సముద్రం నౌక లో విద్యుత్

వారాల నుండి నెలల తరబడి సముద్రంలో ప్రయాణించే నౌక లో విద్యుత్ చాలా కీలకమైనది. నౌక యొక్క విద్యుత్ అవసరాలకి అనుగుణంగా, విద్యుత్ ఉత్పాదక వ్యవస్థ నౌకలోనే ఏర్పాటు చేయబడి ఉంటుంది. ఎక్కువ శాతం నౌకలలో శిలాజ ఇంధనాలని మండించడం ద్వారానే విద్యుత్ ఉత్పాదన జరుగుతుంది.

అన్ని భారీ నౌకలలోనూ ప్రాథమికంగా, జనరేటర్ మరియూ ప్రైమ్ మూవర్ ఉంటాయి. ప్రైమ్ మూవర్ అంటే ఇంధనాన్ని మండించి, తద్వారా యాంత్రిక శక్తిని సృష్టించే యంత్రం. ఉదాహరణకి డీజిల్ ఇంజిన్ ఒక ప్రైమ్ మూవర్. ఇందులో డీజిల్ ని మండించడం ద్వారా వచ్చే భ్రమణ శక్తిని, జనరేటర్ కి అందించడంతో విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.

యుద్ధ నౌకలలో అణు విద్యుత్ తో నడిచే ఏర్పాటు ఉంటుంది. అలాగే కొన్ని నౌకలలో ఆవిరి తో నడిచే టర్బైన్ లు ప్రైమ్ మూవర్ గా ఉంటే, మరికొన్నిటిలో గ్యాస్ టర్బైన్ ప్రైమ్ మూవర్ గా ఉంటుంది.

అయితే సాధారణంగా అన్ని నౌకలలో కూడా రెండు భిన్న వ్యవస్థల కలయికలో విద్యుత్ ఉత్పాదక ఏర్పాటు ఉంటుంది. ప్రధాన వ్యవస్థగా డీజిల్ ఇంజిన్ నడుస్తుంటే, ప్రత్యేక పరిస్థితుల్లో( మరింత వేగంగా వెళ్ళాల్సినప్పుడో, లేక డీజిల్-జనరేటర్ లో లోపం తలెత్తినప్పుడో) వివిధ ప్రైమ్ మూవర్ లను ప్రత్యామ్నాయ వ్యవస్థలుగా ఏర్పాటు చేస్తారు.

నౌకకి అదనంగా షాప్ట్ జనరేటర్ కూడా ఉంటుంది. ఈ జనరేటర్, ప్రధాన ఇంజిన్ లో వృధాగా పోయే శక్తి నుండి విద్యుత్ ని ఉత్పాదన చేయగలదు. అలాగే నౌకకు అవసరమైన సమయంలో చోదక శక్తిగానూ ఉపయోగపడగలదు.

అంతరాయాలు ఏర్పడినప్పుడు, కీలకమైన మరియూ అత్యవసరమైన సేవలకుగాను బాటరీ బ్యాంక్ లు అందుబాటులో ఉంటాయి.