వితంతువు – సాంఘిక దురాచారం

స్త్రీలకి బొట్టూ , కాటుక , పువ్వులు పెట్టుకోవడం , గాజులు వేసుకోవడం ఇవ్వన్నీ వాళ్ళ పర్సనల్ ఛాయిస్ – అవి వాళ్ళ అలంకరణలో ఓ భాగం మాత్రమే. అవి వాళ్ళకి పెళ్ళి కాకమునుపు నుండీ వాళ్ళ జీవితంలో ఓ భాగంగా ఉంటాయి. అలాంటప్పుడు వాళ్ళ జీవితం మధ్యలో పెళ్ళి పేరిట ఒక మగవాడు ప్రవేశించి అతనేదో చనిపోతే అందుకు బాధపడడం , దుఖఃపడడం సహజం కానీ అతనేదో చనిపోయాడనే ఒక్క కారణం చేత స్త్రీ ఇవన్నీ ఎందుకిక్కడితో అర్ధాంతరంగా తన జీవితం నుండి వదిలేసుకోవాలి ? .

” పర పురుషుడికి ఆమెపై వ్యామోహం కలగకుండా ఉంచేందుకై ఈ ఏర్పాటు ” అని అడిగితే కొందరేదో దీనిని సమర్ధించ చూస్తారు కానీ ” అదే ఏర్పాటు మగవాడికెందుకు ఉండదు ?

జీవితాంతం వరకూ కలిసి ఉంటామని అనుకొన్న వ్యక్తి అకస్మాత్తుగా చనిపోతే అప్పటివరకూ అతనితో ఉన్న భావోద్వేగమైన బంధం ఒక్కసారిగా తెగిపోయిందనే బాధ ఓ పక్కన , అతని జ్ఞాపకాలు , పిల్లల భవిష్యత్తు , తన భవిష్యత్తు ఎలా ఉంటుందో అనే ఇలాంటి వందలాది ఆలోచనలు ఆమెని ఇబ్బంది పెట్టేవేళ ఆమెకి ఆసరాగా ఉండి , మానసిక స్థైర్యాన్ని , జీవితం పట్ల భరోసా ఇచ్చేలా ఉండాల్సిందిపోయి ఆచారాల పేరిట ఆమెను బంధువుల సమక్షంలో గుండు కొట్టించి ( కొన్ని కులాలలో ఇప్పటికీ ఇలా చేస్తారు – పూర్వంతో పోలిస్తే ఇప్పుడూ ఈ పధ్ధతి అందరూ పాటించకపోయినా కొన్ని జిల్లాలలో ఇప్పటికీ దీనిని అనుసరిస్తున్నవారున్నారు ) , గాజులు , మంగళసూత్రాలు , మెట్టెలూ , ఇతరత్రా ఆమె అలంకరణలన్నీ తీసేసి , బొట్టు చెరిపేసి , తెల్ల చీరకట్టి ఆమెనెవరూ చూడకూడదన్నట్లు ఓ మూల కూర్చోపెట్టడం , ఆ తర్వాత ఆమెను ఒక్కో బంధువూ చూడటానికి వస్తూ సానుభూతి పేరిట ఆమె మానసిక గాయాన్ని మరలా రేపేలా మాట్లాడడం , జీవితమూ – అందులోని ఆనందమూ ఇక్కడితోనే ఆఖరు అన్నట్లు ప్రవర్తించడం చూడటానికే చాలా అసహ్యమైన విషయాలు నిజానికి.

అలా విధవరాలిలా కూర్చున్న ఆమెను చూడటానికి వచ్చేటప్పుడు ప్రతీ స్త్రీ తన మంగళసూత్రానీకి ఓ పసుపుకొమ్ము కట్టుకొని , నోటిలో కొంత జీలకర్ర వేసుకొని లోపలకి వెళ్ళి మాట్లాడి రావడం , ఆమెతో మాట్లాడి వచ్చాక తన మంగళసూత్రానికి ముందు కట్టుకొన్న పసుపుకొమ్ముని త్రుంచి , నోటిలో అంతకుముంపు వేసుకున్న జీలకర్ర బయటకు ఊసి నోరు పుక్కిలించుకొని మంగళసూత్రాన్ని కళ్ళకద్దుకుంటూ ఉంటారు.

” ఎందుకలా ? ” అని అడిగితే ” అలా వితంతువుని చూడటం వల్ల కలిగే అరిష్టం తొలగడానికి , తమ సౌభాగ్యం నిలిచి ఉండడానికి ” అనే సమాధానం వస్తుంది.

అలాకాక వైజ్ఞానిక, మానవతా దృక్పధంతో ఆలోచించి ఈ సాంఘిక ఆచారాన్ని పూర్తిగా మనం నిషేధించాల్సిన అవసరం ఉంది .

%d bloggers like this: