సంతోషం – డబ్బు

సంతోషం డబ్బులో లేదు. మనసులో ఉంది. అలాగని, సొమ్ము లేకపోతే జీవితం గడవదు. మనిషి జీవించడానికి ముఖ్యంగా..కూడు గూడు గుడ్డ.

అవసరం. మారుతున్న కాలానికి అనుగుణంగా ఎన్నో కనీస అవసరాలు పెరిగాయి. వాటిని నెరవేర్చడం కోసం మనిషి నిరంతరం శ్రమిస్తున్నాడు. ఆర్ధికంగా రెండు జీవిత వర్గాలున్నాయి…

వడ్డించిన విస్తరిలాంటి జీవితం మరియు స్వయం పోషక జీవితం

తాతలు, తండ్రులు సంపాదించి ఇస్తే సుఖజీవనం సాగించేవారిది ‘వడ్డించిన విస్తరి.’

రెండో రకం స్వయం పోషక జీవితం. వీరు ఎంతో కష్టపడి పనిచేయడం ద్వారా జీవిస్తారు. ఇందులో కొందరు చక చకా సంపాదించి, ఆర్ధిక సమృద్ధి సాధిస్తారు. మరికొందరు ఎన్నాళ్ళు చూసినా ‘ గొర్రెకు బెత్తెడు తోక ‘ మాదిరిగా ఉండిపోతారు.

మరి సంతోషంగా జీవించడానికి ఎంత డబ్బు కావాలి అంటే, వారి కోరికల చిట్టాని బట్టి వుంటుంది. చెట్టుకిందో, గుడిసెలోనో వుంటూ, రోజుకు 300లో, 400లో సంపాదిస్తూ, తృప్తిగా జీవించేవారూ వున్నారు.

వచ్చింది చాలలేదని అడ్డదారులు తొక్కుతూ డబ్బులో సంతోషం ఉందని వెతుక్కుంటూ కటకటాల పాలైన వారూ వున్నారు. తన పొట్ట నింపుకోవడంతో పాటు, ఆయిదారు తరాలకు సరిపడా సంపాదించి, సంతోషం లేకుండానే కన్నుమూసిన వాళ్ళూ వున్నారు.

%d bloggers like this: