పోస్టుమార్టెమ్

భారతదేశంలో నున్న చట్టం ప్రకారం, అన్ని మెడికోలీగల్ కేసులకీ పోస్టుమార్టెమ్ చేస్తారు. అంటే – ఏ ఏ సందర్భాలలో మృతి అనుమానాస్పదమో, ఆయా కేసులలో.

అంటే – రోడ్డు ప్రమాదాలు, విషం తీసికోవటం, ఆత్మహత్య, హత్య, అగ్నికి ఆహుతి కావటం, నీళ్ళలో మునిగి చనిపోవటం, బాంబు ప్రేలుడులు, వగైరా.

చట్టం:

‘అనుమానాస్పద మృతి’ అన్నాము కదా! అనుమానం ఎవరికి? అంటే – ఆ మృతదేహాన్ని చూసిన డాక్టరుకు లేదా ఆ కేసును పర్యవేక్షిస్తున్న పోలీస్ అధికారికి, అనుమానం వస్తే చాలు. ఆ అనుమానం వారి వారి విజ్ఞానాన్ని బట్టి, విజ్ఞతను బట్టి, అనుభవాన్ని బట్టి, వ్యక్తిత్వాన్ని బట్టి, పరిస్థితులను బట్టి, – ఇలా.

‘నీకు అనుమానం ఎందుకు వచ్చింది?’ అని వారిని ఎవరూ అడగకుండానే, వారంతట వారే కేసును ‘మెడికోలీగల్’ చేసే అధికారాన్ని భారత న్యాయవ్యవస్థ వారికిచ్చింది. ఒకసారి మెడికోలీగల్ అయిన కేసు చికిత్స పొందుతూ మరణిస్తే, తప్పనిసరిగా పోస్టుమార్టెమ్ చేయాలి. ప్రస్తుత చట్టం ప్రకారం, ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే వైద్యులకే ఈ అధికారం ఉన్నది. మిగిలిన వైద్యులకు లేదు.

ఒక మెడికోలీగల్ కేసులో పోస్టుమార్టెమ్ చేయనక్కరలేదని నిర్ణయించే అధికారం చాల పై స్థాయిలోగల పోలీస్ అధికారులకు మాత్రమే ఉంటుంది. అయితే, ఆ నిర్ణయం వలన ఉత్పన్నమయ్యే పరిణామాలను ఎదుర్కొనే ధైర్యమూ, శక్తీ, వాళ్ళకుండాలి. ఉదాహరణకు – రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు కూడ పోస్టుమార్టెమ్ ను నిర్వహించారే తప్ప, ప్రక్కన పెట్టలేదు.

పోస్టుమార్టెమ్ లక్ష్యం:

పోస్టుమార్టెమ్ చేయటమంటే – సత్యాన్ని ఆవిష్కరించటం కోసం. మృతదేహంలో ఒక సత్యం దాగి ఉంటుంది. దానిని వెలికి తీయటమే పోస్టుమార్టెమ్. “ఇంత కర్కశమైన, అసహ్యమైన, ప్రక్రియ ఎందుకండీ? చనిపోయిన వారెలాగూ పోయారు కదా! ఏం చేస్తే మాత్రం వాళ్ళు తిరిగి వస్తారా?” అనే ప్రశ్నలు భావోద్వేగ నేపథ్యం నుండి వచ్చినవి. రాజ్యాంగానికీ, చట్టానికీ, భావోద్వేగముండదు, సత్యశోధనాపేక్ష మాత్రమే ఉంటుంది. అది వాటి బాధ్యత కూడా. అన్ని చట్టవ్యవస్థల లక్ష్యమూ, సత్యావిష్కారమే! అందుకే, మన నాలుగు సింహాల బొమ్మ క్రింద ‘సత్యమేవ జయతే’ అని వ్రాసి ఉంటుంది.

పోస్టుమార్టెమ్ ప్రక్రియ నేపథ్యం:

మృతిని డాక్టర్ నిర్ధారించాక, ఒక పోలీస్ కానిస్టేబుల్ కు ఆ మృతదేహాన్ని అప్పజెపుతారు. ఆ దేహానికి పోస్టుమార్టెమ్ పూర్తియై, బంధువులకు అది అప్పగించేవరకూ, అతనిదే బాధ్యత. ఒక్కసారి ఊహించండి – అదెంత కష్టమో! మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్ళి, ఫారెన్సిక్ విభాగంలో నుంచి, అక్కడి రికార్డులలో నమోదు చేయాలి. ఒకవేళ ఒక రాత్రి ఆ మృతదేహాన్ని అప్పగించటం జరుగకపోతే, మరునాడు ఆసుపత్రి తీసేవరకూ, మృతదేహమూ, దాని ప్రక్కన తప్పించుకు పోలేని పోలీసు కానిస్టేబులూ! వాస్తవాలెంత కర్కశంగా ఉంటాయంటే – మృతదేహాన్ని వీడి, ఆ కానిస్టేబులు ‘టీ’ త్రాగటానికి, బాత్రూముకు కూడ ధైర్యంగా వెళ్ళలేడు. వెళ్ళివచ్చే లోగా, మృతదేహానికేమైనా అయితే, బాధ్యత అతనిదే!

పోస్టుమార్టెమ్ చేసే విధానం:

పోస్టుమార్టెమ్ పరీక్ష చేసేది ఫారెన్సిక్ లో ఎం.డి. పొందిన డాక్టరు. పోస్టుమార్టెమ్ చేసేటప్పుడు ప్రతి ఎముకనూ, ప్రతి అవయవాన్నీ, డాక్టర్లు పరిశీలిస్తారు. ఆ వివరాలను రికార్డు చేస్తారు. ఒక డాక్టరు పోస్టుమార్టెమ్ చేస్తూంటే, ఇంకో డాక్టరు వ్రాస్తూంటాడు. ఇది వైద్యకళాశాలలున్న ఆసుపత్రులలో. జిల్లా, ఇంకా చిన్న ఆసుపత్రులలో డాక్టరు చేస్తూంటే, ఇంకొక మనిషి వ్రాస్తాడు. ఈ ప్రక్రియకు దాదాపు 1 – 2 గంటల సమయం పడుతుంది. ఆ తరువాత ఒక తాత్కాలిక రిపోర్ట్ ఇస్తారు. శరీరంలో ప్రతి అవయవం నుండీ – చిన్న ముక్కను కత్తిరించి, రసాయనిక పరీక్ష నిమిత్తం సెంట్రల్ ఫారెన్సిక్ లేబొరేటరీకి పంపుతారు. ఆ రిపోర్ట్ రావటానికి దాదాపు పది రోజులు పడుతుంది. ఆ రిపోర్టే ఫైనల్ అవుతుంది.

ఎవ్వరికీ తెలియని దారుణమైన విషయాలు:

ఒక్కక్క బోధనాసుపత్రి ఫారెన్సిక్ విభాగానికీ, రోజుకు 5 – 10 మృతదేహాలు వస్తాయి. రైలు ప్రమాదమో, బాంబు ప్రేలుడో అయితే, ఈ సంఖ్య డజన్లలో ఉంటుంది. అంటే, ప్రతి రోజూ, ఈ విభాగం డాక్తర్లకు దాదాపు 8 8 – 10 గంటలపాటు శవాలను కోయటమే పని. ప్రతి మృతదేహానికీ నంబరు వేసి, పోస్టుమార్టెమ్ నిర్వహించాలి. నీళ్ళలో మునిగిపోయిన దేహాలు కొన్నిరోజుల తరువాత లభిస్తే, వాటి స్థితి ఎలా ఉంటుందో, ఊహించలేము. ఈ బాధలు, కంపు, జుగుప్స – వీటినన్నింటినీ తట్టుకుంటూ, డాక్టర్లు ఈ పని చేయాలి. ఇంకా దారుణమైన విషయం – కొన్ని సార్లు పాతిపెట్టిన మృతదేహాలకు (రీ) పోస్టుమార్టెమ్ నిర్వహించమని కోర్టు ఆజ్ఞాపిస్తుంది. ముక్కూ, నోరూ, మూసుకొని, ఆ పని చేయాలి. ‘చేయను’ అని చెప్పే హక్కు (ప్రభుత్వ) డాక్టర్లకు లేదు.

పోస్టు మార్టెమ్ వలన బాధలు, ఉపయోగాలు:

పోస్టుమార్టెమ్ చేస్తున్న మృతదేహం యొక్క బంధువులకది కచ్చితంగా చాల దారుణమైన, భయంకరమైన, అసహ్యమైన, ఆందోళనకరమైన అనుభవం. అది ఒక మనిషికి సంబంధించిన విషయం. ఆ కుటుంబం బాధ పడుతుంది. వాళ్ళ ఫీలింగ్స్ గాయపడతాయి. కాని, సత్యం ఆవిష్కారమౌతుంది. “మనిషి పోయాక, సత్యం ఎవడికి కావాలండీ?” అంటే – సమాజంలో మారుతున్న మానసిక, హింస, నేర ప్రవృత్తులు బయటపడతాయి. పోస్టుమార్టెమ్ లో బయటపడిన నిజాలు ఆ మనిషిని బ్రతికించలేవు; ఆ కుటుంబానికుపయోగపడవు; కాని, ఆ సమాచారం భవిష్యత్తులో వైద్యశాస్త్రం అభివృద్ధి చెందటానికీ, నేరనిరోధంలో పోలీసులకూ, ఉపయోగపడుతుంది. లక్షలాది మృతదేహాల నుండి బయటపడిన పరిశీలనల ఆధారంగానే ఫారెన్సిక్ సైన్సు ఒక శాస్త్రంగా అభివృద్ధి చెందింది. ఇది కాదనలేని సత్యం. ఒక రకంగా, సమాజానికవసరమయ్యే విజ్ఞానానికి వ్యక్తి మరణిస్తూ చేసిన త్యాగం – తన శరీరాన్ని పోస్టుమార్టెమ్ కి ఇవ్వటం.

ఫారెన్సిక్ డాక్టర్ల స్థితి:

నిత్యం, రోజుకు దాదాపు 8 – 10 గంటలపాటు అదే పని చేసే ఫారెన్సిక్ డాక్టర్ల మానసిక స్థితి ఎలా ఉంటుందో ఊహించటమే కష్టం. ఎంత అలవాటు పడినా, మనం అనుభవించే సుఖాలేవీ అనుభవించే స్థితిలో వాళ్ళ మనస్సుంటుందా? అంటే సందేహమే. వాళ్ళను చూసి జాలిపడాలి. వాళ్ళు ఆపరేషన్ చేసే ఏ రోగీ, లేచి, ‘నా బాధ నయమైంది’ అని చెప్పడు. కృతజ్ఞతలు లేని ఉద్యోగమది. వాళ్ళ కృషిని గుర్తించేది పై వాడొక్కడే! అందుకే, పోస్టుమార్టెమ్ గది వెలుపల ఉండే

“మృతదేహం భగవంతుని ఆస్తి” అనే వాక్యం గొప్ప భావాన్ని వ్యక్తం చేస్తుంది.

%d bloggers like this: