే ఫ్రాంక్లిన్ బ్లూచిప్ ఫండ్ పనితీరు పలుమార్లు సూచీ కంటే తక్కువగా ఉంది:

దీర్ఘకాలానికి ఇటువంటి ఫండ్లు మంచివి కావు. ఈ వివరాలు ValueResearch వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

ఫండ్ సంస్థ (Asset Management Company)

సంస్థ నైతిక విలువలు దీర్ఘకాలిక పనితీరుపై తప్పక ప్రభావం చూపుతాయి. ఇది తెలుసుకోవటం కష్టం కూడా కాదు.

ఆ సంస్థ మోసపూరిత లావాదేవీలు, సంక్షోభాలలో తలదూర్చకుండా ఉండాలి. సంస్థ యాజమాన్యం, ముఖ్య కార్య నిర్వాహక సిబ్బంది పరిశ్రమలో విశ్వసనీయ, గౌరవప్రద వ్యక్తులై ఉండాలి. ఉదాహరణకు HDFC, Axis, Mirae Asset, MotilalOswal ఫండ్ సంస్థలు.

ఫండ్ నిర్వాహకులు (Fund Manager)

ఫండ్ మేనేజర్ పనితీరు చూడాలి. అనుభవజ్ఞులైన మేనేజర్లు ఒక AMCలో పలు ఫండ్లను నిర్వహించటం సర్వసాధారణం. వారి అనుభవాన్ని బట్టి ఆయా ఫండ్ల నిర్వహణ ఎలా ఉందో పరిశీలించాలి.

ఒక ఫండ్ మేనేజర్ ఆ ఫండ్‌ను ఎప్పటి నుండి నిర్వహిస్తున్నారు, ఆ కాలంలో ఫండ్ పనితీరు ఎలా ఉంది, వారు ఇంకా ఏ ఫండ్లకు మేనేజర్‌గా ఉన్నారు – ఆ ఫండ్ల పనితీరు ఎలా ఉంది వంటి విషయాలు చూడాలి.

ఉదాహరణకు ఆక్సిస్ బ్లూచిప్ ఫండ్ మేనేజర్:

ఈ వివరాలు ValueResearch వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

ఫండ్ మేనేజర్ల పనితీరు తెలుసుకోటానికి CityWireSelector వెబ్‌సైట్ చూడవచ్చు.

ఫండ్ పరిమాణం (Assets Under Management)

కనీసం వెయ్యి కోట్ల సంపదను నిర్వహించే సంస్థ మంచిది. సాధారణంగా AUM ఎంత ఎక్కువ ఉంటే ఫండ్ నిర్వహణ అంత సంక్లిష్టంగా ఉంటుంది. అప్పుడే ఫండ్ మేనేజర్ అనుభవం, నైపుణ్యం బయటపడతాయి.

Sharpe Ratio వంటి సాంకేతిక సూచికలు ఉన్నా, పై పద్ధతిలో ఎంపిక చేసుకున్న ఫండ్లు సాధారణంగా సాంకేతిక సూచీల్లోనూ ఉత్తమంగానే ఉంటాయి.

%d bloggers like this: