మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడికి వివిధ మార్గాలు

ఆధార్-మొబైల్ లంకె ఉన్నట్టయితే ఈ KYC వెంటనే అయిపోతుంది. ఇటీవలే షేర్లలో పెట్టుబడులు పెట్టిన వారైతే KYC పూర్తి చేసినవారే. చిరునామా వంటి వివరాల్లో ఏదయినా మార్పులుంటే స్వచ్చందంగా మరలా KYC పూర్తి చెయ్యటం మంచిది.

మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడికి వివిధ మార్గాలు:

డీమ్యాట్ ఖాతా: మ్యూచువల్ ఫండ్ల లావాదేవీలు అందించే బ్రోకరేజ్ సంస్థలో డీమ్యాట్ ఖాతా తెరిచి పెట్టుబడి సాగించవచ్చు. ఉదాహరణకు జెరోధా వారి కాయిన్ వేదిక ద్వారా అయితే ఫండ్లలోని డైరెక్ట్ ప్లాన్లలో పెట్టుబడికి అవకాశం ఉంటుంది. ఇదివరకే డీమ్యాట్ ఖాతా ఉన్నవారు ఆ బ్రోకరేజ్ వెబ్‌సైట్‌లో మ్యూచువల్ ఫండ్ పెట్టుబడి సదుపాయం ఉందో లేదో విచారించి పెట్టుబడులు కొనసాగించవచ్చు.

మ్యూచువల్ ఫండ్ పంపిణీదారులు: వీరు AMFI వద్ద నమోదైన ఆర్థిక సలహాదార్లు, పంపిణీదార్లు. ఏటా పది లక్షలు, ఆపై పెట్టుబడి పెట్టగోరు వారు సాధారణంగా ఈ మార్గం ఎంచుకుంటారు.

ఆన్‌లైన్ సంధాతలు: Scripbox, FundsIndia, Groww వంటి సదుపాయ సంధాతల్లో ఖాతా తెరిచి తద్వారా పెట్టుబడి చెయ్యవచ్చు. ఏ ఫండ్లు కొనాలో తెలియని వారు, తెలుసుకునేంత సమయం లేని వారు Scripboxలో ఖాతా తెరవటం మంచిది. గత అయిదేళ్ళుగా వారు ఎప్పటికప్పుడు మంచి ఫండ్లతో నాణ్యమైన పెట్టుబడి సలహా ఇస్తున్నారు.

మ్యూచువల్ ఫండ్ సంస్థలు: ఏ ఫండ్లలో పెట్టుబడి మంచిదో సొంతంగా తెలుసుకున్న వారు ఆ సంస్థ వెబ్‌సైట్‌లో KYC పూర్తి చేసి నేరుగా వారి ఫండ్లలో పెట్టుబడి మొదలు పెట్టవచ్చు. ఒక్కసారి KYC పూర్తి చేసిన వారు ఆపై పలు సంస్థల ఫండ్లలో తేలికగా పెట్టుబడి మొదలుపెట్టవచ్చు.

ఆన్‌లైన్ సదుపాయం లేనివారు ఆయా ఫండ్ల సంస్థ కార్యాలయానికి లేదా మ్యూచువల్ ఫండ్ సదుపాయం ఉన్న బ్యాంకులకు వెళ్ళి KYC స్వయంగా పూర్తి చేసి చెక్కు ద్వారా పెట్టుబడి చెయ్యవచ్చు.

CAMS, KFinTech  వంటి RTA(Registrar and Transfer Agents)ల ద్వారా కూడా పెట్టుబడి చెయ్యవచ్చు. మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఈ RTAల సేవలను మదుపరుల వివరాలు, లావాదేవీల చరిత్ర నిర్వహించటం కొరకు ఉపయోగించుకుంటాయి. RTAల ముఖ్య కర్తవ్యం అదే కావున వారి వెబ్‌సైట్లలో పెట్టుబడి సదుపాయాలు Scripbox వంటివారితో పోలిస్తే ఆధునికంగా, సులువుగా ఉండకపోవచ్చు. మరో ముఖ్యమైన విషయం – KFinTech అనేది Karvy వారి అనుబంధ సంస్థ. ఇటీవల మదుపర్ల డెమ్యాట్ ఖాతాల్లోని షేర్లతో Karvy చేసిన కుంభకోణం అందరికీ తెలిసినదే.

ఈ మధ్య PhonePe, PayTM మొబైల్ ఆప్‌ల ద్వారా కూడా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెట్టే సౌకర్యం ఉంది. ఈ మార్గం అనుకూలం అనిపిస్తే నిరభ్యంతరంగా ఎంచుకోవచ్చు.

పై మార్గాల్లో అనుకూలమైనది ఎంచుకుని పెట్టుబడి మొదలుపెట్టవచ్చు.

%d bloggers like this: